బామ్మ చెప్పిన బాటలో

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-కె.వి.లక్ష్మణరావు

          సాయంత్రం ఆఫీసు నుండి ఇంటి కొచ్చేసరికి అలసట వచ్చేసింది. ఒక కప్పు కాఫీ తాగితే కానీ అలసట తగ్గదను కుంటూ గుమ్మంలోకి అడుగు పెట్టాను.
 
          నేను రోజూ ఇంటికొచ్చే సమయానికి రుక్కు హాల్లో సోఫాలో కూర్చుంటుంది. కాసేపు టి.వి. తోనో, ల్యాప్టాప్ తోనో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. బీ.టెక్ కంప్లీట్ చేసింది కదా , సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. వాళ్ళు సాంకేతిక సాధనాలతో కాలక్షేపం చేసినా అది ఎడ్యుకేషనే అని నా అభిప్రాయం.
 
          కానీ రుక్కు హాల్లో లేదు. తన బామ్మ అంటే మా అత్తగారు, రుక్కు ప్లేస్ లో దర్జాగా కూర్చొని టీ.వి. చూస్తోంది.
 
          “బామ్మా! షుగర్ ఎన్ని స్పూన్స్ వేయమంటావ్?” రుక్కు కిచెన్ రూమ్ లో నుండి అడుగుతోంది.
 
          “రెండు స్పూన్స్ వేయి. అది కూడా అడగాలా?” కొంచెం వెటకారాన్ని కలగలుపుతూ అంటోంది అత్తయ్య.
 
          గుమ్మంలో నన్ను చూడగానే “పల్లవీ!,వచ్చావా? అమ్మ ఆఫీసు నుండి అలసిపోయి వస్తుంది కదా! అమ్మ కోసం కప్పు కాఫీ కలపమని రుక్కుతో అన్నాను.
 
          “నాకు కాఫీ తాగడమే తప్ప కలపడం రాదంది.!” గొప్పగా ఫోజిస్తూ. ఆ మాట వినగానే ముందు ఆశ్చర్య పోయాను.”నేర్చుకుంటే రానిదంటూ ఉండదు,! ఆడపిల్లవు కదా!వంటా- వార్పూ రాకపోతే ఎలా? నేను నేర్పుతానులే! అన్నాను. వెంటనే వంటింట్లోకి వెళ్ళింది.
 
          అత్తయ్య గొప్పగా నవ్వుతూ అన్న మాటలు నాకు నచ్చలేదు.
 
          “అంత ప్రేమే ఉంటే కాఫీ మీరే కలపచ్చుగా! పసిపిల్లను పనిపిల్లను చేస్తారా?హ్యాండ్ బ్యాగ్ ను సోఫాలో విసురుగా పడేశాను. విసుగ్గా అత్తయ్య కేసి చూశాను.
 
          “అది పెళ్ళీడు పిల్ల. రేప్పొద్దున పెళ్ళయ్యాకా మొగుడుకు కాఫీ కలపడం కూడా రాదని చెబితే …”మీ అమ్మగారు ఎలా పెంచారని నిన్నే అంటారే!”అత్తయ్య బుగ్గలు నొక్కుకుంటూ అంది.
 
          “ఆడపిల్లా…వంటింటి కుందేలు!” వంటి వాక్యాలు ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. ఇది ఆధునికం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీకెండ్ లో పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వంటకి కుక్..వంట సామాన్లకి పనివాళ్ళుంటారు. నేటి ట్రెండ్ వేరు. అయినా అప్డేట్ కాకుండా ఔట్ డేటడ్ అయిన మీకేం తెలుస్తాయిలే?” ప్రతీకారాన్ని వెటకారంలో కలిపేస్తూ అనేశాను.
 
          “రుక్కు!” అని గట్టిగా పిలిచాను.
 
          నా అరుపు లాంటి పిలుపు విని ఒక్కసారిగా ఉలిక్కిపడిన రుక్కు , కాఫీ కప్పును కింద పడేసింది.
 
          ‘దబ్ మని చప్పుడు  చేస్తూ కప్పు పది ముక్కలైంది.
 
          నా కోపం తారా స్థాయికి చేరింది. “బంగారం లాంటి రుక్కు ను కష్ట పెడుతున్నారు.
ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోనన్నాను.
 
          అత్తయ్య మౌనం వహించింది.
 
          “రుక్కు! చేసింది చాలు. పగిలిన కప్పు ముక్కలను మంగమ్మ తీస్తుందిలే. నేను బతికుండగా నీకు కిచెన్ రూమ్ లోకి వెళ్ళే ఖర్మ పట్టనివ్వనంటూ, అత్తయ్య కేసి కోపంగా క్రీగంట చూస్తూ అక్కడి నుండి కదిలాను.
 
          మంగమ్మ వచ్చి సింక్ లో సామన్లన్నీ కడిగేసి, కప్పు ముక్కల్ని తీసేసి డస్ట్ బిన్ లో వేసింది.
 
          అప్పుడు బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చి కాఫీ కలిపాను. బాధ పడినా బాధ్యత తప్పదు కదా? అనుకుంటూ ఒక కప్పు కాఫీ అత్తయ్య ముందు టేబుల్ పై పెట్టాను. ఎప్పటిలా ‘కాఫీ తాగండి!అత్తయ్యా!’అని మాత్రం అనలేదు.
 
          మామయ్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఏం? ఉంటారని మా ఇంట్లోకి ఆహ్వానిం చడం నా తప్పయింది. ఆయన ట్రైనింగ్ కు వెళ్ళారు కదా, రుక్కుకు తోడుగా, నాకు చేదోడు వాదోడుగా ఉంటారని పిలిస్తే మొదటికే మోసం వచ్చింది. పెళ్ళైన పదేళ్ళకు పుట్టిన రుక్కుకు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వస్తున్నాను. నా బంగారాన్ని వంటింటి కుందేలు చేసేద్దా మనుకుంటోందేమో. ఈ విడ బుద్ది నాకేం కొత్త కాదుగా. నేను కాపురానికి వచ్చిన కొత్తలో పదహార్రోజుల పండుగ పూర్తయిందో లేదో? వంటింటి పనంతా నా కప్పగించేసి ఆవిడ పెత్తనం చెలా యించేది. ఆయన ఆఫీసు నుండి వచ్చే సమయానికి మాత్రం నన్ను హాల్లో కూర్చో బెట్టి ఆవిడ వంటింట్లో దూరేది. ఇంటెడు చాకిరీ ఆవిడే చేస్తున్నట్లుగా ఆయన ముందు కనబడాలని. అలాంటి లౌక్యం నాకు తెలీదు.. రాదు.
నా డిగ్రీ చదువుకు ఆఫీసులో క్లర్కు ఉద్యోగం రాబట్టి, నాకు అత్తయ్య ఆరళ్ళు తప్పాయి. ఉద్యోగం పేరుతో వేరే కాపురం పెట్టే వెసులుబాట కలిగింది. నా మీద అప్పుడు చాలా యించ లేని పెత్తనం ఇప్పుడు పని పేరుతో రుక్కు మీద చలాయిస్తోంది. అయినా రుక్కుకు అత్తయ్య నన్ను పెట్టిన బాధలన్నీ చెప్పేశాను. వాళ్ళ బామ్మ ఏం చెప్పినా వినదులే !’ అనుకున్నాను.
 
          కొంత సేపటికి రుక్కు మాత్రమే బెడ్ రూమ్ లోకి రావడంతో
 
          “మీ బామ్మ రాలేదే?”అడిగాను.
 
          “హాల్లో దివాన్ మీద పడుకుంటానని చెప్పింది. ఏ.సి.పడటం లేదట. రానంది!”. రుక్కు జవాబిచ్చింది.
 
          “ఏ.సి.కాదు. మీ బామ్మకు నేనంటే పడదు. అందుకే రాలేదు!”రుక్కుతో అన్నాను.
 
          “అమ్మా!బామ్మ మంచిదే అనిపిస్తోందే!”రుక్కు మెల్లగా అంది.
 
          “అప్పుడే బామ్మ భజన మొదలెట్టావా? అవునులే..అమ్మ చేదు, బామ్మ తీపి!అంతేగా!” అన్నాను ఉక్రోషంగా.
 
          “మీ అత్తా, కోడళ్ళ మధ్యకు రాకూడదులే!” అంటూ  రుక్కు నా పక్కన ఒరిగింది.
 
          “పిచ్చి పిల్లా! అత్త తామరాకైతే, కోడలు నీటి బొట్టు. ఇద్దరూ కలిసినట్టు కనబడతా రు. కానీ కలుసుకో (లే)రు.”
 
          “నాకు అర్ధం కాలేదే!” రుక్కు అమాయకంగా మొహం పెడుతూ అంది.
 
          “రేపు పెళ్ళయ్యాకా నీకే తెలుస్తుందిలే, పడుకోమంటూ రుక్కును, జోకొట్టాను. ఇరవై ఏళ్ళు వచ్చినా నేను జోకొట్టనిదే పడుకోదు. నేను పిలిస్తే గానీ నిద్ర లేవదు. చూస్తుండ గానే రుక్కు నిద్రలోకి జారిపోయింది. అత్తయ్య కూడా హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆవిడ పెట్టే గురక చప్పుడే అందుకు నిదర్శనం. ఆహా! ఈ వయసులో నిద్ర మాత్రల వసరం లేకుండా నిద్రపోతోంది. అదృష్ట వంతురాలనుకున్నాను. నాకు మాత్రం బుర్ర నిండా రుక్కు ఆలోచనలే. అవసరమైతే అల్లున్ని ఇల్లరికం తెచ్చుకుంటాను కానీ, రుక్కు ని వంటింటి కుందేలుని చేయను. అలా ఆలోచిస్తూనే కలత నిద్రలోకి జారుకున్నాను.
 
          తెల తెల్లగా తెల్లారింది.
 
          ఎప్పటిలాగే మెలకువ వస్తోంది. కానీ విపరీతమైన బాడీ పెయిన్స్ కారణంగా లేవ లేక పోతున్నాను. జ్వరంగా ఉందని పించింది. లేని ఓపిక కూడదీసుకుంటూ సెల్ ఫోన్ తీసి ఆఫీస్ బాస్ కు లీవ్ అని మెసేజ్ చేసాను. రుక్కు ఇంకా నిద్రలోనే ఉంది. నేను కూడా తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయాను.
 
          మెలకువ వచ్చి చూసే సరికి సరిగ్గా ఎనిమిది గంటలైంది.
 
          రోజూ అయితే టిఫిన్ చేసి ఆఫీసుకు బయలు దేరే టైమ్. తప్పదనుకుంటూ లేవ లేక లేచాను. అయితే నేను నిద్ర లేపితే కానీ లేవని రుక్కు, నా పక్కన లేకపోయే సరికి ఆశ్చర్యపోయాను. “రుక్కు” అని గట్టిగా పిలిచాను. కానీ రుక్కు నుండి జవాబు రాకపోయే సరికి నాలో కంగారు మొదలైంది. రుక్కు సెల్ ఛార్జింగ్ లో ఉంది. మరైతే రుక్కు ఒంటరి గా, ఎక్కడికి వెళ్ళినట్టు?” నాలో అనేక సందేహాలు.
 
          అత్తయ్యను గమనించాను. పూజ గదిలో పూజ చేసుకుంటోంది. “తప్పక మీతో మాట్లాడుతున్నాను. రుక్కు ఎక్కడ?” అడిగాను. ఎదురుగా ఉన్న గోడకేసి చూస్తూ…
 
          “నేను చూడలేదు. నాకు తెలియదు. నా వైపు చూడకుండానే రెండే రెండు ముక్కలు చెప్పేసి తిరిగి పూజ చేసుకోసాగింది.
 
          నాకు అత్తయ్య పద్ధతి నచ్చలేదు. మీకు నా మీద కోపం. నా రుక్కును నా నుండి దూరం చేయాలనుకున్నారు.
 
          ‘బామ్మ, మంచిదే నమ్మా’ అని రుక్కు నాతో అన్నప్పుడే నాకు మీ మీద అనుమానం వచ్చింది. నా రుక్కును నా నుండి దూరంగా ఎక్కడకు పంపించారు?” గట్టిగా అడిగాను.
 
          “అబద్ధం ఆడను.. రుక్కు ఎక్కడుందో నాకూ తెలియదు. కానీ కంగారు పడకు. రుక్కు ఎక్కడికెళ్ళినా వచ్చేస్తుందిలే!” అని దర్జాగా సోఫాలో కూర్చున్న అత్తయ్యను చూడగానే నా కోపం పతాక స్థాయికి చేరుకుంది.
 
          “చేసిందంతా చేసేసి నన్ను ఊరడిస్తున్నారా? నా రుక్కు ఎక్కడ?” గట్టిగా అరిచాను.
 
          అంతలోనే గుమ్మంలో నుండి వచ్చిన రుక్కు “అమ్మా! గట్టిగా మాట్లాడకే. నీకసలే జ్వరం కదా. నీరసం వస్తుంది!” అంటూ నన్ను సోఫాలో కూర్చో బెట్టింది.
 
          ఆ మాట వినగానే అత్తయ్య సోఫాలో నుండి అమాంతం లేచింది. నా వద్దకు వచ్చి తన చేతుల్లోకి నా చేతిని తీసుకుంది.
 
          “పల్లవీ! విశ్రాంతి తీసుకో! ఎక్కువగా ఆలోచించకు. అంతా మంచే జరుగుతుంది. 
నా తలను అత్తయ్య ఒడిలో పెట్టుకుంది. నా చేతులను ఆవిడ చేతులతో రాస్తోంది.
నా కంతా విచిత్రంగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తోంది.
 
          “రుక్కు!నువ్వు ఎక్కడకు వెళ్ళావమ్మా? అమ్మ నీ కోసం ఒక్కటే కంగారు పడిపోతోం ది!”  అత్తయ్య రుక్కును అడిగింది.
 
          అప్పుడే వంటింట్లో నుండి కాఫీ కప్పు తెచ్చిన రుక్కు ఇలా అంది.
 
          “బామ్మా! ఎప్పుడూ నా కంటే ముందు నిద్ర లేచే అమ్మ ఇంకా పడుకునే ఉంది. ఆశ్చర్యపోతూ అమ్మ చేయి పట్టుకున్నాను. వేడిగా పొయ్యి మీద పెనం మాదిరి కాలి పోతోంది. సమయానికి జ్వరం టాబ్లెట్ ఇంట్లో లేదు. నువ్వింకా నిద్ర లేవ లేదు. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి అపోలో మెడికల్ షాపుకు వెళ్ళాను.
 
          “అమ్మా! కాఫీతో ఈ మాత్ర వేసుకో. జ్వరం ఇట్టే తగ్గిపోతుంది!” అంతలో నీకు వేడిగా ఇడ్లీ వేసేస్తాను. తింటే నీరసం తగ్గుతుంది.!”
 
          రుక్కు మాట్లాడుతూనే చక చకా పనులు చక్క బెట్టేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. ఇంతలో ఎంత మార్పు. పని మనుషులు సమయానికి వచ్చేసి పనులు చేసేసి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళే ఏ సమయంలోనైనా పనులు చేస్తారు. కనిపెట్టు కుంటారు. పని మనుషులతో ఆర్ధిక బంధం. కన్నవాళ్ళతో అనుబంధం! ‘నా కళ్ళు తడి బారు తున్నాయి.
 
          “అమ్మా!ఎప్పుడూ నువ్వేనా పనులు చేయడం. నీకు ఒంట్లో నలతగా ఉన్నప్పుడు చూడక పోతే కూతురిగా నాకు అర్ధం ఏముంది?” వేడి ఇడ్లీలు ప్లేటులో పెడుతూ అంది రుక్కు.
 
          రుక్కు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు నా కళ్ళు ఆనందంతో వర్షించ సాగాయి.
 
          “నీ అనుమతి తీసుకోకుండా రుక్కుకు పని నేనే నేర్పానే. చిన్నప్పుడు జడ వేశాం కదాని, కూతురు అత్తారింటికి వెళ్ళాకా కూడా,”కూడా” వెళ్ళి జడ వేయగలమా?” అందుకే వాళ్ళకి పని నేర్పాలి. మన కోసమే కాదు. తన కోసం. తన కుటుంబం కోసం!” అత్తయ్య ఇడ్లీ ముక్క విరిచి నా నోట్లో పెడుతూ అంది.
 
          అత్తయ్య మాటలతో, రాత్రి బరువెక్కిన గుండె ఆనందంతో తెలికై  పోయింది. రాత్రి నిద్ర పోయే ముందు రుక్కు నాతో అన్న మాటలు గుర్తు కొచ్చాయి.
 
          “అమ్మా! నాన్న ఆఫీసు నుండి రాగానే, నువ్వే ఆయనకు కనబడాలని, నిన్నే నాన్న ముందుగా చూడాలని బామ్మ నిన్ను హాల్లో కూర్చోమని చెప్పేదట. మీ అనుబంధం పెంచడం కోసమే అలా చేసేదట. అది తప్పు కాదు కదమ్మా!”
 
          సుళ్ళు తిరుగుతున్న కళ్ళను తుడుచుకుంటూ “అత్తయ్యా! నా అనుభవం మిమ్మల్ని అర్ధం చేసుకోలేక పోయింది. క్షమించండి!” అని అన్నాను. తేలికైన హృదయంతో.
 
          “మనలో మనకు క్షమాపణ లెందుకే!” అంటూ దగ్గరకు తీసుకుంది. అప్పుడే నా పక్కన చేరిన రుక్కుతో “మార్పు మంచిదే. బామ్మ బాట ఎప్పుడూ మంచిదే!అనుసరించు!” అన్నాను, ఆనందంగా.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.