కనక నారాయణీయం -58

పుట్టపర్తి నాగపద్మిని

          ఎప్పుడో కేరళ ఉద్యోగ సమయంలో వ్రాసిన త్యాగరాజ సుప్రభాతం సంస్కృత రచన తెలుగు తాత్పర్యంతో ప్రొద్దుటూరు అభిమానులు ముద్రించారు. అది పుట్టపర్తికి ఎంత గానో సంతృప్తినిచ్చింది.

సారంగ రాగ మధుర స్వర పూరితేన
వక్రేణ రమ్య కమలాకర మార్గ చారీ
భృంగ: కరోతి భగవద్భజనం సతృష్టం
శ్రీ త్యాగరాజ భగవన్, తవ సుప్రభాతం!

          వికసించిన కమలముల మీద తుమ్మెదలు తిరుగాడుతున్నాయి. వాటి ఝుంకారం సారంగ రాగాన్ని పోలి ఉంది.అవన్నీ భగవద్భజనమొనర్చుచున్నాయి. త్యాగరజ భగవన్! తల్పమును వీడి రావయ్యా! నీకు సుప్రభాతం.’

          సారంగ రాగము, ప్రసిద్ధ కర్నాటక సంగీత రాగం. తుమ్మెదల ఝుంకారం, యీ సారంగ రాగ విభ్రమాన్ని తలపిస్తుందనటం జగత్ప్రసిద్ధం. ఇక్కడ భృంగ అన్నది జాత్యైక వచనం. తుమ్మెదలు అన్న అర్థమే పిండితార్థం.

పల్యంకికా వన పరాయణ రామ భద్ర
సేవాతిలోక విభవాంచిత రాజరాజ!
స్వామిన్! గృహీత జనుష: పరవైభవస్య
పాపాపహస్య మహతస్తవ సుప్రభాతం!

          త్యాగరాజు తన శిష్యులతో ఒకసారి వన మధ్యంలో ప్రయాణిస్తూ ఉండగా, దారిలో దొంగలు వారిని అడ్డగించరు. రామలక్ష్మణులు ధరుర్ధరులై, వారిని రక్షించిన కథ లోక ప్రసిద్ధం. ఇటువంటి ఘట్టాలు త్యాగరాజు జీవితంలో ఎన్నెన్నో! ఆతడు రాజులకు రారాజు. పరవైభవము యొక్క అవతారం. ఆతనిన తలచినంతనే పాపములు తొలగి పోతాయి. అట్టి స్వామీ! నీకు సుప్రభాతం.’

          ఇటువంటి శ్లోకాలు అప్పట్లో కూర్చటానికి కారణాలు, కేరళలోని ప్రకృతి సౌందర్యం, త్యాగరాజు పట్ల పుట్టపర్తి హృదిలో నెలకొని ఉన్న అపరిమిత భక్తిభావమే!

          ఎప్పుడో 12 సంవత్సరాల కిందట తాను వ్రాసిపెట్టుకున్న యీ సుప్రభాతం ఇప్పటికి అర్థ తాత్పర్యాలతో ప్రొద్దుటూరు తహసిల్దారు పిచ్చయ్య చౌదరి గారి ఔదార్యంతో ప్రచురింపబడటం, ఎంతో బాగుంది.

‘కావ్యం యశసే అర్థకృతే, వ్యవహారవిదే, శివేతరక్షతయే
సద్య: పరనివృత్తయే, కాంతా సం మిత తయోపదేశయుజే’

          అని మమ్మటుడేనాడో చెప్పనే చెప్పినాడు. మమ్మటుడెప్పటివాడు? భోజకాలం, అంటే దాదాపు క్రీ.900 నుండీ 1020 ప్రాంతాలవాడు. అంటే అప్పటికే శ్రీమద్రామాయణ భారతాది గ్రంథాలు వ్రాతప్రతుల రూపంలోనైనా వారికి అందుబాటులో ఉండి ఉంటాయి. అవన్నీ శ్రద్ధాభక్తులతో పఠించి, వాటి ఉద్దేశం కూడ అవగతమైన తరువాతే, కావ్య ప్రయోజనం గురించి నేటికీ ప్రామాణికంగా వెలుగొందుతున్న యీ శ్లోకాన్ని లక్షణ గ్రంధంలో ఉటంకించాడు. ఈ విధంగా యేదేని రచనకైనా ఇన్ని ప్రయోజనాలున్నా ‘శివేతరక్షతయే’ అన్న ప్రయోజనమే తలమానికంగా పరిగణింపబడటం ముదావహం. ఆ భావంతో కవులు ఎన్నెన్నో కృతులు వ్రాసి ఆత్మానందాన్ని పొందుతుంటూనే ఉండేవారు. ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. ఆయా రచనలకు వెలుగులోకి వచ్చే రాత ఉంటే, ఏ విధంగానైనా వెలుగులోకి వచ్చి తీరుతాయి.అన్న దృఢ విశ్వాసమే తనది కూడా!

          వారి ఆలోచనలు యీ విధంగా కొనసాగుతూ ఉండగా, ఇంతలో నాగపద్మిని వచ్చి ‘అయ్యా! మీకేదో జాబు వచ్చింది.’ అని కవర్ చేతికిచ్చింది. కవర్ మీద అడ్రస్ చూస్తే, మహాకవి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు, మోచంపేట కడప అని మాత్రమే ఉంది. ఎక్కడి నుంచో అని చూడగా కలకత్తా ఆంధ్ర సాహిత్య పరిషద్ అని ఉంది. లోపల ఉత్తరం తీసి చదువుకున్నారు. ఆంధ్ర సాహిత్య పరిషద్, కలకత్తా అధ్యక్షులు ఎన్. ఏ. యాజులు గారి నుంచీ ఉత్తరం. వారి సభ ప్రథమ వార్షికోత్సవ సభకు ఆహ్వానిస్తూ, యథా రీతి సత్కరించుకుంటామన్న ప్రార్థనతో! తనతో పాటూ, మరో సువిఖ్యాత బెంగాలీ రచయిత కాళిదాస్ రాయ్ ని కూడా సన్మానిస్తారట!

          సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు, అనంతపురం ముద్దు బిడ్డ శ్రీ నీలం సంజీవ రెడ్డిగారి అధ్యక్షతన జరుగబోతున్న యీ కార్యక్రమంలో ప్రముఖ వంగ పత్రిక ‘జన సేవక్’ సంపాదకులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ చపలకాంత్ భట్టాచార్య కూడా పాల్గొంటారట!
నీలం గారు అప్పటికే భారత రాజకీయాల్లో దూసుకుని వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా సఫలీకృతులయ్యారు. ఇక ఇప్పుడు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా తన సత్తాను చాటుకుంటున్నారు. అంతటివారి సమక్షంలో యీ కార్యక్రమం జరుగు తున్నది. తెలుగు గడ్డను దాటి వంగ భూమిలో తనకు సత్కారం దక్కటం, తన కృషికి గీటు రాయి వంటిదే! ఈ వార్షికో త్సవం సందర్భంగా దేశ వ్యాప్త స్థాయిలో వారి సంస్థ నిర్వహించిన కథానిక, కవితల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా ఉంటుందట! తెలుగు భాషా సాహిత్యాల మీద వారికున్న అపరిమిత ప్రేమకు పుట్టపర్తికి చాలా ఆనందం కలిగింది. తన అంగీకారం తెలుపుతూ ఉత్తరం వ్రాయమన్న కలకత్తా ఆంధ్ర పరిషద్ వారి అభ్యర్థనను మరోసారి చదువుకుని, తృప్తిగా నిట్టూర్చి తులజ కోసం కేకవేశారు పుట్టపర్తి.

          తులజ గురించి పిలుపుకు సమాధానం లేదు. జవాబుగా అర్ధాంగి కనకమ్మేవచ్చింది.

          ‘కనకా! కలకత్తా ఆంధ్ర సాహిత్య పరిషద్ వాళ్ళు అహ్వానించినారు, రేపు నెల (మే) 25 న జరుగుతుందీ సభ! వెంటనే అంగీకారం తెలుపమన్నారు. నీకూ చెబుదామని పిలిచాన్లే! నేనే వ్రాస్తాను.’

          కనకమ్మ కూడా యీ సంగతి విని చాలా ఆనందించింది. ‘మీరు చెప్పండి, నేనే వ్రాస్తాను.’ అన్నది కూడా! ఇంకేం? వెంటనే అంగీకారంతో పాటూ కృతజ్ఞతలు కూడా తెలుపుతూ, తనకు కడప నుండీ కలకత్తా చేరుకునే పద్ధతి తెలియజేయమంటూ వ్రాశారు. అక్కడ ఎవరూ పరిచయస్తులు లేనందున హోటల్ లాంటి వాటిలో కాకుండా, పరిషద్ సభ్యులైన యే తెలుగువారి ఇంట్లోనైనా ఎటువంటి భేషజాలూ లేకుండ ఉండేందుకు తనకు అంగీకారమేననీ, హోటల్ తిండి తనకస్సలు పడదు కాబట్టి ఉన్న రెండు రోజులూ పచ్చడిమెతుకులైనా పరమాన్నంగా స్వీకరిస్తానంటూ వినయంగా వ్రాసి పోస్ట్ చేసేశారు పుట్టపర్తి.

          రామకృష్ణా హైస్కూల్ లోనూ, కడపలోనూ యీ వార్త సంచలనమైపోయింది. స్కూల్ లో సంతోషాన్ని వ్యక్తం చేసేవాళ్ళ సంఖ్య అధికమే ఐనా, నొసటితో వెక్కిరిస్తున్న వెటకారపు మాటలు కూడ కొందరు సన్నిహితుల ద్వారా పుట్టపర్తి చెవుల్లో పడనే పడ్డాయి. పుట్టపర్తి ఒకటే అనుకున్నారు, స్పర్ధయా వర్ధతే విద్యా!

          ఇక సుబ్రమణ్యం, సుబ్బన్న, బాబయ్య వంటి శిష్యుల ద్వారా ప్రొద్దుటూరుకు కూడ తన కలకత్తా ప్రయాణం వార్త చేరి, అక్కడి వర్గాలు మనసారా అభినందిస్తున్నట్టుశిష్యుడు వర్ధమాన కవి, మధుర గాయకుడు, రాజన్న కవి ద్వారా తెలిసింది. ఎంతైనా తానా పట్టణం అల్లుడినికదా! ఆ మర్యాద లెప్పుడూ తనకు సేద తీర్చేవే!

***

          కలకత్తాలో దిగినప్పటినించీ, ఎంతో గౌరవంగా ఆదరిస్తున్నారు, పరిషద్ సంయుక్త కార్యదర్శి శ్రీ రావినూతల సత్యనారాయణ, కార్యదర్శి శ్రీ ముక్కామల వెంకటేశ్వర రావు గార్లు. పుట్టపర్తి అవసరాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.

          ఇక పలుకరించే ప్రతి చోటా, తెలుగు పరిమళాలు గుప్పుమంటూ అందరినీ సమ్మోహన పరుస్తున్నాయి. పరిషద్ అధ్యక్షులు శ్రీ యాజులు గారి సౌజన్యం చెప్పనలవి కాదు. అడుగడుగునా అన్నిటా తానేగా ఉంటూ సభానిర్వహణలో మునిగి తేలుతున్నారు వారు.

          పుట్టపర్తి మనసు ఉద్వేగభరితంగా ఉంది. టాగూర్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టం. కుసుమ పేశలమైన భావాలతో ఆత్మ సమర్పణకు తాను సదా సంసిద్ధమనేలా ఆకర్షించే టాగూర్ వ్యక్తీకరణలో ఏవేవో నిగూఢ భావాభివ్యక్తి వినిపిస్తుంది. ఉపనిషత్తుల ప్రతిధ్వనులూ, వేదాంశాల ప్రస్తావన, వీటన్నిటితో పాటు మానవీయ దృక్కోణంలో లాలిత్యం – మనసును సున్నితంగా స్పృశిస్తూ ఉంటాయి. కవిత్వంతో పాటూ చక్కని చిత్రకారుడుగా కూడా టాగూర్ కు చక్కటి గుర్తింపు ఉన్నది. కొన్ని భక్తి రచనలను ముందు బెంగాలీలో వ్రాసి, వాటిలోని కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి దానికే గీతాంజలి అని పేరు పెట్టాడు. దానికే నోబుల్ పురస్కరాన్నందుకుని విశ్వకవిగా ప్రపంచ దేశాల మన్నన పొందాడు. సంగీతమంటే కూడా టాగూర్ కు ఎనలేని ప్రేమ. తన పద్ధతిలో తాను గీతికలు వ్రాసి తానే స్వరపరచి రబీంద్ర సంగీత్ అని నామకరణం చేశాడు. అయన తిరిగిన గడ్డపై తనకు సన్మానం! తానెన్నడూ ఊహించనైనా లేదు. తాను ఢిల్లీలో పనిచేసేటప్పుడు కొంత మంది బెంగాలీ రచయితలతోనూ పరిచయమేర్పడింది. తాను లయాత్మకంగా వ్రాసిన శివతాండవం నిస్సందేహంగా వారినీ ఆకర్షించింది. శివతాండవంలోని సంస్కృత శ్లోకాల భావ గాంభీర్యం, అక్కడివారినందరినీ మంత్రముగ్ధులను చేసిందనటంలో ఎటు వంటి సందేహమూ లేదు. ఇదంతా,ఆ అగస్త్యేశ్వర స్వామి కృప కాక మరేమిటి?

          కాళిదాస్ రాయ్ కూడా గొప్ప కవి. టాగూర్ శకానికి సంబంధించిన రచయిత. సంస్కృతంలోనూ దిట్ట. కవిశేఖర అన్న బిరుదు, ఇంకా ఎన్నెన్నొ జాతీయ పురస్కారా లందుకున్న విశిష్ట కవి. కుంద, బ్రజ్ వేణు లాంటి ఎన్నెన్నో గొప్ప రచనలు చేశా డాయన. తనకంటె సుమారు ఇరవై సంవత్సరాలు పెద్ద. వారితో పాటూ తానూ వేదిక పంచుకోవటం, ఆశ్చర్యం, ఆనందదాయకం కూడా!

          కలకత్తా దాకా ఎటూ రావడమైంది కాబట్టి టాగూర్ స్థాపించిన విశ్వభారతిని కూడా సందర్శిస్తే బాగుండును! అనుకున్నారు పుట్టపర్తి.

          ఉదయం రసోగుల్లాలతో ఉపాహారం తమాషాగా అనిపించింది. సాయంత్రం సభా ప్రాంగణానికి ఎత్తుపల్లాల రోడ్లలో తోపుడు రిక్షాలో ప్రయాణం, ఇక్కడి ప్రజల స్థితిగతులు, ఏనాటి అలవాట్లనో ఇంకా కొనసాగించే తత్వాన్ని పరిచయం చేసింది.

          సభాప్రాంగణం చేరుకున్న పుట్టపర్తికి తాంబూల భరిత అరుణారుణిమలు స్వాగతం పలికాయి. యాజులు గారు హడావిడిగా తిరుగుతున్నారు. ఇంతకూ, నీలం సంజీవ రెడ్డి గారు ఏదో రాజకీయ కార్యాల వల్ల రావటం లేదని తెలిసింది. అధ్యక్షులు ఎవరుంటారా అన్న చర్చ జరుగుతున్నది. 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.