ముందడుగు

– ఝాన్సీ కొప్పిశెట్టి

“శారద.. విడో ఆఫ్ శ్రీనివాస్”

          అలసటగా ఆఫీసు నుండి తిరిగి వస్తూ గేటుకి తగిలించి వున్న పోస్ట్ బాక్సులో నుండి తీసిన కవరు పైన పేరు చదివిన శారద మనసు ఒక్క క్షణం స్తబ్దు అయిపోయింది.
మొట్ట మొదటిసారిగా తన పేరుతో జత చేయబడ్డ ‘విడో’ అనే కొత్త విశేషణం వంక
విచిత్రంగా చూసింది. శారద విడో ఆఫ్ శ్రీనివాస్ అయి ఇరవై రోజులే అయ్యింది. వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ గా ముప్పయి ఏళ్ళు జీవించింది. తన పేరులోనే తన శ్రీనివాసుని లీనం చేసుకు ని మిసెస్ శారదా శ్రీనివాస్ గా మారి ముప్పయి సంవత్సరాలు అయ్యింది. ఈ రోజున అతను లేనంత మాత్రాన వైఫ్ కాకుండా పోదు కదా. మరి వైఫ్ చోట విడో అని విడమర్చి రాసి పోస్ట్ చేసి, అతను లేనితనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం నిజంగా అవసరమా…

          శారద నిస్సత్తువగా మంచం పై వాలి ‘విడో ఆఫ్ శ్రీనివాస్’ అనే అక్షరాలను పదే పదే చదువుతోంది. నిశ్శబ్ద నిశీధిలో పక్కనే ఏదో చిన్న అలికిడి. ఆమెలో ఏదో అలజడి.
పక్క నుండి బలంగా ఊపిరి పీలుస్తున్న శబ్దమేదో విషాదంగా వినిపిస్తోంది. తన గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తూన్న ఆ నీరవ నిశ్శబ్దానికి అజ్ఞాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు తోడయ్యాయి. గడ్డ కట్టిస్తోన్న ఆ స్మశాన నిశ్శబ్దంలో ఆమెను వెన్నంటి వెంటాడుతున్న భ్రమ అతనేనా అని శారద విస్తుపోయింది.

          శ్రీశ్రీ అనుభవించిన మృత్యు శైతల్యం ఏదో ఆమెను ఆవహించింది. నిస్త్రాణంగా కనురెప్పలు మూసింది. మూసిన కళ్ళ నుండి నిండుకున్న కన్నీరు కంటి కొలకుల్లోంచి అవిరామంగా జారుతూ దిండుని తడుపుతోంది. ఆమె జారుతున్న కన్నీటి తెర వెనుక కాలుతున్న అతని కాష్టం కదలాడింది…

* * * 

          మొన్నటి రాత్రి తన చేతిని అతని గుండెల కదుముకుని నిద్రించిన శ్రీనివాస్ ఇవాళ హాలులో నేల పైన శాశ్వత నిద్రలో వున్నాడు. ఒద్దికగా బాసింపెట్టు వేసుకుని
శారద అతని పక్కనే కూర్చుని అతని చల్లని చేతిని తీసుకుని తన ఒడిలో పెట్టుకుని
అతని ప్రశాంత వదనం వంక చూస్తోంది.

          గత కొద్ది కాలంగా అనారోగ్య కారణంగా లో బీపీతో అతని ఒళ్ళు ఒకింత చల్లగానే
వుండేది. కాని ఇవాళ మంచులా మరీ చల్లగా వుంది. అందరూ అతను పోయాడంటు న్నారు. అంటే ఇంక తనతో వుండడన్నమాట. శారదకి చెప్పలేనంత దిగులుగా వుంది. రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు అతని పక్కలో, ప్రేమలో, సేవలో, లాలన లో, సాన్నిహిత్యంలో వెళ్లదీసేది. తను లేకుండా ఇప్పుడు ఏం చేయాలి.. జీవితమెలా
వెళ్లదీయాలి…

          “శారద కంట్లో ఒక్క చుక్క కన్నీరు లేదు.. భర్త పోయాడన్న దుఃఖం అస్సలు లేదు”
ఎవరెవరో చెవులు కొరుక్కుంటున్నారు. “మొగుడు పోయాడని శారదే ఏడవటం లేదు. నువ్వెందుకే అనవసరంగా ఏడ్చి తల నొప్పి తెచ్చుకుంటావు” కళ్ళు ఒత్తుకుంటున్న తన కోడలు రాధను చూసి ఎంతో కన్సర్న్ తో శారద అక్క అంటోంది.

          శారద ఆంతరంగిక స్నేహితురాలు, ప్రియ నెచ్చెలి కోమలి మాత్రం శారద ఒక్కసారి
మనసారా ఏడ్చి తన గుండె భారం దించుకుంటే బావుండునని కోరుకుంటోంది. “తల కొరివి పెట్టడానికి కొడుకులు ఎటూ లేరు. అమెరికా నుండి కూతుళ్ళయినా వస్తారంటారా”
మానవ సహజ పైశాచికానందంలో కూతుళ్ళు రాకూడదని కోరుకుంటూ ఎవరో చేస్తున్న
విచారణ.

          గత నెల రోజులుగా అనుక్షణం అమెరికా నుండి కాల్ చేస్తూ తండ్రి యోగక్షేమాలు
తెలుసుకుంటున్న శారద బిడ్డలు ఇద్దరూ కన్నీరు మున్నీరవుతున్నారు. తల్లి
వంటరిగా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్న దిగులు వాళ్ళను నిలువనీయటం లేదు. అది తండ్రి పోయిన దుఃఖాన్ని మించిన దుఃఖం. అయినా రాలేని పరిస్థితి. ఒక కూతురు పూర్ణ గర్భంతో కాన్పు కోసం ఎదురు చూస్తూ ప్రయాణానికి అర్హతలేక ఏడుస్తోంది. మరో బిడ్డ తండ్రి మరణానికి రెండు రోజుల ముందు బిడ్డను కని ఆసుపత్రిలో అతలా కుతలం అవుతోంది.

          విదేశాల్లో బిడ్డలను ఎంత ప్రేమపాశం లాగినా పరిస్థితులు అనుకూలించక రాలేని
తమ స్థితిని నిందించుకుంటూ తండ్రి పార్థివ దేహాన్ని, పాలిపోయిన తల్లి మొహాన్ని, పిన్ని చేసిన వీడియో కాల్ లో చూస్తూ విలపిస్తున్నారు.

          శ్రీనివాస్ ఆఫీసు మొత్తం ఆ ఇంటి ముంగిట్లో ఆసీనమై అతని మంచితనాన్ని
కొనియాడుతున్నారు. శారద సహోద్యోగులు, సన్నిహితులు, స్నేహితులు ఏ స్పందన
లేకుండా అభావంగా వుండి పోయిన శారదను ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా
రోదిస్తున్నారు.

          “ప్రసాదూ, రెండేళ్ళగా శ్రీనివాసుకి స్వంత తమ్ముడిలా సేవ చేసావుగా, నువ్వు తల
కొరివి పెట్టవయ్యా, శారద ఎంతో కొంత ముట్టచెబుతుందిలే నీకు”

          చావుకి వచ్చిన ప్రసాదు అన్నదమ్ములు ప్రసాదు చెవిలో గుసగుసలాడుతున్నారు.
దూరపు బంధువు, కటిక పేద, చదువు సంధ్యలు లేని, శారదకు వరుసకు తమ్ముడైన
ప్రసాదుని శ్రీనివాసు ఆరోగ్య రీత్యా సహాయ సహకారాల కోసం గత సంవత్సర కాలంగా శారద తన ఇంట్లో పెట్టుకుంది.

          “శారద తన మేనల్లుడు రవికి తన పరపతితో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించింది. వాడు అప్పుడప్పుడూ వచ్చి ఆవిడ మంచి చెడులు తెలుసుకుంటూ వుంటాడు. శారదకి వాడు దత్తపుత్రుడు. తల కొరివి రవితో పెట్టించండి”

          రవి కుటుంబ సభ్యులెవరో ఎంతో ఔదార్యం ఒలకబోస్తున్నారు. కొన్ని లక్షల్లో అమ్ముడుపోతున్న క్లర్క్ ఉద్యోగం శారద తన ఉద్యోగ హోదా, పరపతి ఉపయోగించి బోర్డు సభ్యులతో మాటాడి పైసా ఖర్చు లేకుండా రవికి ఇప్పించింది.

          “శారద అక్కగారి చిన్నబ్బాయి వాసు ఉన్నాడుగా. వాసు శ్రీనివాసుకి తల కొరివి
పెట్టకూడదా…”

          “అలా పెట్టడం ఎలా కుదురుతుందండీ… రేపు వాళ్ళ అమ్మకు పెట్టాల్సిన వాడు కదా”

          “వాసు పెట్టడానికి సిద్దమవుతున్నప్పుడు మనకు అభ్యంతరాలు దేనికండీ”

          వాసు ఏమి ఆశించి ముందుకొచ్చాడో తెలియకుండా బంధువుల్లో వాదోపవాదాలు
జరుగుతున్నాయి. హాలులో బంధు జనం శారద పైన సానుభూతిని కుట్రలా కొనసాగి స్తున్నారు. ప్రతి ప్రేమ వెనుక ఒక కుట్ర దాగి వుంటుందేమో.

          “కర్మకాండలు ఎవరు చేస్తున్నారో నిర్ధారించుకుని ఆచమనీయ శుద్ధికి స్నానానికి
రండి. అలాగే పార్థివ దేహాన్ని కూడా పసుపు నీళ్ళతో పరిశుద్ధం చేయాలి… బయటకు
తీసుకు రండయ్యా… కార్యక్రమానికి ఆలస్యం అవుతోంది.. త్వరగా తెమలండి”

          శారద చిత్తరువులా చూస్తూండగానే బయటి నుండి పంతులు అరవటం, శ్రీనివాసుని తీసుకెళ్లి పోవటం ఒక్క సారే జరిగిపోయాయి.

          కూతురికి పెళ్ళయితే ఇంటి పేరు, గోత్రం మారతాయి కాబట్టి తల్లిదండ్రులకు
కర్మకాండలు చేయటానికి పనికి రారంటారు. మరి శ్రీనివాసుతో ఎటు వంటి వంశ
పారంపర్య, జన్యుపర సంబంధాలు లేని వేరే వంశీయులు అతనికి తల కొరివి పెట్టడం
ఎంత వరకూ సహేతుకం.

          శారద తన పేరుకి అతని ఇంటి పేరును ముందు, అతని పేరును వెనుక తగిలించు కుని ముప్పయి మూడేళ్ళు సహధర్మచారిణిగా సంసారం చేసిన సతీమణి, అతని వంశా న్ని వృద్ధి పరిచిన అర్ధాంగి… ఆమె కన్నా తల కొరివి పెట్టడానికి అర్హులెవరు.

          క్షణం ఆలోచించకుండా శారద చటుక్కున లేచి బయటకు వెళ్ళి “నేనే వారి కర్మ కాండలు చేస్తున్నాను” అంటూ స్నానం చేయించమని కుర్చీలో కూర్చొంది.

          యావన్మందీ ఒక్కసారిగా హతశులయ్యారు. 

          “అమ్మా, మీరు స్త్రీలు. మన హిందూ మతాచారం ప్రకారం స్త్రీలు శ్మశానాల్లోకి కూడా వెళ్లరు. అలాంటిది మీరు చేయటమేమిటమ్మా. కర్మకాండల తదనంతర కార్యాలు, తల నీలాలు తీయటాలు గట్రా చాలా వుంటాయి. భావోద్వేగంలో తీసుకునే నిర్ణయం కాదమ్మా ఇది. స్త్రీలకు అన్నీ సాధ్యం కావు తల్లీ” బ్రాహ్మడు శారద ప్రయత్నాన్నిమార్చే ప్రయత్నం చేసాడు.

          ఒకసారి శారద మనసు ఒక నిర్ణయానికి వచ్చాక ఇక మార్పు వుండదు.

          “ఇంతవరకూ చరిత్రలో భార్య భర్తకు తల కొరివి పెట్టడం జరగలేదు శారదమ్మా. ఇది మన ఆచారాలకు, మన సాంప్రదాయానికి విరుద్దమమ్మా” పంతులు శారదను ఆపే మరో ప్రయత్నం చేసాడు.

          “నేను కొత్త చరిత్రను సృష్టిస్తాను… తల కొరివి అత్యంత ఆత్మీయులు పెట్టాలే కాని ఆచారాలు, మతము, సంప్రదాయం, హక్కులు కాదు ఎవరు పెట్టాలని నిర్ణయించేది. నా అడుగుజాడల్లో మరెవరైనా నడిస్తే నేను శ్రీకారం చుట్టిన తొలి స్త్రీని అవుతాను లేదా నేను మాత్రమే చేసిన దాననవుతాను”

          బిందెలు బిందెలుగా శారద తలమీద కుమ్మరిస్తున్న పసుపు నీళ్ళతో పాటు ఒక్క సారిగా బద్దలైన ఆమె గుండె కార్చిన కన్నీరు ఏరై ప్రవహించింది. సనాతన సత్సంప్ర దాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలి ఉద్వేగ పూరితంగా ఏడుస్తూ తడి బట్టల్లో వున్న శారదను గుండెలకు అదుముకుంది.

          ఇద్దరు మేనల్లుళ్లు, తమ్ముడు, అక్క కొడుకు నాలుగు భుజాల పైన అతని పాడె
మోస్తుండగా వాళ్ళను లీడ్ చేస్తూ ఒంటికి అంటుకు పోయిన తడి చీరలో శారద శ్మశాన వాటికకు బయిలుదేరింది.

          శ్రావణ మాస శుక్రవార సాయంత్రం వేళ కోమలి తన నిష్టాగరిష్ట నియోగ బ్రాహ్మణ వంశాచారాలన్నింటినీ పక్కన పెట్టేసి శారదకు మనోబలాన్ని ఇస్తూ ఆమె పక్కనే నడిచింది. శారద నడుస్తోందే కాని ఎందుకో ఆమెకు ఇంకా అతను లేడన్న నమ్మకం కుదరటం లేదు.

          డప్పుల చప్పుళ్ళకి ఉలికిపడి అతను లేవచ్చేమోనని చిన్న ఆశ…దింపుడు కళ్ళెంలో ఆమె పిలుపుకి పలకవచ్చేమోనని పేరాశ… ‘శ్రీనివాస్ అమర్ రహే’ అని శవవాహకులు చేసే నినాదాలకు మేల్కొనవచ్చేమోనని దురాశ… మిన్నునంటుతున్న టపాసుల, రాకెట్ల వెలుగులో పై నుండి ఆమెను ఎవరో పిలుస్తున్నట్లనిపించింది.

“ఎవ్వరో హో
ఈ నిశీథి నెగసి
నీడవోలె నిలిచి పిలుతురెవరో
మూగకనులు మోయలేని చూపులతో
ఎవరోహో… ఎవరోహో…”

          దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఎవరి కోసం ఎలుగెత్తి ఆర్తనాదం చేశారో.. శారదకూ ఎలుగెత్తి అరవాలని వుంది. 

          శారదను శ్మశాన వాతావరణం భయపెట్టింది. గాలి స్తంభించి వుంది. ఆకుల్లోఅలికిడి
లేదు. దిగులు మొహాల పూలు సందడి చేయటం లేదు. చెట్లు విషాద చాయల్లా తల వాల్చి మౌనాన్ని ఆశ్రయించాయి. ఏ ధ్వనీ లేని ఈ దుఃఖాన్నే కాబోలు శ్మశాన నిశ్శబ్దం
అంటారు. వెన్ను గగుర్పొడిచే ఆ వాతావరణం చూసి శారద మనసు పరిపరి విధాల
పోతోంది. ఇక్కడ అతనిని ఖననం చేస్తే తప్పకుండా జడుచు కుంటాడు. మొన్నటి వరకూ మనో ధైర్యం కోసం తన చేతి పట్టు వదలకుండా పడుకునేవాడు. అలాంటిది ధరణి కౌగిట్లోనైతేనేమి అతనిని తను ఒంటరిగా వదల లేదు. కాటికాపరి ఇంటి పక్కనే తను మరో గూడు ఏర్పరచుకోవాల్సి వుంటుంది.

          అదృష్టం కొద్దీ అతనిని దహనం చేసారు. ఎప్పుడూ ఆమె గుండెల పైన సేద తీరే అతని శిరస్సుకి శారద స్వయంగా తన చేతులతో కొరివి పెట్టింది. కఠినాత్మురాలై గుండె
రాయి చేసుకుని కపాల మోక్షం అయ్యే వరకూ వీక్షిస్తూ నిలబడింది.

* * * 

          ఇరవై రోజుల క్రితం తను పెట్టిన తల కొరివి మంటలు ఇప్పటికీ కార్చిచ్చులా ఆమెను నిలువునా దహించి వేస్తున్నాయి. ఒంటరితనము, తన మనసును ఆవహించిన శూన్యము, చుట్టూ మౌనంగా రోదించే గోడలు, నిరంతర చీకటి, భయపెట్టే నిశ్శబ్దం ఆమెను కునుకు తీయనీయటం లేదు. శ్మశాన వైరాగ్యంలో ఆమె కొట్టుమిట్టాడుతోంది.

“ఇది నితాంత తమఃక్రాంత మిది దరిద్ర
మీ నిశాంతమ్ము శూన్య, మిం దెన్నడో ర
హ శ్శిథిలసుప్తి కలవర మంది…”
అని కృష్ణశాస్త్రి ఎందుకు విలపించారో కాని శారద పతి వియోగ విలాపం శాంతించటం
లేదు…

          ఎన్నడో చెదిరిన నిద్ర కలవరంలో అంతులేని ఈ దరిద్రపు చీకటి ముగింపు శూన్యమే.

          “శారద.. విడో ఆఫ్ శ్రీనివాస్” అనే చేతిలో కవరు వంక శారద మరోమారు శూన్యంగా
చూసుకుంది.

*****

Please follow and like us:

11 thoughts on “ముందడుగు”

 1. ఒక నూతన సమస్యను తీసుకుని చాలా బాగా రాసారు..ఆదపిల్లల తల్లిదంద్రులు ప్రస్థుతం ఎదుర్కొంటున్న సమస్య ఇది..ఎవరో ఒకరు దారి చూపాలి.. చాలా బాగుంది….

 2. ఎంతో హృద్యంగా ఉంది…అప్రయత్నంగానే కళ్లు చెమ్మగిల్లాయి.🙏

 3. మేడం ,నమస్కారములు.
  మీకథ ముందడుగు చాలా బాగా వుంది.
  ‘గొంతు విప్పిన గువ్వ’ లో రాసిన దానికన్నా భర్త చనిపోయిన స్త్రీ
  వేదనను, అంతర్గత ఆలోచనలను చక్కగా ఆవిష్కరించారు. అభినందనలు.

  1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు అజయ్ కుమార్ గారూ🙏🙏

 4. చాలా ఆర్ద్రతతో హృదయానికి హత్తుకు పోయింది కథ చాలా చాలా బాగుంది ప్రతి పదం పదే పదే చదివించేలా వ్రాశారు ఫ్రెండ్ హాట్సాఫ్ యూ.👏👏👏👏👏👏🙏 హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐💐💐💐🤝

 5. ఒక కొత్త కథావస్టువును తీసుకుని,
  సంప్రదాయాలను ఛాలెంజ్ చేసిన ఒక ధీర వనిత చుట్టూరా తిరిగిన ఈ కథ నా దృష్టిలో ఒక అద్బుతమైన,విషాదకరమైన
  విప్లవాత్మక కథ.అందుకే బహుశ ఈ కథ కు ‘ ముందడుగు’ అని పేరుపెట్టారెమొ అనిపిస్తుంది.
  రచయిత్రికి అభినందనలు శుభాకాంక్షలు

  1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డాక్టరు గారూ🙏🙏

Leave a Reply

Your email address will not be published.