చిత్రం

-గణేశ్వరరావు

జార్జియా కీఫ్, అమెరికన్ చిత్రకారిణి, ‘మనం పూలని సరిగ్గా చూడం, ఎందుకంటే అవి చిన్నవి. సరిగ్గా నేను చూసే పద్ధతిలో పెద్దవిగా చూపిస్తూ వాటి బొమ్మ గీస్తే? మీరు తప్పక చూస్తారు’ అంటుంది. 1928లో గస గసాల పుష్పం బొమ్మను (30″/40″) గీ సింది, ప్రకృతిని నైరూప్య కళలో ప్రదర్శించి కళ్ళముందుకు తెచ్చింది. రెండు పూలే కనిపిస్తాయి, వాటి వెనుక కొమ్మలూ రెమ్మలూ లేవు . రంగుల మేళవింపులోనూ, వేసిన పద్ధతిలోనూ ఆధునికమైన ఈ చిత్రం ఆమె అద్భుతమైన ప్రతిభకు గుర్తు. పాపీ ఫ్లవర్ లోని అత్యంత సున్నితమైన వివరాలన్నింటినీ పెద్దవిగా చేసి చూపించింది. ఎరుపు, నారింజ రంగులను పూల రేకులకి వాడింది. రేకులకు వేసిన లేత రంగులు మఖమల్ అనుభూతిని కలిగిస్తూ .. మెరుస్తూ .. పూలు సజీవంగావున్నట్టు అనిపిస్తాయి. పూల మధ్య భాగాన్ని గాఢమైన ఊదా రంగులో ఆమె చిత్రించింది. పూవులోని సౌందర్యాన్ని గతంలో మనం చూడలేనంతగా చిత్రించి మనం అచ్చెరువందెలా చేసింది. చైతన్యవంతమైన రంగులతో పూలకో వ్యక్తిత్వాన్నికల్పించింది. సానుకూలమైన వాతావరణాన్ని అది కలగజేస్తుంది . అద్భుతమైన ఈ అడవిజాతి పూలను అత్యంతంత వాస్తవికమైన రంగులలో చిత్రించటం ద్వారా మనం ప్రకృతికి ఎంతో దగ్గరలో ఉన్నట్టు, ఈ అనంత విశ్వములో మనం కూడా ఒక భాగమైన అనుభూతిని కలగజేస్తుంది. మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పుడు ఫోటో జర్నలిస్టులు వాడుతున్న క్లోజ్ అప్ టెక్నీక్ ను, కీఫ్ అప్పట్లోనే వాడింది. ఆమె కళ నైరూప్య కళ కాదు. ఆమె శైలి ‘ఖఛ్చితత్వం’. ఈ కళాఖండం ఆమె కళాత్మక సౌందర్యావలోకనానికి నిదర్శనం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.