అనుసృజన

ఇక అప్పుడు భూమి కంపిస్తుంది

మూలం: రిషబ్ దేవ్ శర్మ

అనుసృజన: ఆర్ శాంతసుందరి

చిన్నప్పుడు విన్న మాట
భూమి గోమాత కొమ్ము మీద ఆని ఉందనీ
బరువు వల్ల ఒక కొమ్ము అలసిపోతే
గోమాత రెండో కొమ్ముకి మార్చుకుంటుందనీ
అప్పుడు భూమి కంపిస్తుందనీ .
 
ఒకసారి ఎక్కడో చదివాను
బ్రహ్మాండమైన తాబేలు మూపు మీద
భూమి ఆని ఉంటుందనీ
వీపు దురద పెట్టినప్పుడు
ఎప్పుడైనా ఆ తాబేలు కదిలితే
భూమి కంపిస్తుందనీ.
 
తరవాతెప్పుడో ఒక పౌరాణిక నాటకంలో చూశాను
వేయిపడగల శేషనాగు
భూమిని మోస్తోందనీ,
కాలం నాగస్వరం ఊదితే
ఆ సర్పం తోక ఆడుతుందనీ
వేయిపడగలూ ఊగుతాయనీ
అప్పుడు భూమి కంపిస్తుందనీ.
 
భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు
భూమి కడుపులో
అంతటా ప్లేట్లు ఉంటాయనీ
అవన్నీ వరసలుగా పేర్చి ఉంటాయనీ
ఒక ప్లేటు జారిందంటే
మరొకటి కదులుతుందనీ
అప్పుడు భూమి కంపిస్తుందనీ .
 
అర్థశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తాయి
మనిషి నియమాలని అతిక్రమిస్తే
ప్రకృతి ఎదురు తిరుగుతుందనీ
అప్పుడు భూమి కంపిస్తుందనీ.
 
మతాన్ని గుత్తకు తీసుకున్నవాళ్ళు ప్రకటించారు
ధర్మానికి హాని కలిగినప్పుడల్లా
అధర్మం పెరిగిపోయినప్పుడల్లా
అన్యాయం, అత్యాచారం పెరిగిపోతాయనీ
అప్పుడు భూమి కంపిస్తుందనీ .
 
భూమి కంపిస్తుంది
పగుళ్ళు ఏర్పడతాయి
పదేసి అంతస్తులూ మట్టిలో కలిసిపోతాయి
కొన్ని వేల పూరిపాకలు భూగర్భంలో కలిసిపోతాయి.
 
గోమాత కొమ్ములు గుచ్చుకుని
స్కూలు పిల్లల పేగులు ఛిద్రమౌతాయి.
 
తాబేటి డిప్పమీద పడి
రక్తసిక్త మౌతాయి
గర్భవతులు తమ కడుపులో నింపుకున్న
కొత్త జీవితపు ఆశలు.
 
ఆదిశేషుడి విషపు కాటుకి నీలంగా మారిపోతుంది
పొలాల్లోనూ కర్మాగారాల్లోనూ
పనిచేసే వాళ్ళ నెత్తురు.
 
ప్లేట్లలా విరిగిపోతాయి మేడలు
గాయాలతో ఛిద్రమైపోతుంది
ఈ పచ్చని నేల దేహం.
నల్లని నీడలాంటి మృత్యువు
పరికెత్తుతూనే ఉంది అనుక్షణం
అన్నివైపుల నుంచీ చుట్టుముడుతూ
మనిషి ప్రాణాలని.
 
ఇన్ని రకాల మృత్యువు
మనిషేమో ఒక్కడే.
సృష్టి ప్రారంభమైనప్పటి నుంచీ
ఈ పరుగు వెంట వస్తూనే ఉంది
విలీనం చేస్తూనే ఉన్నాయి నాగరికతలని భూకంపాలు
అట్టహాసం చేస్తూనే ఉన్నాడు కాలభైరవుడు
తాండవనృత్యం చేస్తూ
 
కానీ
 
ప్రతిసారీ ఎక్కడో ఒకచోట
కూలిన శిథిలాల మధ్య
కదులుతుంది ఒక చెయ్యి
పైకి లేస్తాయి ఐదు వేళ్ళు
ఊపిరి పీలుస్తూ
అన్ని శిథిలాలనీ చీల్చుకుని
సవాలు చేస్తూ !

*****

Please follow and like us:

One thought on “అనుసృజన- ఇక అప్పుడు భూమి కంపిస్తుంది”

  1. నాకు శాంతాసుందరి గారితో పరిచయం హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో, సుమారు పదేళ్ల కిందట. చిరునవ్వుతో వెలిగిపోతున్న ముఖారవిందంతో మాట్లాడింది. కొకు గారి కూతురని తెలిసి ఒక ఫోటో దిగాను కూడా.ఆపై, ఆవిడ ఒక ప్రఖ్యాత అనువాద రచయిత్రని తెలిసింది. Facebook లో ఎన్నో కవితలు చదివాను. నేనెప్పుడో రాకుకున్న మాట… ‘మనిషి అభివృద్ధి చెందుతున్న కొద్ది తన మరణానికి కొత్త దారులు కనుక్కొంటున్నాడని ‘. ఆదే భావం, ఈ కవితలో చూసాను. మనల్ని మోస్తున్న భూమి కంపిస్తున్నది అంటే, మనవల్ల ఆ తల్లికి ఏదో ఇబ్బంది కలుగుతున్నట్లే. అది తెలుసుకుంటే, ఈ గ్రహాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published.