కనక నారాయణీయం -48

పుట్టపర్తి నాగపద్మిని

          గ్రంథంలోని అక్షరాలవెంట పుట్టపర్తి ఆలోచనలు పరుగులు పెడుతుంటే, చిత్తూరు బస్సు, తన గమ్యం వైపుకు పరుగులు పెట్టి పెట్టి చివరికి బస్టాండ్ చేరింది.’చిత్తూర్ చిత్తూర్..’ అని కండక్టర్ అరిచిన అరుపుకు పుట్టపర్తి ఉలిక్కిపడి  ఇహలోకానికి వచ్చారు. బస్సు ఆగింది. ప్రయాణీకులు మెల్లిగా దిగుతున్నారు. పుస్తకంలో తాను చదువుతున్న పుట కుడి పై భాగాన గుర్తుగా కాస్త మడిచి, చేతి సంచీలో పెట్టుకుని, మెల్లిగా సీటు నుంచీ లేచారు పుట్టపర్తి. మోకాలి చిప్ప దగ్గరి గాయం, కలుక్కుమంటూ తానున్నానని గుర్తు చేసింది. మోకాలిని సవరించుకుంటూ, మెల్లిగా లేచారాయన కూడా! ఇప్పుడిక ఆ వెంకట సుబ్బయ్యను పట్టుకోవాలి. ఎలాగబ్బా? అన్నదే సమస్య.

          బస్సు నుంచీ కిందకు దిగారు, భుజానికి వేసుకుని ఉన్న సంచీని సర్దుకుంటూ! ఆ అబ్బాయిని గుర్తు పట్టేందుకేమైనా గుర్తులు చెప్పాడా సుబ్బయ్య? ఏమో, ఇప్పుడెలా? తోసుకుంటూ దిగుతున్న ప్రయాణీకులలో ఒకడుగా, తానూ దిగారాయన.

          దిగి, కాస్త ఖాళీగా ఉన్నచోటు చూసి నిలబడి, కళ్ళద్దాలు తీసి పంచెకొంగుతో తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నారు. ఆ కుర్రాడి పేరు వెంకట సుబ్బయ్యేనట! పేరు పాతకాలందే ఐనా కుర్రాడికన్నీ నవీన భావాలేననీ, ఆ అబ్బాయి వ్రాసిన కథలు ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురింపబడ్డాయనీ కూడా చెప్పాడు సుబ్బయ్య. ‘ఇవన్నీ సరే, ముఖమ్మీద వ్రాసి ఉండవు కదా యీ వివరాలన్నీ? ఇలా అనుకోగానే నవ్వొచ్చింది వారికి! ఆ మాటకొస్తే తనను ఆ అబ్బాయి గుర్తుపెట్టేదెలా? శివతాండవ కర్త అని ముఖమ్మీద రాసి ఉందా తనకేమైనా?’ పెదవుల మీద ఒక చిరునవ్వు ఇలా మెరిసి అలా వెళ్ళిపోయింది. చుట్టూ పరికిస్తూ ఉండగా, అక్కడో హోటల్ కనిపించింది. వెంటనే వేడి వేడీ కాఫీ తాగాలనిపించింది కూడా. అసలే తాను కాఫీ గత ప్రాణి కూడా!  పోనీ కాఫీ తాగి వస్తే? ఊహూ..ఈ లోగా ఆ అబ్బాయి వెదికి వెళ్ళిపోతేనో? వద్దు వద్దు, ఇక్కడే ఉండాల్సిందే! 

          నిలబడే ఉండటంతో దెబ్బ తగిలిన మోకాలు మొరాయించింది. ఎక్కడైనా కూర్చుంటే బాగుంటుందని సూచించింది. కూర్చునే చోటు వెదుక్కునేందుకు చుట్టూ పరికించి చూస్తుంటే, ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతగాడొచ్చీ రాగానే ‘నువ్వేనా రా వెంకట సుబ్బయ్యవు?’అని అడిగారు పుట్టపర్తి.

          అవునని తల ఊస్తూ నమస్కరించి, ‘క్షమించండి స్వామీ! మిమ్మల్ని గుర్తు పట్టేందుకు సమయం పట్టింది.’ అన్నాడా అబ్బాయి నొచ్చుకుంటున్నట్టు ముఖం పెట్టి.

          పుట్టపర్తి నవ్వు ముఖం పెట్టి అన్నారు ,’ఇక్కడెక్కడైనా మాంచి కాఫీ దొరుకు తుందారా?’

          ‘ఆ..దొరుకుతుంది స్వామీ, మెడ్రాస్ కేఫ్  ఉందిక్కడ! ఆ బ్యాగ్ నా చేతికివ్వండి. మీ కాలికి దెబ్బ తగిలిందట కదా! సుబ్బయ్యగారు చెప్పినారు. ఎట్లా ఉందిప్పుడు?’

          ‘బాగానే ఉందప్పా!!’ చనువుగా భుజమ్మీద తట్టి, వారి భుజానికి వేలాడుతున్న బ్యాగ్ ను వెంకట సుబ్బయ్యకు అందించారు వారు. హోటల్ చేరుకుని కుర్చీలో కూర్చున్న తరువాత సర్వర్ తెచ్చి పెట్టిన నీళ్ళు తాగేశారు. సర్వర్ ను చూస్తూ ‘రెండు కాఫీ తీసుకు రాప్పా!’అనేశారు.

          వెంకట సుబ్బయ్య సంభ్రమంగా పుట్టపర్తి వైపు చూస్తూ  చెప్పటం మొదలెట్టాడు.

          ‘స్వామీ! మీరంటే నాకెప్పటి నుంచో ఆరాధన! మా పదవ తరగతిలో మీరు వ్రాసిన సత్యాదేవి మాకు పాఠంగా ఉండేది. మా తెలుగు సార్ గజేంద్రనాయుడుగారు, ఆ పాఠాన్ని ఎంత బాగా చెప్పినారో! మీ చిన్న చిన్న వాక్యాలు, ముచ్చటైన హాస్యం, మధ్య మధ్య అల్లిబిల్లిగా ఇంగ్లీష్ పదాలు – భలే బాగుండేవి! మీరు శివతాండవం వ్రాశారని కూడా ఆయనే  చెప్పినారు. నేను ఎంతగానో వెదికినా నాకు దొరకలేదు కానీ, ఇక్కడి లైబ్రరీలో పాత భారతుల్లో ఒక కటింగ్ దొరికింది. అదే కాపీ చేసుకుని ఎన్ని సార్లు చదువుకున్నానో! ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ చూడడం నా అదృష్టం నిజంగా!’

          పుట్టపర్తి ముఖాన చిరునవ్వు. కాఫీలొచ్చాయి. మెడ్రాస్ పద్ధతిలో పొగలు కక్కుతూ ఉన్నాయి. పుట్టపర్తి కాఫీ అందుకుని వేడిగా ఉన్నా గబగబా తాగేసి, ‘నువ్వింకా తాగలేదు, తాగు!’ అంటూ జేబులోకి చెయ్యిపోనిచ్చి, తాజ్ మహల్ బీడీ కట్ట లాగి, అందులోంచీ ఒకటి తీసి అగ్గిపెట్టెతో వెలిగించుకుని తాగటం మొదలెట్టారు.

          వెంకట సుబ్బయ్య అనే ఆ యువకుని కళ్ళల్లో ఇంకా అదే సంభ్రమం. కాఫీ కప్పు లోంచీ కాస్త కాస్తగా తాగుతూ, పుట్టపర్తి వారి వంకే చూస్తున్నాడలా!!

          ‘మీ శివతాండవం చదువుతుంటే, యీవిధంగా రాయటం వేరెవరికీ  సాధ్యం కాదనిపిస్తుంది స్వామీ!’ అన్నాడు.

          ఆ మాటలు వింటూ, ‘అంతా ఆ నాటి నా గురువులూ,  గురుతుల్యుల దయరా నాయనా’ అంటూ, బీడి తాగుతూ ఆలోచనల్లో మునిగిపోయారు వారు. తరువాత పుట్టపర్తి అన్నారు, ‘నాకింకో కాఫీ కావాలప్పా, చాలాసేపయింది కదా తాగి!’  

          ఇంకో కాఫీ కూడా తాగిన తరువాత, మళ్ళీ ఇంకో బీడి వెలిగించారు. ” ఏ జన్మ నుంచీ నాతో కలిసి ప్రయాణిస్తున్నాయో గానీ, ఈ కాఫీ అలవాటూ, బీడీ అలవాటు పోగుట్టుకో లేకుండా ఉన్నానురా! రోజుకు కనీసం నాలుగైదుసార్లు కాఫీ తాగాల్సిందే! ఒక ఇరవై, ముప్ఫై బీడీలూ తాగాల్సిందే!’

          అంత వరకూ బీడీ తాగున్న పుట్టపర్తినీ బస్ స్టాండ్ లో చుట్టుపక్కల గోలనూ చూస్తూ కూర్చుని ఉన్న వెంకట సుబ్బయ్య వైపు చూసి, అతని దగ్గరున్న సంచీ తన కిమ్మని సైగ చేశారు. తీసుకుని అందులో నుంచీ ‘శివతాండవం’  కాపీ తీసి ఆ అబ్బాయి చేతికిస్తూ అన్నారాయన, ‘ఇదిగో! సుబ్బయ్య నీకిమ్మన్నాడు.’ అని ఇచ్చారు.

          వెంకటసుబ్బయ్య కళ్ళు మెరిసిపోయాయి.

          ‘ఇంతకూ ఒరే, నా సాపాటూ అదీ ఎక్కడేర్పాటు చేసినార్రా?’ ప్రశ్న.

          ‘మీకు అభ్యంతరం లేకపోతే, మా ఇంట్లోనే మీరు భోజనం చేయవచ్చు స్వామీ! మా నాయనగారు అశ్వత్థమయ్యగారికి కూడా సాహిత్యమంటే ప్రాణం. అమ్మ లక్ష్మీదేవమ్మ చేతి వంట అమృతమే!’ అనేశాడా అబ్బాయి.

          ‘ఇంకేమిరా! మీ ఇంటికే పోదాం పద మరి! హోటల్ భోజనం కంటే నాకు ఇంటి భోజనమే ఇష్టం రా! మీ నాయనగారికీ సాహిత్యమంటే ఇష్టమంటున్నావ్. మరీ మంచి దప్పా. పచ్చడి మెతుకులైనా రుచిగా ఉంటే చాలు. నేను  పుస్తక ప్రియుణ్ణే కానీ, భోజన ప్రియుణ్ణి మాత్రం కాదులే!. కాకపోతే, సాపాటు తరువాత, బీడీ తప్పనిసరి. బీడి వాసన మీ నాయనకు నచ్చుతుందో లేదో మరి?’ 

          ‘అయ్యో, ఎంత మాట స్వామీ! ఏమీ లేదు. మా నాయనకు నశ్యం అలవాటుంది. మీకు ఫరవాలేదు కదా?

          ‘ఆ..మరీ మంచిది. నేనూ ఒక పట్టుపట్టొచ్చు.’ నవ్వారు నిండుగా పుట్టపర్తి.

          ‘మా తాతగారు రామచంద్రప్పగారు సామాజిక సేవలో మంచి పేరున్న వ్యక్తి కూడా! మా ఇంట్లో మీకే ఇబ్బందీ ఉండదు. ఇంటికే పోదాం. మహద్భాగ్యం మాది.’

          ‘సాపాటు తరువాత నడుం వాలుస్తానప్పా కొంచెం! ప్రయాణం చేసి వచ్చినాను కదా! పైగా కాలు నొప్పి కూడా!’ సంజాయిషీ ఇస్తున్నట్టన్నారు వారు.

          ‘ఏమీ ఫరవాలేదు. అరగొండ పాఠశాలలో మీ ఉపన్యాసం సాయంత్రం కదా! మీరు భోంచేసి విశ్రాంతి తీసుకోండి. ఈ లోగా నేను పోయి వాళ్ళకు చెప్పి వస్తాను.’ అన్నాడు వెంకటసుబ్బయ్య.

          రిక్షాలో వల్లంపాటి ఇంటికి చేరుకున్నారిద్దరూ! పరస్పర పరిచయాలూ, స్నానాలూ అయ్యాక వల్లంపాటి గారి తండ్రి అశ్వత్థమయ్యగారి రాయలసీమ తమిళ సరిహద్దు లలోని  సుగంధ భరిత వాక్చాతుర్యమూ, తల్లిగారు లక్ష్మీదేవమ్మ చేతి వంట రుచుల ఆస్వాదనా పుట్టపర్తికి ఆహ్లాదాన్నిచ్చాయి. ఆ పైన బస్సుప్రయాణపు అలసట, ఆవహిం చగా, పక్కమీద వాలిపోయారు.  

***

          సాయంత్రం. సంజ కెంజాయరంగుల సమ్మోహన దృశ్యం. అరగొండ పాఠశాలలో పుట్టపర్తి ఉపన్యాసం, మరింత సమ్మోహనంగా!!

          ‘నన్నీ పాఠశాలకు దయతో పిలిపించిన ప్రధానోపాధ్యాయులకూ, సహకరించిన అధ్యాపక బృందానికీ నా కృతజ్ఞతలు. పిల్లలూ! మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నతనం జ్ఞాపకమొస్తూంది. నేను మీ వయసులో మీ కంటే ఎక్కువ అల్లరి చేసేవాణ్ణి. ఊరిలో వాళ్ళకు నా అల్లరంటే భయం. ఇంట్లో లక్ష్మీకాసులు దొంగిలించి, స్నేహితులతో కలిసి  రంగు షోడాలు తాగడం..ఇంకా ఇటు వంటివి చాలా!! ఊరిలో వాళ్ళకూ  నా అల్లరంటే భయం. పక్కింటి వకీలును కుక్క సర్కస్ లతో శాంతి లేకుండా చేయడం, రైల్వే స్టేషన్ అల్లర్లు – నా అప్పటి పనులన్నీ చెప్పితే మీ అమ్మానాయనలు నన్ను తిట్టుకుంటా రేమో!’  

          పిల్లలూ పెద్దలూ అంతా నవ్వులు.

          ‘అందుకే చెప్పను కానీ, మా స్నేహ బృందమంతా అల్లరికి దుడుకు పనులకూ మాంచి పేరున్నవాళ్ళమే! కానీ, ఇంట్లో మా అయ్యను చూస్తే, ఎక్కడలేని వణుకు నాకు. పెద్దగా దండించేవారు కాదుకానీ, ఆయన గంభీరమైన విగ్రహం చూస్తేనే నా లోని అల్లరంతా మాయమైపోయి పిల్లి వలె ముడుచుకుని పోయేవాణ్ణి. ఆయనింట్లో ఉంటే నేను ఇంటి వెనక, అయన బైటుంటే, నేను లోపలా!’

          నవ్వుల గలగలలు.

          ‘ఆయన మహా సంస్కృతాంధ్ర పండితుడు. శాస్త్ర పాండిత్యమున్నవాడు. కలం పట్టి కావ్యాలేవీ వ్రాయకపోయినా, కావ్యాలన్నింటినీ అద్భుతంగా విశ్లేషించే పాండిత్యం ఆయన సొంతం. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారూ, రొద్దం ప్రభాకర రావు గారూ, చిలుకూరి నారాయణ రావుగారూ వంటి పెద్దలందరూ ఆయన్ను ఎంతో గౌరవించేవారు. మా ఊళ్ళో యే సాహిత్య సభా మా అయ్యగారు లేకుండా జరిగేదే కాదు. ఆయన కంఠం ధీర గంభీరం. పద్యం ఆయన గొంతులో జీవం పోసుకునేది. ఆయన్నక్కడ చూసి నప్పుడంతా, యీయనే మా అయ్య కదా! అని గర్వం. కానీ కుక్క తోక వంకరే కదా! బాల్య సహజమైన అమాయకతే అల్లర్ల సమయంలో గెలిచేది. ఇంకేముంది, మళ్ళీ అల్లర్లు, మా అయ్యతో తిట్లూ!’

          పిల్లల్లో నవ్వుల జలపాతాలు. పెద్దల పెదవుల మీద చిరునవ్వుల జల్లులు.  

          ‘కానీ, మా ఊర్లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అప్పటి కట్టడాలెన్నో ఉండేవి. వాటి మధ్య తిరుగుతూ ఉంటే, నా మనసులో నుంచీ ఏదో బాధ తన్నుకుని వచ్చేది. ఆ కట్టడాల వెనుక కథలూ అవీ విని ఉండడం వల్ల, వాటితో నాకేదో బంధమున్నట్టే తోచేది. నాకు గురు సమానులూ, మార్గదర్శకులూ, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి వద్ద ప్రాకృత సాహిత్య పాఠాలతో పాటూ, వాళ్ళన్నయ్య గోపాల కృష్ణమాచార్యుల వద్ద విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలు ఆసక్తితో వినేవాణ్ణి. ఆ సంగతులన్నీ నా మనసులో బాగా పాదుకుని ఉండిపోయినాయి. అందుకేనేమో ఆ స్థలాలన్నీ నన్ను రా రమ్మని పిలుస్తున్నట్టే అనిపించేదెప్పుడూ! అక్కడి శిథిల నిర్మాణాల్లో కోట, రాజవీధి అని చెప్పబడే పాడుబడ్డ ప్రాంతం, రామ బురుజు, ఆలయం, బాబయ్య గోరీ, ముఖ్యంగా గగన్ మహల్ – ఇవన్నీ నాకేవో కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపించేవి. నాకప్పుడు తీరా మారా పన్నెండు పదమూడేళ్ళే!’    

          సభలో నిశ్శబ్దం. పుట్టపర్తి చెప్పే విధానం అటువంటిది మరి.

          ‘అస్థిరం జీవితంలోకే’  అనికదా అన్నారు? కీర్తి ధనమే స్థిరం. విజయనగర రాజులు సంస్కృతికి చేసిన సేవ స్థిరంగా ఉంటుంది. అంతే! వారు చేసిన సాహిత్య సేవ అనుపమానమైనది. అంతే కదూ?’

(చిత్రం – పెనుగొండ కోట ప్రవేశ ద్వారము)

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.