దుబాయ్ విశేషాలు-11

-చెంగల్వల కామేశ్వరి

          అబుదాబీలో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. నేను చూసినవాటి గురించే వివరిస్తున్నాను. మిగతావాటి గురించి తర్వాత పర్యటనలో వివరిస్తాను. క్రింద ఇచ్చిన ప్రదేశాలన్నీ చూడాలంటే తగిన సమయం, ఆర్ధిక స్తోమత, అభిరుచి ఉండాలి. చరిత్ర సృష్టించిన సంపన్నుల విలాసాల విడిదిల వంటి ఈ ప్రదేశాలు చూడగలగటం మన కనులు చేసుకున్న అదృష్టం !

ఇంకొన్ని షార్జా విశేషాలు

షార్జా డెసర్ట్ సఫారీ కూడా మేము ఎంజాయ్ చేసాము. ఆ వివరాలు ఈ రోజు  తెలియ చేస్తాను.

          మా అల్లుడు చిరంజీవి రవీంద్రకుమార్ ముందుగానే బుక్ చేసినందున ఇంటి దగ్గరే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మాతోపాటు ఇంకొక టూరిస్ట్ జంట( రష్యన్) మొత్తం ఏడుగురం డెసర్ట్ సఫారీకి బయల్దేరాం.

          విశాలమైన హైవే రోడ్ గుండా అటు ఇటు ప్రభుత్వం పెంచిన ఫారెస్ట్ కనిపిస్తుంది. గంటన్నర ప్రయాణించి నగర శివార్లు దాటి ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక ప్రదేశంలో ఉన్న కేఫ్టేరియా వంటి చెక్ పోస్ట్ కి వెళ్ళి బుకింగ్ డీటైల్స్ చెక్ చేయించుకుని అక్కడ ఇసకలో బైక్స్ కార్స్ నడుపుతున్నవారిని చూసి సరదాగా ఫొటోలు తీయించుకున్నాము.

          ఆ తర్వాత మా వెహికిల్ ఎక్కాము అప్పుడు మొదలైంది మరువరాని తొలిడెసర్ట్ ప్రయాణం అనుభవం. ఎత్తయిన సైకతశిఖారాగ్రాల అరోహణావరోహణలు. భయంతో కేకలు అరుపులు నవ్వులు హమ్మయ్య అనుకునేలోగానే ఇసకను తొలుచుకుంటూ పైకి దొర్లుకుంటూ క్రిందకు జరిగిన నలభై అయిదు నిముషాల ప్రయాణం.

          లోలోన బిక్కుబిక్కుమంటున్నా నాక్కూడా గుండె దడదడలాడుతున్నా మా చెల్లి, మా వసంతల భయానికి మాకు ఒకటే నవ్వు. నాకు గతంలో రాజస్థాన్ ఎడారిలో అయిన అనుభవమొకటుంది కాబట్టి ఆ డ్రైవ్ గురించి కొంత తెలుసు.

          పాపం మా చెల్లి అక్కో అక్కా! ఏమండీ ? ఏమండీ ! అనంటూ, మా వసంత మమ్మీ ! మమ్మీ అంటూ చాలా భయపడ్డారు. “భయం లేదు! సుశిక్షితులైన డ్రైవర్స్ చేసే విన్యాసాలు. ఏమి భయముండదు” అని ధైర్యం చెప్పినా, లోలోన నాకూ భయమే! ఒఠ్టి మేకపోతు గాంభీర్యం అన్నమాట! మొత్తానికి మమ్మల్ని నీళ్ళు త్రాగించి ఎడారిలో దింపేసరికి భయం పోయింది.

          ఎటు వైపు చూసినా ఆ సాయంత్రపు నీరెండలో బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక దిబ్బలు తప్ప మరేమి కానరాని ఆ ఎడారిలో మేమున్నామనే తలంపుకి చిన్నప్పు డు మేము చూసి ఏడ్చిన “పాపంపసివాడు” సినిమా గుర్తొచ్చింది. అక్కడ నుండి సూర్యా స్థమయం చూసాక తిరిగి మమ్మల్ని డెసర్ట్ కేంప్ కి తీసుకెళ్ళారు.

          అప్పటికే నింగి నిండా చుక్కలు చంద్రుడు కొలువుతీరారు. ఆ వెన్నెల అందానికి మించిన విధ్యుత్ దీపాల కాంతులు ఆ కేంప్ పరిసరాలలో నిండి పోయాయి. ఎందరో పర్యాటకులు కుటుంబాలతో సహా విచ్చేసారు. ముందుగా అందరూ వాళ్ళకి కావల్సిన స్నాక్స్ కౌంటర్ లో నుండి తెచ్చుకుని తిని టీ త్రాగి అక్కడ వలయాకారపు వేదికకి చుట్టూ ఉన్న టేబుల్స్ కి అటు ఇటూ మెత్తని కుషన్స్ మీద కూర్చున్నాక రకరకాల విన్యాసాలతో వివిధ నృత్య రీతుల ప్రదర్శన మొదలయింది.

          వాటిల్లో ముఖ్యంగా “నిప్పుతో చెలగాటం”లాగ వెలుగుతున్న కాగడాలతో, చేసిన నృత్యం, తానౌరా అనబడే ఒక సాంప్రదాయ నృత్యం, సంగీతానికి అనుగుణంగా శరీరంలోని అణువణువుని కదుపుతూ ఒక యువతి చేసిన బెల్లీ డాన్స్ చాలా బాగున్నా యి. అవన్నీ ఒక కళగానే అందరూ ఆస్వాదించారు నచ్చినచోట చప్పట్లు కొట్టారు. కాని ఎవరూ స్టేజ్ పైకి రావడం ఈలలు వేయడం కాని లేదు. ఆ డీసెన్సీ నాకు బాగా నచ్చింది.

          చక్కగా వారిచ్చిన మీల్స్ (వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ) తింటూ చక్కగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసాము. అలా షార్జాలో మేము వెళ్ళిన డెసర్ట్ సఫారీ మాకందరికీ ఒక అపురూప జ్ఞాపకంలా మనోఫలకంలో ముద్ర పడిపోయింది. “ధాంక్సెగైన్ ! రవీంద్రా అండ్ వసంతా!

          మరికొన్ని షార్జా విశేషాలు మళ్ళీ తెలియచేస్తాను.

అబూదాబీలో చూడవలసిన ప్రదేశాల వివరాలు. మీ కోసం…

యాస్ మాల్

సాదియాత్ పబ్లిక్ బీచ్

అల్ లులు ద్వీపం

ముష్రిఫ్ సెంట్రల్ పార్క్

మెరీనా మాల్

అబుదాబి మాల్

డాల్మా మాల్

ముష్రిఫ్ మాల్

షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు కేంద్రం

కస్ర్ అల్-హోస్న్

హెరిటేజ్ విలేజ్

సఫారీలు

బ్లూ వేల్ జెట్ స్కీ

ఎల్లో బోట్ టూర్

ఎడారి శిబిరం

ఫెరారీ వరల్డ్

మెరీనా ఐ

ఎమిరేట్స్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్

ఎమిరేట్స్ పార్క్ జూ

వార్నర్ బ్రదర్స్ వరల్డ్

లౌవ్రే మ్యూజియం

అల్ ఐన్ ప్యాలెస్ మ్యూజియం

మహిళల హస్తకళా కేంద్రం

ఎతిహాడ్ టవర్స్

గిడ్డంగి 421

అరేబియా వైల్డ్ లైఫ్ పార్క్

ఎమిరేట్స్ ఆటో నేషనల్ మ్యూజియం

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.