రమణీయం

బుద్ధుని జీవితం-ధర్మం-4

-సి.రమణ 

క్రిందటి సంచికలో అనుకున్నట్లుగా మనం ఇప్పుడు  దశపారమితల గురించి తెలుసుకుందాం. పారమి అను పాళీ భాష  పదానికి అర్థం కొలత, కొలమానం. మనం దేనినైనా కొలవాలంటే ఒక కొలమానం ఉపయోగిస్తాము. కాలం దూరం,  ఉష్ణోగ్రత, కొలవడానికి  మరియు ఘన ద్రవ పదార్థాలు కొలవడానికి రకరకాల భౌతిక కొలమానాలు ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ మనం దేనిని కొలవాలి? ఎందుకు కొలవాలి? మనిషి యొక్క మానవీయ లక్షణాలను కొలవాలి. అతను చేసే కుశల కర్మలు, కుశల ధర్మాలను బట్టి అతని యొక్క మానవీయతను, సౌశీల్యతను అంచనావేస్తాం. సంపూర్ణ మానవుడిగా గుర్తిస్తాము. ఈ 10  పారమితలు మనకు ఉంటే మనం మంచి మానవులమన్నమాట.

మానవ అంటే మనువు సంతానమని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. మర్త్యులు (మృతి చెందేవారు)  కాబట్టి మానవులు అంటారు. ఈ నిర్వచనం బుద్ధుడు అంగీకరించలేదు.  మానవీయ లక్షణాలు ఉంటేనే  మానవులం అని బుద్ధుడు అంటాడు. ప్రపంచంలోని అనేక జీవజాతులలో ఈ గుణాలు ఏమీ ఉండవు. మనిషిలో మాత్రమే కనిపిస్తాయి. మానవజాతిని హోమో సేపియన్స్ ( లాటిన్ భాషలో)  అంటారు.  హోమో అంటే హ్యుమానిటీ అని సైన్స్ నిర్వచనం. బుద్ధి కలిగిన జీవి లేక బుద్ధిమంతుడు అనవచ్చు.

 థేరవాద బౌద్ధంలో 10 పారామితులు ఉండగా మహాయాన బౌద్ధంలో అవి ఆరు మాత్రమే ఉన్నాయి. మనం థేరవాద బౌద్ధం లోని పారమితల గురించి చెప్పుకుంటున్నాం.అవి

1.దానం

2.శీలం

3.నిష్కామ

4.ప్రజ్ఞ

5.వీర్య

6.క్షమ

7.సత్యం

8.అధిష్టాన

9.మైత్రి

10.ఉపేక్ష

  1. దానం :  దానం అన్నిటికంటే ఉత్తమ లక్షణం. ఏ జంతువు తాను    సంపాదించుకున్న ఆహారం మరో జంతువుకి ఇవ్వదు.మానవుడు మాత్రమే ఆవిధంగా చేస్తాడు. తను శ్రమపడి సంపాదించిన ఆహారం సాటి జీవికి (అన్ని ప్రాణులకు) అందించడంలోనే అతని మానవీయత స్పష్టంగా గోచరిస్తుంది. దానాలు ఎన్నోవిధాలుగా చేస్తూ ఉంటాం అందరము. వాటిని రెండు రకాలుగా చూడవచ్చు.  విద్య, జ్ఞానం, ధనం, సమయం, ఆహారం, వస్తువులు, బట్టలు ఇవి అన్ని సాధారణ  దానాలకిందకు వస్తాయి. ఇక శరీర అవయవాలు, ప్రాణదానం వంటివి విశిష్ట దానాలు లేక పరమార్థ దానాలు  అంటారు. ప్రాంతం, కులం గోత్రం, రంగు రూపు, మంచి చెడు ఏమీ లెక్కించకుండా ఇవ్వడమే  బౌద్ధం చెప్పిన దాన లక్షణం. అర్హతను చూసి దానం ఇవ్వడం జరగదు. అపాత్ర దానం అనేది లేదు బౌద్ధంలో. దానం ఇచ్చి, ప్రతిఫలం కానీ, ప్రయోజనం కానీ ఆశించరాదు. దానం సహజ గుణంగా ఉండాలి, కీర్తి కోసం చేయడం దానలక్షణం కాదు. సమాజంలోని  ప్రతి ఒక్కరు కష్టసుఖాలు పంచుకుంటూ ఇచ్చి         పుచ్చుకోవడాల వల్ల శ్రేష్టమైన  సమాజం  ఏర్పడుతుంది. 
  2. శీలం :  శీలం అంటే సత్ప్రవర్తన అని ఇంతకుముందు సంచికలో తెలుసుకున్నాం. అకుశలమైన మాటలు, అకుశలమైన చేతలు లేకుండా, మంచి పనులు, మంచి మాటలు, మంచి ఆలోచనలు చేస్తూ, సదాచార జీవనం గడపడమే శీలం. శీలం లేని జ్ఞానం నిరర్ధకం. అలాగే శీలం లేని ప్రజ్ఞ ప్రమాదకరం. జ్ఞానం, ప్రజ్ఞలకు, శీలం తోడైతే ప్రకాశవంతంగా భాసిస్తాయి. శీలం మరి ఏ ఇతరమైన దానితోనూ పోల్చటానికి వీలు లేనంత విలువైనదని బుద్ధుడు చెప్పాడు.
  3. నిష్కామ : ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత కలిగి ఉండటం. ఏ పని చేసినా ప్రతిఫలం ఆశించకుండా ఉండటం. ఏవిధమైన అనుబంధాలు, స్వార్థపూరిత కోరికలు లేకుండా ఉండటమే నిష్కామం. 
  4. ప్రజ్ఞ :  ప్రజ్ఞ  గురించి కూడా మనం క్రితం సంచికలో తెలుసుకున్నాం. మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వంటి మాలిన్యాలను తొలగించుకోవడం, మంచి ఆలోచనలతో కుశలమైన మానసిక స్థితిని వృద్ధి చేసుకొని ప్రతి క్షణం ఎరుకతో, సరైన దృష్టి కలిగి ఉండటమే ప్రజ్ఞ.
  5. వీర్యం : అంటే వీరత్వం. వెనకడుగు వేయని ధీరోదాత్తమైన తత్వం. బౌద్ధంలో వీరత్వం ఏమిటి?  అని సందేహం కలుగుతుంది.  మామూలుగా మనం చెప్పుకునే, ఒక వీరుడు 100 మందిని ఓడించడం వంటి వీరత్వం కాదు. తనను తాను జయించాలి. క్రోధం,ఈర్ష్య,అసూయ, ద్వేషం వంటి చెడు గుణాలను పారద్రోలటానికి మనతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. బుద్ధుడు తనకున్నది, తనదైనది సమస్తం త్యాగం చేయడం వీరత్వం. అనేక కష్టాలు పడుతూ కూడా తన ధీరత్వం విడనాడలేదు.  ఒక పని చేయడానికి పూనుకున్నప్పుడు మాటిమాటికీ ఊగిసలాడ కుండా ఉండటం ధీరత్వం.
  6. సత్యం :  మన మాట సత్యమైనదిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనూ సత్యమే మాట్లాడాలి. మన లోలోపల ఆలోచన, ప్రవర్తన సత్యవంతమై ఉండాలి.
  7. క్షమ : సహనమే క్షమ.  ద్వేషాన్ని ద్వేషంతో అణచలేము. మనలను ద్వేషిస్తున్న  వారి పట్ల కూడా ద్వేష  భావం లేకుండా సహనంతో  ప్రవర్తించాలి. క్షమతోనే ద్వేషం జయింపబడుతుంది . సహనశీలత అలవరచుకోవడానికి సాధనచేయాలి.
  8. అధిష్టాన : ధృఢచిత్తం. ఏదైనా పని అనుకుంటే అది జరిగే వరకు వెనకడుగు వేయకుండా పదే పదే ప్రయత్నం చేసి అయినా సాధించాలి. మన శాస్త్రజ్ఞులు కొన్ని వందల సార్లు విఫలమైనా, వెనకడుగు వేయకుండా ప్రయోగాలు చేసి, మనలను కాపాడే ఔషధములను కనుగొన్నారని మనకు తెలుసు. మధ్యలో వదిలిపెట్టకుండా ఎంత శ్రమ అయినా ఓర్చి, కష్టాలు నష్టాలు వచ్చినా భరించి దృఢచిత్తంతో పరిపరి విధాలుగా ప్రయత్నించి, సంకల్పించినది సాధించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, నిరాశ పడకుండా, ముందుకే అడుగు వేయాలి; లక్ష్య సిద్ధిని పొందాలి.
  9. మైత్రి :  సాటి మనుషుల పట్ల మంచి హృదయంతో మెలగడమే మైత్రి. సాటి వారి పైనే కాకుండా సకల జీవుల పట్ల కరుణ భావంతో, రాగ ద్వేష మోహ రహితంగా, సామరస్యత కలిగి ఉండాలి. మైత్రీ భావం ఎల్లప్పుడూ జీవనదిలా ప్రవహించాలి. తనకు హాని చేసిన వారి పట్ల కూడా స్నేహ భావం కలిగి ఉండాలని తథాగతుడు బోధించాడు. 
  10. ఉపేక్ష. : సమచిత్తత.  సకల జీవ రాశుల పట్ల దయ చూపుతూ దయామయులై  ఉండటం. ఇతరుల ప్రవర్తనలోని గుణగణాలను విమర్శించటం గాని, ప్రశంసించడం కానీ చేయకుండా వుండటం.  ఒక దానిమీద ఇష్టతకాని,అయిష్టత కానీ చూపనటువంటి అనాసక్త భావం, ఉపేక్ష. తన వంతు కర్తవ్యం నిర్వహిస్తూ, ఫలితం ఎటువంటిదైనా ఆందోళన చెందకపోవడం ఉపేక్ష.

ఈ దశ పారమితలు  సక్రమంగా నిర్వర్తించాలంటే ప్రజ్ఞా పారమీ జ్ఞానం చాలా అవసరమైన సౌశీల్యతగా గుర్తిస్తాము. హేతువంతం కానిది,సత్యవంతం కానిది ఏది బుద్ధుడు బోధించలేదు. బుద్ధుడు జీవించి ఉన్న కాలంనాటి వేదనాభరిత మైన దుఃఖకర జీవితంలోకి, మానవాళి మరల నెట్టివేయబడుతుంది. ఒక చెడు నుండి కాని, దుఃఖం నుండి కానీ బయట పడక పోతే అది మన తప్పే. అపార జ్ఞాన సంపద మన ముందు ఉన్నది. ఎల్లప్పుడూ మనం, తప్పు ఇతరుల మీద, ప్రభుత్వం మీద, సమాజం మీద వేసి పరనిందకు పాల్పడతాము. మన బాధ్యత పక్కన పెట్టి, వ్యక్తిగా చేయవలసినది చేయకుండా సమాజం మారాలి, దేశం మారాలని ఆశపడుతుంటాము. సామాజికమార్పు వ్యక్తి మార్పుతోనే మొదలవుతుంది. అది మనతోనే మొదలవ్వాలి. మన సంస్కారాలు, మనో ధర్మాలు మనలను విముక్తి మార్గం వైపు నడిపిస్తాయని స్పష్టమవుతుంది.

ప్రపంచానికి జ్ఞాన బోధ చేసిన తధాగతుడు చెప్పిన, పంచశీలాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.