చిత్రం-10

-గణేశ్వరరావు 

ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘అంతరించిపోతున్న జీవితం’. ఈ  చిత్రంలో కొత్తదనం వుంది. రంగుల ఎంపిక చూడండి, చిత్రమైన అనుభూతిని, వాతావరణాన్ని కలగజేస్తుంది. అమ్మకానికి డ్రాయింగ్ రూమ్ ల కోసం పెయింటింగ్ వేసే  వాళ్ళు అటవీ ప్రాంతాన్నీ వాటిలో సంచరించే లేళ్ళు దుప్పులనీ ఇలా చిత్రించరు! వాల్ పర్జిస్ మ్యూజ్ పేరుతో ఈ బొమ్మ గీసిన ఆమె చిత్రకళా ప్రదర్శనల్లో తరచూ పాల్గొంటూ ఉంటుంది.   ఆమె పెట్జకున్న జర్మన్ పేరుకు అర్థo – ‘అందరినీ కాపాడే అధిదేవత”

ఆమె తన గురించి, తన కళ గురించి ఇలా అంటుంది:: ‘నా చిత్రాలు నా ఆత్మని ప్రతిబింబిస్తాయి. కొన్ని చిత్రాలు చీకటితో నిండినట్లు వాటిలోని నలుపు రంగు కళ్ళకు కొట్టేచ్చేటట్టు కనిపిస్తుంది, కారణం మనం ఇప్పుడు ఉంటున్న ప్రపంచం చీకట్లోనే ఉందికదా! ఒక అందమైన కళాఖండాన్ని తయారు చేయాలని అనుకోవడం లేదు. నా ఆలోచనలను నా శైలిలో నా ఊహలకి అనుగుణంగా చిత్రాల్లో రూపం కల్పిస్తుంటాను. ఇది డ్రాయింగ్ రూమ్ కళ కాదు. నేను వేసిన బొమ్మలు పాతబడవు.

‘కళ అందరికీ తెలిసిన భాష, దాన్ని అర్థం చేసుకోవడానికి అనువాదాలూ, నిఘంటువులూ అవసరం లేదు, దాని సొంత గొంతుతో అదే తన గురించి చెబుతూంటుంది. సమాజపరిణామానికీ అద్దం పడుతుంది. అద్భుతమైన యుగాలతో పాటు, అంధకారం నిండిన కాలాలను కూడా అది చిత్రీకరిస్తుంది. నా భావాలని, అనుభూతులని నా చిత్రాల ద్వారానే వ్యక్తపరచగలను.

”మనది అందమైన ప్రపంచం, ఒక సౌందర్య వనం, కాని దాని వినాశానికి మనమే కారణం అవుతున్నాయి. వారసత్వంగా దొరికిన ఈ ప్రపంచాన్ని, అంతకన్నా మెరుగైన రూపం లో భావితరాలకి అందించడం మన బాధ్యత. ఆధునిక నాగరికతలో మనం గర్వ పడవలసిన అంశం ఏదీ లేదు, ప్రపంచంలోని మూడు వంతుల జనాభా దారిద్ర్యంలో గడుపుతున్నారు, కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంలో రూపొందింప బడ్డ జంతు వృక్ష సంపద అంతరిస్తూ వుంది, రాబోయే శతాబ్దంలో అది పూర్తిగా కనుమరుగాయేటట్టు వుంది. యుద్ధాలూ.. మానవ అకృత్యాలూ వైవిధ్యమైన సంస్కృతినీ, సంపదనూ, నాశనం చేస్తున్నాయి. మన మేధావులు వారి తెలివితేటలను ఉపయోగించి ఈ గ్రహాన్నీ దాని మీద నివసిస్తూన్న అన్ని ప్రాణులకీ గౌరవంగా జీవించే అవకాశం ఎందుకు కల్పించకూడదు?’

ఆమె వ్యక్తపరచిన భావాలకు ఈ చిత్రం ఒక ప్రతీక.



*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.