
కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత)
-సుభాషిణి వడ్డెబోయిన
కళ్ళ లోగిలిన చూపుపడకేసి
కలల ధూపమేసి
తలపు తలుపు తెరచుకున్నా
కాలం కరుగుతున్నా
కానరాననుకోని
కాదంటానని కలత పడ్డావేమో!
సెలయేటి నవ్వులతో సంచరించిన ఊసులు
చిలిపి మాటలతో చెప్పుకున్న ముచ్చట్లు
మనం అనే వనంలో పండు వెన్నెలలో
పడి పడి కోసుకున్న పూలనడుగు
నా మనసు సువాసనలు చెబుతాయి
మన చెలిమి వెలుగు కునుకుతో
చీకటికి కునుకాగి
జాబిలి జంట కోరికతో సిగ్గుపడి
మబ్బు ఒడిలో మునిగింది
చలికే వణుకు పుట్టి
వేడి కోసం వెతుక్కుంటూ
మదిన మత్తును కోరగా
మన పక్కలో ఒరిగి,
తొంగి చూసే జాము వెక్కిరించేలోపే
గుట్టుగా నా గుండెల్లో దూరిపో
కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను…
కోరిన తీపి కోరికను
మూట కట్టి నీ ముందు ఉంచుతాను…
*****

సుభాషిణి వడ్డెబోయిన ఓ యేడాది నుండి వచన కవిత్వం వ్రాస్తున్నాను. నేను ఓ సామాన్య గృహిణి. ఇంటర్ మాత్రమే చదువుకున్నాను. ప్రకాశం జిల్లా పొందూరు అనే గ్రామంలో ఉంటాను. మన నెచ్చెలి పత్రిక చాలా నచ్చింది.. మంచి మంచి కవితలు, వ్యాసాలు చదివి నేను కూడా వ్రాసి పంపాను

కవితకు పెట్టిన పేరు చూడగానే ఎవరైనా చదవకుండా ఉండలేరేమో! చక్కని భావ వ్యక్తీకరణతో సాగిన మంచి కవిత.
కవితకు పెట్టిన పేరు చూడగానే ఎవరైనా చదవకుండా ఉండలేరేమో! చక్కని భావ వ్యక్తీకరణలో సాగిన మంచి కవిత.