కొత్త అడుగులు – 47

రావి దుర్గాప్రసన్న- మనోతరంగాలు

– శిలాలోలిత

          రావి దుర్గాప్రసన్న రాసిన తొలి కవితా సంకలనం ‘మనోతరంగాలు’.  ఇది 2017 లో వచ్చింది. ఒక లాయర్ కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో మనమే కవితల్లో చూడవచ్చు. 1984 నుంచి మొదలైన కవిత్వ ప్రచురణ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండటంతో జీవితపు మరో ముఖం ఈమె కవిత్వం అని చెప్పాలి.

          వివిధ అంశాల పైన ఎప్పటికప్పుడు రాసిన కవితలు, లీగల్ అవేర్నెస్ క్యాంపులలో ప్రసంగాలు, రాజకీయ సమీక్షలు, వ్యాసాలు మాత్రమే కాక న్యాయ సలహాలు ప్రముఖ పత్రికలలో అనేక సంవత్సరాలుగా ప్రచురింపబడుతున్నాయి. ప్రశంసలు పురస్కారాలు అనేకం అందుకున్నారు.

          టీవీ చానల్స్ లో, ఆలిండియా రేడియోలో, దూరదర్శన్ లో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండటం ఈమె సామాజిక బాధ్యతకు నిదర్శనం. ఇప్పటి వరకు భూమిక, చైతన్య మానవి, విశ్వ రచన, ప్రస్థానం గ్రీన్ క్లైమేట్, మనవెలుగు, చినుకు, కలాలు-గళాలు కవి సమ్మేళనాలు , నేటి నిజం, ఆంధ్ర ప్రదేశ్ మహాపత్రిక సాహిత్య కిరణం, ఎంప్లాయ్మెంట్ న్యూస్, హాస్య కవితల సంకలనం వంటి ప్రముఖ పత్రికల్లో తరచు ఈమె కవితలు మొదలైనవి వస్తుండేవి.

          కొత్త కవయిత్రులను పరిచయం చేయడమే ఈ కాలం ఉద్దేశం కాబట్టి ఈసారి దుర్గా ప్రసన్న పరిచయం. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు. స్త్రీలకు జరుగుతున్న ఎన్నో అన్యాయాలను వివక్షను, సమాజ రీతిని ఎదుర్కొంటున్న ఎందరెందరినో అనేక పార్శ్వలతో పరిశీలించిన అక్షరాలవి. ఆమె అక్షరాల్లో నిజాయితీ ఎంతో ఉంది. వేదనలో నిబద్ధత ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడంలో ధైర్యం ఉంది.

ఇక కవిత్వంలోకి వెళితే ‘అపరాజిత’  కవితలో–

నేను ఎక్కు పెడితే బాణాన్ని
కప్పి పెడితే విత్తనాన్ని
అణిచిపెడితే ఆక్రోసాన్ని
నొక్కి పెడితే ఎగసే జ్వాలని
అణువంతే అయినా విస్ఫోటనాన్ని
నేను అపరాజితను..

-అని నిర్ణయ ప్రకటన గట్టిగా వెల్లడించింది. స్త్రీల సమస్యలు ప్రధానంగా కవిత్వీకరించ బడ్డాయి. కొన్ని కవితలు ముగించిన తరువాత ఆలోచనలోకి జారిపోయేటట్లుగా ఉన్నాయి. ఫీల్ కనబడింది. ఎక్కువగా తన దృష్టికి వచ్చిన, ఘర్షణకు గురిచేసిన నిజాలన్నింటినీ వస్తువుగా తీసుకుంది. న్యాయం చేయడానికి ప్రయత్నించింది. 3,4 కవితలకు పైగా స్త్రీకి తన గర్భసంచి పై అధికారం కోల్పోయి ఆడపిల్లను చంపాలని చూసే వ్యవస్థను ఈసడిస్తూ రాసింది. గర్భస్థ ఆడ శిశువు తల్లితో సంభాషిస్తూ ఓ కవిత ఉంది.

          ‘బంగారు సంకెళ్ళ’ ని వివాహం పేరిట తొడుక్కున్న స్థితులను గమనించి –

యుగాలనాటి దౌర్భాగ్యాన్ని దౌర్బల్యానికి చిహ్నంగా బంధం పేరుతో ‘నన్ను’ మాత్రమే కట్టి ఉంచిన కనబడని సంకెళ్ళు..

నేను అల్లికల వలలో చిక్కుకొని
ఊపిరాడక ఆర్తనాదాలు చేస్తున్నా
ఒక్కరూ చేయి అందించ రండి
సంకెళ్ళు నా  తనువును బంధిస్తే
ఆ సంకెళ్ళ బరువు
నా గొంతుని నొక్కి పెట్టినట్లుంది

                      ***

నన్ను నేను ప్రశ్నించుకోగా
నాకు నేను అర్థం అవుతున్నాను
నాలో ఆలోచనల చైతన్యం
వెలుగులై నా చుట్టూ నిండింది
సంకెళ్ళు పసిడి సంకెళ్ళయిన సరే
తెంచుకోక తప్పదు

                      ***

నీ దృష్టిలో
నీకు – యజమానిగా గుర్తింపూ
నాకు – నీ సొత్తుగా పరిగణింపూ
అందుకే ఈ బంధం నాకు సంకెళ్ళు అయ్యింది…

          దీనికి వేరుగా వివరణ అవసరం లేదు. అర్థమైపోతూనే ఉంది. తన గురించి తాను తవ్విన క్షణాల్లో వచ్చిన చైతన్య రేఖలను స్పష్టంగా వివరించింది. భాషలో సరళత, భావంలో గాంభీర్యం, విషయం పట్ల అవగాహన, తన తోటి స్త్రీలతో సమాజంలోని ఇతర విషయాల పైన కూడా ఒక ఆరాటం. ఈమె కవితలన్నింటి ధ్వని. భాష పటాటోపాలు లేని స్వచ్ఛమైన అడుగులివి. మరికొంత గట్టిగా ప్రయత్నిస్తే చిక్కని కవిత్వాన్ని తప్పకుండా మునుముందు రాయగలదనిపించింది.

          ఇంకా ఉదాహరించదలిస్తే చాలా కవితలు మేమున్నామని ముందుకు వస్తున్నాయి.  ప్రస్తుతానికి ఆపుతూ మంచి కవిత్వాన్ని, వివిధ అంశాలను క్రోడీకరిస్తూ తాను ఒక కవయిత్రిగా స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రసన్నను అభినందిస్తూ ప్రస్తుతానికి సెలవు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.