కోడలుగారు (హిందీ అనువాద కథ)

హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          ఆవిడని చిన్నా-పెద్దా అనకుండా అందరూ కోడలుగారు అనేవారు. ఆవిడ అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇలా తప్ప మరో పేరుతో ఆవిడని పిలవటం నేనెప్పుడూ వినలేదు. మేము ఉండే పెద్ద భవనానికి ఆవిడ యజమానురాలు. మూడు అంతస్తులు ఉన్న ఆ భవంతిలో పై అంతస్తులో మేము ఉండేవాళ్ళం. అన్నిటికన్నా కింది అంతస్తులో కేశవ్ దాదా కుటుంబం ఉండేది. మధ్యలో ఉన్న మొత్తం అంతస్తులో కోడలుగారు ఒక్కావిడ ఉండేవారు. ఇన్ని గదుల్లో ఆవిడ ఒంటరిగా ఎందుకని, ఎలా ఉంటున్నారని పిల్లలమైన మాకు చాలా అశ్చర్యం కలిగేది.

          నన్ను తన ఇంట్లో ఆడుకోవడానికి కోడలుగారు ఎప్పుడూ వద్దనలేదు. వారి ఇంట్లో ఫ్లోర్ అంతా మెరిసే తెల్లని రాళ్ళతో చేసింది. వాటి మీద జారడంలో ప్రత్యేకమైన ఆనందం కలిగేది. ఆవిడ ఇంట్లో అన్నిటికన్నా పెద్ద గది తలుపుకి సరిగా పైన బంగారపు రంగు ఫ్రేము కట్టించిన ఒక చాలా పెద్ద చిత్రం వేలాడుతూ ఉండేది. ఈ చిత్రం అబ్బాయి గారు అంటే కోడలుగారి భర్త నరేంద్రనాథ్ గారిది. నేను తరచు ఆ చిత్రాన్ని శ్రద్ధగా చూస్తూ ఉండే వాడిని. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. గౌరవర్ణం, సౌష్ఠవంతో కూడిన శరీరం, వెడల్పైన నుదురు, పొడవాటి ముక్కు, ఉంగరాల జుట్టు.  దానిమీద త్రీపీస్ సూటు, టై లలో ఆయన శరీరం ఏ ఆంగ్లేయుడినైనా అతిశయించేలా ఉండేది. ఆయన ఆ కాలం నాటి ఆ ధనిక కుటుంబంలో ఏకైక సంతానం మాత్రమే కాక పేరెన్నిక గన్న బారిష్టరు కూడా. ఆంగ్ల జడ్జిల న్యాయస్థానాలలో ఆయన వాదించడానికి నిలబడినప్పుడు తన పాండిత్యంతో, వాగ్ధాటితో అందరినీ ప్రభావితులను చేసేవారు. ఆయన పట్టణంలోని ధనాఢ్యులతోనూ, ఆంగ్లేయులతోనూ సాంగత్యంలో ఉంటూ క్రమం తప్పకుండా క్లబ్బులకి వెడుతూ వుండేవారు. ఆయన నివాసంలో కూడా ఉన్నత కులీనులతో సమావేశాలు జరుగుతూ ఉండేవి. మొత్తం నగరంలో జనం ఆయన్ని గౌరవంగా చూసేవారు, మర్యాదగా వ్యవహరించేవారు. కోడలుగారు కూడా ఏ విషయంలోనూ అబ్బాయిగారికి తక్కువ కాదు. వార్ధక్యంలో అడుగుపెట్టిన కోడలుగారు గీచిన చిత్రంలాగా అందంగా కనుపించేవారు. తీర్చిదిద్దినట్లున్న ముఖం, పాలతో కడిగినట్లున్న ఆవిడ శరీరం ఆవిడకి ఒక ఆకర్షించే వ్యక్తిత్వాన్ని ఇచ్చేది.

          చలికాలంలో మధ్యాహ్నం నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే భోజనం చేశాక కోడలుగారి ఇంటి ఒకేఒక పనిమనిషి సంతో ఆవిడ ఫోల్డింగ్ ఈజీచెయిర్ ని పై అంతస్తుకి చెందిన డాబా మీద పెట్టి వెళ్ళేది. మేము పై అంతస్తులో ఉండేవాళ్ళం. అందువల్ల ఆ పెద్ద డాబా మా యింటిలో భాగం. ఆవిడ రాగానే ఎండ కాచుకునేందుకు కింది అంతస్తు లోని వారు కూడా అక్కడికి చేరుకునేవారు. ఇంక పెద్ద సమావేశం జరిగేది. ఎక్కువగా మౌనంగా ఉండే కోడలుగారి రూపం అప్పుడు మరోలా ఉండేది. ఆవిడ కథలు వినడం లోనూ, కథలు చెప్పడంలోనూ బాగా ఆనందించేవారు. నిష్కపటంగా నవ్వేవారు. ఆవిడ కిలకిలా నవ్వుతూవుంటే నాకు చాలా బాగుండేది. ఆవిడ ఇక్కడే మా డాబా మీదనే కూర్చుని, తన నవ్వులతో మమ్మల్ని అలరిస్తూ ఉండాలని అనిపించేది. కాని, ఎండ నెమ్మదిగా పిట్టగోడ మీదకి వెళ్ళిపోయినప్పుడు జనం లేచేవారు. సంతో ఈజీ చెయిర్ తో పాటు కోడలుగారిని కూడా కిందకి తీసుకువెళ్ళేది.

          కోడలుగారు ఎక్కువగా తనలో తానే లీనమై ఉండటం, తక్కువగా మాట్లాడటం కారణంగా కూడా ఆవిడ ఈ విధంగా ఈ సమయంలో ఇలా నవ్వుతూ ఉండటం, మాట్లాడుతూ వుండటం ఎంతో బాగుండేది. దీనికి కారణం వెతకటం కూడా కష్టమేమీ కాదు. అబ్బాయిగారు నలభై అయిదేళ్ళ వయస్సులో ఒక యాక్సిడెంటులో మరణించారు. ఆయన తన తల్లిదండ్రులకి ఒకే ఒక సంతానం. ఆయన వెళ్ళిపోయాక కోడలుగారి అత్త వారింట్లో ఎవరూ బంధువులు మిగల్లేదు. కోడలుగారి తన పుట్టింట్లో కూడా ఆవిడ తల్లి దండ్రులు కాలం చేశాక ఇంక ఆవిడ గురించి అడిగేవారెవరూ లేరు.

          ఆవిడ అబ్బాయిగారికన్నా పదేళ్ళు చిన్న. జనం చెప్పుకునేదాని ప్రకారం అబ్బాయిగారు ఏదో పెళ్ళిలో కోడలుగారిని చూశాక ఆవిడ పైన మోహితులయ్యారు. ఇంత పెద్ద ఇంటి నుండి వచ్చిన సంబంధాన్ని కోడలుగారి నిర్ధనులైన తల్లిదండ్రులు దైవ కృపగా భావించి కళ్ళకద్దుకున్నారు. తమ ఏకైక పుత్రికను ఏ మాత్రం ఆలస్యం చెయ్య కుండా వివాహబంధంలో బంధించారు. ఆవిడ వయస్సు అప్పటికి  పధ్నాలుగేళ్ళు  ఉంటుంది. అబ్బాయిగారికి ఇంచు మించు ఇరవైనాలుగు-ఇరవైఅయిదు సంవత్సరాలు ఉండవచ్చు.

          కోడలుగారు ఘోరమైన దారిద్య్రం నుంచి వెలువడి అనుకోకుండా ధనాఢ్యుల వాతావరణంలోకి వచ్చిపడ్డారు. ఆ చిన్నవయస్సులో ఆవిడకి ఇదంతా ఒక స్వప్నలోకం లాగా ఉండేది. మొదట్లో వుండే బెరుకుతనం పోయి క్రమంగా ఈ వాతావరణంలో అలవాటు పడసాగారు. అబ్బాయిగారు ఆవిడకి ఇంగ్లీషు నేర్పడానికి, ధనవంతుల పద్ధతు లు అలవాటు చెయ్యడానికి ఒక ఆంగ్ల ఉపాధ్యాయినిని నియమించారు. నేర్చుకునే ఆ వయస్సులో ఆవిడ అన్నీ త్వరితగతిన నేర్చుకుంటూ అబ్బాయిగారిని కూడా ఆశ్చర్య పరిచింది. 

          కోడలుగారి గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకునేవారు. కాని నాకా వయస్సు లో అర్థం అయ్యేవి కావు. మా నాయనమ్మ లాంటి పాతకాలపు మనుషులు గుసగుస లాడుకునే గొంతుకతో చెప్పేవారు. రొట్టెవిరిగి నేతిలో పడినట్లు ఆవిడ ఈ ఉన్నవారి జీవితపురంగులో బాగా కలిసిపోయింది. చీర స్థానంలో ఇంగ్లీషువారి డ్రస్సులు వచ్చాయి. ఆవిడ బ్రిజిష్ ధరించి గుర్రపుస్వారీ చేసేది. అబ్బాయిగారితో క్లబ్బులకి వెళ్ళి డాన్స్ ఫ్లోర్ మీద జరుగుతూ నృత్యం చేసేది. పేకాట ఆడేది. సిగరెట్ పొగ రింగులు రింగులుగా వదిలేది. కోడలుగారు అనుసరిస్తున్న ఈ పద్ధతులేవీ సంఘంలోని జనులకి అసలు నచ్చేవి కావు. కాని వాళ్ళు అబ్బాయిగారి ఉన్నత స్థితి ముందు ఏమీ మాట్లాడలేక పోయేవారు. మరోపక్క అబ్బాయిగారు కోడలుగారి మీద మరింత ముగ్ధులైపోయారు. ఆయన కోరుకున్నట్లుగా వుండే భార్య ఆయనకి లభించింది. ఆవిడతో కలిసి వెళ్ళడంలో ఆయన గర్వపడేవారు. జనం కోడలుగారి అందాన్ని చూసి మెచ్చుకుంటే ఆయన దర్పం ఇంకా ఎక్కువయ్యేది. ఆయన ఆవిడని చాలా అభిమానంగా క్లబ్బులకి తీసుకువెళ్ళేవారు. ఆంగ్లేయులు కూడా ఆవిడ వ్యవహరించే పద్ధతులతో ఆనందిస్తూవుంటే చూసి ఆయన సంతోషించేవారు. నిజానికి కోడలుగారు ఆయన సర్కిల్ లో ఇంత తొందరగా పూర్తి ఆమోదాన్ని పొందుతారని అబ్బాయి గారికి అంత నమ్మకం ఉండేదికాదు. ఆ రోజుల్లో ఇంగ్లీషు జడ్జి హేరిస్ కొడుకు హెన్రీ గురించి జనం గుసగుస లాడుకునేవారు. అతను కోడలుగారంటే పడిచస్తాడని, అంతేకాక అబ్బాయిగారి యాక్సిడెంటులో ఏదో విధంగా అతని ప్రమేయం ఉందని.

          నిజం చెప్పాలంటే అప్పుడు నాకు ఆ మాటల్లో ప్రత్యేకమైన అర్థం ఏదీ తెలిసేది కాదు. కాని కోడలుగారి గురించి ఏదో బాగా చెప్పడంలేదని మాత్రమే బోధపడేది. ఇటు వంటి మాటలు విని నాకు చాలా కోపం వచ్చేది. మా నాయనమ్మలాంటి సాధారణమైన ముఖవర్చస్సు ఉన్నవారు కోడలుగారంటే ఈర్ష్య చెందుతున్నారని, ఆవిడ మీద లేనిపోని మాటలు అంటున్నారని నాకనిపించేది. నేను మాత్రం ఆవిడ భగవంతుని ధ్యానంలో పూర్తిగా లీనమై ఉండటం చూశాను. కోడలుగారి మీద చెడ్డగా చెప్పుకునేవాళ్ళకి రోజూ మధ్యాహ్నం ఆవిడ ఇంట్లో భజన చేయడానికి ఆడవాళ్ళంతా చేరుతారని, ఇంచు మించు రెండు గంటలపాటు ఢోలక్-చేతాళాలు వాయిస్తూ భజనగీతాలు పాడుతూ ఉంటారని కనిపించేది కాదు.

          కోడలుగారి ఇంట్లో మొత్తం అయిదు గదులుండేవి. కాని ఆవిడ ఎక్కువగా ఆ హాలు వంటి పెద్దగదిలోనే ఉండేది. అక్కడే ఆవిడ తాంబూలచర్వణ పేటిక పెట్టి ఉండేది. అక్కడే దేవుడి భజన చేసేవారు. అక్కడే మా పిల్లలమంతా ఆడుకునేవాళ్ళం. అక్కడే ఆవిడ రాత్రిపూట పడుకుని ఉండేది. ఆ పెద్దగదికి రెండువైపులా ఒక్కొక్క గది ఉండేది. వాటి తలుపులు గదిలోపలికే తెరుచుకునేవి. వాటిలో ఒక గదిని ఆవిడ తన డ్రస్సింగ్ రూమ్ లాగా ఉపయోగించుకునేది. ఆ గదికి సరిగా ఎదురుగా మరో గది ఉండేది. అది ఎప్పుడూ మూసి ఉండేది. దాని తలుపుకి ఎప్పుడూ ఒక పెద్దతాళం వేలాడుతూ ఉండేది. కోడలుగారు ఆ గదిలోకి చాలా తక్కువగా వెడుతూ వుండేవారు. ఒక సంగతి నేను గమనిం చాను. మరెవరైనా కూర్చుని ఉన్నప్పుడు ఆవిడ ఆ గదిలోకి వెళ్ళేదికాదు. నేను ఒక్కడినీ లేదా మిగతా పిల్లలం అక్కడ ఆడుతున్నప్పుడు ఆవిడ ఆ గదిలోకి వెళ్ళడం చాలా తక్కువగా జరిగేది. కాని ఆవిడ ఆ గదిలోకి ఎప్పుడు వెళ్ళినా లోపలి నుంచి తలుపు మూసివుంచేది. చాలా సేపు గదిలోపలనే ఉండేది. నిజం చెప్పాలంటే చాలాసార్లు ఆవిడ ఆ గదిలో ఉన్నప్పుడు నేను లోపలికి తొంగిచూడటానికి ప్రయత్నించేవాడిని. ఒకసారైతే నెమ్మదిగా స్టూలు జరుపుకుని దాని మీదికి ఎక్కి నేను తలుపుకి బాగా పైన అమర్చిన గాజుపలకలో రెండుచేతులనీ అడ్డం పెట్టుకుని లోపలికి చూడటానికి ప్రయత్నించాను. కాని నాకేమీ కనిపించలేదు. ఎందుకంటే ఆ గాజుపలకల్లోంచి రెండోపక్క ఏ ముందో కనిపించదు. ఆ గది నాకు ఏదో అర్ధంకాని తెలియని రహస్యంతో కూడుకొని వున్నదిలాగా అనిపించేది. ఎందుకంటే ఆ గదిలో నుంచి బయటికి వస్తూనే ఆవిడ దానికి తాళం వెయ్యడం మరిచిపోయేది కాదు. తాళంవేసి తాళంచెవి తన కొంగులో దోపుకునేది. ఒకసారి నేను ఇంట్లో ఈ విషయం చెపితే నాయనమ్మ అంది- “ఈవిడ దగ్గర చాలా సంపద ఉంది. ఒకప్పటి కలవారి కోడలు. నోట్లు లెక్కపెట్టుకునేందుకూ, నగలు జాగ్రత్త పెట్టుకునేందుకూ వెడుతూ ఉంటుందేమో.” నాయనమ్మ చెప్పే ఈ తర్కం అందరికీ నమ్మదగ్గదిలాగానే కనిపించేది.

          ఆ భవనం అంతా పై నించి కిందకి పరుగులెత్తుతూ, అందరి ప్రేమనీ సంతరించు కుంటూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, పొరపాట్లు చేసినప్పుడు తిట్లుతింటూ, కోప తాపాలతో, బుజ్జగింపులతో, ఆడుకుంటూ, ఆడిస్తూ ఉండే ఆ రోజులు ఇట్టే ఎగిరిపోయాయి. ఒక రోజున నాకు ఉన్నట్టుండి ఇప్పుడు నేను చిన్నపిల్లవాడిని కానని అనిపించింది. పెదవులకి పైన మూతి మీద తేలికపాటి నూనూగు మీసాలు కనిపించసాగాయి. మాటిమాటికీ నన్ను “ఇంత పెద్దవాడివయ్యావు” అని చిన్నవాళ్ళ మధ్య ఆడుకోకుండా ఆపుజేయడం మొదలయింది. నేనే కాక నా చుట్టుపక్కల వుండే అందరూ పెద్దవాళ్ళ వుతున్నారని నాకనిపించింది. నా చెల్లెళ్ళతో సహా భవనంలో వుండే పిల్లలంతా పదహారేళ్ళ వయస్సు దాటుతున్నారు, లేదా దాటేశారు. వయస్సు ప్రభావం మా నాయనమ్మ, అన్నిటికన్నా కింది అంతస్తులో వుండే భావో, ఇంకా చెపితే కోడలుగారి మీద కనిపిస్తోంది. కోడలుగారి గొంతు మీద మాంసం కొంచెం వేలాడుతోంది. ఆవిడ ముఖంలో కొన్ని ముడతలు కూడా కనిపిస్తున్నాయి. కంటిచూపు కూడా కొంచెం తగ్గింది. ఈ మధ్యనే ఆవిడ తన కళ్ళజోడు రెండుసార్లు మార్పించుకుంది. ఇంట్లో కూడా ఆవిడ తిరగడం చాలా తగ్గిపోయింది. ఆవిడ ఎక్కువగా తన మంచం మీదనే పడివుంటుంది. ఏం ఆలోచి స్తుందో తెలియదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు ఆవిడ దిగులుకి కారణం అడిగినా, ఆవిడ నవ్వేసి ఊరుకునేది. నాతో అనేది- “ఏం లేదు బాబూ. వయస్సుపెరుగుతోంది. అంతే.”ఆవిడ నిజమే చెబుతోందని నాకు అనిపించేది. కాని, ఆవిడ అలా ఒంటరిగా దిగులుగా పడివుండటం చూసి నాకు బాగుండేదికాదు.

          ఆవిడకి సాయం ఎక్కువగా అవసరమైన సమయంలోనే ఆవిడ పనిమనిషి సంతో తన పని విడిచిపెట్టి వాళ్ళ వూరికి వెళ్ళిపోయింది. కోడలుగారికి ఇది షాక్ లాంటిది. అయినా, ఆవిడ మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని తన పని స్వయంగానే చేసుకోసాగింది. ఆవిడ ఇబ్బంది త్వరగానే అందరికీ తెలిసింది. అంతా ఆవిడ కోసం పనిమనిషిని వెతకసాగారు. కాని అంత తొందరగా పని అయ్యే పరిస్థితి కాదు. తర్వాత ఇంక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మధ్యాహ్నం భోజనం మాయింటి నుంచి, సాయంత్రం భోజనం భావో యింటి నుంచి పంపించడం మొదలుపెట్టాము. చాయ్-టిఫిన్లు ఒకసారి మాయింటి నుంచి, మరోసారి భావో యింటి నుంచి పంపించసాగాం.

          ఆ రోజు అమ్మ నాకుఅన్నం పెడుతూ అంది- “ఇవాళ నేను కోడలుగారికి అన్నం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ కొంచెం ఎక్కువగానే దిగులుపడుతున్నట్లు కనిపిం చింది. ఆవిడ మాటలు వింటే ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఆవిడకి భయంగా వుందని, నిద్ర కూడా సరిగా పోవడంలేదని నాకనిపిస్తోంది. ఆవిడ కోసం పనిమనిషి ఏర్పాటు జరిగే వరకూ నువ్వు రాత్రిళ్ళు ఆవిడ యింటికి వెడుతూ వుండు. అక్కడే శాంతిగా చదువుకో. తెల్లవారాక లేచి వచ్చేస్తూవుండు.” నేను అమ్మ చెప్పినదానికి సరే అన్నాను. అమ్మ కోడలుగారికి ఈ విషయం చెప్పినప్పుడు ఆవిడ ముఖంలో ఊరట కలిగిన భావం కనిపించింది.

          నేను ఆ రోజు నుంచే రాత్రి అన్నం తిన్నాక కోడలుగారి యింటికి వెళ్ళడం మొదలు పెట్టాను. ఆవిడ మంచానికి పక్కనే నేను నా చిన్న మంచం వేసుకున్నాను. నేను కొంత సేపు చదువుకుంటూ వుంటే ఆవిడ కూర్చుని మాల పట్టుకుని జపం చేసుకునేది. నేను నిద్రపోవడానికి లేచినప్పుడు ఆవిడ కూడా తన పెద్ద మంచం పైకి వచ్చి పడుకునేది. ఆవిడ పరిస్థితి ఎలావుందని నేను అడిగితే ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి పక్కకి తిరిగి పడుకునేది. కాసేపటిలోనే నిద్రపోయేది. ఆవిడ నిశ్చింతగా నిద్రపోవడం చూసి నాకు బాగుండేది. నేను కూడా ఒళ్లెరగకుండా నిద్రపోయేవాడిని.

          ఆ రోజు కోడలుగారు కాస్త ఎక్కువగానే మౌనంగా ఉన్నారు. నేను చెప్పే ఏ మాటకీ ఆవిడ జవాబు ఇవ్వడంలేదు. అమ్మ కూడా ఈ విషయాన్ని గమనించింది. ఆవిడకేమీ అనారోగ్యం కాదుగదా అనే సందేహంతో అడిగితే ఆవిడ కాదని చెప్పింది. నేను చదువు కునేందుకు కూర్చున్నప్పుడు ఎప్పటిలాగా ఆవిడ మాల తీసుకుని జపం చెయ్యడానికి కూడా కూర్చోలేదు. నేనన్న ఏమాటకీ జవాబివ్వకుండా తన మంచం మీదకి చేరి నిద్ర పోయింది. నేను కూడా అప్పుడు ఎక్కువ చదవలేక నిద్రపోవడానికి తొందరగానే లేచి పోయాను. కోడలుగారి మీద నా దృష్టి పడింది. ఆవిడ గాఢనిద్రలో ఉంది. నేను నా మంచం మీదకి చేరి పడుకున్నాను. కొన్నిసార్లు ఇటూఅటూ ఒత్తిగిల్లాక నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియలేదు.

          రాత్రి నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. చూస్తే కోడలుగారు తన మంచం మీద లేదు. మంచినీళ్ళు నేను జగ్గునిండా నింపి ఆవిడ తలవైపున పెట్టాను. బహుశా బాత్ రూంకి వెళ్ళివుండవచ్చు. నేను మళ్ళీ నిద్ర పోవడానికి ఉపక్రమించాను. చాలా సేపటి వరకూ కోడలుగారు తన మంచం దగ్గరికి తిరిగి రాకపోయేసరికి నాకు చింత కలిగింది. నేను లేచి కూర్చున్నాను. అప్పుడే నా దృష్టి ఆ గది తలుపుకి పై భాగంలో వున్న అద్దాలలోంచి వస్తున్న కాంతి మీద పడింది. ఆగది ఎప్పుడూ మూసివుండేది. కోడలుగారు ఇంత రాత్రివేళ ఆ గదిలో ఏంచేస్తూ ఉండవచ్చు? నేను వెంటనే ఆ తలుపు దగ్గరికి చేరుకున్నాను. ఎప్పటిలాగే అది లోపలి నుంచి మూసివుంటుందని నాకు తెలుసు. భయంతోనూ, గగుర్పాటుతోనూ నేను ఏంచెయ్యాలన్నది ఆలోచిస్తూ వుండగానే లోపలి నుంచి వెక్కివెక్కి ఏడుస్తున్న ధ్వని విని నేను ఉలిక్కిపడ్డాను. నేను ఏమీ ఆలోచించ కుండా తలుపుని కొంచెం తొయ్యగానే అది ఏమీ చప్పుడు చేయకుండా తెరుచుకుంది. ఆ తలుపుని లోపలి నుంచి వెయ్యడం ఆవిడ మొదటిసారి మరిచిపోయినట్లుంది.

          నా మనస్సు భయంతో కూడిన ఉత్సుకతతో నిండిపోయింది. కోడలుగారి వీపు తలుపు వైపుకు ఉంది. ఆవిడ మూలవున్న కుర్చీలో తన ఎదురుగావున్న గోడకి ఆనించి పెట్టిన టేబిల్ మీద తల వంచుకుని కూర్చుని వుంది.ఆవిడ తన తల రెండు చేతుల తోనూ గట్టిగా పట్టుకుని వుంది. ఏడుస్తూ ఆవిడ శరీరమంతా కదులుతోంది. గదిలోకి వెళ్ళాలా వద్దా అన్నది నాకు అర్ధం కావడంలేదు. ఆవిడ ఆరోగ్యం బాగుండకుండా వుండి ఆవిడకి నా అవసరం ఉంటేనో. ఏంచేయాలో దిక్కుతోచని ఆ పరిస్థితిలో నేను అడుగు ముందుకి వేస్తూ ఉండగానే ఆవిడ తనలో తానే ఏదో గొణుక్కోవడం వినిపించి నేను ఆగి పోయాను. ఆవిడ ఏడుస్తూ చాలా మందమైన తక్కువ స్వరంలో మాట్లాడుతున్నది ఆ రాత్రి నిస్తబ్ధతలో నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆవిడ అంటోంది- “అంతా విడిచిపెట్టి నేను నీతో ఎలా రాను హెన్రీ. నేను ఇలా ఉన్నాను అన్నది నరేంద్ర కారణంగానే. ఆయన నా భర్త. ఉన్నతమైన సొసైటీలలో కలిసిమెలిసి ఉండేందుకు నన్ను ఆయనే యోగ్యురా లిగా చేశారు. పేదరాలైన నాకు ఆయన ఎంతో ప్రేమని ఇచ్చారు.  నేను ఆయన్ని మోసగించలేను. నేనేం చెయ్యను హెన్రీ? నీతో వచ్చేయాలని మనస్సు తపిస్తోంది. కాని నా కాళ్ళు సంస్కారాల సంకెళ్ళతో బంధించబడి వున్నాయి. ఆయన వితంతువుగా ఉండ టంలోనే నాకు వాస్తవం కనిపించింది. నువ్వు సప్తసముద్రాల అవతలకి వెళ్ళిపోయావు. అయినా నాకు మాత్రం నా మనిషి ఒకడు ఉన్నాడని అనిపించేది. కాని, ఇప్పుడు నువ్వు కూడా మరో లోకానికి వెళ్ళిపోయావు. నేను నిజంగా చాలా ఒంటరిదాన్నయి పోయినట్ల నిపిస్తోంది.” ఆవిడ వెక్కివెక్కి ఏడుస్తోంది. టేబిలు మీద కొన్ని ఉత్తరాలు చెదురుగా పడివుండటం నేను గమనించాను. ఇంకా ఒక ఆంగ్ల యువకుడి ఫోటో అక్కడ పెట్టివుంది.

          నాకు ఇంకా ఏమీ తెలుసుకునే, అర్ధం చేసుకునే అవసరం లేకపోయింది. నేను ఏ మాత్రం చప్పుడు చెయ్యకుండా వెనక్కి జరిగి బయటికి వచ్చేశాను. తలుపు అదే విధంగా వేసేశాను. కోడలుగారు బయటికి రావడానికి ముందుగానే నేను నా మంచం దగ్గరికి వచ్చి పడుకుని నిద్ర పోవాలనుకున్నాను. అప్పుడే నా దృష్టి తలుపు దగ్గరే పడివున్న ఒక ఎయిరోగ్రామ్ మీద పడింది. బహుశా అది లోపలి నుంచి ఎగిరి అక్కడికి వచ్చివుంటుంది. నేను దాన్ని చదవకుండా ఉండలేకపోయాను. గదిలోంచి వస్తున్న మసక వెలుతురులో నేను దాన్ని అతికష్టం మీద చదవగలిగాను. ఎవరో టోనీ రేక్సిన్ దాన్ని లండన్ నుంచి పంపించాడు. కేవలం అయిదు పంక్తుల్లో దాన్ని రాశాడు- “చాలా కాలం అనారోగ్యంతో ఉన్నాక ఈరోజు హెన్రీ మరణించాడు. మీ కోరికని గౌరవిస్తూ అతను ఎప్పుడూ భారతదేశా నికి తిరిగి రాలేదు. కాని ఆఖరిశ్వాస వరకూ మిమ్మల్ని స్మరించుకుంటూనే ఉన్నాడు. అతను కాలం చేసిన వార్త మీకు తెలియపరచటం అవసరమని నాకనిపించింది. అతని ఆత్మశాంతి కోసం మీ భగవంతుడిని తప్పకుండా ప్రార్ధించండి.”- టోనీ రేక్సిన్.

          నేను మంచం మీదకి వచ్చి పడ్డాను. కాని, నిద్ర రాకూడదనుకుంది కాబట్టి రాలేదు. మాటిమాటికీ ఆ మూసివున్న తలుపువైపుకి నా కళ్ళు చూస్తున్నాయి. ఇంచు మించు ఒక గంట తరువాత ఆవిడ బయటికి వచ్చింది. వచ్చి తన మంచం మీద పడుకుంది. ఆలోచిస్తూ నాకు కునుకు ఎప్పుడు పట్టిందో తెలియదు. నాకు మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. రోజూ నాకన్నా ముందుగా లేచే కోడలుగారు ఇంకా నిద్ర పోతోంది. రాత్రి జరిగిందంతా ఒక కలలాగా అనిపిస్తోంది. నేను చాలాసేపు ఆవిడ తల వైపున నిలబడి ఆవిడ నిష్కళంకమైన ముఖంలోని అమాయకత్వాన్ని తదేకంగా చూస్తూ నిల బడ్డాను. శాంతంగా వున్న ఆవిడ ముఖంలో దాగివున్న వ్యాకులత, ఏకాంతం భగవదర్చ నతో, గట్టిగా పాడిన భక్తిగీతాలతో, మాలతో చేసే జపంతో పోయేది కాదు. ఎంతో గట్టి ప్రయత్నంతో కోడలుగారు వీటన్నిటినీ ఇంత కాలంగా తనవరకే పరిమితం చేసి ఉంచింది. దీని గురించి ఎప్పుడూ ఎవరికీ ఏమీ చెప్పకూడదని, దీనిని ఒక కలగా భావించి మరిచి పోవాలని నేను నిర్ణయించుకున్నాను. 

          కాని, కోడలుగారికి మాత్రం ఇదంతా కల కాదు. ఆవిడ మనస్థితిని ఎవరూ అర్ధం చేసుకోలేరు. ఆవిడ లోలోపలే అంతర్మథనం చెందుతుందని, ఇంకా ప్రగాఢమవుతున్న ఒంటరితనంతో పోరాటం చేస్తూవుంటుందని నాకు తెలుసు. ఇది తప్ప ఆవిడ దగ్గర మరో మార్గం ఏదీ లేదు.

          మర్నాడే ఆవిడకి తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆవిడని హాస్పిటల్ లో చేర్చవలసి వచ్చింది. నెల కూడా గడవకుండానే అదే అనారోగ్య పరిస్థితిలో ఆవిడ శాశ్వతంగా కన్ను మూసింది. ఆవిడ గురించి ఆలోచించినప్పుడల్లా ఏదో తెలియని విచిత్రమైన అశాంతి నన్ను చుట్టుముట్టుతుంది. నా ముకుళిత హస్తాలు అప్రయత్నంగానే ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తాయి.

***

డా. రమాకాంత్ శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత్ శర్మ 90 కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథా సంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాల పైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు
కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us: