చిత్రం-11

-గణేశ్వరరావు 

‘వాస్తవికత’ అనే పదమే ఎంతో అర్థవంతమైంది, దానికీ ఈ నాటి కళా ప్రపంచానికి లోతైన సంబంధం వుంది.
ఒక్కో సారి ఫోటోను చూసి చిత్రం అని, చిత్రాన్ని చూసి ఫోటో అని భ్రమపడతాం. కారణం వాటిలో ఉన్న  వాస్తవికతే!
జీవితంలోని ఒక క్షణాన్ని కళ సంగ్రహపరచ గలదు, దాని కన్నా లోతైన అవగాహనను  కల్పించగలదు, మన రోజువారీ జీవన పరిధి ని దాటి అర్థాన్ని అందించగలదు..
అందరికీ కొన్ని పోలికలు ఉన్నట్టే కొన్ని తేడాలూ ఉన్నాయి, ఒక వ్యక్తీ మూర్తి చిత్రాన్ని గీస్తున్నప్పుడు చిత్రకారులకి సవాలుగా మారే అంశం : ఆ వ్యక్తీ మనలోని ఒకరే అని చూపించడంతో పాటు, ఆ వ్యక్తిలో వున్న భిన్నమైన అంశాలను ఎత్తి చూపిస్తూ ఆ  వ్యక్తికి ఉన్న  ప్రత్యేక వ్యక్తిత్వాన్ని మనం గుర్తించేలా చిత్రించడం!
చిత్రాల్లోని వాస్తవికత శక్తివంతమైనది, అందుకే దాన్ని కొందరు ఫోటోగ్రఫీ తో పోలుస్తూ ఉంటారు. అయితే ఫోటో,  ఒక వస్తువును చదును చేసి రెండు పరిమాణాల్లోనే చూపిస్తే, చిత్రకారిణి తన చిత్రానికి మూడో కోణాన్ని కూడా  కల్పిస్తుంది.  వస్తువులోని అంతర్గత సారాంశాన్ని పట్టుకుంటుంది. 

పాస్టెల్ పెయింటింగ్స్ చిత్రీకరణలో వాస్తవికత కొత్త పుంతలు తొక్కుతోంది. అధునాతనమైన పద్ధతులు అనేకం వచ్చాయి. పాస్టెల్ పెయింటర్ గా  వికి సలవన్  ఈ చిత్రంలో అదే చేయడానికి ప్రయత్నించింది. ఆమె ఎంతవరకు కృత కృత్యు రాలైందో మీరే చెప్పాలి. తాను చేబట్టిన ప్రతీ వస్తువునూ నిజాయితీగా చిత్రీకరించడం తన లక్ష్యం అని ఆమె అంటుంది.
ఈ చిత్రానికి ఆమె పెట్టిన పేరు ‘యువత అందం’.

 గులాబీ రంగు తులిప్ మొగ్గ, దాని పైన మంచు బిందువులు. చూడగానే హృదయానికి హత్తుకోవాలనిపించే రంగురంగుల తులిప్‌ మొగ్గ! 

 వికీ చిత్రప్రదర్శనలో ఒక సారి జరిగిన వింత – ఓ ఏడేళ్ళ అబ్బాయి ఈ చిత్రం దగ్గరకు వెళ్లి తన చేతి వేళ్ళతో నీటి చుక్కలను తుడిచివేయడానికి ప్రయత్నించడం.!  కారణం ఆ చిన్నారి ఆ మొగ్గ నిజంగా తడిసిపోయిందని అనుకోవడమే!

ఒక విలేకరి ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ  , ఆమెకు వేసే  ప్రశ్నలలో  ఎటువంటి ప్రశ్నను   ఆమె అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడుతుందని అడిగినప్పుడు, ఆమె ఇచ్చిన సమాధానాన్ని మనమూ  ఇష్టపడతాం. ఆ ప్రశ్న:  ‘వికీ, ఈ అద్భుతమైన పైంటింగ్ నాకు అమ్ముతారా? ‘ అని ఒక  చిత్రకళాభిమాని ఆమె ముందుకు రావడం!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.