కనక నారాయణీయం -57

పుట్టపర్తి నాగపద్మిని

          ‘అమ్మవారి చిరునవ్వు చూసి బాలుడిగా ఉన్న అతను, ముగ్ధుడై పోయి ‘అమ్మా,  నీ చిరునవ్వు ముందు, మల్లెల కాంతులు కూడా  ‘ కుహనా మల్లీమతల్లీరుచ ‘ నకిలీ మల్లె పూలా, అన్నట్టు,  వన్నె తగ్గి పోతాయి అన్నాడంట ఆయన! కామాక్షీ దేవి నవ్వుల కాంతు లు అంత స్వచ్చంగా మల్లెపూవులనే చిన్నబుచ్చే విధంగా ఉన్నాయంట! పోనీలే! నీ వల్ల నేనీరోజు మూక పంచ శతిని గుర్తుకు తెచ్చుకున్నాను. మరి నీ చేతి వ్రాత చాలా బాగుంది. మొన్నెప్పుడో చూస్తే అనిపించింది, మీ అమ్మకీలోగా కొంచెం నలతగా ఉందంట!ఆమెకు, ఇంటి పనీ, వంట పనీ, తన పూజలూ పునస్కారాలూ చాలా ఉంటాయి. నేను డిక్టేట్ చేస్తుంటే నువ్వు వ్రాయగలవు కదా?’

          తులజకు తప్పించుకునే మార్గమే లేదు. గబగబా తలాడించి కిందకు వచ్చేసి, అమ్మ ముందు నిలబడింది నిశ్శబ్దంగా! ఐనా

          అమ్మకిప్పుడేమయింది?

          కనకమ్మ అడిగింది, ‘అయ్యేదో బుక్ తెమ్మని అడిగినారు కదా! ఇచ్చొచ్చినావా?’

          తులజ తలూపి అన్నది,’అమ్మా! ఒకటి అడుగుతాను, చెబుతావా?’

          కనకమ్మకు కూతురును చూస్తే ముద్దేసింది. ఎప్పుడూ ఇట్లా అడగని పిల్ల యీ రోజీ విధంగా అడుగుతుంటే!

          ‘చెబుతానులే! అడుగు!’

          ‘అయ్య అన్నారు, నీకు ఆరోగ్యం బాగాలేదనీ, నన్ను వ్రాయడానికి రమ్మనీ! అవునూ నీకేమయ్యింది ఉన్నట్టుండి?’

          గొంతులో వెలక్కాయ పడినట్టైంది కనకమ్మకు.

          ‘ఏదో..నాకూ తెలియటం లేదు తులజా! ఏదో కొన్ని రోజులు బరువు పనులు చేయ కుంటే సరిపోతుందని రాసిందమ్మ. చూద్దాం. అది సరే..

          పైన మీ అయ్యేదో మాట్లాడుతున్నారే నీతో? దేని గురించి?’

          ‘నీకు ఆరోగ్యం బాగా లేదనీ, నన్ను కొన్ని రోజులు తన వ్రాత పనులకు పలకమనీ అన్నారు. నా చేతి వ్రాత అయ్యకు నచ్చిందంట!

          నీ మాదిరే ఉంటాయంట నా అక్షరాలు!’ తులజ కళ్ళల్లో మెరుపు!

          కనకమ్మకు సంతోషమైంది. పోనీలే యీ రకంగానైనా ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టుండే బిడ్డ కాస్త యీ లోకం లోకి వచ్చి పడుతుందనే ఆనందం!

***

          తులజ అటు వెళ్ళగానే  కనకమ్మ చింతాక్రాంత అయింది. ఆమెకిప్పుడు బహుశా నాలుగో నెల. అమ్మ లేఖా సారాంశం కూడ ఇదే! చచ్చేంత సిగ్గుగా ఉంది. అటు ఇద్దరాడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన ఆనందం ఇంకా తీరకుండానే..ఊహించని యీ వార్త. పైగా దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత, ఇప్పుడు తగుదునమ్మా అని గర్భం దాల్చటమంటే, ఎంత అప్రతిష్ట?

          ఆమెకు గతం ఒక్కసారి ముందు నిలిచింది.  1939 లో పుట్టిన పెద్ద బిడ్డ కరుణకూ, తరువాతి ఆడపిల్ల తరులతకూ దాదాపు మూడేళ్ళు తేడా. తరువాత మూడేళ్ళకు, మగ పిల్లవాడు. కృష్ణ చైతన్య అని పేరుపెట్టుకుని ఎంతో ముద్దుగా చూసేవారాయన.ఆయనకు అప్పుడు కృష్ణ చైతన్య సంప్రదాయం పట్ల ఎంతో ఆరాధన అప్పట్లో! భజన సంప్రదా యంలో తాను కూడా ఎన్నో అష్టాక్షరీ కృతులు వ్రాసి, హార్మోనియం వాయిస్తూ పాడుతూ ఉంటే, ఎంతో బాగుండేది. ఇదివరకు విన్న శ్లోకమొకటుంది.

ఏక: స్వాదు న భుంజీత  

నైక: సుప్తేషు జాగృయాత్

ఏకో న గఛ్చేదద్వానం

నైకశ్చార్థాన్ ప్రచింతయేత్..’

          ‘మధురతరమైన పదార్థాన్ని ఒంటరిగా తినకూడదు. నిద్రపోతున్న వాళ్ళ మధ్యలో ఒక్కరే మేలుకుని ఉండకూడదు. దుష్కరమైనట్టి ప్రదేశాలకు ఒక్కడే వెళ్ళకూడదు. కఠినతరమైన సమస్యల గురించి ఒక్కరే ఆలోచించకూడదు.’

          వెనుకటి పెద్దలు ఎంతగా ఆలోచించి ఇటువంటి సూక్తులు వ్రాసి ఉంటారో. ప్రకృతి లో మూడే అన్నిటికన్నా ముఖ్యమైనవట. అవేవి?  

          జలమన్నం సుభాషితం..నీరు, ఆహారము, సుభాషితం. అల్పాక్షరాల్లో అనల్పమైన అర్థాన్ని పొదిగి అలనాటి తపస్వులు మనకిలాంటివెన్నెన్నో సూక్తి సుధలను అందిం చారు. ఇంతకూ, ఇప్పుడు కనకమ్మ అలోచనలు సుభాషితాల్లోంచీ మళ్ళీ తన పరిస్థితి వైపుకు మళ్ళాయి. ఆ రోజుల్లో కృష్ణ చైతన్య సంప్రదాయపు మాధుర్యాన్ని గ్రోలుతూ ఆయన గానామృతంలో  పరవశించిపోతుంటే, తానూ పిల్ల్లవాడిలో చిన్ని కృష్ణుణ్ణి చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది. భగవద్భక్తిలోని ఆకర్షణ అటువంటిది కదా! అటు శిష్య బృందమూ, ఇటు ఆయన అభిమానులూ, ఇరుగూ పొరుగూ కూడా ఎంతో ఆనందంగా ఆ భజనల్లో పాలుపంచుకుంటూ ఉండేవాళ్ళు. విష్ణు పురాణంలో సాక్షాత్తూ ఆ విష్ణువే అన్నాడు, తత్ర తిష్టామి నారద! అని!

          తన గుణగానం ఎక్కడ జరుగుతూ ఉంటుందో నేనక్కడే ఉంటానని సాక్షాత్తూ ఆ పరమాత్మే చెప్పినప్పుడు ఇంక చెప్పేదేముంది? ఇంటిలో ఎప్పుడూ భక్తి సుధాతరంగాలే!           

          కానీ ఉన్నట్టుండి పిడుగుపాటు. అరునెల్ల పిల్లవాడికి ముమ్మరంగా ఫిట్స్ వస్తున్నాయి. ఇంటి వైద్యాలు మొదలు ఆయుర్వేదం, మూలికా వైద్యం ఎన్ని చేసినా తగ్గటమే లేదు. అటు ఆయనా, ఇటు తానూ కూడా కుంగిపోయారు. ఒక దుర్ముహూర్తాన, ముద్దులు మూటకట్టే చిన్ని పాపడు నిస్తేజంగా చేతుల్లో వేలాడిపోయాడు. ఇంకేముంది? అంతా విషాదం! ఆ బాధా సమయంలో  కూడా తప్పనిసరై ఆయన ఉద్యోగ, సాహితీ వ్యవహారాల్లో యధావిధిగా మునిగిపోయారు. ఆయనకు రాతకోతల్లో సహకరిస్తూ తానూ  ఆ దు:ఖాన్ని దిగమింగుకోవలసి వచ్చింది.

          ఆ తరువాత నాలుగైదేళ్ళకు తులజ, దాదాపు ఏడాదిన్నర తరువాత అరవిందుడూ, వాడి తరువాత నాగపద్మిని! ఈ లోగా ఆయన ఉద్యోగ జీవితంలోనూ, సాహితీ రంగంలోనూ ఏవేవో మార్పులు, గుర్తింపులూ! చూస్తూ ఉండగానే మొదటి రెండవ కుమార్తెలకు పెళ్ళిల్లు కుదరటం, ఆ ఏడుకొండలవాడి దయవల్ల పెళ్ళిళ్ళై పోవటమైంది. వాళ్ళ ముద్దూ ముచ్చటలు తీర్చటం వంటివింకా జరుగుతూనే ఉన్నాయి, ఇంతలో తమ కుటుంబంలోకి మరో జీవి ప్రవేశించటమన్న వార్త ఆడపిల్లల అత్తవారిళ్ళల్లో ఏ దుమారానికి కారణమౌతుందో?

          అమ్మేమో ‘ఆ ఇదేమంత పెద్ద విషయం? చిన్న తనంలోనే పెళ్ళిళ్ళైతే ఇలాగే ఉండేవి పాత కాలంలో పరిస్థితులు! నువ్వేమీ దిగులు పడొద్దు. 

          నేను వస్తానులే సాయానికి!’ అని వ్రాసింది. ఇల్లు గలావిడ గుడిపాటవ్వ కూడ అదే అంటున్నది. ‘నీకెందుకు కనకమ్మా? ఆ పిల్లో పిల్లవాడినో నా ఒళ్ళో పడెయ్, నేనే పెంచుతాను. పాలు తాగించి ఇవ్వంతే! అన్నీ నేనే చూసుకుంటాలే!’ అనేసింది. ఆమె పాపం బాల వితంతువు. 

          పిల్లలు లేరు. ఈ విధంగానైనా పిల్లల పెంపకంలో మైమరచి పోదామని ఆమె తపన కాబోలు! ఏది ఏమైనా ఇప్పుడీ పరిస్థితి దాచిపెట్టేదీ కాదు కాబట్టి ఎదుర్కోక తప్పదు.’ నిట్టూరుస్తూ లేచింది కనకమ్మ!

***

          కాలం ఒకరికోసం ఆగదు కదా! సమయ పురుషుడికి తీరికెక్కడిది? కొన్ని రోజుల తరువాత తులజకు కూడా అమ్మ ఇబ్బంది తెలిసిపోయింది,

          గుడిపాటవ్వ ద్వారా! తమ్ముడు అరవిందుణ్ణీ, చెల్లెలు నాగపద్మినినీ గదమాయిస్తూ  తన అదుపాజ్ఞల్లో ఉంచుకుని ఇంటి పనుల్లో అమ్మకు ఇబ్బంది లేకుండా చేస్తూందామె. ఇంతే కాకుండా అటు అయ్యకు కూడా రాత పనుల్లో సహకరిస్తూ అన్నీ అవలీలగా చేసుకుంటూ పోతున్న బిడ్డను చూస్తే గర్వంగా ఉంది దంపతులకు! ఆ సమయంలోనే పుట్టపర్తి మరాఠీ నుంచీ స్వర్ణపత్రములు అనే అనువాద గ్రంధాన్ని వ్రాశారు. సంస్కృత చారుదత్త నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. అరవిందాశ్రమం వారికోసం విప్లవ యోగీశ్వరుడు అన్న గ్రంధం, అరవిందులవారి జీవిత విశేషాలతో వ్రాశారు. మళయాళ సాహిత్య వ్యాసాలు  చాలా వ్రాశారు. ఇవన్నీ దాదాపు తులజ సహకారంతో జరిగినవే!

          ఎప్పుడో కేరళ ఉద్యోగ సమయంలో వ్రాసిన త్యాగరాజ సుప్రభాతం సంస్కృత  రచన తెలుగు తాత్పర్యంతో ప్రొద్దుటూరు అభిమానులు ముద్రించారు. అది పుట్టపర్తికి ఎంతగానో సంతృప్తినిచ్చింది.

సారంగ రాగ మధుర స్వర పూరితేన

వక్రేణ రమ్య కమలాకర మార్గ చారీ

భృంగ: కరోతి భగవద్భజనం సతృష్టం

శ్రీ త్యాగరాజ భగవన్, తవ సుప్రభాతం!                

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.