యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-9

బ్లూ మౌంటెన్స్ డే ట్రిప్ (Blue Mountains Day Trip) తరువాయి భాగం 

మరో అయిదునిమిషాల తరవాత త్రీ  సిస్టర్స్ శిలల్ని వెనుక నుంచి చూడగలిగిన బుష్‌ ట్రయిల్ దగ్గిర ఆగేం. అయితే రహదారి సరిగా లేనందు వల్ల, పది నిముషాలు మాత్రమే సమయం ఉన్నందు వల్ల అందరం వెళ్ళలేదు.

          అక్కణ్ణించి సరాసరి బ్లూ మౌంటెన్స్ సీనిక్ వరల్డ్ కి వెళ్ళేం. ఇక్కడ మొత్తం నాలుగు విశేషాలుంటాయి. 

          సీనిక్ స్కై వే, సీనిక్ కేబుల్ వే, సీనిక్ రైల్వే, సీనిక్ వాక్ వే. 

          వీటన్నిటికీ టిక్కెట్లు మా ప్యాకేజీ టూరులో భాగం కావడం వల్ల ముందుగా ఎంట్రన్స్ లో మా అందరికీ  తలా ఓ హ్యాండ్ బ్యాండ్ ఇచ్చేరు. 

          మొదటిది సీనిక్ స్కై వే. సీనిక్  వరల్డ్ తూర్పు స్టేషన్ నించి సీనిక్  వరల్డ్ టాప్  స్టేషన్ వరకు రెండు శిఖరాల మధ్య గాల్లో ప్రయాణం పది నిముషాలు. మొత్తం 85 మంది వరకు ఎక్కగలిగిన పెద్ద గాజుగది లాంటి రోప్ వే అది. గాల్లో ఎగిరే ట్రాములాగా ఉంటుంది. మా వ్యానులో వచ్చిన వాళ్ళతో బాటూ మరో పది మందితో కలిపి లోపలికి వెళ్ళిన వెంటనే స్కై వే కదిలింది. లోపలికి ఎక్కగానే మధ్య ఒక గట్టు లాంటిది, అటూ, ఇటూ అయిదారు కుర్చీలు ఉన్నాయి. మిగతా అంతా నిలబడాల్సిందే. ఇక స్కైవే కదలగానే మధ్య గట్టు తెరుచుకుంటుంది. అది నిజానికి గ్లాస్ బాటమ్ అన్నమాట. కాళ్ళ కింద గాజులో నుంచి చూస్తే లోయ మీద నిల్చుని కదులుతూన్నట్టే ఉంటుంది. నచ్చినవాళ్ళు ఆ గాజు మీద నడవొచ్చు. 

          ఇక చుట్టూ నిలబడ్డ వాళ్ళకి ఒక పక్కగా అందమైన సన్నని జలపాతం, మరో వైపు కాస్త దూరంగా త్రీ సిస్టర్స్ పర్వతాలు కనువిందు చేస్తూ ఉంటాయి. నిజానికది చాలా అద్భుతంగా అనిపించినా ఎక్కినట్టే లేకుండా వెంటనే దిగిపోవాల్సి ఉండడం లోటుగా అనిపించింది. 

          అది దిగంగానే రెండో విశేషం వైపు దారితీసేడు గైడు. అక్కడ సీనిక్ వరల్డ్ టాప్  స్టేషన్ నించి కొండ కిందికి నిలువుగా ప్రయాణించే సీనిక్ రైల్వే ఎక్కేం. అసలు పెట్టెలు నిలువుగా కిందికి వెళ్ళాడుతున్నట్టు ఉండడం చూస్తేనే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. ఒక్కొక్క సీటులో నలుగురు పట్టే విధంగా ఎమ్యూజ్ మెంటు పార్కులో ఏదో రైడ్ ఎక్కినట్టు కూచున్నాం. చుట్టూ అద్దాల తలుపులతో మూసి వేసినా మొత్తం నాలుగు పెట్టెల్లో 84 మంది పట్టే రైలు బండిలో చివరి పెట్టెలో దాదాపు చివరి సీటులో కూర్చున్నందు వల్లో, కాళ్ళని కింది సీటుకి తన్నిపెట్టి కాచుకుని కూర్చున్నందు వల్లో ఒక్క ఉదుటున కిందికి  పడే బండి కదలగానే భలే భయం వేసింది. దాదాపు ఒక్క నిమిషం పాటు ప్రయాణం అది అంతే. కానీ చాలా తమాషాగా, కొత్తగా ఉంది. 

          అక్కణ్ణించి సీనిక్ వాక్ వే ప్రారంభమవుతుంది. దాదాపు కిలోమీటరున్నర పాటు చుట్టూ దట్టమైన చెట్ల మధ్య నించి నిర్మించిన చెక్క దారి గుండా నడవాల్సి ఉంటుంది. బాటకి మొదట్లోనే ఉన్న కతూంబా బొగ్గు గని (Katoomba Coal Mine) ఉంది. నిజానికి మేం దిగి వచ్చిన పట్టాల దారిని  ఒకప్పుడు ఈ బొగ్గుగనిలో తవ్విన బొగ్గుని పెట్టెల్లో నింపి పైకి పట్టుకెళ్ళేందుకు ట్రామ్ వే గా వాడేవారు. గని నించి ట్రాము వరకు బొగ్గుని తొట్టెల్లో గుర్రాల సాయంతో పట్టుకెళ్ళేవారు. ఇక  సీనిక్ వాక్ వే లో అక్కడి ప్రత్యేకంగా కనిపించే  లైర్ పక్షుల (Lyrebirds) గురించి, గొడుగుల్లా ఆకాశంలోకి విసరించిన ఇక్కడి ప్రత్యేకమైన పామ్ చెట్లు మొ.న విశేషాల్ని వివరిస్తూ ముందుకు చకచకా నడుస్తున్న గైడుని అనుసరిం చేం. 

          అక్కణ్ణించి మళ్ళీ పైకి సీనిక్ వరల్డ్ టాప్ స్టేషన్ కి చేరడానికి ఈ సారి మెట్ల గదిలా ఉన్న రోప్ వే ఎక్కేం. 

          84 మందిని ఒక్కసారి తీసుకెళ్ళ గలిగే కేబుల్ వే ఇది. సరిగ్గా 8 నిమిషాల్లో పైకి వచ్చేసాం. 

          ఈ రైడ్లన్నీ ఎక్కడా లైనుల్లో వెయిటింగు లేకుండా చకచకా ఎక్కి దిగిపోవడం వల్లనో ఏమో ప్రతిసారీ “అయ్యో! అప్పుడే అయిపోయిందా” అని అనిపిస్తుంది. 

          సిడ్నీ వెళ్ళినవారు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఈ సీనిక్  వరల్డ్ . 

          దాదాపు 11.30 ప్రాంతంలో బోర్స్ హెడ్ లుకవుట్, కాహిల్స్  లుకవుట్ల దగ్గిర వ్యాను ఆపేడు. సరిగ్గా పదిహేను నిమిషాల స్టాపు అది. సిమెంటు బాట, మెట్ల దారి గుండా అయిదు నిమిషాల నడక అది. మెరిసే వెచ్చని ఎండకి గాలి తోడయ్యినందు వల్ల నును వెచ్చగా ఉండి ఆహ్లాదంగా ఉన్న ఆ రోజు అక్కణ్ణించి కనిపించే విశాలమైన లోయని, కనుచూపుమేర నించి ఆకాశంలోకి నీలంగా విస్తరించిన పర్వతసానువుల్ని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. 

          అక్కణ్ణించి దగ్గర్లో ఉన్న లారా (Leura) అనే ఊళ్ళో ఉన్న అలెగ్జాండ్రా హోటలు రెస్టారెంటులో భోజనానికి ఆగేం. విక్టోరియా పద్ధతిలో ఉన్న పెద్ద టేబులు చుట్టూ వ్యాను లో వచ్చిన అందరం కూర్చుని భోజనం చెయ్యడం విశేషంగా అనిపించింది. మాకు ఉదయం దారిలోనే మెనూ ఇచ్చి ఏమేం కావాలో ఆర్డర్ చేసుకోమనడంతో మేం అక్కడికి వెళ్లిన అయిదు నిమిషాల్లోనే భోజనం సిద్ధం అయ్యింది. ఫిష్ , చికెన్, వెజిటబుల్స్ & ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ రుచిగా ఉన్నాయి. అన్నిటినీ మించి వ్యానులో వచ్చిన వాళ్ళందరం ఒకరికొకరం పరిచయమయ్యి చక్కగా కబుర్లు చెప్పుకున్నాం. హాంగ్ కాంగ్ నించి వెళ్ళి సింగపూర్ లో స్థిరపడ్డ వాళ్ళు, ఇంగ్లాండు నించి వెళ్ళి దుబాయ్ లో స్థిరపడ్డ వాళ్ళు, మాలాగా ఇండియా నించి వెళ్ళి అమెరికా లో స్థిరపడ్డ వాళ్ళు…ఇలా ప్రపంచంలోని అన్ని మూలల్నించి వచ్చిన వాళ్ళం ఉన్నామని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. అక్కడ ఆ కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాం. ఇక ఆ రోజంతా గ్రూపులోని పిల్లలంతా కలిసి తిరగ సాగేరు. పెద్దవాళ్ళం కూడా ఒకళ్ళకొకళ్ళం గ్రూపు ఫోటోలకి సహాయం చేసుకుంటూ, సాయంత్రానికి పరిచయం పెరిగి ఫోను నంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నాం. అలా ఈ టూరు చాలా సరదాగా గడిచింది. 

          భోజనం తరువాత బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్కులో చివరి స్టాపు లింకన్స్ రాక్ దగ్గిర ఆగేం. పార్కింగ్ నించి ఫర్లాంగు దూరంలో ఏకశిలలాగా ఉన్న వెడల్పాటి కొండ కొమ్ము ఈ లింకన్స్ రాక్ అనే ప్రదేశం. 

          ఆ రాతిమీద చెక్కిన అనేక పేర్లని దాటుకుంటూ రైలింగుల్లేని ఆ కొండ చివర కాళ్ళు వేళ్ళాడేసి కిందికి కూచుని తన్మయత్వంలో తేలుతున్న వారిని చూసి పడతారేమోనని భయం వేసింది. కానీ కొండ చివర కాళ్ళ కింద మరో వరుస వరకు కొండ పరుచుకుని ఉంది. ఇసుకరాయి కావడం వల్ల విసురుగాలికి ఎప్పటికప్పుడు చివరి రాళ్లు  కొట్టుకు పోతున్న నిదర్శనంగా ఎక్కడిక్కడ కోసుకుపోయి ఉంది. కాస్సేపు అక్కడ గడిపితే బావుణ్ణనిపించినా సమయం లేకపోవడంతో వెలితిగా అనిపించింది. 

          మరో గంటలో “ఫెదర్ డేల్ వైల్డ్ లైఫ్ పార్కు”(Featherdale wildlife park) కి వచ్చే వరకు ఎక్కడివాళ్ళం అక్కడ పడి నిద్రపోయేం.

          ఈ ఫెదర్ డేల్ జంతు సంరక్షణా కేంద్రంలో ఈమూలు, కొయాలాలు, కంగారూలు, వాలబీ (wallaby) లు, పెంగ్విన్లు, కాకటూలు (cockatoo) మొ.నవెన్నో ఉన్నాయి. వాలబీలు చిన్న కంగారూలన్నమాట. కాకటూలు నెత్తిన పసుపుపచ్చని కుచ్చుకలిగిన  తెల్లని, అందమైన  చిలుకలు. ఇక్కడ కొయాలాలతో ఫోటోలు తీసుకోవచ్చు, కంగారూలు, వాలబీలు, చిలకలకి మేతకొని తినిపించొచ్చు. ఇక అక్కడున్న గంటసేపు పిల్లల సందడి అంతా ఇంతా కాదు. కొయాలాతో ఫోటో తీసుకుంటున్నప్పుడు అచ్చం టెడ్డీ బేర్ లాగా మెత్తగా ఉండి, కొమ్మని పట్టుకుని తపస్సు చేస్తున్నట్టు కదలకుండా మెదలకుండాఉన్న  కోయాలాని ముట్టుకున్నపుడు దాని ఒంట్లోని వెచ్చదనం మా ఒంట్లోకి ప్రవహించినట్టయ్యి ఒళ్ళు గగుర్పొడిచింది. వాలబీ కడుపులోని సంచీలో ఉన్న పిల్ల కిందికి దూకగానే ఎర్రని రక్తపు గాయం తెరిచి ఉన్నట్టున్న సంచీని చూడగానే కడుపులో దేవినట్లయ్యింది.  కంగారూలకి తినిపిస్తున్నపుడు తన చిన్న కాలితో తినిపించే  చేతిని పట్టుకుని మరీ తింటున్న కంగారూని చూసినప్పుడు ముచ్చటేసింది. మొత్తంమ్మీద ఇక్కడ అన్నీ ఇప్పటి వరకు ఎక్కడా కలగని కొత్త అనుభవాలే. 

          సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఒలింపిక్ పార్క్ అన్న చోటి నించి సిడ్నీ సెంట్రల్ కి మమ్మల్ని పడవ ఎక్కించి మా అందరి దగ్గిరా సెలవు తీసుకున్నాడు వ్యాను డ్రైవరు. అయితే ఆ చోట మా టిక్కెట్లు తీసుకొనడానికి మెషిన్ పనిచెయ్యడం లేదు కాబట్టి పడవ టిక్కెట్టు డబ్బులు వాపసు ఇచ్చి క్రెడిట్ కార్డు సాయంతో లోపలికి వెళ్ళమని చెప్పేడు. మేం అందరిలానే ఒక్కసారి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి  లోపలికి వెళ్ళిపోయేం. పది నిమిషాల్లో పడవరాగానే ఎక్కి కూచుని దార్లో కనబడ్డ సుందర దృశ్యాల్ని ఆస్వాదిం చాం. అక్కణ్ణించి సిడ్నీకి వెళ్ళే దార్లో వరసగా ప్రతి అయిదు నిముషాలకొక బోటు స్టాపు ఉంది.  స్టాపు రాగానే పడవలో పనిచేసే ఇద్దరు యువకులు చకచకా తాడు ఒడ్డునున్న గుంజకి విసిరి కట్టి, చిన్న వంతెనని పరుస్తూ, ప్రయాణీకులు ఎక్కగానే మళ్ళీ అన్నీ సర్దేయసాగేరు. నగర పరిసర ప్రాంతాల్నించి సిటీ సెంట్రల్ కి వెళ్ళడానికి ఇది మంచి ట్రాన్స్పోర్టు ఇక్కడ. 

          అయిదున్నర ప్రాంతంలో డార్లింగ్ హార్బరు దగ్గిరికి చేరుకున్నాం. తీరా దిగేవేళ మా టిక్కెట్లు తీసుకున్న క్రెడిట్ కార్డు మళ్ళీ  గీస్తే ఒక్కర్ని మాత్రమే బయటికి వదలుతోంది ఆ గేటు. నిజానికి అక్కడ ఇలా వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెపరేటు క్రెడిట్ కార్డు ఉండాలి. విషయం తెలియక మేం, మాతో వచ్చిన అందరం తెల్లమొహాలేసాం. ఇక చేసేదేమీ లేక గేటు కీపర్ కి విషయమంతా వివరించాం. అతను ఇంకోసారి వచ్చేటపుడు ఇలా చెయ్యవద్దని చెప్పి మమ్మల్ని దయతో బయటికి పంపాడు. అక్కడేమీ అపశృతి దొర్లనందుకు సంతోషించి బయటికి వచ్చాం.  

          మొత్తానికి ఆ ఒక్కరోజు టూరులోనే ఆస్ట్రేలియాలోని అన్ని రకాల వాహనాలని ఎక్కి దిగేసేం.

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.