నారి సారించిన నవల-43

కె. రామలక్ష్మి – 3

                      -కాత్యాయనీ విద్మహే

          1970వ దశకపు రామలక్ష్మి నవలలలో  జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చిన ‘మూడోమనిషి’ నవల మొదటిది. ఈ నవలను రామలక్ష్మి బావగారైన ఎం ఎస్ ఎన్ మూర్తికి అంకితం చేసింది. తరువాతి నవల ‘ఆశకు సంకెళ్లు’ ఆంధ్ర వారపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 సెప్టెంబర్ లో అదే నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చింది. ఆడది నవల 1974 ప్రచురణ లో 1960 నాటి మెరుపుతీగ నవలతో పాటు అన్నపూర్ణ అనే నవల కూడా చేర్చబడింది. దానిని  మూడవ నవలగా భావించవచ్చు. నాలుగవ నవల లవంగి ప్రధమ ప్రచురణ ఫిబ్రవరి 1975. 1976 నవంబర్ లో వచ్చిన రెండవ ముద్రణ నవభారత్ బుక్ హౌస్ వారిదే. ఈ రెండవ ముద్రణలోనే ‘బ్రహ్మచారీ బహుకుటుంబీకుడు’ , పండ రంగని ప్రతిజ్ఞ అనే రెండు నవలలు ఉన్నాయి. 1976 లో కరుణ కథ 1978 లో తిరుగుబాటు, దారి తప్పిన తండ్రి 1979 లో కోటిగాడు నవలలు వరుసగా వచ్చాయి. మొత్తం నవలలు పది.  వీటిలో రెండు చారిత్రక నవలలు. 

1

          సాంఘిక నవలలలో మూడోమనిషి ,  ‘బ్రహ్మచారీ బహుకుటుంబీకుడు’ రెండూ  దాదాపు ఒకే రకం ఇతివృత్తం కలవి. తల్లి లేని పిల్లల బాగోగులు చూసుకొనే బాధ్యత మీద జమిందారీ కుటుంబలో అడుగుపెట్టిన యువతులు రెండింటిలో సామాన్యం. మూడో మనిషి నవలలో ఆ పిల్లలు యజమాని పిల్లలు కాగా బ్రహ్మచారీ బహుకుటుంబీకుడు నవలలో వాళ్ళు యజమానికి చనిపోయిన అక్క పిల్లలు. పిల్లల హృదయాలను గెలుచు కున్న ఆ యువతులు యజమానులకు కూడా ప్రేమాస్పదులు కావటం, పెళ్లిళ్లు చేసు కొనటం నవలల ముగింపు. 1968 లో వచ్చిన చీకటి దారి నవలలోనూ జమీందారు గారింటి ఆడపిల్ల బాగోగులు చూడటానికి వచ్చిన యువతికి ఆ పిల్ల అన్నకు మధ్య ఏర్పడిన ప్రేమ అది పెళ్ళికి దారితీయటం అనే కథా  సూత్రం మూడోమనిషి నవల కథా సూత్రం దాదాపు  దగ్గరగా ఉంటాయి. 1969 నాటి ప్రేమించు ప్రేమకై నవలలో లాగానే   బ్రహ్మచారీ బహుకుటుంబీకుడు నవలలో ఒంటరివాడు, ఆస్థిపరుడు అయినా నాయకుడికి కూతురిని ఇచ్చి పెళ్ళిచేయాలని ఆ ఇంట వచ్చి చేరిన దూరపు బంధువు పెత్తనాన్ని కాదని ఆ నాయకుడు తాను ఇష్టపడిన యువతిని   పెళ్ళాడటం కనిపిస్తుంది. 

          ‘ఆశకు సంకెళ్ళు’ నవల ముగ్గురు ఆడపిల్లల తండ్రి కథ. కూతుళ్ళకు  చదువులు చెప్పించి వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసి కట్నాల బేరాలు, ప్రేమల పరిణామాలు చూచి బేజారెత్తిన తండ్రి ఆత్మహత్య చేసుకొటం, తన పెళ్లి గురించి తండ్రి ఆశలకు ఆదర్శా లకు పొంతన కుదరక భార్య మరణించిన ఇద్దరు పిల్లల తండ్రిని కోరి పెళ్ళాడి తండ్రి భారం దింపిన పెద్ద కూతురు అత్తగారి ఆరడికి తట్టుకోలేక పిచ్చిది కావటం, ప్రేమలో పడి మోసపోయి, గర్భవతైన  రెండవ కూతురు ఆ ప్రేమించిన యువకుడికి స్త్రీలపట్ల ఉన్న దృష్టి అర్ధమయ్యాక అతనితో పెళ్లి ఆత్మగౌరవానికి  హానికరమని ఆత్మహత్య చేసుకొనటం  ఈ నవల ఇతివృత్తంలో ప్రధాన పాయలు. ఆడపిల్లలకు పెద్ద చదువులు చెప్పిస్తే ఆ చదువు విలువను గుర్తించి కట్నాలు లేకుండా పెళ్ళాడతాము అనే సంస్కారం మగ పిల్లలలో అభివృద్ధి చెందని సంకుచిత సమాజం గురించిన హెచ్చరికగా ఈ నవలలో శాంతి జీవితాన్ని చూపింది రచయిత్రి. చదివి ఉద్యోగాలు చేసే ఆడపిల్లల షోకులు,  ఆకర్షణలు, ప్రేమలు, తొందరపాట్లు వాళ్ళ జీవితాలను ఆపదలలోకి ఈడవటమే కాకుండా తల్లిదండ్రులకు పీడాకరంగా తయారవుతాయని హెచ్చరిస్తుంది రచయిత్రి కాంతి జీవితం ద్వారా. పైచదువులకు వెళ్ళక ఇంటిపట్టునే వున్న చిన్న కూతురు ఆశను  అందరిపట్ల బాధ్యతగా మెలిగిన సంస్కార వంతురాలిగా చిత్రించటం ద్వారా రచయిత్రి ఇయ్యదలచుకొన్న సందేశం ఏమిటన్న సందేహం కలగక మానదు. చదువులు , ఉద్యోగా లు స్త్రీలకు హానికరం అన్నది రచయిత్రి భావంలాగా కనిపిస్తుంది. అవి లేని స్త్రీలు వివేక వంతులు అని చెప్పదలచుకొన్నట్లు కనిపిస్తుంది. చదువుకొన్న స్త్రీలను, వృత్తి విద్యలు, ఉన్నత విద్యలు చదివిన స్త్రీలను, తమ జీవితాలను స్వీయ వ్యక్తిత్వాలతో నిర్మించు కొంటున్న స్త్రీలను నమూనాలుగా చూపిస్తూ నవలలు వ్రాసిన రామలక్ష్మి ఈ నవలను ఇట్లా ఒక అననుకూల దృష్టితో విషాదాంతంగా వ్రాయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

          ఇక మూడవ నవల అన్నపూర్ణ. కాకతాళీయంగా కలిసిన రాజుతో ప్రేమ, పెళ్ళికి చొరవ,  అన్యోన్య దాంపత్యం వరకు సాఫీగా సాగిన కథలో సంఘర్షణ మామా అల్లుళ్ళకు సంబంధించినది.  ఒకానొక కంపెనీలో ఇంజనీరుగా రాజు వాళ్ళు పని చేపట్టిన ఏ ప్రాంతా లకు వెళ్లి పనిచేయమంటే అక్కడకు వెళ్లి పనిచేస్తుంటాడు. అలా భిన్న ప్రాంతాలకు తిరుగుతూ ఉద్యోగం చేయటం అతనికి ఇష్టం. ఆ రకంగానే అన్నపూర్ణ  వున్న వూరికి వచ్చాడు. అన్నపూర్ణను ఇష్టపడి పెళ్లాడాడు. అన్నపూర్ణ తప్ప మరి పిల్లలు లేని తండ్రి రాజుకు కూడా తల్లీ తండ్రీ లేకపోవటంచేత ఇద్దరూ తన తోటే ఉండాలని ఆశపడటంతో వచ్చింది సమస్య. బదిలీని నిరాకరించమని అల్లుడి పై ఒత్తిడి తెస్తాడు. అతనికి విదేశీ కంపెనీల నుండి వచ్చే అవకాశాలను అందకుండా చేస్తాడు. తన వ్యాపారాలు చూసు కొంటూ ఉండిపోతే బాగుండునని ఆశపడతాడు. అది నచ్చని రాజు తన ప్రయత్నాలు తను చేసుకొని విదేశంలో ఏడేళ్లు ఉద్యోగం చేయటానికి ఒప్పందం కుదుర్చుకొని ఆ విషయం చెప్పే సరికి అన్నపూర్ణ గర్భవతి. తండ్రి పడి కాలువిరగటంతో భర్తతో ఆమె ప్రయాణం ఆగిపోతుంది. కొడుకు పూట్టాడు. తన శ్రద్ధ అంతా వాడి మీద పెట్టి పెంచుకు వచ్చింది. వాడికి ఏడేళ్ల వయసులో తండ్రి దేశానికి తిరిగి రావటంతో మొదలయింది అసలు సమస్య. తండ్రి రాకతో తల్లి శ్రద్ధ తనమీద నుండి అతని  మీదికి మళ్లిందని ఆ పసి హృదయం గాయపడి కల్లోలానికి గురై కోపంతో , తెలియని ఉక్రోషంతో ఇల్లు వదిలి వెళ్లిపోయేట్లు చేసింది. సిటీ చేరిన వాడి అనుభవాలు, ఆందోళనలు, పిల్లవాడి కోసం తల్లిదండ్రుల వెతుకుకులాట, వేదన ఈ నవలలో కీలకమైనది. పిల్లల పెంపకం అంటే ప్రేమలో ముంచెత్తటమో , గారాబం చేసి మరొక లోకం లేకుండా చేయటమో కాదు, క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండడమూ కాదు. స్నేహంగా ఉంటూ వాళ్ళను వాళ్ళు తెలుసుకొనేట్లు చేయటం, పరిస్థితులను తెలుసుకోనట్లు చేయటం అని చెప్తుంది ఈ నవల. తండ్రి, భర్త, కొడుకు ముగ్గురిపట్ల అన్నపూర్ణకు ఉన్న ప్రేమ ఆమెను జీవితంలో ఎంత ఒత్తిడికి లోను చేసిందో నవల అంతటా పరచుకొని కనిపిస్తుంది.  

          కరుణకథ నవల రెండవ ముద్రణ 1976. మొదటి ముద్రణ ఎప్పుడో తెలియదు. ఈ నవలను రామలక్ష్మి తన కూతురు కవితకు అంకితం ఇచ్చింది. 

          రంగారావును ప్రేమించి, శారీరకంగా దగ్గరై, గర్భవతి అయి, పెళ్ళికి అతనిని ఒప్పించటానికి ప్రయత్నించి ‘పెద్దలను ఒప్పించి చేసుకుందాం, ఇప్పటికి గర్భస్రావం చేయించుకో’ అన్న మాటలతో హతాశురాలై ఇల్లు చేరి,  తండ్రిచేత తిరస్కృత అయి ఒక శరణాలయంలో బిడ్డను ప్రసవించి, ఉద్యోగం కోసం వెళ్లి యాక్సిడెంట్ లో చనిపోయిన పూర్ణ కూతురు కరుణ కథ ఇది. అనాధ శరణాలయం వార్డెన్ ప్రేమతో పెరిగి అనుకొన్న దేదో మాట్లాడి, చేసెయ్యగల చొరవ , కల్లాకపటం లేని స్నేహం, ఆత్మగౌరవ చేతనలతో వికసించిన వ్యక్తిత్వం కరుణది. వలచి వచ్చిన పెద్దింటి బిడ్డ రామప్రభును పెళ్లాడటంతో  ఆమె జీవితంలో వచ్చిన పరిణామాలు ఈ నవలకు ఇతివృత్తం. అత్తగారు తన ఆస్తికి అంతస్తుకు తగిన పిల్ల కాదని దూరం పెట్టింది. రామప్రభు ప్రేమ , అతని తల్లి ద్వేషాల మధ్య కొత్త కాపురం. బిడ్డపుట్టటం. ఆఫీసు పని మీద అతను విదేశాలకు వెళ్లిన సమయం చూసి బిడ్డను కరుణ నుండి దూరం చెయ్యటానికి, కాలేజీ రోజుల్లో కరుణ వెంటపడి ఆమె తిరస్కారానికి గురైన ఆనంద్ ను చేరదీసి, ఆమెను శీలంలేని మనిషిగా నిరూపించటానికి, డ్రైవర్ కు డబ్బాశ చూపి ఆమెను లేకుండా చేయాటానికి రామప్రభు తల్లి పన్నిన పన్నాగా లు చివరకు కరుణ కారు ప్రమాదంలో మరణించింది అన్న వార్త కావటం వరకు పరిణమించాయి. కరుణ ఆ కారు ప్రమాదం నుండి తప్పించుకొని ఒక పెద్ద మనిషి అండ పొంది ఫ్యాక్టరీ పని వాళ్ళ పేటలో వుండి వారి సంక్షేమం కోసం పని చేస్తూ జీవించటం , కొన్నేళ్ల  తరువాత అనుకోకుండా ఆడపిల్లలను పని పేరు చెప్పి మభ్య పెట్టి మాయం చేస్తున్న ముఠా సంగతి తెలుసుకొనటానికి చేసిన ప్రయత్నంలో తటస్థ పడిన ఆనంద్ తనను నిర్బంధించి సుభద్రమ్మను బ్లాక్ మెయిల్ చేసి లాభపడాలని చూసినప్పుడు అతనిని చంపి హంతకురాలిగా కోర్టుబోన్ ఎక్కవలసి రావటం ఈ నవలలోని కీలక ఘట్టాలు. లాయర్ అయిన ఆమె కొడుకే ఆమె కేసు వాదించ వలసి రావటం, ఆ క్రమంలో ఆమె తన తల్లి అని తెలుసుకొనటం, తండ్రి , నాయనమ్మ కూడా ఆ విషయం తెలుసు కొనేట్లు చేయటం కథను క్లైమాక్స్ కు తీసుకువెళ్లాయి. భర్తను, కొడుకును చూసుకొంటూ వాళ్ళ సమక్షంలో కరుణ కన్ను మూయటం నవలకు ముగింపు. 

          సినిమాకు అవసరమైన ప్రేమలు, ద్వేషాలు, త్యాగాలు, మలుపులు ఉన్న నవల ఇది. అందుకే ఈ నవల సినిమా కాగలిగింది. త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారి అభిమానవతి సినిమాకు మాతృక అని ఈ నవల ముందు పేజీలో ప్రచురించబడింది. కరుణను బ్రతికించి కుటుంబానికి దగ్గర చేయటం సినిమాను సుఖాంతం చేయటం కోసం చేసిన మార్పు. మిగిలినదంతా యథాతథమే.

          1978 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ ప్రచురణగా వచ్చిన ‘దారితప్పిన తండ్రి’  నవల ఆంధ్రపత్రిక సీరియల్ గా వచ్చింది. భార్య కాపురానికి , పిల్లలను కనిపెంచటానికి, విలాసానికి బయటి స్త్రీలు ఎందరైనా అనుకొనే  భూస్వామ్య దంభం మూర్తీభవించిన మగవాడి భార్యా పిల్లలు పడే హింస ఈ నవలకు వస్తువు. పరాయి స్త్రీలను ఇంటికి తెచ్చి వాళ్ళ ముందు,  వాళ్ళకోసం తల్లిని కొట్టి అధికారం చేసే తండ్రిని చూస్తూ పెరిగిన ముగ్గురు కొడుకుల కథ. పెద్ద కొడుకులిద్దరూ చదువుల పేర తండ్రికి దూరంగా ఉన్నా చిన్నకొడుకు తల్లి భద్రతకు, ధైర్యానికి తండ్రిని ఎదిరిస్తూ హెచ్చరిస్తూ అక్కడే ఉండి పోయాడు. వాడి చుట్టూ పెద్దవాళ్ళతో సహావాసం, లేనివాళ్ళ కోసం ఉన్నవాళ్లను దోచి పెట్టటం వంటివి తీవ్రవాద చర్యలుగా కొంత అల్లిక పని జరిగింది. ఆ చిన్నా ఇష్టపడి పెళ్ళాడుదామనుకొన్న అల్లి అనే పిల్లనే బలవంతం చేయబోయిన భర్తను బతిమిలాడి, భంగపడి, తుపాకీతో అతనిని కాల్చేసి జైలుకు వెళ్ళటం ఈ నవలకు ముగింపు. భర్త మాటకు ఎదురాడరాదు, భర్త ఎంత వేధించినా సహనంగా కాపురం సాగించాలి అన్న లోక మర్యాదలకు తలవొగ్గి జీవించిన అన్నపూర్ణ  ఒక స్త్రీ షీలా రక్షణ కోసం భర్త ప్రాణాలు తీయటానికి వెనుకాడక పోవటాన్ని విశేషంగా చూపిన నవల ఇది.  

2

          1978 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చిన తిరుగుబాటు నవల, ఆంధ్రపత్రికలో సీరియల్ గా (16-2-1979 – 20-4-1979) వచ్చిన కోటిగాడు నవల ఒక మేరకు దళిత సమస్యను చిత్రించాయి. 

          వ్యాపారాలు, సంపదలు, దాతృత్వం , సామాజిక సంక్షేమ దృష్టి ఉన్న వంశ వారసుడు, కోటీశ్వరుల ఏకైక కుమారుడు , హాకీ ఆటగాడు అయిన సుకుమార్ కు డిగ్రీ చదువుతున్న మంగిపూడి మాదిగ వాడ అమ్మాయి సుజాతకు మధ్య ప్రేమ ,పెళ్లి ,అన్యోన్య దాంపత్యం తిరుగుబాటు నవలకు విషయం.పేద, దళిత అమ్మాయితో పెళ్ళికి సుకుమార్ తల్లిదండ్రుల అభ్యంతరం మామూలే. వాళ్ళను కాదని చేసుకొన్న సుజాత ఏదో జబ్బుతో అర్ధాంతరంగా మరణించటంతో నవల ముగుస్తుంది. 

          ఈ నవలలో తిరుగుబాటు ఎవరిది? సుకుమార్ ది. ఎవరి మీద? కులం,  కుటుంబం, ఆస్తిమోపే పరువు బరువుల మీద. వాటిని అంటి పెట్టుకొని తనను కూడా ఆ పరిధికి కట్టేయాలని చూసే తల్లిదండ్రుల మీద. వంశ వారసత్వ సంపదలు తన స్వేచ్ఛకు సంకెళ్ళుగా పరిణమింప చేసిన సామాజిక రీతి పైన. పెద్ద కుటుంబాలలో తల్లిదండ్రు లకు, పిల్లలకు మధ్య అభిమానాలకు అడ్డువచ్చే డబ్బు, దర్పం, దర్జా, నాగరికతలపైన. పిల్లల ఇష్టాలను ఆదరించి ఆశీర్వదించ లేని ఘరానా కొంపలమీద. వీటికి అతీతంగా నిజమైన జీవశక్తి నింపుకున్న సుజాత సాహచర్యం కోసం ఆ తిరుగుబాటు అతనికి అవసర మైంది. తిరుగుబాటులో వ్యక్తిత్వం వుంది. స్వేఛ్చ సమానత్వ విలువలతో కూడిన జీవన లాలస వుంది. తిరగబడిన అతను ఆర్ధిక సమస్యలను సుజాత సహకారంతో, మార్గదర్శక త్వంలో సులువుగానే ఎదుర్కొన్నాడు. పుట్టుకతో వచ్చిన సర్వ సౌకర్యాలు, సౌఖ్యాలు వదులుకొని డబ్బు లేకుండా , తండ్రి మద్దతు లేకుండా బ్రతకటాన్ని సవాల్  గా స్వీకరిం చి వచ్చిన సుకుమార్ అలా వచ్చినందుకు ఏనాడూ అసంతృప్తికి లోను కాలేదు. అంతగా తనదైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకొన్న వాడికి సుజాత మరణాన్ని శిక్షగా విధించటం అసంబద్ధంగా కనిపిస్తుంది. 

          సుజాతలోని జీవశక్తి  ప్రతికూల సామాజిక పరిస్థితుల నుండి ఎదిగిరావటం. “ సాంఘికంగా బండి సున్నాలం. ఆర్ధికంగా బడుగు పేదలం” అన్న వాస్తవం తెలిసి, పుట్టుక వల్ల వచ్చిన వెనకబడిన తనాన్ని సవాల్ చేసి చదువులో ప్రతిభ కనపరుస్తూ డిగ్రీ చదువు పూర్తి చేయ బోతూ,  పై చదువుకు ఢిల్లీలో స్కాలర్ షిప్ మీద సీటు సంపాదినచిన వ్యక్తి సుజాత. తన కులం గురించి, ఆర్ధిక స్థితి గురించి అవమాన పడకుండా అతి సహజంగా చెప్పగలిన పరిణిత స్థాయి ఆమెది. ఆమె తండ్రి అన్నట్లు లోకం చూసే చిన్న చూపు, దరిద్రం కూడా బాధపెట్టని ఆత్మవిశ్వాసాన్ని చదువు, సంస్కారాల ద్వారా సాధించింది.  

          మానవ సంబంధాలలో ఇచ్చిపుచ్చుకో వలసిన ప్రేమ గురించిన పట్టింపు ఉన్న వ్యక్తిత్వం సుజాతది. తండ్రిపట్ల సుకుమార్ కొంత సున్నితంగా ఉండటం అవసరమని చెప్పటంలో గానీ ఆయన ప్రేమలేని మనిషి అని దూరం పెట్టటం కాక, ‘ప్రేమించి చూడు ప్రేమ వస్తుంది’  అని చెప్పటంలో గానీ ఆ వ్యక్తిత్వమే ప్రతిఫలిస్తుంది. అందుకే సుకుమార్ చిన్నచిన్న విషయాలలో కూడా జీవితాన్ని ఆనందించటం తెలిసిన మనిషి గా, తెలియ చెప్పిన మనిషిగా ఆమె గురించి అభిమానంగా అనుకొంటాడు. సుకుమార్ లాయరు కావాలని అతని తండ్రి ఏది ఆశించాడో దానిని ఒక సవాల్ గా ముందుకు పెట్టి సుజాత ఆ వైపే అతనిని నడిపించింది. తల్లిదండ్రులకు ఏనాటికైనా అతను దగ్గర కావాలన్న సుజాత ఆంతర్యం, మనిషి కన్నా మరే పట్టింపులు, పంతాలు గొప్పవి కావు అని ఆమె నమ్మిన విలువ ఆమె  ప్రవర్తనను అలా నిర్దేశించాయి. కులాంతర ప్రేమ వివాహాల సాఫల్యానికి సరైన మార్గం జీవితంలో కుల ప్రమేయ ప్రాధాన్యతను తక్కువ చేసే సంస్కారాల అభివృద్ధి అని సూచించ గలిగిన ఈ నవలలో సుజాతను చంపెయ్యటం ద్వారా రచయిత్రి సాధించదలచుకొన్న ప్రయోజనం ఏమిటో అర్ధం కాదు.

          తిరుగుబాటు నవలలో సుజాత దళిత సామాజిక వర్గం నుండే వచ్చినా అందులో దళిత జీవితం, జీవన సంఘర్షణ లేవు. వాటిని కోటిగాడు నవలలో చూడవచ్చు.   తిరుగు బాటు నవలలో సుజాత  చెప్పిన “సాంఘికంగా బండి సున్నాలం. ఆర్ధికంగా బడుగు పేదలం” అన్న మాటలోని జీవన విషాదం కోటిగాడు నవలకు ఇతివృత్తమైంది. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి దళితులు ఆత్మగౌరవ చైతన్యంతో తలెత్తుకొని ఆ విషాద జీవన పరిస్థితులను మార్చటానికి సంసిద్ధులవుతున్న దృశ్యాన్ని కూడా ఈ నవల చూపించ గలిగింది. 

          అగ్రహారం, దానికి అనుబంధంగా ఉన్న హరిజన వాడ భూమికగా నడిచిన నవల ఇది. హరిజనవాడలో పుట్టిన కోటిగాడు, వాడి నాయన వెంకన్న, తల్లి నూకాలు అగ్రహారం లోని కరణంగారింటి చాకిరి గాళ్ళు. కోటిగాడుగా కరణం తదితర అగ్రహార పెద్దలచేత పిలవబడే పన్నెండు ఏళ్ళ కోటి / కోటీషును కరణంగారింట ఎందుకు పనిచేయాలన్న ప్రశ్న వేధిస్తుంటుంది. తల్లినడిగితే ఆమె ఇచ్చే జవాబు ‘అదంతే  … తాతల నుండి  పని చేస్తున్నారు … రేపు నువ్వు కూడా వారింటనే పని చెయ్యాలి’ అని. అది వాడికి నచ్చని జవాబు. తనలా పని చెయ్యకూడదు, చదువుకోవాలి అన్నది వాడి కోరిక. ఏదో ఒక కారణం గా తరచు కరణం దెబ్బలు తినవలసి వస్తూ అతని అధికార గర్వం పై తిరగబడాలన్న కోరిక. కరణం గారి కూతురు మహాలక్ష్మితో స్నేహం వాడికి సంతోషకరం. ఇద్దరికి యుద్ధం లో కాలు పోగొట్టుకొని ఆ గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్న అహమ్మద్ కథలు, కబుర్లు చెప్పే అత్యంత ఆత్మీయుడు. అహమ్మద్ మాటల్లో “ కోటిగాడంటే కనబడని సంకెళ్ళలో బిగిసి పోయి కొట్టుమిట్టాడుతున్న పులిపిల్ల.” “వాడికీ  ఊరంటే ఒళ్ళు మంట, ఇక్కడి మనుషు లంటే ఒళ్ళు మంట, ఇక వాడు పుట్టిన కులం అంటే ఒళ్ళు మంట’అందరి మీద తిరగబడాలన్నది వాడితత్వం.” అటు వంటి కోటిని కేంద్రంగా చేసుకొని గ్రామాలలోని కులవర్గ పెత్తందారీ తనాల దుర్మార్గాన్ని దాన్ని ఎదుర్కొనటానికి లేస్తున్న కొత్త శక్తులను , తత్పరిణామాలను నిరూపిస్తూ రామలక్ష్మి వ్రాసిన నవల కోటిగాడు. 

          మహాలక్ష్మి కోసం మామిడికాయ కోసివ్వటం, ఆమె కొరికి ఇచ్చిన ముక్కలు తినటం కోటికి అలవాటే. ఆమెకు కొరుకుడు పడని కాయను చొక్కాతోకప్పి కొరికి అతడు ఇయ్యటం మాత్రం నేరం అయి కరణం చేతిలో చావుదెబ్బలు తినవలసి వచ్చింది. కారణం అతడి కులం. కులం గీతలు దాట కుండా, అగ్రవర్ణాల కుల ఆధిక్యతను గౌరవిస్తూ మెసిలేట్లు  పిల్లలను హద్దుల్లో ఉంచుకొన వలసిన బాధ్యత తల్లిదండ్రులది అని కరణం వంటివారు ఆశిస్తారు. శాసిస్తారు. అయితే ఈ అణచివేత ధిక్కారాన్ని కోరుతుందని అది పీడితవర్గా లలో నివురుగప్పిన నిప్పులా వుండి అనుకూల పరిస్థితులలో జ్వలిస్తుందని చరిత్ర చెబుతుంది. దానిని ఈ నవలలో రుజువుచేసి చూపింది రామలక్ష్మి. దళితులలో జీవశక్తికి  ప్రతినిధిగా కనబడే కోటి, ఆ వూరిబడికి వచ్చే మహిళా టీచర్లను లైంగిక వేధింపులకు గురి చేసే కరణం బావమరిది గోపాలకృష్ణ నుదిటి పైకి గురిచూసి కొట్టిన ఉండేలు దెబ్బ   దళితుల తిరుగుబాటుకు ఆరంభం. ఆ ఊరి బడికి టీచర్ గా వచ్చిన ఇందిర ఆ చిన్న వ్యక్తిగత తిరుగుబాటు సామూహిక పోరాటంగా ఎదగటానికి  అనుకూల పరిస్థితులను సృష్టించిన చైతన్య శక్తి. 

          దళితులు కులంరీత్యా అంటరాని వాళ్ళు. మేం మాలోళ్ళం అంటూ ఒదిగి ఒదిగి దూరంగా నిలుచోనటానికి శిక్షణ ఇయ్యబడ్డవాళ్లు. ఆర్ధికంగా వాళ్ళవి అగ్రవర్ణ అధికార వర్గాల దయాదాక్షిణ్యాల పై ఆధారపడ్డ వెట్టి బతుకులు. వాళ్ళ పై  పీడన దోపిడీలకు అగ్రవర్ణ అధికారవర్గ స్త్రీలు తెలిసి గానీ, తెలియకగానీ మద్దతుదారులు అవుతుంటారు. ఈ నవలలో కరణం భార్య సూరమ్మ అలాంటి స్త్రీలకు ప్రతినిధి. అయినా అప్పుడో ఇప్పుడో పెట్టె పచ్చడి బద్దలకో, పొసే మజ్జిగ నీళ్ళకో ఆమెను పెట్టుపోతలకు అన్నపూర్ణ గా, మనసున్న మాలక్ష్మిగా వెంకన్న, నూకాలు అనుకొంటారు. చెప్తారు. తమ సర్వ శ్రమ శక్తులను ప్రాధమిక అవసరాలు కూడా పూర్తిగా తీర్చని అతికొద్ది ప్రతిఫలానికి వారి పొలాల ను పండించటానికి, ఇంటి పనికి వెచ్చించి వాళ్ళ సంపదలను పెంచే , వాళ్లకు సౌఖ్యాన్ని సమకూర్చే వెంకన్న, నూకాలు  వంటి వాళ్ళు నిజమైన అన్నపూర్ణలు, మనసున్న మారాజులు. ఈ వాస్తవాన్ని తలకిందులు చేసిన లోక వ్యవహారం కాస్తోకూస్తో తెలుస్తూ బాధిస్తున్నందు వల్లనే  కోటికి ఆ అసహనం. చదువు పట్ల కోరిక. కొత్త టీచర్ ఇందిర  మాలమాదిగ వాడల పిల్లలందరూ బడికి రావలసిందే అని వాడిలో ఆశలను ఎగదోసింది. పిల్లలతో పనులు చేయించుకొనటం కామందుల తప్పని చెప్పింది. కానీ వాడిని బడికి పంపరాదని తండ్రి మీద కరణం తెచ్చిన ఒత్తిడి వాడి ఆశల మీద నీళ్లు గుమ్మరించింది. కోటి వంటి దళిత పిల్లలు బడికి పోరాదన్నది అగ్రవర్ణ అధికార నిర్ణయం. దళితులందరూ సాగుకు స్వంత భూమి లేనివాళ్లే కావటంతో కౌలుకు భూమి కావాలన్నా, పాలేర్లుగా జీతానికి ఉండాలన్నా, కూలి పనులు కావాలన్నా కామందులను ఆశ్రయించాల్సిన స్థితిలో ఉంటారు. కనుక వాళ్ళ బ్రతుకు తెరువు గురించి భయపెట్టి వాళ్ళ పిల్లలను చదువులకు పంపవద్దని  ఒత్తిడి తేవటం వాళ్లకు సులువు. తమ సంపదల పెంపుకి తరువాతి తరం  పనివాళ్లను సిద్ధం చేసుకొనే వ్యూహంలో భాగమిది. దళితులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఎన్నో సదుపాయాల గురించి ప్రస్తావిస్తుంది ఇందిర. అవి రాజ్యాంగపరంగా వాళ్లకు లభించినవి. అయితే గ్రామీణ భూస్వామ్యం దానిని ఆచరణ వాస్తవం కాకుండా అడ్డు కొంటున్నది. రాజ్యాంగ నైతికత కిందిస్థాయికి ఇంకలేదన్నమాట. తనమీద, తన జీవితం మీదా, కన్న తల్లిదండ్రులకు కాక కరణం దంపతులకు నిర్ణయాధికారం ఉండటం కోటిని గాయపరిచిన విషయం. చాతకాని కోపంతో పలకని నేలకేసి కొట్టి బడి నుండి పరిగెత్తి పోయిన వాడిని చేరదీసి ఇంటి దగ్గర చదువు నేర్పి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చేర్చి పదేళ్లలో రెవిన్యూ అధికారిగా గ్రామానికి తిరిగివచ్చేట్లు మార్గదర్శకత్వం వహించింది ఇందిర. 

          ఈ నవల ఇతివృత్తంలో ఊరి చెరువు చేపల వేలం కీలకమైన మలుపులకు కారణమైన ఘటన. కరణం మునుసుబుల మధ్య పోటీ చివరకు ప్రతి సంవత్సరం కరణమే ఆ అవకాశం చిక్కించుకొనటం మామూలే. అందుకోసం ఊరి హరిజనులను, ఇతర కులాల వాళ్ళను కూడగట్టుకొనటానికి పెట్టె ప్రలోభాలు, చేసే హింస ఎవరూ ప్రశ్నించలేనిది. ఆ వేలం పాటల కోసం బడిని ఖాళీ చెయ్యాలన్న పెద్దల మాటను ధిక్కరించటంతో ఇందిర ఆ క్రమానికి ఒక సవాల్ విసిరింది. ఎవరినో చంపి చెర్లో వేయటం చూసిన కోటి ‘సత్యమేవ జయతే’ అన్న విలువ పనికి రానిదని, తాను నోరు మూసుకుని ఉంటేనే తల్లికీ తండ్రికీ క్షేమం అని తెలిసి తట్టుకోలేక కల్లోలపడ్డాడు.   చెరువులో నాచు తీస్తే శవం బయటపడటంతో అసలు కారకుడు కర్త స్థానంలో వెంకన్న ను పోలీసులకు పట్టివ్వటంతో ఇందిర కోటిని తీసుకొని వెళ్లి వకీల్ సంగమేశ్వరరావు సహాయంతో పోలీస్ స్టేషన్లో సాక్ష్యం ఇప్పించి వెంకన్నను బెయిల్ మీద విడిపించి కోటీని తీసుకొని వెళ్లి స్కూల్ లో ప్రవేశపెట్టింది. పదేళ్ల తరువాత రెవిన్యూ ఆఫీసరుగా స్వ గ్రామంలో చేపల వేలం పాట అతనే నిర్వహించటం దళితులంతా ఒక్కటై సహకార పద్ధతిలో ఆ వేలంపాట గెలుచుకొనెట్లు కోటిగాడు ఇందిర మార్గదర్శకత్వం వహించటం ఈ నవల ముగింపు. దళితుల చదువు దళిత సామాజిక వర్గపు ఐక్యతకు, చైతన్యానికి, అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న అంబేద్కర్ దృక్పథాన్ని సాహిత్య వస్తువుగా చేయటం అంటే ఇదే. 

          మత్య్సమాంసాలు ముట్టని బ్రాహ్మణులు చేపల వేలంలో నెగ్గి వ్యాపారం చేయటం లోని అధికార రాజకీయాల విమర్శ ఈ నవలలో వుంది. 

          పనిలో పనిగా వితంతువైన కరణం కూతురికి , దళిత కోటికి పెళ్లిచేసి సంస్కరణ వివాహం కూడా జరిపించింది రచయిత్రి. 

          సంగమేశ్వర రావు వంటి వకీలు ఆదర్శాలు, ఉదారభావాలు ఆయన కొడుకు పైన, కూతురు పైన అల్లుడి పైన యే మాత్రం ప్రభావం చూపకపోవటమే వింత. 

3

          ఈ దశకంలో రామలక్ష్మి వ్రాసిన రెండు చారిత్రక నవలలు లవంగి, పండరంగని ప్రతిజ్ఞ. అలంకారశాస్త్ర చరిత్రలో రసగంగాధరము అనే రచన ద్వారా ప్రసిద్ధుడు, పదిహేడవ శతాబ్ది పూర్వార్ధంలో జీవించినవాడు అయిన జగన్నాథుడి ప్రేమ కథ ఇతివృత్తంగా వచ్చిన నవల లవంగి. జగన్నాధుడు పండితరాయలు అన్న గౌరవ నామంతో ప్రసిద్ధుడు. లవంగి అయన ప్రేమించి పెళ్లాడిన ముస్లిం స్త్రీ. ఈ ప్రేమ కథకు చారిత్రక ఆధారాలేమీ లేవు. ప్రచారంలో ఉన్నది మాత్రమే. జగన్నాధుడు ఆంధ్రదేశంలో కోనసీమలోని ముంగండ ఆగ్రహారానికి చెందినవాడు. తండ్రి పేరిల భట్టు వద్దనే సకల విద్యలునేర్చాడు. రసగంగాధరములో ఆయనను తన గురువుగా పేర్కొన్నాడు. తండ్రి పంపగా కాశీలో ఆయనకు గురువైన శేష వీరేశ్వరుల దగ్గరకు వెళ్లి తాను కూడా శిష్యుడు అయి వ్యాకరణ శాస్త్రాదులలో నైపుణ్యం సంపాదించాడు. లవంగి నవలలో కథ  జగన్నాధుడి  కాశీ నగర ప్రవేశంతోనే మొదలవుతుంది. వెళ్ళటం దగ్గర నవలలో కథ మొదలవుతుంది. కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వచ్చిన షాజహాన్ కూతురు లవంగిని చూసి మోహంలో పడటం , ఆమె కూడా అతనిపట్ల ఆకర్షితురాలు కావటం గంగా సైకత తీరప్రాంతాలలో విహారాలు కథను ముందుకు నడిపాయి. జగన్నాధుడు రాజపుత్ర జయపుర ప్రభువు ఆహ్వానం మీద జయపుర పాఠశాల విద్యాధికారిగా ఉన్న సమయంలో ఢిల్లీ పాదుషాల ఆస్థానంతో పరిచయాలు , విద్వద్ గోష్టులలో పాల్గొనటం, సర్వ సైన్యాధ్యక్షుడైన ఆసఫ్ ఖాన్ అభిమానాన్ని చూరగొనటం షాజహాన్ ఆస్థానంలో పండిత రాయాల బిరుదు పొందటం ఇవన్నీ చారిత్రిక విశేషాలే. లవంగి కోసం ఢిల్లీ వచ్చి కోటలోకి ప్రవేశించటానికి చేసిన సాహస కృత్యంతో వీటిని ముడిపెట్టి నవలేతి వృత్తాన్ని నడిపింది రామలక్ష్మి. లవంగి జగన్నాథుల ప్రేమకు ఈర్ష్యపడి రోషనార హానితలపెట్టినట్లు కూడా మరొక కల్పన చేసింది. ఆ క్రమంలో గాయపడిన లవంగిని బతికించుకొనటం కాశీ గంగా జల స్పర్శ వల్లనే సాధ్యమని తీసుకొని వెళ్లి అందుకు ఎదురైన అవరోధాలను అధిగ మించే క్రమంలో గంగాదేవిని స్తుతించినట్లుగా అందుకు ఉప్పొంగి గంగ అవరోధాలను దాటి జగన్నాధుడు ఉన్న ప్రాంతం వరకు ఎగిసిపడుతూ ఉరికి వచ్చినట్లు ఆ నీటి స్పర్శతో లవంగి తేరుకొన్నట్లు కథను కల్పించింది రామలక్ష్మి. జగన్నాధుడు గంగాలహరి అనే యాభై మూడు శ్లోకాల కావ్యం గంగానదిని స్తుతిస్తూ వ్రాసిన మాట నిజం. దానిని లవంగి పట్ల జగన్నాధుడి ప్రేమోద్వేగ సందర్బం నుండి ఆశువుగా చెప్పబడినదిగా   రామలక్ష్మి కల్పించింది. మనుషుల మధ్య చిగురించే  ప్రేమ మతానికి అతీతమైనదని హిందూ ముస్లిం విభేదం , విద్వేషం కూడనిదని సందేశం ఇస్తుంది ఈ నవల. 

          పండరంగుని ప్రతిజ్ఞ తెలుగు ప్రాంతపు సేనాని జీవితం వస్తువుగా వచ్చిన నవల. పండరంగడు క్రీస్తుశకం 9వ శతాబ్ది వాడు. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వేంగీ చాళుక్యు లలో గుణగ విజయాదిత్యుడి సేనాని. అతని పక్షాన యుద్ధాలుచేసి విజయాలు సంపాదిం చి పెట్టినవాడు. పండ్రెండు బోయకొట్టములను మట్టుపెట్టటం దగ్గర నుండి కందుకూరు ను మరొక బెజవాడగా తీర్చిదిద్దటం వరకు అతను సాధించిన విజయాలను, చేసిన పనులను నమోదు చేసిన శాసనం అద్దంకిలో తవ్వకాలలో దొరికింది. పండరంగని అద్ధంకి శాసనంగా అది ప్రసిద్ధి. అదే మొదటి పద్య శాసనం. మొదటి తెలుగు పద్యం ఇందులోనే ఉంది. అది తరువోజ ఛందస్సులో ఉంది. ఆ రకంగా ప్రసిద్ధుడైన చారిత్రక వ్యక్తి పండరంగడు. అతని రాజభక్తి, దేశభక్తి, తెలుగుభాషాభిమానం కేంద్రంగా చేసుకొని రామలక్ష్మి ఈ చారిత్రక నవలను వ్రాసింది. 

          బాదామిని పాలించే సత్యాశ్రయ పులకేశి దిగ్విజయ యాత్రలు క్రీస్తు శకం 624 లో తెలుగు ప్రాంతాలలో వేంగీ కేంద్రంగా అతని తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడిని రాజుగా స్థాపించాయి. అతని వారసులు తూర్పు చాళుక్యులుగా ప్రసిద్ధులు. కుబ్జ విష్ణు వర్ధనుడికి పదవతరం వాడైన రెండవ విజయాదిత్యుడి పాలనా కాలంలో ఈ నవలలో కథ మొదలవు తుంది.  అతని పాలనా కాలం 808 నుండి 847. అతని మనుమడు గుణగ విజయాదిత్యు డు ఈ నవలకు నాయకుడు. నవల ప్రారంభంలో నాయకుడి తాతగారి పాలన నలభై  ఏళ్లుగా సాగుతున్నట్లు గుణగవిజయాదిత్యుడి సోదరుడు మల్లపురాజు మాటలను బట్టి తెలుస్తుంది. అంటే నవలలో కథ 840 లో మొదలైనట్లు. అతని మరణంతో రాజైన కొడుకు కలి విష్ణువర్ధనుడు అతి కొద్దికాలానికే మరణించటంతో గుణగవిజయాదిత్యుడు సింహాసనం అధిష్టించాడు. అతనిది అసలు కథ. అతనికి పండురంగడు ఇష్టసఖుడు. తాను ఎప్పుడు రాజైనా అప్పుడు తన సర్వ సైన్యాధిపతి పండరంగడే అని నిశ్చయించు కొని ఉన్నాడు. గుణగ విజయాదిత్యుడి కోసం బోయ కొట్టాలను కొట్టి కందుకూరు వరకు రాజ్యాన్ని సుస్థిరం చేయించిన విషయాన్ని చెప్పే అద్దంకి శాసనం 848 నాటిది. కనుక గుణగ విజయాదిత్యుడు రాజైన వెంటనే ఈ దండయాత్ర జరిగిందన్నమాట. ఆ తరువాత పండరంగడు తన ప్రభువు గుణగ విజయాదిత్యునికి జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చటంగా చేసిన  యుద్ధాలు, రాష్ట్రకూటుల పై సాధించిన విజయాల ప్రస్తావనతో ఈ నవల ముగుస్తుంది. 

          ఏ దేశ చరిత్రలో చూసినా రాజ్యాధికారం కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధాలు, కుట్రలు, హత్యలు, పర రాజ్యాలను ఆక్రమించి విస్తరించాలనే కాంక్షలు, నిరంతర యుద్ధాల చరిత్రలో గెలిచినవాళ్లు చేసిన అవమానాలకు ఓడినవాళ్లు ప్రతీకారం తీర్చు కొనాలని పట్టుదలలు తరతరాలకు కొనసాగి రావటం మామూలే. రాష్ట్ర కూటులు ఒకప్పుడు చాణుక్యుల మీద సాధించిన విజయానికి గుర్తుగా చాళుక్యులతో వెట్టి చేయించి వాళ్ళ నగరంలో నిర్మించిన ఒక భవనం గురించి నవల ప్రారంభంలోనే ప్రస్తావన వస్తుంది. నిర్మాణం చాలా అందమైనదే కానీ దానిని విజయాదిత్యుడు చాళుక్యుల అవమాన చిహ్నంగా భావిస్తాడు. దానిని నిర్మూలించి ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలను కొంటాడు. పండరంగడు కాబోయే సైన్యాధ్యక్షుడుగా ఆ విజయాన్ని అతనికి సమకూర్చి పెడతానని వాగ్దానం కూడా చేస్తాడు. 

          తాత మరణించి తండ్రి రాజ్యానికి వచ్చి విజయాదిత్యుడు యువరాజు అయినది మొదలు చాళుక్య సింహాసనం తనకు దక్కాలన్న ఆశతో విజయాదిత్యుడి చిన్న తమ్ముడు మల్లపురాజు మేనమామలైన రాష్ట్రకూటులు పంచచేరి మంతనాలు ప్రారంభిం చటం అతనిని నెపంగా పెట్టుకొని చాళుక్యుల పై ఆధిపత్యం కోసం రాష్ట్రకూటులు యుద్ధానికి తలపడటం, అది తెలిసి చాళుక్యులు ప్రతివ్యూహాలతో దండు నడిపినట్లు తల్లి శీలమహాదేవికి ఇచ్చిన మాటకు కట్టుబడి గుణగ విజయాదిత్యుడు యుద్ధవిరమణ చేసి మేనమామ షరతులకు లోబడి వాళ్ళ రాజధానిలో తమకు అవమానకర చిహ్నంగా ఏ వాహ్యాళి గురించి అనుకున్నాడో దానిని చీపురుతో ఊడ్చినట్లు  ఘటనను కల్పించి రచయిత్రి ఇతివృత్తంలో ఉద్వేగాల స్థాయిని, ప్రతీకారాల కాంక్షను పతాకస్థాయి దశకు చేర్చింది. పండరంగడికి కార్యక్షేత్రాన్ని మరింత పెంచింది. గుణగ విజయాదిత్యుడిని వేంగీ రాజుగా స్థిరపరిచింది. 

          నా దేశం, నా రాజు, నా భాష అన్నఅభిమానం పండరంగని కార్యోత్సాహంలో విడదీయరాని భాగం. అద్దంకి దగ్గర విజయ శాసనం తెలుగు పద్యాలలో వేయించటం దానికి నిదర్శనం. ఈ భాషాభిమానానికి పాదులు తీసిన ఘటనలను ఇతివృత్తంలో భాగంగా మొదట్లోనే సమకూర్చింది రచయిత్రి. చాళుక్యు లను అవమానపరిచే నిర్మాణాలు చేసి శాసనాలు వేయించటం పట్ల రాష్ట్రకూటుల పై ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న విజయాదిత్యుడి మనసును మళ్లించటం అతని తల్లి శీలామహాదేవి కోరిక. దానిని నెరవేర్చటానికి సర్వసైన్యాధ్యక్షుడు కడియరాజు, మంత్రి వినయడి శర్మ కలిసి అతని ముందుకు ‘భాషా స్పర్ధ’ ను తీసుకొని వచ్చారు. రాష్ట్రకూటులు చేసిన రాజకీయ అవమానాల సంగతి సరే … భాషాపరమైన అవమానాల గురించి ఆలోచించమన్నారు. విజయాదిత్యుని మేనమామ రాష్ట్రకూట రాజూ అయిన అమోఘవర్ష నృపతుంగుడు కన్నడసాహిత్య పోషకుడుగా ప్రసిద్ధి. కన్నడభాష పద్య లక్షణాలను, కవి మార్గాలను నిర్దేశిస్తూ కవిరాజ మార్గం అనే లక్షణశాస్త్ర గ్రంధం ఆయన వ్రాసాడు అని పండరంగని ద్వారా రచయిత్రి చెప్పించింది కూడా. వాస్తవానికి అది అతని ఆస్థానంలో ఉన్న శ్రీ విజయుడు వ్రాసాడని అందుకు ప్రేరకుడు నృపతుంగుడు అన్నది వాస్తవం. అదలా ఉంచితే ఈ నవలేతివృత్తానికి కావలసింది ఆయన కన్నడ భాషాభిమానం. దానిని  ప్రస్తావించి వినయడి శర్మ ఆయన తెలుగును ద్వేషిస్తాడట అన్న ఒక వ్యతిరేక భావాన్ని విజయాదిత్యుడిలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసాడు. ఆయన కవిత్వం చదివి వినిపిం చటం గురించి కన్నడ కస్తూరి, తెలుగు తేట అని రెండు భాషలను మెచ్చుకొనటం గురించి చెప్తూ విజయాదిత్యుడు ఆ విషయమై సందేహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించే సరికి అవి ముఖస్తుతి మాటలు అని తీసి పారేసాడు. కన్నడం  ఉన్నట్లు తెలుగుభాషలో ఒక్క కావ్యమైనా లేకపోవటాన్ని, తెలుగులో శాసనాలు లేకపోవటాన్ని ప్రస్తావించి మేనమామకు దీటుగా గుణగ విజయాదిత్యుడు తెలుగుకు ఒక లక్షణగ్రంధం వ్రాయాలని అందుకు ప్రజల వ్యవహారంలో ఉన్న రకరకాల దేశి ఛందోరీతులను సేకరించి లక్షణ నిర్దేశం చేసే కార్యక్రమం విజయాదిత్యుడికి ఇయ్యబడింది. అందుకతనిని ఉత్సాహ పరచినవాడు పండరంగడే. ఆ నేపథ్యంలోనే పండరంగడు శాశనం వేయటానికి లభించిన తొలి అవకాశాన్నితెలుగు పద్యాన్ని నమోదు చేయటానికి ఉపయోగించినట్లు కథను నడిపింది రామలక్ష్మి.  

          అలాగే యుద్ధాలలో ఓడినవాళ్లు గెలిచినవాళ్లకు తమ ఆడపిల్లలను ఇచ్చి పెళ్ళి చేయటం చరిత్రలో ఒక సాధారణ అంశం. చాళుక్యులకు రాష్ట్ర కూటులకు జరిగిన నిరంతర యుద్ధాలలో అలా జరిగిన పెళ్లిళ్లు ఉన్నాయి. మూడవ విజయాదిత్యుడి తాతగారు రెండవ విజయాదిత్యుడు వేంగీ సింహాసనం దక్కించుకొనటానికి సవతి సోదరు లతోను, వాళ్లకు మద్దతు ఇచ్చిన రాష్ట్రకూటులతోను అనేక యుద్ధాలు చేయవలసి వచ్చింది. వాళ్ళ చేతిలో ఓడిన ఒకానొక సందర్భంలో తన చెల్లెలిని రాష్ట్రకూట రాజుకు ఇచ్చి పెళ్లిచేసి సంధి చేసుకోవలసి వచ్చింది. ఆమె కొడుకు బిడ్డ శీలమహాదేవి. ఆ తరువాత ఎప్పుడో రాష్ట్ర కూటుల పై  విజయం సాధించిన సందర్భంలో ఆయన కొడుకు కలివిష్ణు వర్ధనుడికి శీలమహాదేవి భార్య అయింది. ఓడినవాళ్లు విజేతలకు కట్టే కప్పాలు కానుకలలో ఇంట పుట్టిన ఆడపిల్లలు ఉంటారు. శత్రుత్వాలు మాత్రం తరతరాలకు కొనసాగుతుంటాయి. అత్తింటి పుట్టింటి వైరాల మధ్య నలిగిపోయే రాజ కుటుంబాల మహిళల అంతరంగ వేదనను శీలమహాదేవి ముఖంగా చూపటం ఈ నవల ప్రత్యేకత. ఇరువైపులా ఆమె రక్త సంబంధీకులే ఉంటారు. ఎవరి విజయానికి సంతోషించాలో, ఎవరి ఓటమికి దిగులు పడాలో తెలియదు. యుద్ధం అంటే హింస. మరణాలు. ఎటువైపు వాళ్ళు మరణించినా ఆమెకు దుఃఖమే. అందుకే స్త్రీలు యుద్ధాలను కోరుకోరు. యుద్ధోన్మాదాన్ని ఏవగించుకొంటారు. నిరోధించటానికి విఫల ప్రయత్నాలు చేస్తారు. 

          ఈ నవలలో శీలమహాదేవి చేసింది అదే.  కొడుకులు తన పుట్టింటి పై ద్వేషాలతో రగిలి పోకూడదు అన్నది ఆమె కోరిక. సవతి సోదరుడు అమోఘవర్ష నృపతుంగుడి కూతురుతో తన పెద్దకుమారుడు విజయాదిత్యుడికి పెళ్లి చేయటం దానికి పరిష్కారం అనుకొంటే అది కలిసిరాలేదు. తీరా అతను సింహాసనం ఎక్కటంతోనే రాష్ట్రకూటులతో యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఆ రక్తపాతాన్ని ఆపాలని ప్రయత్నించింది. తల్లిగా శాంతి భిక్ష పెట్టమని కొడుకును అర్ధించి విజయుడు నీకు సామంతుడిగా ఉండి కొలుచు కొంటాడు అని మాటయిచ్చినట్లు కథను కూర్చింది రామలక్ష్మి. విజయాదిత్యుడు రాష్ట్ర కూటులతో యుద్ధాలలో ఓడిపోయి సామంతుడుగా అవమానాలపాలు కావటం చారిత్రక సత్యమే. అయితే అది గుణగావిజయాదిత్యుడి ఓటమిగా కాక తల్లిమాట జవదాటనికొడుకు విలువగా నిరూపించటానికి సహజమూ, సంభవయోగ్యమూ అయిన శీలమహాదేవి శాంతి కామనను నెపంగా చేసుకొనటంలో రచయిత్రి దృక్పథ నైశిత్యం కనబడుతుంది.   

          నృపతుంగుడి మరణానంతరం (878) గుణగ విజయాదిత్యుడు స్వతంత్రత ప్రకటించుకొని రాష్ట్రకూటుల పై పైచేయి సాధించాడు. ఆ ఓటమిని మానవ బంధాలకు, శాంతి సమరసాలకు ప్రాధాన్యత ఇచ్చిన తల్లికి చేసిన వాగ్దాన ఫలంగా చూపినరచయిత్రి  ఆ తరువాత సాధించిన విజయాన్ని వాగ్దాన భంగం చేశాడన్న అపవాదు లేకుండా ఆమె మరణానంతరం సాధించినదిగా కల్పించింది. నవల పేరు పండరంగుని ప్రతిజ్ఞ అయినా, యుద్ధకార్యకలాపాలన్నీ అతనివే అయినా ఆ విజయాలన్నీ సైన్యాధ్యక్షుడిగా రాజైన గుణగ విజయాదిత్యుడి కోసం సాధించినవి కావటం వలన అతనే నాయకుడు అవుతున్నాడు ఈ నవలకు. మంచి చారిత్రక నవలను చదివిన అనుభవాన్ని ఇస్తుంది ఈ నవల. 

          అయితే ఇది రాజుల కోణం నుండి అంటే విజేతల కోణం నుండి వ్రాయబడిన చారిత్రక నవల అని మనం మరిచి పోకూడదు. పండరంగని యుద్ధాలలో ఓడిపోయిన, జాతి జాతి నశించిపోయిన బోయకొట్టాల ప్రజల కోణం నుండి చరిత్రను చూసినప్పుడు జీవితంలోని అధికారవాంఛల , ఆక్రమణ చర్యల, విద్వేషాల భీభత్సం మనలను కలత పెట్టక మానదు. కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లే వ్రాసిన ‘బోయకొట్టములు పండ్రెండు’ అనే నవల చదవండి. తెలుస్తుంది.  

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.