ప్రమద

వహీదా రెహ్మాన్: భారతీయ సినిమా ఐకాన్

-నీలిమ వంకాయల

          నటి వహీదా రెహ్మాన్ దయకు, గాంభీర్యానికి మారుపేరు. విశేషమైన ప్రతిభకు నిలువెత్తు దర్పణం. భారతీయ చలనచిత్రంలో అగ్రగామిగా నిలిచిన అతికొద్ది మందిలో ఒకరు. ఐదు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో సాగిన ఆమె ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఔత్సాహికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫిబ్రవరి 3, 1938న భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించిన వహీదా రెహ్మాన్ జీవితం నటనా కళ పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనం.

          వహీదా తండ్రి అబ్దుల్ రెహమాన్ జిల్లా కమిషనర్ గా బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా తమిళనాడు కేరళతో పాటు, ఆంధ్రప్రదేశ్లో  విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలలో కూడా పనిచేశారు. అందువలన  ఆమె బాల్యం తమిళ, మలయాళ, తెలుగు భాషలతో సాగింది. వహీదా తండ్రి తాను ముస్లిం అయినప్పటికీ అన్ని మత గ్రంథాల గురించి పిల్లలకి చెప్పేవారు. డాక్టర్ కావాలనేది వహీదా చిన్ననాటి కల. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు బదిలీల వల్ల  ఆమె ఎదుర్కొన్న స్కిన్ ఎలర్జీ, ఆస్తమా వంటి అనారోగ్యాల వల్ల మెడిసన్  చదవాలనుకుంది. కానీ, ఆమె చదువు కూడా కుటుంబ పరిస్థితుల వల్ల పెద్దగా సాగలేదు.

          అయితే ఆమె తండ్రి రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు వహీదా తన కుటుంబ సభ్యులతో కలిసి ‘కమల లక్ష్మణ్’ అనే ప్రముఖ కళాకారిణి చేసిన నృత్య ప్రదర్శన చూసారు. ఈ ప్రదర్శన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ప్రదర్శన చూసి ముగ్ధురాలై ‘తను కూడా నాట్యం నేర్చుకుంటాను’ అని తండ్రిని కోరడంతో, ఆయన కూతురు ఇష్టాన్ని కాదనలేక రాజమండ్రిలో ఉన్న తమిళనాడుకు చెందిన రామచంద్రన్ అనే గురువుని నియమించారు. ముస్లింలు కొంత మంది తమ మత ఆచారానికి విరుద్ధమైన భరతనాట్యం నేర్చుకోవడం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. కానీ ఆమె తండ్రి వాటిని పట్టించుకోలేదు. ఆమె తర్వాత తన అభ్యాసాన్ని జయలక్ష్మి ఆళ్వార్  దగ్గర కొనసాగించారు. అయితే ఆమెతో ప్రదర్శనలు ఇప్పించాలని మాత్రం తల్లిదండ్రులు ఏనాడూ తలవలేదు. ఒకసారి వైజాగ్ లో ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ చారి  అక్కడికి పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఒక ప్రముఖ నాట్యకారిణి నృత్యప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ, ఆ కళాకారిణి అనుకోని కారణాల వల్ల ఆ  కార్యక్రమానికి రాలేక పోయారు. ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఇష్టంలేక ఆమె తండ్రి పై అధికారి అబ్దుల్ వహీదాతో  ఆ ప్రదర్శన కొనసాగింపజెయ్యమని కోరారు. పై అధికారి కోరడంతో కాదనలేక ఆమె తండ్రి అంగీకరించారు. ఆ విధంగా 11 సంవత్సరాల వయస్సులో వహీదా మొదటి నృత్య ప్రదర్శన ఇచ్చారు.

          వహీదాకు 14 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కుటుంబం ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.  అప్పటికి వహీదా అక్కలందరికీ  వివాహం కావడం వల్ల వారి తల్లి ముంతాజ్ తప్పని సరిగా వహీదా నృత్యప్రదర్శనలకు  అంగీకరించవలసి వచ్చింది.

కెరీర్ ప్రారంభ రోజులు:-

ఆ సమయంలోనే ఎన్టీఆర్ నిర్మాతగా మారి హీరోగా నటించిన ‘జై సింహ’ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. వహీదా నృత్య ప్రదర్శన చూసిన  పుండరీకాక్షయ్య ఎన్టీఆర్ కు వహీదాను పరిచయం చేయడంతో ‘జై సింహ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ‘రోజులు మారాయి’ సినిమాలో ఆమె నృత్యం చేసిన పాట ‘ఏరువాక సాగాలో అన్నో చిన్నన్న’ అనే పాటతో వహీదా పేరు ఆంధ్రదేశం అంతట మారు మోగిపోయింది. ఆమె సినీ కెరియర్ కూడా మారిపోయింది. ఆ తర్వాత కన్యాదానం 1955 జూలైలో విడుదలైంది. ఈ రెండు సినిమాల తర్వాత తన మొదటిసారి నటించిన ‘జై సింహా’ సినిమా 1955 అక్టోబర్లో విడుదలైంది. అంటే ఈ సినిమా తనకి మూడవది. ఆ సమయంలోనే ముంబై నుండి హైదరాబాదుకు వచ్చిన డైరెక్టర్ ,ప్రొడ్యూసర్, యాక్టర్ గురుదత్త వహీదాను చూసి ముంబై పిలిపించి తన C.I.D సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. 1957 ఫిబ్రవరి 22న ఆ  సినిమా విడుదలై సంచలనం సృష్టించింది.  ఆ సినిమాలో వహీదా నటనకి చాలా మంది సీనియర్ బాలీవుడ్ నటీనటులు ఫిదా అయిపోయారు. ప్రేక్షకుల గురించి అయితే చెప్పనవసరమే లేదు. వహీదా రెహ్మాన్ వైవిద్యాభరిత నటనా సామర్థ్యం విశేష ప్రజాదరణ పొందడానికి గణనీయంగా దోహదపడింది. ఆమె శైలి సినిమా రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి గల పరిమితులను అధిగమించటానికి దోహదపడింది, శృంగార చిత్రాల నుండి సామాజిక చిత్రాలకు అప్రయత్నంగా మారింది.

          20 సంవత్సరాలు కూడా నిండని వహీదా జీవితంలో మరో పెను తుఫాను 1957 లో ఆమె తల్లి మరణం. అయినా ఆ ఒత్తిడి నుంచి విశ్రాంతిని ఆమె తన చిత్రాల ద్వారానే పొందారు. “ప్యాసా” (1957), “గైడ్” (1965),  “చౌద్విన్ కా చంద్” (1960) వంటి చిత్రాలలో ఆమె నటన బహుముఖ ప్రజ్ఞా  నైపుణ్యాలకు నిదర్శనం.

వహీదా రెహమాన్  ప్రత్యేకమైన చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. సంక్లిష్టమైన పాత్రలలో నటించడంలో ఆమె ప్రవీణురాలు. దేవ్ ఆనంద్, గురుదత్ , రాజేష్ ఖన్నా వంటి ప్రముఖ నటులతో ఆమె నటన ప్రేక్షకులకు నచ్చింది. 60, 70దశకాల్లో ఆమె కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకుంది.

  సత్యజిత్ రే చిత్రం ‘అభిజన్ తో 1962 లో  బెంగాలీ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశించింది వహీదా. తరువాత ‘బాత్ ఏక్ రాత్ కీ’ , ‘రాఖీ’, ‘ ఏక్ దిల్ సౌ అఫ్సానే’   చిత్రాలలో హత్యానేరంలో అనుమానితురాలిగా, తోబుట్టువుల గొడవల్లో చిక్కుకున్న అమ్మాయిగా, సంతానంలేని మహిళగా పలు వైవిధ్య భరితమైన పాత్రలలో నటించారు. అదే సమయంలో పలు హిందీ సినిమాల్లో ‘ముజే జీనే దో’ , ‘కౌన్ అప్నా కౌన్ పరాయ’ , భయానక చిత్రం ‘కొహ్రా’, సైకలాజికల్-థ్రిల్లర్ ‘బీస్ సాల్ కే బాద్‌’ లలో నటించారు. 1959 నుండి 1964 వరకు హిందీ చిత్రాలలో అత్యధిక పారితోషికం పొందిన మూడవ నటిగా ప్రసిద్ధికెక్కారు. విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించిన “గైడ్” చిత్రంలో ఆమె పాత్ర ఆమెకు  అత్యంత పేరు తెచ్చి పెట్టిన పాత్రలలో ఒకటి. వ్యక్తిగత, కళాత్మక స్వేచ్ఛను కాంక్షించే నృత్యకారిణిగా ఆమె పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. “గైడ్”లో కేవలం నటన ద్వారానే కాక, తన నృత్య కళ ద్వారా బహుముఖ ప్రతిభ గల కళాకారిణిగా నిలబడటం విశేషం.

          ఏప్రిల్ 1974లో, వహీదా శశిని (సినిమా పేరు – కమల్జీత్) వివాహం చేసుకున్నారు. వారు ‘షాగూన్’ చిత్రంలో కలిసి పనిచేశారు. వివాహం తర్వాత నటన వైపు నుంచి దృష్టి మరలించుకుని తన సొంత బ్రాండ్ అల్పాహార ధాన్యాన్ని మార్కెట్ చేస్తూ బెంగళూరు ఫామ్‌హౌస్‌లో సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డారు. వారికి ఒక కుమారుడు – సోహైల్, కుమార్తె – కశ్వి ఉన్నారు.

          1976-1994 వరకు సహాయ నటిగా 24 సినిమాలు చేసింది. 2000లో తన భర్త మరణించిన తర్వాత మళ్ళీ 9 చిత్రాలలో తనదైన శైలిలో పెద్దరికపు పాత్రలలో నటించింది.

అవార్డులు

          భారతీయ సినిమాకు వహీదా రెహ్మాన్ అందించిన సేవలు విస్తృతంగా గుర్తించబడ్డాయి. ఆమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు.

‘తీస్రీ కసం’  (1966)తో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ‘రామ్ ఔర్ శ్యామ్’ (1967), ‘నీల్ కమల్’  (1968), ‘ఖామోషి’ (1969) –  మూడు చిత్రాలు రెహ్మాన్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్లు పొందాయి. ‘నీల్ కమల్’  చిత్రం ద్వారా రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారం, “రేష్మా ఔర్ షేరా” (1972) చిత్రంలో నటనకు జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా  పలు అవార్డు లను అందుకున్నారు.

2001లో, చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశిష్ట సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో ఆమెను సత్కరించింది. “15 పార్క్ అవెన్యూ” (2005)లో ఆమె పాత్రకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2013లో భారతీయ సినిమాకి ఆమె చేసిన కృషికి ‘సెనిటరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ’ అవార్డును సొంతం చేసుకున్నారు. రచయిత, దర్శకురాలు నస్రీన్ మున్నీ కబీర్ సేకరించిన ఇంటర్వ్యూ లతో కూడిన సంభాషణలతో వహీదా రెహ్మాన్ అనే పేరుతో రెహ్మాన్ గురించి జీవిత చరిత్ర 2014లో ప్రచురించబడింది.

          వహీదా రెహ్మాన్ తన 85 ఏట కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) డైరెక్టరేట్ ద్వారా 2021 సంవత్సరానికి భారత చలనచిత్ర అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించినందుకుగాను “దాదాసాహెబ్ ఫాల్కే” అవార్డును కైవసం చేసుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును అందజేస్తారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైనందున 2021 అవార్డులు ఈ సంవత్సరం ఇవ్వబడుతున్నాయి. కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి వహీదా రెహ్మాన్ కు భారత రత్న అవార్డు ను ప్రకటిస్తూ “వహీదా జీ అంకితభావం, నిబద్ధత  వల్ల భారతీయ నారీశక్తికి  ఉదాహరణగా నిలిచారు. ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆమెకు లభించడం అన్నది భారతీయ సినిమారంగానికి విశేష సేవలు అందించి, సినిమాల తర్వాత తన జీవితాన్ని సమాజ హితవు కోసం, దాతృత్వానికి అంకితం చేసిన స్త్రీ మూర్తికి  తగిన గుర్తింపుని  ఇవ్వడమే” అని అన్నారు.

          ప్రధాని నరేంద్ర మోదీ కూడా “భారత సినిమాలో ఆమె ప్రయాణం చెరగని ముద్ర వేసింది. ప్రతిభ, అంకితభావం, దయతో కూడిన ఆమె జీవితం సినిమా వారసత్వంలో ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది, ” అని సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో అభినందనలు తెలిపారు.

          వహీదా నటనా కౌశల్యం భారతీయ చలన చిత్రరంగానికి శాశ్వత వారసత్వాన్ని మిగిల్చింది. తర్వాతి తరం నటీనటులకు, సినిమా ఔత్సాహికులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందనటంలో సందేహం లేదు.

*****

Please follow and like us:

One thought on “ప్రమద – వహీదా రెహ్మాన్”

  1. Voka manishini choodagaane Manaku ardham avutundi .
    Alaanti nati Vaheda ! Naaku ishtam …..ante !
    Matallo cheppaleni haava bhaavaalu aame swantham .
    CONGRATULATIONS 🎈 WAHEDA !

Leave a Reply

Your email address will not be published.