తెల్లవారింది! 

హిందీ మూలం -`सुबह तो हुई!’- డా. దామోదర్ ఖడసే

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

[ముంబయి వాస్తవ్యులకి 25 జూలై 2005 మరువలేని రోజు. ఆరోజు నెలకొన్న ప్రళయ సదృశ వాతావరణంలో ఎన్నడూ కని-విని ఎరుగని విధంగా భయంకరమైన వర్షం కురిసింది. జనం `ఇటీజ్ రెయినింగ్ ఎలిఫెంట్స్ అండ్ హిప్పోపొటామసెస్’ అని భావించారు. మహానగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల్లో ఉండిపోయినవారు ఆ రాత్రికి సురక్షితంగా ఉండగా, ఇళ్ళకి బయలుదేరినవారు, ప్రత్యేకించి కొంత మంది మహిళలు రాత్రివేళ మార్గమధ్యంలో టెన్షన్ తో ఇబ్బంది పడ్డారు. ఇది ఈ నేపథ్యంలో వ్రాసిన కథ.  – అనువాదకర్త]

          టాక్సీలో మేము ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడింక ఎట్టి పరిస్థితిలోనూ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటం చాలా కష్టమని అందరికీ అర్థమైపోయింది. నిజానికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే ఆఫీసుల నుంచి ఇళ్ళకి చేరుకునేందుకు నలువైపులా జనం పరుగులు తీయడం మొదలయింది. మాకు కూడా ఆ ఆలోచనవచ్చింది. కాని భయంకర మైన నోటితో ప్రతి వస్తువును కబళించే కొండచిలువలాగా నీళ్ళు రోడ్లని పొట్టన పెట్టు కుంటాయని మాకనిపించలేదు.

          ట్రైనులు ఎప్పుడో ఆగిపోయాయి. ముంబయి ప్రత్యేకత ఇదే– ప్రతి వర్షాకాలంలోనూ ఒకటి-రెండు రోజులకి ట్రైనులకి విశ్రాంతి లభిస్తుంది. జనం కూడా అనుకోకుండాదొరికిన ఈ సెలవులని బాగా గడుపుతారు. కాని ఈ విధంగా ఈ మధ్యనే జరిగి అదంతా గడిచి పోయింది….కాని ఈ రోజు ఇప్పుడు నలువైపులా ఎటు చూసినా నీళ్ళే…వర్షం అయితే… మన్ను-మిన్ను ఏకమైనట్లుగా ఆగడం అనేది లేకుండా కురుస్తూనే వుంది. ఒక ధూళి రంగుతో కూడిన సముద్రం నగరంలో ప్రసరిస్తోంది. 

          మా టాక్సీవాడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. టాక్సీ చక్రాలు సగం మునిగిపోయి ఉన్నాయి. అన్నివైపులా నీళ్ళు ఉన్నాయి. పై నుంచి క్షోణీపాతంగా తీవ్రమైన వర్షం. నలువైపులా ఆదుర్దా…భయాందోళనలు. ఎవరు కనిపిస్తున్నా, చెప్పలేని భయంతో పరుగుతీస్తున్నవాళ్ళే. రకరకాల వదంతులు ఇట్టే వ్యాపిస్తున్నాయి…. అక్కడ నుంచి ముందుకి వెళ్ళిన కొద్దీ వరదలాంటి పరిస్థితి అని, ముగ్గురు కొట్టుకు పోయారని… టాక్సీ అతికష్టం మీదనే దొరుకుతుందని, నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని… అయినా, ఈ టాక్సీ అతనికి తన ఇంటి వైపుకు వెడుతున్న దూరప్రయాణీకులుగా మేము దొరికాం అంధేరీ వెళ్ళటానికి. అందుకనే ఇతను మమ్మల్ని తన బండిలో ఎక్కించు కున్నాడు. ఫోర్టు నుంచి మేము ఎలాగో మెల్లమెల్లగా ముందుకి వెడుతున్నాము. చాలా సార్లు టాక్సీ చక్రాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. నా గుండె కూడా తెలియని శంకతో ఆందోళన చెందుతోంది. నేను నా మనస్సులోనే అమ్మవారిని తలుచుకుంటున్నాను. ఇంక మానవమాత్రుడి చేతిలో ఏమీ లేదని అర్థమైపోయింది. మేము ఇంచుమించు మధ్యాహ్నం నాలుగింటికి బయలుదేరాము. అయిదు గంటల సమయం గడిచినా ఇంకా దాదర్ కూడా చేరుకోలేదు. అరగంట మాత్రమే పట్టే దారి. అయినా దానికే అయిదు గంటలు పట్టింది!

          ఇప్పుడింక ఒకే ఒక్క సాధనం సహాయపడగలుగుతుంది – మొబైల్…..కాస్త ఇంటికి ఫోన్ చేసుకుంటే చాలు. మొబైల్ ఇంతగా ఎప్పుడూ ఉపయోగపడలేదు. కాని ఇంత వరకూ ఇంటికి ఎవరూ చేరుకోలేదు. సమ్యక్ ఇంకా ఇంటికి రాలేదు. ఆయన కూడా ఆఫీసు నుంచి అయిదుగంటలకే బయలుదేరానని చెప్పారు. మొబైల్ ఇప్పుడింక తప్పకుండా తీసుకోవలసిందేనని సమ్యక్ కి ఎన్నిసార్లో చెప్పాను. కాని ఆయన అనడం మాత్రం ముందు సామ్యకి తీసుకుందామని. తను కాలేజీలో చదువుతోంది. ఈ రోజుల్లో కాలేజీకి వెళ్ళే అమ్మాయిలందరి దగ్గరా మొబైల్ ఉంటుంది….మనకి కూడా దిగులు తగ్గుతుంది. సామ్యకి కూడా భద్రంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ కారణంగా కూడా మొబైల్ ఇప్పుడు చాలా అవసరం.

          “మమ్మా……ఎక్కడున్నారు మీరు?”

          “తల్లీ, నువ్వు బాగా ఉన్నావా… ఇంటికి చేరుకున్నావా?”

          “నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను…. సేఫ్ గానే ఉన్నాను….డోంట్ వర్రీ…. మీరెక్కడున్నారు?”

          “ఇప్పుడే దాదర్ దాటాం… డాడీతో కాంటాక్ట్ అయిందా?”

          “లేదు. ఇంట్లో ఫోన్ పాడయింది. నా ఫ్రెండ్స్ ఇంట్లోవాళ్ళతో కూడా ఫోన్ కనెక్షన్ దొరకడం లేదు. వాళ్ళిద్దరూ నాతోనే ఇక్కడే ఉన్నారు. వాళ్ళు బోరీవలీ వెళ్ళాలి. వాళ్ళని మన యింటికే రమ్మన్నాను.”

          “నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ పిల్లలూ నువ్వూ తిన్నగా ఇంటికే వెళ్ళిపొండి. మీరంతా జాగ్రత్తగా ఉండండి. నా గురించి ఏమీ దిగులు పడవద్దు. నాతోపాటు సుచేత, శుభ్ర ఆంటీలు ఉన్నారు. మేము ఏదో విధంగా…” ఏమయింది?…ఫోన్ కట్ అయింది. మొబైల్ అవుట్ ఆఫ్ రేంజ్… “భగవంతుడా… పిల్లని రక్షించు తండ్రీ…. ఇప్పుడేం చెయ్యడం?”

          “సుచేతా, నీ ఫోన్ పని చేస్తోందా?”

          “ఒక్క నిమిషం… అవును బాగానే వుంది…..”

          “తొందరగా కాస్త నీ నెంబరు సామ్యకి చెప్పు….ఏదయినా ఎమర్జెన్సీ ఉంటే కాంటాక్టు చెయ్యడానికి ఉంటుంది…పిల్ల కూడా ధైర్యంగా ఉంటుంది.”

          సుచేత తన మొబైల్ నాకిచ్చింది. నేను సామ్యకి రింగ్ చేసి ఇది సుచేత ఆంటీ మొబైల్ అని చెప్పాను. మేము ఒక్క చోటనే కలిసి ఉన్నాము, ఈ నెంబరుకి చెయ్యమ న్నాను, సామ్య కూడా ఊరటగా ఊపిరి పీల్చుకుంది.

          అప్పుడే టాక్సీ పెద్ద ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. ఎడతెరిపి లేని వర్షం, ఒక చేతికి మరోచెయ్యి కనిపించడం లేదు. టాక్సీ అద్దాలు పాలరంగులో తెల్లగా అయిపోయాయి. కేవలం మసక-మసకగా ఉన్న టాక్సీల లైట్లు కనిపిస్తున్నాయి. వైపర్ తిరుగుతోంది కాని, ప్రయోజనమేమీ లేదు. టాక్సీ అతను కూడా మనశ్శాంతి లేకుండా సతమతమవుతు న్నాడు. బహుశా పెట్రోలు కూడా తక్కువగా ఉన్నట్లుంది.

          “మేడం, మీరంతా దిగండి. నేను టాక్సీని తరువాత గ్రౌండ్ లో పార్క్ చేస్తాను. ఇంకా ముందుకి వెళ్ళాలంటే మీరు ఇంకో టాక్సీ చేసుకోండి….”

          “ఇంకో టాక్సీనా?” మేం ముగ్గురం ఒకేసారి అన్నాం, “అలా ఎందుకంటున్నావు…. నువ్వు చూస్తున్నావు కదయ్యా…అందరం ఇబ్బందిలో ఉన్నాం. నువ్వేమో ఇంకో టాక్సీ అంటున్నావు…” మేం ముగ్గురం ఒకేసారిగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. మేము ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. టాక్సీ అతను ఇంకా ఏదో చెబుతున్నాడు. అది జాగ్రత్తగా వింటున్నాం…

          “టాక్సీ ఇంజనులోకి నీళ్ళు వెళ్లాయంటే ఇంక అది పనిచెయ్యదు… నాకు చాలా లాస్ అవుతుంది. అందులోనూ పెట్రోలు కూడా తక్కువగా ఉంది.” సుచేత, శుభ్ర ఒకరి నొకరు చూసుకుని ఏడుపు ముఖం పెట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు పరస్పరం నొక్కుకున్నాయి. కాని ఈ సమయం కోపం చూపిం చేదికాదు. కాస్త ఆలోచించి పని జరుపుకోవాలి. నేనన్నాను, “ఏం బాబూ, మీయింట్లోని  మీ చెల్లెలుకాని, కూతురుకాని ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుపోతే ఇలాగే ఆలోచిస్తావా? ఇంకో టాక్సీ ఇంక దొరకదని నీకు తెలుసు. ఎలాగోలా మాలో ఏ ఒకరి ఇంటి దగ్గరైనా మమ్మల్ని దిగబెట్టు…ప్లీజ్… దేవుడు నీకు మేలు చేస్తాడు…”

          “కాని నేను నష్టపోయేది నాకెవరిస్తారు?”

          “నష్టం గురించి ఏమాలోచిస్తున్నావు? ఎక్కడయినా బండి నిలబెడితే అక్కడ నుంచి కొట్టుకుపోతేనో?” అనడానికి అనేశాను కాని, కొంచెం ఎక్కువ కఠినంగానే మాట్లాడానని పించింది. ఒకవేళ అతను పట్టుపట్టి జబర్దస్తీగా మమ్మల్ని దింపేస్తే చాలా కష్టమైపోతుం ది. ఇదే ఆలోచిస్తూ నేను అతని వంక చూశాను. అతనేదో చెప్పాలనుకుంటున్నాడు.నేను వెంటనే అన్నాను, “బాబూ, నీకు నష్టపరిహారం మేమిస్తాం. కాస్త…” అతను ఒక్కసారి వెనక్కి చూసి, అక్కడి నుంచి ముందుకి వెళ్ళడానికి టాక్సీ స్టార్ట్ చేశాడు. మేము ఇంగ్లీషు లో మాట్లాడుకుంటున్నాము. మొబైల్ కాల్స్ వస్తున్నాయి. బహుశా అతనికి మాతో ఎక్కువ వాదించడం మంచిది కాదని అనిపించి వుండవచ్చు. చాలాసేపు నిశ్శబ్దం తాండవిం చింది. మేము మా కుటుంబ సభ్యుల గురించి దిగులుపడుతూ పరధ్యానంగా ఉన్నాము. అప్పుడే అతను కొంచెం నెమ్మదిగా అన్నాడు, “అమ్మా, నాకు చాలా నష్టం కలుగు తుంది.”

          “కాని నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళగలవు, మా అందరి దారి ఒక్కటే – అంధేరీ. ఇంక ఏమీ ఆలోచించకు. నీకేమైనా నష్టం వాటిల్లితే మేము చూస్తాం.” నా కంఠస్వరంలో ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సుచేత, శుభ్రల కళ్ళలో నన్ను సమర్థి స్తున్న భావం ఉంది.

          కరెంటు పోయింది. మొత్తం సిస్టమ్ లోనే ఏదో లోటు ఉంది. మేము ఒకరికొకరం మా ముఖాలు అతికష్టం మీద చూడగలుగుతున్నాము. ఎందుకంటే కేవలం టాక్సీల టేల్ లైట్లు, హెడ్ లైట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. నలువైపులా చీకటిగా ఉంది. టాక్సీ తలుపు లు లాక్స్ వేసివున్నట్లు మేము రెండు వైపులా రూఢిచేసుకున్నాం. టాక్సీ అతను మంచివాడు. అతని మాటలవల్ల అలా అనిపిస్తోంది. కాని లోలోపల భయం మాత్రం ప్రగాఢమవుతోంది. మేము ముగ్గురం మౌనంగా ఉన్నాం. టాక్సీ అతను కూడా మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు పదికూడా అయింది. ఎవరెవరిని తిట్టుకోవాలో అదంతా పూర్తి అయింది. మునిసిపాలిటీ వారి డ్రైనేజి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రైల్వే సర్వీసు యొక్క వాస్తవికత…. మళ్ళీ ఇల్లు గుర్తుకొచ్చింది….. సామ్య ఇంటికి వచ్చిందా లేదా. సుచేత మొబైల్ తో ఫోన్ చెయ్యబోతుండగానే సుచేత మొబైల్ మోగింది. నేను మొబైల్ సుచేతకి ఇచ్చేశాను. సుచేత హలో అనగానే సామ్య గొంతుక విని నేను ఉలిక్కిపడ్డాను. సుచేత చేతి నుంచి మొబైల్ ఇంచు మించు లాక్కుంటూనే నేను నా చెవికి ఆనించి పెట్టుకున్నాను “తల్లీ, ఎలా ఉన్నావు నువ్వు… ఎక్కడున్నావు? ఇంటికి చేరుకున్నావా… డాడీ వచ్చారా….ఫోన్ సరిగ్గా ఉందా…?”

          “అవును మమ్మా… నేను బాగానే ఉన్నాను. నా ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాని మమ్మా, నువ్వు ఎక్కడున్నావు? బాగా ఉన్నావా? జాగ్రత్త మమ్మా. డాడీ ఇంటికి వచ్చారు. ఇదిగో మాట్లాడు…”

          సమ్యక్ ఎంతో ఆదుర్దాగా మొబైల్ తీసుకున్నారు. ఎన్ని ప్రశ్నలడిగారో. నా దగ్గరికి తను చేరుకోలేదన్న పరిస్థితి ఆయన్ని ఎంతగానో బాధ పెడుతోంది. నేనే ఆయనకి ధైర్యం చెప్పాను. మేము ముగ్గురం ఉన్నాం. టాక్సీ అతను చాలా మంచివాడు. మీరేమీ దిగులు పడకండి. వీలు చిక్కగానే మేము త్వరగానే చేరుకుంటాము.

          ఆయన అన్నారు–“కాని నేను విన్నది బాంద్రా దగ్గర వరద లాంటి పరిస్థితి ఉందని. ఒక కారు, చాలా మంది జనం కొట్టుకుపోయారని…”

          “ఇప్పుడు మీరు అలా ఏమీ ఆలోచించకండి. మాకేమీ కాదు. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఏమాత్రమైనా వీలు కాగానే మేము వచ్చేస్తాము. చూడండి, మీరు ఇక్కడికి రావడానికి అసలు ప్రయత్నం చెయ్యకండి. అదేం ప్రయోజనం లేదు… ఇబ్బంది ఇంకా ఎక్కువవుతుంది.” నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను, ఇంతట్లోనే సుచేత ఫోన్ కూడా ఆఫ్ అయిపోయింది.

          శుభ్ర టాక్సీ డ్రైవరుకి సరిగ్గా వెనకాల కిటికీ దగ్గర కూర్చుని వుంది. చాలాసేపు నుంచి దిగులుగా ఉంది. నిజానికి అందరం దిగులుగానే ఉన్నాం. కాని తను మరోరకమైన దిగులుతో ఉంది. సుచేతతో తను నెమ్మదిగా అంది, “దగ్గరగా మరో టాక్సీలో ఉన్న ఆ మనిషి నన్ను చాలా సేపటి నుంచి అదేపనిగా చూస్తున్నాడు…. నాకయితే భయం వేస్తోంది….”

          అప్పుడే టాక్సీ డ్రైవరు మాట మా అందరికీ వినిపించింది. మా ముగ్గురికీ ఆశ్చర్యం కలిగింది. “అమ్మా, మీరేం కంగారుపడకండి. నేనున్నాను కదా! మీరేమీ అసలు దిగులు పడవద్దు.”

          మాకు డ్రైవరు చెప్పిన ఈ మాట మీద ముందు నమ్మకం కలగలేదు. కాని ఇది మాత్రం అతని గొంతుకే. అతని కంఠస్వరంలో లాభనష్టాల లెక్కలు మాయమైపోయాయి. అతనిలోని మనిషి మా ముగ్గురికీ అండగా ఉన్నాడు. అతనితో మేము శాంతంగా వ్యవహ రించిన తీరు అతని నష్టాన్ని, అతని ఇబ్బందులని మాకు అనుకూలంగా చేసింది. శుభ్ర ఇప్పుడు దగ్గరలో ఉన్న టాక్సీ వైపుకి తన వీపు ఉంచి కూర్చుంది. తన కొంగు తలపై కంటా కప్పుకుంది. నేను తనకి ధైర్యం చెప్పాను, “కమాన్ శుభ్రా… ఏమీ అవదు. ఇన్ని టాక్సీలు-బళ్ళు ఉన్నాయి, ఇంత మంది మనుషులు ఉన్నారు… నువ్వేమో….”

          “అక్షతా, వాడు చాలా సేపటి నుంచి మన వైపుకి చూస్తున్నాడు. అతని చూపు కరెక్టు కాదు…” శుభ్ర టాక్సీ తలుపు తాళాన్ని తడుముతోంది.

          “ఏం చేస్తాడు… ఆఁ… ఇక్కడేమో ప్రాణసంకటంగా ఉంది.” నాకనిపిస్తోంది శుభ్రకి ఇలా అర్ధరాత్రి వరకు ఒంటరిగా చిక్కుకుపోయానన్న భయం ఎలాగూ ఉంది… పైగా తను ఆడదానినన్న దిగులు కూడా….. నాకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తోందో తెలియదు…. నేనే మాట్లాడుతూ ఉన్నాను ఈ టాక్సీ అతనితో, ఈ చీకటితో, ఈ వర్షంతో…. బహుశా ఒంటరిగా వేరే ఊళ్ళకి టూర్ మీద వెళ్ళే నా అనుభవమే నాకు కొంత సాహసాన్ని కలిగించిందేమో…. కాని అప్పుడు లక్నో ఎయిర్ పోర్ట్ దగ్గర రాత్రిపూట… బయట టాక్సీ వాడు నన్ను ఒంటరిగా చూసి ఎలా కట్టడి చేసి ఇబ్బంది పెట్టాడో… నాకు నోట్లోంచి మాట కూడా రాలేదు. అలా ఎప్పుడూ జరగలేదు. యాదృచ్ఛికంగా అప్పుడే, పరిచయం ఉన్న క్షితిజ్ గారు నన్ను చూసి నా దగ్గరికి వచ్చి తన టాక్సీలో రమ్మని ఆఫర్ చేశారు. క్షితిజ్ ముంబయిలోనే ఒక కంపెనీలో సీనియర్ హోదాలో పని చేస్తున్నారు. బిజినెస్ కి సంబం ధించిన పనుల్లోనే అప్పుడప్పుడూ ఆయన్ని కలుసుకోవడం జరిగేది. అంతకు మించి ప్రత్యేకంగా ఆయనతో పరిచయం ఏదీ లేదు. ఏ పరిస్థితిలో ఆయన కనిపించారో అది నాకు గొప్ప సహాయం అయింది. నేను  నా అదృష్టానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ భగవంతుడికి వేలకొద్దీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆయనతో అక్కడి నుంచి నడిచాను. టాక్సీ బయలుదేరిన తరువాత కూడా చాలాసేపు వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేక పోయాను…. ఆయనే అడిగాడు… “మేడమ్, ఆర్ యూ ఓకే?… కొత్తచోట్లలో ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి…” నేనెంతో సాహసం తెచ్చుకుని ఆయన వంక చూశాను. ఇటు వంటి వర్షంలో కారు వైపర్ విరిగిపోతే స్పష్టంగా ఏమీ కనిపించని విధంగానే, వర్షిస్తున్న నాకళ్ళ ముందు నాకు ఏమీ కనిపించడం లేదు. నేను నా నోటితో కేవలం ఇదే అనగలిగాను…”సారీ…”. నాకు ఇంచు మించు ఏడిచే పరిస్థితి అయింది. అప్పుడే క్షితిజ్ గారి గంభీర కంఠస్వరం నాకు  ధైర్యాన్ని ఇచ్చింది… “కమాన్ మేడమ్… అప్పుడప్పుడూ ఇలా అవుతూ ఉంటుంది….”

          లక్నోనగరంలో మొదటిసారి ఆ విధంగా ప్రవేశించటం నేనెప్పటికీ మరిచిపోలేను. ఆయన నన్ను హోటల్ రిసెప్షన్ దగ్గర దిగబెట్టి అడిగారు, “ఇక్కడ ఎప్పటి వరకు ఉంటారు?”

          “ఎల్లుండి వెళ్ళిపోవాలి…”

          “నేను రేపు సాయంత్రమే ఢిల్లీకి వెళ్ళాలి….”

          ఇంకా నేనేదైనా చెప్పేలోగానే హోటల్ రూం బాయ్ నా సామాను తీసుకున్నాడు. నేను కేవలం ఇదే అనగలిగాను… “క్షితిజ్ గారూ, థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్…” నా కళ్ళు  కృతజ్ఞతా భావంతో నిండిపోయాయి…

          క్షితిజ్….చీకటిగా ఉన్న ఆకాశంలో అనుకోకుండా అప్పటి దృశ్యం కదలాడింది… ఒక మందహాసం నా పెదవుల పై వెల్లివిరిసింది. శుభ్ర నన్నుచూసి ఊరట చెంది నన్ను ఎప్పటి నుంచో తదేకంగా చూస్తోంది. నా చిరు దరహాసంతోనే తను ధైర్యం తెచ్చుకున్న ట్లు కనిపించింది. అప్పుడే టాక్సీ అతని కంఠస్వరం మా ముగ్గురినీ మా-మా దృష్టికి ఎదురుగా తీసుకువచ్చింది,“అమ్మా, మీరేమీ చింతించకండి. నేను బతికున్నంత వరకూ మీకేమీ ప్రమాదం జరగనివ్వను…. మీరు నిశ్చింతగా ఉండండి…”

          మేం ముగ్గురమూ మౌనంగా ఉన్నాం….ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ కూర్చున్నాం…అప్పుడే కుండపోత వర్షపు తీవ్రమైన జల్లులు బాహ్యప్రపంచం నుంచి మమ్మల్ని వేరు చేసేశాయి. అదేపనిగా చూసేవాడి సంగతి అలా వుంచి ఇప్పుడతని టాక్సీ కూడా కనుపించడంలేదు…  

          రాత్రి రెండవుతోంది. వర్షం జోరు కొంచెం తగ్గింది. ఏ విధమైన కాంటాక్టూ పని చేయడంలేదు. కేవలం మేంముగ్గురం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నాం. కాని ఇప్పుడు టాక్సీ అతను కూడా మా ఇబ్బందుల్లో భాగస్వామి అయ్యాడు. నలువైపులా నెలకొన్న గాఢాంధకారం…. కాసేపు టాక్సీ నడుస్తోంది, కాసేపు ఆగిపోతోంది…. మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియడంలేదు. బయట అసలు ఏమీ కనుపించడంలేదు.

          శుభ్ర తన తలపైకంటా కొంగు కప్పుకుంది. మా అందరికీ నిద్రకళ్ళు పడిపోయాయి. కాని తనకి కొంచెం కునుకు పట్టింది. నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు సుచేత గురించిన ఆలోచనే వస్తోంది. తను మా ఇద్దరి మధ్యలో కూర్చుంది. భయం తనకి ఎక్కువగా ఉంది. నాకు కునుకుపడితే తను దిగులు పడుతోంది. నేను కళ్ళు తెరిస్తే తను నేను కళ్ళు ఎప్పుడు తెరుస్తానా అని ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. కాని నాకు మాత్రం కునుకు ఎక్కడ పడుతోంది. మేము మౌనంగానే మాట్లాడుకుంటున్నాం. అప్పుడే చాలాసేపు తరువాత టాక్సీ అతని మాట వినిపించింది, “ఇప్పుడు మనం బాంద్రా ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇంక ఇప్పుడు కనీసం కొట్టుకుపోతామేమోనన్న ప్రమాదం లేదు. మునిగిపోతామన్న భయం కూడా లేదు…”

          అతని గొంతుకలో ప్రాణాలు దక్కాయన్న సంతోషం ఎలాగూ ఉంది, దానితో బాటు ఇప్పుడు అతని టాక్సీ కూడా సురక్షితంగా ఉంటుంది. చాలా పొడవాటి ఫ్లైఓవర్. ఎటు పక్కకూ కదిలేందుకు వీలులేని ట్రాఫిక్ జామ్…

          సుచేత కదలికతో నేను నా బరువెక్కిన కళ్ళు తెరిచాను. గడియారం చూస్తే ఉదయం ఆరు గంటలవుతోంది. శుభ్రకి కునుకు పట్టింది.

          టాక్సీలన్నీ, బళ్ళు అన్నీ చీమలబారులా ఉన్నాయి. ఎక్కడా ఏదీ ఓవర్ టేక్ అనేది కాని, స్పీడు అనేది కాని లేదు….

          సుచేత అలసటలో ఒక నిశ్చింతత, ఒక నమ్మకం తొంగిచూస్తోంది. “అమ్మయ్య, ఇంక తెల్లవారింది…”

          తను ఆ మాత్రం అనగానే శుభ్ర కంగారుగా మేలుకుంది. అన్నిటికన్నా ముందు తను టాక్సీ లాక్ తడిమి చూసింది… లాక్ వేసే ఉంది. ఇంక మమ్మల్ని ఇద్దరినీ చూసి ఒకసారి నిట్టూర్చింది. పక్కకి తిరిగి చూస్తే ఒక టాక్సీ మా టాక్సీకి బాగా దగ్గరగా ఉంది…. తను గట్టిగా అరిచింది… అదే పనిగా చూసే ఆ మనిషి బాగా దగ్గరగా ఉన్నాడు. తను సుచేతని గట్టిగా చుట్టుకు పోయింది. సుచేత కూడా తన జలదరింపు నుంచి తప్పించుకో లేకపోయింది. తను కూడా శుభ్రని వాటేసుకుంది. నేను గమనించింది పక్కనున్న టాక్సీ లో వెనకాల సీట్లో కూర్చున్న మనిషి అదేపనిగా చూస్తున్నాడు. గాజు అద్దం మీద అతని తల ఆనించి ఉంది. కళ్ళు తెరుచుకుని ఉన్నాయి. నేను ఇటూ-అటూ కదిలి అతన్ని జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నించాను. కాని అతను నిర్వికారంగా అలాగే అదే భంగిమ లో వున్నాడు…. ఇక్కడ అతి కష్టం మీద శుభ్ర మళ్ళీ తన ముఖం మా వైపుకి తిప్పుకుని సర్దుకునేందుకు ప్రయత్నించసాగింది. ఇప్పుడు తెల్లవారికూడాపోయింది. రాత్రంతా ఉన్న భయం తగ్గింది. అయినా వర్షం ఇంకా కొనసాగుతూనే వుంది. కాని ఇప్పుడు మేము ఫ్లైఓవర్ మీద ఉన్నాము. మా టాక్సీ అతను కోపంతో కొంచెం మండిపడుతూ కిందికి దిగాడు. అతని పాసెంజర్లు నొచ్చిన మనస్సుతో ఆహతులై ఉన్నారు. ఎవడో తుంటరి తనంతో ప్రవర్తిస్తున్నాడు. ఎవరైనా ఇలా ఎవరినైనా అదేపనిగా చూస్తాడా. శుభ్రతో పాటు అతను కూడా అశాంతంగా ఉన్నాడు. అతను సిద్ధంగానే కిందికి దిగాడు. వెళ్ళి ఆ మనిషి కి ఎదురుగా నిలబడ్డాడు. ఏమయినా జరగకూడనిది జరుగుతుందేమోనని నా మనస్సు కీడు శంకిస్తోంది. కాని ఎవరైనా ఇంత కలతచెందేలా ఏమిటలా చూడటం.

          మా టాక్సీ అతను తదేకంగా చూస్తున్న ఆ మనిషి దగ్గరికి వెళ్ళి టాక్సీ అద్దాన్ని టకటకమని కొట్టాడు…కాని ఆ చూస్తున్నవాడి కళ్ళు నిర్వికారంగా ఉన్నాయి…రాళ్ళలా కొయ్యబారిపోయి…ఏ రంగూ లేకుండా తెల్లగా…మా టాక్సీ డ్రైవరుకి ఏదో జరగకూడనిది జరిగినట్లుగా అనుమానం వచ్చింది… వణుకుతున్న చేతులతో, భయాందోళనతో కంపి స్తున్న గొంతుకతో మాటలులేకుండా విచిత్రంగా అరిచాడు. ఇంచు మించు టాక్సీ అద్దాన్ని కుదిపేస్తూ గట్టిగా కేకలు పెట్టాడు, “ఇక్కడ చూడండయ్యా, ఈ మనిషికేమయ్యిం దో చూడండి?” అతని దగ్గర కూర్చున్నవాడు కంగారుగా అతన్ని చూశాడు. అరుస్తూ ఇంకో అతనితో టాక్సీలోంచి బయటికి వచ్చాడు. వాళ్ళిద్దరూ, ఆ టాక్సీ డ్రైవరు పడుతు న్న కంగారు, దిగులు చూసి వాళ్ళకి ఏదో భయంకరమైన పీడకల చూసి మేలుకున్నట్లు అనిపించింది. ఏదో మంచు ప్రాంతపు కొండచిలువ వాళ్ళ టాక్సీలోకి వచ్చి ప్రవేశించి నట్లు కంగారు పడుతున్నారు. వాళ్ళు ఒకరికొకరు పరిచయం ఉన్నవాళ్ళు కారు. కేవలం ముంబయిలోని ప్రాణఘాతుకమైన వర్షం వాళ్ళని ఒకచోట అక్కడ కలిపింది.

          అతడి పక్కనే కూర్చున్నఅతను అన్నాడు, “ఇతను రాత్రంతా మెలకువగానే ఉన్నాడు. ఉండి-ఉండి ఇతను వణుకుతూ ఉన్నాడు…. వాంతి చేసుకుంటున్నట్టు తన ముఖం అద్దం వైపుకి పెట్టుకునేవాడు…. నాకు కాస్త కునుకు పట్టింది. అతను వణుకు తున్నట్టు కూడా నాకు అర్థమయింది….కాని ఇతనికి ఫిట్స్ వచ్చే జబ్బు ఉండివుండ వచ్చు, లేదా చాలా ఎక్కువగా చలి వేస్తూ ఉండవచ్చు….నేను కావాలనుకున్నా కళ్ళు తెరవలేకపోయాను….నిద్ర కళ్ళలో నాకు ఏదో పెద్ద కొండచిలువ నా బెడ్ రూంలోకి ప్రవేశించిందని అనిపించింది…నా కళ్ళ ముందు అంతా ఏదో ఎరుపురంగుతో నిండి పోయి కనిపిస్తున్నట్టయింది. నా ఒళ్ళంతా మంచుతో కప్పేసినట్లయిపోయింది… నేను నిద్రలోనే అరుస్తూ ఉన్నాను….కాని కళ్ళు తెరవలేకపోయాను….మళ్ళీ నిద్రపట్టేసిం ది….!”

          అందరూ అతను చెప్పేది వింటున్నారు. ఎందుకో నాకేదో అనిపించింది – ఏమనిపించిందో ఏమో… నేను టాక్సీ దిగి బయటికి వచ్చాను. వాళ్ళతో గట్టిగా అన్నాను, “ఏమయిందో కాస్త చూడండి!” టాక్సీ తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. డ్రైవరు లాక్ ఓపెన్ చేశాడు. టాక్సీ తలుపు తెరుచుకోగానే అతను దొర్లి కిందికి పడిపోయాడు. బయట ఎడతెరిపి లేని వర్షం. అంతా అయిపోయింది. జనం తడుస్తూనే ఇప్పుడు కేవలం `బాడీ’ గా మిగిలిపోయిన ఆ అపరిచిత వ్యక్తికి చుట్టూ నిలబడ్డారు. అంతా హతప్రభులై, ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

          శుభ్ర తన చీరకొంగుతో ముక్కు మూసుకుంది. ఇప్పుడు ఇంకా భయభ్రాంతురాలై ఆ మనిషిని చూస్తోంది. బయట భయంకరమైన వర్షం, తడుస్తూ మేమందరం, శుభ్ర కన్నీళ్ళు ముప్పిరిగొన్న కళ్ళు …మరో ప్రశ్న ఎదురుగా ఉంది… ఇప్పుడింక తరువాత ఏం చెయ్యాలి? ఇప్పటి వరకూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుతెన్నులు చూశాం. మొత్తానికి తెల్లారిపోయింది. కాని ప్రశ్నల అంధకారం ఇంకా ఎక్కువ గాఢంగా కమ్ము కుంది. తడుస్తున్న జనం గుంపు పెరుగుతోంది…. వర్షం మాత్రం అసలు తగ్గడం లేదు!

***

డా. దామోదర్ ఖడసే – పరిచయం

డా. దామోదర్ ఖడసే గారి సాహిత్యసేవ విస్తృతమైనది. వీరి 9 కథాసంకలనాలు, 4 నవలలు, 10 కవితాసంకలనాలు, 1 సమీక్ష, 4 ట్రావెలాగ్స్, 8 అధికారభాషకి సంబం ధించిన గ్రంథాలు ప్రచురితమయ్యాయి. కొన్ని డాక్యుమెంటరీలకి, టెలీఫిలింలకి స్క్రిప్టు రాశారు. వీరి సాహిత్యం పైన, వ్యక్తిత్వం పైన విద్వాంసులు రాసిన 7 పుస్తకాలు వెలు వడ్జాయి. వీరి రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధభారతి, దూర దర్శన్, టీవీ ఛానళ్ళలో ప్రసారితమయ్యాయి. ఈయన వివిధ విద్యాసంస్థలలో 1200 కన్నా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చారు. వీరి రచనలను వివిధ విద్యాసంస్థల కోర్సులలో పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. ఈయన మరాఠీ నుంచి, ఆంగ్లం నుంచి 19 సాహిత్య గ్రంథాలను అనువదించారు. 7 పుస్తకాలకి సంపాదకత్వం నిర్వహించారు. వీరి రచనలు ఆంగ్లంతో సహా 10 భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి సాహిత్యం పై కొల్హాపూర్, అమరావతి, షోలాపూర్ యూనివర్సిటీలలో 5 పిహెచ్ డి, పుణే యూనివర్సిటీ ద్వారా 1 ఎం.ఫిల్. డిగ్రీలు ప్రదానం చేశారు. డా. ఖడసే ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థల ద్వారా సన్మానం పొందారు. గౌ. రాష్ట్రపతి గారి ద్వారా 1992లో, 2012లో సాహిత్య పురస్కారం ప్రదానం చేయబడింది. వీరు కేంద్రప్రభుత్వానికి చెందిన కొన్ని ఉన్నత స్థాయి కమిటీలలో సభ్యులు. నాలుగు యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 30 సంవత్సరాలు సేవ చేసిన అనంతరం అసిస్టెంట్ జనరల్ మానేజరుగా రిటైర్ అయ్యారు. డా. ఖడసే పుణే వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.