ఇంకా చెప్పమ్మా (హిందీ అనువాద కథ)

హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          “రా బాబూ, లోపలికి రా” –

          రవీష్ అమ్మగారు నా నమస్కారానికి జవాబిస్తూఅన్నారు.

          నేను నా బూట్లు బయటనే విడిచి గదిలోకి వచ్చాను. ఒక స్టూలు లాక్కుని కూర్చుంటూ అడిగాను – “రవీష్ లేడా అండీ? ఎక్కడికైనా బయటికి వెళ్ళాడా?”

          “వాడిని పెరుగు తెమ్మని పంపించాను. ఇవాళ మజ్జిగపులుసు చేద్దామనుకుంటు న్నాను. దానికి శనగపిండి కావాలి. ఒక్కొక్కటీ తీసి అన్ని డబ్బాలు తీసి చూశాను. ఎందు లోనూ శనగపిండి దొరకలేదు. ఇంక తల పట్టుకుని కూర్చున్నాను. రెండు రోజుల క్రితమే ఈయనకి ఫోన్ చేసి చెప్పాను ఆఫీసు నుంచి వస్తూ బ్రెడ్డూ, శనగపిండి తీసుకురమ్మని. సాయంత్రం ఇంటికి వస్తూ బ్రెడ్ పట్టుకువచ్చారు కాని, శనగపిండి మరిచిపోయారు. ఎందుకు మరిచిపోయారని నేనడిగాను. మీకు అసలు ఏదయినా జ్ఞాపకం ఉంటుందా అని. వయస్సు పైబడుతోంది. ఈయన వెంటనే నాలుగో వీధిలోని షావుకారు దుకాణం నుంచి శనగపిండి తెచ్చారు. నేను తల కొట్టుకున్నాను. ఎన్నిసార్లో చెప్పాను ఈ షావుకారు దుకాణంలో శనగపిండి బాగుండదని.”      

          “ఇంతకూ మీకు శనగపిండి దొరికిందా లేదా?” ఆవిడ మాటకు అడ్డం వస్తూ నేను అడిగాను. ఆవిడ ఏ విషయం చెప్పినా చాలా విపులంగా చెబుతారు. దాంతో అసలు విషయం ఎక్కడో మరుగున పడిపోతుంది. ఈ సంగతి నాకు తెలుసు.

          “అదే చెబుతున్నా విను. అలిసిపోయి వున్నా, ఆయన వెంటనే వెళ్ళి ఐదో నెంబరు వీథిలో ఇందర్ షాపు నుంచి అర్ధ కిలో శనగపిండి తెచ్చారు. వాళ్ళ దగ్గర శనగపిండి మంచిది దొరుకుతుంది. కాని ఈయన కూడా, ఒక కిలో తెమ్మని చెబితే అరకిలోయే పట్టుకొచ్చారు. నేను మాత్రం ఏంచెయ్యను చెప్పు. ఈయనకి మతిమరుపు మరీ ఎక్కువై పోయింది. నేను గనక లేకపోతే ఈ ఇల్లు ఎలా నడుస్తుందో తెలియదు. ఈయన బట్టలు మార్చుకునేందుకు లోపలికి వెడితే నేను ఆ అరకిలో శనగపిండి పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయాను. అక్కడ ఖాళీ డబ్బా ఒక్కటీ దొరకలేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. వెతగ్గా వెతగ్గా చివరకు ఖాళీ అయిపోయిన చ్యవనప్రాశ డబ్బా దొరికింది. అందులోనే కవరుతో సహా శనగపిండి పెట్టాను. ఎన్నిసార్లో చెప్పాను చ్యవనప్రాశ అయిపోయిందని. కాని నా మాట ఎవరైనా వింటే కదా…….”

          “జయేష్, ఎప్పుడొచ్చావ్?” –

          రవీష్ తెరిచివున్న తలుపు దగ్గర నుంచి గదిలోకి వస్తూ అన్నాడు.

          “ఇప్పుడే, కొద్ది సేపే అయింది.”

          “నీకేం బోరు కొట్టలేదా?”

          “లేదు. ఆంటీ ఉన్నారుగా?”

          రవీష్ నేను చెప్పింది పట్టించుకోకుండా వాళ్ళ అమ్మగారికి పెరుగు ప్యాకెట్ అందిస్తూ అన్నాడు- “జయేష్ కోసం చాయ్ పెట్టి తీసుకురామ్మా, ఈసారి చాలా రోజుల తరువాత వచ్చాడు.”

          “ఎటువంటి చాయ్ తాగుతావు బాబూ? అల్లంతోనా లేకపోతే గరం మసాలాతోనా. పోయిన నెల మేం ఇస్కాన్ ఆలయానికి వెళ్ళాము. చాయ్ మసాలా అక్కడినించే తెచ్చాం. మొత్తమంతా ప్యూర్. ఇంతకు ముందు కొన్న మసాలా… అదే సుధ పెళ్ళికి వెళ్ళినప్పుడు అమృత్ సర్ నుంచి తీసుకొచ్చాం. అది ఇంత బాగుండలేదు. వీళ్ళ నాన్నగారు నేను పెట్టిన చాయ్ బ్రహ్మాండంగా ఉంటుందని అంటారు. నాకయితే నవ్వొ స్తుంది. ప్యూర్ చాయ్ మసాలా ఉండగా పొగడ్తలు మాత్రం నాకు. నిజానికి మసాలా లేకుండా కూడా నేను చాయ్ బాగా పెడతాను. మసాలా చాయ్ పెట్టుకోడం జనం ఇప్పుడు మొదలుపెట్టారు. ఇంతకు ముందు అల్లం టీ మాత్రమే పెట్టుకునేవాళ్ళు ఇంట్లో. మా అత్తగారు ఇప్పుడయితే లేరు కాని కోడలు చేతి చాయ్ చాలా బాగుంటుందని ఆవిడ అనేవారు. పాపం మనవడిని ఎదిగిన తర్వాత చూడలేకపోయింది. ఆవిడ వెళ్ళిపోయాక ఈ ఇల్లంతా శూన్యంగా……”

          రవీష్ ఆవిడను మధ్యలో అడ్డుకుంటూ, “అమ్మా, జయేష్ కి మసాలా చాయ్ అంటే ఇష్టం. అతను వెళ్ళిపోయేలోగా చాయ్ తీసుకొచ్చావంటే బాగుంటుంది” అన్నాడు.

          “అరే, అందులో ఏముంది, ఇప్పుడే వెళ్ళి చాయ్ పెట్టి తీసుకొస్తాను.”

          అమ్మ కిచన్ లోకి వెళ్ళింది. అప్పుడు రవీష్ అన్నాడు- “అమ్మ నీకు బోరు కొట్టించ లేదు కదా. నీకు తెలుసుకదా, చిన్న విషయాన్ని కూడా పెద్ద కథలాగా చేసి చెప్పడం ఆవిడకి అలవాటు. చుట్టాలు ఆవిడ యొక్క ఈ అలవాటుని వేళాకోళం పట్టిస్తూవుంటారు. అయినా అమ్మ అర్థం చేసుకోదు. కొత్తవారెవరైనా వచ్చినా ఆవిడ మాటలు విని లోలోపలే నవ్వుకుంటారు. వాళ్ళ ముఖంలో బోరుకొట్టిన భావం కనిపిస్తే మాత్రం నాకేం బాగుండదు. అమ్మకి ఈ విషయం ఎలా చెప్పను?”

          “ఎలా చెప్పడం ఏముంది? చూడు మిత్రమా, ఎవరి స్వభావం వారిది. దాన్ని మనం మార్చలేము. అందులోనూ ఆంటీ ఏదయినా చెప్పే పద్ధతి చూస్తే మటుకు ఏదో కథ వింటున్నామన్న ఆనందం కలుగుతుంది.”

          “నీకు నిజంగా అలా అనిపిస్తుందా?”

          “అవును. నిజంగా.”

          “నువ్వు ఎప్పుడోకాని రావు. అందుకే. కాని మాకయితే….”

          “వేడి వేడిగా ఉంది. టీ తీసుకోండి” – అంటూ రెండు చేతుల్తోనూ ఒక్కో కప్పు పట్టుకుని ఆంటీ లోపలికి వచ్చారు. ఆవిడ కప్పులు టేబిల్ మీద పెట్టి కొంగుతో చెమట తుడుచుకుంటూ కుర్చీ లాక్కుని కూర్చుంది.

          మేము కప్పులు తీసుకున్నామో లేదో ఆవిడ చెప్పసాగింది – “అవును బాబూ. నేను చెప్పేదేమిటంటే మా అత్తగారు చాలా మంచావిడ. వెనకటి జన్మల్లో మంచి పుణ్యంచేసుకో బట్టి తనకు ఇంత మంచి కోడలు దొరికిందని ఆవిడ అందరికీ చెప్పుకుంటూ ఉండేది. నేను కూడా వెనకటి జన్మల్లో మంచి పనులే చేసివుంటాను. అందుకే నాకు ఆవిడ లాంటి అత్తగారు దొరికింది. అత్తగారు అనేకన్నా నాకు తల్లి లాంటిది ఆవిడ. ……..చాయ్ ఎలా వుంది బాబూ?”

          “ఆంటీ, నిజంగా చాయ్ బాగా పెట్టారు. చాలా బాగుంది.”

          “చాయ్ బాగా పెడతానని నేను ముందే చెప్పాను. మీకు వెనకటి సంగతి ఒకటి చెపుతాను. అప్పుడు ఈయన పోస్టింగ్ గాజియాబాద్ లో ఉంది. ఆ రోజున ఈయన డ్యూటీకి వెళ్ళారు. మా అత్తగారు తన పుట్టింటికి వెళ్ళారు. సంవత్సరానికి ఒక్కసారయినా ఆవిడ పుట్టింటికి తప్పకుండా వెళ్ళేవారు. వెళ్ళినప్పుడల్లా కనీసం ఒక నెల తరువాతే వచ్చే వారు. …….ఇంతకూ నేను చెబుతున్నదేమిటంటే, అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. నేను పొద్దునే లేచి స్నానం చేసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని విశ్రాంతిగా కూర్చునిఉన్నాను. నాకు కునుకు ఎప్పుడు వచ్చిందో తెలియలేదు. కంగారుగా లేచే సరికి చూస్తే రవీష్ స్కూలు నుంచి వచ్చే సమయం అయింది. తొందరగా లేచి నేను గ్యాస్ పొయ్యి మీద పప్పు పెట్టాను. బహుశా మసూర్ దాల్ అనుకుంటా.”

          “అమ్మా……..నువ్వు మసూర్ దాల్ నే పెట్టివుంటావు. మరి నువ్వు చెబుతున్న సంగతి ఏమయింది?” – రవీష్ ఆవిడ వాక్ప్రవాహాన్ని ఆపే ప్రయత్నంలో అన్నాడు.

          “ఆగు. అదే చెబుతున్నాను. నేను మసూర్ దాల్ పొయ్యిమీద పెట్టి పిండి తడిపాను. అప్పుడే బయట తలుపు దగ్గర బెల్ మోగింది. నా రెండు చేతులూ పిండితో తడిగా ఉన్నాయి. తలుపు తెరవాలో లేక పిండిని చూసుకోవాలో తెలియలేదు. ఒకపక్క పప్పు ఉడుకుతోంది. అది చేస్తున్న చప్పుడుకు అర్థం ముందు పప్పును చూసుకోవాలని. కాని తలుపు దగ్గర నుంచి మూడోసారి బెల్ మోగింది. మరింక నేను పిండిచేతులు కడుక్కునేం దుకు సింకులోని పంపు ఓపెన్ చేసి రెండు చేతులూ దాని కింద పెట్టి గట్టి-గట్టిగా రుద్దడం మొదలుపెట్టాను. ఆ తొందరలో వేళ్ళమీద పిండి ఇంకా అంటుకునే వుంది. మరోసారి బెల్ మోగింది. నేను పరుగెత్తి వెళ్ళి తలుపు తెరిచి చూస్తే ఢిల్లీలో వుండే మా అన్నయ్య నిలబడి ఉన్నాడు.”

          “ఏమిటమ్మా తలుపు తెరవడానికి ఇంతసేపు చేశావు, ఏంచేస్తున్నావేమిటి?”

          “ఏంలేదన్నయ్యా. వంట చేస్తున్నాను. రెండు చేతులకీ తడిపిండి అంటుకుని వుంది. అరే, అన్నట్టు పప్పు మాడిపోతోందేమో. నువ్వు లోపలికి రా. అన్నయ్య లోపలికి రాగానే తను ఆఫీసు పనిమీద పొద్దుటి లోకల్ లో గాజియాబాద్ వచ్చాననీ, ఒక గంట తరువాత మళ్ళీ ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతాననీ అన్నాడు.”

          “ఇదిగో, వంట చేసేస్తున్నాను. భోజనం చేసి వెళ్ళు.”

          “నేను భోంచేసేశాను. మిమ్మల్ని చూద్దామని, నువ్వు పెట్టే చాయ్ తాగి వెడదామని వచ్చాను. నువ్వు చాయ్ పెట్టావంటే అద్భుతంగా ఉంటుంది.”

          “నేను ఆనందం పట్టలేకపోయాను. అన్నయ్యతో మాట్లాడుతూనే గ్యాసు పొయ్యిలో మరో బర్నర్ వెలిగించి దానిమీద చాయ్ పెట్టాను. నేను పెట్టే చాయ్ తాగడంకోసం మా అన్నయ్య అంత దూరం నుంచి వచ్చాడు. నా చేత్తో పెట్టిన చాయ్ ఒక్కసారి తాగినవారెవ రైనా……”

          “అమ్మా, జయేష్ కి కొంచెం అర్జంటు పని ఉంది. అతను వెళ్ళాలి”- రవీష్అన్నాడు.

          “అరే, నేనెప్పుడు వెళ్ళద్దన్నాను? సరే, జయేష్ బాబూ, అప్పుడప్పుడూ వస్తూ ఉండు నేను పెట్టే చాయ్ తాగడానికి.”

          నేనూ, రవీష్ వెంటనే లేచాం. బయటికి దారి తీస్తూ నేను అన్నాను- “తప్పకుండా ఆంటీ, ఇంత మంచి చాయ్ తాగడానికి మాటిమాటికీ వస్తూనే ఉండాలి.”

          ఆంటీ ముఖం మీద ఒక చిరునవ్వు తొంగి చూసింది. ఆవిడ ఏదో చెప్పడానికి నోరు తెరిచేలోగానే మేమిద్దరం త్వరగా బయటికి వచ్చేశాం. ఇద్దరం వీధి చివర చాలా సేపు మాట్లాడుతూ నిలబడ్డాం. నాకు వీడ్కోలు చెబుతూ రవీష్ అన్నాడు – “సారీ జయేష్. అమ్మ ఒకసారి మాట్లాడటం మొదలుపెడితే ఇంక ఎవ్వరినీ మాట్లాడనివ్వదు. ఈసారి నేను మీ యింటికి వస్తాను. సరేనా?”

          “అమ్మ కదా రవీష్. నాకేమీ ఇబ్బంది లేదు. నీకు ఎలా బాగుందని అనిపిస్తే అలాగే చేద్దాం.”

          ఆ తరువాత మేమిద్దరం చాలా రోజులు కలుసుకోవడం వీలు పడలేదు. నేను ఉద్యోగం రీత్యా భోపాల్ వెళ్ళిపోయాను. ఇంచుమించు ఆరు నెలల తరువాత మా వూరికి తిరిగి వచ్చినప్పుడు రవీష్ కి ఫోన్ చేశాను. “రవీష్, నిన్ను కలుసుకుని ఆరు నెలలు అయింది. నాకూ ఎక్కువ రోజులు సెలవు దొరకలేదు. నాలుగైదు రోజుల్లో తిరిగి వెళ్ళి పోతాను. నిన్ను కలుసుకోకుండా వెళ్ళడమనే ప్రశ్నే లేదు. ఎక్కడ కలుసుకుందామో చెప్పు. ఒక పని చెయ్యి, నువ్వు మా యింటికి వచ్చేసెయ్. లేదంటావా ఎక్కడైనా రెస్టారెంటులో కలుసుకుందాం.”

          కొన్ని క్షణాలు ఎదురు చూశాక రవీష్ మాట వినిపించింది. “జయేష్, నువ్వు మా ఇంటికే వచ్చేసెయ్” ఫోన్ కట్ అయిపోయింది.

          రవీష్ తన ఇంటి బయటే నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను అక్కడికి చేరుకోగానే నన్ను అక్కడే ఆగమని సంజ్ఞ చేశాడు. నాకు ఏదో విచిత్రంగా అనిపించింది. నన్ను ఇంట్లోకి రమ్మని ఎందుకు అనడం లేదు. ఆంటీ కారణంగా నాతో ఇంతకు ముందులాగా ఇంటికి బయటనే నిలబడి మాట్లాడాలని అనుకుంటున్నాడా.

          రవీష్ నా ముఖంలోని భావాలని అర్ధం చేసుకున్నట్లున్నాడు. నా భుజం మీద చేయి వేసి అన్నాడు –“ఇంట్లోకి వెళ్ళే ముందు నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను.”

          “ఏమిటి రవీష్? నువ్వేదో దిగులుగా ఉన్నట్లున్నావు. అసలు విషయమేమిటో చెప్పు నాకు.”

          “అందుకే గదా నిన్ను ఇక్కడికి రమ్మంది. అమ్మ మాట్లాడటం మానేసింది.”

          “ఏమిటి నువ్వంటున్నది? ఆవిడకి ఏమయింది? ఏమయినా జబ్బు…?”

          “అదేం లేదు. ఆవిడకి నా మీద కోపం వచ్చి మాట్లాడటం మానేసింది. ఇప్పటికి ఇరవై అయిదు రోజులయింది. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు.”

          “అంతగా ఏం జరిగింది?”

          “నిజానికి పొరపాటు నాదే. ఆరోజు మా బాస్ తన వైఫ్ తో మా యింటికి వచ్చారు. అమ్మ తన అలవాటు ప్రకారం వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా విస్తారంగా చెప్పడం మొదలుపెట్టింది. బాస్, ఆయన శ్రీమతి గారు వింటూ మాత్రమే కూర్చున్నారు. వాళ్ళకి మాట్లాడేందుకు అవకాశం దొరకడం లేదు. నేను మాటిమాటికీ ఏదో వంకతో అమ్మని లోపలికి పంపించాను. అందువల్లనే మేము కాస్త మాట్లాడుకోగలిగాము. తిరిగి వచ్చాక అమ్మ అంతకు ముందు వదిలిపెట్టిన విషయాన్ని మళ్ళీ మొదలుపెడుతూ వచ్చింది.”

          “అయితే ఏమయింది? ఆంటీ ఏమీ అక్కరలేని విషయం ఏదీ మాట్లాడరు గదా. కేవలం ఒక విషయాన్ని విపులంగా చెబుతారు. అంతే గదా. ఇందులో బాగుండనిది ఏముంది?”

          “కాని, ఆ రోజు నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. ఎందుకంటే బాస్ కారులో కూర్చుంటూ అన్నారు- రవీష్, యువర్ మదర్ ఈజ్ వెరీ ఇంటరెస్టింగ్. ఏదయినా మాట్లాడటం అంటే ఆవిడ దగ్గరే నేర్చుకోవాలి.”

          “నేను ఆయన వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్నాను.”

          “బహుశా ఆయన చెప్పినదాంట్లో వ్యంగ్యం, వెటకారం ఏదీ లేదేమో. ఆయనకి ఆంటీ మాటలు నిజంగానే బాగున్నాయేమో.” నేను అన్నాను.

          “ఏమయినా, నేను ఇంట్లోకి వస్తూనే అమ్మ మీద మండిపడ్డాను – కనీసం ఎవరితో మాట్లాడుతున్నావన్నది కాస్త చూసి మాట్లాడు. వాళ్ళు నా బాసూ, ఆయన భార్యాను.నువ్వు మాట్లాడటం మొదలుపెడితే ఇంక అంతా మరిచిపోతావు. కాస్త తక్కువగా మాట్లాడటం తెలియకపోతే అక్కడ ఎందుకు కూర్చున్నట్లు?” అమ్మ నన్ను కొంచెం ఆశ్చర్యంగా చూసి అంది –

          “నేను మాట్లాడటం నీకు ఇంత నచ్చకపోతే ఇంక నుంచి మాట్లాడనులే.” ఆవిడ ఏదో యాదాలాపంగా అలా అందని నేను అనుకున్నాను. కాని ఆ తరువాత మొత్తానికి మాట్లాడటం మానేసింది. అసలు ఏమీ మాట్లాడటం లేదు…. నేను  లోలోపలే చాలా మథన పడుతున్నాను. ఆవిడని క్షమాపణ కూడా వేడుకున్నాను. అయినా….”

          “బహుశా ఆంటీ మనస్సులో చాలా బాధ పడివుండవచ్చు. నువ్వంటే ఆవిడకి ఎంతో ప్రేమ. ఏదో ఒకటి చెయ్యి….”

          “నేనేం చెయ్యగలను? సరే, అయినా చూద్దాం పద.”

          ఆంటీ డ్రాయింగ్ రూంలో కూర్చుని టీవీ చూస్తున్నారు. నన్నూ రవీష్ నీ చూసి ఆవిడ టీవీ ఆఫ్ చేసి లేచి నిలబడ్డారు. నా నమస్కారానికి బదులుగా ఆవిడ కేవలం చేతులు జోడించి లోపలికి వెళ్ళసాగారు. నేను ఆవిడను చేయి పట్టుకుని కుర్చీమీద కూర్చోబెట్టాను. రవీష్ తల వంచుకుని కూర్చున్నాడు. ఆంటీ మౌనంగా ఉండటం నేను కూడా సహించలేక పోతున్నాను. చాయ్ సిప్ చేస్తూ నేను అన్నాను- “ఆంటీ, ఏమిటి మీరు ఇలా మౌనంగా ఉన్నారు. మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు. బహుశా అందుకే చాయ్ ఎప్పుడూ ఉండేటంత బాగా లేదు…….”

          “నా ఆరోగ్యానికేమయింది? ఈనాటి వరకూ నేను పెట్టిన చాయ్ ని బాగుండలేదని ఎవరూ అనలేదు.” ఆంటీ మండిపడ్డారు – “నీకు తెలుసా, మా అన్నయ్య నేను పెట్టే చాయ్ తాగడానికి ఢిల్లీ నుంచి గాజియాబాద్ కి వచ్చేవాడు. మా అత్తగారు…..”

          అనుకోకుండా ఆంటీ దృష్టి రవీష్ మీద పడగానే ఆవిడ ఏం మాట్లాడకుండా మౌనం వహించారు. రవీష్ లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుని బొంగురుపోయిన గొంతుకతో అన్నాడు – “మాట్లాడుతూ ఉండమ్మా……. నా తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకు. ఇల్లంతా నన్ను దండన చేస్తోంది. నాకు ఈ పరిస్థితి అసహనీయంగా ఉంది.”

          ఆంటీ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆవిడ రవీష్ తల మీద చేయి పెట్టి నిమురుతూ అన్నారు – “లే. జయేష్ చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఇతనితో చాలా విషయాలు మాట్లాడాలి.”

          “అవును. ఇంతకూ బాబూ, నేను చెబుతున్నది మా అత్తగారు……”

          నీళ్ళతో నిండిన రవీష్ కళ్ళు అంటున్నాయి –  “ఇంకా చెప్పమ్మా.”

***

డా. రమాకాంత్ శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత్ శర్మ 90కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథాసంకలనాలు, రెండు వ్యంగ్య సంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతో బాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి.

          బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాల పైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us: