జీవితమే సఫలమా!

-అత్తలూరి విజయలక్ష్మి

“ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి. 

ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ  మండిపడుతూ చూసాడు భార్యవైపు. 

ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ సాధించడానికి పిశాచిలా వచ్చిన ఆత్మా! కసిగా అనుకుంటూ విస, విసా వెళ్లి నాలుగు గోంగూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, నాలుగు తోటకూర కట్టలు తెచ్చాడు. అన్నీ కలిపి ఓ బోకే లాగా పట్టుకుని కావాలని సుబ్బుని రాసుకుంటూ వంటగదివైపు నడిచాడు. 

“అబ్బ ఏంటండి? చూసుకుని నడవచ్చు కదా!  చూడండి అక్షరాలన్నీ ఎలా వంకరపోయాయో!” అంది చిరాగ్గా సుబ్బు. 

“వంకర రాతలకి వంకర అక్షరాలు చాల్లే !”  పైకి అనబోయి ఆగిపోయాడు. ఆవిడ అక్షరాలను, ఆవిడ రాతలను ఏ మాత్రం వ్యాఖ్యానించినా రాబోయే ఉపద్రవం తెలుసు బాలకృష్ణకి.  

సుమారు రెండు నెల్ల నుంచి రామానికి వంటగది అప్పచెప్పి, తను సీరియస్ గా రచనా వ్యాసంగంలో పడింది  సుబ్బు, ఉరఫ్ సుబ్బలక్ష్మి.   

“నేనెంత నీకు మాట ఇస్తే మాత్రం మరీ పెళ్లి అయిన నెలకే ఈ ప్రాజెక్ట్ అవసరమా సుబ్బూ” అన్నాడు జాలిగా. 

“అమ్మో ఇప్పటికే ఆలస్యం అయిందండీ.. నా బంగారు మొగుడు కదూ ప్లీజ్” అంది గోముగా.

“కానీ నాకు వంట రాదు సుబ్బూ” అన్నాడు …

“ఆ, ఊరుకోండి అదేం బ్రహ్మ విద్యా! కాసిని బియ్యం కడిగి స్టవ్ మీద పడేస్తే అదే ఉడుకుతుంది.. కాసిని కూరలు కోసి మూకుడులో పడేస్తే అవే ఎంచక్కా మగ్గి ఊరుకుంటాయి. ఇహ పప్పు… కాసిని దోసకాయ ముక్కలో, ఆకుకూర తుంపులో వేసి, గుప్పెడు కందిపప్పు కుక్కర్ లో పడేస్తే పప్పు రెడీ” అంది అచ్చం కుక్కర్ అడ్వర్టైజ్ మెంట్ లో లాగా…

అచ్చు ఆవిడ చెప్పిన ప్రాసెస్ ఫాలో అయి, రెండు గిన్నెలు, ఒక కుక్కర్తో పాటు కొన్ని బియ్యం, మరికొన్ని కందిపప్పు ట్రాష్ లో పడేసాడు. విషాదంగా మొహం పెట్టిన భర్తని ఓదార్చి  “Try, Try until you die అన్నాడుట  కదండీ ఆయనెవరో అలా మళ్ళి ట్రై చేయండి నన్ను డిస్టర్బ్  చేయకండి” అంటూ నాలుగు కట్టల తెల్లకాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. 

పెళ్లి కాకముందు నుంచీ కూడా సుబ్బలక్ష్మికి రచయిత్రిని అనిపించుకోవాలని మహాకోరిక అని పెళ్ళయ్యాక తెలిసింది బాలకృష్ణకి. అప్పగింతల్లో సుబ్బలక్ష్మి వాళ్ళమ్మ కన్నీళ్లు పెడుతూ “నా కూతురుని నీ చేతుల్లో పెడుతున్నా నాయనా! దాన్ని రచయిత్రిని చేస్తావో, నీ పిల్లల తల్లిని చేస్తావో అంతా నీదే భారం” అంది. ఆప్పుడు ఆ మాటలకి అర్ధం తెలియలేదు… మొదటి రాత్రి ఆ మాటలకి అర్ధం ఏంటని సుబ్బలక్ష్మినే అడిగాడు.  చిన్నప్పటి నుంచి కూడా కధలు రాయాలని తనకి చాలా కోరిక అని, నోటు పుస్తకాల నిండా కధలే రాసి, రాసి, క్లాస్ పుస్తకాల్లో ఏముందో కూడా చూడక టెన్త్ ఫెయిల్ అయినానని, అయినా రచయిత్రి కాలేకపోయానని కాసేపు విషాదంగా, మరి కాసేపు సిగ్గుపడుతూ చెప్పి, కధలు రాయడం అనేది పిచ్చి అని, పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుందని ఎవరో చెప్పడంతో పెళ్లి చేసారని చెప్పింది. 

అంతేకాక నా కోరిక తీర్చడం నా కల నెరవేరేలా చూడడం భర్తగా  మీదే బాధ్యత.. మీ కు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే ఇది మీకు పరీక్ష అని కొస మెరుపు కూడా ఇచ్చింది. 

పొంగిపోయిన బాలకృష్ణ “ఓస్ అంతేనా … అదెంత పని… నా భార్య రచయిత్రి అంటే నాకు మాత్రం గర్వకారణం కాదా సరిగ్గా నెల రోజుల్లో నిన్ను రచయిత్రిని చేసేస్తా” అంటూ వాగ్దానం చేసాడు.

దాని ఫలితమే ఇది… ఒక నెల రోజులు, సినిమాలు, షికార్లతో ఆ విషయం ఎత్తకపోయినా, ముప్ఫై ఒకటో  రోజు డజను తెల్ల కాగితాల కట్టలు, పాతిక పెన్నులు కొనిపించి, మర్నాడు ఏకాదశి, గురువారం మంచి రోజు అని,  అన్నప్రాశన రోజే ముద్దపప్పు, ఆవకాయ కావాలని పేచీ పెట్టె కొత్త టెక్నాలజీ బేబీ లాగా టివి సీరియల్ తో ప్రారంభం చేస్తానని,  కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని చెప్పి, తన రాత పూర్తీ అయిందాకా వంటా, వార్పూ రామమే చూసుకోవాలని డిక్లేర్ చేసింది. 

టి వి సేరియల్ రాస్తే రాసింది… కానీ తనని వంట చేయమనడంతో అదిరిపడ్డాడు బాలకృష్ణ . అసలు స్టవ్ వెలిగించడం కూడా రాని తను వంట చేయడం ఏంటో జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదు. చేసేది లేక కొత్త పెళ్ళాం మాట కాదనలేక నానా అవస్థా పడి తొమ్మిదింటికల్లా. ఇంత ఆకుకూర పప్పు, అన్నం వండి ఆఫీస్ కి పరిగేట్టేసరికి రోజు లేట్ అవడం ఆఫీసర్ తో చివాట్లు తినడం జరుగుతోంది. కానీ నెల కాదు… రెండు నెలలు కావస్తున్నా ఆ సీరియల్ పూర్తీ కాలేదు.. పైగా  “పదివేల ఎపిసోడ్ లు అప్పుడే అవుతుందా ఏంటి మీకసలు సహనం లేకపోతే ఎలా?” అంటూ యక్ష ప్రశ్న కూడా వేసింది. 

ఎందుకు ఈవిడని రచయిత్రిని చేస్తానని వాగ్దానం చేసానా అని గుండెలు బాదుకున్నాడు. కింకర్తవ్యం ఏంటో బోధపడడం లేదు. 

అటు ఆఫీస్ పని, ఇటు ఇంటిపనితో అలసిపోయి నడుం వాలుస్తూ… ఆధునిక మహిళ – కష్టాలు అని ఎవరన్నా సెమినార్ పెడితే ఈ సారి నేను కూడా పేరివ్వాలి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. 

దడేల్ మని నెత్తిమీద ఎవరో సుత్తితో కొట్టినట్టు అయింది… ఎవరది? ఉలిక్కిపడి గట్టిగా అరిచాడు.

నేనే …. వికటాట్టహాసం చేస్తూ వచ్చిందో ఆకారం ….తెల్లచీర, తెల్ల జాకెట్, తెల్ల జుట్టు, తెల్లటి మొహం, కానీ ఆ మొహం నిండా మచ్చలు.. గీతలు.. వికారంగా ఉంది.

బాలకృష్ణ గొంతు ఎండిపోయింది… గుండె వేగంగా కొట్టుకోడం మొదలుపెట్టింది.. చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది.. తడబడుతూ…” ఏ….ఎవరు నువ్వు” అన్నాడు.

“నేనెవరో తెలియదా..” హుంకరించింది ఆకారం. 

“తె …. తెలియదు… చే చెప్పవా…. ప్లీజ్ … నాతొ నీకేం పని… నన్ను ఎందుకు కొట్టావు” అడిగాడు. 

“నిన్ను కొట్టాలా … చంపాలా… బుద్ది లేదూ … అన్నం తింటున్నావా! గడ్డి తింటున్నావా… అసలు నీకు చదువు చెప్పిన ఏబ్రాసి ఎవడు… నన్ను ఎలా వాడుకోవాలో చెప్పిచావలేదా!  ఇలాగేనా నన్ను వాడుకునేది.. చూడు నా మొహం చూడు… విశ్వనాధవారు ఇలాగే వాడుకున్నారా… గురజాడ గారు ఇలాగే నా మొహం నిండా గాయాలు చేసారా. కందుకూరి గారు నన్నిలాగే చిత్రహింసలు పెట్టారా! శ్రీ, శ్రీ, చలం, రావిశాస్త్రి, కొడవటిగంటి దాశరధి …. ఆ మహానుభావులు చచ్చి ఏ లోకాన ఉన్నారో నన్నేనాడైనా ఒక దెబ్బ వేశారా! ఎంత ప్రేమగా చూసేవారు నన్ను… ఎంత ఆప్యాయంగా ఉండేవారు నాతొ.. ఎంత కుదురుగా, పొందిగ్గా దాచేవారు నన్ను… ఏమైందిరా నీకు … నీ పెళ్ళాం నీకెంత ముద్దు అయితే మాత్రం  … దాని కబంధ హస్తాలకి నన్ను అప్పచేప్తావా? నిన్నసలు … ఇలా వదలకూడదు… అందమైన నా మొహం నిండా పెన్నులతో గాట్లు పెడుతూ గాయాలు చేస్తున్న నీ పెళ్ళాన్ని, నిన్ను పీకపిసికి చంపినా రామ, రామ అనకూడదు.. ఇప్పుడే చంపేస్తా.. నా పగ తీర్చుకుంటా…”

కెవ్వుమని అరిచి ధభాల్న మంచం మీంచి కింద పడ్డాడు బాలకృష్ణ ..

నడుం పట్టేసరికి అర్ధమైంది భార్య కీర్తి కాంక్షతో తనకి పీడకలలు కూడా వస్తున్నాయని. ఎట్టి పరిస్థితుల్లో రేపట్నించీ వంట చేయకూడదని, సుబ్బలక్ష్మి చేత ఎలాగైనా పిచ్చిరాతలు మానిపించాలని ద్రుధంగా నిశ్చయించుకున్నాడు. 

అయితే అది అంత సులభంగా సాధ్యం అవదని అర్ధం అయిపొయింది. సుబ్బలక్ష్మి తన పేరు ఎలాగైనా అచ్చులో చూసుకోడం కోసం తను రచయిత్రి అవడం కోసం అన్న, పానాలు కూడా మానేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. 

బాలకృష్ణ కి వంట బాధ తప్పలేదు.. రోజుకో పీడకలతో దడుపు జ్వరం కూడా వచ్చింది. అయినా సుబ్బలక్ష్మి చలించలేదు. 

సరిగ్గా నెల రోజులు గడిచాయి. ఆ రోజు  బాలకృష్ణ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సుబ్బలక్ష్మి వికసించిన మొహంతో ఎదురుచూడసాగింది. అతన్ని చూడగానే ఒక పత్రిక అతని మొహం మీద విసనకర్రలా విసురుతూ “చూసారా సాధించాను”  అంది…

“ఏంటి” అడిగాడు.

“అర్ధం కాలేదా అయ్యో రామా! ఇందులో నా కధ పడిందండి..” అంటూ తన కధ ఉన్న పేజి తీసి చూపించింది. 

బాలకృష్ణ వెనక్కి పడబోయి నిలదొక్కుకుంటూ “అవునా… కంగ్రాట్స్ సుబ్బు” అన్నాడు ..

“ఈ జన్మకి నా కధలు పడవన్నారుగా చూడండి. ఇదిగో చదివి మీ అభిప్రాయం చెప్పండి ఈ లోగా మీకు కాఫీ తెస్తాను”  అంటూ లోపలికి వెళ్ళిన భార్యవైపు అయోమయంగా చూస్తో కధ వైపు చూపులు పోనిచ్చాడు. ఒక వాక్యానికి మరోవాక్యానికి ఎలాంటి పొంతనా లేకపోగా చివరిదాకా చదివినా ఆవిడ ఏం చెప్పదల్చుకుందో అర్ధం కాక వేర్రిమొహం వేసుకుని కూర్చున్నాడు.  అతనికి అది కధా, వ్యాసమా కూడా అర్ధం కాలేదు. 

ఏనాడన్నా ఓ కధ చదివితేగా మీకు అర్ధం కావడానికి నా ఖర్మ అంటూ అతని చేతిలోంచి పత్రిక లాగేసుకుని కాఫీ కప్పు పెట్టింది సుబ్బలక్ష్మి.

ఆ తరవాత వరసగా ప్రతి వారం ఇందులో వచ్చింది నా కధ, అందులో వచ్చింది అంటూ ఇంటినిండా పత్రికలు  పేర్చింది. రెండు నెల్ల తరవాత “ ఏవండి నాకు ఆనపకాయ సాహితీ సంస్థ వాళ్ళు సన్మానం చేసి జీవనసాఫల్య పురస్కారం ఇస్తున్నారు. “ అంటూ మురిసిపోతూ చెప్పిన ఆమె వైపు వెర్రివాడిలా చూసాడు. 

“నీకా పురస్కారమా… జీవన సాఫల్యమా…” తెల్లబోతూ అడిగాడు.

“అవునండి అంత ఆశ్చర్యపోతారేంటి”  అంది చిరుకోపంగా.

“అది, అది జీవనసాఫల్య పురస్కారం నీకివ్వడం ఏంటి? “

“ ఏం? ఎందుకివ్వకూడదు.. నేను చాలా  గొప్ప కధలు రాసానని ఇస్తున్నారు… పదండి నాకు అర్జెంటు గా పట్టుచీర కొనాలి” అంది హడావుడి పడుతూ…

నాలుగు  వారాలు కధలు పడగానే జీవిత సాఫల్య పురస్కారం ఎందుకిస్తున్నారో అర్ధం కాని బాలకృష్ణ తెల్లటి షిఫాన్ చీరతో వయ్యారంగా వచ్చి పదండి అని చేయి పట్టుకున్న భార్యని రోబోలా అనుసరించాడు. 

పదివేల రూపాయల పట్టుచీర సెలక్ట్ చేసుకుని బిల్ చేతికిచ్చింది సుబ్బలక్ష్మి. 

పదివేలే… గుండె ఆగినట్టు అయి కళ్ళు తేలేయబోయి కౌంటర్ దగ్గర టేబుల్ అంచు పట్టుకుని నిలదొక్కు కున్నాడు. 

చేసేది లేక పర్స్ తీసి  డెబిట్ కార్డ్ తీయబోయి కార్డు కనిపించకపోడంతో గాభరాగా అన్నాడు.  నా కార్డు కనిపించడం లేదు సుబ్బూ … 

“అయ్యో మీ కార్డు నా  పర్స్ లో ఉందండి పర్స్ మర్చిపోయాను తేలేదు…” అంది సుబ్బలక్ష్మి నాలిక కొరుక్కుంటూ. 

“నీ దగ్గర ఉందా! ఎప్పుడు తీసుకున్నావు? ఎందుకు  తీసుకున్నావు?” అడిగాడు ఆశ్చర్యంగా..

“ష్ గట్టిగా అరవకండి….పురస్కారం ఊరికే వస్తుందా… పదివేలు …. నిన్ననే విత్ డ్రా చేసి  ఇచ్చాను సంస్థ వాళ్లకి “ అంది అతనికి మాత్రమే వినిపించేలా. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.