చిత్రం-54

-గణేశ్వరరావు 

 
          చూశారా ఈ చిత్రాన్ని? అగస్తీనా నిజంగా అందంగా ఉందా? మీలో సౌందర్య భావాన్ని కలుగజేస్తోందా?
 
          ఇది సుప్రసిద్ధ చిత్రకారుడు విన్సెంట్ వాంగో వేసిన చిత్రం అని తెలిసినప్పుడు మన అభిప్రాయం మారుతుందా? కళలకు స్థిరమైన విలువ ఉంటుందా? టిప్పు సుల్తాన్ ఆయుధాలు, నెపోలియన్ టోపీ కొన్నికోట్లకు అమ్ముడయ్యాయి; అభిమానులు కట్టిన ఆ వెల, వాటి అసలు విలువేనా? ఇలాటి అదనపు విలువలకు ప్రమాణాలు ఏమిటి?
 
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన ఉదంతాన్ని చూడండి:
 
విన్సెంట్ వాంగో – కెరోలిన్, యూజెన్, అగస్తినా వగైరాలను ప్రేమించాడు. ఇక్కడ కూడా అతన్ని దురదృష్టం వెంటాడింది, అతన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. చిత్రంలో కనిపిస్తున్న అగస్తీనా. అతని చిత్రాలు తీసుకుని, బదులుగా తిండి పెట్టేది. నేను చెప్పబోయే కథలో నాయిక ఆమె అయుండవచ్చు.
 
          ఒక పాత్రికేయుడు వాంగో గురించి పరిశోధిస్తున్న సమయంలో, అతడి అదృష్టం పండి ఒక కాగితం మీద వాంగో వేసిన ఒక చిత్రం దొరికింది. అయితే దానిపైన చిన్న మరక కనిపిస్తోంది. దాన్ని తొలగించడం కోసం, అతను చిత్రాలను పునరుద్ధరించే నిపుణుడి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళడం మంచి పని అయింది. ఆ నిపుణుడు దాన్ని చెరపడం ఒక మూర్ఖత్వం అన్నాడు; వాంగో చిత్రం మీద తుళ్ళింది – వాంగో తాగుతున్న టీ కప్పు నుంచి; ఆ టీ తాగమని ఇచ్చింది వాంగో ప్రియురాలు. ఇర్వింగ్ స్టోన్ వాంగో జీవిత నవల ‘Lust for Life’ లో దీని గురించి రాశాడు. ప్రమాదవశాత్తూ ఆ చిత్రం పైన చిందిన ఆ తేనేటి మరక , దానికి అమూల్యమైన విలువని అందించిందని ఆ చిత్రకళా నిపుణుడి అభిప్రాయం; అది అలా అనివార్యంగా ఆ చిత్రంలో అంతర్భాగం అయింది, ఆ చిత్రాన్ని మరకతో పాటే ఉంచాలని అన్నాడు.
 
          అత్యధిక పారితోషికం అందుకునే అమెరికన్ తార, స్కార్లెట్ జొహాన్సన్ – తన బుల్లి ముక్కు చీదుకొని, ఆ చీమిడి రుమాలుని ఒక కవర్లో పెట్టి కవర్ పైన సంతకం చేసి వేలం వేస్తే, అది మూడు లక్షలకు పైగా అమ్ముడవడంలో ఆశ్చర్యం ఏముంది? ఇక్కడ ఒక తార చీమిడి – అదనపు విలువ అది!
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.