నా జీవన యానంలో- రెండవభాగం- 42

-కె.వరలక్ష్మి

          ‘‘లబ్దప్రతిష్ఠులు తమని తామే అనుకరించుకోవడమూ, యువతరం రచయితలు తమ రచననీ, చదువునీ చూసుకొని సంతృప్తి పడడమూ మానుకోవడం అవసరం. రచయిత నిత్య విద్యార్థిగా ఉండకపోతే అతనిలో ఎదుగుదల ఆగిపోతుంది. అతడు (ఆమె) ఊబిలాంటి ఆత్మసంతృప్తిలో కూరుకుపోతాడు’’ అంటారు ‘కథాశిల్పం’ లో వల్లంపాటి.

          ఒక కుక్క తనను ఎందుకు కరిచిందని ఆలోచించాలి అంతేగాని తనలో ఏదో లోపం ఉండడం వల్లే అది కరిచిందని అనుకోకూడదు. మన మీద క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారి పై నుంచి మన ఆలోచనలని మళ్ళించాలి. మనం మార్చలేని వాటి గురించి మథన పడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ లోకం మనం నవ్వితే మనతోపాటు నవ్వుతుంది.
మనం ఏడిస్తే మాత్రం మనపాటికి మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. మనిషి సర్వం కోల్పోయినా సరే ఒకటి మాత్రం మిగులుతుంది. అది ‘భవిష్యత్తు’.

          2007 జూలై 28న అబ్దుల్ కలాం పదవీవిరమణ చేసి మొదటి సారిగా స్త్రీ రాష్ట్ర పతిగా ప్రతిభాపాటిల్ ఎన్నికయ్యారు.

          నా మూడో కథల పుస్తకాన్ని విజయనగరంలోని పబ్లిషర్ ఎన్.కె. బాబు వేసారు. ఆ పుస్తకం ఆవిష్కరణ తమ ఊళ్ళో జరుపుతున్నామని, 5వ తేదీకి రమ్మని ఫోన్ చేసారు. నేను 4వ తేదీనే సింహాచలంలోని మా ఆడపడుచుగారింటికి చేరుకున్నాను. 5 ఉదయం పదిగంటలకి మా ఆడపడుచును తీసుకుని విజయనగరం వెళ్ళేను. ఎన్.కె. బాబు, ఆయన ఫ్రెండు వి. వెంకట్రావు గార్లు మమ్మల్ని రిసీవ్ చేసుకుని ముందుగా  నెహ్రూ యువజన సంఘం బిల్డింగ్ లో జరుగుతున్న లైబ్రరీ వారోత్సవాల సభకి తీసుకెళ్ళేరు. అక్కడ డి.ఈ.ఓ. జయంతీ రామలక్ష్మణస్వామి, నేను ఉపన్యసించేం, బైటికిరాగానే అక్కడ ఆంధ్రజ్యోతి విలేఖరి నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు. తర్వాత కారులో ఊరంతా తిప్పి చూపించారు. కోట, బొంకుల దిబ్బ, గురజాడ, ఆదిభట్ల, చాసోల ఇళ్ళు,  జ్ఞాన సరస్వతి దేవాలయం చూసాం. మధ్యాహ్నం వెంకట్రావుగారింట్లో ఆయన భార్య కుమారి, తల్లి, తండ్రి, కొడుకు, కూతుర్ల ఆత్మీయతల మధ్య భోజనాలు చేసాం.

          సాయంకాలం 6 గంటలకు గురజాడ గ్రంథాలయంలో నా ‘అతడు – నేను’ ఆవిష్కరణ సభ, చాసోగారి భార్య నన్ను చూడాలని ఉందని ఫోన్ చేసారు. అంతకు ముందు నాకు చాసో అవార్డు ఇచ్చినప్పుడు పరిచయం. చాగంటి తులసిగారు కోసం వెళ్ళే కారులో నేను వారింటికి వెళ్ళేను. ఆవిడ చాలా ఆప్యాయంగా పలకరించి తన పక్కన కూర్చోబెట్టుకుని నా చేతులు నిమిరారు. నాకు జరిగిన సర్జరీని మనసులో పెట్టుకుని ‘‘ఆరోగ్యం ముఖ్యం. జాగ్రత్తగా కాపాడుకో అమ్మా’’ అన్నారు ఆత్మీయంగా. నా మనసు నిండిపోయింది. వారి పాదాలకు నమస్కరించేను. ‘నూరేళ్ళు హాయిగా జీవించమ్మా’ అని ఆశీర్వదించేరు.

          సభలో చాగంటి తులసిగారు నా కథల గురించి మాట్లాడేరు చక్కగా. సువర్ణ లక్ష్మిగారు రెండో వక్తగా కథల లోతుల్లోకెళ్ళి వివరిస్తూ ఆత్మీయంగా మాట్లాడేరు. హాలు నిండిపోయి ఇంకా బైట నిలబడేంత జనం వచ్చేరు. జనంలో ఉత్తరాంధ్ర రచయితలు చాలా మంది ఉన్నారు. సభముగిసేక వచ్చి పలకరించేరు అట్టాడ, గౌరునాయుడు వంటివారు.

          జన చైతన్యమండలి మెంబరు శ్రీను డప్పు వాయిస్తూ ఒక అభ్యుదయ గీతం పాడేడు. రాత్రి 9 గంటలకు మేం బయలుదేరుతుంటే రచయిత జి.యస్. చలం టిఫిన్ పేకెట్లు తెచ్చి ఇచ్చేడు. రేడియో మధుగారు మేం బయలుదేరే వరకూ మాతోనే ఉన్నారు.

          ఆగష్టు 9న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తస్లీమాన స్రీన్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. యం.యం. పార్టీ వాళ్ళు కుర్చీలతో ఆమె మీద చేసిన దాడిని టి.విలో చూపించారు. ఆవిడతో అదే స్టేజి మీద ఉన్న ప్రఖ్యాత రచయిత్రులు సైలెంట్ గా గాయబ్ అయి పోయారు. ఎక్కడి నుంచో వచ్చిన మరో భాషా రచయిత్రిని వదిలేసి తమ రక్షణ కోసం పారిపోయారు. వీళ్ళే మళ్ళీ ఆ సంఘటన మీద కథలూ కవితలూ రాసి సానుభూతి సంపాదిస్తారు.

          ఆగష్టు 25న రాత్రి 7.30 కి హైదరాబాద్ లుంబినీ పార్కులోనూ, మరో పది నిమిషా లకు కోఠీ గోకుల్ చాట్ లోనూ పేలుళ్ళు జరిగి 40 మంది పైగా అక్కడే చనిపోగా 100 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. టి.విలో ముక్కముక్కలైన ఆ దేహాల్ని చూడలేక ఏడుపొచ్చింది.

          ఆ అక్టోబర్ లో అజంతా – ఎల్లోరా చూడడానికి వెళ్దాం రమ్మంటే హైదరాబాద్ వచ్చాను మా అబ్బాయి ఇంటికి, 12 రాత్రి 9.30 కి బేగంపేట స్టేషన్లో మా అబ్బాయి ఫేమిలీ, వాళ్ళ మామగారు ఫేమిలీ, మా చిన్నమ్మాయి ఫేమిలీ కలిసి హైదరాబాద్ –ఔరంగాబాద్ ట్రెయిన్ ఎక్కాం, మర్నాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్టేషన్లో దిగి దగ్గర్లో
ఉన్న ఇంద్రదీప్ లాడ్జిలో బసచేసాం. అక్కడి బౌద్ధగుహలు, అచ్చం తాజ్ మహల్ మోడల్ లా ఉన్న ఔరంగజేబు భార్య సమాధి బీబీకా మక్బరా, పాన్ చక్కీ చూసాం. మర్నాడు ఉదయం టాక్సీలో దౌలతా బాద్ (దేవగిరి) వెళ్ళేం. చాలా ఎత్తైన కొండ మొత్తం తొలిచి కట్టిన దేవగిరి కోట ఎవరెంత ఎక్కగలిగితే అంత వరకూ ఎక్కి చూసాం. మా అబ్బాయి, కోడలు, మా మనవడు (చిన్నమ్మాయి కొడుకు) సన్నీ మాత్రం పై వరకూ వెళ్ళి  మొత్తం చూసి వచ్చారు. అక్కడి నుంచి ఖుల్తా బాద్ వెళ్ళి అతి సింపుల్ గా, ఓపెన్ గా ఉన్న ఔరంగజేబు సమాధి చూసాం. అద్భుతమైన శిల్పకళతో నిండి ఉన్న ఘృష్ణేశ్వర
ఆలయం చూసి, అందాల ఎల్లోరా గుహలు చూసి తిరిగి ఔరంగాబాద్ లోని రూంకి చేరుకుని మర్నాడు తిరిగి హైదరాబాద్ వచ్చేసాం.

          అంతలో నవంబర్ లో తలకోన విహారయాత్ర ఉందని భూమిక సత్యవతి తెలియ జేసేరు. నవంబర్ 22న ఇంచుమించు నలభైమంది రచయిత్రులం నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఎక్కేం. వరంగల్లులో కొందరు, విజయవాడలో కొందరు ఎక్కేరు. ఉదయం 5.30 కి గూడూరులో దిగేం. ప్రత్యేకంగా మాట్లాడిన బస్సులో అక్కడి
సముద్రతీరం, సువర్ణముఖీనది చూసి ప్రతిమ ఇంటికి నాయుడుపేట వెళ్ళేం. విశాలమైన స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల అందమైన భవనం. పక్కనే  సినిమా హాలు, కార్లు, బస్సులు, పొలాలు అన్నీ ఉన్న రిచ్ ఫేమిలీ, మా అందరికీ వేడినీళ్ళ స్నానం, మంచి భోజనాలు ఏర్పాటు చేసారు. రోజూ 40 మంది పనివాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తారట. ఇన్ని ఉన్నా ప్రతిమ అతి సామాన్యంగా అందరితో కలిసిపోతుంది. నెల్లూరు నుంచి చంద్రలత, తిరుపతి నుంచి విష్ణు వచ్చి మాతో కలిసారు. సాయంత్రం 4 గంటలకి సర్ప్ రైజ్ జర్నీ అంటూ ‘తడ’ పక్కన పులికాట్ సరస్సు మీద రెండు పడవల్లో ప్రయాణం ప్రతిమ ఏర్పాటు చేసింది. సరస్సు పోటుమీద ఉంది. ఎదురుకెరటాల ధాటికి తడిసి ముద్దయ్యాం. కొందరికి వాంతులయ్యాయి. భార్గవీరావు గారు హార్ట్ పేషెంట్ కావడం వల్ల చాలా సిక్ అయ్యారు. ఆ రాత్రికి మామండూరు గెస్ట్ హౌస్ లో ఉన్నాం. 24 ఉదయం తిరిగి బయలుదేరాం. దారిలో చేలల్లో చెరుకుగడలు విరిచారు కొందరు. చాలా తీపిగా ఉన్నాయి. అందరికన్నా నేనే ఎక్కువ తిన్నాను. మధ్యాహ్నం 1 గంటకి తలకోన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. భోజనాల తర్వాత రెండు కిలోమీటర్లు పైగా నడిచి  రాళ్ళ బాటలో పడుతూ లేస్తూ వాటర్ ఫాల్స్ కి వెళ్ళేం. చాలా పై నుంచి నీళ్ళు పడుతున్న అందమైన వాటర్ ఫాల్స్ అది. అటూ ఇటూ శిఖరం కన్పించనంత ఎత్తైన కొండలు, వృక్షాలు, దట్టమైన అడవి, కోతులు మాత్రం చెప్పలేనన్ని ఉన్నాయి. పంతం సుజాత పర్స్ ఎత్తుకుపోయాయి. 

          మాలాగే విహార యాత్రకు వచ్చిన ఒక అబ్బాయి అంత పెద్ద లోయలోకి దిగి, సెల్ఫోను డబ్బులు ఏరి తెచ్చాడు. ఆ మరుసటి నెల భూమికలో ఆ సంఘటన గురించి రాస్తూ అతని ఫోటో కూడా వేసి అతన్ని సంతోషపెట్టేరు, రాత్రి భోజనాలకు ముందు పంతం సుజాత నవల ఆవిష్కరణ, అనువాద పుస్తకాల గురించి చర్చ జరిగాయి.

          25 ఉదయం 7 కి గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న సిద్ధేశ్వరాలయం చూసి, చిన్న పాక హోటల్లో టిఫిన్స్ చేసుకుని తిరుగు ప్రయాణానికి బస్సెక్కాం. దగ్గర్లో నెరబయలు యానాదిపాలెం దగ్గర రోప్ బ్రిడ్జి (చెట్ల వేళ్ళతో ఏర్పడినది) మీద నడక, మధ్యదారిలో బస్సుదిగి రోడ్డు మీద కాస్సేపు నడక, ఇంకాస్త దూరం తర్వాత రోడ్డు నుంచి కళ్యాణి డేమ్ వరకూ నడక, తర్వాత చంద్రగిరి కోట చూసి విపరీతంగా అలసిపోయి ఆకలితో సొమ్మ సిల్లిపోతూ తిరుపతిలోని మహతి ఆడిటోరియం చేరుకున్నాం. అక్కడ పదార్థాలన్నీ అయిపోతే మా కోసం వేడి వేడిగా వండించి తెప్పించారు. 2007 భాషా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇన్విటేషన్ అంది ఉండడం వల్ల నేను అక్కడ ఆగిపోయాను. సాయంత్రం 5 వరకూ మహతిలో కార్యక్రమాలు చూసి నేను శ్రీనివాసంకి, వాళ్ళంతా రైల్వేస్టేషన్ కి. నిన్నటి, ఇవాళ్టి అలసటకి హాయిగా నిద్ర పట్టేసింది.

          26న మహతిలో సింగమనేని, మీగడరామలింగేశ్వరరావు, యండమూరిల ఉపన్యాసాలు, ఆంధ్ర నాట్యం పేరిణి శివతాండవం, గరికపాటి అవధానం జరిగాయి. 27న స.వెం. రమేశ్, ఎండ్లూరి సుధాకర్ ల ప్రసంగాలు, మీగడ రామలింగేశ్వర్రావు సంగీతా వధానం బావున్నాయి. ‘ఆముక్త మాల్యద’ కూచిపూడి నృత్యనాటిక అద్భుతం. దాంట్లో శ్రీవల్లి కేరెక్టర్ వేసిన అజయ్ కుమార్ మేకప్ లో అమ్మాయిగానూ, మేకప్ తీసేసాక అబ్బాయి గానూ చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళు కూడా శ్రీనివాసంలోనే ఉండడం వల్ల భోజనాల దగ్గర పలకరించి అభినందించాను. 28న జ్వాలాముఖి, ఓల్గా, యం.వి. రమణా రెడ్డిల ఉపన్యాసాలు, శాక్సోఫోన్ మీద కదిరి గోపాలకృష్ణన్ కర్నాటిక్ మ్యూజిక్, అన్నమయ్య  కీర్తనలు, భాషా బ్రహ్మోత్సవాలు నృత్యరూపకం బావున్నాయి. మిక్కిలినేని, చేరా, బి.ఎస్.రాములు గార్లకు సన్మానాలు జరిగాయి.

          29న యస్.వి. సత్యన్నారాయణ గారి ఉపన్యాసం బావుంది. ఎల్లా వెంకటేశ్వర్రావు గారి వాద్య సంగీత సంగమం, వనజా ఉదయ్ మాధవీ బాలల అన్నమయ్య సంకీర్తనా నృత్యం బావున్నాయి. ఆ రోజు అందరితో విడివడ్డాక ప్రతిమ వాళ్ళ ఊరెళ్ళి వెంటనే వచ్చేయడంతో ఇద్దరం కలిసే తిరిగాం, 30న ఉత్సవాల చివరిరోజు. అక్కినేని నాగేశ్వ ర్రావు, సినారే గార్లకు సన్మానం జరిగింది. పడమటిగాలి నాటకానికి థియేటర్ జనంతో కిక్కిరిసిపోయింది. కానీ, సౌండ్ సిస్టమ్ ఫెయిలైంది. చూసి చూసి బైటికి వచ్చేసాం. డిశంబర్ 1కి జగ్గంపేట ఇంటికి చేరుకున్నాను.

          15న బిక్కవోలు నుంచి జంగాగాంధీగారు ఫోన్ చేసి ‘‘రేపు మా ఊళ్ళో జరుగుతున్న సుబ్రహ్మణ్య షష్ఠికి మీరెంతో అభిమానించే గాయకులు బాలకృష్ణప్రసాద్ కచేరీ చెయ్య డానికి వస్తున్నారు. రాగలరా’’ అన్నారు. తిరుపతిలో చూడలేకపోయిన బాలకృష్ణ ప్రసాద్ గారిని ఇంత దగ్గర్లో చూడగలగడం అదృష్టం అన్పించింది. బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వరా లయం, అక్కడ జరిగే షష్ఠి ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి, 16 ఉదయాన్నే వెళ్ళేను. రోడ్డుకి ఎడమవైపు (మావైపు నుంచి) ఉన్న సామర్లకోటవైపు వచ్చే గోదావరి కాలవకి అవతల ఉంది బిక్కవోలు ఊరంతా.

          వచ్చినట్టు గాంధీకి ఫోన్ చేసి వంతెన దాటి రోడ్డుపొడవునా తీర్థం దుకాణాలు చూసు కుంటూ, మధ్యలో రథోత్సవం దాటి గుడిని చేరుకున్నాను. చాళుక్యులకన్నా  ముందు కాలం నాటి ఊరు బిక్కవోలు. అక్కడి తవ్వకాల్లో బైటపడిన శిల్పాలు ఎంతో చరిత్రను తెలియజేస్తున్నాయి. గాంధీ వచ్చేసరికి ఈశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరుల దర్శనం చేసుకుని బైట పందిట్లో వేదపండితులకు జరుగుతున్న సన్మానం చూస్తూకూర్చున్నాను. గాంధీ వచ్చి వాళ్ళ కజిన్ సుజన గారింటికి పిల్చుకెళ్ళేడు.

          అందమైన మూడంతస్తుల పాలరాతి భవనం. ఎంత బావుందో! ఆ ఇంట్లోనే బాల కృష్ణ ప్రసాద్, సహగాయకి బుల్లమ్మ, వయోలిన్, మృదంగ విద్వాంసులు,  విజయవాడ నుంచి ఆయన అభిమానులు బాల (లాయర్ కమ్ రైల్వే ఎనౌన్సర్) వగైరాలున్నారు. నాకూ ఒక రూమ్ ఇచ్చారు. సాయంకాలం సుజనగారు పూతరేకులు, స్వయంగా చేసిన ఇడ్లీ, దోసె, బొబ్బట్లు వగైరాలతో డిన్నరు ఏర్పాటు చేసారు. అందరం కలిసి 8.30 కి పందిట్లోకొచ్చాం. వెంటనే కచేరీ ప్రారంభమైంది. బుల్లమ్మ కూడా మంచి గాయని.ఆయన ఒక్కొక్క అన్నమాచార్య కీర్తనా పాడుతూంటే అలా మైమరచి వింటూ ఉండిపోయాను. శ్రోతలు మాత్రం పందిట్లో ఇరవైమంది కూడా లేరు. అప్పుడెప్పుడో మా ఊరి  వినాయక చవితి ఉత్సవాలకి శ్రీరంగం గోపాలరత్నం గారు రావడం గుర్తొచ్చింది. చిన్న చిన్న ఊళ్ళల్లో జనానికి సినిమాలు, రికార్డింగ్ డేన్సులు తెలిసినంతగా శాస్త్రీయ సంగీతం, నృత్యం లాంటివి తెలీవుకదా! కాని ఎదుట ఉన్న పదిమందికోసమే అయినా మనసుపెట్టి పాడారాయన. కార్యక్రమం ముగిసాక అందరం నడిచి విడిది వైపు వెళ్తూంటే ఆయన తీసిన కూనిరాగాలు, ఇంట్లో తిరుగుతూ తీసిన రాగాలు, మధ్య మధ్యలో నన్ను పలకరిస్తూ చెప్పిన కబుర్లు నన్నెంతో ఆనందంలో ముంచేసాయి. 11.30 కి వాళ్ళంతా కారులో విజయవాడ వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆ ఇంట్లో నేనొక్కదాన్నే గెస్ట్ ని. ఉదయాన్నే లేచి తయారై గాంధీతో వెళ్ళి లక్ష్మీ నృసింహాలయం, గాంధీ వాళ్ళిల్లు, జైనుల గుడి,  వినాయకుడి గుడి, పెద్దరాతిలో మలచినట్లున్న స్వయంభూ వినాయక విగ్రహం, పురాతన శివాలయం చూసి తిరుగు ప్రయాణమయ్యేను.

          ప్రఖ్యాత రచయిత అల్లంరాజయ్యగారి అబ్బాయిని ఆమెరికాలో దుండగులు చంపేసారని తెలిసి పలకరించాలని ఫోన్ చేసాను. కాని గొంతు గద్గదికమైపోయి ఏమీ మాట్లాడలేకపోయాను. డిశంబర్ 27న పాకిస్తాన్ లో ఎలక్షన్ మీటింగు సందర్భంగా ప్రతపక్ష నాయకురాలు బేనజీర్ భుట్టోను అల్ ఖాయిదా వాళ్ళు చంపేసారు. 2007 అలా
ముగిసింది.

          ప్రయాణాలతో గడిచిపోవడం వల్ల ఆ సంవత్సరం ఎక్కువగా రాయలేదు.

          ఫిబ్రవరి 2007 ‘ఆంధ్రప్రదేశ్’ మంత్లీలో ‘కథలపోటీ’ కథ –

          11.07.2007 నవ్యవీక్లీలో ‘చింటూగాడి చిద్విలాసం’ కథ –

          13.09.2007 విశాఖ రేడియోలో ‘గోదానం’ కథ –

          మే – జూన్ 2007 అరుణతారలో ‘తుమ్మేటి కథలు – ఒక పరిశీలన’ వ్యాసం –

          09.09.2007 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ‘ఒక మరణం చెరిపిన దృశ్యం’ పోయెమ్ –

          03.10.2007 నవ్య వీక్లీ లో ‘రెప్పలు మూతపడనివేళ’ పోయెమ్ – మాత్రం వచ్చాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.