నా జీవన యానంలో- రెండవభాగం- 35

-కె.వరలక్ష్మి

          2005 వ సంవత్సరం ప్రారంభం నాటికి నాకు విపరీతమైన నీరసం పట్టుకుంది. రెండు పేజీలు రాసే సరికి కళ్ళు తిరగడం మొదలైంది. ఎలాగో లేని ఓపికతెచ్చుకుని ఇంటిపని, మోహన్ పనులు ముగించి ఎక్కడపడితే అక్కడ ఉత్తనేల మీద పడి నిద్ర పోయేదాన్ని.

          ఒక రోజు ఏమైందో తెలీదు అతనికి తినిపించి, మూతి కడుగు తుంటే చటుక్కున వంగి నా పాదాలు తాకాడు. ఒక్కసారిగా నాకు పెద్ద కెరటం లాగా దుఃఖం ముంచు కొచ్చింది. అక్కడే మంచానికి చేరబడి నిస్సహాయంగా ఏడుస్తూ ఉండిపోయాను. ఎంత చదివినా, ఎన్ని నేర్చినా సెన్సిటివ్ నెస్ మనిషిని వదలదు. దాని నుంచి కొందరు తొందరగా బైటపడతారు. మరికొందరుపడలేరు.

          కన్నడ రచయిత M.V. వెంకటసుబ్బారావు గారు నా నవలిక ‘ఉషోదయం’ ని ‘శుభోదయ ‘ పేరుతో కన్నడంలోకి అనువదిస్తే ‘రాగ సంగమ’ పత్రిక ప్రచురించింది.

          ఆ ఏప్రిల్ లో  హఠాత్తుగా నా ఎడమచెయ్యి భుజం నుంచి అరచేతి వరకూ నొప్పి ప్రారంభమైంది. ఒకరోజు రాత్రి నిద్రపట్టేవేళ నా తల పై నుంచి కాళ్ళ వైపు నల్లని పక్షి ఒకటి రాసుకుంటూ వెళ్లినట్టు అన్పించి ఉలిక్కిపడి లేచాను. నాకేదో జరగబోతోందేమో అని మనసులో దృఢంగా అన్పించింది. అలా అయినా నాకు విముక్తి దొరుకుతుందేమో!

          ఆ రోజు ఎక్కడో చదివింది గుర్తుకొచ్చి ఎడమ చెయ్యి నొప్పికి కారణం ఏమిటా అని పరిశీలించుకుంటే ఎడమ వైపు  బ్రెస్ట్ కి , నెక్ కి  మధ్యలో చిన్న గుళికలాంటిదేదో చేతికి తగిలింది, మా ఊరి గైనకాలజిస్ట్ సత్యక్రిష్ణ చూసి “కాకినాడ నుంచి మంచి స్పెషలిస్ట్ నైనా పిలిపిద్దాం. లేదా మీరు వెళ్ళి కలిసినా సరే. ఆలస్యం చెయ్యొద్దు.” అన్నాడు. అతని ముఖంలోని భావం చూస్తే నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది. డాక్టరు నా వైపు జాలిగా చూస్తూండగా హాస్పిటల్ నుంచి బైట పడ్డాను. ఇంటికొచ్చేసరికి చెమటల్తో తడిసి ముద్దయ్యాను. ఆ గాభరా తట్టుకోలేక ముందు మా అబ్బాయికి ఫోన్  చేసాను. “డాక్టరు చెప్పినట్టు చెయ్యి. అక్కడే చూపించుకో ” అన్నాడు కూడా. వెంటనే గీతకు ఫోన్ చేసాను. “ఆ చూపించేదేదో  ఇక్కడే చూపిద్దాం, నువ్వు వెంటనే రిజర్వేషన్ చేయించుకో” అంది. మళ్ళీ అతణ్ణి తీసుకుని ప్రయాణం. స్టేషన్  నుంచే అతన్ని హోమ్ కి, నన్ను మా అబ్బాయి ఇంటికీ తీసుకెళ్ళారు. ఫ్రెష్ అయ్యాక బంజారాహిల్స్ లోని బసవరామతారకం కేన్సర్ హాస్పిటల్ లోకి తీసుకెళ్ళేరు. మమ్మోగ్రఫీ , సీరమ్  టెస్టులు చేసి, ఆ టెస్టుల్లో ఏమీ తెలీలేదని, రేపు ఇంకొన్ని టెస్టులు చెయ్యాలన్నారు. పిల్లల్తో ఉండడం వల్ల నాకు పోయిన ధైర్యం తిరిగొచ్చింది. ఐదురోజుల పాటు రకరకాల టెస్టులు చేసారు. టెస్ట్ రిపోర్టులు చూసి ‘హమ్మయ్య, పర్వాలేదు’ అనుకొంటూండగా సర్జరీ చెయ్యక తప్పదనీ, వీలైనప్పుడు ఓ రోజు ముందుగా వచ్చి జాయినవ్వమన్నారు. రెండురోజుల్లో మా  అబ్బాయి, కోడలు, గీత వెంట ఉండి జాయిన్ చేసారు. అక్కడ రచయిత్రి మృణాళిని కన్పించింది. వాళ్ళ అత్తగారికి కీమో, రేడియేషన్స్ ఇప్పిస్తున్నారు. తను కూడా ఈ మధ్య టెస్టులన్నీ చేయించుకున్నానని ఏం పర్వాలేదని ధైర్యం చెప్పింది.

          లంప్  అతి చిన్న సైజులో ఉందని, దాన్ని తీసి పరీక్షించాలని అన్న వాళ్ళు నాకు సెడేషన్ ఇచ్చాక పూర్తిగా రిమూవ్ చేసేస్తే ఫ్యూచర్ లో ప్రోబ్లమ్ ఉండదు అని మా పిల్లల సంతకం తీసుకుని రిమూవ్ చేసేసారట. కట్టువిప్పే వరకూ నాకు తెలీనే లేదు. జీవితం లో మొదటి సర్జరీ. మత్తువిడేసరికి ఎడమ చెయ్యి లోపలంతా భరించ లేని బాధ, తట్టుకో లేకపోయాను. మొదటి రాత్రి ICUలో ఉంచారు. రెండవ రాత్రి  గీత తోడుగా ఉంది. అర్థరాత్రే హాస్పిటల్ బైట గార్డెన్ లో ఎవరో అతివిషాదంగా ఏడవడం మొదలుపెట్టారు. ఆ ఏడుపు వింటూంటే నాలో అంత వరకూ లేని పిరికితనమేదో ప్రవేశించింది.

          నాకు టెస్టులు జరిగిన రోజున ఎవరో ఒక పెద్దాయన భార్యకు కూడా జరిగాయి. ఆమెను వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చేవారాయన. కేర్ హాస్పిటల్లో హార్ట్ కి సంబంధించిన టెస్టుల కోసం వెళ్ళినప్పుడు ఆయన నా దగ్గరకొచ్చి “అమ్మా! ఏమైంది మీకు? ఇంత ఆరోగ్యంగా కన్పిస్తున్నారే, కేర్ హాస్పిటల్ కి ఎందుకొచ్చారు. మిమ్మల్ని రోజూ గమనిస్తున్నాను. ఎక్కడో చూసినట్లు ఉందనిపిస్తోంది” అన్నారు. నేను చెప్పేను. “అయ్యో! మీకేం కాకూడదని మనసా వాచా కోరుకుంటున్నాను” అన్నారు. అలాంటి వెల్ విషర్స్ ఎందరో నన్ను చూడగానే పలకరించేవారు.

          మూడవ రోజు ఇంటికి పంపించేసారు. రెండురోజులకొకసారి వెళ్ళి కన్పించాలి. అలాగే మా అబ్బాయి తీసుకెళ్ళేవాడు. డాక్టరు పిలిచే వరకూ వెయిట్ చేసే టైంలో నేను కీమోథెరపీలు, రేడియేషన్లూ జరిగే చోట్లకెళ్ళి పరిశీలిస్తూ ఉండేదాన్ని. మృణాళిని గారి అత్తగార్ని పలకరించేదాన్ని. శారదా శ్రీనివాసన్ గారు వారి భర్తగారికి వైద్యం చేయిస్తూ అక్కడే ఉన్నారు. అక్కడొక పెద్దావిడను పలకరించినప్పుడు “ఈ వైద్యం తాలూకు నరకాన్ని భరించేకన్నా చచ్చిపోవడం మేలు” అన్నారు. అక్కడందరూ సగం సగం జీవాన్ని కోల్పోయినట్టే ఉన్నారు. ‘ఆ వైద్యాలు నాకు చెయ్యకుండా ఉంటే బావుండును’ అన్పించింది. నాకు ఇంకో డౌటు కూడా ఉంది, నాకున్న కీలాయిడ్ టెండెన్సీకి స్కిన్ కింద చిన్ని పెసర గింజంత గుళికలాగా వచ్చి అక్కడేమన్నా గీసుకుంటే అది పైకి నరం ఉబ్బినట్టు అయిపోతుంది. సర్జరీకి ముందు నేనా విషయం చెప్పబోతే ఆ డాక్టరు అసలు విన్పించుకోనే లేదు. రిపోర్టులు కూడా క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నాయి కాబట్టి ఆ వైద్యాలేవీ చెయ్యర్లే అనుకున్నాను. స్టిచెస్ తీసేసే  రోజు “నేను మామూలుగా కథలు రాసుకోవచ్చా డాక్టర్” అని అడిగేను. ఆయన నా వైపు జాలిగా చూస్తూ “రేపటి నుంచే మీరు కీమోలకీ, రేడియేషన్ లకి అటెండవ్వాలి” అన్నాడు. ఒక్కసారిగా నా నవనాడులూ కృంగిపోయినట్టై పోయింది. ఆపరేషన్ టైంలో నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చేక “లంప్ ఒక్కటీ తియ్య డానికి 30 వేలు అవుతుంది, మొత్తం రిమూవ్ చెయ్యడానికి 50 వేలు. అవుతుంది, ఏది చెయ్యమంటారు? ” అని మా అబ్బాయిని అడిగాడట డాక్టరు. అదేమిటి ఆ ఛాయిస్ పేషెంట్ కి ఇవ్వడం ఏమిటి? వైద్యాన్ని వ్యాపారంలాగా చెయ్యడమే కదా!

          మరోపక్క ఇంటి దగ్గర పిల్లల్ని నా దగ్గరకి రాకుండా జాగ్రత్త పడుతోంది మా కోడలు. తెలీక వాళ్ళు నా దగ్గరకి రాబోతే పెద్దపెద్ద కేకలేసేస్తోంది. ఎప్పట్నుంచో మా అబ్బాయి ఇంట్లో ఉంటున్నారు మా కోడలు అమ్మ, నాన్న. ఆవిడ నా వైపు రావాలంటే ముక్కుకి పైట కొంగు అడ్డం పెట్టుకుని వస్తోంది. ఇదేదో అంటువ్యాధా ఏమిటి అని నాకు భయం పట్టుకుంది. చుట్టాలు-పక్కాలు అందరూ పళ్ళు పట్టుకుని చూడడానికి వస్తున్నారు. మా చిన్న తమ్ముడి భార్య “ప్రాపంచిక విషయాలు వదిలేసి దైవ ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. మా అన్నయ్య పెళ్ళాం సర్జరీ అయ్యాక ఎన్నాళ్ళో  బతకలేదు” అంది. ఎడమభాగం అంతా భరించలేని నొప్పిగా ఉంటోంది, నేనున్న వైపు బాత్ రూంలో గీజర్ లేదు. అవతలి వైపు బాత్ రూంలో వేడినీళ్ళు పట్టుకుని ఆ బకెట్టు నేనే మోసి తెచ్చు కోవాలి. ఒకరోజు మా కోడలు తల్లి వైజాగ్ నుంచి వచ్చిన మా ఆడపడుచుతో ” ఇంక ఈవిడ పని అయిపోయిందిలే, తీసుకెళ్ళి మీ అవుట్ హౌస్ లో ఓ మంచంలో పడెయ్యి, మీ అన్నయ్యని ఎలాగూ హోమ్ లో పెట్టేసాం. ఆయన లేని జగ్గంపేటలో ఈవిడకేం పని?” అన్నది నేను వినాలని కాబోలు. మనుషులు ఎంత కఠినంగా ఉంటారు! మాటల్లో ముళ్ళు గుచ్చడం నేర్చుకుని ఉంటారు! ఎవరితోనూ గొడవలు పడే నైజం, ఓపికా ఎప్పుడూ లేవు నాకు. నా వయసు వాళ్ళెందరికన్నానో నేను ఆరోగ్యంగా ఉన్నానని అనుకొని ఇంకా నెల కూడా కాలేదు. జీవితం ఎంత తొందరగా  యవనిక జార్చుకొంది!

          బైట నీలి ఆకాశంలో తెల్లని మబ్బులు, కొబ్బరాకులు, ఆ ఆకుల మీదుగా వస్తున్న చల్లని గాలి అన్నీ దుఃఖాన్ని తెప్పిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటికీ యధాతథంగా ఉంటాయి. నేను మాత్రం ఉండను. బహుశా జీవితపు చివరి మెట్టు మీద ఉన్నాను. నాకు తెలీకుండానే కళ్ళు నీటి చెలమలవుతున్నాయి. క్రమంగా ఆహారం మీద హితవు పోయింది.హోమ్ కెళ్ళి చూస్తే మోహన్ దవడలు లోపలికి పోయి, కళ్ళు బైటికి పొడుచుకొచ్చి చిక్కి శల్యమైపోయాడు. “ఇంటికెళ్ళి పోదాం” అని ఒకటే గొడవ. గొప్ప అశక్తతతో ఇద్దరం కన్నీరు మున్నీరు అయ్యేవాళ్ళం. గీత రాసిన ‘మా  అమ్మకేం కాదు’ పోయెమ్ ఆంధ్రజ్యోతిలో చూసి రచయితలు చాలా మంది ఫోన్ చేసి ధైర్యం చెప్తూ మాట్లాడేరు. సర్జరీ తాలూకు డిప్రెషన్లో ఊళ్ళో ఉన్న ఏకైన ఆస్తి ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను. కాని, కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండే సరికి అదెంత తెలివితక్కువ పనో అర్థమైంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచీ నా బట్టలు నేనే ఉతుక్కుని మెట్లన్నీ దిగి ఆరబెట్టుకోవాలి. వంటయ్యి పెట్టే వరకూ టిఫిన్ కోసం, భోజనం కోసం ఎదురు చూడాలి. కళ్ళు తిరిగిపోతున్నా మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రికి నేనే తినాలి. గొప్ప పరాధీనపు బతుకది.

మూసిన గుప్పిట తెరవొద్దు
ఒంటరితనాన్ని ఏకాంతంగా
ఆస్వాదించడం నేర్చుకో
ఎవరికీ  భారం కావొద్దు

నీ చుట్టూ ఉన్నవాళ్ళే నీ బంధువులు –

అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని సరిగ్గా  నెలకి ఇంటికెళ్ళి పోయాను. కీమోలు, రేడియేషన్లూ ఏవీ వద్దు. ఏం జరిగితే అదే జరగనీ అనుకున్నాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.