బొమ్మల్కతలు-20

-గిరిధర్ పొట్టేపాళెం

 
       ఈ పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది “వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ” కాలం, ఆ కాలేజి లో “కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్” డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో “పెయింటింగ్” మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం.
 
          తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి దూరంగా ఏ. పి. రెసిడెన్షియల్ హైస్కూల్, కొడిగెనహళ్ళి, హిందూపురంలో విద్యాభ్యాసం. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ జూనియర్ కాలేజికి వెళ్ళాలన్న కోరిక బలంగా ఉన్నా నిర్ణయాలు తీసుకోగలిగే బలం వయసుకింకా రాకపోవటంతో, మళ్ళీ దూరంగా రెండేళ్ళ ఇంటర్మీడియట్ “ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడ” లో చేరటం. ఆ తర్వాత ఇంజనీరింగ్ తప్పనిసరి అయి ఇంటికి దూరంగా వెళ్ళాల్సి రావటం. కొంచెం అయినా మా ఊరు “కావలి” కి దగ్గరగా ఉంటానని హైదరాబాద్ వద్దని విజయవాడ “సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి” ఎంచుకుని అక్కడ మొదలుపెట్టిన కాలేజి లైఫ్. ఇంజనీరింగ్ కాలేజి అనగానే ఒక్క సారిగా స్వతంత్రం, స్వేచ్ఛా వాతావరణం, కొత్త ఫ్రెండ్ షిప్స్, తక్కువ క్లాసుల సమయం, ఎక్కువ తీరిక సమయం, ఇలా ఒక్కసారిగా పెద్ద మార్పుల్లో ప్రవేశించి నిర్దేశం తెలిసీ తెలియకనే తెలుసుకునే దిశగా ఆఖరి స్టూడెంట్ దశ అది. మార్నింగ్ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్, వారంలో కొన్ని రోజులు ప్రాక్టికల్స్ ఉండవు, ఖాళీ టైమ్ ఎక్కువగా ఉండేది. వీలైతే సినిమాలు షికార్లు, లేదంటే రీక్రియేషన్ రూమ్ లో క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆటలు, టీవీ చూట్టం, ఇలా మొదటి సంవత్సరం కొత్త ఫ్రెండ్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాలేజి లైఫ్ తో అంతా కొత్త కొత్తగా గడచి పోయింది.
 
          లొయోలా కాలేజిలో మంచి లైబ్రరీ ఉన్నా చాలా తక్కువగా వెళ్ళేవాడిని. అక్కడ ఎక్కువగా డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజిలోనూ మంచి లైబ్రరీ ఉండేది. లైబ్రరీలో హిస్టరీ, ఆర్ట్స్ పుస్తకాలున్న ఒక రూమ్ ఉండేది. వెళ్ళిన ప్రతిసారీ నేరుగా దాన్లోకే వెళ్ళి ఆర్ట్ మ్యాగజైన్స్, బుక్స్ తిరగేసి వచ్చేసేవాడిని. కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ కూడా ఉండేవి. అందులో చూసిన కొన్ని ఆయిల్ పెయిం టింగ్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. అయితే బుక్స్ లాగా ఆ మ్యాగజైన్స్ లైబ్రరీ కార్డ్ మీద కొద్ది రోజులు తీసుకోవటానికి ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో అవి ఎక్కడ దొరుకుతాయి, వీళ్ళు ఎక్కడినించి ఎలా తెప్పించి ఉంటారు అన్న ఆలోచనతో, పుస్తకాల షాపుల వెంట వాటి కోసం నా వెదుకులాట ప్రారంభం అయ్యింది. బీసెంట్ రోడ్డు దగ్గర ఏలూరు రోడ్డులో ఉండే “నవోదయ పబ్లికేషన్స్” బుక్ షాపులో వెతగ్గా వెతగ్గా ఒక్క రష్యన్ ఆర్ట్ పుస్తకం దొరికింది. ఈ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. అందులో చాలా గొప్ప ఆర్టిస్టు లు, వాళ్ళ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అమ్మ కష్టంతో చదువుతున్న అప్పటి నా స్టూడెంట్ స్థోమతకి ఆ పుస్తకం వెల చాలా ఎక్కువ, కొనాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి చివరికి కొనేశాను. ఆ పుస్తకంలోని పెయింటింగ్స్ ని తదేకంగా పరిశీలించటం తో ఏన్ని గంటలు గడిపుంటానో లెక్కే లేదు.
 
          ఒకసారి న్యూస్ పేపర్ లో “పింగాణి ప్లేట్స్” మీద ఆయిల్ పెయింటింగ్స్ వేసిన ఒక విజయవాడ ఆర్టిస్ట్, ఆవిడ ఆర్ట్ షో ఒకటి ఆదివారం “ఒన్ టవున్” దగ్గర  ప్రారంభం అవుతుందని చూసి, ఆ రోజు రాగానే ఉదయాన్నే బస్సెక్కి వెళ్ళిపోయాను. గొప్ప గొప్ప యూరోపీయన్ మాస్టర్ పెయింటింగ్స్ ని అచ్చు అలాగే పింగాణి ప్లేట్స్ మీద వేశారు ఆవిడ. వేలల్లో ధర, ఏ వందో అయితే ఒకటన్నా కొనేసేవాడినేమో. చాలా దగ్గరగా పరిశీ లించాను, అంత కరెక్ట్ గా ఎలా వేసి ఉంటారో అర్ధం కాలా. ఆవిడ్ని అడిగి మెటీరియల్ గురించి ఏమైనా తెలుసుకోవాలని అక్కడే ఉండి చాలాసేపు అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ షో ప్రారంభం టైమ్ కే నేను వెళ్ళటంతో  వచ్చిన చీఫ్ గెస్ట్, మిగతా గెస్ట్స్ తోనే ఆవిడ ఉండటంతో అవకాశం రాక బస్సెక్కి నిరాశగా కాలేజీ వెళ్తున్న ఆ క్షణాలింకా గుర్తున్నాయి. అలా నా ఒంటరి ప్రయాణంలో సంగతీ సమాచారం తెలుసుకోలేని నిరాశ లెన్ని ఎదురైనా “పెయింటింగ్స్” వెయ్యాలన్న ఆశ మాత్రం తగ్గలా.
 
          రెండవ సంవత్సరంలో బుక్ షాపులన్నీ తిరిగి వెతగ్గా వెతగ్గా దొరికిన చిన్న “కేమెల్ పోస్టర్ కలర్స్” ని అవే వాటర్ కలర్ పెయింటింగ్స్ అనుకుని వాటితోనే వెయ్యటం మొదలు పెట్టాను. బహుశా ఈ పెయింటింగ్ అప్పటికి నా మూడోదో, నాలుగోదో అయి ఉండొచ్చు. నేనున్న హాస్టల్ D-14 రూమ్ లో నా పెయింటింగ్ సాధనకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టాను. ఆదివారం మధ్యాహ్నం కూర్చుని ఎక్కువగా పెయింటింగ్స్ వేస్తూ ఉండే వాడిని. 
 
          అలంకార్ థియేటర్ ఎదురుగా ఆదివారం సాయంత్రం నిర్మానుష్యంగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు ఫుట్ పాత్ పై పాత బుక్స్, మ్యాగజైన్స్ పెట్టి అమ్మే వాళ్ళు అని తెలిసి చాలా ఆదివారాలు పనిగట్టుకుని అంత దూరం వెళ్ళి వెతికే వాడిని. అక్కడ కొన్ని అమెరికన్ ఆర్ట్ మ్యాగజైన్స్ దొరికాయి, కొన్ని కొనేశాను. వాటిల్లో ఒక మ్యాగజైన్ అట్ట వెనక పేజీ మీద అచ్చయిన ఆయిల్ పెయింటింగ్ చాలా నచ్చింది. ఆ మ్యాగజైన్ ముందు పెట్టుకుని అచ్చంగా అవే రంగుల షేడ్స్, నాకున్న ఆ ఆరు రంగులతో ఎలా తెప్పించానో నాకూ ఇప్పటికీ మిస్టరీ. ఏ రంగులో ఏ రంగు కలిపితే ఏ రంగు వస్తుందో ప్రాధమిక అవగాహన బొత్తిగా లేదు, అడిగినా చెప్పలేను, కానీ నాకు తెలీకుండానే ఏ రంగు షేడ్ చూసినా రెండు మూడు రంగులు కలిపి అచ్చం అదే షేడ్ వచ్చేసేది, అదే నాకిప్పటికీ అప్పటి మిస్టరీ. అలా దీక్షగా కూర్చుని పెయింటింగ్ వేస్తుంటే, మధ్య మధ్యలో బొమ్మలం టే కొంచెం ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, కొంత మంది మాత్రం “భలే వేస్తున్నావ్ గిరీ” అని మెచ్చుకునేవాళ్ళు.
 
          బయట కమర్షియల్ ఆర్టిస్టులు ఎలా వేస్తారో ఏం మెటీరియల్ వాడతారో తెలుసు కోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ కష్టం, వాళ్ళెక్కడుంటారో తెలుసుకునే వీలు లేని రోజులవి. కనీసం కాలేజి లో సీనియర్స్, జూనియర్స్ లో ఒక్కరన్నా పెయింటింగ్స్ వేసే వాళ్ళుండకపోతారా అని కూడా చూశాను. నాలుగేళ్ళు ఏడు బాచ్ ల్లో ఒక్కరూ తారసపడలా. అప్పటికింకా ఏ మాత్రం అనుభవం లేక, సరయిన మెటీరియల్ కూడా లేక, తడబడుతూనే దొరికిన రంగులు, బ్రషులు, పేపర్ లతో మొదలుపెట్టి ముందుకి పోతూ వేస్తున్నవి నా మొదటి అడుగులే. అయినా, ఈ ఒక్క పెయింటింగ్ తో వచ్చిన స్వీయ అనుభవం మాత్రం నాకు చాలా చాలా ధైర్యాన్నిచ్చింది. పెయింటింగ్స్ ఎలా వెయ్యాలా అంటూ నాలో ఆవహిస్తున్న నిరాశనీ, అసలు వెయ్యగలనా అని చెలరేగు తున్న అనుమానాల్నీ, ఒక్కడినే నేర్చుకోగలనా అంటూ ప్రశ్నిస్తున్న అధైర్యాన్నీ పక్కకి తోసి నన్ను పట్టుకుని ముందుకి నడిపించింది కేవలం నా పట్టుదల, పట్టు వదలని దీక్ష మాత్రమే. వేసిన తర్వాత నా రూమ్ లో గోడపైన మిగిలిన వాటితో బాటు దీన్నీ అతికిం చాను, వెనుక నాలుగు కార్నర్స్ లో గమ్ పూసి. మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్స రం “న్యూ హాస్టల్” లో నేనున్న రెండు రూముల్లోనూ ఈ పెయింటింగ్ గోడ మీదే ఉండేది. తర్వాత ఆ కాలేజి హాస్టల్ గోడలు దాటి బయటి ప్రపంచంలోకి వచ్చిన నాతోనే ఉంటూ, నాతో బాటు ఇండియా వదిలి భద్రంగా ఇంతదూరం నాతో వచ్చేసింది. వస్తూ ఆ కాలం గురుతుల్నీ, జ్ఞాపకాలనూ మోసుకుని తెచ్చింది.
 
          కాలేజి ఫ్రెండ్స్, అక్కడ చదివిన చదువూ, నేర్చుకున్న విజ్ఞానం, పొందిన డిగ్రీ, గడిపిన జీవితం, ఆ అనుభవాలూ ఎవరికైనా జీవితంలో ఒక మలుపు తిరిగే మైలురాయి. కాలేజి లైఫ్ లో చదువు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అందరికీ ఉండేవే. అవి పక్కన పెడితే నా “సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి” రోజులు మాత్రం ఎక్కువగా నిండింది బొమ్మల తోనే. ఇప్పటికీ అప్పుడప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మెయిన్ బిల్డింగ్ లో, ఇంజనీరింగ్ కాలేజి అడ్మిషన్స్ జరిగినప్పుడు, నా కొచ్చిన EAMCET ర్యాంక్ కి నా వంతు వచ్చినపుడు గవర్న్ మెంట్ కాలేజీల్లో నేనెంచుకోవటానికి మిగిలింది REC వరంగల్ లో సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే. నాకు తీసుకోవటం ఇష్టంలేదు. ఇష్టంలేనపుడు వద్దు, ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా ఏ బ్రాంచ్ లోనైనా సీట్ వస్తుంది, అయితే ఫీజ్ ఎక్కువ అంటూ చెప్పారు. అప్పటికే ఇంటర్మీడియట్ లొయోలాలో చాలా డబ్బులయ్యాయి, అమ్మకి కష్టం అవుతుందని తీసుకోవటానికి సిద్ధపడ్డాను. వద్దని చిన్నమామయ్య తీసుకుని వచ్చేశాడు. తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్స్ కి అక్కడికే మళ్ళీ వచ్చిన రోజు నాకు అన్ని కాలేజీల్లో అన్ని బ్రాంచ్ ల్లోనూ ఎక్కడకావాలంటే అక్కడ తీసుకునే ఆప్షన్ ఉండింది. చిన్నమామయ్య “ఇక్కడైతే నేను దగ్గరుంటాను, చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్ తీసుకో” అని ఎంతగానో అడిగినా వద్దని “విజయవాడ” అయితే “కావలి” కి దగ్గర, రెండేళ్ళు ఇంటర్మీడియట్ అక్కడ అలవాటయ్యింది. అక్కడే కావాలని పట్టుబట్టి “సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి” లో కంప్యూటర్ సైన్స్ చేరాను. అప్పుడా కాలేజిలో కంప్యూటర్ సైన్స్ మాదే మొట్ట మొదటి బ్యాచ్.
 
          గతం తల్చుకున్నప్పుడల్లా ఇప్పటికీ అప్పుడప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది, ఒక వేళ అప్పుడు నాకున్న కాలేజి ఆప్షన్స్ లో “సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ” కాకుండా చిన్నమామయ్య ఎంతగానో తీసుకోమని అడిగిన “చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజి, హైదరాబాద్” లేదా “గీతం ఇంజనీరింగ్ కాలేజి, విశాఖపట్నం” లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరి ఉంటే ఇంజనీరింగ్ కాలేజి అనుభవం ఎలా ఉండేదో, ఎవరు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళో, నా జీవితం ఎలా మలుపు తిరిగి ఉండేదో, ఆ మలుపుల్లో నా బొమ్మలు, నా పెయింటింగ్స్ అసలుండేవో లేవో, ఉండి ఉంటే ఎలా ఉండేవో అని…
 
“జీవిత మలుపుల్లో మనం వేసే ప్రతి అడుగూ కనపడని మన గమ్యం వైపే పడుతుంది.”
Poster colors on Paper 8″ x 11″
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.