టాలుస్టాయి జీవితమూ సాహిత్యమూ (రంగనాయకమ్మ)

-పి. యస్. ప్రకాశరావు

          టాలుస్టాయి రచనలు ఇంతకు ముందు చదివినవారు కూడా ఇది చదివితే కొత్త విశ్లేషణలు తెలుస్తాయి. ఆయన మొత్తం రచనలు ఎన్ని? ఆయన నేపథ్యం, స్వభావం, భావాలూ ఎటు వంటివి? ఆయన సాహిత్యం పై లెనిన్ విశ్లేషణ ఏమిటి? వంటివి తెలుసు కోవాలనుకునే వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.

          20 వేల ఎకరాల జమీందారీ కుటుంబంలో పుట్టిన టాలుస్టాయి పేదల కోసం సాటి జమీందార్లతో జీవితమంతా పోరాడిన మహనీయుడు. మాస్కోకి 130 మైళ్ళ దూరంలోని యాస్నయా పోలియానా గ్రామంలో పుట్టాడు 3వ ఏట తల్లీ, తొమ్మిదో ఏట తండ్రీ మరణిస్తే అన్న దగ్గర అతి గారాబంగా, రాజభోగాలతో  పెరిగాడు. ప్రపంచంలోకెల్లా అందమైన వాడిగా పేరు పొందాలని కలలు కనేవాడు. జమీందార్ల బిడ్డల కోసమే ఏర్పాటైన కాజాన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ ఆ చదువు నచ్చలేదు. తన జీవితమంతా బానిసల ఉద్ధరణకు వినియోగించాలని నిర్ణయించుకున్నాడు కానీ, పట్నంలోని పేకాట, జూదం, తాగుడు, వ్యభిచారం వంటి దురలవాట్లకు బానిసైపోయాడు. అప్పుల పాలై అవి తీర్చడానికి సైన్యంలో ఉద్యోగం చేశాడు. ఫిరంగులూ, తుపాకులతో కవాతు చేయడం నచ్చక అది మానేశాడు. విదేశీ యాత్ర మీది మోజుతో ఫ్రాన్స్ వెళ్ళాడు. అక్కడెక్కడా శాంతి కనిపించలేదు. అక్కడ గిలెటిన్ తో తలనరికే మరణ దండన నచ్చక స్విట్జర్ లాండ్ వెళ్ళిపోయాడు.

          34 వ ఏట సోఫియా అనే 18 ఏళ్ళ అమ్మాయిని ప్రేమవివాహం చేసుకున్నాడు. వారి మనసులు కలిసినా భావాలు కలిసేవి కాదు. ‘ప్రజలకెవ్వరికీ లేని ఆస్తి నాకెందుకు?’ అని అతనూ ‘ సంపదతో తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవాలని’ ఆమె అనుకునేవారు. అయినా ఆమె భర్తకు రచనలలో సహకరించేది. ‘ యుద్ధమూ శాంతి’ నవలకు ఆమె 7 సార్లు శుద్ధ ప్రతి రాసింది.

          వేలాది మంది ఇంటి కోసం పది గజాల నేలైనా లేక బాధ పడుతుంటే తాను 20 వేల ఎకరాల భూమికి కామందుగా ఉండటం ఆయనకు నీచంగా కనిపించింది. ధనం జీవితా నికి పరమావధి కాదని, కాపీ రైట్స్ వల్ల పుస్తకాల మీద వచ్చే లక్షల కొద్దీ డబ్బును వద్దను కున్నాడు. టాలుస్టాయి ఉద్దేశంలో‘ జమీందారీ ఆదాయం’ అంటే  బీదవాళ్ళను దోచు కోవడం, యుద్ధం చెయ్యడం అంటే హత్యలు చెయ్యడం. ‘ ప్రతి పనీ ఉచ్ఛనీచ భేదం లేకుండా సోదర ప్రజలతో సమంగా మనం కూడా చేసి తీరాలి’ అని దాన్ని ఆచరణలో పెట్టాడు. చౌకగా లభించే శాఖాహారం తిన్నాడు. సారా, పొగాకూ మానేశాడు. సాధారణ దుస్తులు ధరించాడు. ఇంటి పనుల్లో భార్యకు సాయం చేసేవాడు. చెప్పులు కుట్టడం నేర్చుకుని తన జోళ్ళు తనే కుట్టుకున్నాడు. సామాన్లతో సంచి భుజాన వేసుకుని కాలి నడకన బీదలకు పంచుతూ తిరిగాడు. జీవన విధానం మారాక చిన్న కథలూ, నవలలూ నాటకాలూ వ్యాసాలూ ఉత్తరాలూ ప్రచురించాడు. ఇప్పడు అతని అభిప్రాయంలోప్రజలు రెండే రకాలు. కూలీలు- యజమానులూ. తన ఆస్తినంతా పేదలకు పంచేయాలనుకు న్నాడు. కానీ భార్య వ్యతిరేకించింది. నిరాడంబరంగా బతకాలనే తాను, విలాసవంతమైన జీవితాన్ని గడిపే భార్యా పిల్లలతో ఇమడలేక డాన్ నదీ తీరానికి వెళ్ళి 20 నవంబరు 1910 న మరణించాడు

          సమాజాన్ని నేటికీ పీడిస్తున్న మతం గురించి ఆయన ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

          ‘సత్యం నా కధిక ప్రియం, అదే నామతం’ అంటాడు టాలుస్టాయి. ఏడెనిమిది ఏళ్ళ  వయసులో అతని సహ విద్యార్ధి “ భగవంతుడనే వాడున్నాడనడం శుద్ధ అబద్ధం. అతని అస్థిత్వాన్ని నిరూపించడానికి తీసుకువచ్చే నిదర్శనాలన్నీ ప్రజలను మోసపుచ్చడానికి వేసిన ఎత్తులే” అన్న మాటలు టాలుస్టాయి మనసులో నాటుకు పోయాయి. ‘సువార్తల నెట్లు పఠించాలి’ అనే పుస్తకంలో ‘ మత ప్రవక్తలు, మనుష్యాతీతమైన బుద్ధి ప్రతిభలు కలవారు అనే నమ్మకంతో మత గ్రంధాలు చదివితే వారి బోధనలను గ్రహించలేం’  అన్నాడు. క్రీస్తు చెప్పిన ప్రేమ సందేశాన్ని వ్యాపింపజేయాలంటే పరమత దూషణం ఎందుకుండాలో  టాలుస్టాయికి బోధపడలేదు. 

          విద్యా విధానం పై గొప్ప అభిప్రాయాలున్నా ఆచరణలో పెట్టలేక పోయాడు. పట్టణా లలో కూర్చుని పత్రికలలో వితండ వాదాలు చేస్తూ ప్రజల్ని విద్యావంతులుగా చేస్తున్నా మనుకోవడం కంటే, పల్లెటూళ్ళలో ప్రజా సామాన్యానికి ఉత్తమ విద్య నేర్పడం సరైన సేవ’ అని నిర్ణయించాడు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు సంచరించి అక్కడి విద్యావిధా నాన్ని పరిశీలించాడు. స్వగ్రామంలో ఆదర్శ పాఠశాల స్థాపించాడు. పిల్లల్ని ఫలానా విషయం చదవండి అని నిర్బంధించకుండా వాళ్ళ ఇష్టానుసారం పాఠాలు నిర్ణయించు కోమన్నాడు. కానీ అనారోగ్య కారణాల వల్ల అది అర్ధాంతరంగా మూతబడింది. అయినా అతని ఆదర్శాల ప్రకారం రష్యాలో పాఠ్యగ్రంధాలూ, పాఠశాలలూ బయల్దేరాయి.

          సాహిత్యం గురించి టాలుస్టాయి అభిప్రాయాలు నేటికీ శిరోధార్యాలే! మాస్కో సాహిత్య పరిషత్తులో చేరినపుడు ఆయనకు అఖండ స్వాగతం లభించింది. దాన్ని అవమానంగా భావించి ‘మనం ప్రజలకు ఉపయోగించే పని ఏం చేసినట్టు?’ అని ఆత్మ విమర్శ చేసుకున్నాడు. ప్రజల పక్షాన ఉన్నందుకు జమీందార్లు ఈయన పై ప్రభుత్వానికి చాడీలు చెప్పారు. వెంటనే టాలుస్టాయి ఆ సంఘానికి రాజీనామా చేశాడు. అనేక పత్రికల్నీ కవుల్నీ పరిశీలించాడు. వాటిలో ప్రజల బాగును కోరేది ఒక్కటీ కనబళ్ళేదు. ‘ ఈ కళలూ, కళాకారులూ కేవలం తమ గొప్పదనాన్ని ప్రకటించుకోడానికే రాస్తున్నారు. ఒకరు చెప్పిన విషయాన్ని వేరొకళ్ళు  కాదని వాదనకు అందుకోవడం, ఒకణ్ణి పొగడి పొగిడించు కొనడం, విమర్శ పేరు చెప్పి, ఇష్టం లేని వాళ్ళను తిట్టడం, ఏదో విధంగా పెద్దపేరు సంపాదించుకోడానికి ప్రయత్నించడం; ఇవే చాలా రచనల్లో కనబడేవి. ఈ కవులంతా రాసే ప్రణయగీతాలు ఏ ప్రజోపకారం చేస్తున్నాయి? కాకి మీద, కుక్కమీద పద్యాలు రాయడం గీతాలల్లడం ప్రజలకేం ఉపకరిస్తుంది? వీళ్ళంతా రాస్తున్న రచనలు కేవలం తమ ఆత్మసంతృప్తికేనా? లేక ప్రజలకు ఉపయోగించడానికా? …వాటిని పత్రికలలో ప్రచురించి ప్రజల ధనాన్నీ, అమూల్యమైన కాలాన్నీ, కాగితాన్నీ ధ్వంసం చెయ్యడం ఎందుకు?” అన్నాడు ( పే.19)

          ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి విమర్శించడం ఆయన స్వభావం. బానిసల దీనావస్థను వర్ణించి జమీందార్లు వాళ్ళకు స్వతంత్రం ఇవ్వాల్సిన ఆవశ్యకతను ప్రకటిస్తూ ‘ ఒక భూస్వామి ప్రాతః కాలక్షేపం’ అనే చిన్న నవలరాశాడు. కాలేజీ రోజుల్లోనే ‘ బాల్యం’ అనే రెండో నవల రాశాడు.‘అంధకార శక్తి’ అనే పుస్తకం రాస్తే దాన్ని ప్రభుత్వం నిషేధించింది. 15 ఏళ్ళపాటు కష్టపడి గొప్ప నవలగా పేరొందిన ‘యుద్ధము-శాంతి’ నవల రాశాడు. టాలుస్టాయికి కీర్తి తెచ్చిన ‘అనా కెరేనినా’ నవల అనేక భాషలలోకి అనువాదమయింది. తన అసభ్య జీవితం వల్ల కలిగిన బాధను ‘ నా దోషాంగీకారం’ అనే పుస్తకంలో రాశాడు. క్రైస్తవ-బౌద్ధ-కన్ఫ్యూషియస్ మహమ్మదీయ మతగ్రంథాలను వివరిస్తూ ‘ చాతుర్దర్శన సమన్వయ దీపిక’ అనే పుస్తకాన్ని 1882 లో రాశాడు. మాస్కోలో బీదల జనాభా లెక్కలు తీసే ఉద్యోగంలో చేరి వారి స్థితిగతులు స్వయంగా తెలుసుకుని ‘ ఏమి చెయ్యాలి?’ అనే పుస్తకం రాసి ప్రచురించాడు. ఎప్పటికప్పుడు మత గ్రంధాలను చదువుతూ తనలో కలిగిన మార్పులను ‘ సువార్త సారము’ నా మతం’ క్రైస్తవ బోధ’ వగైరా పుస్తకాలు రాశాడు. ఆయన రచనలకు రష్యా కంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్విస్ దేశాలలో అనువాదాలు జరిగి పదేసి ముద్రణలు పొందాయి. ‘ కళ అంటే ఏమిటి?’ ‘జారు చక్రవర్తి పట్టాభిషేకం’ అనే రచనలు రెండూ దేశంలో సంచలనం కలిగించాయి. కోనీ అనే స్నేహితుడు చెప్పిన ఓ సంఘటనను ‘ ‘పునరుజ్జీవనం’ అనే నవలగా రాశాడు. అది జర్మన్ భాషలో 12 ముద్రణలు పొందింది. ‘మనకాలం బానిసత్వం’ ‘మతం అంటే ఏమిటి? దాని సారాంశం ఏమిటి?’ అనేవి ఆయన ఆఖరు రచనలని చెప్పవచ్చు.

          లెనిన్ మాటల్లో చెప్పాలంటే “రష్యాలో, బూర్జువా విప్లవం సమీపిస్తూ వుండిన కాలంలో, కోట్లాది రష్యన్ రైతులలో ఉద్భవించిన భావాలకూ, అనుభూతులకూ వక్తగా, టాలుస్టాయి గొప్పవాడు”

          ఈ పుస్తకంలో రంగనాయకమ్మగారు టాలుస్టాయి కథలూ నవలలూ ఇతర రచనలూ పరిచయం చేయడంతో బాటు వాటిని మార్క్సిస్టు దృక్కోణంలో విశ్లేషించారు. అవి రేఖామాత్రంగా టాలుస్టాయి రచనల గురించి తెలుపుతాయి. పూర్వం వాటిని ఎవరెవరు అనువదించారో చెప్పారు. వాటిలో అంతర్లీనంగా ఉన్న భావాలను గమనికల పేరుతో చివర ఇచ్చారు. టాలుస్టాయి రచనల గొప్పతనాన్ని చెబుతూనే అవి దోపిడీ ప్రభువులకు ఎందుకు నచ్చుతాయో కూడా చెప్పారు. ఆమె విశ్లేషణల్లో సుగంధాలూ, ఘాటెక్కిన గంధక ధూమాలూ కూడా ఉంటాయి. సామాన్య పాఠకులను దృష్టిలో పెట్టుకుని 84 ఫుట్ నోట్లు ఇచ్చారు. తెలియని పదం ఏదైనా తారసపడితే దాని మూలాలు ఎక్కడున్నా పిలక పట్టుకుని లాక్కొచ్చి ఫుట్ నోట్ లో ఇచ్చే అలవాటు ఇక్కడ కూడా కొనసాగింది.

          పుస్తకం చివర రంగనాయకమ్మగారు చెప్పిన మాటలతో ఈ వ్యాసం ముగిస్తాను. “ప్రతీ ప్రాంతంలోనూ, ప్రతీ దేశంలోనూ, కవులూ రచయితలూ కళాకారులూ పండితులూ, మేధావులూ, అజ్ఞానులూ, అన్ని రకాల వాళ్ళూ వుంటారు. ఎవరి విజ్ఞానం ఎలా వుందో తెలుసుకోవాలంటే, దాన్ని కొలిచే పరికరం ఏది? – మనిషి విజ్ఞానాన్ని కొలిచే ధర్మామీటరు, మార్క్సిజమే.”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.