జీవితం అంచున -15 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

ప్రతీ కథకు ఓ ప్రారంభం వుంటుంది…

ఆ ఆరంభం గతంలోనో.. గత జన్మలోనో…

ఈ కథకు ఇది ప్రారంభం కాదు.

కేవలం ఓ అస్థిమిత రోజుకి మాత్రమే ఇది సాక్ష్యం.

          అస్థిమత్వం ఏమీ శాశ్వతం కాదు… చుట్టం చూపుగా అపుడప్పుడూ వచ్చి పలకరించ వచ్చు. ఆ పలకరింపునే మా నర్సింగ్లో మానసిక అస్వస్థత అంటారు.

          అది డెమెన్షియా కావచ్చు లేదా రిట్రోగ్రేడ్ అమ్నీసియా కావచ్చు…

          ఏదెలా వున్నా ప్రేమ మాత్రం అమరం.

          ఎన్నో ఒడుదుడుకుల పయనం ఈ సుదీర్ఘ జీవితం.

          ప్రేమంటే ఏకాకి ఎడారి బతుకులో చల్లటి ఒయాసిస్సంటి సేద.

          చివరి మజిలీ చేరువలో వున్న మా అమ్మ ఎన్నో కథల కలనేత.

          నేనెరిగిన కథలు కొన్ని.. నేనెరగనివి మరికొన్ని…

          ఎనభై ఐదేళ్ళకు కూడా తరగని రాజసం అమ్మది.

          వెన్ను వంగినా మెత్తబడని అభిమానం ఆమెది.

          జవసత్వాలు పట్టు తప్పినా పట్టు తప్పని పెత్తనం ఆమెది.

          జూమ్ చేసి మరీ చూసాను.

          అమ్మ కొత్త పెళ్ళికూతురిలా కులుకుతూ, సిగ్గులొలుకుతూ ముసిముసి నవ్వులు రువ్వుతూ డైనింగ్ చైర్ పైన ఒక్కర్తీ కూర్చుని వుంది.

          అమ్మ ఎదురుగానే డైనింగ్ టేబుల్ పైన మొబైల్ వుంది. అయినా ఆమె మొబైల్ తీయటం లేదు. మొబైల్ ఏమయినా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిందా. నాలో లక్ష అనుమానాలు. 

          అమ్మను పరీక్షగా చూసాను. చేతులు అటూ ఇటూ కదుపుతూ ఒక్కర్తి తనలో తాను మాటాడుకుంటోంది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. లివింగ్ రూం మొత్తం పరికించి చూసాను ఎవరైనా ఏ మూలైనా ఉన్నారేమోనని. ఎవ్వరూ కనిపించలేదు. వీధి తలుపులు మూసి వున్నాయి.

          కెమేరాల్లోకి చూస్తూ మళ్ళీ ఫోను కలిపాను.

          లాభం లేదు. అమ్మ ఫోను ఎత్తటం లేదు.

          ఈ మధ్యే అమ్మకు తోడుగా వుంటుందని నేను పెట్టిన నా కజిన్ కూతురిని తనకు అవసరం లేదని పంపించేసింది అమ్మ.

          మరో ఆఖరి ప్రయత్నం చేసాను. అమ్మ ఫోను తీయలేదు.

          వెంటనే సర్వంట్ క్వార్టర్ లో వుoటున్న, అమ్మ బాగోగులు చూసుకునే వాచ్ మ్యాన్ కాశికి కాల్ చేసాను.

          “కాశీ, అమ్మ ఫోను సైలెంట్ లోకి వెళ్ళిపోయినట్టుంది. ఒక్కసారి వెళ్ళి చూడు…”

          “లేదమ్మా, అమ్మగారు తన స్నేహితుడు ఎవరో భోజనానికి వస్తున్నారని, ఆమె పిలిచే వరకూ నన్ను పైకి రావద్దన్నారు… నేను ఇప్పుడు పైకి వెళ్ళలేను..” కాశి కాస్త నంజుతూ ఇబ్బందిగా నీళ్ళు నమిలాడు.

          నేను మరింత ఆశ్చర్యపోయాను.

          “ఎవరా స్నేహితుడు.. పైన ఇంట్లో ఎవరూ లేరే…” ఆరాగా అడిగాను.

          “తెలియదమ్మా… తన చిన్ననాటి స్నేహితులట.. బాగా కావాల్సిన వారట.. సాయం కాలం మీ బంధువులు ఎవరో వస్తే, వారికి తలా ఓ ఐదొందలు ఆటో ఖర్చులకని ఇచ్చేసి కంగారు పెట్టి మరీ వాళ్ళను త్వరత్వరగా పంపించేసారు. ఐదు నిముషాలైనా కూర్చో నివ్వలేదు.. ప్రయాణ బడలిక కూడా తీరకుండానే వాళ్ళను తరిమేశారు..” చెప్పనా వద్దా అని సంశయిస్తూనే చెప్పాడు కాశి.

          “ఎవరు వచ్చినా కింద గేటు తీసి నీ ముందు నుండేగా వెళ్ళాలి… కాస్త గమనించు” హెచ్చరించాను.

          “అసలు ఎవరైనా మనిషంటూ వస్తే కదమ్మా గమనించటానికి. ఊరికే అలా భ్రమ పడుతుంటారు ఒక్కోసారి..” జవాబిచ్చాడు కాశి.

          మరింత దిగ్భ్రమకులోనయ్యాను.

          ఇది సరిగ్గా నేను ఒక యూనిట్లో చదివిన విభిన్నమైన సినారియోల్లోకెల్లా మరింత భిన్నమైనది.

          పనిమనిషి యాదమ్మ ప్రతిరోజూ అమ్మ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతుంది. వెంటనే యాదమ్మకి కాల్ చేసాను “ఏందే యాదీ… ఎట్టున్నవు.. ఏమిటి విషయాలు…మా అమ్మెట్టా వుంది”

          పెద్దగా నవ్వింది యాదమ్మ.

          “ఏందే గట్ల నవ్వబడ్తివి… ఏమయ్యింది..”

          “అమ్మా, మీ అమ్మ నాకు అమ్మ అసూంటిది. గిట్ల మాటాడుతున్ననని ఏమనుకోకు. గిప్పుడు ముసలామెకు పడుసు కోర్కెలు పుడ్తున్నయి…”

          నేను మధ్యలో అడ్డుపడుతూ “ఏందే నీ పిచ్చి వాగుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటాడు” అరిచాను యాదమ్మ పైన.

          “నువ్వు గట్ల అరిస్తే ఇగ నేనేమి సెప్ప… నీ ఇష్టం సెప్పమంటే సెప్తా.. లేకుంటే లే…”

          ఏమి జరుగుతోందో తెలుసుకోవటం అవసరం.

          “మరి గా మాటలేందే… అమ్మ వయస్సేంది… నీ మాటలేంది”

          “ముందు నేను సెప్పేది ఇన్నంక నువ్వు మాటాడమ్మ. పొద్దుగాల పాలాయన ఒచ్చేపాటికి పోడర్ గిట్ల కొట్టుకొని తయారయి కూసుంటది. గయ్నను లోపట్కి పిలుస్తది… ఏమేమో కథల్ పడ్తది.. ఎట్ల ఎట్లనో చేస్తుందమ్మా. నాకైతే సమఝ్ అయితలే.”

          ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయ్యింది నాకు.

          “అమ్మ ఒడ్డీ యాపారం చేస్తదంట.. పాలాయన సాయం చేస్తాడని సెప్తుంది. పాలాయన గిరాకి తెచ్చిండు… ఇరవై ఐదు వేలు ఇయ్యాలె అని పైసలు కట్ట కట్టి పెట్టింది. గాయింత పాలాయనకి ఇచ్చేయగలదు మొత్తం పైసలన్నీ…నువ్వేమి చేస్తవో ఏమో… పొద్దుగాలప్పుడు ఒకసారి కెమెరాలు సూడు…” సలహా ఇచ్చింది యాదమ్మ.

          యాదమ్మ చెప్పేది నిజమా…

          అసలు ఏం జరుగుతోంది అక్కడ..

          కళ్ళతో ఏమీ చూడకుండా అమ్మను ప్రశ్నించకూడదు.

          అసలు అలాంటిది ఏమన్నా చూసినా కూడా నేను అమ్మను ప్రశ్నించలేను.

          ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.