యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-5

మా పేకేజ్  టూర్ లో భాగంగా  మర్నాడు  మేం ఎంకరేజ్ నుండి బయలుదేరి దెనాలి నేషనల్ పార్కుకి బయలుదేరేం.  ఎంకరేజ్ నుండి దెనాలి నేషనల్ పార్కుకి ఒక పూట ప్రయాణం. ఆ రోజు, మర్నాడు రెండు రాత్రుల పాటు దెనాలి నేషనల్ పార్కులోనే మా బస ఏర్పాటుచెయ్యబడింది. 

ఉదయం ఎంకరేజ్ లోని హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకుని హోటలు నించి రైలు స్టేషనుకి ఉన్న  ఫ్రీ షటిల్ లో 

నిన్నటిలానే  ఎంకరేజ్  రైల్వే స్టేషనుకి సమయానికి అరగంట ముందే చేరుకున్నాం. అయితే ఇవేళ మా లగేజీ కూడా మాతోనే ఉండడంతో ముందుగా స్టేషనులోకి వెళ్లకముందే నిర్దేశించిన లగేజీ లైనులో వెళ్లి మా లగేజీని పేర్లు రాసి, ట్యాగులు కట్టి అప్పగించి వచ్చాం. 

ఇక మేమెక్కవలసిన రైలు నిర్ణీత సమయానికి పట్టాల  మీద  సిద్ధంగా  ఉంది.  

ప్లాటుఫారం వంటిదేమీ  లేనేలేదు. పరిశుభ్రంగా ఉన్న పట్టాల మీద ఠీవిగా ఆకాశం లోకి నిలబడిన ఆ  డబుల్ డెక్కర్ రైలు ఎక్కడానికి చక్కగా ర్యాంప్ పరిచి ఉంది. 

ముందున్న ఇంజనుని ఆనుకుని గ్లాస్ డూమ్ పెట్టెలు రెండు మాత్రమే ఉన్నా, మొత్తం పదికి  పైగా పెట్టెలతో  విహార యాత్రకి మాత్రమే ఉద్దేశించిన ప్రత్యేక రైలది. 

మా టిక్కెట్టు  ర్యాంప్ ఎక్కేముందే పరిశీలించి లోపలికి ఆహ్వానించేరు. అక్కడ కొద్దిమంది ప్రధాన స్టాఫ్ తప్ప మిగతా  అంతా వేసవి ఉద్యోగాలు చేస్తున్న హైస్కూలు పిల్లలే. 

నవ్వుతూ, తుళ్లుతూ, మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ సీతాకోకచిలుకల్లా ఉన్న వాళ్ళని చూస్తే భలే ఆనందం, ఉత్సాహం వేసింది.  

పై అంతస్థులో టాప్ సగం వరకూ గ్లాస్ డూమ్ తో ఉన్న రైలు పెట్టెలో ప్రయాణం అంతకంతా భలే ఆహ్లాదంగా ఉంటుంది. గాల్లో విహంగంలా రెక్కలు సాచి ప్రయాణిస్తున్నట్టు.  

ముందురోజు మేం విట్టియార్ కి వెళ్లొచ్చినది ఆర్డినరీ డూమ్ ట్రైన్ అయితే ఇవేళ్టి ఎంకరేజ్ నుండి దెనాలి నేషనల్ పార్కుకి వెళ్లే గ్లాస్ డూమ్ ట్రైన్ గోల్డ్  స్టార్ అని పిలిచే స్పెషల్ ట్రైన్ అన్నమాట.

నిజానికి అసలు సిసలైన గ్లాస్ డూమ్ అంటే ఇదే. ఇందులో కూచుంటే ఆకాశంలో కూచున్నట్టే ఉంది మరి!

చుట్టూ కమ్ముకునే  చెట్లు, పర్వతాలు, ఆకాశం, మేఘాలు, ఒరుసుకుని ప్రవహించే నీటి చెలమలు, పట్టాల వరకు  విస్తరించినట్లున్న సముద్ర జలాలు … ప్రకృతిలో మనమూ మమేకమై అల్లనల్లన మెల్లగా సాగిపోతూ…. ఓహ్… అత్యద్భుతమైన ప్రయాణం అది. 

ఆ రైలుకి దూసుకుపోవడం ప్రధాన ధ్యేయం కాదు కనుక గంట సేపట్లో వెళ్లాల్సిన దూరానికి మూడుగంటలు పడుతుంది. 

గ్లాస్ డూమ్ రైలు కాబట్టి పిల్లలు కిటికీ సీటు కోసం కొట్టుకోకుండా బుద్ధిగా కూచున్నారు. 

వరుసల మధ్య తగినంత స్థలంతో వరుసకు నాలుగు సీట్ల చొప్పున మధ్యన టేబుల్తో ఎదురుబొదురుగా రెస్టారెంటులో ఉన్నట్టున్నాయి సీట్లు. 

మెట్లెక్కి పైకి వచ్చే చోటే చిన్న స్నాక్స్ & డ్రింక్స్ బార్. 

కింద పెట్టెలో రెస్టారెంటుని తలపించే చక్కని డైనింగ్ , దానిని ఆనుకుని బయటికి కనబడని పాంట్రీ. 

ఫుడ్, డ్రింక్స్, స్నాక్స్ అన్నీ టిక్కెట్టులోనే కవర్ అవుతాయి.

అక్కణ్ణించి పక్క పెట్టెలోకి వెళ్తే అదీ గ్లాస్ డూమ్ పెట్టే కానీ కింద డైనింగ్ ఉన్నట్టు లేదు. ఇక మేం రైలంతా సందర్శించే ఉత్సుకతతో రైలుకి మరో మూల ఉన్న డెలీ వరకు వెళ్లి ఐస్ క్రీములు తీసుకున్నాం. అయితే ఆ డెలీ మామూలు పెట్టెల్లో  ప్రయాణీకులకు  ఉద్దేశించినది  కావడంతో అక్కడేం తీసుకున్నా డబ్బులు కట్టాలి. 

ఇక పెట్టెకి, పెట్టెకి  మధ్య దాటేటప్పుడు మధ్య ఉన్న కనెక్టివ్ ర్యాంప్ వంటిది బాగా కదలడం, గ్లాస్ డూమ్ పెట్టెలకి , మామూలు పెట్టెలకి మధ్య కిందికి, పైకి చిన్న ఇరుకు మెట్ల మీద  ఎక్కి దిగాల్సి రావడంతో సిరి భయంతో  బాగా పేచీ పెట్టేసింది. 

తిరిగి  ఆ పిల్లనెత్తుకుని వెనక్కి మా పెట్టె లోకి  వచ్చేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. 

మధ్య దార్లో  వచ్చిన టల్కీనా (Talkeetana) స్టేషను దగ్గిర రైలు పదిహేను నిమిషాలు ఆగింది. సత్య, నేను దిగి  అటూ ఇటూ పచార్లు చేసి మళ్లీ ఎక్కేం. చిన్నప్పుడంతా నాకు ఇండియాలో రైలు ప్రయాణాల్లో స్టేషనొచ్చినపుడు రైలు దిగి మళ్లీ ఎక్కడం భలే ఇష్టమైన విషయం. కానీ చిన్నప్పుడంతా చిన్నపిల్లనని దిగనిచ్చేవారు కాదు. పెద్దయ్యాక ఒక్కదాన్ని ప్రయాణించినపుడు దిగితే రైలెక్కడ కదిలిపోతుందో అన్న భయంతోనూ, కూడా ఎవరో ఒకరు ఉన్నపుడు  దిగడానికి బిడియంతోను ఆ సరదా అలా తీరకుండా ఉండి పోయింది. “దిగుదామా” అని సత్యతో అన్నదే తడవుగా పదమంటూ చక్కగా నా ముందు నడిచేడు. అందుకో ఏమో ఎంతో అపురూపంగా అనిపించాయి ఆ క్షణాలు. 

దాదాపు పన్నెండు గంటల వేళ నుంచి లంచ్ ప్రారంభమయ్యింది. కింద డైనింగ్ కారులో సీటింగ్ లిమిటెడ్ గా ఉండడంతో అరగంటకొక బాచ్ చొప్పున పిలవసాగేరు. అయితే ముందే ఎవరు ఏ బాచ్ లో వెళ్లాలనుకుంటారో అడిగి రాసుకోవడం వల్ల మన వంతు కోసం ఎదురుచూడక్కర లేకుండా ఏర్పాట్లు జరిగేయి. 

ఉదయం నించి స్నాక్స్  తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండడంతో మేం చివరి బ్యాచ్ కి వెళ్ళేం. 

మెనూ లో మాకేం కావాలో ఆర్డర్ ఇవ్వడం దగ్గరనించి ఫుడ్ సర్వ్ చెయ్యడం వరకు రెస్టారెంటు స్టైల్ లాగే ఉంది. 

పెద్ద అద్దాల్లోంచి పట్టాల బయటి ప్రకృతిని ఆస్వాదిస్తూ భోజనం చెయ్యడం బాగా నచ్చింది మాకు. 

ఇక ఫుడ్ కూడా రుచికరంగా చాలా బావుంది. అప్పటివరకు బానే ఉన్న సిరి ఆ పూట సరిగా తినలేదు. 

తనకి ఇండియన్  ఫుడ్ బాగా ఇష్టం. అమెరికన్ ఫుడ్ సరిగా తినదు. అందువల్లనేమో అనుకున్నాం. 

మధ్యాహ్నం మూడు గంటల వేళ దెనాలి నేషనల్ పార్కు స్టేషనుకి చేరుకున్నాం. పట్టాల్ని ఆనుకుని ఉన్న 

పార్కింగులాటులో నేషనల్ పార్కు కి వెళ్లే బస్సు మాకోసం సిద్ధంగా ఉంది. 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.