బోన్సాయ్

-డా. లక్ష్మీ రాఘవ

బలంగా ఉన్న విత్తుని నేను
ఎక్కడపడ్డా ధృడంగా ఉంటా..అనుకున్నా
ఆప్యాయత అనే నీరు పుష్కలంగా దొరుకుతుందనుకున్నా
ఏపుగా ఎదగాలన్న కోరికతో ఉన్నా
విస్తరించి నలుగురికీ ఆశ్రయం ఇచ్చే లక్షణాలు కలిగి ఉన్నా
అందుకే అన్నీ దొరికాయని మట్టిని తోసుకుంటూ బలంగా బయటికి వచ్చా.

సూర్య కాంతి అందం నన్ను మురిపించి రా అంటూ చేయి చాచింది.
ఆహారం సమకూర్చుకుంటూ ఇంకాస్త పైకి లేచి చుట్టూ చూసా..
అందమైన ప్రపంచం పరికరిస్తూంటే పడిందో చూపు నా మీద ..
వేళ్ళతో పేకిలించి మంచి పింగాణీ పాత్రలో పెడితే మురిసిపోయా..
నేనూ, నా ఆవరణం ప్రత్యేకం అనుకున్నా
ఆ ఆవరణమే నాకు కంచె వేస్తుందని ఊహించలేక పోయా
పైకి ఎదుగుతూంటే ఆకాశమే హద్దు అవుతుందిలే అనుకున్నా
శాఖలను కత్తెరించి గాయం చేసి మరీ మందు వేస్తారని తెలియక పోయే
నాలోని జన్యువు పెద్ద వృక్షందని హాయిగా మలి శాఖలు వేస్తూ
విస్తరించాలనుకున్నా,

‘ఊహూ’ అంటూ పుటుక్కున తెంపడం అలవాటైపోయే
తల్లి వేరు బలంగా ఉండాలని చొచ్చుకు పోవాలంటే నేలేదీ???
లోతు తక్కువగా ఉన్న పింగాణీ పాత్ర మెరుస్తూ కింద నా వేర్లను పక్కకు మళ్ళించే
అటు కిందకూ పోలేక, పైకీ ఎదగలేక పోయినా
శాఖలకి ఆపుగా వూడలను పెంచుకున్నా..
కన్నీటిని దిగమింగుకుంటూ జానెడు ఎత్తులోనే మహా వృక్షమైపోవాలా ?
అనుకుంటూన్నప్పుడు మృదువుగా తాకిన ఒక చేయిని అందుకున్నా..
“నీలాగే నేనూ “అంటూ ఉప్పటి కన్నీళ్ళ స్పర్శతో కరిగిపోయా..
‘ఎందుకమ్మా ?’ అని అడగాలని ఉన్నా మాట్లాడలేను కదా..

“ఎంతటి పోలీకే మరుగుజ్జు మర్రిచెట్టా నీకూ, నాకూ .. చిక్కాము కదా ఇలా ..
పుట్టినప్పటి నుండీ ఎదగాలనే ఆరాటం,
ఆడపిల్ల అన్నదే ఇంటివారికి సంకటం
చదవాలని చేయి లేపితే ‘తగ్గించు, నీకంటే తమ్ముడికే ముఖ్యం” అన్న సమాధానం
వంగి పోయా, పట్టు విడవక పరీక్షలు రాస్తూ ధృడం అవుతూంటే
తలవంచి మూడు ముళ్ళూవేయించారు..
మళ్ళీ తలేత్తి పిల్లలనే కొత్త శాఖలను ఇచ్చా
అవి కూడా మాట వినలా.. ఇష్టం వచ్చినట్టు పెరిగితే
నాకు నచ్చని మార్పులోచ్చాయి .. ఏం చేయను?
అనుభవాల సారంతో గట్టిగా ఉన్నా మూలకూర్చున్నా
నియంత్రణకు అలవాటై పోయి …నీ లాగా ఇంట్లో అలంకార భూషణమై ..

*****

Please follow and like us:

7 thoughts on “బోన్సాయ్ (కవిత)”

  1. చాలా బాగుంది మీ రచన. బోన్సాయ్ ను , ఆడపిల్లను పోల్చిన విధానం బాగుంది. అభినందనలు.

  2. లక్ష్మి గారు చాలా చక్కగా రాశారు. Best

  3. చాలా బాగుందండి లక్ష్మీ రాఘవ గారూ ఆడపిల్లకూ బోన్సాయ్ కి పోలిక. బోన్సాయ్ పెరుగుదల గురించిన మీ పరిశీలన అమోఘం. మహిళా

    1. అణచి వేయబడిన ఆడపిల్ల జీవితం, నియంత్రణ అలా పోలిక తెచ్చింది. ధన్యవాదాలు మీ స్పందనకు. 🙏🏼

  4. ఎంత బాగా రాసారమ్మా.. ఆడపిల్లకు, బోన్సాయ్ మొక్కతో పోల్చాలన్న ఆలోచన చాలా బాగుంది. ఇప్పటికీ కూడా అమ్మాయి చదువు, ఇంట్లో స్థానం రెండో స్థానంలో నిలిపే కుటుంబాలున్నాయి. బోన్సాయ్ మొక్కకు మనసుంటే అలాగే ఆలోచిస్తుందేమో. ఎందుకంటే నాకు వాటిలో అందంకన్నా నిశ్శబ్దంగా నిలబడిన తీరులో ఓ మూగ వేదన కనపడుతుంది. చాలా చక్కగా పోల్చి రాసారు.

    1. అందానికి ప్రతీక అంటూ నియంత్రణ కు గురి అయిన ఆడపిల్ల మరుగుజ్జుగా ఉండిపోవాలనే సమాజంలో ఉంటున్నాం కదా . థాంక్ యూ రాధికా 🙏🏼

Leave a Reply

Your email address will not be published.