గోర్ బంజారా కథలు-1

ఢావ్లో(విషాద గీతం)

-రమేశ్ కార్తీక్ నాయక్

తండా మధ్యల నుండి ఎటు సుసిన అడ్వి కనబడతది.కొండలు కనబడతయి.కొండల మీద నిలబడే నక్కలు, నెమళ్ళు, ఉడ్ములు కనబడతయి, వాటన్నింటినీ లెక్కలు ఏసుకునుడే పిల్లల రోజు పని. 

తాండా నుండి అడ్వి దాకా వాట్ (దారి) కనిపిస్తది, ఆ పై ఏమి కనబడది. అయినా అడ్వికి పోయేటోల్లు రోజుకో కొత్త దారి ఏసుకుంటరు.

తాండా సుట్టు నల్లని కొండలు, ఆ కొండల మీద,దాని ఎనక పచ్చని సెట్లు. రోజు కుప్పలు తెప్పలుగా ఎండిన ఆకుల తండా ముఖాన ఎగిరి అస్తయి.

ఆ తాండా పేరు మోర్ ముట్టి (నెమలి పిడికిలి) ఆడా మన్సుల కన్న మోర్లే మస్తుంటయి. ఎంత ఏటాడుదామన్నా దొర్కవు, దొర్కినా వాటి కాళ్ళతో లడాయి చేసి గీరి, పొడిచి పారిపోతయి, అట్ల ఆ తండాకు ఆ మోర్ ముట్టి అన్న పేరు అచ్చింది.

వాట్ వాట్ ఎటు సూసిన బల్దేర్ బండి (ఎడ్ల బండ్లు – బంజారా భాషలో ఏకవచనమైనా , బహువచనమైనా ఏకవచనంతోనే పిలుస్తారు) పడున్నయి. అడాడా ఉన్న సెట్లకు కొమ్మలు లేవు.పెద్ద పెద్ద సెట్ల కొమ్మలకు శీతల (బంజారాలకు తీజ్ తర్వాత అతి ముఖ్యమైన పండుగ శీతల, కానీ శీతల తర్వాతే తీజ్ జరుపుతరు) నాడు కట్టి ఏలాడ దీసిన కోడి, మేక కాళ్ళు ఏలాడుతున్నయి. పోరగాల్లు మర్రి ఊడలు పట్కుని ఉయ్యలలు ఊగుతుంటరు.కొందరు రేలాపూలను కూర ఒండనికి కొమ్మల నుండి ఒలుస్తూ కనిపిస్తుంటరు.

     తండాల పదమూడు గుడిసెల మందలు ఉన్నయి. అవి గొత్రాలతో విడదియబడినవి వాటిలో రాథోడ్, నునావత్, మూడ్, బొడా, అజ్మెర, మాలావత్, బానావత్, భూక్యా, ఝరప్ల, లావుడ్యా, వడ్త్యా, విస్లావత్, గుగ్లోత్ ఇంటి పేర్లతో ఎవరికి వారు ఒక్కాడా బతుకుతున్నరు.

     తండాలో సానా వరకు ఇంటికో ఎద్దును(ఆడ పిల్ల పెళ్ళి అయ్యి అప్పగింతలప్పుడు ఎద్దు మీద నిలబడి విన్తి(ప్రార్థన) చేయించనికి ఉంచుకుని మిగిలిన అవుల్ని అమ్మేసిండ్రు. కొందరు గొర్రెలు ఇంకొందరు మేకలు పెంచుతూ బతుకుతున్నరు. తండాకు పదిహేను కిలమీటర్ల దురంల ఓ పల్లెటూరు ఉంది.సంతకు పోయి ఆడ పని చేసి ఈళ్ల దగ్గర ఉన్న జంతు మాంసం,చెట్ల బెరడు, తాటింకాయలు, ఇతరేతరవి అమ్మి తిరిగి అచ్చేపాటికి రెండు మూడు రోజులు పడతది. కొందరైతే నెలలు, సంవత్సరాలు ఆడనే పని కోసం ఎంకులాడుతు ఊరురు తిరుగుతుంటరు.

    ఇలా పర్పంచానికి దూరంగా అడ్వికి ఎదురుగా కొండ ఒళ్ళో దొరికింది తింటూ కాలం కోసం రోజు చెప్పే కథలో పాత్రలై ఆకలితో ఆనందంగా బతుకుతుంటరు.

                               ***

   అది ఎండాకాలం బాయిమన్క్యా పేణా (పూర్వపు) తరాలను సూసిన  లింబేర్ ఝాడ్ (ఏప సెట్టు) కింద,మందకు మంద తలా ఓ దిక్కుకు కుసుని కొందరు గీద్ (పాట) పాడనికి సుస్తున్నరు, బట్టలపై లాల్డి (పూసలు) ఆడ్సి(అద్దాలు) కుట్టనికి సుదుల్లో దారాలు ఎక్కిస్తా సన్నని స్పష్టమైన గొంతులతో కొందరు విషాద రాగాన్ని తీస్తూ పని షురూ చేసిండ్రు. కొందరు మొగోల్లు, మిగిలిపోయిన అడోళ్లు ఏట కోసం అడ్వి బాట పట్టిండ్రు.

పైన కెల్లి మొట్టి కాయలు ఏసినట్లు,ఏప సెట్టు తాపతాపకి ఏప కాయల్ని రాలుస్తాంది. బాయి మన్క్యా తాపాతాపకి తల మీద సెయ్యి ఏసి సూసుకుంటున్నరు ఏ పిట్ట దొడ్డికి ఏసిందో ఏమో అని.

ఆ సెట్టు  కొసాకి గుడు పెట్టుకున్న ఉడ్తలు కిందకి పైకి తిరుగుతా ఉన్నయి. రంగురంగుల బొమ్మలెక్క కనిపిస్తున్న ఆ మన్సులను సుడనికి అనుకుంట. 

పిల్లలు ఆ ఏప కాయల్ని ఏరి సప్పరించి ఒకొల్ల మీద ఒకొల్లు ఉమ్ముకుంటు తమ నాల్కల బలం ఎంతుందో సుసుకుంటున్నరు.

పిల్లలు ఒక మందల కెంచి ఇంకో మందలకు, ఈ మందల కెల్లి ఆ మందలకు తిర్గుతున్నరు. ఒక మందల ఒ కువార్ చోరీ(వయసులో ఉన్న ఆడపిల్ల) బొమ్మ లెక్క కుసూని దూరంగా సుస్తాంది. ఆమె మంగ్లి.సుట్టు పిల్లలు గల్గల్ మంటు గమ్మత్ చేస్తున్నరు.ఆమె ఆ వాతావర్ణాన్ని ఆనందించే సోయిల లేదు, ఆమె మన్సు అడ్వి ఎన్క ఉన్న తెల్ల కొండల దగ్గరుండిపోయింది, ఆ పెద్దోళ్ళ పాట ఇంటుంటే ఆమెకి రొవ్ణి (ఏడ్పు) అగుతలేదు. కొందరు పాడ్తూ ఏడుస్తున్నరు. “ఎడ్సుడు సరిగ్గా రాకుంటే జిందగీ సీదా నడ్వది, నేర్చుకో నరవేలి(పెళ్ళి కూతురా)” అంటూ ఏడుస్తున్నరు.

మంగ్లి గతకొన్ని దినాలసంది ఏడుస్తానే ఉంది, కానీ అయిమెకు తన ఏడ్సుడు సరిగ్గా లేదన్పించింది.ఏడ్చి ఏడ్చి అయిమె కన్లు ఏర్రగైపొయ్నయి, పొయ్యిలో మంట గుడా అంత ఎర్రగా ఉండదేమో. కన్లల్ల నీళ్లు నిల్వ ఉండిపొయ్నయి, అద్దాల లెక్క. కన్ల ముందంతా మబ్బు మబ్బుగా కన్పిస్తాంది. ఉలుకు పలుకు లేకుండా కుసున్న మంగ్లికి  ఆమె సుట్టు వాతావర్ణం ఖాళీ ఖాళీగానే అన్పిస్తాంది. లోలోపల తన పుట్టింటి చివరి రోజు మిగిల్చబోయే హర్దే (గుర్తులు) సుడి తిరుగుతున్నయి.

  బట్టల పై పూసలు, అద్దాలు అల్లికలు నడుస్తున్నయి, ఏప సెట్టు మీద నుండి కిందికి ఏలాడుతున్న కోడ్యార్ మాళ్నీ (సాలే జాలినీ) పిల్లలు పట్టుకొని సాగదిస్తున్నరు. “నా పోతి(మనవరాలు) కోసం ఓ పాట పాడతా” అంటూ అందుకుంది దేవ్లి బాయి

జంగలే…….రి జా………లేమా

 జా……..లేరి సప్ణే…….మా 

(అడవి వలలో, వల యుక్క కలలో)

కుణ చ్ఛ…. బాయి కుణ ఊ 

( ఎవరున్నారు అక్కా ఎవరు వారు ?)

పక్క కెంచి ఆడక్కలు “మంగ్లి చ్ఛ బాయి అపణ మంగ్లి”

హర హరి వా……..లేమా… ఆఆ ఆఆ ఆఆ

హరి సాతే ద్ధపే……. మా 

(పచ్చ పచ్చని గాలిలో, పచ్చని ఏడు అడుగులలో)

కుణ చ్ఛ బాయి కుణ 

(ఎవరున్నారు అక్కా ఎవరు ?)

పక్క కెంచి ఆడక్కలు “మంగ్లి చ్ఛ బాయి అపణ మంగ్లి”

మంగ్లి అ పాట వింటూ బోరుమంది, గట్టిగా చిన్న పాపలా ఏడ్పు అందుకుంది. బాయి మన్క్యా అందరూ మంగ్లి సుట్టు చేరి ఓదార్చ యత్నం చేస్తూ 

“రోమత్ బేటి రొమత్” అంటూ మౌనంగా కన్లు తుడ్చుకుంటూ పోతినీ దగ్గరకు తీసుకుంది దేవ్లి బాయి.

                       ***

అడ్వికి పోయి నోళ్ళు జల్దిన అచ్చిండ్రు, ఆ అస్తున్న వారిని సుపెడ్తూ దెవ్లి తన పోతితో “సూడు బేట ఒకొక్కొల్లు ఎర్రగ చమటకి మెరిసిపోతూ చారోలిలా నిగనిగలాడుతున్నరు” అంటూ ఆ వాతావర్ణాన్ని మార్చనికి ఆ అస్తున్న వాళ్ళను సూపిస్తు “సూడు ఓ సారి సూడు అంటుంది, కానీ మంగ్లికి తన వాళ్ళను సుసే హిమ్మత్ (ధైర్యం) లేకుండా పోయింది.తండాల వాతావర్ణం గంటకి ఒకసారి మారిపోతాంది,అప్పుడే నవ్వులు అప్పుడే ఏడ్పులు.

 అడ్వి నుండి అచ్చినోల్లు నర్వేలి(పెళ్ళికూతురు) కోసం చారోలి (మొర్రి పళ్ళు), ముంజలు, ఘోబో (కర్జుర చెట్టు తల భాగంలో ఉండే తెల్లని పీచు) , కర్జురపల్లు, మొర్పంగ్ (నేమాలికలు) , సస్యా (కుందేలు) అన్ని బహుమతులుగా నర్వేలికి ఇచ్చిండ్రు. 

వాటిని సూస్తానే దుఃఖం మొదలైంది, ఎంత సంజాయించినా ఫలితం లేకుండా పోయింది, తన కాళ్ళకు ఉన్న గజ్జలను తడ్ముతూ ఢావ్లో అందుకుంది, ఒదినలు “ఏ మంగ్లి నువ్వు గిట్ల ఏడిస్తే తండాకు మంచి జర్గదు,కొన్ని ఆసు (కన్నీళ్లను) అయినా దాసుకో” మంగ్లికి ఏమి వినబడలేదు,కన్ల నుండి కన్నీళ్ళు రాలుతాంటే, మంగ్లికి తనేదో ఖాళీ అయిపోతున్న అన్భూతి కల్గుతాంది. ఎంత తుడ్సుకున్న, కన్లు నిండిపోతనే ఉన్నయి.

మొత్తం మీద ఏదో ఏదో చెప్పి సంజాయించిండ్రు. ఏడ కుసున్న, ఏడ కుసోబెట్టిన తన కాళ్ళను మాత్రం కనబడకుండా దాసుకుంటాంది. ఏడ తన కాళ్ళకు ఉన్న గజ్జలను తన తమ్ముడు  ఇడిపించి తనను వాయకి (పెళ్లికి) పంపుతాడో అని.

దినమంతా అట్లనే గడ్సింది. పెద్దోళ్ళు, సిన్నోల్లు, ఆడక్కలు అందరూ సాయంత్రానికి మంగ్లి వాళ్ల గుడ్సే ముందుకు  అచ్చి నర్వేలి మంగ్లినీ కలిసి,ఏవో ఏవో ఆల్లకి తెలిసినది మంచి చెడూ చెప్తాంటే, ఆ మాటలతోనే చీకటి పడిపోయింది.

                 ***

తెల్లారగానే,సల్లనీ వాతావర్ణంల షికార్కు అచ్చిన నెమళ్ళ ఎంట పిల్లలు పరుగులు తీస్తూ రాలిన నేమలికలను ఏరుకుంటున్నరు.

తండా మన్సులు ఏదో ఒక పని పెట్టుకుని బిజీ అయిపోయ్నరు.దెవ్లి బాయి తన సేతిలోని చుంగాను (  గవ్వలతో కుట్టిన దారాలకు చివరన వూల్ దారాలతో గుత్తులుగా చేసి ఏలాడదీసి మోచేతికి పైన కట్టేది)  పక్కన బెట్టి తన పోతి (మనువరాలు) కన్ల నీళ్ళు తుడ్వ మంగ్లి పక్కన చేరినాది.

   “ఏమైందే ఎందుకు ఏడుస్తున్నవు,పెళ్ళి పిల్లగాడు బాలేడా ?

 నేను కుట్టిన కాళీ/కాంచ్ళీ ( జాకెట్) ఫేట్యా (ఘాఘర) ఘుంగ్టో ( అద్దాల ముసుగు) బాలేవా ?

   దాది మాటలకు తను ఏడ్సుడే సమాధానం అన్నట్లు దాదిని పట్కుని బోరుమంది.ఇంటి ముందు పిల్లలు, పెద్దమనుషులు అందరూ పోగైనరు నానమ్మ మనుమరాళ్లను సూస్తూ నిలబడిపోయినరు.

సుట్టూ రంగురంగుల బట్టలు కనిపిస్తున్నా వాతావర్ణం మాత్రం విషాదాన్ని తలపిస్తాంది,పెదాలు మాత్రం నవ్వుతున్నయి, కళ్లు మాత్రం వర్ణించలేని దుఃఖంతో మెరుస్తున్నయి. బాయి మన్క్యా అందరూ సుట్టూ చేరిపోయ్నరు. మగ మన్సుల కళ్లు నీళ్లతో నిండిపోయినయి కానీ ఆ కన్నీళ్లను రాలనియ్యలేదు ఆళ్లు.

        మంగ్లిని సూస్తే ఎవరికి కన్నీళ్లు ఆగుతలేవు, ఆళ్లకు తెలుసు ఇంకా మంగ్లి కనబడది అని. మళ్లీ జీవితంల ఆమె కనిపిస్తదో లేదో అని , ఒక్కొక్కరిగా మంగ్లిని పట్టుకుని ఢావ్లో పాడుతున్నరు, ఏడుస్తున్నరు. రోజంతా తినుడు ఏడ్సుడు.ఢావ్లోలో ఏమైనా తప్పులుంటే సరిచేసి నేర్పుతున్నరు.

      పనికి పోయినొల్లు కొందరు తండా చేరుకున్నరు.పెళ్ళి హడావిడి చాలైంది. “అరే నర్వేలినీ ఎందుకు బాధ పెడ్తున్నరు. ఏడ్సి ఎడ్సి పిల్ల బక్కచిక్కింది,ఏడ్పిస్తానే ఉంటరా ? జర గమ్మత్ చేయ్యుండ్రి” అంటూ నాలుగో తరం డోక్రి (ముసలావిడ) అంటు నవ్వించనీకి యతనం చేసింది.

   ఈ మిగిలిపోయిన కాలంల అయిన తమ ఆడ బిడ్డను నవ్వించాలని, ఒదినలు తమ పెళ్ళి నాటి రాత్రుళ్ళ గురించి ఊహించి ఊహించి చెప్పి మొత్తం మీద నవ్వించిండ్రు మంగ్లినీ.

                                 ***

    ఒకరోజు ఉట్టిగనే గడ్సిపోయింది. ఇంకా ఏం రోజులు మిగలలేవు. ఆ దినం ఎవరు ఏ పనికి పోలే వేతడు (పెళ్ళి కొడుకు) కాడా కొందరు నర్వేలి కాడా కొందరు జమ అయినరు.

           ఆ రోజు మధ్యాహ్నం ఘుగరా చోడాయేర్ (గజ్జలు విప్పే సన్నివేశం, ఇది ముఖ్యమైన ఘట్టం కూడా, ఈ సన్నివేశం ఇంకా నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది,ఇప్పుడు నువ్వు నీ దారి ఏర్పాటు చేసుకోవాలి, సప్పుడు చేసి నీ దారిని కలవర పరిచే ఈ గజ్జలు అద్దు అని తమ్ముడి మన్సులోని అంతరార్థం)  తన తమ్ముడు తనను ఏడ్పించకుండా సుస్కుంటా అన్నోడు, అయిమె కాలి గజ్జల ముడి ఇప్పేసిండు. బతిమిలాడింది, కాళ్ళు మొక్కుతా అన్న ఇనలేదు. అంతా అయిపోయింది. ఇంకా మంగ్లి కలలో కూడా చిన్న పిల్ల కాదు. “అంతా అయిపోయింది, అందరూ నన్ను అద్దు అనుకుంటున్నరు” అంటూ ఏడుస్తాంటే, అడ్వి కూడా మౌనంగా ఇంటూ ఏడ్వనికి పయత్నించింది.

ఇంటి ముందు  ఫంద్రి (పందిరి) ఏయ్యనికి పెద్ద కట్టెలు, ఏడు కుండలు, రెండు గోట్ (మేకలు) తెచ్చి పెట్టుకున్నరు ఆ ఇంట్లోల్లు(రేకుల ఇల్లైనా, దాభా ఇళ్లైనా, గుడిసె అయినా , ఎవరికైనా చెప్పేటప్పుడు దానిని ఇల్లు అనే అంటరు, అది ఓ పాక అయినా). అర్ధరాత్రి దాటినా ఢావ్లో సేస్తూ ఏడుస్తనే ఉన్నరు.

            మోగొల్లు కొంత మంది దారు దావత్ చేసుకుంట రాత్రి గడుపుదమని ఇళ్లకు దూరంగ ఎడ్ల బండి కాడా కుసున్నరు.

         బాయిలోక్ నర్వేలికి అటూ ఇటూ పండుకున్నరు. నర్వేలి అందరి లెక్క పండుకున్నట్లే ఘుంగ్టో కప్పుకుని గచ్చప్ (మౌనంగా) ఏడుస్తనే ఉన్నది.

           మోగోల్లు తాగిన కాడనే పండుకొనికి ఒరిగిపోయ్నరు.

గంప కిందకి రాకుండా సెట్టు మీదనే నిలబడి నిద్రపోతున్న కోడి పుంజును పిల్చింది, కుక్ కుకుక్ అన్న అవాజ్ విని మంగ్లి 

“కుకడో మ కూ జగో అచ్చో సామళ్”

(కోడిపుంజు నేను చెప్పేది సరిగ్గా విను) అంటూ ప్రేమగా నిరసమైన గొంతుతో 

    “చీకటి కరిపొంగనే కూత కూయకు,నువ్వు కుసినవా నన్ను ఈళ్లు పంపించేస్తరు, ఈ రాత్రి కదలకుండా అట్లనే ఉండాలి పో ఎం చేస్తవో చెయ్ నాకు పోవాలని లేదు.నీకు కావల్సింది ఇస్తా ఈ పారి నా మాట విను నీ ముందు మోకరిల్లి ముక్కు రాకుత” అని ఏడుకుంది.

తర్వాత సాళ్యానీ (నక్కని) పిలిచింది.సాళ్యా ఆమె పిలుపుకి ఏ బదులు లేకపోయే పాటికి,సరే అని గాలికి తన సమాచారం సాళ్యాకి చెరవేయి అని సెప్పింది.

    “సాళ్యా ,నిన్ను నేను ఎన్నో సార్లు తిట్టిన , నీ మీదికి కట్టే ఇసిరిన అడ్విల నువ్వు నా గొర్రెల మంద కాడికి అచ్చినపుడు, కని గిప్పుడు గదంత మర్చిపో. రేపు తండా తండా అంతా నా తాంగ్డి (అప్పగింతలు/పెళ్ళికూతురి ఓ గోనె సంచిలో పెట్టీ ఇచ్చే కానుకలు) తిద్దామని అనుకుంటున్నరు. ఒకవేళ కుకడో కుస్తే నువ్వు నన్ను ఎద్దు మీద నిలబెట్టనికి గడ్పా దాటించే యాల్లకు గట్టిగా తండాల నీ గొంతు గింగిర్లు కొట్టెట్లు అరువు, నా తాంగ్డి ఆగిపోతది నీకు ఈ సారి గొర్రెల మందలో తిరగనిస్తాను ఏటాడనిస్తాను” అని కన్లల్ల కెంచి మస్లుతున్న ఉప్పు నీళ్లను తుడ్సుకుంటా కేల్డానీ(ఎద్దును) పిల్చింది.

“కేల్డా, నీకు భార్య పిల్లలు ఉన్నరు. నాకు అవ్వా అయ్యలున్నరు. మన దాంట్ల ఒక్కరూ దూరం అయిన ఎట్లనిపిస్తది, రేపు సాళ్యా మర్చిపోయి అరవకుంటే నువ్వైనా నాకు సాయం చెయ్.నువ్వు లేకపోతే నీ మీద నన్ను నిలబెట్టరు,నువ్వు ఎటైనా ఎల్లిపో” అంటూ అల్సిపోయిన మన్సుతో నిద్రపోయింది.

               ***

తెల్లారింది. మంగ్లి, రాత్రి అయిమే అనుకున్నదంతా మర్సిపోయింది.

వెతడునర్వేలిలను తానం చేయించిండ్రు. తండాలోని కువార్ (వయసులో ఉన్న) పోరి పొరగాళ్లు రెండు భాగాలుగా ఇడిపోయి ఒక మందా వెతడు ఇంకో మందా నర్వేలిని తిస్కని పోయిండ్రు.

 నర్వేలి తల దూసి నాలుగు పాయలు తీసి రెండు జడలల్ల టోప్లి (చంపదగ్గర వెలాడే బుట్టలు) అల్లడానీకి పిన్నులు గుచ్చుతుంటే ఓ చిన్న పిల్ల ఆ టోప్లిలు తన చెవుల దగ్గర పెడుతాంటే, దేవ్లి ఆ పాప తలపై మొట్టికాయ ఏసి వాటిని లాగేసుకుంది”రేపు నీ పెళ్ళి అప్పుడు నీ జుట్టుకు అల్లుతారులే” అంటూ వాటిని మంగ్లి రెండు జడలకు అల్లి చంపల దగ్గర ఏలాడ దిసి జడ తోకను మిగిలిన రెండు జడలతో కలిపి అల్లి రిబ్బెను కట్టిండ్రు. మంగ్లిని సదరనికి మస్తు సంయం పట్టింది ఆల్లకు.

      పెళ్ళి జరిగే కంటే ముందు “నీకు పెళ్ళి అయితుంది,నువ్వు ఇప్పటి నుండి చిన్నపిల్లవి కావు” అంటూ ఇదిగో నీ పెళ్ళి జీవితానికి ఈ కాళి (అద్దాల, పూసల ఢిజైన్లతో కుట్టిన బంజారా మహిళలు ధరించే జాకెట్) ఈ చంప బట్టలు సాక్షాలు అని నర్వేలినీ సదుర్తూ పాటలు పాడుతాంటే,తండా పెద్దలు ఇంటి ముందు ఏడు కుండలు తమ దగ్గరి ధాన్యాలతో నింపి ఒకదాని మీద ఒకటి పేర్చి జిల్లేడు కొమ్మలను ఆ కుండలకు చుట్టూ దారంతో కట్టి నిలబెట్టి వెతడు నర్వేలినీ అక్కడికి పిలిచిండ్రు.

   పెళ్ళి వేషధారణలో అచ్చిన వారు ఆడనే ఆ కుండ ఎదురుగా నిలబడి దండం పెట్టుకున్నాక వేతడు నర్వేలి కోసం తెచ్చిన బలియా (బొక్క గాజులను) ఆమె మోచేతికి పైన తొడ్గిండు(పుస్త , మెట్టలు తెలుగు పెళ్ళిల్లో ఎలాగో, మా బంజారా పెళ్ళిలో ఆ మోచేతికి పైన తొడిగే బొక్క గాజులు అలా, మా దాంట్లో మెట్టెలు నర్వేలికి పెళ్లికి కొంత కాలం ముందే ఒదినలు మర్దల్ కాలి వేళ్ళకు తొడిగిస్తరు) , అతను తెచ్చిన వాంకడి (వంకర కడియాలను) ఆమె కాళ్ళకు తొడిగిండు.మోచేతికి తొడిగిన బొక్క గాజుల కిందా చుంగాను వేతడు కట్టి ఆమెని తన పెండ్లంగా స్వీకరించిండు.

ధణిగొణ (భార్యాభర్తలు) ఆ కుండ సుట్టూ ఏడుసార్లు తిరిగిండ్రు.వేతడు వెనక నర్వేలి ఢావ్లో చేస్తూ ఆ కుండ చుట్టూ తిరిగి,అది అయిపోయాక ఇంటి ద్వారానికి బయట కొంత దూరంలో రెండుదోసిల్ల మట్టి పై పెట్టిన ఓ కుండ,దాంట్లో ఓ రూపాయి పెట్టీ ఉంచిండు మంగ్లి తండ్రి,దాని పై ఓ మట్టి కప్పు కూడా.ఆ కప్పులో ఎలిగించిన ఆ దీపం ముందు మోకరిల్లి పూర్వీకులకు నమస్కరించుకుని,ఓ దగ్గర కుసున్నరు.కాసేపటి తర్వాత దోసెడు సలోయి (రక్తం, చింతపండు, ఉప్పు, మాంసం కలిపి చేసేది) తిని పెళ్ళి దావత్ ముంగించిండ్రు.

                ——————

తనకంటే పెద్ద అక్కలు ఇద్దరి పెళ్లిళ్లు అయిపోయినయి, ఆల్లు ఎడున్నరో తెల్వది,తన వాయాకి అక్కలు రాలేదు.తన పెళ్లి అయిపోయింది,తన  పత్తో (జాడ) కూడా ఇంకొన్ని ఒద్దులకు ఉండదు. అచ్చే ఏడాది పెళ్ళి చేద్దాం అనుకుంటున్న తమ్ముడ్ని కౌగలించుకుని 

“యాడియె జ్జే ఆహియా” అంటూ నర్వేలి తమ్ముడి తల సుట్టూ గట్టిగా సేతులను సుట్టుకుని బుజం మీద తలపెట్టి ఢావ్లో అందుకుంది.

ఇప్పుడు ఆమె తనను తాను నిరూపించుకోవాలి ఢావ్లో పాడాలే, ఆ ఢావ్లో అందరినీ కద్లించాలే , అందరినీ ఏడ్పించాలే.

అందరూ ఆమె పాడే పద్ధతిని గంనిస్తుంటరు.పెళ్ళి చేస్తున్నరంటే ఆమెకి ఢావ్లో , బట్టలపై పూసలు అద్దాలు కుట్టడం తప్పకుండా అచ్చి ఉండాలే లేకుంటే ఆమె జీవితం అసంపూర్ణం.పెళ్ళి చేస్తున్నారంటే నేర్చుకోవాల్సిందే.

  భాయి, తోన బకడి భరుకన ఆయి 

( తమ్ముడా నిన్ను గుండెలకు హద్దుకుందామని అచ్చిన)

 

సాలేరి సప్నేన మార్ ఆసుమా భరలాయ్  

(సంవత్సరాల కలలను నా కన్నిల్లలో నింపుకుని అచ్చిన)

                                     ”  ఆహియా “

మేళ మతేశర మన 

(నన్ను పంపించకు)

యాడి వేజావుచు తోన

(తల్లిని అవుతాను నీకు)

                                   ”  ఆహియా “

మత్ మత్ కన రోయి

(వద్దు వద్దని ఏడ్చిన)

సాంలేకొని మన కోయి

(వినిపించుకోలేదు నన్నేవ్వరు)

                                  ” ఆహియా “

ఘుగరాన తొడన బాండే కిదో మార టాంగే

(గజ్జలను తెంపి నా కాళ్ళను ఖాళీ చేశావు)

తాండో తాండో ఆజ్ మార్ ఆసు మాంగే

(తండా తండా కలిసి నా కన్నీళ్లను అడుగుతున్నారు)

                               ” ఆహియా “

నర్వేలి పక్కనే ఉన్న బాయి లోక్ (ఆడక్కలు) నర్వేలి సేతులను విడిపించనికి ప్రయత్నిస్తున్నరు. నర్వేలి మాత్రం వద్లకుండా ఇంకా 

“యా… డి…. యే జ్జె ఆహియా” అంట పాడ్తానే ఉంది.

 అంతలనే ఆ పక్కనే ఉన్న ఓ బాయి మంగ్లినీ పట్టుకుని రాగం అందుకుంది. ఆ రాగంలో  దుఃఖాన్ని గమనించిన మంగ్లి, ఆమె తన యాడి అని గుర్తు పట్టి ఢావ్లో అందుకుంది. కూతురు పెళ్లి అని తెలిసి ఆమె గత కొన్ని రోజులుగా కూతురు నుండి తప్పించుకుని తిరిగింది.తనని సుస్తే ఇంకా ఎక్కువ ఎడుస్తదని. ఇద్దరు యాడి బెటి ఒకరినొకరు కౌగలించుకొని గట్టిగా పట్టుకున్నరు.

యాడి యాడియే

చాలు వేరియే  మారి గాడి

(అమ్మ ఓ అమ్మో, నా బండి మొదలౌతుంది)

జావుని మ

జావతో ఆవుని మ

(పోను నేను,పోతే రాను నేను)

గోకల మన, మార్ సోనేరి యాడి

(దాచుకో నన్ను, ఓ నా బంగారు అమ్మా)

బళ్యా , కాచ్ళి పేరానాకే

మన తమార అసుమా వేరానాకే

(జాకెట్, ఘాగర తొడిగారు,నన్ను మి కన్నిళ్ళలో వదిలేశారు)

మత జణో చోరీ ఉన

జణన తాంగ్డి మేలోమత ఉందున

(ఆడ పిల్లలను కనకండి, కని వారిని వేరే వారితో పంపెయ్యకండి)

యాడి యాడియే…..

           ఆహియ………

“ఏడ్వకు బిడ్డ అందరి జీవితాలు ఇట్లనే ఉంటయి” అంటూ యాడి బేటిలను విడిపిస్తున్న దాదినీ పట్టుకు ఢావ్లో మొదలుపెట్టింది. దాదిని పట్టుకుని సాధారణంగానే ఏడ్సింది.

ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుని ఏడ్చి ఏడ్చి అల్సిపోయింది. తాండా వాళ్ళందరూ బక్కచిక్కిన మొఖాలతో నిలబడ్డరు. కాసేపటి తర్వాత అళ్లంతా నర్వేలి ఇంటి ముందు కుసున్నరు.

       నర్వేలి మంగ్లి వాళ్ల యాడి దాది, ఒక తాంగ్డిని(ఎద్దు పొట్టకి అటూ ఇటూ వస్తువులు మోయడానికి వీలుగా కుట్టిన సంచినీ) తెచ్చి ,అందరి కన్ల ముందు దానిలో ఒక కచోళో (పళ్ళెం లాంటి గిన్నె) , ఏక్ టోక్నీ (చిన్న బిందె), ఏక్ లోటా (ఒక చంబు), ఏక్ టోక్నో (ఒక బిందె), రెండు సంప్రదాయ బట్టలు ఏసి మాట్లాడుతుంటే. ఆలోపు నర్వేలి తండా లోని ప్రతి ఇంటికి తిరిగి “నేను పోతున్న,మీరు అందరూ జాగర్త” అంటూ భావోద్వేగానికి లోనౌతుంది.

    తాండా పెద్దమనిషి డబడా (డప్పు) కొట్టి అందరినీ జమ చేసిండు. అందరూ అచ్చి చేరినాక ముస్తాబు చేసిన ఎద్దును ఇంటి ఆంగనో (ప్రాంగణం) ముందుకు తెచ్చి,దాని  పై మంగ్లినీ నిలబెట్టనికి బాబాయి మామలు ఎక్కిస్తుంటే దేవ్లి బాయి ” నాయక్తో (ఊరి పెద్ద) మంగ్లి బలహీనంగా ఉంది, నిలబెడితే జారి పడ్తది, తల తిరుగుతుందని చెప్పింది” అని చెప్తే

 మంగ్లిని ఎద్దు మీద కుసొబెట్టిండ్రు. మంగ్లి తన రెండు సెతులను పైకి లేపి సంప్రదాయ నృత్య భంగిమతో ప్రార్థన చేసింది.

 ప్రార్థన అయినాక తన వారినందరినీ ఆశీర్వదించి తన పెద్దవారి ముందు మోకరిల్లి ఆశీర్వాదం తీసుకుని తన ఘుంగ్టోను తన కన్లలోని దుఃఖం కనిపించకుండా కప్పేసుకుంది.

  తాంగ్డినీ ఎద్దు పై పెట్టీ,ఎడ్ల బండి పై వేతడునర్వేలినీ కూర్చోబెట్టి పంపేసినారు. మంగ్లి తండ్రి ఆ ఎద్దును తన కూతురితోనే పంపేసినాడు(నిజానికి అలా ఎద్దును కొంతదూరం వెళ్లాక ఆ ఎద్దు మీద ఉన్న తాంగ్డినీ తీసి ఎడ్ల బండి పై వేసి ఇంటికి తెచ్చేస్తరు)

తండా తాండా అంతా మౌనంగా మారిపోయింది. అందరి మన్సుల మంగ్లి పాడిన ఢావ్లో ప్రతిధ్వనిస్తా ఉంది.

****

 

Please follow and like us:

2 thoughts on “గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం)”

  1. తర్వాత సర్దుకోవచ్చు కాని పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్లడం అనేది ఏ స్త్రీ కైనా దుఃఖ భాజకమే, అది తండా కావచ్చు ఊరు కావచ్చు. ఆ దుఃఖాన్ని చక్కగా చిత్రించావు రమేశ్ కార్తీక్ నాయక్.
    అద్భుతం
    అభినందనలు శుభాకాంక్షలు 👍

Leave a Reply

Your email address will not be published.