స్త్రీల స్వీయ అస్తిత్వ చైతన్య ఛాయలు

శారదాదేవి కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

                                                                       

1950 దశకం తర్వాత తెలుగు సాహిత్యంలో ఏ ఉద్యమాలు లేకపోవడంతో కవిత్వంలో కొంత వరకు స్ధబ్దత  చోటుచేసుకుంది. కానీ కాల్పనిక సాహిత్యంలో ముఖ్యంగా కథా సాహిత్యంలో మాత్రం ఈ దశకంలో ఎక్కువగానే రచనలు చేయడం ప్రారంభించారు. మారిన సామాజిక సందర్బం కారణంగా స్త్రీలు తమని తాము గుర్తించటం (అస్తిత్వం) పురుషులతో పాటుగా సమాన గౌరవాన్ని కోరుకోవటం, ఆస్థానాన్ని పదిలం చేసుకోవటం కోసం తమలో చెలరేగుతున్న అసంతృప్తులను, అన్యాయాలను మొట్టమొదటిసారిగా ఈ దశకం లో స్త్రీలు పడిన తపన స్పప్టాస్పష్టంగానైనా సరే కనిపిస్తుంది. 1950 దశకం తరువాత స్త్రీల మనోభావాలలో ప్రారంభమైన మార్పు ఎనభై దశకం వచ్చేసరికి ఒక  సిద్ధాంత  రూపాన్ని సంతరించుకోగలిగింది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం స్త్రీలు తమ భావాలలో వస్తున్న అస్తిత్వ స్పృహను గుర్తించి ప్రతిస్పందించడానికి, ఉద్యమించడానికి మూడు దశాబ్దాల కాలం అవసరమైంది.

జాతీయ అంతర్జాతీయ మహిళా ఉద్యమాల ప్రభావం, సామాజికంగా స్త్రీలపై జరుగుతున్న  పురుషాధిపత్య దాడులు, వివిధ రంగాలలో స్త్రీల ప్రాధ్యాన్యతకు అవకాశంలేని పితృస్వామ్యవ్యవస్థ చూపుతున్న వివక్ష, వీటన్నింటికి మించి అపుడపుడే తెలుగు సమాజంలో విద్యావంతులైన  స్త్రీలు తమ గురించి తాము అలోచించటంతో పాటు రచనలు చేయడం ప్రారంభించారు.

         ఒకనాడు స్త్రీలు తమ భావాల్ని వెల్లడి చేయడానికి తగిన సామాజిక వాతావరణం లేకపోయింది. సామాజిక మార్పుల నేపథ్యంలో స్త్రీలు చైతన్య వంతులైనారు. ఈదశలో స్త్రీలు తమ వ్యక్తిత్వాన్ని స్థిరీకరించుకొంటూ ఇన్నాళ్ళుగా గొంతు విప్పని స్త్రీలు స్వేచ్ఛగా కాకపోయినా వ్యక్తావ్యక్తంగా  తమ రచనల్లో వాటిని పొందుపరిచారు. స్త్రీల కుటుంబ నేపథ్యాన్ని బట్టి సామాజిక స్తితిగతుల్ని, ఆర్థిక , రాజకీయ అవగాహనను బట్టి కలిగిన భావాల రూపకల్పనలో కనిపిస్తుంది. ఈమె  రచనల్లో శ్రామికుల పట్ల సానుభూతి, ,శ్రమను దోచుకునే విధానంపట్ల నిరసనా కనిపిస్తున్నాయి.

         నేటి సామాజిక వ్యవస్థలోని వైవాహిక జీవితాన్ని, నానాటికీ సంక్లిష్టమౌతున్న వివాహ సంబంధాల గురించి రాసిన కథలు కనిపిస్తున్నాయి. స్త్రీల భావప్రకటనాశక్తిని పితృస్వామిక వ్యవస్థ నియంత్రిస్తున్న వైనాన్ని ఆ అదుపునుండే స్త్రీలకు తమ స్థితిగతుల వ్యక్తీకరణ కూడా సాధ్యమవుతూ వచ్చింది. అందుకే పురుష స్వభావ చిత్రణలో ఔన్నత్యంగల పురుష పాత్రల చిత్రణ ఆచంట శారదాదేవి కథల్లో కనబడకపోవడం గమనించదగిన అంశం.

 ఈమె కథలు నాలుగు సంకలనాలుగా వచ్చాయి.”పారిపోయిన చిలుక” (1963),”ఒక్కనాటి అతిథి” (1965), మరీచిక (1969), వానజల్లు. (1991).ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 1922 లో శారదా దేవి  విజయవాడలో జన్మించారు. 1954 నించీ 77 వరకూ తిరుపతి పద్మావతీ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. 1999 లో మరణించారు.

 శారదాదేవి కథలు చదువుతోంటే  అందులోని పాత్రలన్నీ మనకు తెలిసినవారిలా, రోజూ మనింటికి వచ్చిపోతూన్న మన ఇరుగు పొరుగువారిలా, మన మనసును అక్రమిస్తారు. అందులో ఎవరూ మనకు తెలియని తీరులో నడుచుకోరు. మనం వినని రీతిలో మాట్లాడరు. మనం స్పందించని తీరులో స్పందించరు. మనం ఆలోచించని తీరులో ఆలోచించరు. వారందరూ మనకు అయినవారిలా మన కళ్లల్లో కదులుతారు. ఆడవారైనా మగవారైనా  అంతే.        ఇంచుమించు ప్రతి కథ వెనుక అంతర్లీనంగా ఆవేదన, నిరాశ, నిస్పృహ కనిపించడం గమనించవలసిన విషయం. ఆ నిరాశను ఆశావాదంతో పాటు, పురుషడంతే, స్త్రీ అంతే ఇలాగే ఉండాలని, అది స్త్రీకి సహజమైన విషయమనే సహజధోరణిలో ఉండే కొంతమంది నిరాశావాదులు అనాటి కథకుల్లో కనిపిస్తున్నారు. మొత్తంమీద అనాడు సమాజం ఇంకా స్త్రీలకు పురుషులతో సమానంగా భావ స్వేచ్ఛ ఇవ్వలేదనే విషయాన్ని మనకు తొలితరం స్త్రీ రచయిత్రులైన అచంట శారదాదేవి, అబ్బూరి ఛాయదేవి,మొదలగు రచయిత్రల రచనల్లో స్త్రీవాద ఉద్యమం, ఉద్యమ భావాలు మొదలవక ముందే స్త్రీ అస్తిత్వ స్పృహను కలుగజేసే ఇతివృత్తంలోను, శిల్పరీత్యా కూడా ఉదారవాద, స్ర్తీవాద భావజాలం ఛాయలు ఈమె కథల్లో కనిపిస్తాయి.

ఆచంట శారదాదేవి కధలలో రవీంద్రనాధ్ టాగోర్,దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావం కనబడుతుంది. ప్రకృతి ఆస్వాదన,సంగీతం పట్ల అభిరుచి ,ఎవరినీ నొప్పించని సున్నితత్వం ,ఉన్న పరిస్థితిల్లోనే ఏదో ఒక ఉపశాంతిని కనుక్కుని జీవితాన్ని నడుపు కోవడం,కొంత మానసిక విశ్లేషణ, ఈ మె రచనల్లో ముఖ్యాంశాలుగా వుంటాయి.   శారదాదేవి గారికి కొండలంటే ఇష్టం. కొండల మీదుగా జారే సెలయేళ్లంటే ఇష్టం. ఇంటి చుట్టూ వేసిన మామిడి తోపులు పూలమొక్కలు. ఎండలో అవి మెరుస్తు వుండటం.నడిప్రొద్దువేళ అవి పరిచే చల్లటి నీడలు, జడివాన, కుండపోతవర్షాలు, వాన వెలిశాక కాసే నీరెండ, బరువైన చినుకులు చెట్ల ఆకులమీదుగా జారిపడుతూ చేసే చప్పుడు ఇలా ప్రకృతిలోని ప్రతి కదలిక ఆమెకు చాలా ఇప్ష్టం. అందుకే  తన పాత్రల ఆలోచనలకు వీటన్నిటీనీ నేపథ్యాలుగా తన కథల్లో మలుచుకున్నారు. స్త్రీల జీవితాలలోని వెలితిని గుర్తించారు. కానీ, దాన్ని ఎదిరించలేని పాత్రలు… , ప్రేమ, ఆరాధనలకే తన కథల్లో  ఎక్కువ  ప్రాముఖ్యమిస్తారు. లోకం పోకడలవల్ల స్త్రీలు కోల్ఫోతున్న స్పేస్ పట్ల  తాత్వికమైన ఆలోచనలు, వాటి తాలూకు అనుభవాలను ,,హాయిగా సామాన్య పాఠకుడు సైతం చదువగలిగిన లలితమైన శైలిలో రాశారు.

       చిన్న చిన్న వాక్యాలూ, సూటిగా చెప్పేతీరూ, మనసు లోపలి పొరల్లో దాగివున్న భావాలను సుతారంగా బయటికి తీసే నేర్పూ, తాను చూసినవీ, తనకు తెలిసినవి తాననుభవించినవీ మాత్రమే అవిష్కరించే నిజాయితీ మాటలతో పాఠకులను కదిలించి, ఆశ్చర్యపరుస్తుంది. మనోలోకాల కవాటాలను తెరిచేట్లుగా కథనాన్ని అల్లగల శైలీ, చక్కటి కథనంతో అలవోకగా చెప్పగల నైపుణ్యం అచంట శారదాదేవి  కథలకు ఉచ్చ్వస నిశ్శ్వాసాలు.

1950లలో స్త్రీలు రచనారంగంలోకి అడుగుపెట్టి ౧౯౬౦ దశకంవచ్చేసరికి చాలా  విరివిగా రాయటమే కాకుండా తెలుగు కథాసాహిత్యం పైన ఒక ప్రత్యేక ముద్ర వేయగలిగారు. స్త్రీల పేరుతో రాస్తేనే పాఠకుల అభిమానాన్ని చూరగలం అన్న ధోరణి కూడా కొంతమందిలో కలిగింది. అలాంటి  సంధర్బపరికల్పన చేసిన  ప్రసిధ్ధ కధా రచయిత్రులలో శారదాదేవి ఒకరు. ”పగడాలు” “ఒక నాటి అతిథి” “అమ్మ ’ మరీచిక” ’ఆడవిదాగిన వెన్నెల” “పారిపోయిన చిలక”, “మారిన మనిషి” “వంటి ప్రాచుర్యం పొందిన కధలు ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు వంద కథలు వ్రాసి వుంటారు. ఆమె  కథలన్నింటిలోకీ “పారిపోయిన చిలుక” శారదాదేవి భావజాలాన్నికి ప్రాతినిధ్యంగా నిలిచే కథ. అందులో శిల్పం, తాత్వికత, వర్ణన,వస్తువు చక్కగా  కలిసిపోయాయి . సహజంగా యువతులకుండే జీవనకాంక్షతో కళకళ లాడుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సామాన్య కుటుంబంలో పుట్టిన కామాక్షమ్మ. ఈమె ఎనిమిదో క్లాసు వరకే చదువు కుంది . తన స్నేహితురాలిలాగా తనకు కూడా ఒంటినిండా నగలుంటే బావుండుననుకుంటుంది. కుటుంబ పరిస్థితుల వల్ల ఆమెకు పదిహేనేళ్ళ వయసులో ముఫ్ఫై ఏళ్ళ సుందరరావుతో పెళ్ళి కుదురుస్తున్నప్పుడు,”వంటీ నిండా నగలు పెడతారా?”అని తల్లినడిగింది. పల్లెలో.మామిటితోటా ఇల్లూ వాకిలీ నౌకర్లూ చాకర్లూ వున్న సుందరరావుకి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టిన కామాక్షమ్మ త్వరలోనే అతని వస్తు సముదాయంలో ఆమె కూడా ,అతని  సామాజిక గౌరవాన్ని పెంచే ఒక వస్తువులాగే వుంటుంది.  అతనికీ తనకీ మధ్య ప్రేమ అటుంచి కనీస బాంధవ్యమేమీ లేదనీ, అంత ఇంట్లో తనకి మానవ స్పర్శ కరువైందనీ తెలుకుంది. అతను రోజూ దగ్గరున్న పట్టణానికి  పొద్దున వెళ్ళి రాత్రికొస్తాడు.వచ్చాక కూడా ఆమెతో ఒక మాటా మంతీ లేదు. ఆమె పలకరించినా వెళ్ళి రేడియో వినమంటాడు…అతని వ్యాపకాలు అతనివి. కనీసం అతను రోజూ  పట్టణానికి  వెళ్ళి చేసే వ్యాపారమేమిటో కూడా ఆమెకి తెలియదు. ఆమెకి చెప్పవలసిన అవసరం అతనికి లేదు.

 కామాక్షమ్మ వంటరితనానికి గాయపడ్డ చిలుక తోడయ్యింది. దాన్ని దగ్గరకు తీసి పంజరంలో పెట్టి చిన్నారి అని పేరుపెట్టుకుంది. దాని పోషణలో, మాటలు నేర్పడంలో ఆనందం వెతుక్కుంటుంది.కానీ ఒకనాడు పొరపాటున పంజరం తలుపు తీసిపెడితే చిలక పారిపోయిందని ఆమె దిగులు పడుతుంది,మళ్ళీ వసంతం వచ్చి మామిడి చెట్లు పూతకి రాగానే చిలకలు తోటలోకి వస్తాయి.ఒకదాన్ని పట్తితెచ్చి పంజరంలో పెడతామంటే కామాక్షమ్మ వద్దంటుంది. వాటిని స్వేచ్చగా వచ్చి తోటలో తిరిగి పోనిమ్మని, వాటిని చూడ్డంలోనే ఆనందం వుందనీ అంటుంది.పంజరంలో చిలుకకూ తనకూ పోలిక అర్థం అయినా అల్లా ఎగిరిపోవాలన్న కోరిక ఆమెకి లేదు. ఆమెను బాధించిన స్నేహరాహిత్యాన్ని మాత్రమే కధనం చేయడం రచయిత్రి సాధించిన విజయం.

శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవపరిధిలో వున్న మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవ వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికి నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు ఆవిష్కరించారు.  శారదాదేవి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అందంగా, మనసులోంచి అలవోకగా పుట్టినట్టు ఉంటాయి. ఎదుటి వారి మనసులను సుతారంగా తాకుతూ ఉంటాయి. “ఈ కథలు చదువుతుంటే నిర్మలమైన నదిలో స్నానం చేసినట్లు ఉంటుంది” అని భుజంగరాయశర్మ అన్న మాటల్లో కూడా  శారదాదేవి రచనా వ్యక్తిత్వం ద్యోతకమవుతూంది.

    శారలదాదేవిగారి కథలు చదవటానికి అలవాటుపడ్డ పాఠకులు వూహించలేని కొన్ని కథలు కూడా వున్నాయి. ఈ కథలు బడుగువర్గాల వారి నిత్యజీవన రేఖలు, వారి బతుకుల్ని స్వయంగా చూసి, వారి ఆలోచనలను పసిగట్టి, వారి అనుభవాలు తన అనుభవాలుగా మర్చుకొని రాసిన కథలు. వున్నవారికీ, లేనివారికీ, మధ్య వున్న తేడాలను చెప్పే కథలు, సమాజం ఎలా నడుస్తున్నదో చెప్పటం కాదు. సమాజాన్ని ఎలా మార్చాలో పరిష్కారాలు అలోచించటం వేరేవారి పని అన్నట్లుగా సున్నితంగా వాటిని మన ముందుకు చర్చకు పెడతారు. సమస్యల వాస్తవాలు చెప్పటం మట్టుకే రచయితగా నాపని అన్న మనస్తత్వం కనబడుతుంది.

       “ వానజల్లు” కథలో పార్వతికి వాళ్ల బావంటే వెర్రి యిష్టం. అతడు అమెరికా వెళ్లి, తన్ను మర్చిపోయి, ఎవరినో పెళ్లి కూడా చేసుకుని అక్కడే వుండిపోతాడు. బావమీది మమకారం చంపుకోలేక పెళ్లి మానుకుని పార్వతి తన ముసలి తండ్రితో ఒంటరి జీవితం గడుపుతూంటుంది. అంతటి నిస్పృహలోకూడా ఎక్కడో లోలోపల బావమీది మౌనరాగం లీలగా కదులుతునే వుంటుంది. ఒకరోజు కుండపోతగా కురిసి వెలిసిన వాన మళ్ళీ మొదలౌతుంది. కొద్ది క్షణాలకు ఒక కొత్త మనిషి లోపలికొచ్చి వరండాలో నిలబడి ’ నేను సునంద తండ్రినండీ’ అంటాడు. సునంద ఎవరో ఆమెకు జ్ఞాపకం రాలేదు. కాలేజీలో తన విద్యార్థిని అయి వుంటుందనుకుంటుంది. మర్యాదగా లోపలికి రమ్మని పిలిచి,  “సునంద ఇప్పుడెక్కడుందండీ” అని అడుగుతుంది.అమెరికాలో వుందని చెప్పి చినుకులు వెలవగానే అతను వెళ్లిపోతాడు. పార్వతి మసస్సులో తీపి కదలికలు మళ్ళీ మొదలౌతాయి. రెండు నిమిషాలు తమ వరండాలో అగి వెళ్లిపోయిన ఆ కొత్త వ్యక్తి తనకిప్పుడు చుట్టుమనిపించాడు. ఇంతకుముందు ఎంత ఆలోచించినా గుర్తురాని సునంద తనకెంతో ఆత్మీయురాలనిపించింది. వారిద్దరినీ పరిచయం చేసిన “ వానజల్లు” మరీ ఇష్టమనిపించింది. “ వానజల్లు” లోతడుస్తు వూగుతున్న పూలమొక్కలు ఆమెకు చాలా ప్రియమైన బంధువులనిపించాయి. ఆమెకిక  ఒంటరితనం లేదనిపిస్తుంది. బావమీద తన అంతరాంతరాల్లో దాగివున్న ప్రేమ వల్ల తనకెంతోమంది అయినవారయ్యారని భావిస్తుంది.  బావ పట్ల ఆమెకున్న అనురాగం వల్లనే ప్రకృతి లోని ప్రతి అందం ఆహ్లాదకరంగా తన బంధువులుగా భావించగలిగింది. ఆమెలోని ప్రేమతత్వం ఆమె ఆలోచనలు, జీవితం ఆనందంగా మారిపోవడానికి కావలసిన ఆలంబన ఆమెకు దొరికింది. ఇక్కడ రెండు అంశాల్ని గమనించాలి. ఒకటి తను బావ ప్రేమను హృదయంలో నింపుకోవడానికి, ఆమెకు అతనితో జరిగే  వివాహం ప్రమేయం కాకపోవడం. రెండు అతడు అవివాహితుడు కాకపోవడం. ఇవేమి ఆమె ప్రేమను విచ్చిన్నం చేయలేక పోవడం. ఆకాలంలో ఇలాంటి ఆలోచనలకు సామాజిక ఆమోదం లేకపోయినా శారదాదేవి తనకథలో ఈ బావాలను నిర్భయంగా బయటపెట్టగలిగింది. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి విమర్శకుల మెప్పును కూడా పొందిందనడానికి సాక్ష్యం ఆయన వాక్యాలే.

         “వికాసోన్ముఖమైన అనుభవ పరిణితి చాలని సీమంతిని హృదయంలోని వేదన ఇది. ‘ఇంతేనేమో’  అనికాని ‘ఇంతే’ అని ధైర్యంతో చెప్పలేని హృదయ దైన్యం, ధైర్యంగా వేషం వేసుకోవడానికి ముందు జీవిత నేపథ్యంలో చూపే అవ్యవస్థ, తొందర -ఈ వేదన. దాన్ని ఎంతో సహనుభూతితో ఈ ప్రబంధ సంగ్రహంలోని ఒక్కొక్క ఖండికలోనూ చల్లగా సన్నని కంఠంతో చిత్రించారు. శ్రీమతి అచంట శారదాదేవి”.

            “ ఈ ప్రశ్నకు బదులేదో” శారదాదేవిగారికి తెలుసు. ఈ ప్రశ్నకు బదులేదో తెలిసిన సంస్కర్తలూ, కార్యకర్తలూ వందలాది సంవత్సరాలుగా సమాజాన్ని మార్చటానికి పరిశ్రమిస్తున్నారని కూడా వారికి తెలుసు. అలాంటివారి పరిశ్రమకు చేయుతగా తాము ఎప్పటికైనా కొత్తరకం కథలు కొన్ని రాయక తప్పదని కూడా వారికి తెలుసు. ఆ కొత్తతరం కథల కోసం ఆంధ్రదేశం చాలాకాలంగా ఎదురుచూస్తోంది. ఈ సంధర్భంలో  ఆచంట శారదాదేవి ని గురించి ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు అన్నమాటల్ని గుర్తుచేసుకోవడం అసంధర్భం కాదనుకుంటాను.

            “ఏ ఉత్తమ రచనకైనా అనుభవం అతి ముఖ్యం. ఈ అనుభవం వల్లనేనిజాయితి కలుగుతుంది. అతి ప్రధానమైన ఈ నిజాయితీకి అందము, అలంకరణ కోసమూ ఊహా, కల్పనాసాయపడతాయి. నిజమైన అనుభవము ఈ ఊహా, కల్పనలతో ఎంతో ఆకర్షవంతంగా అమరుతుంది అది సాధించినవారు మనకు సన్నిహితులవుతారు. శారదాదేవి ఇట్లాంటి రచయిత్రి.”

స్త్రీ పురుషులిద్దరిలో భావావేశం, ఆర్తి తపనలు ఒకటిగానే ఉన్నపుటికీ, స్త్రీ పురుషునిలాగా భావాల్ని వ్యక్తం చేయలేదు. తనలో కలిగిన భావ సంఘర్షణలను తనలోనే దాచిపెట్టాలనుకుంటుంది. స్త్రీల  మనస్తత్వం పురుషుల మనస్తత్వం వలె ఆవేశపడదు. స్త్రీలలో సంయమన శక్తి అధికమటం వలన దానికి ఆలోచన జతపడడంవలన  వాళ్ళ అభిప్రాయాలను వెల్లడించడం జరుగుతుంది. రాజకీయ, సామాజిక చారిత్రక నేపధ్యాన్నుంచి చూసిన స్త్రీల కథలలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటున్నారు. పరిష్కారం కోసం మార్గనిర్దేశంకూడా అస్పష్టంగా  కనిపిస్తుంది.

 

ఎక్కువ కధల్లో యువతులు ఒక అపరిచితుడిపైనో చిన్నప్పటి స్నేహితుడిపైనో మక్కువ పెంచుకుని దాన్ని ఆరాధనగా మార్చుకుని  అందని ద్రాక్షపండుకోసం జీవితకాలం నిరీక్షిస్తూ వుంటారు. “వానజల్లు” కధలో పార్వతి ఆమె బావను ప్రేమించింది.కానీ అతను అమెను ఇష్టపడడు. ఆమె లెక్చెరర్ గా పని చేస్తూ తండ్రిని చూసుకుంటూ వుంటుంది..తన ఇల్లూ ఇంటి ముందరున్న తోటా, తండ్రి ప్రేమ, విధ్యార్ధుల అభిమానం, ఆమె జీవితాన్ని నడిపే చోదక శక్తులు.

”చారుశీల” అనేకథలో మంజిష్ట అనే అమ్మాయికి తన మేనమామ మరొకర్ని వివాహమాడాడని తెలుసు.అతను పెళ్ళిచేసుకున్న చారుశీలకి అతనంటే వల్లమాలిన అభిమానమేకాక ఒక పొసెసివ్ నెస్ ఉందని కూడా తెలుసు.తల్లి పోగానే ఆమె మేనమామ దగ్గరికే వచ్చింది.అయినా అతన్నే ఆరాధించింది.అతన్ని తప్ప వేరొకర్ని చేసుకోదు. చివరికి నదిలో పడి మరణించింది.అ మేనకోడలి మరణానికి కొంతవరకు చారుశీల పొసెసివ్ నెస్ కారణమన్నట్లు అర్ధమౌతుంది.

”దిగుడుబావి” అనే కధలో చంద్రమల్లి అనే అమ్మాయి ఆవూరిలో ఏదో పని వుండి వచ్చిన హరిరావుపైన మనసు పడుతుంది. అతను వెళ్ళిపోతే ఆ వేదన భరించలేక చనిపోవాలని అనుకుని మళ్ళీ తన మరణం తన వాళ్ళనెంత కృంగతీస్తుందో గ్రహించుకుని ఆప్రయత్నం మానుకుంటుంది.కానీ అతన్నే తలుచుకుంటూ  దిగుడుబావి దగ్గరకు వెళ్ళి కూర్చొంటూ వుంటుంది. ఆరాధనే జీవన సార్థకతగా భావించటం  ఒక ఎత్తైతే, స్త్రీ జీవితమంతా ఒకే పురుషస్పర్శలోనే వుండటం  ఆకాలంనాటి స్త్రీల జీవతాదర్శంగా ఈమె కథలు నమోదు చేశాయి.

”నిలువలేని నీరు” కథలో ధరణి తన బావను ప్రేమించింది.అతని నడత మంచిదికాదని చెప్పినా అతన్నే పెళ్ళిచేసుకుంటానని పట్టుపట్టింది.అతన్ని అమెరికా పంపించి పై చదువులు చెప్పిస్తానని ధరణి తండ్రి ఆమెతో పెళ్లికి వప్పిస్తాడు. అతను ధరణిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు.తిరిగి వచ్చినా ఆమెను పిలవడు.పైగా వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోటానికి ఈమెను పెళ్ళి రద్దు చేసుకున్నట్లు రాసిమ్మంటాడు.అతనడిగిందేచాలని రాసిస్తుంది.అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నది.కానీ చివరికి అతను ధరణిని రమ్మని కబురు పెట్టాడు.కబురంపిందేచాలని సంబర పడుతున్న ధరణికి ఆమె చెల్లెలు అతనెందుకు రమ్మన్నాడో చెప్పింది.అతని కొత్త భార్య గర్భంతొ వుండి పని చేసుకోలేక పోతున్నది కనుక ఆమెను రమ్మన్నాడు.అయినా అదే మహాభాగ్యమని ఆమె ఒప్పుకుంది..అప్పుడు వెన్నెలలో ఆమె ముఖం పసిపాపలా మెరిసింది, ఎంతైనా మనసులోపలి మమకారం మాసిపోదేమో అనుకుంది చెల్లెలు.

”మరీచిక” అనే కధలో నీల కూడా తాముండే పరిసరాలను అధ్యయనం చెయ్యడానికొచ్చిన ఒకతన్ని ప్రేమించి అతను వెళ్ళిపోగానే దుఃఖసాగరంలో కూరుకు పోయింది. ఒకసారి ఒకరిని ప్రేమించాక,జీవితమంతా అతనికోసమే అర్పించాలని అతని బలహీనతలన్నిటితో సహా అతన్ని స్వీకరించాలని,లేదా అతన్నే ఆరాధిస్తూ జీవితం గడిపెయ్యడమే గాఢమైన ప్రేమకు చిహ్నం అనేది రచయిత్రి భావన.

 

“కారుమబ్బులు”కథలో  ఒకే ఆఫీస్ లో పని చేసే యువతీయువకులిద్దరు పరిచయం పెరిగి ఇష్టపడి పెళ్ళిచేసుకుని కలిసి మెలిసి కాపురం చేసుకుంటూ వుండగా భార్యకి ప్రమోషన్ వచ్చింది.ఆమె తన కలీగ్స్ కు పార్టీ ఇస్తే అతను వెళ్ళడు.ఆ క్షణం నించీ అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. అతను ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడని గ్రహిస్తుంది..అతను అక్కడ రాజీనామా చేసి వేరే ఉద్యోగం చేసుకుంటానంటే ఆమె రాజీనామా చేసి అతన్ని సంతోష పెడుతుంది.అతని మనసుకి పట్టిన మబ్బు విడిపోయింది కానీ ఆమె ఇప్పుడు అతనికి అంత సన్నిహితంగా మెలగలేకపోతుంది. తన ప్రమోషన్ ని సహించలేక పోయిన అతని సంకుచితత్వం గుర్తొస్తూ వుంటుంది.. ఆ మబ్బేదో తనని ఆవరిస్తున్నదనిపిస్తుంది. కానీ తన ప్రవర్తనకు తనే నవ్వుకుని ఆందులోనించీ బయటికి రావాలనుకుంటుంది. “ఉదాత్తంగా ప్రవర్తించడం స్త్రీలు అలవాటు చేసుకోవాలికదా!” అని ఉదాసీనంగా వ్యవహరిస్తుంది.

 “అందం” కథలో కూడా రచయిత్రిలోని ప్రాకృతిక ప్రేమతత్వం ఎంతవరకు పర్యవసించిందో చెప్పడానికి ఉదాహరణగా నిలిచే కథ ఇది. అందుకే కొంత వివరంగా మాట్లాడుకోవాల్సిన కథ కూడా. ఈకధలో మాలతి అందమైనది. పసితనం నించీ ఆమె అందం అందర్నీ ఆకర్షించేది.అది ఆమెనొక్కక్కసారి చాలా చికాకు పెట్టేది కూడా.చిన్నప్పుడు బుగ్గలు పుణకడం,కౌగిళ్లల్లో బంధించడం వంటివి.. రాను రాను ముసలి వాళ్ళు కూడా తినేసేలాగా చూడ్డం, అబ్బాయిలు వెంటపడ్దం ఇవ్వన్నీ స్త్రీల సహజానుభవాలే .అట్లాగే తోటలో అందం గా పూసిన పూలను తెంచేదాకా కొంతమందికి తోచదు.చెట్టునుంటె కళ్ళకీ మనసుకీ ఆనందం కలిగించే పూలను తెంపి ఒక్కక్షణం ఆనందించి పడెయ్యడమూ అంతే సహజం. మాలతి అందం చూసి ముగ్ధుడైన జడ్జిగారబ్బాయి ఆమెను కోరి పెళ్లిచేసుకున్నాడు. అయితే ఆ అందాన్ని పక్కన పెట్టుకుని బయటకి వెళ్లినప్పుడల్లా అతనికి ఆమెను అందరూ అట్లా చూడ్డం నచ్చదు.పమిట కప్పుకోమని అలాంటివన్నీ అంటూ వుంటాడు.ఆమె అతనితో బయటకు పోవడం తగ్గించింది.

 మాలతి కూతురు చిన్నపాప మాలతిలాగే అందంగా వుంటుంది.ఎవరో హైస్కూల్ పిల్లాడు అ పిల్ల బుగ్గ గిల్లితే అక్కడ గిల్లిన గుర్తుపడింది.ముందు కోపం వచ్చింది మాలతికి.ఎవరైనా గిల్లితే మళ్ళీ గిల్లు,మాష్టర్ కి రిపోర్ట్ ఇవ్వు అని చెప్పాలనుకుంది “ అయినా ఎవర్నని ఏంలాభం ,మానవ ప్రకృతి మారదు.మౌనంగ భరించక తప్పదు’ అనుకుంటుంది..అట్లా చెబితే పాపలో సున్నితత్వం నశిస్తుందంటుంది. మొరటుదైపోతుంది అనుకుం టుంది.పాప తండ్రి పాప బుగ్గ చూసి కోపంతో మండిపడతాడు. హేడ్ మాష్టర్ కి చెప్తానంటాడు. మాలతి నవ్వుకుంటుందంటుంది. మాలతి ఆలోచనల్లోని అపసవ్యత ఎదిగీ ఎదగనిస్త్రీల ఆలోచనలకు ప్రతిరూపం.అసలు స్త్రీలను పువ్వులతో పోల్చడమే ఈకథలోని ప్రాధమిక అభ్యంతరం.

పువ్వులు కొయ్యకుండా వంటావిడ ఎవర్నీ ఆపలేదు. తండ్రి కూడా పాప బుగ్గ గిల్లకుండా ఎవర్నీ అపలేడు, అరిచి నవ్వులపాలవడం తప్ప అనుకుంటుంది .ఇంకా అందంగా వుండడం పాప చేసిన తప్పు ,అందంగా వుండడం పువ్వులు చేసిన పాపం అనికూడా అనుకుంటుంది.మన ముంగిట్లో తోటపూలు మనం కాపాడుకోలేమనీ, మన పిల్ల బుగ్గ కమిలి పోయేలా గిల్లితే మనం ’అదంతే” అని ఊర్కోవాలని చెప్పిన ఈ కధనిశారదాదేవి కథలను ఎంత ఇష్టపడ్డవారికైనా అర్ధం చేసుకోడం కష్టమే.

 స్త్రీలపై వయసుతో నిమిత్తం లేకుండా  జరిగే లైంగిక వేధింపుల్ని అండర్ టోన్స్ లో చక్కగా చెప్పిన ఈ కధ ముగింపు కొచ్చేసరికి అట్లా మిధ్యా వాదం లోకి మళ్ళింది. స్త్రీవాద ఉద్యమం స్త్రీలకిచ్చిన స్థైర్యం ఈకథలో తెలిపిన చేష్టలన్నీ లైంగిక పరమైన భావానలోనుండి పుట్టిన వ్యక్తీకరణ రూపాలని చాలా స్పష్టంగాస్త్రీవాద రచయితలు తమ  కథలలో తెలుపుతున్నారు. తమ పిల్లలకు ఈ అంశంపై తర్ఫీదు ఇవ్వాలని కూడా గీతాంజలి వంటి రచయిత్రుల సాహిత్యం డిమాండ్ చేసే దశకు చేరుకున్నాం. ఆచంట శారదా దేవి కథల్లో వ్యక్తమైన ఉదారవాద భావాలు అస్తిత్వ ఛాయల దశ నుండి స్త్రీలుగా, స్త్రీవాదులుగా  చేస్తున్న ఒక సుధీర్ఘ ప్రయాణాన్ని అంచనావేసేందుకైనా  ఈమె కథల్ని తప్పక చదవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తుంది.

స్త్రీవాద భావజాల స్పర్శతో సాగిన ఆచంట శారదాదేవి కథల్ని పునర్మూల్యాంకనం చేస్తే, ఆకాలంనాటి స్త్రీల ఆంతరంగిక జీవితం బాహ్య సామాజిక స్థితిగతులతో సంగర్షించిన వైనం, అందులో నుండి బయటపడలేని స్త్రీల అసహాయత,సామాజిక పరిమితులు, పురుషాధిపత్య నియంత్రిత స్వభావం, తద్వారా ఏర్పడిన జీవన నిర్వేదంను చాలా శక్తివంతంగా రచయిత్రి ప్రొజెక్ట్ చేశారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.