ఆక్రందన(కథ)

– శ్రీపార్థి

వస్తానన్న వాడు ఇంకా రాడే
ముంచడు గదా ముష్టి వెధవ
వస్తాడా రాడా! ఏమో… ఏమో….

          ఈ బస్టాండు చూస్తే పాడుబడిన స్మశానంలా వుంది. చుట్టూ వున్న ఈ మనుషులు
స్మశానంలో కాకుల్లా హడావుడిగా తిరుగుతున్నారు. ఎంతసేపని ఒంటరిగా ఈ చేసంచి పట్టుకొని కూచోను. ఈ కాకులన్ని నన్ను పొడుచుకు తినేలా చూస్తున్నాయి. కొంపదీసి రాడా ఏమిటి దరిధ్రుడు.

          కొంపదీసి ఏమిటి… కొంపే కూలిపోతుంది – కాలిపోతుంది – కడతేరిపోతుంది
పైన సూర్యుడు కాలిపోతున్నాడు, కింద నా గుండె మండిపోతున్నది. ఆదరిస్తాడా – అక్కున చేర్చకుంటాడా – మోసం చేస్తాడా ఎర్ర గండు చీమల్లా వచ్చే బస్సు – పోయే బస్సు – రాడే అభాగ్యురాలిని – అనాథను – పరుల పంచన బతికేదాన్నని నా బతుకు బజారుకీడ్చడు గదా పది గంటల వేళకు రమ్మన్నాడు – జాడ లేడే కడుపొచ్చిందని చెప్పడం తప్పేమో – చెప్పకుండ రమ్మనడం ఒప్పేమో బస్సుల హారన్లు దయ్యాల అరుపుల్లా నా చెవులను మెలిపెడుతున్నాయి మనుషుల కేకలు పిండాకూడుతినే కాకుల అరుపుల్లా ఉన్నాయి నమ్మి దరిచేరితే నమ్మకద్రోహాం జవాబెమో..

          పానియంలో మత్తు కలిపి, మైకంలో నన్ను వంచించి నాకు సంబంధం లేని ఒక జీవాన్ని నాలో పడేసి ఇంకా రాడే – వచ్చి నన్ను తీసుకెళ్లడే ఎర్రటి వేషాలేసుకొని బస్సు లు యమదూతల్లా తిరుగుతున్నాయి. ఈ కాకులు వాటిలో దూరి కిక్కిరిసిపోతున్నాయి.
స్త్రీని పువ్వుతో పోల్చాడు మహానుభావుడు చలం కాని ఎక్కడ… ఎక్కడ… రాబంధుల కాళ్ల కింద పువ్వులు నలిగి నాశనమైపోతున్నాయే చుట్టూ కలియజూసిన కానరాడే – కాలం పెట్టె పరీక్షలకు కలసి రాడే పెళ్లి కాకుండానే తల్లినయ్యానని ఈ కాకులు పొడుస్తాయే – ఎలా… ఎలా…. ఎలా…

          ఈ పిండాకూడు తినే కాకులకు అది కొట్టిన పిండే రాడే… రాడే… ఇంకా రాడే….
సంతలో పశువులా, అంగడిలో బొమ్మలా, అడవిలో అమాయకపు లేడిలా ఎంతసేపని కూచోను నా గుండె వేగం డెభ్బై రెండు నుండి నూట రెండుకు పెరిగినట్టుందే, రక్తం నరాల్లో ప్రళయ వేగంలా, తుఫాను బీభత్సంలా ప్రవహిస్తున్నట్టుందే ఎలా… ఎలా… ఎలా… ఇప్పుడెలా

          రాడా… రాడా… ఇంక రాడా…. రానే రాడా… పైన ప్రళయకాల రుధ్రునివలే ఎండ – లోపల మండి పోతున్న నా గుండె మరోపక్క శిథిలం చేస్తున్న మనస్సు ఈ కాకులు నన్ను బతకనిస్తాయా! పొడుచుకు తినవు..

          పొడిచి… పొడిచి…. పొడిచి… నా మానాన్ని నా ప్రాణాన్ని అవలీలగా తీసేయవు
ఎలాగ… ఎలాగ… ఎలాగ… ఇప్పుడెలాగ…

          నిండా నీరున్న కాలవ గట్టేనా నా గతి.. అంతే… అంతే… అంతే…. ఇక్కడ క్షణం ఉండలేను పదా… పదా… పదా…

          నడక… నడక… నడక… పరుగు… పరుగు… పరుగు…ఈ కాకులతో నాకిక పనిలేదు, ఈ లోకంతో అస్సలు యే పనిలేదు ఒక్కసారి కాలవలో దూకితే అంతే… ఆ తరువాత ఏమీ తెలియదు మళ్లీ యే లోకమో… మళ్లీ యే కాకులో… యే రాబంధులో కాని… కాని…. అయ్యో! లోపల మరో ప్రాణి వుందే దాన్ని యేలా చంపడం పాపం గాదూ పాపమేనా – యేమో – పాపమేనేమో – కాని తప్పదు… తప్పదు… దూకడమే – ఇక దూకడమే – కాలవలో దూకడమే.

          నా కన్ను దూరంలో ఎవరూ… ఇద్దరు కూర్చున్నట్టున్నారే అమ్మాయి అబ్బాయేనా – కన్ను సరిగా కానరావడం లేదు వాళ్లు నన్ను బయటికి తీయరుగదా – నా ప్రయత్నం వృధా కాదుకదా ఎవరది… ఎవరది… ఎవరది…. ఎక్కడో చూసిన ముఖంలాగా ఉందే, ఎవరతడు నన్ను వారు ఎరిగి వుంటే, కాలువలో దూకాక, బయటికి తీసి నన్ను బతికిస్తే
ఎవరది… ఎవరది… కొంచెం దగ్గరగా వెళ్లి చూస్తే… ఇంకొంచెం దగ్గరగా చూస్తే…

          అమ్మో! వాడిలాగున్నాడే, వాడేనా వాడే… వాడే…. వాడే… ఇంకేవడు నన్ను వంచిం చిన వాడే ఇక్కడ… ఇక్కడ,,, ఇంకో అమ్మాయితోనా – ఎంత మోసం… ఎంత మోసం…

          పరుగు… పరుగు… పరుగు… వాడి దగ్గరకు పరుగు నన్ను చూసినట్టున్నాడు… చూసాడా… చూసేసాడు… ఆ అమ్మాయి చెయ్యి విదుల్చుకొని , వాడి పుంజాలు తెంచుకొని
పరుగు… పరుగు… పరుగో పరుగు వెధవ కాళ్లకు చక్రాలు కట్టుకుపోతున్నాడు.

          ఈ అమ్మాయేమిటి అయోమయంగా చూస్తోంది ఈ పిల్ల నా కంటే అమాయకు రాలిలా వుందే పట్టుకోవాలి… పట్టుకోవాలి … వాన్ని పట్టుకోవాలి ఆలోచిస్తే… నా గుండే వేగాన్ని తగ్గిస్తే, నా రక్తాన్ని చల్లబరిస్తే నేనేందుకు కాలువలో దూకాలి, నేనేందుకు నా ప్రాణాన్ని త్యజించాలి వాన్ని పట్టుకొని నా కాలికింద తొక్కెయ్యాలి, వాని పీక పట్టుకొని కాలువలోకి తోసెయ్యాలి అదే శాస్తి…. అదే శాస్తి… అదే శాస్తి….

          నా కడుపులో జీవాన్ని నేనెందుకు వదులుకోవాలి, నేనెందుకు చంపుకోవాలి
బతికించాలి…. బతికించాలి…. బతికించాలి…. ఈ కాకులకు నేనెందుకు భయపడాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.