ఒక నాటి మాట

-కాళ్ళకూరి శైలజ

          “మీ ఆయనకి నాలుగో తరగతి నుంచి పరీక్ష ఫీజులు నేనే కట్టానమ్మా. చిన్న మావయ్యా ! అంటూ నా చుట్టూ తిరిగేవాడు”. శిల్ప నవ్వుకుంది. రాహుల్ కూడా నవ్వాడు.
ప్రేమ వివాహం అయ్యాక ఇరుపక్షాల వాళ్ళు ఇంకా వేడిగా ఉండటంతో రాహుల్ శిల్పని పూనాలో ఉన్న తన మేనమామ రాధాకృష్ణ గారింటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి లోనవ్లా వెళ్లాలని వాళ్ళిద్దరి ప్లాన్. తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉండటంతో రాధాకృష్ణ గారికి పెద్ద పట్టింపులు లేవు. పైగా చిన్నప్పటి ప్రేమ, ఆప్యాయత వల్ల రాహుల్ శిల్పను అక్కడికి తీసుకెళ్లాడు.

          రాత్రి భోజనాలయ్యాక అటూఇటూ పచార్లు చేస్తూ రాధాకృష్ణ మళ్ళీ కబుర్లు చెబు తున్నాడు. “వినాయక చవితి వస్తే చాలమ్మా! మీ ఆయన కొత్త బట్టలడిగేవాడు. అలా మొదలెట్టింది డిగ్రీ పూర్తయ్యే దాకా అదే రివాజు. చవితికి కొత్త చొక్కా కొనకపోతే మీ పిన్ని గారికి కూడా మనసు తృప్తిగా ఉండేది కాదు. ఏం, పూర్ణిమా ,అంతేనా?”, అన్నారు.
“రాహుల్ నాన్నకి,అదే మీ మావగారికి ఫిట్స్ జబ్బుంది. ఓసారి రైల్వే కాంట్రాక్ట్స్ చేస్తుండగా ఆరడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తుంటి కీలుకి ఆపరేషన్ చేశారు.

          ముందుగా ఎముకల డాక్టర్ దగ్గరికి. మా బావకి సిగిరెట్ అలవాటులే! సిగిరెట్ తాగి తాగి దగ్గుకి మరో డాక్టర్ దగ్గరికి. జ్వరం వస్తే ఇంకో డాక్టరు.బీపీకి మరొకరు. కాలు నొప్పి కొకరు. ఫిట్స్ కి ఎలానూ ప్రతి నెలా వెళ్లక తప్పదు.రాత్రిపూట నిద్ర పట్టక మానసిక డాక్టర్ దగ్గరికి. ఇలా మందులు వాడి వాడి మొహం మీద, ఒంటి మీదా నల్ల మచ్చలొచ్చాయని చర్మ వ్యాధుల డాక్టర్. డాక్టర్లకి, మందులకి, రిక్షా వాళ్లకి… చూస్తూ ఉండగా ఆరేళ్లలో ఆయన సంపాదనంతా హారతిలా కరిగిపోయింది. వాళ్ళమ్మ ఓపికకి మెచ్చుకోవాలి. పాపం. పుట్టింటి వాళ్లిచ్చిన నగలమ్మి, రాహుల్ అక్కలిద్దరి పెళ్లిళ్లు చేసింది. మేమంతా నిలబడ్డా మనుకో పెద్ద మనుషులుగా. లేకపోతే ఆడపిల్ల పెళ్ళిళ్ళౌతాయా? ఏరా?”, రాహుల్ కూర్చున్న సోఫా దగ్గర ఆగి అడిగి, మళ్ళీ పచార్లు మొదలు పెట్టారు.రాహుల్ కాస్త ఇబ్బందిగా కదిలి, అయినా కూర్చునే ఉన్నాడు.

          “ఎలాగో మనోడికి చదువొచ్చింది. ఏ మాటకామాట! ఏ ట్యూషన్లూ చెప్పించలేదు . అంతా సొంత చదువే. పుస్తకాలు కూడా పాపం ఏదో తంటాలు పడి ఎక్కడో సంపాదించు కున్నాడు.

          ఉత్కళ యూనివర్సిటీలో పీజీ చేసాక ఉద్యోగానికి మీ ఊరొచ్చాడు. ఆ తర్వాతంతా నీకే తెలుసుగా?!” అన్నాడాయన .

          ఔను!శిల్పకి తెలుసు.

          రాహుల్ ముంబైలో సబర్బన్ ఏరియాలో ఓఎన్జిసిలో ఉద్యోగానికి చేరి, రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాడు.ఆ ఇంటి ఓనర్ కూతురే శిల్ప.ఈడు, జోడు, మనసు అన్నీ కుదిరాయి. పక్కన చేరి పక్కలో బల్లెమై వాళ్ళమ్మాయి మనసుకి కన్నం వేశాడని శిల్ప వాళ్ళ అమ్మానాన్న రాహుల్ మీద కక్ష కట్టారు. ఆడపిల్ల వారికే అంతుంటే మాకెంత ఉండాలని రాహుల్ తల్లీ, పెద్దవాళ్ళు అలిగి కూర్చున్నారు.

          కానీ రాహుల్ , శిల్పా వీటన్నింటినీ దాటి ముందడుగు వేశారు. పెళ్లైన రెండు నెలలకి ఇప్పటికి, హనీమూన్ కి కాస్త వీలు చిక్కింది.

          రాధాకృష్ణ టీవీ కట్టేసి “ఫ్రెష్షవ్వండి అదో ఆ గది మీకు. పూర్ణా! వంట సరే,కొంచెం ఇలా వచ్చి అమ్మాయిని మాట్లాడించూ”, అని పిలిచారు.

          మరో గంట తర్వాత ,

          “అమ్మాయ్! మీ ఆయన సెవెంత్ చదువుతుంటే మెట్ల మీంచి జారి, కింద పడ్డాడు.చెయ్యి విరిగితే, అమ్మా,నాన్నా అని కాక చిన్నమామయ్యా! అని ఏడిచేడటమ్మా.. “, పెద్దగా నవ్వుతూ చెప్పారు రాధాకృష్ణ గారు.

          ఆరోజు మధ్యాహ్నం భోజనంలో రాహుల్ కి ఇష్టమైనవన్నీ చేసి కొసరి కొసరి వడ్డిస్తూ, “మీ ఆయనకి చిన్నప్పటి నుంచి నడకంటే ఇష్టం లేదు.. ఎప్పుడూ ఏదో బండి గోలే ! సైకిల్ నుంచి లాంబ్రెట్టా స్కూటర్ దాకా వాడి ముద్దు మురిపాలన్ని తీర్చింది నేనే! ఏరా ?”, అంటూ రాహుల్ కేసి చూస్తూ కన్నుగీటారు.

          “ఔనౌను మావయ్యా ! గుర్తుంది నాకు”, అన్నాడు రాహుల్ మరి కాస్త ఇబ్బందిగా.
మర్నాడుదయం బయలుదేరుదాం అనుకుంటూ ఉంటే, దేశమంతటా రైతుల స్ట్రైక్ తో భారత్ బంద్ ప్రకటన వచ్చింది. “దొరికాం రా బాబూ !”, అనుకున్నాడు రాహుల్. ఓ పక్క రాధాకృష్ణ గారు,మరోపక్క అత్తయ్య, ఇద్దరూ గతంలో కూరుకుపోయారని చెప్పాలి. 20 ఏళ్ల నాటి సంగతులు

          “అదేమిట్రా ? యాపిలా? ఆరంజా? ఏదో పండు పేరు… అసలా పేరెందుకు పెట్టేరో, ఏంటో ఆ సినిమా!మీ రాహుల్ కి ఎంతో నచ్చేసింది.ఆ పాటికి నాలుగు సార్లు చూసాడు.మళ్ళీ నేను పనిమీద మా నాన్నని కలవడానికెళ్తే, నన్ను తీసుకెళ్తానని పట్టు పట్టాడు. ఈ కొత్త కుర్రాళ్ళ సినిమాలు చూడలేక టిక్కెట్ డబ్బులు మాత్రం ఇచ్చి,నేను తప్పించుకున్నాను. ఏరా ఎప్పుడూ నువ్వా పాటలు పాడుతూ ఉండేవాడివి కదూ!”, అన్నట్టు ఇప్పుడా హీరోయిన్ బోలెడు రీల్స్ చేస్తుంది.మీరు చూస్తారా? జెనీలియా కదూ”.
రాధాకృష్ణ గారు ఏం చెప్పినా అదంతా శిల్పకి రాహుల్ బాల్యంలా కనిపిస్తోంది. ఆమె రాహుల్ కేసి ఆరాధనగా చూస్తోంది. రాహుల్ కి మాత్రం గాలి తీసిన టైర్లా, ఫ్లాట్ గా ఉంది మనసంతా. ఏకాంతం దొరికాక శిల్ప అడిగింది,”రాహుల్ ఇంతకీ ఆరెంజ్ అని పేరెందుకు పెట్టారు ఆ మూవీకి?”. అప్పటికే ఆ సినిమా గురించి తన దోస్తులతో ఎన్నోసార్లు డిస్కస్ చేసి ఉన్న అనుభవంతో రాహుల్, ” ఓ!అదా! ఈ పెద్దవాళ్ళకి సింబాలిజం అంతగా తెలియదు శిల్పా! అదేం పండు పేరు కాదు.’ఆరెంజ్ ‘అనేది ఒక కలర్.అటు రెడ్ లాగా
స్ట్రాంగ్ కాదు ; ఇటు తెలుపులా శూన్యమూ కాదు. ఆరెంజ్ అంటే హృదయ వైశాల్యం. ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించడం. మా అందరికీ ఆ మూవీ చాలా నచ్చింది”,  అంటూ వివరంగా చెప్పాడు రాహుల్. రాహుల్ చేతిని శిల్ప ప్రేమగా నొక్కింది. భోజనం చేస్తుంటే మావయ్య, “ఏరా ఇంకా గోంగూర చికెన్ కర్రీ తింటున్నావా? మానేశావా?అమ్మా వీడికదంటే ప్రాణం. సెలవులకొస్తే వారంలో రెండు సార్లు చేసేది మీ పిన్ని గారు.నేను తిడతానని వాడికి ప్రత్యేకం వండి పెట్టేది.మరిప్పుడు ఏం తింటున్నాడో? ఇష్టాలేమైనా మారిపోయాయో… ఏమిటో”, అన్నాడు.

          ఆ రాత్రి గడిపి ఉదయం ఇద్దరూ బయటపడ్డారు. కరెక్ట్ గా బయలుదేరబోతుంటే “ఏరా రాహుల్ !షూస్ జాగ్రత్తగా వేసుకున్నావా? ఎదవ వీడు పరీక్ష పాసైతే చాలు, కొత్త షూ సాక్స్ కొని తీసుకెళ్లాల్సిందే! లేకపోతే మొహం మాడ్చుకుని ఉండేవాడు అవి కొన్నాక కాస్త అయ్యవారికి నవ్వొచ్చేది!”,అన్నాడు రాధాకృష్ణ.

          “సర్లేండి! ఆ పిల్ల ముందు ఇంకా ఎంత చెప్తారు మీ గొప్పలన్నీ. మీరు వెళ్ళి రండమ్మా! వస్తూ పోతూ ఉంటేనే చుట్టరికం” అంది పూర్ణ.

***

          “ఏంటీ ,మా‌ మావయ్య చెప్పినవన్నీ విని ఏమనుకున్నావ్?” రాహుల్ అడిగాడు శిల్పని. “ఆయనకి మీరంటే పిచ్చభిమానం అని. కంటికి రెప్పలా మిమ్మల్ని పెంచారని ” అన్నది శిల్ప. రాహుల్ రిలాక్స్ అయాడు.

          నాలుగు నెలల్లో అనుకోని వార్త ఎదురైంది. చిన్న మావయ్యకి హార్ట్ ఎటాక్ అట”, గాబరాగా చెప్పాడు రాహుల్ …

          “వెళ్ళు రాహుల్! అసలే వాళ్ళబ్బాయి దూరంగా ఉన్నారు”, అంది శిల్ప.
ఐదు రోజుల తర్వాత ఆయన్ని ఆస్నుంపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు.
“అత్తా! మరి నేను రేపు సాయంకాలం ఫ్లైట్ కి వెళ్తాను.” అని చెప్పాడు రాహుల్
“హాస్పిటల్ బిల్లు ?”, అంది పూర్ణ.

          “మామయ్యని నా గార్డియన్గా రికార్డు చేశాను అత్తా. ఇన్సూరెన్స్ వస్తుందిలే. నువ్వు వర్రీ కాకు. అన్నట్టు ఇకమీదనైనా మన మధ్య ప్రేమ,ఆప్యాయత తప్ప పెట్టుబడులు, ఇచ్చిపుచ్చుకోవడాలు లెక్క ఉండకూడదని మా ఇద్దరి మాటగా చెప్పు అత్తయ్య. దీనికి
మీరిద్దరూ ఓకే అనుకుంటే మాకు ఫోన్ చేయండి.మళ్లీ నెల శిల్పా , నేనూ వస్తాం.” బెడ్ రూమ్ బయట సోఫా మీద కూర్చుని రాహుల్ అన్న మాటలు రాధాకృష్ణకి కూడా విన బడ్డాయి.

*****

Please follow and like us:

5 thoughts on “ఒక నాటి మాట (కథ)”

  1. అనుబంధం ఉంటె రక్త సంబంధం అవసరంలేదు అని రాహుల్ కి ,అతని మామతో ఉన్న రుణబంధాన్ని చాల చక్కగ చిత్రీకరించారు శైలజ గారు ! ధన్యవాదములు .

  2. వాళ్లకు అది మురిపమో, మరోటో కాని రాహుల్ కి అది నిజంగా ఇబ్బందే.. తీర్చలేని రుణం లా. చక్కని ముగింపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.