చిత్రం-6

-గణేశ్వరరావు

బ్రోర్ద్రిక్ గీసిన ఈ చిత్రం ఒక పోటీలో ప్రధమ బహుమతి పొందింది. బహుమతి ఎంపికకు జ్యూరీ నిర్ణయానికి వున్న కారణాలు ఏవైనప్పటికీ, ఈ చిత్రంలో ఒక విశేషం వుంది: అదే చిత్రంలో మరో చిత్రం. నేపథ్యంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పొలాక్ గీసిన చిత్రం వుంది. బ్రోర్ద్రిక్ చిత్రంలో ఒక విద్యార్థి బృందం చిత్ర కళా ప్రదర్శనలో ఒక కళా కృతిని చూస్తున్నట్టు చూపించబడింది. పొలాక్ ఆమెను ప్రభావింతం చేసాడు, అతను తనకు అందించిన స్ఫూర్తికి  గుర్తుగా ఆమె ఈ చిత్రాన్ని గీసినట్లుంది. 

ముందు బ్రోర్ద్రిక్ పరిచయం: ఆమె తన చిత్రాలకి అన్ని రకాల ఇతివ్రుత్తాలని స్వీకరిస్తుంది: కొండలూ  కోనలు, పల్లె – పట్నం దృశ్యాలు, జనం, జంతువులూ.. ఆమె చిత్రాల గురించి అందరూ అనే మాట ఒకటే – అవి చూడటానికి ఎంతో ప్రశాంతం గా వుంటాయి, వాటిలో నాటకీయతతో పాటు కవితాత్మకమైన సున్నితత్వం కూడా కనిపిస్తుంది, రసరమ్యంగా వుంటాయి. ఆమె లేత రంగులు వాడినా, వాటిలో మెరుపు కనిపిస్తుంది. ఆమె తన చిత్రాల్లో వివిధ రంగులను వాడినా అన్నీ కలిసిపోయి, కంపోజర్ ఎన్ని వాయిద్యాలు వాడినా అవి కలిసిపోయి సింఫనీ ని సృష్టించినట్లు, ఆమె చిత్రాలలో మాధుర్యతనూ harmony ని కలగజేస్తాయి.

ఇక చిత్రంలోని చిత్రం గురించి. దీన్ని చిత్రించింది పొలాక్. భావవ్యక్తీకరణ వాదానికి ఇది ఒక ఉదాహరణ.. ఒక ప్రత్యెక పధ్ధతిలో దీన్ని Pollock రూపొందించాడు. అతను స్టూడియో నేల మీద బొమ్మలు వేసే గుడ్డను పరిచి దాని మీద గోడలకు వేసే ఎనామిల్ పెయింట్ ను విదిలించేవాడు. కాన్వాస్ చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ అన్ని వైపులనుంచీ ( పైనుంచి కూడా ) రంగులని విదిలించేవాడు,నలుపు-తెలుపు రంగులలోని రేఖలు… వంకర గీతలు, రంగు మచ్చలు.. లేత పసుపు రంగు కాన్వాస్ నేపథ్యంలో ఒక దానితో మరొకటి కలిసిపోయేవి. అలా అతను తన చిత్రంలో అక్షరాలా ‘దూరి’ పోయేవాడు, అందులో ఒక ‘భాగం అయిపోయిన భావనకు లోనయేవాడు. అలవోకగా – సుషుప్తావస్థలో – ఒక అధివాస్తవిక చిత్రాన్ని రూపొందించేవాడు. ఇలా అతను చిత్రించడాన్ని ‘ఏక్షన్ పెయింటింగ్'(చర్యార్థక చిత్రం) అని పేరు పెట్టారు కొందరు. ఇక్కడ కాన్వాస్ ‘కార్య క్షేత్రం’, ఒక ఘటనకు రంగ భూమి. ఈ పెయింటింగ్ సన్నివేశం – కళాకారుని భౌతిక మానసిక చర్యను చూపిస్తుంది. అదే సమయంలో చిత్రంలో గజిబిజి గా పొందుపరచిన రంగులు – తెర మాటున అంతరార్థాన్ని దాచి పెట్టనూ వచ్చు, లేదా ‘తెర’ ను పూర్తిగా తొలగించి రహస్యమనేదీ లేకుండా అంతా స్పష్టం చేయనూ వచ్చు. సహజ ప్రపంచానికి తన చిత్రాలు సన్నిహితంగా ఉండాలనే అతను ఎంతో ఆశించినా , ఈ చిత్రంలో సంక్లిష్టంగా వున్న రేఖా విన్యాసం చూపరులను కట్టి పడేస్తుంది. ఇందులో గీతలు ఒక రూపాన్ని కనబరచవు, రేఖలే రూపం దాలుస్తాయి. ఈ చిత్రాన్ని గమనిస్తున్నప్పుడు , ఏదో తెలియని శక్తి అందులోంచి వెలువడుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఒక మహత్తరమైన కళాకృతి గా విజ్ఞులు గుర్తించారు. దీని కేసి మనం చూస్తునప్పుడు, మన చూపు ఒక చోట నిలకడగా ఉండదు, మూల మూలాలూ తడివి చూస్తుంది, అన్ని కోణాలూ స్పృశిస్తుంది , చిత్రానికి మూడో కోణం ఇస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.