నా జీవన యానంలో- రెండవభాగం- 15

-కె.వరలక్ష్మి

అది 1991 ఏప్రిల్ నెల. మా అత్తగారి మూడో చెల్లెలు సరోజని. నలుగురు పిల్లల తల్లి. అప్పటికి రెండేళ్ళుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడి మరణించింది. నలభై రెండేళ్ళ వయసు. కుటుంబంలో అందరికీ బాధాకరమైన సంఘటన.

గోదావరి జిల్లాల్లో పునిస్త్రీగా మరణించిన వాళ్ళ పేరున పదకొండో రోజున దగ్గర్లో ఉన్న చెరువు వొడ్డునో, కాలువ వొడ్డునో మూసివాయనం పూజలు జరిపి ముత్తైదువులందరికీ చేటలో పసుపు, కుంకుమ, చిన్న అద్దం – దువ్వెనలాంటివి వేసి పంచేవారు. అదిప్పుడు స్టేటస్ సింబల్ గా మారిపోయి వెండి చేటలు, ఇత్తడి చేటలు, వెండి కుంకుమ భరిణలు, చీరలు – జాకెట్లు వగైరా వాళ్ళ వాళ్ళ తాహతును బట్టి పంచడంగా మారింది. రాజమండ్రిలో ఉన్నవాళ్ళంతా ఇలాంటి కార్యక్రమాలు గోదావరి ఒడ్డున చేస్తారు. సరంజామాలన్నీ రిక్షాలో ఎక్కించి, మమ్మల్నందర్నీ నడిపించి ఉదయాన్నే గోదావరి ఒడ్డుకి తీసుకెళ్ళారు, పంతులుగారు వేరే పూజలో ఉండడం వల్ల మా పూజ ఆలస్యమైంది. నేను ‘బేబక్కయ్యా ‘ అని పిలిచే సరోజనిగారు నాతో స్నేహంగా ఉండేది. అందరితో కూర్చుంటే నాకు ఏడుపొచ్చేస్తోంది. అందుకని లేచి ఆ పుష్కరాల రేవులో అటూ ఇటూ తిరుగుతూ అన్నీ గమనించసాగేను, అలా గమనించినవే, చివరికి పూజారి కుర్రాడితో సహా ఈ కథలోని సంఘటనలు. ఈ కథలోని పాత్రల పేర్లన్నీ నిజంగా అవే. కాళ్ళు నొప్పెట్టి వచ్చి మెట్ల మీద చతికిలపడినప్పుడు చిరుగుల చీర కట్టుకున్న నిరుపేదరాలొకామె వచ్చి నాకు కాస్త ఎడంగా కూర్చుంది. ఆమే రాజేశ్వరి. మా పూజలో ఆమెను కూర్చోబెట్టుకోమని చెప్పమని ప్రాధేయపడింది. నేను కాస్త ఆప్యాయంగా పలకరించేసరికి తన కథంతా చెప్పుకొచ్చింది. అప్పటికే నారాయణ పంతులు కాలం చేసి, అక్కడి పూజలు, తతంగాలు జోగయ్య పంతులు చేతిలోకి వచ్చాయి. ఈమెను పట్టించుకునేవాళ్ళెవరూ లేరు. తనకి చేటలో పోసే బియ్యం, ఒక్క పదిరూపాయలు ఇప్పిస్తే చాలంది. నేను మా అత్తగారి తల్లిగారికి ఈ సంగతి చెప్పాను. అప్పటికి ‘సరే అని, తీరా పూజ వేళకి నన్ను తీసుకెళ్ళి గోదాట్లో మునక వేయించి, పసుపు – కుంకుమలు మెత్తి ఆ పీట మీద నన్ను కూర్చోబెట్టారు. అత్తింటి వాళ్ళముందు ‘కాదు – కూర్చోను ‘ అని చెప్పలేని నిస్సహాయత, ఆ పీట మీద గజగజ వణికిపోతూ కూర్చున్నాను. ఆ తతంగమంతా ముగిసి నేను మళ్ళీ గోదాట్లో మునిగి లేచేసరికి పొంగుకుంటూ జ్వరం వచ్చేసింది. సాయంకాలానికి ఇంటికి చేరుకున్నా ఆ గోదారి, ఆ పూజలు, రాజేశ్వరి నా కళ్ళముందు నుంచి చెరగడం లేదు. జ్వరంతోనే ఆ రాత్రి కూర్చుని ఈ కథ రాసాను. ఏక బిగిన కొన్ని గంటల్లోనే రాసిన నా కథల్లో ఈ కథ ఒకటి.

నా ఒడిలోని చేటతోబాటు నేనిచ్చిన పదిరూపాయలు చూసిన ఆమె కళ్ళల్లోని మెరుపును ఇప్పటికీ మరచిపోలేను.

పేదరికం అనేది ఎంత దుస్సాహమో, అది కులాల్ని మతాల్ని బట్టి లెక్కవేసేది కాదని అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వం వారికి అర్ధమైతే బావుండునని నాకు అనిపిస్తూ ఉంటుంది.

ఈ కథకు ‘మూసివాయనం’ అని పేరు పెట్టడం ఇష్టంలేక మా స్కూల్లో కృష్ణవేణి టీచర్ నాన్నగారు మన్నేరు పాలెం పంతులుగార్ని అడిగితే ‘సువాసినీ పూజ’ అనే పేరు సూచించారు. ఇప్పటికీ ఈ కథ పేరును చాలామంది ‘సు హాసినీ పూజ” అని పలుకుతుంటారు.

ఈ కథలో పూజారి కుర్రాడు వాళ్ళు మాట్లాడుకున్న సినిమా నటి దివ్యభారతి. పుష్కరాల రేవు బైట సినిమా హోర్డింగుల మీద ఆ అమ్మాయి పొట్టి పొట్టి బట్టల్లో ఉంది.

కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి తతంగాలు లేవనుకుంటాను, చాలామంది ఇదేం కథావస్తువు? ఇది మీకెక్కడ దొరికింది? ఎక్కడ చూసారు? అని అడుగుతూండేవారు. వారందరికీ ఈ కథా నేపథ్యమే సమాధానం.

సువాసినీ పూజ(కథ)

-కె.వరలక్ష్మి

పాత బ్రిడ్జి మీంచి ట్రైనేదో కూత వేసుకుంటూ పోతోంది. పుష్కరాల రేవు పుష్కరాల కోసం ముస్తాబు చేసుకుంటోంది. తొమ్మిది గంటలకే ఎండ నెత్తి మాడుస్తోంది.

పొద్దున్ననగా నీళ్ళలో దిగిన పిల్లలు ఇంకా ఈతలు కొడుతూనే ఉన్నారు. ఒకళ్ళో ఇద్దరో ఇంక చాలనుకుని ఒడ్డుకొచ్చినా, అప్పుడప్పుడే వేడెక్కుతున్న ఇసుకలో నాలుగడుగులు నడిచి, మెట్ల అంచులవరకు వచ్చాక మనసు మార్చుకుని వెనక్కి పరుగెట్టి, మళ్ళీ నీళ్ళలో దుముకుతున్నారు. గోదావరి తల్లి ఒడిలో ఎంత ఆడుకున్నా తనివి తీరడంలేదు వాళ్ళకి.

రావి చెట్టు మీది కాకులు ఉండుండి అరుస్తున్నై. ఒడ్డున ఎవరిదో పిండ ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నట్టు వాటి అరుపుల్లో ఆత్రుత ధ్వనిస్తోంది. ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఆశతో కొంతా, ఇరుకు గర్భగుడిలో ఉక్కపోత భరించలేక కొంతా మాటిమాటికీ మండపంలో కొచ్చి తడి తుండు గుడ్డతో చంకల్లోనూ, వీపుమీదా తుడుచుకుని మళ్ళీ లోపలికి పోతున్నాడు పూజారి కుర్రాడు. ఉదయం గుడి తలుపు తెరవడానికి గోదాట్లో మునిగే ముందు సగం కాల్చుకుని దాచుకున్న చార్మినార్ సిగరెట్టు పీక చెట్టు తొర్రలోంచి తొంగిచూస్తూ, వాడి పళ్ళని జివ్వుమనిపిస్తోంది. ఆ విషయం మరిచిపోడానికన్నట్టు ఇటు తిరిగి, చెంబు పక్కన పెట్టుకుని మెట్ల మీద ఒంటరిగా కూర్చున్న పొట్టి జోగయ్య పంతుల్ని పలకరించాడు. “ఏం మావా! ఏవిటి సంగతి? ఈవేళ గిరాకీలేం తగల్లేదా?”

జోగయ్య వీడి పలకరింపుతో ఓసారి పళ్ళికిలించి, లేచి నిలబడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. చెంబు తీసి పదిలంగా చంకలో పెట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ నడిచొచ్చి గుడి మండపంలోని స్థంభానికానుకుని మళ్ళీ చతికిలబడ్డాడు. “ఈ రేవు మొత్తం నారాయణ గుత్తకుచ్చేసుకున్నాడు కదా, ఆయనుండగా మనకేం వస్తాయిలే గిరాకీలు!” బద్ధకంగా ఆవులిస్తూ నోటి ముందు నాలుగైదు చిటికలేసుకున్నాడు.

“ఇందాకణ్నుంచి చూస్తున్నా నీ వాలకం, ఏవిటొక్క లెక్కన ఆవులిస్తున్నావ్, రాత్రి సెకండ్ షో సినిమాగ్గాని వెళ్ళావా?” అడిగాడు పూజారి కుర్రాడు, కుతూహలంగా జోగయ్య ముఖంలోకి చూస్తూ, ముందే చేత్తో పట్టుకున్న నాలుగరటిపళ్ళూ జోగయ్య చేతిలో పెట్టాడు.

జోగయ్య అప్పటికప్పుడే అరటిపండు ఒల్చుకుని తినడానికుద్యమిస్తూ

“అవున్రా కుర్రాడా” అని ఊరుకున్నాడు.

“మరి చెప్పలేదేం, ఏం సినిమా అదీ, ఎలా ఉంది? మరేంలేదు, బావుంటే నేనూ వెళ్దామని, ఇంకెవరూ వచ్చేలా లేరు, గుడికి తాళం పెట్టేస్తాను. ఇప్పుడిప్పుడే ఇంటికిపోయి ఏం చేస్తాను, నూన్ షో చూసుకుని పోతాను” కార్యకారణాల వివరణతో ప్రవాహంలా ముంచేసాడు కుర్రాడు జోగయ్యని.

ఆఖరి అరటిపండు గుటకేసే కార్యక్రమంలో చేతులు తిప్పుతూ “ఎంత బావుందో చెప్పలేను. అదేవత్తీ .. ఆ పిల్లా.. అదే హీరోయిను పిల్ల.. బలే రంజుగా ఉందిలే” అన్నాడు జోగయ్య చూపుడు వేలు బొటనవేలూ కలిపి ఆ రంజును అభినయించి.

“అవునట, అందరూ అంటున్నారు, కానీ చిరంజీవి గాడుంటే ఇంకా గొప్పగా ఉణ్ణు” అన్నాడు కుర్రాడు. “వాడేసే స్టెప్సే వేరులే.”

“అహహ అదేం లేదేయ్, చిరంజీవి స్టెప్పుని మరిపించేసిందనుకో సగం సగం బట్టలేసుకున్న ఆ పిల్ల. అసలా పిల్ల తెరమీద కనపడ్డమే చాలు, యాక్షనెవడు చూస్తాడు? పేరేంటోగానీ శ్రీదేవిని మించి పోయిందొరే, కొబ్బరి ముక్కలా వుంది పిల్ల. అవునూ కొబ్బరి ముక్కంటే గుర్తొచ్చింది, రెండు కొబ్బరి చెక్కలివ్వరాదూ మీ అత్తయ్య మావిడికాయేసి పచ్చడి చేస్తానందీ” ఆ రుచిని తల్చుకుని నోట్లోకొచ్చిన నీళ్ళని చప్పరించాడు జోగయ్య.

ఎక్కడన్నా బావకాని వంగతోట కాడ కాదన్నట్టు మొహం పెట్టి చటుక్కున లేచిపోయాడు పూజారి కుర్రాడు – “అది కుదర్దులే, మా నాన్న తిడతాడు” అన్నాడు.

మండపం మెట్ల వెనకవైపు కూర్చున్న రాజేశ్వరమ్మకి వద్దనుకున్నా ఈ సంభాషణంతా చెవుల్లో దూరుతోంది. పిండ ప్రదానం చేయిస్తున్న నారాయణ పంతులు కోసం నిరీక్షిస్తోంది ఆవిడ.

ఈ నారాయణ పంతులు ఓ పట్టాన తెవల్చడు. వీలైనంత ఆలస్యం చేసి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే గుంజుతాడు. సువాసినీ పూజ చేయించుకునే వాళ్ళు ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చేరు కానీ లేకపోతే ముందీ కార్యక్రమం ముగియాల్సిందే. ఈసరికి తను లాంచీలో ఉండాల్సిన మాట.

బొబ్బర్లంక నుంచి అవసరమైన రోజు పొద్దున్నే లాంచిలో ఇవతలొడ్డుకి వచ్చి పదకొండు ఆ ప్రాంతానికి కల్లా తిరిగి లాంచి ఎక్కుతుంది రాజేశ్వరి. ఎందుకో ఆ తతంగం అంతా ముగిసే వరకూ పచ్చిగంగ కూడా ముట్టబుద్ధికాదామెకి. ఈ వేళ పొద్దున్న తను బయలుదేరే వేళకి పెద్దపిల్లాడు తప్ప మిగిలిన వాళ్ళంతా నిద్దట్లో ఉన్నారు. తొందరగా వచ్చేస్తానని చెప్పి వచ్చింది. రాత్రి బియ్యం లేక అన్నం వండలేదు. ఏ ఉప్మానో తాళింపు వేద్దామంటే కనీసం గుప్పెడు నూకలు కూడా లేకపోయాయి. ఇంత వయసొచ్చీ తనకే నీరసంతో శోషాచ్చినట్టుంది. ఇంక, నోరు లేని కుర్రవెధవలు ఎంతగా ఎదురుచూస్తున్నారో తన కోసం, తను పట్టుకెళ్ళే బియ్యం కోసం.

ఈరోజీతంతంతా ముగిసి తను వెళ్ళేసరికి ఎలా లేదన్నా ఒంటి గంటో, రెండో అయ్యేలా ఉంది.

రాజేశ్వరి కళ్ళల్లో మూడేళ్ళ చంటాడు మెదిలాడు. పెద్ద పిల్లలకి అలవాటే ఏ గోదావరి నీళ్ళో కడుపులో నింపుకుని ముణగదీసుకు పడుకోవడం. చంటి వెధవ చేసే ఆగం అంతా ఇంతా కాదు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? ఆకలి వాణ్ణలా ఏడిపిస్తుంది.

అన్ని సదుపాయాలూ ఉన్న ఈ రోజుల్లో కూడా నలుగుర్ని కనడం ఎంత పొరపాటో అని రాజేశ్వరి అనుకోని రోజు వుండదు. పెద్దాడి తర్వాత ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో “ఇంకోసారి చూద్దాం, మగపిల్లాడు పుడతాడేమో” అన్నాడు భర్త జగన్నాథశాస్త్రి.

“ఆడపిల్లే పుడితేనో” అన్న రాజేశ్వరితో

“పుట్టనీ, చెట్టుకు కాయ బరువా” అని కూడా అన్నాడు.

అతను కోరుకున్న రెండో కొడుకు పుట్టాడు, కానీ ఆ కబురు వినకుండానే జగన్నాథం మాయమైపోయాడు.

అతనున్నన్నాళ్ళు రాజేశ్వరి ఇల్లు కదిలి ఎరగదు. రోజూ లాంచీలో గోదావరి దాటి, ఈశ్వరాలయంలో అర్చనలూ, అభిషేకాలు, రాజమండ్రిలో పౌరోహిత్యాలు చేసి బాగానే సంపాదించేవాడు జగన్నాథం. తాంబూలం వేసుకునే అలవాటు కూడా లేని వాడవడం వల్ల సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా భార్యకి తెచ్చి ఇచ్చేవాడు.

బొబ్బర్లంకలో గోదావరి ఒడ్డునే వాళ్ళకున్న పూరిపాకే అయినా, సాయంకాలాలు, భర్తతో, పిల్లల్లో వాకిట్లో చాప పరుచుకుని కూర్చుంటే దేవలోకంలో సింహాసనం ఎక్కినంత గొప్ప అనుభూతి కలిగేది. ఇంటి చుట్టూ విరగకాసిన కూరగాయలూ, గుత్తులు గుత్తులుగా పూసిన పూల మొక్కలూ చూస్తూ తన జీవితానికింకేం అక్కర్లేదు అనుకునేది రాజేశ్వరి. ఆ కాయలకీ, పూలకీ, తమకీ జీవశక్తినిచ్చిన గోదావరి మాతని రోజూ బిందెతో నీళ్ళకోసం వెళ్ళినప్పుడు చారెడు పసుపు, చిటికెడు కుంకుమతో పూజించి, ఆ పసుపు కాళ్ళకీ ఆ కుంకుమ నుదుటికీ పూసుకుని, బిందెతో నీళ్ళుముంచుకుని తిరిగొచ్చేది.

బాగానే వున్నావు అమ్మవారిలాఅని నవ్వేవాడు జగన్నాథం.

నిజానికి అద్దంలో చూసుకోవాలంటే భయం రాజేశ్వరికి. తనెంత అందవికారంగా ఉంటుందో తనకే తెలుసు. ముసలి తండ్రికి వండిపెట్టే యవ్వనపు రోజుల్లో నీళ్ళకోసం వెళ్ళినప్పుడు నిశ్చలంగా ఉన్న గోదావరి చెలమలో తన మొహాన్ని చూసుకుని కంటనీరు పెట్టుకునేది రాజేశ్వరి. పెద్ద పెద్ద బండ పెదవులూ, చట్టిముక్కు, చీపికళ్ళూ, నల్ల జీడిగింజలాంటి శరీర ఛాయ. తన రూపం తనకే అసహ్యం కలిగించేది. కానీ, వెనకా ముందూ ఎవరూ లేని జగన్నాధానికి తను నచ్చిందనీ, అతను తనని పెళ్ళి చేసుకుంటాడని తెలిసినప్పుడు రాజేశ్వరిలో ఏ భావాలు ఉరకలేసాయో చెప్పడం కష్టం. తన తండ్రి రాసిచ్చిన ఆ పూరిగుడిసె కోసమూ, చారెడు మడిచెక్క కోసము అతను తనని పెళ్ళాడాడని అనుకోవడం ఆమెకేమాత్రం నచ్చని విషయం. పచ్చని దబ్బపండు ఛాయలో, కోటేరేసిన ముక్కుతో జగన్నాథం నవమన్మధుడల్లే కనిపించేవాడామెకి. పెద్దాడిదంతా తండ్రి పోలిక, మూడో పిల్ల పోలిక తండ్రిదైనా రంగు తనది. ఇక పెద్దపిల్లా, చిన్నాడు అచ్చుగుద్దినట్టు తన పోలికే.

“రాజేశ్వరమ్మగారు! పంతులుగారు పిలుస్తున్నారు” భుజం పట్టుకుని కుదుపుతోందొకావిడ. ఎప్పుడు మాగన్నుగా నిద్రపట్టిందో తెలీలేదు రాజేశ్వరికి. చెట్టుకిందున్న చేటలూ వగైరా సరంజామానంతా ఎప్పుడు గోదావరి ఒడ్డుకి చేరవేసారో గమనించనేలేదు.

“రాజేశ్వరీ! చప్పున గోదార్లో ఓ మునుగు మునిగిరా, చాలా ఆలస్యం అయిపోయిందిప్పటికే,” అంటున్నాడు నారాయణగారు హడావుడి పడుతూ. రాజేశ్వరి తత్తర పడుతూ లేచివెళ్ళి గోదాట్లో మునిగి తడి బట్టతో వచ్చి అప్పటికే అక్కడ వేసి ఉన్న కొత్త పీట మీద కూర్చుంది. పదకొండు రోజుల క్రితం ఈ లోకాన్ని విడిచిపోయిన ఓ పెద్దింటి ముత్తైదువ పేరుతో సువాసినీ కార్యం జరుగుతోందక్కడ.

ఒక పెద్దామె ముందుకొచ్చి పళ్ళెంలో కలిపి పెట్టిన పసుపును రాజేశ్వరి ఒంటికంతా పూసింది. మొహానికి, కాళ్ళకీ మరింత దట్టంగా పట్టించింది. నాలుగు వేళ్ళతో చారెడు కుంకుమ తీసి నుదుటి మీద మెత్తింది. రెండు చేతులకి నిండుగా రంగు రంగుల గాజులు తొడిగింది. ఒళ్ళో ఓ కొత్త చేట నుంచి దాన్లో బియ్యం పోసి, ఆ పైన కొత్త చీర, రవిక, కొబ్బరి బొండాం, అరటిపళ్ళూ, చిన్న అద్దం వగైరాలు పెట్టింది. రెండు తమలపాకులు ఓ పక్కన పెట్టి పసుపుతో గౌరమ్మను ప్రతిష్టించి, ఆ ఆకుల్లో బంగారు మంగళసూత్రం, నల్లపూసలూ, వెండి మట్టెలు, నూట పదహారు రూపాయలు పెట్టించాడు నారాయణగారు. చచ్చిపోయిన పునిస్త్రీ స్థానంలో రాజేశ్వరిని పేరంటాలుగా కూర్చోబెట్టి సువాసినీ పూజ జరిపిస్తున్నాడాయన.

దూరంగా గోదావరి మీద పాపికొండల వైపు తరలిపోతున్న పడవని నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంది రాజేశ్వరి. అనుకోకుండా తలదించి చేటలోకి చూడబోయిన ఆమెకి ఆ చౌకబారు అద్దంలో తనవి రెండు ముఖాలు కనిపించి కొద్దిగా ఒళ్ళు జలదరించింది. ఆ పసుపుకుంకాల పూతలో తను నిజంగానే అమ్మవారల్లే వున్నట్టుంది.

ఆమె చూపులు అన్నిట్నీ చీల్చుకుని చేటలో అడుగునున్న బియ్యం మీదకి పోయాయి. రెండు శేర్లుండచ్చు. రెండురోజులు తిండికోసం వెతుక్కోనక్కర్లేదు. తాంబూలంలోవేవీ తనకియ్యడు నారాయణగారు. అంతా ముగిసేక వెళ్ళే ముందు అక్కడికి వచ్చిన ఆడవాళ్ళంతా తన కాళ్ళకి నమస్కరించి తృణమో పణమో చేతిలో పెడతారు. అదృష్టం బావుంటే ఒకోసారి పదో పాతికో ముట్టిన రోజులున్నాయి. అవతలి వాళ్ళు అంతగా లేని వాళ్లైతే తనకి అన్నీ గీసి గీసి ఇస్తారు. నారాయణగారి తాంబూలంలో కూడా అయిదో పదో పెడతారు. చీర బదులు రవిక గుడ్డతోనే సరిపెట్టుకోవాలి. ఇంకా నయం ఈ మాత్రానికైనా తను నోచుకుంది.

భర్త కనిపించకుండా పోయిన కొత్తల్లో తనూ పిల్లలూ గోదాట్లో దిగడం తప్ప మరో మార్గం లేదనుకుంది.

గోదావరికి వరదలొచ్చి లాంచీలు నడవక తనూ పిల్లలు పస్తులుండాల్సొచ్చినప్పుడల్లా కోపంతో గోదావరిని తిట్టిపోస్తుంది రాజేశ్వరి. తమ జీవితాన్నిలా భ్రష్టు పట్టించింది ఈ ముదనష్టపు గోదారే అనుకుంటుంది. వరద తగ్గి ఎప్పట్లా అయ్యాక చెంపలు వేసుకుని తనని తనే తిట్టుకుంటుంది. ఈ గోదావరి తల్లే లేకపోయుంటే తనగతీ, తన పిల్లలగతీ ఏమై ఉండేది?

గోదావరికి వరదలొచ్చిన రోజే జగన్నాథం మాయమైపోయాడు. వరద తగ్గాక వస్తాడు లెమ్మనుకుని ఎప్పట్లాగానే నిశ్చింతగానే వుంది తను. వరద తగ్గి రెండు రోజులైంది. మూడు రోజులైంది. అతని జాడే లేదు. అతన్ని వెతుక్కుంటూ పిల్లల్ని వెంటేసుకుని గోదావరి ఇవతలికి వచ్చింది. అన్ని రేవుల్లోనూ అన్ని ఆలయాల్లోనూ వెతికింది. పురోహితులందర్నీ వాకబు చేసింది. లాభం లేకపోయింది. ఎవరూ ఏ మాత్రం ఆచూకీ చెప్పలేక పోయారు.

కాళ్ళరిగేలా తిరిగి తిరిగి ఇంటికి చేరుకుని వాళ్ళకింత అన్నం వార్చి పెట్టి, పిల్లల్ని రెక్కల కింద దాచుకున్న పక్షిలా పొదుపుకుని పడుకుంది. ఆ రాత్రి కంటిమీదకి కునుకే రాలేదు. ఒకవేళ జగన్నాథం నిండుగోదాట్లో…. భయంతో వణికిపోయింది. ఆ మాట అనుకోవడానికే భయపడుతుంది తను. ఈ పసుపు కుంకుమల్లేకపోతే ఈ మాత్రపు జీవనాధారం కూడా దొరికి వుండేది కాదు.

భర్త చనిపోయిన వాళ్ళు సువాసినీ పూజకి అర్హులు కారు. తననీ పిల్లల్నీ చూసి పెద్దాయన నారాయణశాస్త్రి జాలిపడి ఈ మాత్రమైనా ఆధారాన్ని చూపించబట్టి కానీ లేకపోతే తనూ పిల్లలూ ఎప్పుడో గోదాట్లో.

మతాల గురించీ, వాటి నియమాల గురించీ, ఇప్పుడిప్పుడొస్తున్న స్త్రీ ఉద్యమాల గురించీ రాజేశ్వరికేం తెలీదు. దేశంలో ఎక్కడేం జరుగుతోందో ఆమెకక్కర్లేదు. గోదావరికటు, బొబ్బర్లంక, ఇటు రాజమండ్రి తప్ప మరో ప్రపంచం తెలీదు. నిరంతరం ఆమె మెదణ్ణి తొలిచేసే సమస్య ఒక్కటే రేపు పునిస్త్రీలెవరైనా చచ్చిపోతారా? వాళ్ళ వాళ్ళు గోదావరి ఒడ్డునే సువాసినీ పూజ చేయిస్తారా? తనకి పిలుపొస్తుందా? పిలిచినా, తనకీ పిల్లలకీ నాలుగు రోజుల వరకైనా సరిపడా బియ్యం పోస్తారా వాయనంలో – కొత్తల్లో “అయ్యో నేనేమిటి ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నాను” అని చెంపలేసుకునేది. క్రమంగా అలవాటైపోయి “తప్పేముందిలే, ఎవరు మాత్రం శాశ్వతంగా ఉట్టికట్టుకుని ఊరేగుతారు.” అనుకుంటుంది.

పుణ్యాహవచనం ముగిసింది. ఓసారి గోదార్లో మునిగి ఒంటికంటిన పసుపూ కుంకుమా శుభ్రంగా కడుక్కుంది. వాయనంలోని సామాగ్రినంతా జాగ్రత్తగా సంచిలోకి వంపుకుంది. రాజేశ్వరి చిలకాకుపచ్చ రంగు కొత్త ముతకనేత చీరని చేతిలోకి తీసుకోగానే ఆమె ఆడమనసు అల్లరి చేసింది. ఆ చీరనలాగే గుండెలకి హత్తుకొని సంచిని గోదారిమాత విగ్రహం పాదాల దగ్గర పెట్టి, మరుగు ప్రదేశం కేసి నడిచింది. చిరుగులు పడి వెలిసిపోయి బూడిదరంగులో ఉన్న ఒంటిమీది పాత చీరని విప్పేసి ఆదరాబాదరా కొత్త చీరని చుట్టుకుంది.

ఎవరో బాగా ఉన్నవాళ్ళు తప్ప ఇలా చీరలివ్వరు. ఇదివరకు రెండుసార్లు ఎవరో ఇచ్చిన చీరల్ని పెద్దాడికి జ్వరం వచ్చినప్పుడోసారీ, చంటాడికి వాత గుణం కనిపించినప్పుడోసారి బొబ్బర్లంక పేరమ్మకి అమ్మేసింది. తడి చీరని విప్పెయ్యగానే కొండంత బరువు దింపుకున్నట్టయింది. రాజేశ్వరి బయలుదేరేసరికి రేవంతా నిర్మానుష్యంగా ఉంది. కాషాయ బట్టలు కట్టుకున్న ఓ సాధువెవరో ఎక్కడో యాచించి తెచ్చుకున్న అన్నాన్ని కాబోలు ఆవురావురుమని తింటున్నాడు. మండపం మెట్ల మీద బ్రిడ్జి అవతల రేవులోంచి బట్టలుతికే చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. చెట్టుకొమ్మల్లో చేరిపోయిన కాకులు నిద్రలో జోగుతూ మెలుకువొచ్చినప్పుడల్లా ‘కావు’ మంటున్నాయి. సూర్యుడు నడినెత్తిన నిలబడి నిప్పులు చెరుగుతున్నాడు.

మెట్లెక్కి గట్టుమీదికి వచ్చేసరికి ఒళ్ళు తూలినట్టయింది. పొద్దుట్నుంచీ పచ్చిమంచినీళ్ళైనా తాగలేదని గుర్తొచ్చింది.

ఇంచుమించు యాచనలాంటి నీచస్థితికి ఆర్ధికంగా దిగజారిపోయినా, ఎక్కడా తిండికి కక్కుర్తిపడే అలవాటు మాత్రం కానందుకు సంతోషిస్తుంది రాజేశ్వరి. ఆ క్షణంలో మాత్రం అలాంటి సంతోషం లాంటిదేమీ కలగలేదు.

గోదావరొడ్డునే లాంచీల రేవు వరకూ ఎంత దూరం నడవాలో తల్చుకుంటే గుండె గుభేలుమంది. వెనక్కెళ్ళి గోదారి నీళ్ళు నాలుగు దోసిళ్ళు తాగుదామా అంటే తిరిగి మెట్లన్నీ దిగే ఓపిక లేదు. పైట చెంగు భుజాల మీది నుంచి నిండుగా కప్పుకుని నడక మొదలు పెట్టింది రాజేశ్వరి. మార్కండేశ్వరాలయం దగ్గరకొచ్చేసరికి గొంతెండిపోతున్నట్టు తోచింది. ఆలయం లోపలికి నడిచి కుళాయి విప్పి కడుపు నిండా నీళ్ళు తాగింది. ఎవరూ వచ్చేవేళ కాక గుడి కూడా నిశ్శబ్దంగా ఉంది. చౌకీదారు కాబోలు గోపురం నీడలో బల్లమీదపడి నిద్రపోతూ గురకపెడుతున్నాడు.

లాంచీ అందుతుందో లేదోనని ఆత్రుత ఓ పక్క, పిల్లలు ఆకల్తో అలమటిస్తుంటారనే తొందరోపక్కా రాజేశ్వరిని తరుముతున్నాయి. ఇంకా నయం లాంచీల వాళ్ళెవరూ తన దగ్గర డబ్బులు తీసుకోరు.

లాంచీలో ఓ మూలగా కూర్చున్న రాజేశ్వరిని బొబ్బర్లంక చౌదరిగారు పలకరించాడు – “రాజేశ్వరమ్మా! పిల్లలు కులాసాగా ఉన్నారా?” అంటూ. ఎప్పుడూ మాట్లాడి ఎరగని చౌదరి అలా పలకరించేసరికి రాజేశ్వరి తబ్బిబ్బు పడింది. ఆమె సమాధానం చెప్పేలోపే చౌదరి అందుకున్నాడు – “పెద్దోణ్ణి వేరే పెట్టిస్తున్నాం. కొంప ఖాళీ చేస్తే అక్కడ మంచి బిల్డింగు కట్టుకుంటాడంట అత్తారిచ్చిన కట్నంతో. ఆళ్ళ డబ్బూ ఆళ్ళిష్టం వద్దంటానికి మనమెవరం చెప్పు” అంటున్నాడు.

రాజేశ్వరి వెలవెలా పోయింది. “ఏం కొంప మాటన్నయ్యగారూ మీరంటోంది?” అంది భయపడుతూ, మనసులో ఏదో కీడును శంకిస్తూ “ఇంకే కొంప మాటో అయితే నీకెందుకు చెప్తానమ్మా, మీ కొంప మాటే. నీకు తెలీదా ఏంటి అప్పుడే మూడేళ్ళు దాటిపోడంలే జగన్నాథం అమ్మేసి? మూడేళ్ళ క్రితం వచ్చిన వరదల ముందు చాలా అవసరంగా డబ్బు కావాల్సొచ్చిందని తొందరపెట్టి, అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరిపించేసాడు. ఆ డబ్బుచ్చుకునే కదా అతను దేశాలట్టుకుపోయింది” అంటున్నాడు చౌదరి. ఆ తర్వాత ఆయనేం మాట్లాడేడో రాజేశ్వరి చెవులకెక్కలేదు.

లాంచీలో ఉండగానే జ్వరం పొంగుకుంటూ వచ్చింది. ఇంటికెలా వచ్చిపడిందో, పొయ్యంటించి కాసిని బియ్యం ఎలా పడేసిందో ఆమెకే తెలీదు. చాపమీద పడి నిద్రపోయింది. మధ్యలో ఎప్పుడో “అమ్మా, అన్నం వార్చేసానే, చింతపండు పచ్చడి కలుపుకుని మేం తింటున్నాం, నువ్వూ రెండు ముద్దలు తినవే” అని పెద్దాడు అనడం మాత్రం గుర్తుంది.

మర్నాటికల్లా ఒంటికి కుండల్లా పోసి పొంగులోకి దించింది రాజేశ్వరికి. ఆ జ్వరంతో పదిరోజులు కన్ను తెరవకుండా పడి వుంది. జ్వరం తగ్గుముఖం పట్టి తెలివొచ్చాక ఇంటి చాకిరీ అంతా చేస్తూ చెల్లెళ్ళనీ, తమ్ముళ్లీ సందరిస్తోన్న పెద్దకొడుకుని చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి రాజేశ్వరికి.

రాజేశ్వరి పూర్తిగా కోలుకునే సరికి మరో పది రోజులు పట్టింది. ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. ఆ రోజు అనాలోచితంగా చిలకాకు పచ్చచీర కట్టేసుకున్నందుకు తనని తనే తిట్టుకుంది రాజేశ్వరి. వారం క్రితం ఒకసారి ఆమె నోటి చివరకొచ్చింది. పెద్దాడిని నారాయణగారింటికి వెళ్ళి కాసిని బియ్యం, పది రూపాయలు అప్పుగా తెమ్మనాలని మళ్ళీ వెంటనే, అలా అడగడం నీచంగా ఉంటుందనీ, ఆయనకి కోపం వస్తే ఆ మాత్రం బతుకు తెరువుకి కూడా నీళ్ళొదులుకోవాలనీ ఆ ప్రయత్నం మానుకుంది. చీకటితోనే కాస్త సున్నిపిండి నల్చుకుని తలమీంచి స్నానం చేసింది రాజేశ్వరి. చిలకపచ్చని చీరని ఉతికి ఆరబెట్టి ఎప్పటి చిరుగుల బూడిద రంగు చీరని కట్టుకుని, పిల్లల్ని జాగ్రత్తని చెప్పి లాంచీ ఎక్కింది. లాంచీ దిగి పుష్కరాల రేవు చేరుకునేసరికి ఎనిమిది గంటలు కావస్తోంది. ఆ రోజు శనివారం కావడం వల్ల అక్కడంతా రద్దీగా ఉంది. గుళ్ళో గంటలు గణగణా మోగుతున్నాయి. స్నానాలు చేసి పైకి వస్తున్న వాళ్ళు వస్తుండగా దిగేవాళ్ళు దిగుతున్నారు. ఆడవాళ్ళు కొందరు మెట్లమీది గదుల్లోకి వెళ్ళి పొడి చీరలు కట్టుకుంటున్నారు.

కొందరు మాత్రం ఒంటికంటుకుపోయిన తడి చీరలోనే నీళ్ళోడుకుంటూ తప తపా గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అంత రద్దీలోనూ పూజారి కుర్రాడు ఆ దృశ్యాన్ని దొంగ చూపులు చూస్తున్నాడు.

రాజేశ్వరి కళ్ళు నారాయణ పంతులు కోసం వెతుకుతున్నాయి. వెతికి వెతికి ఆమె చూపులో చోట టక్కున ఆగిపోయాయి. అప్పుడే మెట్లకాచివర గోదారొడ్డున సువాసినీ పూజ జరుగుతోంది. కళ్ళు చికిలించి నిశితంగా పరిశీలించి చూసింది. తను కూర్చోవాల్సిన స్థానంలో ఎవరో కొత్తావిడ కూర్చుని పూజ జరిపించుకుంటోంది.

“అయ్యో.. అయ్యో..” అని గోల పెట్టింది రాజేశ్వరి అంతరాత్మ. తనిక రాదనుకుని ఇంతపని చేసుంటాడా పంతులు. ఎంతపని జరిగిపోయింది. గుండెల్లో రాయిపడినట్టైంది. ఉక్రోషం ముంచుకొచ్చి ముక్కుపుటాలదిరేయి. కళ్ళల్లో నీళ్ళు నిండుకొచ్చాయి. అడుగుతీసి అడుగెయ్యలేనంత భారంగా అనిపించింది శరీరం. ఎలాగో తడబడుతూ అక్కడివరకూ నడిచింది.

అక్కడ పూజ చేయిస్తున్న వాడు నారాయణ పంతులు కాడు, జోగయ్య పంతులు, పీట మీద కూర్చున్నది ముత్తైదువ కాదు, మంచి పొంకంలో ఉన్న ఇరవై ఏళ్ళలోపు పిల్ల. దానికి పెళ్ళయిందో లేదో కాని, రుజువు కోసం అన్నట్టు ఇంత లావు పసుపుతాడు మెళ్ళో వేసుకుంది. ఏ దిక్కూలేని తనకి తప్పక ఈ అశుభకార్యాని కొడబడి ప్రేతాత్మ స్థానంలో కూర్చుంటోంది. చూపులకి చక్కని చుక్కల్లే ఉంది. దీనికిదేం పొయ్యేకాలం? తను లేకపోవడం చూసి ఈ జోగయ్య గాడిదంతా చేసుంటాడు. ఎర్రగా బుర్రగా ఉన్న ఆడదాన్ని చూస్తే చాలు వెధవకి మతిపోతుంది. ఇదెవత్తో సమయం చూసి వీణ్ణి బాగానే బుట్టలో వేసుకుంది.

ఆ నారాయణ పంతులేవూరో వెళ్తూ ఈ రేవులో పూజలన్నీ ఈ త్రాష్టుడికి అప్పగించినట్టున్నాడు అనుకుంది. అక్కడికి కొంత దూరంలో చెట్టుకింద సరంజామా అంతా సిద్ధంగా పెట్టుకుని మరో గుంపు కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తూనే ‘హమ్మయ్య ‘ అని నిట్టూర్చింది రాజేశ్వరి.

”పాపం, నారాయణ పంతులు పోయాట్టగా ఈ మధ్య” అంటోందో పెద్దావిడ ఇంకెవరితోనో..

తుళ్ళిపడింది. రాజేశ్వరి ‘హారి భగవంతుడా ఎంతపనిచేశావు’ అనుకుంటుంటే దుఃఖం పొంగి వచ్చింది. పైట చెంగుతో కళ్ళెత్తుకుంటూ అలా ఎంతసేపు కూర్చున్నా అవతల జోగయ్య నడిపిస్తున్న సువాసినీ పూజ ముగిసే విధం కనిపించడం లేదు.

నిస్సత్తువతో నడుం పీక్కుపోతోంది. తలకింద చెయ్యి పెట్టి అక్కడే అలా నడుం వాల్చింది రాజేశ్వరి. అంత సందట్లోనూ కలత నిద్రపట్టేసిందామెకి.

ఎవరో తట్టి లేపినట్టుగా చటుక్కున మెలుకువ వచ్చి తుళ్ళిపడి లేచి కూర్చుంది.

జోగయ్య పంతులు ధ్వజ స్థంభం వెనుక నిలబడి గబగబా బీడీ దమ్ము లాగుతున్నాడు.

రెండవసారి సువాసినీ పూజకి అన్నీ సర్ది ఉన్నాయి. ఆ పిల్ల మళ్ళీ గోదాట్లో మునిగొచ్చి పీట మీద కూర్చోడానికి సిద్ధపడుతోంది. ధ్వజస్థంభానికి ఇవతలివైపు నిలబడింది రాజేశ్వరి. “అన్నగారూ” అంది కాస్త గట్టిగానే, తుళ్ళిపడి చేతిలో బీడీ విసిరేసాడు జోగయ్య.

“అన్నగారూ, పిల్లలు కలదాన్ని, మరో దిక్కూ దివాణం లేనిదాన్ని. మా నోటికాడ కూడు పడగొట్టద్దు” అంది చేతులు జోడించి దీనంగా. కిందినుంచి మీదివరకూ రాజేశ్వరిని అసహనంగా చూసాడు జోగయ్య. ఆ ముసలాడు నారాయణ పంతులు హయాంలో వాయినాలను ఈవిడే కదా అందుకునేది. ఏ అభ్యంగన స్నాన మంత్రమో చెప్పి పావలా అర్థా సంపాదించడం తప్ప ఈవిడకొచ్చినంత ఆదాయం కూడా తనకొచ్చేది కాదు.

“వీలు పడదు, దయమంతికి మాటిచ్చేసాను” అన్నాడు ముఖం తిప్పుకుంటూ.

“అలా అంటే ఎలా బాబూ, పిల్లలూ నేనూ ఆకల్తో మాడి చచ్చిపోతాం.” రాజేశ్వరి మాట వినిపించుకోకుండానే తుండు దులిపి భుజం మీద వేసుకుంటూ వెళ్ళిపోయాడు జోగయ్య.

ప్రాణం హరించి పోయినట్టయి జోగయ్య నిర్లక్ష్యానికి సిగ్గుతో సగం చచ్చిపోయి అక్కడే కూలబడిపోయింది రాజేశ్వరి. ఆమె కళ్ళముందు ఆకల్తో అలమటిస్తున్న నలుగురు పిల్లలు కనిపిస్తున్నారు. ఇక మీద ఆ నోరులేని పసివాళ్ళనెలా పెంచాలి? ఎక్కడ తలదాచుకోవాలి? అవతల జోగయ్య గొంతుపెంచి ఆవాహన మంత్రం పఠిస్తున్నాడు. మంత్రాలన్నీ బాగా చదివి చాలా గొప్పగా నడుపుతాడు కార్యక్రమం అనిపించుకోవాలని కాబోలు గంటలు గంటలు నడిపిస్తున్నాడు పూజని. అంతా ముగిసే సరికి బాగా ఎండెక్కింది. చేటలోని వాయనంతో బాటు తన వంతు తాంబూలంలోని డబ్బుల్ని కూడా ఆ పిల్ల సంచిలోనే వేస్తూ కళ్ళు చికిలించి నవ్వుతున్నాడు జోగయ్య.

రాజేశ్వరి చిరిగిన చీరకొంగులో ఎవరో పదిపైసల నాణం విసిరి ముందుకు నడిచారు. తుళ్ళిపడింది రాజేశ్వరి. సిగ్గుతో చీరకొంగు నిండుగా కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ అన్యమస్కంగా లేచి నడక మొదలుపెట్టింది. కొత్త బ్రిడ్జి మలుపు దగ్గర ఏదో కారు దూసుకుపోతూ చెవులు చిల్లులు పడేలా వేసిన హారన్ కి ఉలిక్కిపడి పైకి చూసింది.

అక్కడ నిలబెట్టిన సినిమా హోర్డింగ్ మీద జున్ను ముక్కల్లాంటి పిల్లొకత్తె అర్థనగ్నంగా అందాల్ని ప్రదర్శిస్తూ నాలుక బైటపెట్టి వెక్కిరిస్తోంది.

ఎవర్ని? ఈలోకాన్నా? తనలాంటి నిర్భాగ్యుల్నా?

(23-8-91 ఆంధ్రజ్యో తి వీక్లీ &  కౌముది-ఏప్రిల్,2016 ) 

****

ఆర్ట్: మన్నెం శారద 

Please follow and like us:

One thought on “నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-4 సువాసినీ పూజ”

  1. మా కృష్ణాజిల్లా ‘సువాసినీ పూజ’ ఆచారం వుంది. కథ చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published.