సర్వసంభవామ్ – 1

-సుశీల నాగరాజ

          ఈ మద్యనే  డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డిగారు అనువాదం చేసిన ‘విరాట్’  పుస్తకం చదివి రివ్యూ రాశాను.

          కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు!
దేనినైతే మనం “ధర్మం” అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి.

          “ధర్మో రక్షతి రక్షితహః”
    
‘సర్వసంభవామ్’  పుస్తకం గురించి రాసేందుకు ముందు .

నేను పుట్టిపెరిగిన నేపథ్యం గురించి చెప్పాలి…

మరీ ఆచారవ్యవహారాలు లేకపోయినా, రోజూ పూజలు, పండుగలు, ధనుర్మాసం సమయంలో సూర్యోదయానికి ముందేలేచి దేవాలయానికి వెళ్ళటం. శనివారం శ్రీరాముని పూజ. 16 సోమవారాల వ్రతం ఇలాంటివన్నీ ఉపవాసాలతో చేసేది మా అమ్మ. మా మనసంతా ప్రసాదం పైనే ఉండేది.

          మా అమ్మ పండుగలపుడు, ఆదివారాలలో పూజకు సంబంధించిన పనులుచాలానే చేయించేది. ఇలాంటివన్నీ క్రమంగా మా అమ్మతోపాటు ఆచరించేవారము.

          పెళ్ళైన తరువాత కూడ అన్ని పూజలను చేసుకుంటూనే వచ్చాను. మా అమ్మ చని పోయిన తరువాత మెల్లగా ఏ పండుగ వచ్చినా దేవుడి ముందు దీపం వెలిగిస్తే నాకు పండుగ పూర్తయిపోయినట్లు. అంత సరళం, సులభం చేసుకున్నాను.

ఆ ఏడుకొండలవాడిని దర్శించుకున్న నా నేపథ్యం…

పెళ్ళికి ముందు రెండుమూడు సార్లు తిరుపతి కొండకు వెళ్ళి ఒక రాత్రంతా కంపార్ట్మెంట్ లో ఉండి మరుసటిరోజు ఉదయం ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నా ము..  

          1999లో నేనూ మావారు కాలినడకన వెళ్ళాము. డిసెంబరు నెల కాబట్టి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండింది. ఉదయం 8 గంటలకు బయలుదేరాము. వానజల్లు ప్రారంభ మైంది. ఎక్కడా కూర్చోలేదు. ఉసిరికాయలు మాత్రం కొని తింటూ మెట్లెక్కడం ప్రారంభిం చాం. 

          నడుస్తూంటే వేంకటేశ్వరుని పాటలు, నామస్మరణతో దేహం, మనసూ రెండూ పులకించాయి. ‘భావములోనా బాహ్యమునందూ” అంటూ ఆ ప్రకృతి అందాలు, ఆ పచ్చదనం మనసును చూరగొన్నాయి.

          ఏ అలుపుసొలుపు లేకుండ ‘ పదవే పోదాము గౌరి పరమాత్ముని సూడా,’ అంటూ ! నడిచాము.

          11 గంటలకు కొండ పైకి  చేరాము. అంటే ఎక్కడానికి  3 గంటలు తీసుకున్నాము. ఆ మబ్బులు, ఆ చల్లదనం, ఆ వానజల్లు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది.

          ఆ రోజురాత్రి కుంభవృష్టి కురిసింది. ఉదయం ‘ సుప్రభాత ‘ పూజకు వెళ్ళాము.

          మళ్ళీ 2017 నవంబరులో స్నేహితుడి కుమారుని వివాహానికి తిరుపతి వెళ్ళాము.  అప్పుడు Senior Citizens కు ప్రత్యేక దర్శనం ఉన్నందు వల్ల త్వరగానే దర్శనం చేసుకుని వచ్చాము. మరుసటి రోజే అంటే 29th నవంబరు 2017 మా బాబు మధు  మెగలాన్ జలసంధిని ఈదాడు అన్న వార్త తెలిసింది..

          చాలా రోజుల నుంచి నా దగ్గరే ఉన్న ‘సర్వసంభవామ్’ పుస్తకం చదవండి అని స్నేహితురాలు గుర్తుచేసింది. .

          అలా  పి.వి.కె.ఆర్ ప్రసాద్, IAS గారి ‘సర్వసంభవామ్” “నాహం కర్తా,  హరిః కర్తా” పుస్తకం షెల్ఫ్ నుంచి చేతికి వచ్చింది. 

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.