కనక నారాయణీయం -49

పుట్టపర్తి నాగపద్మిని

 సభలో నిశ్శబ్దం. పుట్టపర్తి చెప్పే విధానం అటువంటిది మరి.

          ‘అస్థిరం జీవితంలోకే’ అనికదా అన్నారు? కీర్తి ధనమే స్థిరం. విజయనగర రాజులు సంస్కృతికి చేసిన సేవ స్థిరంగా ఉంటుంది. అంతే! వారు చేసిన సాహిత్య సేవ అనుపమానమైనది. అంతే కదూ? కృష్ణదేవరాయల వారి జయంతి ఉత్సవాలు కూడా మా ఊళ్ళో బాగా వైభవంగా జరిగేవప్పట్లో!! అప్పుడు మా అయ్య అంటే మీ మాటల్లో మా తండ్రిగారాసభల నిర్వహణలో పెద్ద బాధ్యత వహించేవారు. ప్రతి సభలోనూ విజయనగర సామ్రాజ్య వైభవం గురించి తానే వ్రాసి స్వర పరచిన పాట పాడేవారు చాలా శ్రావ్యంగా, భావోద్వేగంతో! (పుట్టపర్తి టేబుల్ మీదుంచిన నీళ్ళు తాగి, గొంతు సవరించుకునిపాడటం మొదలెట్టారు.)

పోయి సూసొత్తాము రారే
మీరందరూ రాయలా నగరానికీ..పోయి..
విజయనగరంలోన
వేడుకైతాదంట,
ప్రజలు సంతోషంతొ
పలుమందొత్తారంట…పోయి..
తప్పెట్లు, నాగార్లు
తాజా మరుపూలంట,
ఎప్పుడూ సూసినా
చప్పుడైతాదంట…పోయి..
పప్పూ బువ్వాగలిపి పవలెల్ల
రేయల్ల సప్పరలో బంచి సాగనిస్తారంట….పోయి..
పెద పెద్ద పేరైన
పెబువులొత్తారంట,
బలుసదువు సదివినా
బ్యామ్మర్లొత్తారంట
యుద్ధాలు పట్టేటి
యీరులొత్తారంట,
ఇదైదాల మంచి
ఇంతలైతాదంట!
గుట్టలల్లా దిరిగే
గున్న ఏనుగులంట
కట్టాలు దాటేటి
పొట్టి గుర్రాలంట,
బట్టాలు సొగసుగా
గట్టే ఆడోల్లంట,
పట్టపగలైనట్టు
పెట్టే దీపాలంట
పోయి సూసొత్తాము రారే
మీరందరూ రాయల నగరానికీ…..

          ఈ పాట ఎన్ని సభల్లో విన్నానో! విన్న ప్రతీసారీ ‘అయ్యో, విజయనగర వైభవాన్ని కళ్ళారా చూడలేకపోయానే!’ అని గుండెల్లో బాధ! అంతే కాదు, ఆ నాటి కవులూ వాళ్ళ కవిత్వమూ, అప్పటి జీవన విధానమూ అన్నీ మా అయ్యా వాళ్ళ స్నేహితుల మధ్య జరిగే సంభాషణల్లో భాగాలే. కాబట్టి, ఆ విజయనగర సామ్రాజ్యంలో నేనూ భాగమైనట్టూ, ఇప్పుడీ శిధిలాల మధ్య తిరుగుతుంటే, అప్పటి జ్ఞాపకాలేవో నాతో నడుస్తూ సంభాషిస్తున్నట్టే అనిపించేది! మా అయ్యవల్ల తిక్కన శైలితో బాగా అనురక్తి ఏర్పడింది, ఆయన పురాణ కాలక్షేపాల్లో భారతం చదివి చదివి! నేను చదువుతుంటే ఆయన వ్యాఖ్యానిస్తూ ఉండే వారు మరి! ఇంకే ముంది, ఆ శిధిలాల్లో తిరుగుతున్నప్పుడే, పద్యాలు వాటంతటవే ధారాపాతంగా దొర్లిపోతుండేవి. కాగితం మీద ఎక్కించేవాణ్ణి. అయ్యకు చూపించాలంటే భయం. ఒకసారి ఆయనే నా వ్రాతని చూసి అన్నారు, వ్రాయటం పూర్తిగా రాకపొతే కలం పట్టటం మానుకోవాలని! ఏమో, యీ పద్యాల్లో ఎన్ని తప్పులున్నాయో, ఆయన నన్ను ఝాడించి పడేస్తాడంతే!! ఆ భయంతో అయ్యకు చూపించకున్నా తిరుపతిలో శిరోమణి క్లాస్ లో మా స్నేహితుల మధ్య చదివేసరికి వాళ్ళకు తెగ నచ్చేశాయి నా పద్యాలు.

చలమున్ డింద, యశంబు జేకొనని శుష్కప్రాణి నేనంచు, నా
కులతన్ బొందగ నేల, చేవ విడి నీకున్ పిచ్చి తండ్రీ! జయం
బులు డోలా చలనంబులీశ్వరు తలంపుల్వార్థి గంభీరముల్
దగమేగన్ గొన భావి లోకముననేర్పాటెట్లు గావించునో?

          ‘మన చేతుల్లో ఏమీ లేదు, డోలాయమానమే మన జీవితాలన్నీ..’ అన్న నిర్వేదంతో కూడుకున్న పద్యాలూ, ‘తళుకున్ గత్తుల..’  లాంటి విజయ నగర రాజుల శౌర్య పరాక్రమా లను వర్ణించే పద్యాలూ, శిల్ప సౌందర్యాన్ని వర్ణించే పద్యాలూ చదివినప్పుడు అందరూ నన్ను తెగ మెచ్చుకున్నారు. వాళ్ళే పూనుకుని దీన్ని ముద్రించారు కూడా? ‘దగ్గు వస్తే, ఒక నిముషం ఆగారు పుట్టపర్తి.

          అంతటా నిశ్శబ్దం. పిల్లలందరి ముఖాల్లో ఉత్సుకతే ఉత్సుకత. నీళ్ళు తాగి మళ్ళీ మొదలెట్టారు వారు.

          ‘చాలా మంది పెద్దవాళ్ళు నా బాల్య రచనను మెచ్చుకున్నారు. తరువాత నా ప్రప్రథమ ఖండ కావ్యం పెనుగొండ లక్ష్మి ప్రభావం ఎన్నో మలుపులు తిరిగింది నాటకీయంగా! ఆ పుస్తకమే మళ్ళీ విద్వాన్ పరీక్ష నేను వ్రాసినప్పుడు నాకే పాఠ్యపుస్తకం తెలుసా?’

          పిల్లలంతా చప్పట్లు. పెద్దల కళ్ళల్లో ప్రశంసాత్మక కాంతులు .

          ‘నా మనసులోనూ ఉద్వేగమే!! ఆ హాల్ లో ఎవరికి చెప్పుకోను, ఇది నా రచనే అని? చెప్పినా నమ్మేదెవరు అప్పుడు? పరీక్ష సమయం మూడు గంటలూ, ఎలా గడిచి పోయినవో గానీ, సమయం ఐపోయిందన్న హెచ్చరిక విని చూసుకుంటే, నేనింత సేపూ వ్రాసిందొక ప్రశ్నకు సమాధానం మాత్రమే!! చేసేదేముందు? ఇచ్చేసి వచ్చేశాను. ఫలితాలూ వచ్చేశాయి. మనం ఫెయిల్.’

          అంతటా నిశ్శబ్దం. చీమ చిటుక్కుమంటే వినబడేలా ఉంది వాతావరణం. అదెలా? విద్వాన్ పరీక్ష పాసవటం అనివార్యం కదా? అధ్యాపకుల ముఖాలు ప్రశ్నార్థకాలు. పుట్టపర్తి వారు జుబ్బా చేతులు పైకి మడుచుకుంటూ, మొదలెట్టారు.

          ‘ఏముంది? పెనుగొండ లక్ష్మీ ఖ్యాతే మళ్ళీ నాటకీయంగా నన్ను ఉత్తీర్ణుణ్ణి చేసింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు చెబుతూ కూర్చుంటే పెనుగొండ చేంతాడంత కథ. అన్నట్టు పెనుగొండ చేంతాడు అనే సామెత విన్నారా?’

          ‘లేదు, లేదు..’ పిల్లలు అరిచారు గట్టిగా!!

          ‘మా పెనుగొండ విజయనగర చరిత్రకే కాదు, ఇటువంటి సామెతలకూ ప్రసిద్ధే! అక్కడిప్పుడు నీళ్ళకు కరువు. బావుల్లో నీళ్ళెక్కడో ఉంటాయి, వేరే ప్రాంతాల్లో, లోతుకు వెళ్ళితే గంగైనా దొరుకుతుందేమోగానీ, మా ఊళ్ళో,  చెంబెడు నీళ్ళు బావిలోంచీ తోడా లంటే రెండు మూడు చేంతాళ్ళు కలిపితేగానీ సాధ్యమవదిప్పుడు! కరువు సీమైపోయింది. చిన్నప్పటి మా ఊరికీ, ఇప్పటి మా ఊరికీ ఎంతో తేడా! ఆ కరువు సీమను ఆదుకునే నాధుడెవడో ఎప్పుడొస్తాడో? సరే. ఆ సమస్యలు పరిష్కరించే నాయకుల కోసం ఎదురు చూస్తూనే వుందక్కడి నేలంతా!! నా బాధను నా మేఘదూతం అనే గేయ కావ్యంలో వ్రాశానర్రా!! అది కూడా మీకు నచ్చుతుంది.’

          ఇంతలో ఎవరో చీటీ పంపారు, ఆచార్యులవారు తీసి చదువుకున్నారు, చిరునవ్వు తో, అన్నారు,’ ఎవరో పంపారప్పా ఇది. శివతాండవం గురించి చెప్పమని యీ చీటీ! అదేమిటోగానీ యీ ‘శివతాండవం’ కూడా నా జీవితానికి సార్థక్యతను తెచ్చిపెట్టిన ఖండ కావ్యమే!! కానీ దీని రచన కేవలం మండలంలోనే ముగిసిందంటే నమ్ముతారా మీరు? నేను ప్రొద్దుటూరులో స్థిరపడిన తరువాత ఏవేవో చికాకులతో మనసు వ్యాకులం చెంది, అక్కడి అగస్తీశ్వరాలయంలో ఒకసారి మండలం పాటు ప్రదక్షిణలు చేస్తానని సంకల్పించుకున్నాను. మా రాయలసీమ ఎండలకూ ప్రసిద్ధే కదా!! బండల మీద నిప్పులు పోసినట్టే ఉంది. కానీ ప్రతి రోజూ నూటా ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని కదా నా దీక్ష! ఆ దీక్షలో రోజూ ఒకే ఒక్క లక్ష్యం. ఈ పని పూర్తి చెయ్యవలె! అంతే!! గుడి ప్రాంగణం చాలా పెద్దది. ఉదయం తొమ్మిది గంటలే ఐనా, ఎండ తీవ్రంగానే ఉండేది. ఏది ఏమైనా,  దీక్ష ముగించవలె! లోపలున్న భగవంతునిమీదే దృష్టి నిల్పి, ఆ సర్వేశ్వరుని లీలా గాధలను తలచుకుంటూ, ఆ భక్త వశంకరుని కరుణా పారీణతను మననం చేసుకుంటూ, ఆ లయకారుని లీలా తాండవాన్ని ధ్యానించుకుంటూ నడుస్తూ ఉంటే, కైలాసమే ముందు సాక్షాత్కరించినట్టూ, సంధ్యా కాంతుల్లో, ఆ నటరాజ స్వామి నా ముందు నర్తిస్తున్నట్టూ ఒక ఊహ తళుక్కున మెరుపు వలె మెరిసింది! నా గొంతు పెగిలింది.

ఏమానందము భూమీ తలమున
శివ తాండవమట,
శివ లాస్యంబట!
అలలై బంగరు కలలై
పగడపు బులుగులవలె
మబ్బులు విరిసినయవి!

          పుట్టపర్తి స్వామి శివతాండవ పఠన ప్రారంభమే అక్కడున్న పిల్లా పెద్దా అందరినీ ఒక అద్భుతానంద సీమా విహారం వలె కట్టి పడేసింది. వారి గొంతులోంచీ వినిపిస్తున్న సంస్కృత శ్లోకాలకు అర్థం తెలియకున్నా, వాటి తాత్పర్యమేదో అర్థమైపోతున్నట్టే భావన. ఏదైనా ప్రశ్న ఉదయించినా,  శివ స్వరూపమే సమాధానమన్నట్టూ అందరి మనసుల్లోనూ ఒకే ఒక్క దృశ్యం!

          ‘ఎదురుగా హిమాలయ శిఖరాలు! వారి  వారి స్థాయిలను బట్టి కూర్చుని ఉన్న దేవతలందరి నిర్నిమేష దృక్కులూ ఒకే చోట కేంద్రీకృతాలై ఉన్నాయి. డమరుక విన్యాసాలూ, శంఖ ధ్వనులూ, వీణా వేణు నాదాలూ, జతుల సందడులూ – అన్నిటితో కూడిన సర్వేశ్వరుని నాట్య చాతుర్య దృశ్యాలు!

(చిత్రం – హోయసల శిల్పంలో నటరాజు)

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.