యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-11

గ్రాండ్ కురండా టూరు (Grand Kuranda) 

కెయిర్న్స్ లోని ఇండియన్ రెస్టారెంటులో రాత్రి భోజనం మెన్యూలో అత్యంత ప్రత్యేక మైన రెండు ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి నలభై డాలర్ల ఖరీదైనవి. ఒకటి కంగారూ మాంసం, రెండు మొసలి మాంసం. అప్పటి వరకు ఎన్నోసార్లు వినడమే కానీ నిజంగా ఉంటాయని తెలీదు. రెండూ ఇండియన్ పద్ధతిలో వండిన బట్టర్ మసాలాలే. స్థానికులకి కంగారూ మాంసం అతి సహజమైంది. ఇండియాలో చెవులపిల్లుల్లాగా ఇక్కడ కంగారూలు అన్నమాట. మొత్తానికి మొదటిదానికి ధైర్యం చేసాం కానీ, ఎందుకో తినలేకపోయాం.  రెండోది ఆర్డర్ చెయ్యడానిక్కూడా అసలు ధైర్యం చెయ్యలేకపోయాం. 

          మొత్తానికి ఎలాగో భోజనం అయిందనిపించి నైట్ మార్కెట్ లో కాస్సేపు అటూ ఇటూ తిరిగాం. అంత రాత్రి పూట కూడా చుట్టూఉన్న వేడికి తలల మీంచి చెమటలు ధారాపాతంగా కారసాగేయి. తిరిగి హోటలుకి వచ్చి తలారా స్నానాలు చేస్తే గానీ వేడిమి ఉపశమించలేదు. నిద్రకి ఉపక్రమించేసరికి పదిన్నరయ్యింది. 

          మర్నాడు ఉదయాన్నే మేం కెయిర్న్స్ లో మా ప్యాకేజీ టూరులో మొదటి విశేషమైన గ్రాండ్ కురండా  (Grand Kuranda) టూరుకి బయలుదేరేం. 

          మా హోటలు నించి 7.30 కల్లా ఒక పెద్ద బస్సు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంది. బస్సులో మాతో బాటూ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. ముందు రెండు సీట్లలో కూచున్నా మని సంతోషించేలోగా రెండు వీధులు తిప్పి మరొక బస్సులోకి మారమన్నారు. ఆ బస్సు లో చివరి రెండు మూడు వరుసలు తప్ప ఖాళీల్లేవు. సరే లెమ్మని సర్దుకు కూచున్నాం. 

          బస్సెక్కగానే మాకు ఆ రోజు మేం చెయ్యబోయే కార్యక్రమాల వివరాల బ్రోచర్ ఒకటి చేతిలో పెట్టారు. అందులో గంటగంటకీ మా కార్యక్రమం వివరంగా ఉంది. ఎక్కడెక్కడ ఏమేం ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎలా గైడ్లని కలవాలి, ఏ సమయానికి ఏ కార్యక్రమం చెయ్యాలి, ఎంతసేపు ఎక్కడ గడపాలి… వంటి అన్ని వివరాలు ముద్రించి ఉన్నాయి. ఒక విధంగా సగం మేరకు సెల్ఫ్ గైడెడ్ టూరు అది. కానీ ఎక్కడికక్కడ గైడ్ లు ఉండి దారి చూపిస్తూ, సహాయం చేస్తూ ఉన్నారు. 

          ఆ రోజు మొత్తం కార్యక్రమం స్థూలంగా ఏవిటంటే మేం ఒక రైలెక్కి పర్వతసానువు ల్లోకి వెళ్తాం. అక్కడ బటర్ ఫ్లైస్ శాంక్చువరీ (సీతాకచిలుకల సంరక్షణాలయం) ని , రైన్ ఫారెస్టుని, స్థానిక అబోరీజినల్ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాల్ని, కోయలలు, కంగారూల్ని చూస్తాం. చివరగా కేబుల్ కారులో వెనక్కి వస్తాం. ఇందులో నాకు స్థానిక సంస్కృతిని దగ్గరగా చూడడం అనే అంశం బాగా నచ్చింది. ఇప్పటికి అసలు ఆస్ట్రేలియాని చూస్తామన్న సంతోషం వేసింది. 

          ఇక బస్సు ప్రయాణంలో బయటంతా ‘హవాయిలాగా ఉంది’ అని మావారు అంటే ‘తూర్పు కనుమల్లోని మా ఊరులాగా ఉంద’ని మేం అనుకున్నాం. చెరుకు తోటలు, బొప్పాయి చెట్లు, కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం, బాటని వెంటాడే కొండలు.    

          గంటలో ఫ్రెష్ వాటర్ (Fresh Water) అనే ఊళ్ళో రైల్వే స్టేషనుకి చేరుకున్నాం. 

          తొమ్మిది గంటలకి మేం కురండా సీనిక్ రైలు ఎక్కాల్సి ఉంది. కేవలం టూరిజం కోసమే పదిల పరిచిన స్టేషను అయినప్పటికీ అంత సుందరమైన రైల్వే స్టేషనుని ఇంత వరకు మేం ఎక్కడా చూడలేదు. స్టేషనే ఓ చక్కని కెఫెటేరియాలాగా అందంగా అలంక రించి ఉండడమే కాకుండా పక్కనే  పాత రైలు పెట్టెల్లో కాఫీ, బేకరీ ఐటమ్స్ అమ్ముతూ భలే చూడముచ్చటగా ఉంది. ఆకలితో ఉన్నామేమో అందరం తలా ఒకటి కొనుక్కు తిన్నాం.

          ఇక రైలు అనుకున్న సమయానికి పది నిమిషాల ముందే వచ్చేసింది. మాకు చివరి నుంచి రెండో పెట్టెలో సీటు వచ్చింది. మా బోగీ నంబరు, సీటు నంబర్లు మాకు బస్సులో ఇచ్చిన బ్రోచర్ లో “రైలు” అన్నచోట రాసి ఉండడంతో వెతుక్కోవడం కష్టం కాలేదు. 

          అది పాతకాలపు రైలులా అద్దాలు లేని కిటికీలతో మామూలు జనరల్ బోగీలా ఉంది. కానీ, మంచి సీట్లు, రంగులు వేసి ప్రత్యేకంగా తయారు చెయ్యడం వల్ల కొత్తగా ఉంది. బాత్రూము కూడా హోటలు గదిలోలాగా పరిశుభ్రంగా ఉంది.  

          మా ఎదురు సీటు మీద ఎవరూ లేకపోవడంతో ఎదురు బొదురుగా కాళ్ళు చాపుకుని కూచుని స్వేచ్ఛగా, హాయిగా ప్రయాణించాం. 

          రైలు కదిలే ముందు ఒక్కొక్కక్కరికి ఒక్కొక్క విసనకర్రల్లాంటి అర్థచంద్రాకారపు అట్టల మీద రైలు ఎక్కడెక్కడ ఆగేది, ఆయా ప్రాంతాల విశేషాలు ఏవిటి అన్న విషయా ల్ని ఫోటోలతో సహా ముద్రించి అందించారు. దారంతా నిజంగానే విసురుకోవడానికి ఉపయోగపడ్డాయవి. 

          ఇక రైలు జనరల్ బండిలాగే మెల్లగా, స్థిమితంగా వెళ్ళసాగింది. రైలు టన్నెల్స్ ని దాటుతూ వెళ్ళినప్పుడల్లా మాకు దారంతా విశాఖ పట్నం నించి అరకు, బొర్రా గుహలకి వెళ్ళే రైలు ప్రయాణం  జ్ఞాపకం వస్తూనేఉంది. మొత్తం పదిహేను టన్నెల్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతీదీ యంత్రాలు వాడకుండా మనుషులు స్వయంగా తవ్వినవే. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? అన్న శ్రీశ్రీ  జ్ఞాపకం వచ్చాడు. 

          కొండల్లో కోనల్లో దట్టమైన తీగల నడుమ పచ్చని చెట్లని పట్టాలతో దారికడ్డం తొలగిస్తున్నట్టు సాగుతున్న ఆ రైల్లో ఇండియాలోలాగా రైలు మెట్ల మీద కూచుని ప్రయాణం చెయ్యనిస్తే భలే బావుండేది అనిపించింది. కానీ తమాషాకి కూడా ఎవరూ అలాంటి పనులు చెయ్యకుండా తలుపులు గట్టిగా వేసి ఉంచారు. స్టేషనులో ఆగినప్పుడు వాళ్ళే తెరుస్తారు. 

          మొదటగా స్టోనీ క్రీక్ స్టేషను వచ్చింది. పట్టాల పక్కనే స్టోనీ క్రీక్ ఫాల్స్ కనువిందు చేసాయి. అక్కణ్ణించి దార్లో గ్లేసియర్ రాక్, రాబ్స్ మాన్యుమెంట్ అనే పెద్ద రాళ్ళని చూస్తాం. 

          చివరగా పది నిమిషాల పాటు పెద్ద జలపాతం కనిపించే వ్యూ పాయింటు దగ్గిర ఆగింది రైలు. 

          ఆ స్టేషను పేరు బారన్ ఫాల్స్ స్టేషన్. కొండ దిగువన లోయలో దుమికే పెద్ద జలపాతం అద్భుతంగా దర్శనమిచ్చింది. దాని పేరు బారన్ ఫాల్స్. చుట్టూ వెచ్చని వాతావరణంలో చూడచక్కని, ప్రశాంతమైన ప్రయాణంలో అక్కడ రైలు దిగి ఎక్కడం కూడా ఒక హాయైన అనుభూతిని కలిగించింది.  

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.