గాజుల గలగలలు

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-శ్రీనివాస్ గంగాపురం

          “వదినా!… వదినా!” అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది ప్రీతి. “ఆ… చెప్పు ప్రీతి, రా… కూర్చో” అంటూ ఆహ్వానించింది రమ్య వంటింట్లోంచి వస్తూ.

          “ఏం చేస్తున్నావు రమ్యా” అడిగింది ప్రీతి.

          “రేపు ఆదివారం కదా, ఇడ్లీ చేద్దామని రవ్వ నానపెడుతున్నాను” అంది రమ్య.

          “రేపు మేం ఊరెళ్తున్నాం, ఎల్లుండి సాయంకాలం వస్తాం. కాస్త ఇంటివైపు చూస్తూ ఉండండి” అంది ప్రీతి బతిమాలినట్టు.

          “తప్పకుండా వదినా, ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు” అంది రమ్య కుతూహలంగా.

          “సిరిసిల్లకు, మా ఆడపడుచు దగ్గరికి” అంది ప్రీతి సంతోషంగా.

          “ఎందుకు?” అంది రమ్య ప్రశ్నార్ధకంగా కనుబొమ్మలెగరేస్తూ.

          “వదినా మరదళ్ళ గాజులు తొడిగించడానికి, చార్మినార్ నుంచి మీ అన్నయ్య గాజులు కూడా తెచ్చాడు” అంది గొప్పలు పోతూ, చేతులు సాగదీస్తూ.

          “అవునా!” అంది రమ్య ఆశ్చర్యంగా. “

          వస్తా రమ్య, లగేజీ సర్దాలి” అంటూ లేడి పిల్లలా ముందుకు కదిలింది ప్రీతి.

          “హు… నాది ఒక బతుకేనా” అంటూ నిట్టూర్చింది” రమ్య సోఫాలో కూలబడుతూ. “నాకు అన్నదమ్ములు, లేరు మా ఆయనకి అక్కా చెల్లెళ్ళు లేరు నేనెవరితో గాజులు పెట్టించుకోవాలి” అనుకుంది మనసులో బాధగా. ఉదయం నుంచి పని బడలికలో ఉన్న రమ్యకు కూలర్ తల్లి చల్లగా జో కొట్టడంతో కళ్ళంటుకున్నాయి.

***

          లేచి చూసేసరికి సాయంత్రం ఏడయింది. భర్త దివాకర్ స్కూల్ నుండి ఇంకా రాకపోవడంతో ఇప్పటిదాకా ఎక్కడ రాయబారాలు నడుపుతున్నాడో కనుక్కుందామని ఫోనందుకొని నంబర్ డయల్ చేసింది. “ఇంకా ఫోనెత్తడేంది? ఎవరితో కాలక్షేపం చేస్తున్నాడో ఏమో?” అనుకుంది ఈసడింపుగా. ఫోనింకా రింగవుతుండగానే గేట్ తీసుకొని “రమ్యా!” అనుకుంటూ లోపలికి వస్తూ “నా గురించే తలుచుకుంటున్నావా?” అంటూ స్ట్రాబెర్రీ పళ్ళ బాక్స్ ను చేతికందించాడు.

          “ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? స్కూలు ఏడింటి దాకా నడుపుతున్నారా?” అంది వెటకారంగా.

          “అదేం లేదు రమ్యా, స్కూల్ నుంచి వస్తుంటే వేణు ఫోన్ చేశాడు. కూలర్ కొందా మని సెలక్షన్ కోసమని నన్ను షో రూమ్ కి రమ్మంటే వెళ్ళాను.”అన్నాడు తాపీగా.

          “దానికి ఇంతసేపా?” అంది ఘాటుగా. “లేదు కూలర్ దిగబెట్టడానికి వేణువాల్ల ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అంతే” అన్నాడు బుజ్జగింపుగా.

          “వేణు కోసమెళ్ళారో, రేణు కోసమెళ్ళారో?” అంది దెప్పి పొడుపుగా, మూతి తిప్పుతూ. ఆ మాట విన్న దివాకర్ కు కోపం కట్టలు తెంచుకోవడంతో చెయ్యెత్తాడు విసురుగా! అంత లోనే కోపాన్ని దిగమింగి ఎక్కడ గొడవల గోడలు బద్దలౌవుతాయోనని రమ్యకుఅనుమానం రాకుండా ఎత్తిన చేతితో సెల్ఫ్ లో ఉన్న నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ తీసుకొని రేపటి క్లాస్ కి ప్రిపేర్ కావడానికి తన రీడింగ్ రూమ్ కి వెళ్ళాడు.

          చదువుతున్నాడన్నమాటే కానీ రమ్య మాటలు అతని చెవి చుట్టూ గింగిరాలు కొడుతూనే ఉన్నాయి. “పొద్దు గూకేదాకా తిరగడం, ఏమైనా అంటే ఓ పుస్తకం ముందరేసు కోవడం. పెళ్ళాంతో కాసేపు గడిపేది ఏమైనా ఉందా లేదా?” అంది ఉడుకుతూ” అయినా ఎవరెవరితోనో మాట్లాడడానికి టైముంటది కానీ నాతో మాట్లాడేందుకు ఎందుకుంటది పెళ్లయినప్పటి నుంచి ఇదే సంత! ఓ మాటా లేదు, మూటా లేదు” పంచాంగం వల్లె వేసింది. తిందామని దివాకర్ బతిమాలడంతో తుఫాన్ వాన కాస్త తెరిపిచ్చినట్టు కొంచెం విరామమిచ్చింది. వాళ్ళు తింటుంటే గిన్నెలు, గిలాసలు, గంటెలు గలగలా మాట్లాడుకు న్నాయి! భోజనాలయ్యాక ఒకరు తూర్పుకు, మరొకరు పడమరకు. ఇద్దరు పడుకున్నారే కానీ ఒక్కరు నిద్రపోలేదు! మరో మూడు గంటలు రేణు గురించి… “ఇదొక్కతేనో ఇంకా ఎన్ని గుంట నక్కలు ఉన్నాయో ఇతగాడి మనసులో నాకు ఎప్పటి నుంచో అనుమానమే అయినా వీళ్ళను కాదు ఆ వేణు గాడికి సిగ్గుండాలి నా రాత సక్కగ లేక ఎవర్నని ఏమి లాభం లే!” అంటూ సెకండ్ షో హర్రర్ సినిమా చూపించింది.

          “నేను, వేణు క్లాస్మేట్స్ అంతే కాదు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఉద్యోగరీత్యా ఇద్దరం ఊర్నోదిలి పట్టణంలో ఉంటున్నాం. ఆపదకి సంపదకి ఇద్దరం తోడుంటున్నాం. ఇక్కడ ఒకరికొకరం తోడుండకపోతే బతకడం కష్టం. చూసుకునేవారు గానీ, ఆదుకునే వారు గానీ, చివరికి పలకరించేవారు గాని ఎవరు లేరు! వేణు గాడు బైక్ పై నుంచి పడినప్పుడు హాస్పిటల్ లో దగ్గరుండి చూసుకున్నా. వాడికి నయమయ్యే దాకా ఇంటికి సరుకులు కూడా తెచ్చిచ్చిన. ఆ సమయంలో వాడి కళ్ళు కన్నీళ్ళతో చూపిన కృతజ్ఞత ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది”

          “ఇప్పుడు ఆ వంకతో రేణు వాళ్ళ ఇంటికెళ్ళొస్తున్నావా?”

          “రేణు కాదు, వేణు”.

          “అబ్బో! నాకు ఆ మాత్రం తెలియదేంటి, అది నీ కోసం మనింటికి వచ్చి నా కోసం వస్తున్నట్టు నటించడం, ఇట్లాంటివెన్ని చూడలేదు”.

          ఇద్దరికీ నిద్ర లేవాల్సిన సమయానికి కునుకు పట్టింది. లేచి చూస్తే ఉదయం ఎనిమిదిన్నర. ఆదివారం కాబట్టి సరిపోయిందిద్దరికి.

          ఉదయాన్నే ప్రీతి ఇంటికి వచ్చి తాళం చేయిచ్చి “వెళ్ళొస్తా రమ్యా కాస్త ఇల్లు జాగ్రత్త!” అని చెప్పింది గొప్పగా.

          ప్రీతీ వాళ్ళు మా బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళాయన మూడు చేతులా సంపాది స్తాడు! వాళ్లింట్లో లేని వస్తువంటూ లేదు. వీళ్ళకు లేని కూలర్, ఏ.సి. ల్యాప్టాప్, వైఫై, రూటర్ మొదలగు వస్తువుల గురించి మా గొప్పగా చెప్తుంది.

***

          “గవర్నమెంట్ టీచరని చెప్పి వీడికి నన్నిచ్చి నా గొంతు కోశారు. ఏ బిజినెస్ వాడినో చేసుకున్నా బాగుండేది. పైపెచ్చు ఇతగాడికి పెన్షన్ లేదుట, అతని తదనంతరం నాకిక జీవితాంతం టెన్షనే” అంటూ ‘కీ’ ని కిటికీ కొక్కానికి తగిలిస్తూ దివాకర్ కు వినబడి, వినబడ నట్టు గొణిగింది.

          “ఇంతకీ ప్రీతి వాళ్ళెటెళ్తున్నారట?” అడిగాడు కుతూహలంగా దివాకర్ “ఎటో లే మనకెలాగు అంతటదృష్టం లేదు. చెప్పినా ఏం లాభం లే!” అంది నసుగుతూ.

          “చెప్పు?”

          “ఎందుకు?”

          “ఏం లేదు, ఊరికే; ఏ ఊరికెళ్తున్నారో తెలుసుకుందామని, వాళ్ళాయన మనకి పాతిక వేలివ్వాలి, ఎప్పుడొస్తారో కనుక్కుందామనడిగానంతే”

          “అబ్బో చెట్టెక్కలేనమ్మ గుట్ట లెక్కిందట! మనకే అతి గతి లేదు వాళ్ళకు బదులి చ్చావా?”

          “నిజం, ఇంతకీ వాళ్ళెటుళ్తున్నారో చెప్పనేలేదు?”

          “సిరిసిల్లకుట, వాళ్ళాడపడుచు వాళ్ళింటికట, వదినా మరదల్ల గాజులు పెట్టించు కోడానికట, నాకెలాగు దిక్కూ మొక్కూ లేదు, ఇలాంటి వాళ్ళని చూసి బాధపడటం తప్ప నేనేమీ చేయగలను.”

          “మరి నువ్వు ప్రీతి క్లోజ్ గానే ఉంటారు కదా మీరిద్దరు గాజులు పెట్టించుకోరాదు.”

          “ఏం క్లోజ్ దాని మొహం! అవసరానికి వదినా అంటు దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతది కానీ ఇంట్లకు కూడా రమ్మనది. మనింటికొచ్చి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ, టీ త్రాగి మరీ వెళ్తది. కానీ వాళ్ళింటికెళ్తే, అదే బయటకొచ్చి నిలబెట్టి మాట్లాడి పంపిస్తది” అంది భర్తకు ఇడ్లీలు పెట్టి, తను తింటూ.

          “దివాకర్ టిఫిన్ చేసి బయటకెళ్తుంటే, “ఎక్కడికి మళ్ళీ రేణు వాళ్ళింటికేనా” అంది కవ్వింపుగా.

          “అది కాదు లైబ్రరీకెళ్తున్నా, నీకు తెలుసు కదా నేను ప్రతి సండే లైబ్రరీకెళ్తానని” అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ లైబ్రరీ వైపు తిప్పి, అంతలోనే ఏదో ఆలోచన రావడంతో వేణు వాళ్ళింటి వైపు మళ్ళించాడు.

          “రారా దివాకర్, రా! నేనే నీకు కాల్ చేద్దామనుకుంటున్న మనం ఊరెళ్ళి చాలా రోజులైంది కదా. ఈరోజెళ్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావ్. ఇప్పుడే వెళ్దామా, లంచ్ చేసి వెళ్దామా?” అన్నాడు మిత్రునికి కుర్చీ చూపిస్తూ.

          “ఇంటికి మరో రోజు వెళ్దాం రా ఈ రోజు మీరిద్దరూ మా ఇంటికి రావాలి” అన్నాడు వేడుకోలుగా.

          “ఓ దానికేం భాగ్యం, మరేం దావత్ ఇస్తున్నావురా?” అడిగాడు చనువుగా.

          “మీ ఇంటికా?” అడిగింది రేణు కంగారుగా. రమ్య తనను అయిష్టంగా, అనుమానంగా చూస్తుందని చెప్పలేక, రాననలేక గాబరా పడిపోయింది. ఆమె పరిస్థితిని చూసి దివాకర్ “అరే! బావ నువ్వు చెల్లెలిని తీసుకొని ఈ రోజు మా ఇంటికి రావాల్సిందే రా!” అడిగాడు పట్టుబట్టినట్టు.

          “అదేంట్రా! దివాకర్ ఈ రోజు కొత్తగా బావ, చెల్లి అంటున్నావ్?”

          “ఏం లేదురా నాకు చెల్లెల్లు లేరు, రమ్యకు వదినా మరదళ్ళు లేరు కనీసం రేణుని చెల్లెలిగా అనుకుంటే రమ్యకు ఓ అన్నయ్య వదినలను ఇచ్చినట్టుంటుంది కదరా!”

          “థాంక్యూ రా బావా! నీకే కాదు రా మాకూ ఆ లోటు తీరుతుంది” అన్నాడు ఆనందంతో.

          “కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ రా!” “ఏంట్రా అది, ఇప్పుడు మనం బంధువులం రా, ఏం కావాలో చెప్పు” అన్నాడు దివాకర్ని దగ్గరికి తీసుకుంటూ.

          “ఏం లేదురా మీరు వచ్చేటప్పుడు రమ్యకు గాజులు తీసుకురండిరా వదినా మరదళ్ళ గాజులు పెట్టించుకుంటున్నారట కదా, తనకెవరూ లేరు” అన్నాడు గద్గద స్వరంతో.

          “చాలా సంతోషం అన్నయ్యా! తప్పకుండా వస్తాం అంది” రేణు కన్నీళ్ళు  తుడుచు కుంటూ.

          “అంతేకాదు ఈ రోజు మీరు మా ఇంట్లోనే ఉండాలి” అడిగాడు దివాకర్ ఆశగా.

          “సరే లేరా రమ్య కోరుకుంటే అట్లాగే ఉంటాం లే” అన్నాడు భుజం తడుతూ.

          ఇద్దరికీ నమస్కరించి బైక్ స్టార్ట్ చేసి గాజుల షాప్ కెళ్ళి నాలుగు రకాలు నాలుగు డిజైన్లలో నాలుగేసి డజన్ల గాజులు కొని బైక్ డిక్కీలో భద్రంగా పెట్టి ఎప్పటిలాగే ఇంట్లో కొచ్చి నడుంవాల్చాడు.

          సాయంత్రం నాలుగయింది. “వదినా! ఏం చేస్తున్నారొదినా!” అనే పిలుపు వినబడే సరికి “అరే ప్రీతి వాళ్ళు రేపు వస్తామన్నారుగా ఈ రోజే వచ్చారా వదినా ” అంటూ… తలుపు దగ్గరకు వచ్చి రేణు, వేణులను చూసి నోరెళ్ళబెట్టి అవాక్కయ్యింది!

          “ఏం వదిన ఇంట్లోకి రానిస్తావా లేక గుమ్మం ముందే నిలబెడతావా?” అని రేణు చనువుగా అడగడంతో..

          “ఆ రండి రండి” అని కంగారు పడుతూ లోపలికి పిలిచి సోఫా చూపించింది. రేణు వేణులు ఎప్పుడు ఫ్రెండ్స్ లా పేర్లు పెట్టి పిలుచుకున్నారే కానీ ఇలా వరుస పెట్టి పిలుచుకోలేదు. త్రాగడానికి నీళ్ళిచ్చి, టీ పెట్టి దివాకర్ని లేపింది.

          “అరే వేణు! ఎప్పుడొచ్చార్రా” అంటూ కళ్ళు నిమురుకుంటూ ఏమి తెలియనట్టు దివాకర్ అటకాయించడంతో, ఇప్పుడే వచ్చామన్నయ్యా అంటూ సోఫాలోంచి లేస్తూ బదులిచ్చింది రేణు.

          “అయ్యో కూర్చో అమ్మా” అంటూ తను పక్కనున్న స్టూల్ లాగి కూర్చోగానే అన్నీ వింటూ టీ తీసుకొచ్చింది రమ్య ఆశ్చర్యపోతూ!

          “ఏంట్రా వేణు ఇంకేం విశేషాలు ఈ రోజు ఊరెళ్ళ లేదా?”

          “ఏం లేదురా రేణుకు వరసైన వదినా మరదళ్ళెవరు లేరు కదా, అందుకని అందరూ వదిన మరదళ్ళ గాజులు పెట్టించుకుంటున్నారని చెల్లెమ్మకి పెట్టిద్దామని వచ్చామురా” అన్నాడు టీ తాగుతూ. రమ్యవైపు ఆప్యాయంగా చూస్తూ, “అది మీకిద్దరికీ అభ్యంతరం లేకపోతేనే” అనడంతో దివాకర్ టీ తాగుతూ రమ్య అనుమతిని కోరాడు కళ్ళతో మూడో కంటికి తెలియకుండా! రమ్య తికమక పడుతూ కాస్త ఆలోచించి తలూ పింది ఆఖరి గుక్క మింగుతూ.

          “వాళ్ళిష్టం రా నాకేం ఇష్టం లేదు, అయిష్టం లేదు” అని దివాకర్ ముక్తసరిగా అనడంతో

          “అయ్యో అలా అంటారేంటండి నాకిష్టమే అయినా రేణు నన్ను వదినా అంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది” అంది నవ్వుతూ.

          రేణు తన బ్యాగులోంచి గాజులు తీస్తుండడంతో రమ్య దివాకర్ దగ్గరకొచ్చి “అయ్యో మన ఇంట్లో గాజులు లేవు కదా, తొందరగా వెళ్ళి పట్టుకురండి అనడంతో ‘కీ’ తీసుకొని బైక్ స్టార్ట్ చేసి అరగంట తర్వాత నింపాదిగా వచ్చి బైక్ డిక్కీలోంచి గాజులు తీసిచ్చాడు రమ్యకు.

          ఇద్దరు సంతోషంతో నవ్వుతూ ఒకరికొకరు గాజులు వేసుకొని పసుపు, కుంకుమ, సారె ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి ముఖాలు జంట దీపాలైనై.

          బయట మిత్రులిద్దరూ మాట్లాడుకుంటుంటే రమ్య వచ్చి “మా అన్నయ్యకు మాటలతోటే కడుపు నింపేస్తావా, లేక ఏమన్నా మర్యాద చేసేదుందా లేదా? అనడంతో “అరే మాటల్లో మరిచేపోయాను, ఉండు” అంటూ బైక్ కవర్ లోంచి సరంజామా బయటకు తీశాడు వీరుడిలా!

          రాత్రి ఎనిమిదిన్నరకి వంటింట్లో వంటలో మునిగిన నాలుగు చేతులు మసాలా దంచుతుండగా, కొత్త గాజులు గలగలమని శబ్దం చేస్తుంటే… హాలులో గాజు గ్లాసులు గలగలమని వంత పాడాయి!

*****

Please follow and like us:

3 thoughts on “గాజుల గలగలలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. కథ గాజుల గలగలలు బాగుంది. అనుమానంతో లేనిపోని సంబంధాలు అంటకట్టె ఆడవాళ్ళకు, నిష్కల్మషమైన మనసుతో ఉండే బంధాల విలువ బాగా చూపించారు. అభినందనలు.

  2. గాజుల గలగలలు అనే శ్రీనివాస్ గంగాపురం గారు రచించిన కథ సమకాలీనంగా వున్నది. ఇందులో తోబుట్టువులు లేని ఒక వివాహిత స్త్రీ యొక్క అసూయా ద్వేషాలను, ఆమె అనుమానపూరిత మనస్తత్వాన్నీ మరియు అబధ్రతా భావాన్నీ రమ్య పాత్ర ద్వారా రచయిత చక్కగా తెలియచేశారు. దివాకర్ తన సమయస్ఫూర్తితో తన ఇంటి సమస్యను పరిష్కరించుకున్న విధానం బాగున్నది. దివాకర్, వేణుల పాత్రల ద్వారా స్నేహితం యొక్క ఔచిత్యం తెలియచెయ్యబడింది. మొత్తంగా ఇది మానవ సంబంధాలను చక్కగా చిత్రించిన కథ. రచయితకు, నెచ్చెలి సంపాదక వర్గానికీ అభినందనలు.
    బి.వి. శివ ప్రసాద్

Leave a Reply

Your email address will not be published.