కనక నారాయణీయం -56

పుట్టపర్తి నాగపద్మిని

వెంటనే పుట్టపర్తి అందుకున్నారు,

“ఆదీప్త వహ్ని సదృశై: మరుతావధూతై:
సర్వత్ర కింశుక వనై: కుసుమావనమ్రై:
సద్యో వసంత సమయేన సమాగతేయం
రక్తాంశుకా నవ వధూరివ భాతి భూమి:.’

          ఎంతో గొప్ప వర్ణన! కింశుక వృక్షం వసంత కాలానికి ప్రతీకగా ఎందరో కవులు అద్భుతంగా వర్ణించారు. నిండుగా విరగబూచిన పలాశ, అదే మోదుగ చెట్ట్లు ఎటు జూసినా కనబడుతున్నాయి. ఇలా భూమిని చూడగానే, కాళిదాసుకు అరుణారుణ వస్త్రాలు ధరించి నిలచి ఉన్న నవ వధువు కళ్ళల్లో మెదిలిందట! ఎర్రెర్రగా, ప్రజ్వలింప జేయబడిన అగ్నిలాగా ఉన్నాయా పూలు. గాలి వీచినప్పుడల్లా, ఆ చెట్టు ఊగుతుంటే, పువ్వులు కూడా అలవోకగా ఊగుతున్నాయి. కళ్ళు మూసుకుని, ఆ దృశ్యం ఊహించు కుంటేనే ఎంతో అనందం మనసంతా నిండిపోతుంది! అందుకే ఉపమా కాళిదాసస్యా అన్నారెప్పుడో పెద్దలు!’

          ‘ఔను స్వామీ! మన స్కూల్ లో ఉన్నది ఒక్కచెట్టే! కానీ పరిసరాలన్నిటినీ యీ చెట్టు అందం శోభాయమానం చేస్తున్నది.’

          వాళ్లిలా మాట్లాడుకుంటూనే, స్కూల్ లోకి ప్రవేశించి, హెడ్ మాస్టర్ కూర్చునే గదికి చేరుకున్నారు. కానీ అక్కడెవరూ లేరు. ఇదేమిటి? ఏమై ఉంటుంది? పుట్టపర్తి, రామేశ్వర శర్మ ఎవరినడగాలో తెలీక అటూ ఇటూ చూస్తుంటే, పరుగు పరుగున నాగపద్మిని ఆయాస పడుతూ వచ్చిందక్కడికి,’అయ్యా, నేను తోటలోంచీ బైటికొస్తూ ఉంటే, రంగనాధం సర్ కార్లో వెళ్ళిపోతున్నారు. ఆయనకు ఏదో అర్జెంట్ పని వచ్చిందంట! ఆయనతో పాటూ తక్కిన వాళ్ళూ వెళ్ళిపోయినారు. నేను మీ కోసం వచ్చినాను.’ ఇప్పటికి ఇద్దరికీ అసలు మీటింగ్ ఎందుకు కాన్సల్ అయిందో అర్థమైంది. కానీ వాళ్ళిక్కడికి వచ్చే ముందు ఏమి జరిగిందో తెలియలేదు. అసలు అందరినీ పిలిచిన కారణమేమిటో కూడ తెలియలేదు. ఐనా, రేపు స్కూల్ లో ఎటూ తెలుస్తుంది ‘ అనుకుంటూ ఇళ్ళకు తిరుగుముఖం పట్టారు.

***

          ‘నాగా..ఒసే నాగా!!’ తళిహింట్లో వంట చేసుకుంటున్న కనకమ్మకు మిద్దె మీద నుండీ ఆచార్యులవారి పిలుపు గట్టిగా వినిపిస్తూ ఉంది. చేతులు తుడుచుకుంటూ, వీధి తలుపు దగ్గరికి వెళ్ళిందామె, నాగ ఎక్కడుందో చూసేందుకు! గడప దాటి వీధి వైపున్న అరుగులు దాటి అటూ ఇటూ దృష్టి సారించి చూసింది. నాగ జాడ లేదు. వెనక్కి తిరిగి చూస్తే, తులజ అక్కడే కూర్చుని, ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. ‘తులజా! మీ అయ్య నాగనెందుకో పిలుస్తున్నారు. అదెక్కడికి పోయిందో మరి! నువ్వు పోయి అడుగు ఏంకావాలో ఆయనకు!’

          తులజ తల అడ్డంగా ఊపింది.

          ఈ లోగా మళ్ళీ పిలుపు.

          ‘ఎందుకే?’

          సమాధానం లేదు. ఈ తులజ ఎప్పుడూ ఇంతే! ఎక్కువ మాట్లాడదు. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉంటుంది. ఇంటి పని చెబితే, అది కూడా ఎక్కువ మాట్లాడే అవసరం లేకుండానే చేస్తుంటుంది. స్కూల్ లో ఎప్పుడూ మంచి మార్కులే! యెందుకింత ముభావంగా వుంటుందో ఏమో! తనను అడిగి ఫలితం లేదనుకుంటూ, తనే మెట్ల మీదుగా పైకి వెళ్ళింది. పుట్టపర్తి ఏదో పుస్తకంలోకి చూస్తూ తీక్ష్ణంగా ఆలోచిస్తూ ఉన్నట్టుగాఉన్నారు.

          కనకమ్మ మెట్ల దగ్గరే ఆగి అన్నది. ‘నాగ ఇంట్లో లేదండీ, ఏమి కావాలో చెప్పండి.’
‘అదే, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందో, నాకు రూల్ నోట్ బుక్ కావాలిప్పుడు. ఎదురుగా సుబ్బయ్యనడిగి తెమ్మని చెబుదామంటే, ఎదీ, ఇంట్లోనే లేదు. ఆ తులజుంటే, దానితో పంపించు.’ పుస్తకంలోకి చూసుకుంటూనే చెప్పేశారాయన.

          తనకు తప్పదిక అనుకుంటూ కిందకి దిగారామె. ఈ లోపల, తనకు ఎక్కడలేని నీరసం అనిపిస్తూంది. మొన్నోనాడు కడుపంతా తిప్పినట్టై వాంతికి వచ్చేసింది. ఎందుకో అర్థం కావటం లేదు. అమ్మకు జాబు రాసి పది రోజులయ్యింది. అమ్మ ఏమైనా చెబితే, ఇంక ఆలోచించవలసిన పనే లేదు. ఈ ఎండాకాలం మరీ విపరీతంగా ఉంది. మామిడి కాయలూ, మల్లె పూలూ – సంగతి అటుంచి, బండలు పగిలిపోయేటట్టే ఉంటుందెప్పుడూ ఇక్కడ కడపలో! గోడలు కూడా వేడెక్కి పోతున్నాయి. పాపం, ఆయన మిద్దె మీదే ఉంటా రెప్పుడూ! ఎంత ఎండో! ఆయన పుస్తకాలేమో, అయనేమో అన్నట్టే ఎప్పుడూ! ఈ ఎండా, తాపం – ఇవన్నీ ప్రభావం చూపించవేమో, కావ్యోద్యాన వనాల్లో తిరుగుతూ ఉంటే! ‘
ఆలోచిస్తూనే కనకవల్లి మళ్ళీ వీధి అరుగుల దగ్గరికొచ్చి తులజ ముందు నిలబడి ,’తులజా! ఆ సుబ్బయ్య దగ్గరికి పోయి, రూల్డ్ నోట్ బుక్ పెద్దదొకటి తీసుకు రా! లెక్కలో రాసుకొమ్మను. మీ అయ్యకు ఇచ్చేసిరా! నేను తళిహెలో ఉన్నా.’ ఆజ్ఞాపించి లోపలికి వెళ్ళిపోయిందామె!

          తులజకు ఇంక తప్పలేదు.

          ఈ సుబ్బయ్య అంగడి, తమ ఇంటికి ఎదురుగా ఉన్నడా. నీలకంఠం గారి ఇంటి ముందు వరండాలో ఉంది. డాక్టర్ అంటారే కానీ, ఆయన దగ్గరికి పేషెంట్లు వచ్చేది చాలా తక్కువే! సర్వీస్ లో ఉన్నప్పుటి సంగతి తమకు తెలియదు. వెనకున్న నరసరామయ్య వీధి నుంచీ ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చింది కదా మరి! ఎప్పుడో రిటైర్ అయినట్టున్నాడు ! బక్క చిక్కి ఆయనే ఒక జబ్బు మనిషిలా ఉంటాడు. పైగా దగ్గుతూ ఉంటాడు కూడా!! ఇంక అటువంటి డాక్టర్ దగ్గరికి ఎవరొస్తారు? ఇంటి ముందు బోర్డ్ మీద డా. నీలకంఠం అని పెద్ద అక్షరాలతో బోర్డైతే ఉంది.

          ఇంక ఈ సుబ్బయ్య వాళ్ళ అబ్బాయి, రామ కృష్ణ హై స్కూల్ లోనే లెక్కల టీచర్. వైశ్యులు. నిజానికి వాళ్ళకీవిధంగా చిన్న చిన్న కొట్లు పెట్టుకోవలసిన అవసరమే లేదు. ఐనా యీ సుబ్బయ్యకు ఇంట్లో పొద్దు పోదట! తిరిగే కాలూ, తిట్టే నోరూ ఊరికే ఉండలేవ న్నట్టు, యీ కొట్టు ఆలోచన చేసుకున్నాడీ సుబ్బయ్య. ఇది బడి పిల్లలు వెళ్ళే దారి కదా! పిల్లలకు అవసరమయ్యే, పుస్తకాలు, పెన్సిళ్ళూ, రబ్బర్లూ, నోటు బుక్కులూ, పరీక్షలు రాసే అట్టలూ, ఇటువంటి సామగ్రి పెట్టుకుని కూచుంటాడా సుబ్బయ్య! వయసు పెద్దదే! బోసి నోట్లో ఏదో బిస్కెట్ లాంటివి వేసుకుని ఆడిస్తూనే ఉంటాడెప్పుడూ!!

          తులజ వీధి దాటి, డా. నీల కంఠం వాళ్ళింటి మెట్లెక్కి సుబ్బయ్య దగ్గరికి వెళ్ళింది. ‘ ఇదిగో సుబ్బయ్యా! మా అయ్యకూ రూల్ నోటు బుక్కు పెద్దది కావాలంట! పద్దులో రాసు కుని ఇవ్వు, తొందరగా!’

          సుబ్బయ్య వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు చూశాడు.

          తులజ కు కోపం వచ్చేసింది. గట్టిగానే చెప్పినా వినబడనట్టే అడుగుతున్నాడు చూడు! అని కోపం వచ్చింది. ఇంక మళ్ళీ చెప్పే ఓపిక లేనట్టు తనే ముందుకు వంగి రూల్డ్ బుక్స్ ఉన్న దొంతిలో నుండీ రెండు బుక్స్ తీసుకుని, లెక్కలో రాసుకొమ్మని సైగలతో చూపించి, నాగ ఎక్కడైన కనిపిస్తుందేమోనని ఆశగా అటూ ఇటూ చూసింది.
ఇప్పుడీ బుక్స్ అయ్యకిచ్చి రావలె! అక్కడ నిలబడి చూస్తే, కుడి వైపు వీధి మలుపు దగ్గర శివాలయం దాకా, ఇటు ఎడమ వైపు, దివ్యజ్ఞాన సమాజం దాకా బాగా కనిపిస్తుంది. రద్దీ కూడ ఎక్కువగా ఉండదు, స్కూల్ సమయంలో తప్పితే! ఈ నాగ ఎక్కడెక్కడుంటుందో, సమయానికి ఇంట్లో ఉండదు. దీనికీ స్నేహితులెక్కువే! అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూనే ఉంటుందెప్పుడూ! దృష్టి సారించి ఎంతగా చూసినా నాగ పొలకువ లేదు.

          మెల్లిగా ఇంట్లోకి వెళ్ళి అమ్మేమి చేస్తుందో చూసింది. ఏదో రోటి పచ్చడి కాబోలు నూరుతూ ఉందమ్మ, వెనక గుడిపాటవ్వ, ఇంట్లో ఉన్న రోలు దగ్గర కూర్చుని! ఇంక లాభం లేదన్నట్టు, తనే ఆ పుస్తకాలు పట్టుకుని మెల్లిగా మిద్దె మీదికి వెళ్ళింది. మెట్లు దాటే ముందున్న చిన్న గోడ మీదిగా చూసింది. దీర్ఘంగా ఏదో బుక్ లోకి చూస్తున్నారయ్య.
నిశ్శబ్దంగా మెట్లెక్కి, నోటు బుక్కులు అయ్య రాసుకునే బల్లదగ్గర పెట్టి, శబ్దం చేయ కుండా కిందికి వచ్చేద్దామని వెనక్కి తిరిగిందో లేదో,’ ఆ..తెచ్చినావా రూల్డ్ బుక్స్?’ అయ్య గొంతు.

          చప్పున వెనక్కి తిరిగింది. ”పద్దులో రాసుకున్నాడయ్యా సుబ్బయ్య!’ అనేసింది.

          ‘అది సరే, నీవిప్పుడే క్లాసు?’

          ‘ఫిఫ్త్ ఫార్మ్. రామకృష్ణా హై స్కూల్ లోనే.’

          ‘అది సరే కానీ, ఎందుకంత నిశ్శబ్దంగా ఉంటావెప్పుడూ మూక కవి మాదిరి?’

          తులజ నుండీ సమాధానం లేదు.

          ‘మూక కవి అంటే ఎవరో తెలుసా?’

          తెలియదన్నట్టు అడ్డంగా ఊపింది.

          ‘ కాళిదాసు అని ఒక కవి ఉండేవాడు. అదైనా తెలుసా?’

          తెలుసన్నట్టు తల ఆడించింది తెలుజ.

          ‘ఆ కాళిదాసే. తరువాతి జన్మలో మాటలు రాని వాడై పుట్టినాడంటారు ! కామాక్షీ కటాక్షంతో అతని మూగతనం పోయి, అమ్మవారి మీద ఆశువుగా శ్లోకాలు చెప్పినవే ‘మూక పంచశతి’ అన్న కావ్యంగా ప్రసిద్ధికెక్కినాయి. మరి నువ్వు మాట్లాడాలంటే కూడా ఆ కామాక్షీ దేవి దిగి రావాలా ఏమి?’

          తులజ ముఖం మీద చిన్న నవ్వు.

          అయ్యేదో మంచి పుస్తకం చదువుతున్నట్టుంది, అందుకే ఆయనిట్లా మాట్లాదుతు న్నారు. లేకపోతే ఆయనా ఎప్పుడూ గంభీరంగానే కదా ఉంటారు? ‘

          ‘అమ్మవారి చిరునవ్వు చూసి బాలుడిగా ఉన్న అతను, ముగ్ధుడై పోయి ‘అమ్మా, నీ చిరునవ్వు ముందు, మల్లెల కాంతులు కూడా ‘ కుహనా మల్లీమతల్లీరుచ ‘ నకిలీ మల్లె పూలా, అన్నట్టు, వన్నె తగ్గి పోతాయి అన్నాడంట ఆయన! కామాక్షీ దేవి నవ్వుల కాంతు లు అంత స్వచ్చంగా మల్లెపూవులనే చిన్నబుచ్చే విధంగా ఉన్నాయంట! పోనీలే! నీ వల్ల నేనీరోజు మూక పంచ శతిని గుర్తుకు తెచ్చుకున్నాను. మరి నీ చేతి వ్రాత చాలా బాగుంది. మొన్నెప్పుడో చూస్తే అనిపించింది, మీ అమ్మకీలోగా కొంచెం నలతగా ఉందంట! ఆమెకు, ఇంటి పనీ, వంట పనీ, తన పూజలూ పునస్కారాలూ చాలా ఉంటాయి. నేను డిక్టేట్ చేస్తుంటే నువ్వు వ్రాయగలవు కదా?’

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.