ఓ స్త్రీ ! నిబద్ధత నీ పేరు

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-వి. శ్రీనివాస మూర్తి

          అదొక పెద్ద ఐటి కంపెనీ. రిసెప్షన్ లో ఒక పదిమంది దాకా ఇంటర్వ్యూ కోసం వేచి వున్నారు. వారిలో శ్వేత ఒకరు. అనుభవం వుండి కంపెనీ మారాలి అనుకునే వారికి జరిగే ఇంటర్వ్యూ. శ్వేత అప్పటి దాకా ఒక అయిదు సంవత్సరాలు ఒక చిన్న కంపెనీలో పని చేసి మంచి అనుభవం సంపాదించింది. పెద్ద కంపెనీలో పెరుగుదల, అవకాశాలు బాగా ఉంటాయి అని ఈ జాబ్ కి అప్లై చేసింది. ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తోంది. మనసులో ఆమెకి ఏ మాత్రం టెన్షన్ లేదు. తన మీద తనకు నమ్మకం వుంది. సెలెక్ట్ కాక పోయినా తనను బాగా చూసుకునే కంపెనీలో పని చేస్తోంది అనే ధైర్యం. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ వుంది. అది ఆమెకు అలవాటు టైమ్ దొరికినప్పుడు.

          మిస్ శ్వేత అని ఎవరో పిలవగానే మెల్లిగా కళ్ళు తెరిచి, లేచి సర్దుకొని ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకి నింపాదిగా నడిచింది.

          “మే ఐ కమ్ ఇన్”

          తలుపు మెల్లగా తెరుస్తూ శ్వేత ఇంటర్వ్యూ రూము లోకి వెళ్ళింది. రూమ్ లో ముగ్గురు మగవారే ఉన్నారు. “ప్లీజ్ కమ్ ఇన్” అని కూర్చోమని చెప్పారు. మెల్లగా కూర్చొంది. ఆమె నింపిన అప్లికేషన్, బయోడేటా చూస్తూ ఇంటర్వ్యూ మొదలు పెట్టారు.

          ముందు తన గురించి, కుటుంబం గురించి, తన చదువు, ఉద్యోగంలో అనుభవం గురించి ప్రశ్నలువేశారు. చాలా నింపాదిగా సమాధానాలు చెబుతోంది. తనకు మంచి చదువు, ఐదేళ్ళ అనుభవం, ఇంగ్లీషులో చక్కటి వ్యక్తీకరణ, కస్టమర్ తో ఎలా మెలగాలో అనుభవం. తన మీద తనకు నమ్మకం ఉంది. తర్వాత ఇంకా లోతుగా టెక్నాలజీ మీద, ఇంతకు ముందు చేసిన ప్రొజెక్ట్స్ మీద, కస్టమర్ ని డీల్ చేయడం ఎలా అనే వాటిమీద ప్రశ్నలు వేశారు ఆ ముగ్గురు. ఛాలా వరకు చక్కటి జవాబులు చెప్పింది. ఇంటర్వ్యూ చేసే వారిని గమనిస్తూ వుంది. తన జవాబులతో తృప్తి చెందినట్లే వాళ్ళ మొహాలు చెబుతున్నాయి. ఒకటి రెండు వాటికి తన దగ్గర జవాబు లేదు. తనకు తెలియదు అనే  చెప్పింది. తర్వాత ఒక సీనియర్

          “ఐదు సంవత్సరాల తర్వాత ఏమి కావాలి అనుకుంటున్నారు ??”

          “ ప్రోగ్రామ్ మేనేజర్ “

          “దట్ఈస్ గ్రేట్”

          ఇంతలో ప్రాజెక్ట్ లీడర్ కార్తీక్ “ మీకు పెళ్ళి అయిందా, మీ వారు ఎక్కడ పని చేస్తారు. మీకు పిల్లలు ఉన్నారా ?? “జస్ట్ ఇన్ఫర్మేషన్ “ అడిగాడు.

          శ్వేత కూల్ గా “ వివాహం అయి మూడు ఏళ్ళు అయింది. మా ఆయన టీ సీ యస్ లో మానేజర్ గా చేస్తున్నారు. పిల్లలు లేరు. త్వరలో  ప్లాన్ చేయాలనుకుంటున్నాము. “

          “ఓకే “ కార్తీక్ స్పందన.

          తర్వాత జీతం మీద మిగతా బెనిఫిట్స్ మీద కొంత చర్చ జరిగినది. ఆమె తాను ఆశించే శాలరీ స్పష్టంగా తెలియ చేసింది. వారి మొహాలు చూస్తే అంగీకారం వున్నట్లు శ్వేతకి అనిపించింది.

          “మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా” ఆ ముగ్గురులో సీనియరు అడిగాడు.

          “ లేదు. ధన్యవాదాలు” శ్వేత జవాబు.

          “మీరు సెలెక్ట్ అయితే వారం లోపల మీకు ఈ మెయిల్ వస్తుంది. మా కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. “

          తను కూడా ధన్యవాదాలు చెప్పి బయటకు వెళ్ళింది. కంపెనీకి ఆమె అవసరం చాలా ఉంది అని ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు అభిప్రాయపడ్డారు. సెలెక్ట్ అయితే ఆమె పని చేసే ప్రాజెక్ట్ మానేజర్ కార్తీక్ ఆ ముగ్గురులో ఒకడు. వాళ్ళలో సీనియరు, కార్తీక్ అభిప్రాయం అడిగాడు.

          అతను “ నాకు అన్ని విధాల ఓకే . కానీ” అని తటపాయించాడు.

          “చెప్ప తలుచుకొన్నది చెప్పు” అని సీనియరు అన్నాడు.

          కార్తీక్  “ ఏమి లేదు సార్. ఆ దంపతులు త్వరలో పిల్లలు ప్లాన్ చేస్తున్నారని చెప్పింది. ప్రాజెక్ట్ క్రిటికల్ స్టేజ్ లో ఉంది. ఆమె శలవులో వెళితే ప్రాజెక్ట్ పూర్తి చేయడం లో ఇబ్బందులు వస్తాయి. కేవలం డెలివరీ తర్వాతే కాదు. ముందుగా కూడా ఆరోగ్య సమస్యల వల్ల స్త్రీలు శెలవులు ఎక్కువ పెడతారు. మామూలుగా కూడా ఇంటి పనుల వల్ల, లేట్ గా పని చేయలేరు. శని ఆది వారాలు అవసరమైతే రాలేరు. అందుకని ఇందాక వచ్చి ఇంటర్వ్యూ తృప్తిగా చేసిన కుమార్ అయితే బాగుంటుంది. శ్వేత తప్పకుండా కుమార్ కంటే చాలా బెటర్. తప్పుగా అనుకోవద్దు.”

          సీనియరు “ నీ అభిప్రాయం చెప్పావు. కాని నీ ఆలోచన తీరు నాకు సరిగా అనిపించ డం లేదు. కంపనీ పాలసీ కూడా నీ అభిప్రాయాన్ని ఒప్పుకోదు. ఏదో ఊహించుకొని, స్త్రీల కమిట్మెంట్ ని ప్రశ్నించడం సరికాదు. ఆమె ఈ ప్రాజెక్ట్ కే కాదు. కంపెనీలో భవిష్యత్తులో కీలక పాత్ర వహిస్తుంది నా నమ్మకం. ఇంకా దాదాపు ఆమెకు ముప్పయి ఏళ్ళు కెరీర్ ఉంది. మొత్తం కెరీర్ లో పదిపన్నెండు నెలలు శెలవు పెడుతుందిఏమో. మగ ఉద్యోగ స్థులు కూడా, ఆరోగ్య, ఇతర కారణాల వల్ల ఇంకా ఎక్కువ శెలవు తీసుకోవచ్చు. ఇది కేవలం సమాజంలో ఉన్న విచక్షణ. మనము ఆమెకు ఆఫర్ చేస్తున్నాము. మీరు మీ అభిప్రాయం పక్కన పెట్టి ఆమెను విచక్షణ లేకుండా ఉపయోగించుకోండి.”

          పేపర్ల మీద సంతకాలు పెట్టి అందరు వాళ్ళ సీట్ల దగ్గరకు చేరారు. కార్తీక్ తనకు ఆ అమ్మాయిని అంటగట్టారని బాస్ మీద అక్కసు ఫ్రెండ్స్ దగ్గర కక్కాడు.

          వారం రోజుల్లో ఆమెకి ఆఫర్ వచ్చింది. తాను పనిచేసే కంపెనీలో రాజీనామా చేసింది. ఆ కంపెనీలో సీనియర్ వ్యక్తులు ఆమె వెళ్ళకుండా వుండడానికి జీతంలో పెంపు, ప్రమోషన్, అమెరికా పోస్టింగ్ ఆఫర్ చేశారు. కానీ తాను వారికి ధన్యవాదాలు చెబుతూ, తాను కేవలం డబ్బు గురించి కాదు అని వారిని ఒప్పించి రాజీనామా అంగీకరిం చేలా చేసింది. రెండు నెలలు నోటిస్ ఇచ్చి, తన పనులు అన్ని పూర్తి చేసి, ఇంకొక  అబ్బాయికి అప్పగించి, నోటిస్ పీరియడ్ అవ్వగానే అందరి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఆఫీసులో అందరూ ఆమెని మిస్ అయ్యారు .

          శ్వేత కొత్త కంపెనీలో చేరి పని మొదలు పెట్టింది. కార్తీక్ ఆమెకు ప్రాజెక్టు అప్పగించి, అన్నీ వివరంగా చెప్పి, ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయాలి, కస్టమర్ ఏమి ఆశిస్తున్నాడు తెలియచేశాడు.

          తొందరగానే కంపెనీకి, ప్రాజెక్టుకి, ఇతర టీం సభ్యులకు అలవాటుపడ్డది. ఇచ్చిన పని అనుకున్న దాని కంటే ముందే పూర్తి చేస్తుంది. కొత్త పని అడిగి తీసుకొంటుంది. తనకు ఇంటి పనులు కూడా చేసుకోవాలి కాబట్టి టైమ్ వృధాకాకుండా ఆఫీస్ టైమ్ లోనే పని పూర్తి చేసుకొని వెళుతుంది. కొంత మంది మగవాళ్ళలాగా, టైమ్ వేస్ట్ చేస్తూ, బాస్ ని మెప్పించడానికి ఎక్కువసేపు ఉండడం ఆమెకు కుదరదు. అవసరం లేదు. కార్తీక్ ఆమె పనిలో తప్పు పట్టే అవకాశం ఆమె ఇవ్వలేదు.

          ఒక రోజు ఆమె కార్తీక్  రూమ్ లోకి వచ్చి  “ ఐ వాంట్  టు టాక్ టు యు”

          కార్తీక్ “ ప్లీజ్ చెప్పండి”

          శ్వేత “ ఐ యామ్ ఇన్ ది ఫ్యామిలీ వే. ఏప్రిల్ లో డేట్ ఇచ్చారు డాక్టర్” .” నా పనులు అన్ని పూర్తి చేసి మీరు చెప్పిన వ్యక్తికి అప్పగించి వెళ్తాను. ముందు ఎక్కువ లీవ్ తీసుకోను. డెలివరీ తర్వాత మూడు నెలలు సెలవు కావాలి .”

          కార్తీక్ మనసులో “అనుకున్నట్లే బాంబు పేల్చింది. నా మీద ఈమెను రుద్దారు.” అనుకుంటూ పైకి మాత్రం “కంగ్రాచ్యులేషన్స్. ఎవరికి అప్పగించాలో తర్వాత చెబుతాను” అని సీరియస్ గా స్క్రీన్ చూడడం మొదలుపెట్టాడు. ఆమె తన సీటుకి వెళ్ళింది.

***

          రోజులు గడిచే కొద్ది ఆమె శరీరంలో, మనసులో సహజమైన మార్పులు జరుగు తున్నాయి. ఒకోసారి నిద్ర లేచి పనులు చేసుకొని, వెళ్ళాలంటే శరీరం, మనసు మొండికేసేవి. కానీ తన వల్ల ప్రాజెక్టు దెబ్బ తింటుందేమోనని, అలాగే మనసుకు నచ్చ చెప్పి ఆఫీసుకు వెళ్ళేది. ఇంతకు ముందు కంటే ఆహారం ఎక్కువ కావాలి. క్యాంటీన్ ఆహారం,హోటల్ ఆహారం మంచిది కాదు అని రెండు మూడు డబ్బాలు సద్దుకొని బయలుదేరేది. భర్తకు డ్రాప్ చేయడం కాని పికప్ చేయడం కుదరని రోజు ఆటో దొరికి ఇంటికి చేరి మరల వంటపని, ఇతర పనులు చేసుకోవాలంటే కష్టం అనిపించేది. ఒకో సారి ఓపిక లేక చేసుకోలేక పడుకొందామనిపించేది. కాని లోపల బిడ్డ అమ్మా ఆకలి అన్నట్లుగా అనిపించి ఎక్కడ లేని శక్తి వచ్చేది. ఓపిక చేసుకొని, వ్యాయామం, మెడిటేషన్ వారంలో కొన్ని రోజులు చేసేది. తనకు పండంటి బిడ్డ, నార్మల్ డెలివరీలో కలగాలని తను ఆఖరి రోజు వరకు ఫిట్ గా ఉండాలనే సంకల్పంతో సాగింది.

          ఇలా ఉండగా, టీమ్ మెంబర్ సురేష్ ఆక్సిడెంట్ పాలయి, నాలుగు నెలల మెడికల్ లీవ్ పెట్టాడు. దిగులు పడుతూ ఏమి చేద్దాము అని ఆలోచనలో పడ్డాడు కార్తీక్.

          శ్వేత నిండు గర్భిణిగా ఆఫీసుకి వచ్చి పనులు చేసుకుంటూ ఉంటే, కొంత మంది చాలా మెచ్చుకొనే వారు. కొందరు జాలి మాటలు పలికే వారు. శెలవు తీసుకోండి. మీ ఆరోగ్యం. బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. తరవాత అనుకొంటే ఉపయోగం ఉండదు. ఈ కంపెనీ మీకేమి సాయం చేయదు. మరి కొందరు వెనకాల చేరి, ఈమె పైనే కంపెనీ  నడుస్తోంది అనుకుంటుంది. ఎంత సేపటికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ తప్పితే వేరే ఆలోచన లేదు. ఏమి ఆడదండి. ఆరోగ్యం, లోపల బిడ్డ ఆరోగ్యం కంటే పని, డబ్బులు, అధికారం కావాలి .

          ఒకో సారి అలా అన్నవారికి గట్టిగా జవాబు ఇవ్వాలని నోటిదాకా వచ్చి, నేను ఆవేశ పడితే నాకే నష్టం, తను తన ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం ఎలా జాగ్రత్తగా చూసుకొంటున్నది తనకు తెలుసు. వాళ్ళు విమర్శిస్తే నాకేమిటి?? పైగా అలాంటి సూటి పోటి మాటలతో తాను మానసికంగా గట్టిపడాలని దేవుడు వాళ్ళ చేత అలా అనిపిస్తున్నాడు అని సర్ది చెప్పుకొనేది.

          భర్త కూడా ఒకటి రెండు సార్లు “శెలవులు పెట్టు. ఉద్యోగం మాను . బిడ్డ కంటే ఆఫీస్ ముఖ్యమా” అని విసుక్కున్నాడు.

          ఒక రోజు ఇంక ఆపుకోలేక భర్త “మన బిడ్డకి ఏమైనా అయితే సహించను.” తిక్కగా మాట్లాడాడు.

          శ్వేత గుక్కపట్టి ఏడ్చేసింది. అంతలా తనను బాగా అర్ధం చేసుకునే భర్త అలా అంటే ఓర్చుకోలేక పోయింది. కాని మరల అతని మనసును అర్ధం చేసుకొని, తనే దగ్గర చేరి తల నిమురుతూ, పొట్ట మీద అతని చేయి వేసి ప్రేమగా “మన బిడ్డ బాగా పెరుగు తోంది. నాకు తెలుస్తోంది.  డోన్ట్ వరీ అని బుజ్జగించింది. అతను చిన్న పిల్లవాడిలా ఆమెలో ఒదిగి పోయాడు.

          ఆమె మాత్రం డెలివరీ డేట్ కి వారం ముందు దాక ఆఫీసుకి వచ్చింది. పని పూర్తి చేసి రాకేశ్ కి అప్పగించి అందరికి బై చెప్పి సెలవులో వెళ్ళింది. తనను ఫోన్ లో అవసరమైతే కాంటాక్ట్ చేయవచ్చని చెప్పింది. అందరూ “అల్ ద బెస్ట్ “ అని వీడుకోలు చెప్పారు. మేము చూసుకుంటాము. ప్రాజెక్టు గురించి దిగులు పడకు. అంత ప్రేమ, అభిమానం చూసి శ్వేతకి చాలా బాగా అనిపించింది. డేట్ దగ్గర పడుతోంది. అమ్మ,నాన్న వచ్చారు. భర్త, తల్లి తండ్రులు తనని మంచందిగకుండా అన్నీ అందిస్తున్నారు.తినడం సంగీతం వినడం, భర్తతో ముచ్చట్లు, లోపల బేబీ కదలికలు అంతా ఎక్సైటింగ్ గా వుంది. ఎప్పుడు ఎప్పుడు ఆ బిడ్డ బయటికి వస్తుందా, తాను ముద్దు పెట్టి తన్మయత్వం చెందు తుందా అనివేచి వుంది మొదటి సారి తల్లి కాబోయే శ్వేత..

          కంపెనీ ఆడిటోరియంలో వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిభను గుర్తించే అవార్డ్ పంపిక మొదలు అయింది. అత్యుత్తమ అవార్డ్ కంపెనీ రత్న. ఒకరికే ఇస్తారు. అందరు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ముందు ప్రశంస పత్రం చదివి పేరు చివరలో చెప్పడం ఆనవాయితి. “ ఈ వ్యక్తికి  మంచి నాణ్యత గల పని చేస్తూ, ఇతరులకు సాయపడే గుణం వుంది.  కస్టమర్ ఎన్నోసార్లు ఈ వ్యక్తి  పనిని చాలా మెచ్చుకున్నారు. ఈ వ్యక్తి డెవలప్ చేసిన సాఫ్టువేర్ వల్ల కస్టమర్కి చాలా లాభం వచ్చింది. కొత్తగా పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి ఒప్పు కొన్నాడు. ఈ సంవత్సరం కంపెనీ రత్న అవార్డ్ గోస్ టు శ్వేత కుమారి. హాలు మొత్తం చప్పట్లు. “శ్వేత శ్వేత “ అరుపులు.

          కార్తీక్ గర్వంగా ఒక పక్క , ఆమె గురించి, స్త్రీల గురించి తప్పుగా అనుకొన్నందుకు సిగ్గు పడ్డాడు. మనసులోనే శ్వేతకు, ఆడవారికి క్షమాపణ చెప్పుకున్నాడు.

          ఇంతలో మైక్ లో “ ఈ రోజు శ్వేత మనతో ఇక్కడ ఆడిటోరియంలో  లేదు. ఆమె  బాస్ కార్తీక్ ఆమె తరపున అవార్డ్ తీసుకుంటారు. ఇంతకూ ఆమె ఎక్కడ ఉందను కుంటున్నారు. హాస్పిటల్లో.

          అందరూ కంగారు పడ్డారు. ఆమెకి ఏమి అయిందా అని.

          కొంచం గ్యాప్ ఇచ్చి “నిన్ననే పుట్టిన ఆడ పిల్లతో.

          “ శ్వేత అండ్ బేబి, శ్వేత అండ్ బేబి”, హాలంతా అరుపులు.  హాస్పిటల్లో శ్వేతకి, వినపడేంత గట్టిగా.

          ఓ స్త్రీ ! నిబద్ధత నీ పేరు .. చాల మంది మనసుల్లో వచ్చిన భావన. కొంత మంది  వారికి తెలియకుండానే పైకి అనేశారు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.