కథా మధురం

 ఒక వాస్తవానికి మెలకువ గా నిలిచిన కథ – ‘కల’ 

(రచయిత: విద్యార్థి)

-ఆర్.దమయంతి

 ఈ ప్రపంచంలో అత్యంత కటిక బీదవాడు ఎవరూ అంటే, అందరూ వుండీ ఎవరూ లేని వాడు. తన ఒంటరితనమే తనకు తోడు గా  చేసుకుని బ్రతికే వాడు.

   మనిషి సంపాదనలో పడ్డాక ఎన్నో ఆస్తులను  కూడపెట్టుకుంటాడు. కానీ, ముసలి వయసులో ఆసరా గా నిలిచే   అసలైన సంపదను మాత్రం పొందలేకపోతున్నాడు. ఏమిటా సంపదా, ఐశ్వర్యం అంటే – మాట్లాడుకునేందుకు  ఒక మనిషి. కదలలేని స్థితిలో..; నువ్వేం దిగులు పడకు. నేనున్నా నీకు.’ అని నిండుగా పలికి, తోడుగా నిలిచే ఒక మనిషి. 

మదర్ థెరెస్సా అందుకే అంటారు.  ‘ the most terrible poverty is loneliness and the feeling of being unloved ‘  అని 

  పూర్వం మన కుటుంబాలలో ఈ కొరత అన్నది వుండేదే కాదు.   కష్టాలను చెప్పుకునేందుకు అయిన వాళ్ళుండేవారు. ఓదర్చేందుకు ఆత్మీయులుండేవారు. లేవలేని స్థితిలో ఆసరాగా నిలిచేందుకు తన వాళ్ళుండేవారు. పోయాక మీదపడి ఏడ్చేందుకు కుటుంబీకులు వుండేవారు.

యేడాదికొకసారి అందరూ గుమికూడి,  పోయిన వారిని సంస్మరించుకుంటూ గుర్తు చేసుకునే వారు. ఆత్మకు శాంతిని ప్రసాదించేవారు.   ఇలా అన్ని దశల్లోనూ అందరకీ అందరూ తోడుగా వుండేవాళ్ళు.   

అందుకే ఆ కాలపు వృద్ధులకి మతి పోయే డిప్రెషెన్స్,  ఒంటరి తనపు నిరాశలు మనసుని తరిమేవి కావు.

 ఏ యుగం లో అయినా మనిషికి –  బ్రతుకెప్పుడూ ప్రశ్నే. కాదనం.  కానీ ఈ కాలం మనిషికి – చావు కూడా ప్రశ్న గా  మారడం ఎంతైనా విషాదకరం! 

 మరి ఈ దుస్థితి  ఎదురవడానికి కారణం – కాలమా? మనుషులా? పరిస్థితులా?  – బదులు చెప్పలేని ఈ ప్రశ్నకు జవాబుగా నిలుస్తారు – ఈ కథలో ని మామ్మ గారు.

మామ్మ గారు ఎవరు?  :

అంపశయ్యమీది భీష్మునిలా …మరణానికి  అతి చేరువగా మంచం మీద పడి వున్న స్త్రీ మూర్తి.

పిల్లలు ఉద్యోగ రీత్యా దూరం గా వుంటారు. ఆమె ఒకర్తే ఇక్కడ మిగిలిపోయి వుంటుంది. ఆ ఇంటి  పై అంతస్థులో కాపురం వుండే కుటుంబం ప్రస్తుతం ఆమెకి ఒక వరం. ఆ ఇంట్లో మూడో క్లాసు చదివే తన మనవరాలి లాటి   చిలక ఒక్కతే ఇప్పుడామె కి ఆశ అయినా, ఆసరా అయినా. 

ఆ చిలక స్కూల్ నించి రావడం కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ‘మామ్మ గారూ.. మామ్మ గారూ’ అంటూ పిలిచే ప్రియమైన పిలుపు కోసం ఆమె  చెవులు రిక్కించి వింటుంది. 

అదీ ప్రస్తుతం ఆమె వున్న పరిస్థితి.

ఈ స్త్రీ పాత్ర ప్రత్యేకతలేమిటంటే  : 

అంత కదలలేని అసహాయ స్థితి లో కానీ, ఒంటరి తనంలో కానీ ఆమెతన వారినెవరినీ పల్లెత్తు మాట అనదు.  దూషించదు. దుర్భాషలాడదు.

 మరణానికి ముందు మనిషి తనని తాను లోతుగా విశ్లేషించుకుంటాడని అంటారు.    తాను నడిచొచ్చిన దారినంతా ఒక సారి పరిశీలించుకుని, అడుగులను తరచి చూసుకుంటాడు. నడతలోని లోపాలకు పశ్చాత్తాప పడతాడు.  తాను చేసిన మంచి పనులకు గర్వపడతాడు.   

ఈ కథలో ని మామ్మ గారూ అంతే. ఆమె మౌనంగా వ్యక్తపరిచే  భావాలు మన మనసుల్ని సున్నితం గా స్పృశిస్తాయి. ఆమె తలబోసుకునే అనుభవాలు మనల్ని   ఆకట్టుకుని, ఆలోచింపచేస్తాయి 

   చిలక చెప్పే కమ్మని మాటలు వింటూ,  ఆమె తన గతంలోకి వెళ్ళొస్తుంటారు. అలా ఆమె తన జీవ్తాన్ని పాఠకులతో పంచుకుంటారు.  

 ఒక చిన్న గదిలో మొదలైన కాపురం…అందులోనే సర్దుకున్న వైనం, ఆ తర్వాత రెండు గదులింట్లోకి మారినా, పిల్లల చదువులకయ్యే ఖర్చులతో బాటు వచ్చే పోయే చుట్టాలు, నెరవేర్చవలసిన బాధ్యతలు,  ఈ చేయీ ఆ చేయీ అనుకోకుండా బంధువలకు చేసిన సాయాలు, అన్నీ ఒక్క సారిగా ఆమె కళ్ళ ముందు మెదుల్తాయి. తాను సహాయపడిన వాళ్లంతా ఈ రోజు ఎక్కడా అని చూసుకుంటే ఎవ్వరూ కనిపించరు. అయినా ఆమె నిందించదు.

 తనని కాచుకునుండాల్సిన కన్న బిడ్డలని కూడా  పరుషమెత్తు మాట అనదు. నిందలు మోపదు. పరుల సానుభూతి కోసం తన వారి మీద చాడీలు చెప్పదు.

పైగా, చిత్రం గా – బిడ్డలని  వెనకేసుకొస్తారు . ‘పాపం, రెక్కలమ్ముకున్నారు. జీతాలొస్తేనే గా వాళ్ళయినా బ్రతికేది ‘ అని జాలిపడతారు.  ‘ఇద్దరూ చెరో వైపు దేశాల్లో వున్నారు. అవసరానికొకరు వచ్చి అన్నీ చూస్తున్నారు. వెళ్తున్నారు. వారి జీవన ధర్మం వారిది కదా పాపం ‘ అని వాపోతారు. ‘ ఎం తైనా అమ్మ అమ్మే ..అమ్మని మించిన దైవం వుంటుందా?’ అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనం  గా నిలుస్తుంది ఈ స్త్రీ మూర్తి. 

పై పెచ్చు –  తన గురించి తాను ఎలాటి దాపరికం లేకుండా  చెప్పుకుంటారు. ‘తను మాత్రం పెద్దవాళ్ళని ఏం చూసిందని? అంటూ తనని తాను విశ్లేషించుకుంటారు. ఆ కాలం లోనూ ఇదే సమస్య. పల్లెల నించి పట్నాలకొచ్చి అవస్థలు పడేవారు.  నగరం బ్రతుకులకు అ లవాటు పడిపోయేవారు. వృద్ధులు – వున్నవూరు వొదిలి రావనే వాళ్ళు. అలానే అక్కడే కన్ను మూసే వారు. ఎవరుండి సేవలు చేసారని? అప్పట్లో పల్లెల నించి పట్నాలకు వలస ఐతే ఇప్పుడు దేశాలు వీడి – విదేశాలకు పోయి బ్రతుకుతున్నారు.  అంతే తేడా. అంటారు . నిజమూ అంతే. కానీ ప్రాణాలు తోడుకుపోయే క్షణం లో సైతం ఆమె తన పరిస్థితికి చింతించక, సామాజిక ఆర్ధిక కారణాల ను ఆలోచించమనే – ఆ మనో నిబ్బరానికి ఆశ్చర్యమనిపిస్తుంది.  

ఏ దశలో కానీండీ, సమస్యలెదురైనప్పుడు స్త్రీ  తనని తాను సంబాళించుకోవడం నేర్చుకోమని పరోక్షం గా   చెబుతారు మామ్మ గారు. ఈ వ్యక్తిత్వాన్ని అలవరచుకునే ప్రయత్నం చేయడం ఈ నాటి  స్త్రీలకెంతైనా అవసరం.

మామ్మ గారికి చిలక పైని ఆశెందుకు? : 

ప్రేమకి మారుపేరే స్త్రీ. –  బాలిక దశ నించి బామ్మ వరకూ ఆమె కుటుంబంలో వారికి తన ప్రేమామృతాన్ని పంచి పెడుతూనే వుంటుంది.  స్త్రీ చివరి దశలో మరోసారి గాఢమైన ప్రేమలో పడేది ఎవరితో అంటే…మనవలు మనవరాళ్ళతో. కొడుకు పిల్లలైనా, కూతురి పిల్లలైనా ఎవరైనా ఆమెకి ప్రేమే.  సరిగ్గా ఆ పాత్రకి ప్రతిరూపాన్ని చూస్తాం ఈ మామ్మ గారిలో కూడా.

ఆమెకి చిలక అంటే ప్రాణం. ఆమె చెప్పే కబుర్లూ, టాబ్ లో చూపించే తన మనవరాలి ఫోటోలు, ఇంకా వాళ్ళింట్లో జరిగే  సంగతులు, స్కూల్లో అల్లర్లు, తను చేసిన సాహసాలు ప్రతాపాలూ అన్నీ ఆవిడ కళ్ళకి క్కట్టినట్టు ఆర్చుకుంటూ చెబుతుంది. అవి వింటం ఆవిడకు మహా ప్రీతి. ఆ చిట్టి తల్లి  ఆమె పాలిట తల్లి కూడా. తన చిన్ని చిన్ని చేతులతో నోటికందించే ప్రసాదమూ, తులసి టీ చుక్కలే ఆమె ప్రాణాలు నిలిపే అమృతాలు.   

ఆ రోజు..వైకుంఠ ఏకాదశి. రోజూలానే చిలక వచ్చి కబుర్లాడి ”అమ్మ కోప్పడుతుంది..మీకు టైం కి ఇవ్వకపోతే అంటూ..’   సేవలందిస్తుంది. కానీ చిలక చివరి ప్రశ్నకి మామ్మ గారు స్పందించారా? – అనేదే ఈ కథ కి కొసమెరుపు.

చిలకమ్మ ఎవరు?

అబ్బో పెద్ద వాగుడు కాయ. నాన్ స్టాప్ ‘పిల్ల బీబీసి.’ 🙂 ఇలాటి మనవరాలుంటే ఏ మామ్మ గారూ  అనారోగ్యం పాలు కారేమో అనిపించేంత ముద్దు గా, మురిపెంగావుంటుంది. 

‘ మామ్మ గారిని చూస్తుండు.’ అనే  అమ్మ మాటలని పట్టుకుని మామ్మ గారి దగ్గరున్నట్టే వుండి. అలా మళ్లా ఆటల్లొకి వెళ్లొస్తూ..అంతలోనే గిర్రున వెనక్కి తిరిగొచ్చి మామ్మ గారిని అరుచుకుంటూ, ఆ కబురూ ఈ కబురూ మోసుకొస్తూ.. చెవిలో ఊదేస్తూ..తాత గారి సెల్ ఫోన్ లోంచి వినొచ్చే భజగోవిందం శ్లోకాల గురించి చెబుతూ..ఎం ఎస్ సుబ్బులక్ష్మి  గాత్ర మాధుర్యాన్ని పొగిడేస్తొ.. ‘అరె, భలే వుంది ఈ చిలక ‘ అని ముచ్చటేస్తుంది.  

ఆడవాళ్ళకి మాట్లాడటం ఇష్టం. వస పోసినా పోయకున్నా.. పుట్టుకతోనే ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకుంటార న డానికి ఈ చిలకే సాక్ష్యం.  

ఈ చిట్టీ చిలక పెదనాపసాని లా, చిన్న పేరక్కలా  మాట్లాడటం చూస్తే ‘ ఔరా’ అనిపిస్తుంది. కానీ ఈ కాలం లో చిలక తల్లులకి తెలివితేటలు ఎక్కువే. ఆ అమాయక తెలివితేటలు, వింతైన కబుర్లూ ఏమిటో తెలుసుకోవాలంటే –  కథ చదివి తెలుసుకుంటేనే బావుంటుంది.

చిలక కి ఎన్ని తాపత్రయాలో! కొత్త బట్టలేసుకుని మామ్మ గారికి చూపించాలని తాపత్రయం.. అపార్ట్ మెంట్  లో కాపలా కాసే కుక్కకి పుట్టిన పిపిల్లల్ని తీసుకొచ్చి మామ్మ గారికి చూపించాలని తాపత్రయం..తాత గారి సెల్ లో అన్ని గేంస్ ఆడేయాలని తాపత్రయం..టాబ్ తెరిచి మామ్మ గారికి ఆవిడ మనవరాల్ని చూపించాలని తాపత్రయం..ఇంట్లో అమ్మా అమ్ముమ్మ చెప్పుకునే పెద్దమ్మ కూతురి వివరాలు అర్ధం కాకపోయినా వినాలని తాపత్రయం..ఇవన్నీ ఎప్పటికప్పుడు  మామ్మ గారికి చేరేయాలని తాపత్రయం. 

 ఇన్నీ గడ గడా  వాగేస్తూ కూడా చిలకకి ఎంతో అసంతృప్తి పడిపోతుంది. తనని ఇంటా బయటా ఎవరూ మాట్లాడనివ్వడం  లేదనీ, స్కూల్ లో టీచర్లు, ఇంట్లో పెద్దలు తన వాక్ స్వాతంత్రాన్ని తొక్కేస్తున్నారనీ వాపోతుంది. పాపం! 

చదవుతుంటే ఫక్కున నవ్వొస్తొంది చిలక ఆశకి. 

 అంత నిస్సత్తువ లోనూ   ఆవిడకి ఒకే ఒక్క బలం –  చిలక, ‘మామ్మ గారూ’ అని చనువుగా పిలిచే చిలక పిలుపు, ఆగకుండా చిలక చెప్పే కబుర్లు. 

కథ  ముగింపులో – చిలక  పెట్టిన గాబరా కేకకి – పాఠకుని మనసు ఉలిక్కిపడుతుంది. ఆ చిన్నదాని పెద్దరికానికి మనసు నీరౌతుంది. 

చిలకమ్మ తల్లి పాత్ర :

ఆ తల్లి కి ఇంట్లొ ఊపిరాడని పని.  మామ్మ గారి ని కనిపెట్టుకోడానికి సమయం చిక్కదు. పై అంతస్థు లో కదా వుండేది. అందుకని వండినవి  మామ్మ గారికి అందే బాధ్యతని చిలకకి పురమాయిస్తుంది. ఇంటికి చుట్టాలూ, తండ్రి రాక, మరో పక్కన అక్క గారింట్లో జరిగిన శుభకార్యానికెళ్లొచ్చిన అలసట,  అందులో ఆ రోజు వైకుంఠ ఏకాదశి.. 

ఇవన్నీ మనకి చిలక చెబితే నే తెలుస్తాయి. ఈ కథలో చిలక పెద్దమ్మ, పెద్దమ్మ కూతురు, చిలక స్నేహితురాళ్ళు –  కూడా ఆమె మాటల్లోనే మనకి పరిచయమౌతారు.   

 మా అమ్మ గారు ఎప్పుడూ అంటుండేవారు.  ‘ఒక్క మాట చాలు. పోయే ప్రాణాన్ని నిలిపేందుకు. 

చివరి దశలో ఒక్కరున్నా చాలు మన పక్కన.   తృప్తి గా కన్ను మూసేందుకు ‘ అని.

 ఈ కథా  రచయిత ‘విద్యార్ధి ‘ గారు సరిగ్గా ఈ మాటల భావాన్ని అందుకున్నారు అనిపించింది. 

*****

రచయిత గురించి :  విద్యార్ధి ! పేరులోనే వుంది చదివే తత్వం. మనుషుల్ని చదవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య లా అబ్బిందనిపిస్తుంది.  రచయిత సునిశితమైన పరిశీలనాత్మక దృష్టి కి నిదర్శనం గా నిలుస్తాయి – ఈ కథలోని ప్రధాన పాత్రలు. అవి స్త్రీ పాత్రలూ  కావడం మరో విశేషం. అందుకే ఈ కథని – కథలో నే చదివిన స్త్రీ పాత్రలు అనే శీర్షిక కోసం ఎంచుకోవడం జరిగింది. 

సహజం గా మగవాళ్లకి ఆడవాళ్ళని అర్ధం చేసుకోవడం కష్టమంటారు. 

కానీ ఈ రచయిత తనకిది చాలా సుసాధ్యం అని నిరూపించారు. 

  స్త్రీ  పాత్రలను సృష్టించడం  ఒక ఎత్తు ఐతే, పాత్రలో తాను జీవిస్తూ.. జీవింపచేయడం మరో ఎత్తు. కేవలం సాధనా శోధనల తో మాత్రమే అలవడుతుంది ఈ  విద్య.

ముఖ్యం గా స్త్రీ మనో భావాలను, ఆలోచనా ధోరణులనూ,  అలవాట్లను, ఆంతర్యాలను, మనసులోనిమాటలను..ఎంతో సహజం గా చిత్రీకరించ డం ఎంతైనా ప్రశంసనీయం. 

 రచయిత ఎంతటి సునిశితమైన పరిశీలన చేసారూ అంటే –  చిలక చెప్పే కబుర్లలో దొర్లే ఒక చిన్న సంఘటన అందుకు చిన్న ఉదాహరణ. అక్క  చీర చింపి పెద్దమ్మ తనకి లంగా కుట్టించిందట. ఇంట్లో వాళ్ళు ‘చిన్న పిల్లవి.  మా మాటలు నీకుందుకు? అవతలకు ఫో ..’ అంటారట.  

ప్రతి ఇంటా జరిగే ఈ సహజమైన సన్ని వేశాలు ఈ కథలో థళుక్కుమంటూ మెరుస్తాయి. చదువుతుంటే పాఠకుని పెదవి మీద విరిసే నవ్వులా!  మనసులో గుర్తుండిపోయే మంచి కథలా! 

కథలో హాస్యం,  కరుణ రసాలతో బాటు వేదాంత సారాంశాన్నీ నింపారు. 

భజ గోవిందం శ్లోకాలకి – మామ్మ గారి స్వగతానికి  ముడి వేస్తూ, చక్కని చిక్కని వివరణని, విశ్లేషణని అందించారు. 

కథలో ఒక నూతన ప్రయోగాన్ని ప్రవేశపెట్టారు. 

కథలో ఒక్క సారైనా మాట్లాడని మమ్మ గారు తన జీవితాన్ని మన ముందు పరుస్తుంది. ఎలా సాధ్యం?

చిలక తాత గారి ఆధ్యాత్మికత అంతా ఆయన్ని చూడకున్నా మామ్మ గారికి అర్ధమౌతుంది. ఎలా? 

కథని   ప్రయోగాత్మకం గా తీర్చిదిద్దడం లో రచయిత సఫలీకృతులయ్యారని చెప్పడం లో ఎలాటి సందేహమూ లేదు. 

సహజం గా కథ లో ఒక సందేశం వుంటుంది. ఈ కథలో రెండు సందేశాలున్నాయి.

ఒకటి – తమ తల్లితండ్రుల్ని  మామ్మ గారిలా ఒంటరిగా వదిలేయకూడదని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. 

రెండు – పరిస్థితుల కారణం గా ఒంటరిగా   పోరాడాల్సి వస్తే ధైర్యం గా పోరాడాలి.

 అయితే,  కథ చదివాక రీడర్ కి కలిగే అభిప్రాయమే తప్ప నిజానికి రచయిత ఏ సందేశాన్నీ సూచించరు.

 వెరసి  ఈ ‘కల’ ఒక వాస్తవానికి మెలకువ గా నిలిచింది.  కల కాని నిజాన్ని నిరూపించింది.   

రచయిత  ‘విద్యార్ధి ‘గారికి హృదయపూర్వక అభినందనలు.

కౌముది ఆన్ లైన్ మాస పత్రికలో వెలువడిన కథని పాఠకుల కోసం ఇక్కడ అందచేస్తున్నాను.  తప్పకచదివి, కథపై మీ విలువైన అభిప్రాయాలను రచయితకు తెలియచేయవలసిందిగా మనవి. 

వచ్చే  నెచ్చెలి లో మరో వినూత్న మైన  కథతో కలుసుకుంటాను.

అప్పటి దాకా సెలవ్.

******

కల

-విద్యార్థి

ధనా ధనా .. ఢమా ఢమా పరిగెత్తుకు వస్తున్న బూట్ల చప్పుడు. తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. 

అలసి, అలసి, ఎదురుచూస్తున్న పెద్దావిడ కనురెప్పలు  బరువుగా తెరుచుకున్నాయి. మంచం మీదనుండి కదల్లేకపోయారు. కనీసం తల కూడా తిప్పలేకపోయారు.

“మామ్మగారూ, మామ్మగారూ, స్కూల్ బెల్ కొట్టగానే పోటీ వేసుకుని పరిగెత్తుకొచ్చేసా. అందరి కంటే నా స్కూల్ బాగ్‌లో పుస్తకాలెక్కువ ఉంటాయి కదా, అందుకుని నా బాగ్‌ అందరి బాగ్‌‌లకన్నా బరువు ఎక్కువ కదా, అందుకని నేను గెలవలేదు. మెట్లు ఎక్కుతున్నప్పుడు స్కూల్ బాగ్‌ బరువు ఇంకా ఎక్కువ వుంటుంది గదా”, అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పేసి ఆయాసం తీర్చుకుంటోంది చిలక.

మూడవ తరగతి చదువుతోంది చిలక. రోజూ స్కూలుకి వెళ్లేటప్పుడు ఆగి పెద్దావిడకి రెండు కబుర్లు చెపుతుంది. స్కూలునుంచి రావటం రావటమే కబుర్లు మొదలు పెడుతుంది. అదో పలుకుల చిలక, వలపుల గిలక. చెప్పే కబుర్లన్నిటికీ అభినయం కలుపుతుంది. ఎన్ని సార్లు వారించినా అరమరికలేకుండా ఇంటి విషయాలు, స్కూలు విషయాలూ, ఇంకా ఏమైనా సరే చెప్పుకుంటూ పోతుంది. తుర్రుపిట్ట లాగా ఇట్లా వస్తుంది, అట్లా వెళ్తుంది.

“ఏం, ఇవాళ అన్నమేమీ తినలేదా మీరు? మంచి నీళ్లు కూడా తాగలేదే? అసలు మంచం మీద నుంచి లేచి కూర్చున్నారా? ఈ టీపాయ్‌ మీద మీకు కావల్సినవి అన్నీ పెట్టి మంచానికి దగ్గరగా ఈ టీపాయ్‌ని జరిపి వెళ్లానుగా స్కూలుకి వెళ్లేటప్పుడు?  అమ్మో, మిమ్మలని సాయంకాలం స్కూలునుంచి వచ్చేటప్పుడు ఎక్కువ విసింగచకుండా వెంటనే ఇంటికొచ్చేయమని చెప్పింది మా అమ్మ! ఇవాళ ముక్కోటి ఏకదశి, తొందరగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలని చెప్పింది. మళ్లీ కాసేపాగి వస్తా” అంటూ తుర్రుమంటూ వెళ్లింది.

తన పై అంతస్తు అపార్టుమెంటులో రెండు సంవత్సరాల క్రితం వచ్చిన కుటుంబం ఈ చిలక వాళ్లది. వచ్చినప్పటి నుంచి తనని రోజూ పలకరించేది ఈ చిలక ఒక్కటే.

వచ్చిన కొత్తలో, “ఏం, ఇంకా భోజనం ఎందుకు చెయ్యాలేదూ?” అని అడిగేది. సంవత్సరం క్రితం తనకి మంచం దిగే ఓపికలేకపోతే, తనే టిపాయ మంచం దగ్గరకి జరిపి, పళ్లెం, మంచి నీళ్లు అందేటట్లు పెట్టింది. మూడు నెలల క్రితం ఓపిక కూడ దీసుకుని బాత్రూంకి ళ్లే తొందరలో తూలి శోష వచ్చి పడితే, ఎప్పుడు చూసిందో ఏమో, వాళ్ల అమ్మా నాన్నని పిలిచి ఆసుపత్రిలో చేర్పించింది.  ఆ ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి మంచం మీద వెల్లకిలా పడుకుని పైన తిరుగుతున్న ఫ్యానునీ, ఇంటి కప్పునీ చూస్తూ బందీగా ఉండటమే అయ్యింది.

రెక్కలు వచ్చిన తన పిల్లలు ఒకరు అటు వైపు దేశానికి, ఇంకొకరు ఇటు ప్రక్క దేశానికి ఎగిరి వెళ్లారు. వాళ్లకి చదువులు చెప్పించి, ప్రయోజకులని చేసి, వాళ్లు ఆ దేశాలకి వెళితే సంతోషించింది తనే కదా? మంచి పిల్లలు, ఒకరి తరవాత ఒకళ్లు వచ్చి తనని ఆసుపత్రిలోనూ, ఇంటికి వచ్చిన తరువాతా ఎంతో బాగా చూసుకున్నారు. వాళ్ల వాళ్ల కుటుంబాలని చూసుకోవటానికి, వాళ్ల ఉద్యోగాల కోసం తిరిగి వెళ్లారు. ఎవరి జీవత ధర్మం వాళ్లది.

తను మాత్రం తన అమ్మ నాన్నలను కానీ, అత్త మామలనికానీ ఎంత కాలం ఉండి చూసుకోగలిగింది? ఇదివరకటి కాలంలో తనూ, తన పెనిమిటితో కలసి సొంత ఊరు వదిలి ఉద్యోగ ధర్మమా అంటూ వేరే పట్టణంలో కాపురం పెట్టారు. రోజులు మారి ఈ కాలానికి రెక్కలు వచ్చిన పిల్లలు పట్టణాలు కూడా వదిలి వేరే దేశాలలో కాపురాలు పెట్టారు. తమ పెద్దవాళ్ల పరిస్థితి  ఆరోజులలో ఎంతో, ఈ రోజుకి తన పరిస్థితి కూడా అంతే. ముందు వాళ్లు, ఇప్పుడు తన వంతు.

ఇంతలో చిలక మళ్లీ వచ్చింది. “మామ్మగారూ, మా తాతయ్య వాళ్లు వచ్చారు. ఆయన సెల్ ఫోన్ తెచ్చుకున్నా, గేంస్ ఆడుకోవడానికి. మా తాత … సర్లే సర్లే, ‘మా తాతగారు’ అని అంటా, కోప్పడమాకండే! మా తాతయ్య సెల్ ఫోన్లో అన్నీ భక్తి పాటలే, ఆయనకు ఈ ఫోన్ పూర్తిగా దండగ, ఎన్ని గేంస్ ఉంటాయో ఆడుకోటానికి. నిమిషానికి ఒకళ్లు ఆయనకి ఫోన్ చేస్తారు, అదేమో రింగ్ టోన్ బదులు ఏదో భక్తి పాట మోగుతుంది. వినీ, వినీ విసుగొచ్చేస్తుంది. మా అమ్మ ఇంకొంచెం సేపు ఆడుకుని రమ్మంది, ఫోన్ మోగగానే వెంటనే రమ్మంది”

ఫొన్ మోగింది. రింగ్ టోన్‌లోని పాట వినిపించసాగింది 

“స్థాపకాయ చ ధర్మస్య, 

సర్వ ధర్మ స్వరూపిణే, 

అవతార వరిష్ఠాయ  

రామక్రిష్ణాయ తె నమః”  

“ఊ, అమ్మా, ఇప్పుడేగా నేను వచ్చింది, ఇంకొంచెం సేపు ఆగి, ఆడుకుని వస్తా. సర్లే, ఈ సారి పిలవగానే వస్తా. అలాగే, మామ్మగారిని విసిగించను” అని ఫోన్లో చెప్పింది చిలక.

“మామ్మగారు ఫోన్లో వచ్చిందే, ఆ పాటకు అర్థం తెలీదుగానీ, నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. ఎవరో సుబ్బులక్ష్మి అంట పాడింది. అదేం పేరో?  హి, హి, హి. ఇంటి పేరు ఎంఎస్ అంట. అలా అయితే బాగానే ఉంటుందిలే! మా తాత అయితే, సర్లే, సర్లే .. మా తాతగారు అయితే ఆవిడ గాత్రంలో దైవత్వం ఉంటుందంటాడు. అంటే ఏమిటో? నాకు అసలు అర్థం కాదు బాబూ!!! సర్లే, క్రిందకి వెళ్లి మా ఫ్రెండ్స్‌తో  ఆడుకుని వస్తాను”.

మామ్మగారికి కను రెప్పలు బరువెక్కి, మగతగా మూసుకున్నాయి. కళ్లలో తన పిల్లలు అదే వయసులో కనబడ్డారు. సంసారం అంతా ఒక్క గదిలో ఉండేది. అంతకంటే తాహతులేని రోజులు. ఒక వస్తువు తియ్యబోతే పది వస్తువులు సర్దాల్సి వచ్చేది. అక్కడే వంట, అక్కడే పడక. తన పిల్లలు అక్కడే ఒక మూల కూర్చుని చదువుకొనేవారు. తను ఎంత కఠినంగా వుండి చదివించిందీ??? పాపం పిల్లలు ఎలా భరించేవారో? ఆ పిల్లలే, తన ఒక్క దాని కోసం మూడు పడక గదుల అపార్టుమెంట్  కొని పెట్టారు. ఇప్పుడు ఇన్ని గదుల ఇంట్లో ఉండే తను, ఒక గదిలో బందీ. తన పిల్లలని చదువు, చదువూ అని ఆ రోజులలో అంత కఠినంగా ఉన్నందుకు, ఇప్పుడు గుండెలలో వేదన ఎంతో పెరిగిపోయింది మామ్మగారికి, 

ఇంతలో చిలక తన స్నేహితులతో పరిగెత్తుకు వచ్చింది. ఒక్క సారిగా తన పిల్లలు తనకు ఇచ్చిన ఐపాడ్‌ను  అందుకున్నారు. పిల్లలు అన్నిటిమీద చేతులు వేస్తూంటే తనకి మహా చిరాకు. అయితేనేం, ఈ చిలక లేకపోతే తనకి ఐపాడ్ వాడటం చేతకాదు. 

“మామ్మగారు, మామ్మగారు, ఫేస్‌బుక్కులో మీ మనవరాలి కాలేజీ గ్రాడ్యువేషన్ ఫొటోలంట, అందరూ ఉన్నారు చూడండి”, మామ్మగారు బరువుగా కళ్లు తెరుచుకుని తన సంతానాన్ని  అంతా మురిపెంగా చూసుకున్నారు. గబగబా ఫొటోలు మార్చి తన కొడుకు కుటుంబాన్ని, కూతురు కుటుంబాన్ని చూపించింది చిలక. మిగతా పిల్లలతో ఇప్పుడు మనం “కుక్క పిల్లల గురించి చూద్దాం” అని అన్నది.

ఇంతలో ఫోన్ మోగింది, రింగ్‌టోన్ పాట వినిపించసాగింది.

“భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే  

నహి నహి రక్షతి డుకృణ్ కరణే 

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే”  

“ఆ అమ్మా, ఇంకొంచెం సేపు ఆడుకుని వస్తా, ఆ తొందరగానే వచ్చేస్తా” అని ఫోన్ పెట్టేసింది.

“మామ్మగారు, ఈ పాట నేర్చుకుంటే ఇంకా గ్రామరు చదువుకోవాల్సిన అవసరం లేదని మా మామయ్య చెప్పాడు. అమ్మేమో నేర్చుకోకపోతే ఊరుకోదు. ఇప్పుడే వస్తా” అంటూ తన స్నేహితులతో కలసి తుర్రుమన్నది చిలక.

మామ్మగారికి కళ్లలో తన పిల్లల పసితనం గిర్రున తిరిగింది. అవును, బడికి వెళ్లే పిల్లలని తను ఎంత జాగ్రత్తగా కాపాడిందీ? తన భర్త ఉద్యోగ రీత్యా టూర్లలో తిరుగుతూవుంటే తనే ఒంటరిగా పిల్లలని చదివిస్తూ కాలం గడిపింది. దగ్గర కూర్చుని వాళ్లకి తెలుగు వ్యాకరణం నేర్పింది, లెక్కలు నేర్పింది అన్ని రకాల పాఠాలూ వీలయినంతవరకూ తను నేర్చుకుని వాళ్లకి నేర్పింది. ఒక్కొక్కసారి ఎంత కఠినంగా వ్యవహరించిందీ? పిల్లలని అంత హింసించటం అవసరమా? అది తలుచుకుంటే కళ్లలో బాధ తొంగిచూసింది. అయితేనేం, పిల్లలు ప్రయోజకులయ్యారు. తన క్రమశిక్షణ కొలిమిలిలో విద్యాబుద్దులతో తీర్చిదిద్దిన ఉక్కు శిల్పాలు తన పిల్లలు. వాళ్ల ఎదుగుదల, సౌభాగ్యంతో తన మనసు నిండుగా ఉన్నది. ఇంతకంటే తల్లికి ఏమి కావాలి? గర్వ పడ్డారు మామ్మగారు.

ఇంతలోనే మళ్లీ వచ్చింది చిలక.  “మామ్మగారూ, మామ్మగారూ, మన అపార్ట్‌మెంట్ క్రింద ఇస్త్రీ బండి వాచ్‌మాన్ ఉన్నాడే, ఆ వాచ్‌మాన్‌కి కుక్క ఉంటుందే, దానికి ఏడు పిల్లలు పుట్టాయి. మూడేమో నల్ల కుక్కపిల్లలు, వాటికి తెల్ల మచ్చలున్నాయి. మూడేమో తెల్ల కుక్కపిల్లలు, వాటికి నల్ల మచ్చలు. ఒకటేమో నలుపు మీద తెల్ల మచ్చలా, లేకపోతే తెలుపు మీద నల్ల మచ్చలో అర్థం కావటం లేదు. మీకు తీసుకొచ్చి చూపిస్తామంటే వాచ్‌మాన్ కోపడ్డాడు” అని బిక్క మొహం పెట్టింది చిలక.

ఇంతలో ఫోన్ రింగ్‌టోన్ మోగి పాట వినపడసాగింది.

“యావద్విత్తోపార్జన సక్తః 

తావన్నిజ పరివారో రక్తః

పశ్చాజీవతి జర్జర దేహే 

వార్తాం కోపి న పృచ్చతి గేహే

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే”

“ఆ అమ్మా, వచ్చేస్తున్నా, గుర్తుంది, గుర్తుంది, ఇవాళ ముక్కోటి ఏకదశి పండగని. వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా, వచ్చి స్నానం చేస్తాలే” అని ఫోన్ పెట్టేసింది. 

“మామ్మగారు, మామ్మగారు, మేము తిరుపతి వెళ్లినప్పుడు కోతి పిల్లలని కూడా చూశాం.  బోలెడు కోతులున్నాయి. అవి అన్నీ భలే కలిసి ఉంటున్నాయిలే, అన్నీ చుట్టాలేమో!  మొన్నటిసారి తిరుపతి వెళ్లినప్పుడు కాదు, మా అమ్మా నాన్నగారూ అప్పుడు వారం రోజులుగా మాట్లాడుకోలేదని చెప్పాను కదా, గుర్తుందా? అప్పుడు మా పెద పెద్దమ్మ వాళ్ల పెద్ద అక్కయ్య పెళ్లికి తరవాత అందరమూ కలిసి తిరుపతి వెళ్లామే, అప్పుడన్నమాట. మేము కూడా అందరం కలిసి వెళ్లాం కదా, భలే ఆడుకున్నాంలే! పిల్లలందరం రైలులో అస్సలంటే అస్సలు   పొడుకోలేదు. ఈ బెర్త్ మీద నుంచి ఆ బెర్త్ మీదకీ ఎక్కుతూ దిగుతూ భలే ఆడుకున్నాంలే. మేము పిల్లలందరూ అలా ఆడుకుంటూ ఉంటే, సంబంధాల తాతగారేమో ఆయనని నిద్రపోనివ్వటంలేదని, మమ్మల్ని, అంటే పిల్లలందరినీ బోలెడు కోప్పడ్డారు. సంబంధాల తాతగారెవరంటే మా పెద పెద్దమ్మ వాళ్ల పెద్దక్కయ పెళ్లి ఫొటో ఆల్బం మీకు చూపించినప్పుడు, చివరిలో భోజనాల ఫొటోలలోనోరు బార్లా తెరిచి, నాలుక బయట పెట్టి పెద్ద పెద్ద ముద్దలు తింటున్నారే, ఆ తాతగారు అన్న మాట. ఇప్పుడేమో ఆయన మా పెద పెద్దమ్మ వాళ్ల చిన్నక్కయ ఫొటోలూ, చిన్న పెద్దమ్మ వాళ్ల పెద్దక్కయ్య ఫొటోలు పట్టుకు తిరుగుతూ ఉంటారు. నాకు ఆయనంటే చాలా కోపం.  అయినాసరే, భలే ఆడుకున్నాం. సర్లే, మా అమ్మ ఇంకోసారి ఫోన్ చేసిందంటే తెగ కోప్పడుతుంది” అంటూ తుర్రుమంటూ వెళ్లింది చిలక. 

మామ్మగారికి గతం మళ్లీ కళ్లలో కనబడింది. పిల్లలు హైస్కూలుకి వచ్చేటప్పటికి రెండు గదుల ఇంటిలోకి మారే స్తోమత వచ్చింది. దానికి సరిపడా బంధువులందరూ పట్టణంలో అవసరాలు తీర్చుకోవటం కోసం చేరటం మొదలుపెట్టారు. మళ్లీ అదే ఇరుకు. తన పిల్లలకు చేసిన కూరలు వేళకాని వేళకు వచ్చే బంధువులకు పెట్టటంతో సరిపొయేది. ఎప్పుడన్నా రూపాయి పొదుపుచేసి దాచుకోగలిగితే, తన పిల్లలకి ఖర్చు పెట్టే లోపల కష్టం చెప్పుకునే బంధువులు వచ్చేవారు. ఎంతమందిని ఆదుకోగలిగిందీ? ఆసుపత్రి అవసరాలకోసం వచ్చేవాళ్లూ, వ్యవసాయం పనిముట్లకి రూపాయి తగ్గింది తరువాత ఇస్తామని తీసుకున్నవాళ్లూ, వాళ్ల పిల్లలకి పుస్తకాలు కొనటానికి రుపాయి తక్కువయ్యిందనే వాళ్లూ, ఇలా ఎంత మంది అవసరాలు  తీర్చింది తను?. ఏరి, ఏమయ్యారు వాళ్లందరూ? తన తోబుట్టువల పిల్లలకి, ఆడపడుచుల  పిల్లలకి చదువు చెప్పించింది తనే కదా? అయినా ఇంకొకరికి ఉపయోగపడ్డామని, వారు మనలని గుర్తుంచుకోవాలని అనుకోవటం ఎందుకు? వాళ్లు కూడా ఇంకొకరికి సాయం చేసినవాళ్లేనేమో? అవును, తన కుటుంబం వాళ్లకే కాదు,  ఎంతమందికో తన చేతితో అన్నం వడ్డించింది,  తన చేతితో ఓదార్చింది, ప్రతిఫలం ఆశించకుండా తన చేతితో సాయం అందించింది. కానీ తన చెయ్యి ఇంకొకరి చేతి క్రింద ఎప్పుడూ పెట్టలేదు. అదే సంతృప్తి, అదే ఒక  సాఫల్యం. 

ఇంతలో చిలక మళ్లీ వచ్చింది. “మామ్మగారూ, మామ్మగారూ, స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని మీకు చూపించుదామని వచ్చా. నెమలి ఫించం బట్టలు,  బాగున్నాయా? అంటూ పట్టు పరికిణీని రెండు చేతులతో పైకి పట్టుకుని, తల ఆడిస్తూ  మూడు సార్లు  గిర గిరా తిరిగింది వలపులగిలక. మామ్మగారు అతి కష్టం మీద కళ్లు తెరిచి చూసారు. ఎంత అందమైన దృశ్యం, చక్కని చుక్క. మామ్మగారు రెప రెపలాడే కను రెప్పలతోనే గిర్రున తిరుగుతున్న ఆ వలపులగిలకని దీవించారు.

ఇంతలో ఫోన్ రింగ్‌టోన్‌లో మళ్లీ పాట వినబడ సాగింది.

సుర మందిర తరు మూల నివాసః

శయ్యా భూతలమజినం వాసః |

సర్వ పరిగ్రహ భోగ త్యాగః 

కస్య సుఖం న కరోతి విరాగః

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే”

“ఆ, అమ్మా వచ్చేస్తున్నా. ఏంటీ? మామ్మగారు మధ్యాహ్నం అన్నమా? ఏమీ తినలేదు. అట్లాగే ఉంది. సర్లే, వచ్చి ప్రసాదం తీసుకువస్తా, సర్లే, సర్లే, చీకటి పడితే పడింది, నాకేమీ భయం లేదు” అని ఫోన్ పెట్టేసింది.

“మామ్మగారు, మామ్మగారూ, మా పెద పెద్దమ్మ వాళ్ల పెద్దక్కయ్యకు పెళ్లి అయ్యిందే, ఆ అక్కయ్య కట్టుకోను పొమ్మంటూ విసిరికొట్టిందని చెప్పానే, ఆ చీర చించి మా చిన్న పెద్దమ్మ వాళ్ల చిన్నక్కయ్యకూ, నాకూ కుట్టించింది మా అమ్మమ్మ. మా పెద్దక్కయ్య ఎందుకు విసిరికొట్టిందంటే, మీకు అంతకు ముందు చెప్పాను కదా, పెళ్లయిన తరువాత మా పెద్ద అక్కయ్య పొడుకునే మంచం మీద మా బావగారు పొడుకుంటే ఆ మంచం విరిగి పోయింది అని, అప్పుడన్నమాట. మంచం విరిగిపోయిన రెండు రోజుల తరువాత  మా తాతగారు నన్ను తీసుకువెళితే మా పెద పెద్దమ్మ వాళ్లింటికి వెళ్లాను. అప్పుడు మా బావగారికి మా పెద పెద్దమ్మ నేతి గారెలు, లడ్డూలూ చేసి పెట్టింది. మా బావగారు నేతి గారెలు, లడ్డూలూ తింటూంటే మా చిన్నక్కయ్యేమో నన్ను పక్క గదిలో కూర్చోబెట్టి సంగీతంలో గీతం నేర్పుతానని చెప్పి, “లంబోదర లడ్లు మెక్కరా” అని గట్టిగా పాడించింది. అప్పుడేమో మా పెద పెద్దమ్మ వచ్చి మా చిన్నక్కయను చీపురు తిరగేసి కొడుతుంటే, చిన్నక్కయ్య పడి పడి నవ్వింది. నాకేమో మొట్టికాయలు పడ్డాయి. భోలెడు ఏడ్చేశాను. అప్పుడేమో పెద్దక్కయ్య చీర విసిరి కొట్టింది. నాకయితే అసలేమీ అర్థం కాలేదు. ఆ చీరే, చించి, కుట్టించారు.  మా పెద పెద్దమ్మ నాకు ఒక్కటి కూడా నేతి గారె కానీ, లడ్డూ కానీ  పెట్టలేదు. సర్లే, మా అమ్మ మళ్లీ పిలిచే లోపల వెళ్లి వస్తా” అంటూ తుర్రు మంది చిలక.

మామ్మగారికి మళ్లీ గతం కనబడింది. పిల్లలలు కాలేజీ చదువుకొచ్చేటప్పటికి ఫీజులు కట్టలేకపోవటం గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తమ పెద్ద వాళ్లకి వచ్చిన ఆరోగ్య సమస్యలు. ఈ ఖర్చులన్నీ తట్టుకోవటానికి భార్యా భర్తలిద్దరూ పడిన కష్టాలు ఒకటి అని చెప్పుకోవటానికీ, ఆ రోజులలో అది కష్టం అని తలుచుకునే సమయం కూడా లేకపోయింది. తమ కుటుంబంలో ఏ ఒక్కరికీ సరి అయిన బట్టలు వుండేవి కావు, పచ్చడి అన్నం తప్ప కూర అన్నం ఉండేది కాదు. కానీ భాధ్యతలు ఎప్పుడూ మరవలేదు, అన్నీ గుట్టుగా జరుపుకున్న సంసారం తనది. సుఖదుఃఖాలు అనేవి పూర్తిగా మన ఆలోచనా రీతులలోనే ఉంటాయేమో? జీవన స్రవంతిలోని ఒడిదుడుకులు తట్టుకుని ముందుకు సాగటమే సుఖం. అప్పుడే ఆ నాటి కష్టాలు నేటికి విజయాలుగా మారుతాయి. పూర్తిగా సంతృప్తి పడ్డారు మామ్మగారు.

ఇంతలో చిలక మళ్లీ వచ్చింది. “మామ్మగారూ, మామ్మగారూ, మీరేమీ మధ్యాహ్నం తినలేదని మా అమ్మ లెమన్ టీ, చక్కెర పొంగలి ఇచ్చింది. లెమన్ టీ ఏమో మా అమ్మ చేసింది. మా అమ్మవన్నీ టీవీ వంటలే. ఆ టీవీ వంటలు తింటుంటే బొజ్జ గోవిందమే!. మా అమ్మమ్మ చేసినవయితే చాలా బాగుంటాయి.  ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా, మా అమ్మమ్మ చక్కెర పొంగలి చేసి, తాతగారు అమ్మమ్మ గుళ్లో నైవేద్యం పెట్టి, మా ఇంటికి తీసుకుని వచ్చారు. మీకు కూడా పెట్టమని మా అమ్మ ఇచ్చింది. టీ ఇప్పుడు తాగుతారా, చల్ల బడిన తరువాత తాగుతారా? మీ తులసి మొక్కలోనుంచి మూడు ఆకులు వేస్తే తులసి టీ అవుతుందంట. వేస్తాను” అని గభాలున బాల్కనీలోకి పరిగెత్తి, మూడు తులసి ఆకులు కోసుకుని వచ్చి  టీలో వేసింది. మామ్మగారు ఏమీ పలకలేదు. 

“సర్లే, నేనే స్పూనుతో ఇస్తాను” అంటూ చక్కర పొంగలి ఒక స్పూనుతో తినిపించబోయింది. మామ్మగారు వణుకుతున్న పెదాలతో కొంచెం ప్రసాదం చప్పరించారు. 

“మంచి నీళ్లు కావాలా? పోనీ, ఊది ఊది టీ ఇస్తానులే ” అంటూ తులసి టీ మూడు స్పూనులు తాగించింది.

ఇంతలో మళ్లీ ఫోన్ రింగ్‌టోన్ మోగింది. “మామ్మగారు, మామ్మగారు, మీరేమీ మాట్లడకుండా ఇక్కడ వినండే, ఇక్కడ భలే పాడుతుంది “తస్య యమేవ న చర్చా” అంటూ, అంటే నాకేమీ అర్థం కాదు, కానీ భలే పాడుతుందిలే” అంటూ కళ్లు చారెడేసి చేసి, చేతులు పక్కకి పెట్టి, తల అటూ ఇటూ ఊపుతూ అభినయం చేసింది చిలక.

భగవద్గీతా కించిదధీత

గంగా జలలవ కణికాపీతా |

సకృదపి యేన మురారి సమర్చా 

క్రియతే తస్య యమేవ న చర్చ

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే”

“ఆ అమ్మా, వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా. ఆ( .. హోంవర్క్ ఏమీ లేదులే. సర్లే వస్తున్నా” అంటూ తుర్రుమంది చిలక.

మామ్మగారికి ఆలోచనలు కొనసాగినవి. పిల్లలు పై చదువులకు వచ్చేనాటికి తన భర్త అనారోగ్యం, అస్తమయం. నిస్సహాయత, నిస్పృహలతో కూడిన ఆర్ధిక సమస్యలు. తన భర్త సాయం అందుకున్నవారెవరూ కనబడని రోజులు. ఊరు అనుకోవటానికి లేకుండా ఎక్కడో ఊరి పొలిమేరలలో అద్దె తక్కువని తీసుకున్న ఒంటరి ఇంటిలో ఉన్న రోజులు. రోహిణీ కార్తె ఎండలు. మధ్యాహ్నం తను మజ్జిగ అన్నం తినబోయే సమయానికి తలుపు బయట నుండి “దాహం దాహం” అంటూ పిలిచిన నీరసపు కేకలు. భయపడుతూనే తలుపు తీస్తే, ఎవరో ఒక బిచ్చగాడు, జంగం ఏమో? దాహం దాహం అంటూ మళ్లీ అడిగితే, మంచి నీళ్లు ఇస్తే, “భగవతీ, గంగా జలం పోసి దాహం తీర్చావు” అని అన్నాడు. ఆశ్చర్యం, ఆ రోజులలో తమ లేమితనాన్ని చూసి చులకన చేసినవాళ్లే కానీ, తనని ఒక మనిషిగా చూచి గౌరవించిన వాళ్లు ఎవరూ లేరు. తనకోసం ఉంచుకున్న కొంచం అన్నం మజ్జిగ నీళ్లు, ఆ జోగికి ఇచ్చింది. ఎండ తగ్గిన తరువాత ఆ జోగి వెళుతూ, “భగవతీ, ధైర్యలక్ష్మి నీ వెన్నంటే ఉండుగాక. ధైర్యలక్ష్మిని నీవు నిలుపుకోగలిగితే, అన్ని లక్ష్ములు నీ ఇంట చేరుతాయి.” అని చెప్పి వెళ్లాడు. తను చేసిన పని ఏమిటి? ఎవరో తెలియని మనిషికి కొంచెం దాహం తీర్చింది. నిష్కామ క్రియ. ఎక్కువ చదువుకోక పోయినా భగవద్గీత సారాంశం ఇదేనేమో?  ఆ జోగి దీవించబట్టే తను ఎప్పటికీ ధైర్యం కోల్పోలేదేమో? జీవితంలో నాకు నేను సాధించాను అని అనుకోవటంకంటే, ఎందరివో దీవెనలు మనని వెన్నంటి నడిపించి గమ్యం చేర్చుతాయి. అందరూ గురువులే.  అందరికీ మనస్సులోనే నమస్కరించింది.  

ఇంతలో చిలక మళ్లీ వచ్చింది. “మామ్మగారూ, మామ్మగారూ, పైన అందరూ కలసి ఏదో ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను ఏమిటో చెప్పమని అడిగితే, చిన్న పిల్లవు, నీకిన్ని ఆరాలెందుకు? ఇప్పుడు విసిగించమాకు, చిన్నపిల్లవు నీకు ఈ విషయాలన్నీ ఎందుకు అంటూ ఏమీ చెప్పరు. కానీ, నాకు అన్నీ తెలుసు. మామ్మగారికి రాత్రి భోజనానికి కొంత చారు అన్నము, పెరుగన్నమూ కలిపాను, ఇదిగో తీసుకు ఫో అని పంపించింది మా అమ్మ” అంటూ టీ పాయ మీద రెండు గిన్నెలు పెట్టింది చిలక.

“మామ్మగారూ, మామ్మగారూ, మా ఇంట్లోనేమో నన్ను మాట్లడనివ్వరు, స్కూలుకి వెళితేనేమో అక్కడ ఎంత సేపూ సైలెన్స్ సైలెన్స్ అంటూ టీచర్లు అరుస్తారు. మీరొక్కళే నన్ను మాట్లాడనిచ్చేది. మొన్న స్కూల్లో మా లెక్కల టీచరయితే నన్ను బాగా కోప్పడింది, ఎక్కువ మార్కులొచ్చినంత మాత్రాన సరిపోదు, క్లాసులో మాట్లడకూడదు అని. ఈ సంవత్సరం తరువాత రిటైరైయిపోతుందిలే. మేం పిల్లలమంతా ఆ టీచరుని గుర్ఖా టీచారని పిలుస్తాం. ఎందుకంటే, ఆవిడకి మద్యాహ్నం క్లాసులేవి ఉండవు. మద్యాహ్నం స్టాఫ్ రూంలో వాలు కుర్చీలో పొడుకుని గురక పెడుతుంది. నిద్రపోతూ నోటితో గాలి పీల్చేటప్పుడు గుర్‌ర్‌ర్ అంటుంది. గాలి వదిలేటప్పుడు మాత్రం ఒక్కసారిగా ఖా అంటుంది. అందుకే గుర్ఖా టీచరనమాట. మాకెవరికీ ఆ టీచరంటే ఇష్టం లేదు. మా క్లాస్ టీచరయితే ఎవరినీ కోప్పడదు, అందుకే మాకందరికీ ఇష్టం”

ఇంతలో ఫోన్ రింగ్‌టోన్ మాళ్లీ మోగింది.  

“గురుచరణా౦బుజ నిర్భర భక్తః

సంసారాదచిరార్భవ ముక్తః |

సేంద్రియమానస నియమాదేవం

ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే” 

మామ్మగారికి తనకు కలుగుతున్న ఆలోచనల మీద ఆలోచన వచ్చింది. జరిగినది, కనపడినది తన లోచనములకా? లేక ఆ లోచనములను నియంత్రిస్తున్న మనసుకా?  మరి ఏవి తన ఆలోచనలు, ఏవి తన అనుభూతులు? అన్నీ ఒక అనంతమైన కలలోని భాగాలేమో? మరి తనకున్న అనుబంధాలు, తన విజయాలూ అన్నీ కూడా ఈ అనంతమైన కలలోని భాగాలా? అనుబంధాలు లేకపోతే ఆలోచనలు కూడా ఉండావు, మరి ఈ అనుబంధాల పొగమంచు తొలగిన సత్యమేది? 

గతం అంతా ఒక కల లాగా అనిపించింది. ఇది ఒక తియ్యటి కల. ఈ ఆలోచనలు కూడా జీవుడు చేస్తున్న సత్యాన్వేషణలో భాగమైన కలలేమో?  మరి ఈ కలలలోని కష్టసుఖాలు అనంతములోని శీతోష్ణముల వంటివా?

మామ్మగారి ఆలోచనలు ఆగినవి. ఒక నిశ్వాసతో తనకు ఉన్న కోరికలూ, అనుబంధాలు విడిచిపెట్టారు. మనసులో వున్న సంకల్పాలు విడివడ్డాయి. అనంతములోని అంతులేని ఆనందంతో మనస్సు నిండింది. కైవల్యం. 

ఇంతలో ఫోన్ రింగ్‌టోన్ మళ్లీ మోగింది. 

“భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ ……………..”

కలవరిస్తున్న మామ్మగారి పెదవులు వంత పాడాయి.

“ఆ అమ్మా, మామ్మగారు ఇంకా ఏమీ తినలేదు. మామ్మగారూ, మామ్మగారూ, ఈ చారన్నం కొంచెం తింటారా, లేకపోతే పెరుగన్నం తింటారా? నిద్రపోతున్నారా? ఇంత తొందరగా రాత్రివేళ నిద్ర పోరుగా మీరు? ఆ(, అమ్మా, మీరే క్రిందకు తొందరగా తొందరగా రండి. మామ్మగారు ఏమీ తినటంలేదూ, ఏదో కలవరించారు”,  పలికింది చిలక.

[కౌముది -డిసెంబర్, 2018]

***

రచయిత విద్యార్థి స్వీయ పరిచయం:

నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం.  గత 25 సంవత్సరాలుగా కాలీఫోర్నియాలో హర్డ్‌వేర్ ఇంజినీరు వృత్తి. ప్రవృత్తి ఫలసాయం.

శాన్ హోసేలోని వీక్షణం సమావేశంలోని మిత్రుల స్ఫూర్తితో కథలు వ్రాయటం మొదలుపెట్టాను. కథలు వ్రాయటమంటే అభిప్రాయాలు పంచుకోవటమని అనుకుంటాను. కథల ద్వారా చెప్పే నా అభిప్రాయాలు 1. స్త్రీ అభ్యుదం, విజయం 2. మూఢ నమ్మకాలు, దురలవాట్లు  3. నేటి సంసారంలోని సరిగమలు.

స్త్రీ విజయమంటే ఏమిటి? ఒక కుటుంబాన్ని నిస్వార్థంగా నడుపుకొచ్చి, తన పిల్లలను ఉన్నతులని చేసి, ఆఖరి క్షణం వరకు అందరి మంచి కోరుకుంటుంది. ఆ స్త్రీ మూర్తులు అందరూ జీవితంలో విజయాన్ని చూసినవారే.  

“కల” కథ చెప్పటంలో నా ప్రయత్నం – విదేశాలలో పిల్లలు ఉండటం, తల్లి దండ్రులు ఒంటరులై  భారత దేశంలోనే ఉండిపోవటం జరుగుతున్న కాలం ఇది. మరి ఆ ఒంటరి అమ్మల ఆలోచనలు ఏమిటి? వారి దైనందిన జీవితంలో  ఉండి రోజూ పలకరించేవారెవరు? ఈ ఇతివృత్తంతో వ్రాసిన కథ “కల”.

ఈ కథలో నేను చేసిన ప్రయత్నాలు – ఒకే కథలో మూడు కథలు చెప్పటం  (ప్రస్తుత సన్ని వేశం, రెండు ఫ్లాష్‌బాక్‌లు”. “భజ గోవిందం” కి నాకు తెలిసినంతలో, కథా  రూపంలో వివరణ ఇవ్వటం.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.