చైత్రపు అతిథి (కవిత)

 విజయ దుర్గ తాడినాడ

కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా!

ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!!

మానుల రెమ్మల దాగితివందున,

 కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !! 

కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో,

మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే !!

చైత్రపు అతిథిగ ఆహ్వానిద్దునా,

ఆదరముగ చూత చివురులు సిద్ధమాయే !!

గ్రీష్మ తాపపు భగభగలు, చేదువగరుల చిరచిరలు

మేమున్నామని గుర్తించమనీ నీ వెంటే ఏతెంచునాయే !!

వగరుల చిగురులు తిందువు ‘ఛీ ఛీ’ అందున,

నీ మధుర గానము గంధర్వమెనాయే  !!

మమతల చల్లని తల్లిని, అలకల అల్లరి చెల్లిని

మరిపించెడి మురిపెపు నీ రాగం మా ఎద సుస్థిరమాయే !!

జీవితమంటే కష్టమే కాదు, జీవితమంటే సుఖమే కాదని,

ఉగాది పచ్చడి షడ్రుచులు సందేశాన్నందించునాయే !!  

కోకిలమ్మ ఆత్మీయపు పలకరింపులు, అమ్మచేతి పిండివంటలు,

బొండుమల్లెల ఘుమఘుమలు, మన తెలుగింటి ఉగాది సంబరాలు !!

*****

Please follow and like us:

2 thoughts on “చైత్రపు అతిథి (కవిత)”

Leave a Reply

Your email address will not be published.