నా జీవన యానంలో- రెండవభాగం- 17

మల్లెపువ్వు – కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

మా పెద్దమ్మాయి పెళ్ళికి ముందూ, పెళ్ళి తర్వాతా నేనెదుర్కున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. అంతకు రెండేళ్ళ ముందే ఎల్.ఐ.సి లోన్ పెట్టి ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు పూర్తయ్యేవరకూ పెళ్ళిళ్ళ మాట తలపెట్టవద్దులే అనుకోవడం వల్ల నా సంపాదనలో ఇంటి ఖర్చులు పోను మిగిలినది లోకి వడ్డీ కట్టేస్తూ వచ్చేదాన్ని, నా సంపాదన అని ఎందుకంటున్నానంటే మా పిల్లల తండ్రిది నాకన్నా ఎక్కువ జీతం వచ్చే గవర్నమెంటు ఉద్యోగమే అయినా ఇంటికోసం ఒక్క రూపాయైనా ఖర్చు చెయ్యని, ఇంటి బాధ్యతలేవీ పట్టించుకోని చిత్రమైన నైజం. హఠాత్తుగా పెళ్ళి ఖర్చు వచ్చేసరికి నిస్సహాయురాలినైపోయాను. అప్పుచేసి పెళ్ళి చేసాక మంచం, పరుపు, బీరువా, టి.వి, చివరికి సూట్ కేసులాంటివి – వడ్డీ కట్టడం కొన్నాళ్ళు ఆపుచేసి ఒక్కొక్కటిగా కొని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కాసే చెట్టుకే రాళ్ళు రగుల్తాయి. బాధ్యత వహించేవాళ్ళే మాటలూ పడాల్సి వస్తుంది. అయినా ఎప్పుడూ మొహాన నవ్వు పులుముకుని, అవసరమైన చోట్ల అతి గంభీరంగా నెట్టుకొస్తూ ఉండేదాన్ని. అబ్బాయిని యూనివర్సిటీకి, చిన్నమ్మాయిని కాలేజ్ కి పంపాల్సి ఉంది. మరోపక్క అమ్మాయిని అత్తింటి వాళ్ళు వేధిస్తున్నారే అని బాధొకటి.

ఆ పెళ్ళిలో పట్టుకున్న జలుబు – దగ్గు నెలరోజులు దాటిపోయినా, ఎన్ని కాఫ్ సిరలు తాగినా తగ్గలేదు. ఎవరో సలహా ఇస్తే రాజమండ్రిలో కొత్తగా పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్ కెళ్ళాను. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకూ పరీక్షలు చేసి టి.బి ప్రారంభదశలో ఉందని, ఏడాదిపాటు మందులు వాడాలని చెప్పారు. ఇంటికొచ్చి ఈ మాటను నా జీవితభాగస్వామికి చెప్పాను. “మందులువాడు, అదే తగ్గిపోతుందిలే” అన్నాడాయన చాలా తేలిగ్గా, అంతే, ఆ సంగతి నేనింకెవరికీ చెప్పలేదు. నాకు నేను ఎంత ధైర్యం చెప్పుకున్నా ఒకలాంటి నిర్వేదమేదో నన్ను వదిలేదికాదు. అలాంటి నిర్వేద స్థితిలో రాసిందీ కథ. కథ అన్నాక కొంత కల్పన కూడా అవసరం కదా! నా ఫ్రెండ్ మేరీకి ఆలస్యంగా పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళిలో వాళ్ళ కులాచారాలన్ని చూడడం జరిగింది. వాటిని ఈ కథలో మణిరత్నం పెళ్ళికి వాడడం జరిగింది. ఈ కథను శాంతసుందరిగారు హిందీలోకి అనువదించాక గుజరాతీ, బెంగాలీలాంటి భాషల్లోకి అనువదించబడింది. చాలా ఉత్తరాలు, ఫోన్ల ద్వారా నార్త్ ఇండియానుంచి చాలామంది పలకరించారు. ఈ మధ్య కలకత్తా నుంచి సంధ్యా గుప్తా అనే ఆవిడ ఫోన్ చేసి కథ గురించి మాట్లాడుతూ మధ్యలో ఏడ్చేసింది.

నిడదవోలు మాలతిగారు ‘గాజుపళ్ళెం’ కథను ఇంగ్లీష్ లోకి, శాంతసుందరిగారు హిందీలోకి, ‘పాప’ కథను మరెవరో అనువదించి ఇతరభాషల్లోకి వెళ్ళి, వాళ్ళు పలకరించడం అదంతా మధురమైన అనుభూతి, అనువాదకులకు నా కృతజ్ఞతలు.

రాసేవాళ్ళం చాలామందిమి అతి సెన్సిటివ్ గా ఉంటాం. చిన్న చిన్న సంఘటనలు కూడా మనుషుల్ని ఎంతగా బాధిస్తాయో ఈ కథలో చెప్పాను.

మల్లెపువ్వు

పళ్ళెంలో పోసుకున్న మల్లెల్ని అరచేత్తో తాకుతూంటే మణిరత్నానికి దగ్గుతెర కమ్ముకొచ్చింది. మల్లెల వాసన నిషిద్ధం తనికిప్పుడు. టి.బి తన ఊపిరితిత్తుల్ని నిర్దాక్షిణ్యంగా తినేసింది. దగ్గి దగ్గి కళ్ళల్లో ఊరిన నీటిని ఒత్తుకుని ఆయాస పడుతూ మల్లెలవైపు చూసింది.

ఆమె మనసు గతంలోకి పరుగులెత్తింది.

మణిరత్నానికి మల్లెపూలంటే మహాప్రాణం. కానీ, అవెప్పుడూ ఆమెకి అచ్చిరాలేదు.

పెళ్ళైన కొత్తలో మొదటిసారిగా రెండు జడల సిగవేసుకుని, సిగచుట్టూ మల్లెలు చుట్టుకుని తెల్ల చీరా తెల్లరవికా కట్టుకున్నప్పుడు “బాగానే వున్నావ్ బోగం మేళంలో నాయకురాల్లాగ. కప్పుల బాడీ కూడా ఏస్కుంటే ఏసం సరిగ్గా సరిపోయేది” అన్న కట్టుకున్న వాడి కామెంటుకి ఆమె లేత మనసు ముక్కచెక్కలైంది.

నర్స్ ట్రైనింగు పూర్తి చేసేసరికి మణిరత్నానికి ఇరవై ఏళ్ళొచ్చాయి. తండ్రిపోయిన కొత్త, తల్లి బెగిలిపోయి వుంది. ఇంటికి మగదిక్కుగా వుంటాడని ఒక్కగానొక్క కూతుర్ని తన తమ్ముడికే ఇచ్చికట్టబెట్టింది.

పెళ్ళికి అమ్మమ్మ వూరినుంచి ఎవరెవరో చుట్టాలు – పైన తుండుగుడ్డ తప్ప చొక్కా వేసుకోని మొగాళ్ళూ, రవికల్లేని ఆడవాళ్ళూ ప్రధానం కావిట్లో ఒక ఉట్టిలో అరటిగెలా, రెండో ఉట్టిలో ఎత్తెడు బెల్లం, డప్పులో ఊరేగి తమ ఇంటికి రావడం, తన ఒంటికంతా పసుపు దట్టంగా పూసేసి, ఒళ్ళో కొబ్బరిబొండాం పెట్టి ప్రధానమైందనిపించడం, వచ్చినోళ్ళందరికీ వాకిట్లో కుట్టుడు పనసాకులేసి, కోడిగుడ్లూ ఎండుచేపలూ కలిపి చేసిన పులుసుతో అమ్మ నానా హైరానా పడిపోయి వడ్డించడం, ఎర్రకొర్రల అన్నాన్ని ఒక్కొక్కళ్ళూ రెండు ఆకులు తేలిగ్గా ఖాళీ చేసెయ్యడం, ఆ వచ్చిన వాళ్ళతోనే ఆడపెళ్ళి వాళ్ళంతా కలిసి కాలినడకన మగ పెళ్ళివాళ్ళ ఊరికి పెళ్ళికి తరలి వెళ్ళడం, ఎప్పుడూ అలవాటైన అడవిగుండా తను చకచకా నడుస్తూంటే వరసైన వాళ్ళు వేళాకోళం చెయ్యడం – అదంతా తనకి గుర్తె.

అప్పటికి పెళ్ళంటే సరైన అవగాహనలేదు మణిరత్నానికి. ఒక్క సంవత్సరం ఉద్యోగం చెయ్యనిచ్చి పెళ్ళిమాట తలపెట్టి వుంటే ఎంత బావుండేది అని తర్వాత ఎప్పుడూ అనుకునేది – చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే.

మండు వేసవికాలంలో మిట్టమధ్యాహ్నం లగ్నం. తనని తలపైకెత్తనివ్వలేదెవ్వరూ. కులాచారం ప్రకారం మేనబావ వరసైన వాడొకడు తనని ఎత్తుకుని గుర్రం ఎక్కించబోయి నాలుగడుగులేసి ఆయాసపడిపోయి “ఏటిపిల్లా, ఆస్టల్లో రాళ్ళుగానీ మింగేదానివే. ఇంత బరువెక్కిపోయావ్” అని హాస్యమాడేడు. గోప్యం తెలీని అప్పటి మనుషులు ఉత్త అమాయకులు – అనాగరికులు అనుకోవడం రత్నానికి ఇష్టం ఉండదు.

పెళ్ళైన నెలలోనే జిల్లా కేంద్రంలో గవర్నమెంటు హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది.

ఎలా చేసిందో సరసమెరగని మోటు మనిషి యాకోబుతో అయిదేళ్ళ కాపరం. ఆ అయిదేళ్ళలోనూ అతనిమీది అయిష్టం కొద్దీ మల్లెపూల జోలికి పోయేదికాదు. ఆ అంతంతమాత్రపు కాపరానికి గుర్తుగా డేవిడ్, రోజీ పుట్టారు. అప్పటికే తన మీద మొయ్యలేని భారం ఉండేది. అమ్మ, అమ్మమ్మ, పనీపాటు లేకుండా తిని తిరిగే మొగాడూ. ఆరుగురి తిండికీ జీతం ఏ మూలకీ చాలేదికాదు. రోజంతా చుట్టలు కాల్చి ఎక్కడపడితే అక్కడ ఉమ్మెయ్యడం ముసలమ్మ పనైతే రాత్రిళ్ళు తాగొచ్చి నానా రబసా చెయ్యడం యాకోబు పని. క్వార్టర్స్ కావడం వలన చుట్టుపక్కల వాళ్ళంతా ‘ఏంటీ న్యూసెన్స్ ?’ అని విసుక్కునేవాళ్ళు. పల్లెటూళ్ళో పుట్టి పొలాల్లో తిరగడానికి అలవాటు పడిన అతను బస్తీ వాతావరణంలో ఇమడలేకపోయాడు. సరికదా, తనకన్నా పదిహేనేళ్ళు చిన్నదైన మణిరత్నం యవ్వనాన్ని చూస్తుంటే అతనికేదో అసహనంగా వుండేది. వారానికో రోజు స్నానం చేసే అతన్ని భరించడం ఆమెకీ సాధ్యం కాలేదు. నెలకింతని ఇచ్చే ఏర్పాటు చేసుకుని అమ్మమ్మనీ, మామయ్యనీ పల్లెకి పంపించేసి ఓ నమస్కారం పెట్టేసింది రత్నం. తల్లి మొత్తుకుంది, అమ్మమ్మ నానా శాపనార్థాలూ పెట్టింది. ఎలాంటి వికారాలూ లేకుండా వెళ్ళినవాడు యాకోబు ఒక్కడే అతనికిదివరకే అక్కడో అక్రమ సంసారం వుంది. ఆమెకూడా కూలీనాలీ చేసి ఇతన్ని మేపాల్సిందే

మల్లెపూల దండలు కొని తెచ్చి మేరీమాత ఫోటోకి తగిలించేది మణిరత్నం. గదినిండా నిండుకున్న మల్లెల సౌరభం మనసుకేదో హాయినిచ్చేది. “మొగుడూ మొద్దులూ అక్కర్లేందానికి మల్లిపూలెందుకో?” అని సణుక్కునేది తల్లి. “మొద్దులాంటి మొగుడు లేడు కాబట్టే” అని నవ్వే సేది.

ఆ తర్వాత మణిరత్నం పూర్తి ఏకాగ్రత పిల్లలిద్దరి మీదా కొనసాగింది. చేసే ఉద్యోగమూ, డ్యూటీల టైమింగ్సూ ఎన్నెన్నో ప్రలోభాల్ని కల్పించినా అన్నిట్నీ తిరస్కరించి ఆమె పిల్లలకోసమే బతికింది.

మణిరత్నం తల్లి అశాంతితోనే కన్నుమూసింది.

డేవిడ్ బి.టెక్ చేసాడు.

రోజీ డిగ్రీలో జాయినైంది. ఎలా అయ్యిందో హౌస్ సర్జన్సీ చేస్తున్న ఓ కుర్ర డాక్టరుతో రోజీకి పరిచయమైంది. సాయంకాలాలు కాలేజ్ నుంచి వచ్చాక బైట మొక్కల్లో కుర్చీలేసుకుని కూర్చునేవాళ్ళు.

డేవిడ్ తో అంది మణిరత్నం “ఒరే బాబూ, రోజీ ఆ కుర్రాణ్ణి తప్ప చేసుకోనంటుందిరా. ఆళ్ళ పెద్దలేమో యాభైవేలు కట్నం అడుగుతున్నారు. బేంకులో ఆర్డీ, నా లోన్ల సొమ్మూ కలిసి ముప్పై అయిదువేలవరకు వస్తాయి. మిగిలిన దానికోసం నీ బండి అమ్మేస్తా” ఇంజనీరింగ్ కాలేజ్ లో అందరికీ బళ్ళున్నాయని ముచ్చటపడుతూంటే బుల్లెట్ కొనిపెట్టింది. డేవిడ్ ఏమనుకున్నాడో రెండు నిమిషాలు రెప్పవాల్చకుండా చూసాడు.

“ఇప్పుడీ పెళ్ళి చెయ్యకపోతే ఏం?”

“ఎప్పుడైనా తప్పదు గదా”

“తాహతుకి మించిన పరుగులెందుకు?”

“అది కోరుకుంటున్నప్పుడేం చేస్తాం?”

డేవిడ్ ముభావంగా బండి అమ్మేసి డబ్బు తెచ్చిచ్చాడు. ఖర్చులకి మరికొంత వడ్డీకి అప్పుచెయ్యక తప్పలేదు. డేవిడ్ ముభావం వీడలేదు.

“మగపిల్లాడుకదా, బాధ్యత లేదు. కొంచెం అన్నీ నువ్వే చక్కబెట్టుకోవాలి” అంది మణిరత్నం.

“నీకా వ్యవహార దక్షతలేదా? చ్చొచ్చొచ్చో నీకున్నంత వ్యవహార దక్షత ఇంకెవరికుంది. డాక్టర్ని అల్లుణ్ని చేసుకోవడం కన్నా వ్యవహారదక్షత ఇంకేముంది” అన్నాడు డేవిడ్ కనుబొమలు పైకెత్తి. ఆ మాటలోని వ్యంగ్యం సూటిగా గుండెలో తాకింది. దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడింది మణిరత్నం.

పెళ్ళవుతూనే మంచం, బీరువా వగైరా సారెతో అమ్మాయిని పంపించమని మగ పెళ్ళివారు డిమాండ్ చేసారు. దొరికిన చోటల్లా అప్పుచేసి వాళ్ళకి తగినట్టు అన్నీ సమకూర్చింది. చేతిలో చిల్లగవ్వలేదు. బయల్దేరే ముందు రోజీ  జేవురించిన మొహంతో తల్లిమీద నిష్టూరాలు పోయింది. “ఏంటమ్మా ఈ కక్కుర్తిపన్లూ, ఈ పాత సూట్ కేస్ తో బట్టలు పట్టుకెళ్తే అక్కడ నాకేమైనా గౌరవం ఉంటుందా? ఎంతలోకువైపోతాను. వి.ఐ.పి కొనిపెట్టు, దీన్ని నువ్వే వుంచుకో. అయినా కొడుకు కోసమైతే ఏవైనా చేస్తావులే, నాకోసం ఎందుకు చేస్తావ్, లక్షల ఖరీదు చేసే అల్లుడు చవగ్గా దొరికితే ఇలాగే వుంటుంది ఎవరికైనా” మూత తెరిచి బట్టలన్నీ నేలమీద ఒంపేసింది రోజీ.

మరో శరాఘాతం.

డేవిడ్ హైదరాబాద్ లో ఏదో పార్ట్ టైమ్ జాబ్ లో జాయినయ్యాడు.

క్షేమసమాచారం తెల్పమని మణిరత్నం రాసిన ఉత్తరానికి అక్కణ్ణుంచి జవాబు వచ్చింది. “నా కాళ్ళమీద నేను నిలబడాలనుకుంటున్నాను. నీకు కూతురు తప్ప నేనెప్పుడూ పరాయివాణ్ణే. నీకున్నదంతా వాళ్ళకే పెట్టుకో, నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు”

గొప్పింటి కోడలయ్యాక రోజీ ఇటు తిరిగి చూడ్డమే మానేసింది.

పుట్టి బుద్ధెరిగాక నిజమైన ఒంటరితనం అప్పుడావరించింది మణిరత్నాన్ని.

క్రమంగా ఒంట్లో ఏర్పడుతున్న నిస్సత్తువనీ, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది.

గుప్పిట తెరిచి చూసింది. నలిగి వాడిపోయిన మల్లెపువ్వు జాలిగా నలుపురంగుకి తిరుగుతూ.

“మధుర పరిమళాల్ని కురిపించే ఈ పువ్వుకింత మృదుత్వాన్నెందుకు పెట్టావు తండ్రీ…”

(27.93 ఆంధ్రజ్యోతి వీక్లీ – న్యూజెర్సీ పోటీలో గెలుపొందినది)

 

****

(వచ్చేనెలలో మరోకథ)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.