చదువువిలువ

-రమాదేవి బాలబోయిన

రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ

కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు

నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది

“శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ మూడుకాళ్ళ ఆసరాతోని నడుసుకుంట పోయింది నర్సమ్మ

శ్రీనివాస్ గవర్నమెంటు బడిలో పంతులు నౌకరీ చేస్తున్నడు…తండ్రి అతని పదోయేటనే చనిపోతే ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు,తమ్ముడి చదువు ఇంటిల్లిపాది పోషణ అంతా తన లేత భుజాల మీద వేసుకుని ఎల్లదీసిండు.

అన్ని బాధ్యతలు అయిపోయి తమ్ముడికి ఇంజనీరుగా హైదరాబాదులో ఉద్యోగం దొరికి ఓ ఇంటివాడు అయ్యాకనే..తన ముప్పయ్యోఏట శ్యామలను పెళ్ళి చేసుకున్నాడు.

పుట్టినసంది కష్టంసుఖం తెలిసినోడు కాబట్టి ప్రతీఖర్చూ ఆచితూచి పెట్టేవాడు..పాపం…శ్యామల కూడా భర్తకు తగ్గట్టుగా నడుచుకునేది..అన్ని విధాల బాగున్న ఆడపడుచులు ,మరిది కూడా ఇప్పటికీ తమ మీద పడి దోపిడీ చేస్తున్నా కూడా భర్తను పల్లెత్తుమాట అనేది కాదు..ప్రతీదీ సర్ధుకుపోయేది

ముసలితనానికి వచ్చిన తల్లిని ఎవరూ అరుసుకోకున్నా తనే కోడలూ,కూతురు అయ్యి సేవలు చేస్తుండేది…పెళ్ళైన కొత్తల్లో నర్సమ్మ అత్తరికం చూపించేది…కాని..సౌమ్యురాలైన శ్యామల ముందు తన ప్రవర్తన సిగ్గుపడేలా చేసేది..కూతుళ్ళ వేరుబంధం మాటలను పట్టించుకోకుండా కోడలిపైననే మమకారం పెంచుకుని తల్లిలా మారిపోయింది..అయినా ఏం లాభం…అప్పటికే…పుట్టెడు రంధులల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది…ఇపుడు మంచానబడ్డది..

శ్రీనివాస్  కొడుకు బి.టెక్ చదువుతుంటే…కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది..ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల సుగుణాలను పుణికిపుచ్చుకున్నోళ్ళే…పసితనం నుండి సర్దుకుపోయే గుణాలే…కాని…శ్రీనివాస్ కొడుకు మణి…వారంరోజులుగా ఏదో కిరికిరి పెడుతుండు…అది ఎప్పుడూ లేని విధంగా మొగుడూపెళ్ళాలకు గొడవకు కారణమైంది

ఆలోచించుకుంటా…గల్మ దాటబోయి తూలింది నర్సమ్మ…బయట సింకు దగ్గర మొహం కడుక్కునేటోడల్లా ఉరికొచ్చి తల్లిని పొదివిపట్టుకున్నడు శ్రీనివాసు

పసితనం నుంచి కొడుకుపైనే ఆధారపడి…ఈ అవసానదశలో కూడా కొడుక్కి భారమైపోయినాననే బాధతో…నర్సమ్మ కుండెడు నీళ్ళకు ఏడ్చింది

తల్లిని ఓదార్చాలనే సోయి కూడా లేకుండా…తల్లిని వరండాలో ఉన్న కుర్చీలో కూచోబెట్టి….ఆమె పక్కనే ఓ చెక్క కుర్చీ మీద కూలబడిండు శ్రీనివాస్ 

ఇంట్లో నుండి పరిగెత్తుకొచ్చారు..బాపమ్మ  శోకాలకు కొడుకు మణి,కూతురు దీప  

ఏమైందే బామ్మా…పొద్దున్నే ఏంటీ శోకాలు…కాస్త విసుగ్గానే అడిగింది దీప

ఆడవాళ్ళకు కన్నీళ్ళు ఓ వరమేనేమో…ఏదైనా కష్టమొచ్చినపుడు ఏడ్చి గుండెలో భారాన్ని తగ్గించుకుంటారు..మగవాళ్ళకు అలాంటి అవకాశమే ఉండదు…ఎన్ని బాధలోచ్చినా గుండెలో ఓ మూలన దాచిపెట్టుకుని పైపైకి మేకపోతుగాంభీర్యాన్ని చూపిస్తారు

***

ఇంట్లో వాతావరణం చల్లబడటానికి వారం రోజులు పట్టింది..

మణి తెచ్చిన అప్లికేషన్ ఫారాల మీద సంతకం పెడుతూ…చివరికి నీ పంతమే నెగ్గింది కదా అన్నట్లు కొడుకు మొహంలోకి చూసాడు..శ్రీనివాస్ 

నాన్నా…నన్ను మన్నించు..కాని..ఇది తప్పదు…అన్నట్లు తండ్రి మొహంలోకి చూసాడు మణి

సరిగ్గా నెలరోజుల తరువాత..ఒకటోతారీఖునాడు సాయంత్రం తల్లిదండ్రులను కుర్చీల్లో కూర్చొబెట్టి… తన మొదటినెల జీతం,పండ్లూ,స్వీట్లూ పెట్టిన ప్లేటు వాళ్ళిద్దరికీ అందిస్తూ కాళ్ళు మొక్కాడు మణి 

తల్లి కళ్ళల్లో ఆనందభాష్పాలు రాగా…తండ్రి పుత్రోత్సాహంతో గుండెలకు హత్తుకున్నాడు

తండ్రి కష్టాన్ని చూడలేక ఎంతో కష్టపడి సంపాదించిన పీహెచ్ డీ సీటును కూడా వదులుకుని బి.టెక్ తోనే క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగంలో చేరిన అన్నయ్యను వైపు గర్వంగా చూసింది దీప

పసితనం నుండే సంపాదనతో పాటు చదువును కూడా కొనసాగించేందుకు…అహర్నిషలు కష్టపడిన శ్రీనివాస్ కి  నెలరోజులక్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది

స్కూలులో విద్యార్ధులకు పాఠం చెబుతూ ఉండగానే ఉన్నట్టుండి కళ్ళుతిరిగి పడిపోయాడు శ్రీనివాస్ ..పాఠశాలలోని తోటి ఉపాధ్యాయులు వెనువెంటనే  వరంగల్ హెల్త్ కేర్ హాస్పటకి తీసుకువచ్చారు..పరిస్తితి విషమంగా ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు

హన్మకొండలోనే మంచి పొజీషన్లో ఉన్న అక్కలకు,హైదరాబాదులో ఇంజనీరుగా సెటిలైన తమ్ముడీకీ ఆఘమేఘాల వర్తమానాలు పంపారు

ఇపుడంతా కంప్యూటరు యుగమేనాయే…వార్తలను చేరవేసినంత బిరంగా మనుషుల్ని రాబట్టలేకపోయారు

కళ్ళల్ల పెట్టుకుని ఆదరించిన తోబుట్టువుని కనీసం చూసేందుకైనా ఒక్కరూ రాలేదు…కూడబలుక్కున్నట్టుగా ముగ్గురూ మొఖం చాటేసారు..శ్రీనివాస్ మిత్రులే అతనికి సమయానికి అడగకపోయినా సహాయం చేసి ప్రాణాలు నిలబెట్టారు.

హాస్పటల్ నుండి శ్రీనివాస్ ఇంటికి చేరిన నాడే …తమ్ముడి నుండీ వర్తమానం..ఇప్పుడున్న ఆస్తిలో తన వాటా తనకిమ్మని…

చదువు సంస్కారం నేర్పిస్తుందని….బాగా చదివిన తన తమ్ముడు తనకు ఆసరా అవుతాడని భావించిన శ్రీనివాసుకు గుండెల్లో రాయి పడ్డట్లయింది…

కాని…అదే చదువు…తన కొడుకునూ సంస్కారవంతుడిగా చేసి ప్రయోజకుణ్ణి చేసింది.

ఇప్పుడు…శ్రీనివాస్ గుండెల్లో…ఎలాంటి బాధలేదు…అక్షరాన్ని నమ్ముకున్నవాడెపుడూ బాగుపడతాడు…అహంకారాన్ని చూపినవాడు అడుగుబడతాడని నిరూపనైనందుకు అతని ఆనందానికి హద్దులు లేవు

****

Please follow and like us:

2 thoughts on “చదువువిలువ (కథ)”

Leave a Reply

Your email address will not be published.