వాడని నీడలు

 (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

-ఝాన్సీ కొప్పిశెట్టి

మొబైల్ నిర్విరామంగా మోగుతోంది.

          ఆ మోతలో ప్రశాంతత లేదు. అందులో ఆరాటం, దూకుడు నా సిక్స్త్ సెన్స్ కి సుస్పష్టంగా వినిపిస్తోంది.

          అయినా నేనుప్రశాంతంగానే “హలో” అన్నాను.

          “ఏమిటి, నువ్వు ఆల్ ఇండియా రేడియోలో కథ వినిపించనన్నావుట…” ఆవేశంలో మూర్తిగారి గొంతు అదురుతోంది. ఎటువంటి పలకరింపు లేకుండా వేడిగా, దురుసుగా అడిగారు.

          నాకు ఉన్న మగ స్నేహితులు ఒక చేతి వేళ్ళ లెక్కింపుకి సగానికి తక్కువే వుంటారు. దగ్గరైన స్నేహితురాళ్ళయితే చనువుగా ‘ఏమే, ఒసేయ్’ అంటూ ఏకవచనంలో మాటాడ తాను. కాని పురుషులతో స్నేహం ఎంత పురాతనమైనా బహువచనంలోనే సంభోదిస్తాను. తిరిగి వారి నుండి అదే గౌరవాన్ని ఆశిస్తాను.

          అతి తక్కువ స్నేహకాలానికే మూర్తిగారు “నేను మిమ్మల్ని నువ్వు అనవచ్చా…” అని అడిగారు.

          నాకు మగ స్నేహితులు ఏకవచనంలో సంభోదించటం సాధారణంగా నచ్చదు.మరీ పితృసమానులు, వయోవృద్ధులు అయితే తప్ప. ఎంచేతో భర్త, అన్నతమ్ములు కాని పరాయి పురుషుడితో ‘నువ్వు’ అనిపించుకోవటం నా ఆత్మాభిమానాన్నే కించపరుచు కున్నట్టుగా వుంటుంది. కాని తెలంగాణ మాండలికం మాటాడే వారికి బహువచనం బహు దూరం అనే విషయం అర్ధమయి, నేను మూర్తిగారికి సమాధానం ఇవ్వలేదు. మౌనం పూర్ణాంగీకారంగా భావించిన వారు ‘మీరు’ అన్న గౌరవ పదాన్ని పూర్తిగా త్యజించేసారు. నేను వారిని తప్పు పట్టను. కాని ఈ ఏకవచన సంభోదన కోపావేశాల్లో అనౌచితంగా వినిపిస్తుంటుంది.

          “మా అక్క భోజనానికి వచ్చింది. తను వెళ్ళిపోయాక మాటాడతాను” అని అక్కకు వినిపించకుండా లోగొంతులో అన్నాను.

          “నాకు తెలుసు. నువ్వు నన్ను కావాలనే తప్పించుకుంటున్నావు. నేను నీ కోసం చేసే ప్రయత్నాలన్నీ కావాలనే వ్యతిరేకిస్తున్నావు…ఇది ఒక రకంగా నన్ను అవమానించ టమే…” చాలా కర్కశంగా గట్టిగా అన్నారు.

          మూర్తిగారి మాటలను మధ్యలోనే కట్ చేస్తూ “నేను మీతో తర్వాత మాటాడతాను” అంటూ ఫోన్ కట్ చేయబోయాను.

          “అసలు నువ్వు నాకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవటాన్ని ఎలా అర్ధం చేసుకో వాలి నేను….” విసురుగా ప్రశ్నించారు.

          అతని నిలదీతకు చిరాకేసి ఫోన్ కట్ చేసేసాను.

          ఫోనయితే కట్ చేసా కాని, అతని మాటలు మైండ్ దాటి బయటకు పోవటం లేదు.

          నా కార్యకలాపాల పైన అసలు అతని పెత్తనం ఏమిటి. నాకు నేనుగా స్వంత నిర్ణయాలు తీసుకోకూడదా.స్నేహితుడు అయినంత మాత్రాన అతని ఆజమాయిషీని నేను ఎందుకు సహించాలి.

          నేను అన్యమనస్కంగా వుండటాన్ని గ్రహించిన అక్క “ఏం జరిగింది.. ఫోనుచేసింది ఎవరు” అంటూ ఆరా తీసింది.

          “ఏం లేదక్కా. మూర్తిగారని మంచి స్నేహితులు. ఆల్ ఇండియా రేడియోలో వారికి తెలిసిన మహిళా విభాగపు ఇంచార్జీకి నా పేరు సిఫార్సు చేసారు. నేను వెళ్ళి రెండు కథలు చదివి వినిపించటానికి అప్పుడు అంగీకరించాను. ఇప్పుడు నా పరిస్థితులు అనుకూలించక, ఇతనితో సంప్రదించకుండా మహిళా విభాగపు ఇంచార్జీకి కాల్ చేసి ‘నేను ప్రస్తుతం చదవలేనని మన్నించమని’ వేడుకున్నాను.

          ఆవిడ ‘ఫరవాలేదులెండి… ఆ మాత్రానికే సారీ ఎందుకు’ అని నా నిరాకరణను తేలిగ్గానే తీసుకున్నారు. ఆ విషయం తెలిసి ఇతను అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు

          అక్కకు మామూలుగానే జవాబిచ్చినా నా మనసంతా వికలమై పోయింది.

          మూర్తిగారు నా శ్రేయోభిలాషి అన్న మాట వాస్తవం. సాహిత్యపరంగా వారితో నిత్యం సలహా సంప్రదింపులు చేస్తుంటాను. దాదాపుగా వారి సలహాలు పాటిస్తుంటాను. అలాగని నా ఆరోగ్యం సహకరించనప్పుడు, నాకు ఎటువంటి స్ట్రెస్ఫుల్ కమిట్‌మెంట్స్ వద్దను కున్నప్పుడు నా ఇష్టప్రకారం నేను నడుచుకోవటానికి, నిర్ణయం తీసుకోవటానికి ఇతని అనుమతి తీసుకోవాలా..నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉండదా.

          భర్త భార్య పైన అధికారక పెత్తనం చేయటం, ప్రియుడికి ప్రేయసి పైన ప్రతి బంధకాలు, తండ్రి బిడ్డను శాసించడం, చెల్లెలి పైన అన్నగారి ఆజమాయిషీ…ఇలా అడుగడుగునా ఇప్పటికీ పితృస్వామ్యం ప్రజ్వరిల్లుతూనే వుంది.

          కాని, స్త్రీ పురుషుల మధ్య మామూలు స్నేహంలో కూడా ఈ లింగ వివక్ష, పితృస్వామ్య జులుం తప్పవా…

          ఆ సాయంత్రం అక్కతో సమయాన్ని సంతోషంగా మనస్ఫూర్తిగా వెచ్చించలేక పోయాను.

          అక్కకు వీడ్కోలు చెప్పి నిస్సత్తువగా మంచం మీద వాలాను.

          అలసిన మనసు పైన డమురుకం వాయించినట్టు మళ్ళీ మొబైల్ మోగింది.

          నేను మానసికంగా స్థిమితపడి మూర్తిగారికి నచ్చచెప్పేందుకు ఇంకా సిద్ద పడ కుండానే మళ్ళీ అతను ఫోను చేస్తున్నారా..?

          అయినా నచ్చచెప్పటం అంటే లొంగుబాటుతనమే కదా…!

          ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఇలాంటి సర్దుబాటు స్నేహాలు అవసరమా ..?

          నా అంచనా తప్పు. కాల్ చేసింది నా ఎక్స్ కొలీగ్ రవి.

          రవి కాల్ కి ముందు జరిగిన కథ కొంచం చెప్పాలి ఇక్కడ.

          రవి నా ఇరవై ఏళ్ళ సహోద్యోగి. నాకన్నా పది సంవత్సరాలు చిన్నవాడు. పరిమిత ప్రపంచజ్ఞానినైన నాకు మంచి సహృదయ సలహాదారుడు. అతనితో ఎటు వంటి విషయం గురించి అయినా నేను నిర్మొహమాటంగా చర్చించగలను. అంతటి చనువు వున్నప్పటికీ నన్నెప్పుడూ ఏకవచనంలో సంభోదించడు. పదేళ్ళు చిన్నవాడయినా, కావలసినంత చనువున్నా, నా జన్మగత సంస్కారం కారణంగా నేనూ అతనిని బహు వచనంలోనే సంభోదిస్తాను.

          నేను స్వచ్చంద పదవీ విరమణ చేసినా పొరపొచ్చాలు లేని మా నిష్కల్మషస్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.

          హైదరాబాదు నగర శివార్లలో మా వారు కట్టుకున్న చిన్న గెస్ట్ హౌస్ ని అమ్మకం పెట్టాను. ఎంత తొందరపడి తీసేసినా కనీసం ముప్పై లక్షలు వస్తాయని అంచనా. కొంత కాలం ఓపిక పడితే నలభై కూడా రావచ్చు. నేను ఇండియాలో వుండేది కొద్ది రోజులు మాత్రమే కనుక ఎక్కువ వ్యవధి లేదు. లాభనష్టాల బేరీజులు వేసుకోకుండా నేను ఇండియా నుండి వెళ్ళిపోయే లోపు డబ్బు మొత్తాన్నిగడువు లేకుండా అతిత్వరగా ఏర్పాటు చేయగల బేరం కావాలి.

          మా ఆఫీసులోనే రవి చేతి కింద పనిచేసే లక్ష్మి అనే ఒక బంట్రోతు ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నంలో వుందట. రవి లక్ష్మికి మా గెస్ట్ హౌస్ వివరాలు చెప్పాడు. ఖరీదు తన స్థాయికి ఎక్కువయినా ఇల్లు చూసి మోజు పడి ఆమె రవిని ఆశ్రయించింది. ఎలాగయినా తనకు ఆ ఇల్లు దక్కేట్టుగా చూడమని ఆ ఇంట్లో రవి ఫోటో పెట్టుకుని రోజూ పూజ చేసుకుంటానని వేడుకుందిట.

          నా వెనుక రవి ఆమెకు చేసిన వాగ్దానాలు నిజానికి నాకు తెలియవు.

          లక్ష్మి త్రాగుబోతు భర్త చనిపోతే ప్రభుత్వ దయాదాక్షిణ్యాల పై ఆమెకు ఆ బంట్రోతు ఉద్యోగం లభించింది. ఆమె నీతి, నిజాయితీలతో బ్రతుకుతున్న ముగ్గురు పిల్లల తల్లి. ఒక పేదరాలికి సాయం చేస్తే పుణ్యం కలుగుతుందని రవి నాకు హితబోధచేసాడు. ముప్పై లక్షల ఆస్తిని ఇరవై ఆరు లక్షలకు అమ్మకానికి నన్ను ఒప్పించాడు. నేను నాకున్న నెల రోజుల గడువులో మొత్తం డబ్బుని ఇవ్వాలని నియమం పెట్టాను. అగ్రిమెంట్ కింద కొంత ముందుగా ఇప్పించమన్నాను. అందుకు ఒప్పందం కుదిరింది.

          నాలుగు రోజుల తరువాత అగ్రిమెంట్ డబ్బు గురించి లక్ష్మికి కాల్ చేసాను.

          “ఇరవై నాలుగు లక్షలు చేసుకోండి మేడం, గరీబ్ దానిని” అంది.

          “అదేమిటి ముందే నాలుగు లక్షలు తగ్గించి ఇరవై ఆరు చేస్తే, మళ్ళీ రెండు తగ్గించ మంటావు..” అని అడిగాను.

          “రవి సారు నాకు ఇరవై ఐదు లక్షలకు ఇప్పిస్తానన్నాడు. నేను మిమ్మల్ని పర్సనల్ గా తండ్రి లేని నా బిడ్డల మొహం చూసి మరో లక్ష డిస్కౌంట్ అడుగుతున్నాను” అంది.

          నేను హతశురాలినయ్యాను. నాతో ఇరవై ఆరు అని చెప్పి ఒప్పించి, ఆమెకు పాతికకు ఇప్పిస్తానని చెప్పటంలో రవి ఆంతర్యం ఏమిటో నాకు పాలుపోలేదు.

          వాళ్ళ నాన్నగారి ఆస్తి కనుక నా పిల్లలకి విషయం చెప్పాను.

          “ఆఖరి క్షణంలో నువ్వు కాదనవని రవి ఆమెకు అలా చెప్పివుంటాడు అమ్మా. రవి నీ కన్నా ఆమెకు ఎక్కువ ఫేవర్ చేస్తున్నాడు. ఇది మీ స్నేహానికి సంబంధించిన విషయం. నువ్వే ఆలోచించుకో” అన్నారు పిల్లలు.

          రవి మంచివాడే. అయినా నా మంచితనాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఏమీ నిర్ణయించుకోలేక పోయాను.

          “అగ్రిమెంట్ డబ్బు ఎప్పుడు ఇస్తావు. మొత్తం డబ్బు నెల రోజుల్లో ఏర్పాటు చేయగలవా” అని లక్ష్మిని నీరసంగా అడిగాను.

          “నేను జిపి ఫండ్ లోనుకి దరఖాస్తు పెట్టుకున్నాను మేడం. నా కొడుకు బ్యాంకు లోనుకి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఏది ఎప్పుడు ఎంత వస్తే గప్పుడే గట్లనే మీకు ఇచ్చేస్తాను మేడం. నా కున్న కొంచం బంగారం కూడా అమ్మేస్తాను. రెండు రోజుల్లో కొంత ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాను” అంది.

          నాకు ఇదంతా నెల రోజుల్లో సాధ్యమయ్యే విషయంలా అనిపించ లేదు.

          డోలాయమాన స్థితిలో వుండిపోయాను.

          అగ్రిమెంట్ కి రెండు రోజుల వ్యవధి అడిగిన లక్ష్మి నాలుగు రోజులయినా జాడ లేదు. నేను ఫోను చేస్తే పలకలేదు. నా వెనుక లక్ష్మికి పాతిక లక్షలకు ఇప్పిస్తానన్నాడని తెలిసాక నాకు రవికి ఫోను చేయటానికి మనస్కరించ లేదు.

          ఇంతలో గెస్ట్ హౌస్ గేటుకి తగిలించిన అమ్మకం బోర్డు చూసి ఎవరో కాల్ చేసారు. అసలే చిరాకుగా వున్న నేను ముప్పై లక్షలకు పైసా తగ్గనన్నాను. వాళ్ళు ముప్పై లక్షలకు రిజిస్ట్రేషన్ కి ఆరు నెలల గడువు అడిగారు. ఆరు నెలలు ఆగటం కుదరద న్నాను. ఇరవై ఎనిమిది లక్షలకు ఇస్తే వడ్డీకి తెచ్చుకుని మొత్తం డబ్బు పది రోజుల్లో ఏర్పాటు చేసేస్తామని చెప్పారు. పిల్లలకు చెప్పాను. పది రోజుల్లో డీల్ పూర్తి అవుతుంది పైగా ఇరవై ఎనిమిది లక్షలు వస్తున్నాయి, రెండో ఆలోచన చేయకుండా డీల్ ఒకే  చేయ మన్నారు పిల్లలు. లక్ష్మి బేరం కన్నా మూడు లక్షలు అదనంగా రావటమే కాకుండా ఎటు వంటి వెయిటింగ్ టైం, మనస్తాపం లేకుండా పది రోజుల్లో మొత్తం డీల్ పూర్తి అయి పోతుందని సంతోషించారు.

          మనసు ఒప్పక ఆఖరి ప్రయత్నంగా లక్ష్మికి ఫోను చేసాను. ఆమె ఫోను తీయలేదు. మరుసటి రోజున రెండో పార్టీ ఐదు లక్షలు ఇచ్చి పదిరోజుల గడువులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని అగ్రిమెంట్ రాసుకుని వెళ్ళిపోయారు.

          అది జరిగిన రెండు రోజులకు లక్ష్మి “మేడం, నాతాన ఒక లక్ష జమ అయినయి. అగ్రిమెంట్ రాసుకుందామా” అంటూ కాల్ చేసింది.

          “లేదమ్మా. నీకు నేను మూడుసార్లు కాల్ చేసాను. నువ్వు పలకలేదు. నీకు ఇచ్చిన గడువు అయిపోయింది కూడా. వేరే వాళ్ళకు అమ్మేసాను” అన్నాను.

          “అయ్యో, గట్లంటే ఎట్ల మేడం. నేను నా బంగారం అమ్ముకున్నా” అంటూ లక్ష్మి గోల చేసింది.

          ఆమె ఫోను పెట్టేసిన ఐదు నిముషాల్లో గతవారమంతా కాల్ చేయని రవి కాల్ చేసాడు.

          “మీరు అలా ఎలా చేయగలరు. ఇది చాలా అన్యాయం. నేను మీరు అసలు ఇలా చేయగలరని అనుకోలేదు. నిరుపేద, భర్త్రు విహీనురాలు లక్ష్మి మిమ్మల్ని నమ్మి బంగారమంతా నష్టానికి అమ్ముకుంది. నేను అనవసరంగా మధ్యలో ఇరుక్కున్నాను” అంటూ తెగ బాధపడిపోయాడు.

          నా నోట మాట రాలేదు.

          ఏది న్యాయం.. ఏది అన్యాయం…

          స్థోమత లేనివారితో మూడు లక్షల నష్టానికి, కాల పరిమితి లేనిడీల్ కుదర్చటం స్నేహితునిగా రవిది న్యాయమా…

          పూర్తి డబ్బు ముట్టకుండా ఇల్లు అప్పచెప్పేసి నేను విదేశాలకు వెళ్ళిపోయి, మరో రెండేళ్ల వరకూ ఇండియా రాకపోతే, అప్పటికి మిగతా డబ్బు సమకూర్చవచ్చనుకునే వాళ్ళ కుచ్చితపు ఆలోచన న్యాయమా…

          బంగారం మొత్తం అమ్మి ఒక లక్ష పూడ్చలేని వారి కోసం, బ్యాంకు లోను ఎంత ఇస్తారో ఎప్పటికి మంజూరు అవుతుందో తెలియని వారి కోసం నేను వేచివుండక పోవటం అన్యాయమా…

          డబ్బు సర్దుబాటు కాక ఫోను ఎత్తని వారితో డీల్ తెంచుకోవటం అన్యాయమా…

          ఓ పక్క సహృదయుడు, నా చీఫ్ అడ్వైజర్ అనుకున్న మిత్రుడు నా నమ్మకాన్ని వమ్ము చేసాడని బాధ పడుతుంటే మరో పక్క మంచి సాహితీ మిత్రుడు, శ్రేయోభిలాషి అనుకున్న మరో మిత్రుని నిరంకుశత్వానికి చింతిస్తుంటే ఇప్పుడు రవి నుండి కాల్…

          గుండె నిబ్బర పరుచుకుని ఫోను ఎత్తి “హాయ్ రవీ…” అన్నాను.

          “సారీ టు సే దిస్ ఈజ్ మై లాస్ట్ కాల్ టు యు. నా ఫ్రెండ్ నా మాట కాదనదు అని లక్ష్మికి చెప్పాను. నా నమ్మకాన్ని నిలువునా నరికేశారు. ‘నా బంగారమంతా నష్టానికి అమ్మేసినా.. ఇప్పుడు గీ పైసలు ఏం చెయ్యను సారూ’ అని లక్ష్మి అడిగే  ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నా అహం పైన కత్తివేటు వేసారు. మీరు చేసింది మంచి పని కాదు. గుడ్ బయ్ టు యు అండ్ అవర్ ఫ్రెండ్షిప్” అంటూ నా సమాధానం కూడా వినకుండా విసురుగా ఫోన్ కట్ చేసేసాడు.

          చిన్న ఆస్తి అమ్మకపు వివాదంలో పాతికేళ్ళ స్వచ్చమైన మా స్నేహానికి ఒక్క ముక్క లో గుడ్ బాయ్ చెప్పేసాడు.

          ఏది మంచి…. ఏది చెడు…?

          స్త్రీ పురుషుల మధ్య స్నేహంలో కూడాఎప్పుడూ అగ్రస్థానం పితృస్వామ్యానిదేనా.

          ప్రపంచం ఎంత పురోగమించినా ఈ పితృస్వామ్యపు నీడలు వీడవా..?

          పురుషుడికి మగాడినన్న అహంభావం నరనరానా జీర్ణించుకుని వుంటుంది.ఆడది తన మాట ఎందుకు వినదన్న అహం.

          వినకపోతే పొడుచుకు వచ్చే పౌరుషం.

          తన మాటే నెగ్గాలన్న పట్టుదల. తన మాట నెగ్గకపోతే తన మగజన్మకే అపకీర్తి కలిగిందనుకునే మగ నైజం.

          రెండు చేతివేళ్ళను నిటారుగా పెట్టి మంచి స్నేహితులని సగర్వంగా చెప్పుకునే వేళ్ళు రెండూ ముడుచుకుపోయాయి.

          ఈ నా బలహీనపు గుండె మరోసారి మనస్తాపాన్ని భరించలేదు. రవి ఎటూ తనకు తానే గుడ్ బాయ్ చెప్పేసాడు. నేనుగా మూర్తిగారికి గుడ్ బాయ్ చెప్పి నడుం నిటారుగా జీవించాలనుకుని నిశ్చయించుకున్నాక మనసు తేలిక పడింది.

*****

Please follow and like us:

14 thoughts on “వాడని నీడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)”

 1. కధ వాస్తవానికి దగ్గరగా,చాలా బాగుంది,ఆభినందనలు

 2. Congratulations!
  నిజానికి ఈ కథకి బహుమతి ఇవ్వాలమ్మా! మొదటి బహుమతి కథని చదవకుండా అలా అనకూడదు! అవును… జడ్జ్ లు పితృస్వామ్యమా లేక మాతృస్వామ్యమా? దాన్ని బట్టి కూడా ఉంటుంది నిర్ణయం! చాల మంది అనుభవం… మీరు అక్షర రూపమిచ్చి స్నేహం ఎంత లూజో తెలియ జేశారు!
  మాతృస్వామ్యంలో కూడా జరుగుతాయమ్మా! మూర్తి గారి బదులుగా మరో రచయిత్రి ఐ ఉంటే, ఇలాగే మాతృస్వామ్యమా అని అనగలరా? డౌటే!

 3. అసలిది “కథ” కాదు. “తన జీవితం లో ఎదురయిన రెండు సంఘటనలు” అని రచయిత్రే చెప్పారు. బహుమతి పొందినందుకు ఆశ్చర్యాన్నీ కూడా వ్యక్తం చేశారు. గతంలో రెండు అద్భుతమైన నవలలు (అవీ జీవితానుభవాలే అన్నారామె) రాసి పాఠకుల అభిమానాన్ని పొందిన రచయిత్రి కథలు విషయంలో మాత్రం సృజనాత్మకత ను కోల్పోతున్నారు. వ్యక్తిగతంగా ఎదురైన సంఘటనలను మంచి భాషతో, శైలితో “వర్ణిస్తే” అది మంచికథ కాబోదు.
  వ్యక్తిగతం గా ఎదురైన అనుభవాలకు ” పితృ స్వామ్యం”, “పురుషాధిక్యత” వంటి పదాలు చేర్చితే అది స్త్రీవాదం ప్రస్పుటించే కథ అయిపోదు.
  ఈమధ్య స్త్రీవాద కవయిత్రి/ రచయిత్రి అనే ముద్ర కోసం చాలామంది ఏది తోస్తే అది రాసేయడం జరుగుతోంది. పాఠకులను తప్పు దారి పట్టించేలా రాయడం అంటే తమను తాము వంచించుకోవడం, “స్త్రీవాదాన్ని” అవమానించడమే అవుతుంది. కానీ పాఠకులు అమాయకులు, అజ్ఞానులు కారు. స్త్రీ వాద సిద్ధాంతం ఏమిటో, దాని కోసం ఎన్నో ఏళ్లుగా రాస్తూ, పోరాడుతూ ఉన్నవారెవరో గ్రహించగలరు.

  రేడియో ప్రోగ్రాం మానేసినందుకే ఆ సాహిత్య మిత్రుడు, సలహాదారుడు, శ్రేయోభిలాషి కి అంత కోపం రావడం చిత్రం గా ఉంది. “నువ్వు” అనేంత చనువు, దగ్గరతనం లేకపోతే అతనెందుకు అంటాడు? ఒకవేళ ఆన్నా ఆ స్నేహశీలి మాటలకే ఆమె నొచ్చుకోనేల? దానిని పాఠకులపై “అందంగా” రుద్దనేలా?
  అంతేకాక భర్త చనిపోతే వచ్చిన కారుణ్య నియామకంతో అటెండర్ లాంటి చిన్న ఉద్యోగం పొందిన ముగ్గురు పిల్లల తల్లి తన బంగారం అంతా అమ్మితే కేవలం ఒక లక్ష కూర్చుకున్న ఒకామె పాతిక లక్షల ఖరీదు చేసే ఇల్లు కొనాలనుకోవడం ఆశ్చర్యం, అసంబద్ధం.
  పైగా ఆ మధ్యవర్తి పాత్ర కూడా తికమకగా ఉంది. ఇద్దరితోనూ “ఇంటి బేరం” గురించి చర్చించడానికి అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు కదా! అతనికందులో లాభం ఏమీ లేదు కూడా.
  ఇక్కడ ఒక వ్యక్తి కి “డబ్బు” విషయంలో జరిగిన అనుభవం. దానికి పితృ స్వామ్యానికి సంబంధం లేదు. ఇందులో పురుషాధిక్యత కూడా లేదు. ఆమే అన్నట్లు అసలిది కథే కాదు. తన బాధను “ప్రపంచపు బాధ” గా చిత్రించడం ఏమీ బాగాలేదు. బహుమతులు ముఖ్యం కాదు, పాఠకుల ప్రశంసలు పరమ ప్రథానమని గుర్తించాలి ఎవరైనా. గుండెను తాకి చెమరింపజేసి, కొన్నాళ్ళు మనసును వెంటాడేదే మంచి కథ.

 4. హహహ….ధన్యవాదాలండీ సురేఖగారూ…

  ఇలాంటి విషయాలను స్త్రీలు బిడియపడి తెర వెనుకే మరుగుపరచటం వలననే తెర పైన పురుషులు విజృంభిస్తున్నారు. నేను నిజ జీవితంలో ఏకధాటిన సంభవించిన రెండు సంఘటనల ధాటికి తట్టుకోలేక దుఃఖావేశంలో స్వాంతన కోసం ఏదో కథలా రాసేసాను… ఆ కథను నెచ్చెలివారు బహుమతికి ఎన్నుకోవటం ఒక ఆశ్చర్యానందమైతే అంతకన్నా అబ్బురం ఈ రోజున ఆ కథ చదివిన ముగ్గురు పాఠకులు ఫోను చేసి మరీ అభినందించటం, వారూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నామంటూ ఏకరువు పెట్టడం….

  స్త్రీల దైనందిన జీవితంలో అభిమానాన్ని గాయపరిచే ఇలాంటి అవమానాలు అనేకులు అనుభవిస్తున్నారు కాబట్టే అందరూ ఈ సందర్భంలో తమను తాము చూసుకుని స్పందిస్తున్నారు. నిజానికి ఇది నేనూహించని స్పందన…

  మీకు ధన్యవాదాలు….

 5. స్నేహమంటే ప్రాణప్రదంగా భావించే నేను నిజ జీవితంలో ఏకధాటిన సంభవించిన రెండు సంఘటనల ధాటికి తట్టుకోలేక దుఃఖావేశంలో స్వాంతన కోసం ఏదో కథలా రాసేసాను… ఆ కథను నెచ్చెలివారు బహుమతికి ఎన్నుకోవటం ఒక ఆశ్చర్యానందమైతే అంతకన్నా అబ్బురం ఈ రోజున ఆ కథ చదివిన ముగ్గురు పాఠకులు ఫోను చేసి మరీ అభినందించటం, వారూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నామంటూ ఏకరువు పెట్టడం….
  స్త్రీల దైనందిన జీవితంలో అభిమానాన్ని గాయపరిచే ఇలాంటి అవమానాలు అనేకులు అనుభవిస్తున్నారు కాబట్టే అందరూ ఈ సందర్భంలో తమను తాము చూసుకుని స్పందిస్తున్నారు. నిజానికి ఇది నేనూహించని స్పందన…
  నెచ్చెలి సంపాదక వర్గానికి మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు😍🙏🙏

 6. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారి కథ
  చదివాను.నిజానికి పాటకుడిగా నేను వారి కథల అభిమానిని. ఈ కథకు ద్వితీయ బహుమతి పొందిన రచయిత్రికి అభినందనలు /శుభాకాంక్షలు .ఈ కథను కావాలని రెండు సార్లు చదివాను.ఇందులో కథా వస్తువు బహు సామాన్యమైనది.కాని రచయిత్రి ఇందులో ” పితృస్వామ్యం ” వంటి పదజాలం వాడడం తో,కథ కాస్త బరువెక్కింది.
  ఈ కథలోని మూర్తి గారి పాత్రనే స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఇక స్త్రీ పాత్ర రచయిత్రిదా,ఇతరులదా అన్న అంశం ప్రక్కన పెడితే, ఇక్కడ రెండు ముఖ్య అంశాలు కనపడుతూ న్నాయి.
  1) మూర్తిగారు ఫోన్లో దురుసుగా మాట్లాడడం
  2)మూర్తి గారు..ఆ స్త్రీ మూర్టిని ” నువ్వు” అని పిలవడం.
  ఇక్కడ పరస్పర అవగాహన,స్నేహమనె దగ్గరితనం,చనువు లేకుండా మూర్తి ఫోన్లో దురుసుగా మాట్లాడే అవకాశం లేదు.
  ఇష్టమైన వ్యక్తి,తనకోసం ఒక కార్యక్రమం,ఏర్పాటు చేయడం వెనుక ఎంత శ్రమ తీసుకున్నాడొ…ఆమె గమనించిందా?ఉన్న చనువు ఆధారంగా,తనకు చెప్పకుండా ,ఆకార్యక్రమాన్ని ,వదులుకోవడం వల్ల సహజంగా మూర్తికీ బాధ కలిగించ వచ్చుకదా?” ఎందుకు ప్రోగ్రాం విరమించుకున్నా”వని బాధగా అడిగితే,అది పితృస్వామ్య లక్షణం అయిపోతుందని,పా టకు లు ఒక నిర్ణయానికి వచ్చేయాలా?ఇక్కడ రచయిత్రి
  పూర్తిగా మూర్తి నే తప్పుపట్టడం.ఏ మాత్రం సమంజసంగా లేదు.
  ఇక ” నువ్వు” అని,పిలవడం గురించి.ఆమెకు ఇష్టం లేకుండా
  మూర్తి ఆమెను ” నువ్వు” అనే పిలుపు కొనసాగదు.లేదా
  ఆమె కూడా మూర్టిని ” నువ్వు” అని పిలిస్తే,సరిపోతుందీ కదా! నువ్వు…అనడానికి,,భర్త నొ,అన్నదమ్ములొ అయి వుండాలన్న నియమం ఏమీ లేదుకదా! ఇది కేవలం
  పరస్పర అవగాహన మీద,దగ్గరి తనం మీద ఆధారపడి
  వుంటుం దని ,నా ప్రఘాడ విశ్వాసం. తొందర పాటు,కోపం,అవగాహనా లోపం ముఖ్య కారణాలని నా నమ్మకం. చర్చకు అవకాశం కల్పించిన రచయిత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  1. డాక్టర్ గారూ మీ సుదీర్ఘ సమీక్షకు ధన్యవాదాలు. మీ సమీక్ష చదివాక మూర్తిగారిలాంటి వారు ఈ సమాజంలో చాలామందే వున్నారని అర్ధమౌతోంది. కథను మరోసారి చదవండి… ఆ పెద్దమిషికి తెలియకుండా ఆమె ప్రోగ్రాం విరమించుకోవటం మహానేరంగా అతను భావించి స్పందించిన తీరు సమర్ధించ తగనిది… అది ఖచ్చితంగా మగాడినన్న అహమే… తను చెబితే వినకపోవటమేమిటన్న పితృస్వామ్య భావనే… మీరు మూర్తిగారిని సమర్ధించటం స్నేహంలోనూ పితృస్వామ్యాన్ని సమర్ధించటమే…I’m really sorry for your way of thinking Sir…

   1. మగాడినన్న అహం ఎక్కడా కనపడలేదు. ఆమె గురించి అతను అంత శ్రమ తీసుకుని ఆమె గొప్పతనం పాటకులకు/శ్రోతలకు తెలియాలని
    ఆమె మేలు కోరి చేసినప్పుడు,మూర్తికీ చెప్పకుండా ఆమె అలాచెయడం టప్పుకాడా! అది ఆమె సమర్డించుకొవడమె అవుతుంది.కధను ఎన్ని సార్లు చదివినా,అక్కడ అన్యాయంగా మూర్తికీ పితృస్వామ్యం పొగరుగా చిత్రించడం సరికాదు.” తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు…”…ఓహో..వేమన…నువ్వు ఎంత గొప్పవాడివయ్యా.

  2. అవగాహన లోపం, తొందరపాటు, కోపం అన్నవి ప్రతి మనిషి లో వుండేవే. సహజత్వనికి దగ్గర గా వుంది. ఈ కథ కల్పితం కాదు కాబట్టి, no comments. రచనా నైపుణ్యం అద్భుతంగా వుంది.

 7. ఇది ఎందరో స్త్రీలకు జరిగే అనుభవం. దాన్ని అక్షర రూపం లో చదువుతుంటే మన అనుభవమే రాసారా అన్నంత బాగా రచయిత్రి పితృస్వామ్యాన్ని వ్యక్తీకరించారు

  1. ధన్యవాదాలు నీలిమగారూ, ఇందాకే రాధిక అని ఒకరు కాల్ చేసి తన జీవితంలో జరిగిన ఇలాంటి అనేక అనుభవాలను ఏకరువు పెట్టారు… కథ ఆమె వ్యథను మరోసారి కెలికిందని బాధపడుతూ అభినందించారు…

 8. స్త్రీ ఎదురు కొనే ఇరకాటంలో ఇదొక అంశం. కథ
  తెర వెనుక విషయం – తెర పైనా వివరించారు. నాకు చాలా నచ్చింది. రచయిత్రి గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.