ఇట్లు మీ స్వర్ణ

-పి సత్యవతి

 పొద్దున్న లేచి, పాలు తెచ్చి, టీ కాచి మంచినీళ్ళు పట్టి తెచ్చి, ఇల్లూడ్చి  వంటింటి పనులు  అందుకుని తమ్ముడుకి తనకీ  బాక్సులు కట్టి షాపుకి తయారైంది స్వర్ణ. , ఎర్ర చుడీ, దానిమీదకి రంరంగుల పువ్వుల కుర్తీ ,పలచని ఎర్ర చున్నీ, వేసుకుంటే జడ లేకపోతె ‘పోనీ’ కట్టుకోవాలి  కానీ జుట్టు వదిలెయ్య కూడదు ‘పోనీ’ కోసం కాస్త జుట్టు కత్తిరించుకుంటానంటే అమ్మ చంపేస్తుంది.చచ్చి నట్టు చిక్కులు తీసుకుని జడ వేసుకోవాలి .షాపులొ పని చేసే వాళ్లకి ఒకే రూలు.మతం బట్టి బొట్టు. హిందువు అయితే తప్పనిసరి . బాత్ రూముల్లో వాడే రబ్బరు చెప్పులు వేసుకోకూడదు .మంచి చెప్పులు వేసుకోవాలి .పెదాలకు లిప్ స్టిక్ వేసుకోకూడదు  నవ్వు పులుముకోవాలి . ఒక సారి అద్దంలో చూసుకుని మూతి విరుచుకుని ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి “అమ్మా నేనొస్తా”అని  కేక పెట్టి చెప్పులు వేసుకుంటూ “చీ చీ “అనుకుంది స్వర్ణ. హీల్స్ బాగా అరిగి పోయి  నడుస్తుంటే ఒక్కొక్కసారి పడేసేటట్టు వుంటాయి .జీతానికింకా వారం వుంది..అప్పటిదాకా  పడకుండా జాగ్రత్త పడుతూ కుంటుతూ పోవాల్సిందే  …బస్సు దొరకలేదు గానీ షేర్ ఆటో దొరికింది .అమ్మయ్య ఆ సురేష్ గాడి కత్తుల చూపులు తప్పినయ్.అప్పుడే షాపు తాళాలు తీశారు .చిమ్మే ఆవిడ చిమ్మింది తుడిచే ఆవిడ తుడిచింది .మేనేజర్ హారతి వెలిగించాడు

సురేష్  తలాకొన్ని పటిక బెల్లం పలుకులు చేతిలో వేసి “ బోణీ బేరాలు పోనీ మాకండి! స్వర్ణా నీకే చెబుతున్నా ! దిక్కులు చూడ్డం కాదు .ముందు ఆ చున్నీకి  పిన్నీసు  సరిగ్గా పెట్టుకో .కాస్త నవ్వు ,నీ సోమ్మేం పోదు ,నిన్నివ్వాళ వర్క్ చీరెల సెక్షన్ లొ వేస్తున్నా ,పండగ ముందు బేరాలు జాగ్రత్తగా చూసుకో “ అన్నాడు . అతను చీరెల సెక్షను హెడ్ .షాపు యజమానుల తాలూకు మనిషి .

సేల్స్ అమ్మాయిలందరికీ ఒకటే డ్రెస్ ..చున్నీ జారితే సురేష్ ఊరుకోడు .ఆ సెక్షన్ లొ పని చేసే పదిమందితోనూ అదే అధికారపు గొంతుతొ  మాట్లాడతాడు. మొన్ననే మనవరాలిని ఎత్తుకున్న సుజాత గారిని కూడా నువ్వు అనే అంటాడు .ఆవిడ అతన్ని మాత్రం సురేష్ గారూ అని అంటుంది అందర్లాగే ..పది నిముషాల తరువాత ఒకా విడ వచ్చింది  .పక్కన ఇంకొకావిడ .సాధారణంగా వాళ్ళు వేసుకొచ్చిన బట్టల్ని బట్టి వాళ్ల అభిరుచి తెలిసి పోతుంది .వాళ్ళు వస్తూనే సుఖాసీనులై “ వర్క్ చీరెలు తియ్” అన్నారు .చాలా మంది కష్టమర్లు సేల్స్ అమ్మాయిలందర్నీ సుజాత తొ సహా నువ్వు అనే సంబోధిస్తారు .“ఎంతలో తియ్యమంటారు మేడం “ అంది స్వర్ణ .

“బాగుంటే ఎంత పెట్టైనా కొంటాం .అదిగో ఆ పై అరలోవి తియ్ “

తీసింది .ధర చీటీలు చూసారు .ఒక్కొక్క చీర తీసి భుజాన వేసుకుని అద్దం  దగ్గర నిలబడి చూసారు .స్వర్ణ తన శక్తి నంతా ధార పోసి “అది మీకు చాలా బాగుంది మేడం! ఇది ఇంకా బాగుంది మేడం!” అని నవ్వుతూనే చెప్పింది. కానీ మేడం లు మొఖాలు చిట్లించారు ఈ రంగుకు ఈ అంచు బాగాలేదు ఈ వర్క్ మరీ గాడీగా వుంది.. అమ్మో ఈ కాస్త వర్క్ కి ఇంత ధరా? ఈ మెటీరియల్ బాగోలేదు అన్నారు .సురేష్ వాళ్లకి శీతల పానీయాలు ఇప్పించాడు .ఈ మధ్య షాపుకి కొత్త హంగులు దిద్దినప్పుడు ఒక మూల నీళ్ళ క్యాను కూడా పెట్టించారు .అక్కడికెళ్ళి ఒక చుక్క తాగి నోరు తడుపుకునే సమయం కూడా ఇవ్వడం లేదీ మేడంలు .స్వర్ణకి అర్థం అయింది .వాళ్లకి నచ్చనివి చీరెలు కావు వాటి ధరలు .. .. ఖరీదైన చీరెల అరలు రెండు ఖాళీ అయ్యాయి .టేబుల్ మీద చీరెల కుప్ప సర్దడానికి భవాని వచ్చింది.ఇట్లాంటి మేడం లంటే భవానికి ఒళ్ళుమంట .సురేష్ చూడకుండా విసుక్కుంటూ అన్నీ మడతేసి సర్దింది .అంత కన్నా కాస్త తక్కువ ధర చీరెల అరలమీద పడ్డారు మేడంలు .సేల్స్ గాళ్స్ కి ఓర్పు ఉండాలి. కొనిపించాలి. ఊరకే వస్తాయా జీతాలూ ! అవును కదా ! ఇవీ అయిపోయినయ్. మేడంలకి చీరేలేవీ నచ్చలేదు. హైదరాబాద్ నల్లీస్ లోనో చెన్నై పోతీస్ లోనో అయితే దొరుకుతాయి వాళ్లకి కావలసిన కాంబినేషన్లు అనుకున్నారు బాహాటంగా ‘”మీ ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు కొనిస్తా పొండి తల్లులూ “అనుకుంది స్వర్ణ లోపల .,విసుగు మింగేసి నవ్వు పులుముకుంటూ “ఏవీ నచ్చలేదా మేడం?” అంది .అంతకన్నా తక్కువ ధరలోని ఒక అరలోనుంచీ ఒక చీరే తీసి “ ఇదిచ్చేయ్ .పాపం ఇంత సేపు బేరం చేసి ఏమీ కొనకుండా పొతే బాగోదు”అంది ఒకావిడ.

వాళ్ళు భుజాన వేసుకుని అద్దంలో చూసుకున్న చీరేలకీ ఆ చీరేకీ ధరలో నాలుగో వంతు తేడా వుంది. .పోనీలే బోణీ బేరం పోలేదు అనుకుంది .ఇట్టాంటి కేసులు రెండు తగిల్తే చాలు తలకాయ పగిలిపోడానికి అనుకుంటూ వుంటే ఒక అంగుళం టీ పట్టే బుల్లి ప్లాస్టిక్ కప్పుతో చల్లారిపోయిన టీ తెప్పించి ఇచ్చాడు సురేష్. ఆపైన ఎవరో వచ్చారు. కొందరు కొన్నారు  కొందరు అవీ ఇవీ చూసి కొనకుండా పోయారు బాక్స్ లొ తిండి చల్లారి పోయింది .ఎదో కూర .భవాని ఒక పెరుగు కప్పు తెచ్చింది .దాని దగ్గర కాసిని డబ్బులుంటాయి మరీ తనలా కాదు .

ఇద్దరూ తింటున్నప్పుడు “నీ మొహానేమిటే! ఆ మచ్చలూ, పేలినట్లు ఆ పొక్కులూ .”అంది భవాని  “దాన్ని ఇంగ్లీషులో “ఎక్నే” అంటారంట అపర్ణ మేడం చెప్పింది  ఫేషియల్ చేయించుకో ఒకసారి”అంది భవాని.తను స్వర్ణ కన్నా తెల్లగా వుంటుంది .వాళ్ళమ్మ నల్లగానే వుంటుంది మరి .భవానికి నాన్న చనిపోయాడు .వున్నప్పుడు తెల్లగా వుండే వాడేమో ! 

 “ఇంకా నయం ఫేషియల్ అంటే వేలతో పనంటగా ! మా అమ్మ వింటే చంపేస్తది”అంది స్వర్ణ ..

“అదేమీ కాదు. మన బజాట్లో టైలర్ షాపు వాళ్ళమ్మాయి బొంబాయిలో నో ఎక్కడో బ్యూటీ చదివొచ్చిందంట. షాపు పైన బోర్డేసింది .రెండొం దలకే ఫేషియలంట..పెద్ద పెద్ద పార్లర్లలో ఆళ్ళ కుర్చీలకీ ఎసీలకీ డికరేశన్లకీ అంత చార్జి చేస్తారంట గానీ ఫేషియల్ ఎక్కడైనా ఒకటేనంట. ఈ నెల జీతం తీసుకుని చేయించుకో.ఆమె మొహం చూసావా ఎట్టా నున్నగా వుంటదో! ఆవిడ వాడే వాటితోనే మనకీ చేస్తదంట” అంది భవాని .

స్వర్ణకి వచ్చేది నెలకి పదివేలు .అందులో తొమ్మిదివేలు అమ్మ చేతిలో పొయ్యాలి. మిగిలిన వెయ్యి తను నెలంతా వాడుకోవాలి .ఎంతో జాగర్తగా! నెలసరి ప్యాడ్స్ కి ,ఫెయిర్ అండ్ లవ్లీకి.ఎప్పుడైనా ఆకలేస్తే భవానితో పాటు ఏ బిరియానీయో తినడానికి ,సెల్ఫోన్ చార్జింగ్ కి …బస్సులూ షేర్ ఆటోలూ దొరక్క పొతే  మామూలు ఆటో ఎక్కడానికి ,ఇంటికెళ్ళే వేళకి కడుపు కాలిపోతూ వుంటుంది.అక్కడేమీ వుండదు పోద్దుటి కూరా ఎదో పచ్చడీ ఒక్కొక్కరోజు మజ్జిగ కూడా వుండదు.తొమ్మిదివేలూ చీటీలకీ పొదుపు అప్పుకీ పోతాయి .అమ్మ జీతం ఇంటి ఖర్చుకి చాలదు .నాన్న ఎప్పుడు ఏమిస్తాడో తెలీదు .ఎప్పుడో చీటీల డబ్బులొస్తాయి. స్వర్ణకి పెళ్లి చేస్తుంది అమ్మ .అయ్యో !అమ్మ! అట్టాగే అక్క పెళ్లి చేసింది ఆ అప్పు ఇంకా తీర్తానే వుంది.

వర్క్ చీరెలు చూసీ చూసీ కళ్ళు జిగేల్ మంటున్నాయి వేలకి వేలు .చూసిన కొద్దీ వాటిమీద విరక్తి పెరుగుతోది అనుకుంది స్వర్ణ..కొంత మంది మేడంలు ఖరీదైన సాదా చీరెలు కడతారు. అమ్మ పని చేసే స్కూల్లో  ప్రిన్సిపాల్ శ్రావణి మేడం లాగా.  అవి భలే వుంటాయి  చూడ్డానికి సీదాసాదాగా వుంటాయి.  కానీ చీరెలు చూస్తె బాగా ఖరీదే ..వాచీలూ చెప్పులూ ఖరీదే .అది ఖరీదైన సాదా తనం అంటుంది భవాని .కొట్టు మూసి యింటి కెళ్లేసరికి అటూ ఇటూ పది అవుతుంది. ఆకలి మండుతుంది “ఇంటికేడితే ఏం వుంటుంది ?నా బొంద!” అంటుంది భవాని .ఇద్దరూ నడుచుకుంటూ బయటికి వచ్చారు నూడిల్స్ బండి దగ్గర బాగా జనం వున్నారు.”ఒక ప్లేటు తీసుకుని చెరి సగం తిందామా” అంది భవాని .”నా దగ్గర డబ్బులు లేవు”అంది స్వర్ణ,

“నీ దగ్గర ఎప్పుడూ వుండవులే .పద నేనిస్తా ..ఇహ నించీ నెలకి నువ్వు రెండు వేలు వుంచుకో .కడుపు నిండా తినోద్డా?” అంటూనే రెండు ప్లేట్లలో నూడిల్స్ తెచ్చింది  నూడిల్స్ తిన్నంత సేపూ భవాని  చెప్తానే వుంది .కడుపునిండా తిను. బాగా వుండు. ఇంత కష్ట పడుతున్నావ్ .నువ్వు బాగుండద్దా? ఆ మొహం రుద్దించుకో .గోళ్ళు కత్తిరించుకుని చక్కగా రంగేసుకో .గోరింటాకు పెట్టుకో జుట్టు కత్తిరించుకుని  మంచి క్లిప్పులు పెట్టుకో  .చెప్పులు కొనుక్కో .ఏం దరిద్రం నీకు ? మీ అమ్మ కి జీతం వస్తుంది. మీ నాయన పెయింట్లు వేస్తాడు .అసలు మీ అక్క పెళ్ళికి చేసిన అప్పు నువ్వేల తీర్చాలి?  భవాని కొనిచ్చిన నూడిల్స్ తిన బుద్ది కాలేదు స్వర్ణకి.బలవంతాన నోట్లో కుక్కుకుంది, భవాని బాగుంటుంది బాగా తయారౌతుంది .బాగా మాట్లాడుతుంది .తను  పది పాసయింది .భవాని తప్పింది .స్వర్ణ మొహం తడిమి చూసుకుంది గర గర లాడుతోంది అవును నెలకి పదివేలు తెచ్చుకుంటూ రెండు వందలు ఖర్చు చెయ్యలేనా ?అనుకుంది .సురేష్ తనతోనూ భవానితోనూ మాట్లాడే తీరులో తేడా వుంది. భవాని  వంక చూసే చూపులో తన వంక చూసే చూపులో తేడా వుంది. కంప్యూటర్ మీద బిల్లులేసే కుర్రాడూ అంతే! భవానిని చూసి నవ్వుతాడు తనని చూసి మొహం చిట్లిస్తాడు..

రాత్రితనకోసం ఉంచిన అన్నం అంతా తినక పొతే అమ్మ తిడుతుంది .ఆవిడ బాధ ఆవిడది .కొడుక్కీ మొగుడికీ పొద్దున్నే  చద్దన్నం పెట్టలేదు. వాళ్లకి బయట టిఫినీలు తినడానికి డబ్బులిస్తుంది  .కూతుర్నీ చద్దన్నం తినమని  చెప్పలేదు.ప్రతి రోజూ  ఆవిడకి చద్దన్నమే. అందుకే భవాని రోజూ ఎదో ఒకటి తిందామన్నా తను ఒప్పుకోదు…

తెల్లవారి మళ్ళీ మొదలు. ఊడ్చుడు .కడుగుడు, వండుడు .పరిగెత్తుడు . ఆ నడకేమిటే నీ బొంద .ఆ జడేమిటే ! ఇవ్వాళ నిన్ను వదలను! పద .ముందు చెప్పులు కొనుక్కో .జుట్టు కత్తిరించుకో మంచి క్లిప్పులు కొనుక్కో . మొహం రుద్దించుకో ఇట్టా వుంటే మీ అమ్మ ఎన్ని చీటీలు కట్టినా ఎంత కట్న మిచ్చినా నిన్నెవడూ చేసుకోడు .ఎప్పుడూ ఈ కొట్లోనే పని చేసుకుంటూ బతుకుతావా ఏం?”

“ భవానీ నన్నోదులు.”

“ వదలను గాక వదలను .ముందు పద “

“ఇదేంది ఇయ్యి నాలుగు కాయితాలే .లెక్క సరింగా సూసుకు సచ్చావా లేదా ?”

“ నేను  ఒక  కాయితం వుంచుకున్నాను నా ఖర్చులకి “

తిట్ల వర్షం .ఏడుపు.తిట్లు!! మొగుడినీ,కూతుర్నీ చచ్చి పోయిన అత్తా మామల్ని, దరిద్రపు సమ్మంధం ఇచ్చిన అమ్మా నాన్నల్ని. దేవుడిని …తుఫాను.. .రోషం వచ్చి వుంచుకున్న ఒక్క కాగితం ఆవిడ మొహాన కొట్టాలన్నంత .కోపం …చెప్పులు క్లిప్పులు మొహాన పొక్కులు .సాయంత్రానికి ఆకలి .తలనొప్పి. 

“రాయిని గాలివానలో నిలబెడితే పైనున్న మురికి కొట్టుకు పోతుంది గానీ దానికేం గాదు” అని అమ్మే ఒక సారి చెప్పింది, నాన్న ఆవిడని చెడ తిట్టినప్పుడు ,అది గుర్తొచ్చింది స్వర్ణకి .తిట్లు గాలికి పోతయ్ .మన పని మనకి గావాలి .మనం తినాలి .అక్క పెళ్లి గావాలి. తమ్ముడి చదువు గావాలి .తిట్టాడని వున్న నాలుగు రూపాయలూ ఆయన మొహాన కొడ్తే రేపు పిల్లలకేం పెట్టను. తిట్టుకోనియ్ ! అలసిపోయి పడుకుంటాడు. లేక పొతే తంతాడు అంతేగా ! దెబ్బలకి దడిస్తే ఎట్టా ? ఇవ్వన్నీ అమ్మ మాటలే .అవును చెప్పులు కావాలి .క్లిప్పులు కావాలి .పొక్కులు పోవాలి. ఆకలి పోవాలి . 

మొహం తడిమితే నున్నగా తగిలింది .చెప్పులు తక్కువఖరీదులో మంచివే దొరికాయి జుట్టుకి రోజూ చిక్కులు తీసే పీడా పోయింది క్లిప్పులు బాగున్నాయి .ఒకటి బట్టర్ ఫ్లై .ఒకటి మామూలు దే భవానీతో కలిసి ఎప్పుడైనా  ఒకసారి  బిరియానీ ఒక సారి  నూడిల్స్ .నాలుగు రోజులు మాట్లాడని అమ్మ ఐదో రోజు మాట్లాడింది .పదిరోజులకి మళ్ళీ మొహం గర గర లాడింది పొక్కులోచ్చాయి .”అవి ఒక్కరోజుతో పోతాయా? రెగ్యులర్ గా రుద్దించుకోవాలి మొహం” అంది బొంబాయిలో నేర్చుకొచ్చి తనలాంటి లేని వాళ్ల కోసం ఉదారంగా రెండు వందలకే ఫేషియల్ చేస్తున్న బ్యూటిషియన్ .

షాపు దగ్గర, బస్సు స్టాపు సెంటర్లో కొత్త బడ్డీ వెలిసింది. బిరియానీ నూడిల్స్, పానీ పూరీ సమోసా అవీ ఇవీ! దాని చుట్టూ జనం . .బాక్సుల్లో అన్నం మామూలే! అరంగుళం సురేష్ టీ మామూలే .సాయంత్రానికి తలనోప్పీ ఆకలీ మామూలే .విసిగించి చంపే కష్టమర్  మేడంలూ మామూలే .అమ్మ చీటీలూ పొదుపు అప్పులూ మామూలే .తమ్ముడి చదువూ నాన్న అరుపులూ అమ్మ విసుగూ మామూలే .విసుగోస్తోంది.అక్క ప్రాణం హాయిగా వుంది .బావకి అక్క బయట పనిచేస్తే అనుమానం ,అవమానం కూడా ! దాన్ని ఇల్లు కదల నివ్వడు. అప్పు అయితే అయింది.. అదన్నా సుఖంగా వుంది.  ఆ అప్పుతీరితే కదా తన సుఖం మాట!భవాని అంటుంది. ప్రతిపైసకీ మొగుణ్ని అడుక్కోడం  సుఖమా?నేను పెళ్లి చేసుకున్నా ఏదో ఒక పని చేస్తాను” పని సంగతి తరవాత ముందు పెళ్లి ఒకటి కావాలిగా !  

ఒకబ్బాయికి స్వంత ఆటో వుంది .బాగుంటాడు లక్ష ఇస్తే చేసుకుంటాడంట! పెద్ద దాని అప్పు తీరనే లెదు మళ్ళీ లక్ష ఎక్కడ తెస్తా ? నా వల్ల కాదు .దానికప్పుడే నాలుగోనెల.. పురిటికి తేవాలి . నేను ఏ బావిలోనో పడి సచ్చిపోతే నీ పీడా వదులుద్ది .ఇవే రోజూ రాత్రిపూట అమ్మా నాన్నల  కబుర్లు .తమ్ముడు టీవీ లొ క్రికెట్ చూస్తూ విసుక్కుంటాడు .బంగారునాయన ! ఆ ఐటీఐ కాస్తా అయిపోతే మెకానిక్కు అవుతాడు. ఎవరూ సావక్కర్లేదు .అంతా వాడే సూసుకుంటాడు .అమ్మ ఆశలు ఆకాశంలో .అవును వాడే అక్కకు పెళ్లి చేస్తాడు అమ్మని స్కూల్లో ఆయా పనికి  పోనీకుండా ఇంట్లో వుంచుతాడు..వాడికి ఐదువేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిపెట్టింది.పదివేలు తెచ్చే తనకి వెయ్యిరూపాయల పిచ్చి ఫోను.. తను బోలెడు డబ్బుతో బయటికి పోవాలి ..వాడు ఇంట్లో వుండి చాలా డబ్బులు తెచ్చి పోషిస్తాడు ..

ఈనెల మొహం రుద్దించుకుని ఇంటికి వచ్చిన రాత్రి స్వర్ణకి మొహం ఒకటే దురద .నిద్రలో తనకి తెలీకుండానే తెగ బరికేసింది .పొద్దున్న అద్దంలో చూసుకుంటే మొహం నిండా దద్దుర్లు .ఆ దద్దుర్ల మొహంతో షాపుకు పొతే సురేష్ ఊరుకోడు కష్టమర్లు దడుచు కుంటారంటాదు.సెలవు పెట్టాల్సిందే .తను చేరి ఇంకా సంవత్సరం కాలేదు కనుక సెలవు పెడితే జీతం కట్ .మళ్ళీ తిట్ల తుఫాను. ఈ సారి సునామీ.రాత్రి ఇంటికి పోతూ భవాని చూడ్డానికి వచ్చింది .తనకోసం అమ్మకోసం సమోసాలూ మైసూరు బజ్జీలూ తెచ్చి పెట్టింది.తెల్లవారే సరికి కడుపులో గుడ గుడ! “పిచ్చి తిళ్ళు తింటే ఏమౌతుంది మరి” అని అప్పుడెప్పుడో తనకి విరోచనాలూ కడుపునేప్పీ వచ్చినప్పుడు ఆరేమ్పీ సాంబశివరావు గారిచ్చిన బిళ్ళలు నాలుగు మిగిలి పొతే ఒకటి ఇచ్చింది అమ్మ .దద్దుర్లకి తోడు ఇదొకటి .సందట్లో సడేమియా అని మామయ్య కూతురు హైదరాబాదు నుంచీ వచ్చి “ఒకసారి మాయింటికి రాకూడదూ  నేను రేపు వెళ్ళిపోతున్నా “అని ఫోన్ చేసింది .అవడానికి సొంత మేనమామ కూతురే గానీ వాళ్ళాయనకి పోలీస్ సబిన్స్ పెక్టర్ ఉద్యోగం .అది మనిళ్ళకి రాదు మనమే పోయి చూడాలి దాని వైభోగం . మేనమామా రాడు ఆయన భార్యా రాదు .షాపుకి కొనడానికి వచ్చినా వాళ్ళని తను మామయ్యా అత్తయ్యా అని పిలవదు.వాళ్ల బేరం సుజాతమ్మ కి అప్పగించేసి తప్పుకుంటుంది .వొళ్ళు మంట తనకి .

” పోయి రావే పాపం .సెలవు పెట్టావుగా “ అని వత్తాసు పలికింది అమ్మ . వాళ్ళు ఎంత దూరం పెట్టినా స్వంత అన్న ఆవిడకి .అమ్మపోరు పడలేక అయిష్టంగానే వెళ్ళింది స్వర్ణ. మేనమామ కూతురు మహాలక్ష్మి. మహాలక్ష్మి లాగే వుంది “ఏమే అంత చిక్కి పోయావూ  డైటింగా?”అని నవ్వింది .ఆ మొహాన ఆ దద్దుర్లేమీటే అని ఆరా తీసింది .డబ్బులు తక్కువ అని వీధి చివరి పేర్లర్ లొ ఫేసియల్ చేయించుకుంటే అంతే అని తీర్పు చెప్పి, తను సాయంత్రం ప్రెటీ వుమన్ పార్లర్ లొ అపాయింట్ మెంట్ తీసుకున్నా ననీ అక్కడ మొత్తం పాదాలూ అరిచేతులూ జుత్తూ అన్నీ మెరుగులు పెట్టించుకుంటే అయిదు వేలని చెప్పింది. అక్కడ నుంచీ వస్తూ వుంటే అపర్ణ మేడం కనిపించి పిలిచింది .ఆవిడ తనకి స్కూల్లో టీచర్ .తను పని చేసే షాపులో బట్టలు కొనడానికి వస్తూ వుంటుంది .ఇప్పుడు ఏవో పరీక్షలు వ్రాసి పెద్ద ఉద్యోగం సంపాదించింది .ఆవిడా మహాలక్ష్మిలా మంచి పార్లర్ లొ ఫేసియల్ చేయించుకోమనీ ఏం తినాలన్నా మంచి నూనెలతో ఇంట్లో వండుకు తినమనీ ,ఈ మధ్య తను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాననీ చెప్పింది  స్వర్ణ కి మర్నాడు కూడా వంట్లో బాగాలేదు .కడుపులో నెప్పి తగ్గలేదు.. “ ఆ సాంబశివరావు గారి దగ్గరకు పోయి మందు తెచ్చుకో పోయి సావు. అక్కర్లేని వాటికి ఊరికే డబ్బు తగలేస్తావు .మందులకి లేవంటావు”అని తిట్టింది .అమ్మకి తిట్లే మాటలు, అవే సలహాలు. అవే ఆశీర్వాదాలు .

సాంబ శివరావు గారి దగ్గర  బోలెడు జనం .జ్వరాల వాళ్ళు. వాంతులు విరోచనాల వాళ్ళు  సెలైన్ పెట్టించుకు పోయే వాళ్ళు. ఇంజెక్షన్లు చేయించుకు పోయేవాళ్ళు .చిన్న చిన్న దెబ్బలకు కట్లు కట్టించుకునే వాళ్ళు .ఆ చిన్న క్లినిక్ లొ కాలు పెట్టె సందు లేదు .అక్కడ చీటీలు రాసిచ్చే వనజమ్మ అమ్మకి చిన్నప్పుడు ఫ్రెండు కనుక ఆవిడని బ్రతిమిలాడి లోపలికి  జొరబడింది  స్వర్ణ..ఆయన మొహం మీద దద్దుర్లు చూశాడు .కడుపు నెప్పి గురించి అడిగి “నీకు తెలుసా అమ్మాయ్! మన ఊళ్ళో ఒక చర్మం డాక్టర్ కన్సల్టేషన్ అయిదు వందలు .పది నిమిషాలు కూడా చూడడు .ఇహ మామూలు డాక్టర్లంతా మూడు వందలు చేసారు .నేనొక్కడినే అన్ని జబ్బులూ చూస్తాను .అన్నింటికీ కలిపి వందే తీసుకుంటాను” “అని ఏవో మందులు రాసిచ్చాడు మూడు వందలకి …పైగా మూడు రోజుల జీతం కట్ . ఆ రాత్రి స్వర్ణకి ఎంతకీ నిద్ర రాలేదు .ప్రేమించానని చెప్పిన అబ్బాయితో వెళ్ళిపోయిన భాగ్యం గుర్తొచ్చింది .అప్పుడు మంచి పని చెసిందని తనూ భవానీ అనుకున్నారు .నాలుగు నెలలకే అది తిరిగొచ్చేసింది ఆ పై నెలలో పురుగు మందు తాగి చనిపోయింది .అవునూ ఇవ్వాళ భాగ్యం ఎందుకు గుర్తొచ్చింది ? అపర్ణ మేడంలాగా మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచి మంచి నూనెలతో వంటలు వండించుకుంటూ మంచి పార్లర్ లొ ఫేసియల్ చేయించుకోవాలంటే  ఏం చెయ్యాలి? ఆమెలా మంచి స్కూల్లో చదవాలా? మంచి ఉద్యోగాలు చేసే అమ్మా నాన్నలుండాలా? ఓసి వెర్రి మొహమా !డబ్బు, డబ్బు వుండాలే ముందు! .అవునే భవానీ నువ్వు చెప్పింది నిజం .మరి డబ్బులేట్లా వస్తాయి మనకి?  మంచి బళ్ళో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని మంచి వంటలు ఇంట్లో వండుకుని మంచి పార్లర్ లొ ఫేసియల్ చేయించుకుని ,ఇదంతా ఈ జన్మ లొ సాధ్యం కాదు  మనకి .మరెట్లా ?

అమ్మ చెప్పినట్టు ఈ జన్మలో బాగా ఉపవాసాలుండి  పూజలు చేస్తే అపర్ణ  టీచర్ లా అట్టాంటి ఇంట్లో పుడతానేమో చూడాలి. అందుకే కావన్సు గుళ్ళల్లోనూ ప్రవచనాల దగ్గరా ఒకటే జనం .ఒచ్చే జన్మ మీద ఆశతోనే కావన్సు. మహాలక్ష్మి మొగుడు కూడా క్రిందటి జన్మలో బాగా పూజలు చేసి వుంటాడు .మళ్ళీ ఇట్టాంటి ఉద్యోగమే రావాలని కావన్సు పూజలూ అభిషేకాలూ అంతులేకుండా చేస్తూ వుంటాడు .ఈ ఉద్యోగం ఇట్టా లక్ష్మీప్రదంగా నిలవాలని కూడా కావచ్చు .ఏది ఏవైనా   అట్టాంటి స్కూల్లో చదువుకుని ,అట్టాంటి కాలేజీల్లో చదువుకుని, అట్టాంటి ఉద్యోగాలు చేసి, అట్టాంటి మొగుణ్ణి పెళ్లి చేసుకుని అట్టా కారుల్లో తిరిగి ,అట్టా ప్రెట్టీ వుమన్ లొ ఫేసియల్ చేయించుకుని, అట్టా ఇంట్లో మంచి నూనెలతో నూడుల్సూ  గులాబ్ జాములూ వండుకుని! అవును అంతే   అవన్నీ వచ్చే జన్మలోనే ! ఇప్పటికింతే ! మన రెండు వందల  ఫేసియళ్ళూ మొహం మీద దద్దుర్లూ  బజారు బండి బిరియానీలూ ఆరేమ్పీ డాక్టర్లూ  అమ్మ చేత తిట్లూ మళ్ళీ ఆవిడ మీద జాలి ..కానీ అమ్మ చెప్పే  ఈ వచ్చే జన్మ సిద్దాంతం తనకి నచ్చట్లేదు .ఎదో చెయ్యాలి ..తప్పకుండా…

****

Please follow and like us:

2 thoughts on “ఇట్లు మీ స్వర్ణ (కథ)”

  1. ఇలాంటి అభాగ్య స్వర్ణ కథలు ఎందరో ఉన్నారు కదమ్మా! కొన్ని కథలకు ముగింపులుండవు.. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఈ జన్మైతే బాగుపడదా! వచ్చే జన్మ కోసం పూజలు, వ్రతాలు చెయ్యాలన్నా అవి కూడా ఖర్చుతో కూడుకున్న పనే.. మరెట్లా!! వచ్చే జన్మలో కూడా ఈ కథలకు అంతు ఉండదా!
    ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది అమ్మా మీ కథ 💖

Leave a Reply

Your email address will not be published.