క ‘వన’ కోకిలలు – 20 : 

కమలా దాస్

   – నాగరాజు రామస్వామి

మదర్ ఆఫ్ మాడరన్ ఇంగ్లీష్ పొయెట్రి (31 March 1934 – 31 May 2009)

“నేను మలబార్ లో పుట్టిన భారతీయ మహిళను. మూడు భాషల్లో మాట్లాడుతాను, రెండు భాషల్లో రాస్తాను, ఒక భాషలో కలలు కంటాను”- కమలా దాస్.

          కమలా దాస్  ‘మాధవి కుట్టి’ కలంపేరుతో, మళయాలం, ఇంగ్లీషు భాషలలో  బహుళ కవిత్వం రాసిన కవయిత్రి. మాధవ కుట్టి పెళ్ళి తర్వాత కమలా దాస్ అయింది. ముస్లిమ్ మతంలోకి మారాక కమలాసురయ్యా అయింది. 

          ఆధునిక ఆంగ్ల కవిత్వ ఆదిమాత (Mother of modern English poetry) కమలా దాస్  మళయాళంలో కథానికలు రాసి లోకప్రియ అయింది. ఆంగ్లంలో సమగ్ర ఆత్మకథ, విస్తృతంగా కవిత్వం, నవలా సాహిత్యం, స్మృతి రచనలు రాసి ఖ్యాతి పొందింది. స్త్రీ సమస్యలు, శిశు సంరక్షణ, పాలిటిక్స్ వంటి అనేక విషయాలతో ఆమె రాసిన పత్రికా శీర్శికలు( Columns) జన ప్రసిద్ధమయ్యాయి. ఏకంగా కాలమిస్టుల సిండికేటే నడిపింది. కమలా దాస్ ది ప్రాయికంగా అపరాధభావ కవిత్వమే (Confessional poetry) అయినా, స్త్రీ సహజమైన లైంగికత పై విచ్చలవిడిగా రాసి గత సంస్కారాలను తిరస్కరించే తిరుగుబాటు కవయిత్రిగా (iconoclast) పేరు తెచ్చుకుంది. హిందూ సంప్రదాయ నాయర్  కుటుంబంలో జన్మించి, సంపన్నుడైన రాయల్ సంతతి చెందిన మెనన్  ను పెళ్ళిచేసుకొని,  65వ ఏట ముగ్గురు పిల్లల తల్లి ముస్లిమ్ మతంలోకి మారిపోయింది. అందుకు, ఆమె తనకన్నా చిన్న వాడైన ముస్లిమ్ ప్రొఫెసర్ ప్రేమలో పడటం ఒక  కారణం అయితే, భర్తకు ఆడంగి లక్షణాలు ఉండటం మరొక కారణం. 

          కమలా దాస్ కేరళలోని పున్నాయుకులం గ్రామంలోని పేరుమోసిన సాహిత్య  కుటుంబంలో జన్మించింది. తండ్రి  ‘మాతృభూమి ‘ పత్రిక సంపాదకుడు.  తల్లి మళయాలీ కవయిత్రి. బాబాయి నాలాపత్నారాయణ మినన్ మంచి రచయిత.  కలకత్తా లో నవ్య సాహిత్యం వికసిస్తున్న కాలంలో పెరిగింది. ఆమె ఆంగ్ల కవిత్వం Anne Sexton, Robert Lowell వంటి కవుల కవిత్వంతో సరితూగ గలదని ప్రతీతి.

          ఆమెది అలుపెరుగని సాహిత్య జీవితం. విదేశాల ఆహ్వానం మేరకు తన కవిత్వం  వినిపించేందుకు జర్మని, సింగాపూర్, కెనడా, జమైకా, ఇంగ్లండ్  దేశాలకు విరివిగా ప్రయాణాలు చేసింది. ఆమె గ్రంథాలు ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, జర్మన్, జపాన్  భాషలోకి అనువదించ బడినవి. కేరళ సాహిత్య అకాడమి వైస్ చేర్పర్సన్ గా, Illustrated Werkly of India సాహిత్య పేజీ సంపాదకులుగా రాణించింది. కాలికట్ విశ్వ విద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. Ezhuthachan Puraskaram, Vayalar Award, Sahitya Akademi Award, Asan World Prize, Asian Poetry Prize, Kent Award,  కేరళనాహిత్య అకాడమీ వంటి ఇనేక అవార్డులు ఆమెను వరించాయి. ఆమె నోబెల్ ప్రైజ్ కొరకు నామినేట్చేయబడింది. కవిత్వంలోని ఆమె ఋజుత్వ వ్యక్తీకరణ Marguerite Duras, Sylvia Plath తో పోల్చ తగింది. మహిళా పక్షపాతంగా రాయబడిన ఆమె ఆత్మకథ My Story  అత్యంత వివాదాస్పదమైనది. సాఫీగా సాగని ఆమె సంసార జీవిత వ్యధ  ఆమె కవితలలో అంతర్వాహినై ప్రవహించింది. పాలిటిక్స్ లో ప్రవేశంచిందే కాని, ఓటమి చవిచూచి, మనసు విరిగి, ఆధ్యాత్మికం వైపు తిరిగింది. 

          “కృష్ణా! నీ దేహంలో నేను బందీని, నీ అస్తిత్వానికి అవతల నాకంతా అంధకారం.  నీ నీలిమ,  నీ ప్రియవాక్యాలు ఈ ప్రాపంచిక గోల నుండి నన్ను  రక్షించినవి” అంటూ వాపోయింది. 

          ఆమె తొలి కవన సంకలనం Summer in Calcutta భారతీయ ఆంగ్ల కవిత్వం లో  కొత్త ప్రాణవాయువుల నూదింది. ప్రేమ, ప్రేమ వంచన, భగ్నప్రణయం,విరహ  విషాదం ఆమె కవితలలో విస్తరించింది. పురాతన కాల్పనిక  శృంగార కవితా రీతిని తిరస్కరించి కొత్త  బాణిని ఎంచుకుంది. రెండవ కవన సంపుటి The Descendants  లో  విషాదమయ మహిళా వ్యక్తిత్వం కట్టలు తెంచుకుని ప్రవహించింది. విశృంఖల భాషాభివ్ యక్తితో  కసికసిగా విజృంభంచింది. 

          “ నిన్ను మహిళను చేసిన నీ శరీరత్వాన్ని అతనికి బహూకరించు, నీ దీర్ఘకేశాల  పరిమళాన్ని, నీ వక్షాల శ్వేదకస్తురిని, నీ ముట్టు నెత్తురును, అలవిగాని నీ ఆకలిని” అంటూ మగజాతి పై అక్కసును వెళ్ల గక్కింది. 

కమలాదాస్ ముఖ్య రచనలు: 

          ఆంగ్లం గ్రంథాలు సుమారు 16 (11 కవన సంకలనాలు, 1 ఆత్మకథ, 2  కథానికల సంకలనాలు, 1  నవల, 1 స్మృతి కావ్యం), మళయాలంలో 50 పుస్తకాలు.  ఇతరులచే ఆంగ్లంలోకి అనువదించబడినవి 3.

          Ten Twentieth-Century Indian Poets, The Oxford India Anthology of Twelve Modern Indian Poets, The Golden Treasure of Writers Workshop Poetry  వంటి పలు ప్రతిష్ఠాత్మక కవనసంకలనాలలో (Anthologies) కమలా దాస్ రచనలు వచ్చాయి.  

ఇవి కొన్ని కమలాదాస్ ఆంగ్ల కవితలకు నా తెలుగుసేతలు.:

కలకత్తా వేసవి : (Summer In Calcutta)

బత్తాయి పండంటి ఎప్రిల్ సూర్య రసంతో 

నా చషకం నిండింది; 

ఇదేం మదిరనో గాని మత్తెక్కిస్తున్నది. 

ఆపకుండా తాగేస్తున్నాను అగ్ని ద్రవాన్ని; 

అవును, తాగి తాగి తూలుతున్నాను

సూర్యగోళాల అగ్నిరేతస్సులలో.

ఏదో విషద్రావకం 

నా నరనరాల గుండా ప్రవహించి

నా మదిని అపహాసంతో నింపుతున్నది

నా వ్యాకుల చింతలు మైకంలో తూగుతున్నవి.

స్నిగ్ధ వధువు సందిగ్ధ హసనంలా 

నా పానపాత్ర లో పగిలిన చిరు బుడగల ధ్వని 

నా పెదవిని చేరుతున్నది. 

క్షమించు ప్రియా! 

నా మసక స్మృతులలో నేను నీకై తపిస్తున్న 

ఈ వాంఛాతప్త క్షణికోపశమనాన్ని. 

ఎంత క్షణికం నా ఈ ప్రణయోపాసన!

చేత గ్రీష్మ సూర్యుల మధురస మధుపాత్రతో

తాగుతూ తాగుతూ నిన్ను పొందే ఈ పునఃప్రాప్తి

ఎంత క్షణికం! 

***

పదాలు : (Words))

నా చుట్టూ పదాలు,

చిగురుటాకుల్లా;

నాలో మెల్ల మెల్లగా పెరుగుతున్నవి.

నేను నమ్ముతాను

పదాలు ఏమైనా కావచ్చని. 

జాగ్రత్త, అవి 

చింతల చీకాకుల చిట్టాలను తెరువొచ్చు,

నడచే నీ కాలి కింద గోతులను తోడొచ్చు, 

స్తబ్ధ కెరటాల సముద్రంగా మారొచ్చు.

మండే గాలి ప్రఘాతాలై

పదును కత్తులై 

నీ ప్రియమిత్రుని కుత్తుకనే ఉత్తరించొచ్చు.

పదాలు సంకట హేతువులైతే కావచ్చు,

కాని,

అవి చెట్టు మీద ఎదుగుతున్న ఆకుల్లా

నాలోంచి, నా లోనిలోతుల నిశ్శబ్దంలోంచి 

పుట్టుకొస్తూనే వున్నవి. 

***

ఓడుతున్న యుద్ధం: (A Losing Battle)

నా ప్రేమ అతన్ని ఎలా కట్టి పడేస్తుంది,

అవతల, ఆ తళుకు బెళుకుల నెరజాణల

కామలాలస ఆడసింహమై 

ఈ మగ మృగాన్ని కబళిస్తుంటే?

మగాళ్ళు వట్టి వ్యర్థజీవులు,

ప్రేమ పేరున ఎరవేసి పడవేసే అనైతికులు;

అనురాగం అంటే

ఆడాళ్ళ పాలిటి అశ్రువులు, 

వాళ్ళ రక్తంలో ప్రవహించే నిశ్శబ్దాలు. 

***

వైపరీత్యాలు : (The Freaks)

అతడు

ఎండకు కందిన చెంపలను నాకేసి తిప్పి

మాట్లాడుతుంటాడు;

అతని నోరు ఓ నల్లని కొండ బిలం, 

నోటిలో మొనలుదేలిన గొగ్గిపండ్లు మెరుస్తుంటవి.

నా మోకాలిపై అతని కుడి చేయి,

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.