నారిసారించిన నవల-18

                      -కాత్యాయనీ విద్మహే 

1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  శీర్షిక కింద ఎడారి పువ్వులు నవలతో పాటు జీవన స్రవంతి, నీలి నీడలు, మిగిలిందేమిటి? వనకిన్నెర , వారిజ అనే ఆరునవలలు పేర్కొనబడ్డాయి. ఏడాదిలో ఏడు నవలలు అంటే ఆలెక్కన ఆమె రచనా వేగం అంచనా వేయవచ్చు. పథవిహీన అనే నవల ఆంధ్రప్రభలో 1961  జూన్ నుండి అక్టోబర్ వరకు సీరియల్ గా వచ్చింది.1963 లో నీహారిక, ఉమరుఖయ్యాం, భగవంతుడి పంచాయితీ,  వైతరణీ తీరం నవలలు వచ్చాయి.1969 లోమహానగరంలో స్త్రీ నవల వచ్చింది. ఆ ఏడూ ఈ ఏడూ కలిపి అరవై దశకపు నవలలు 14. వీటిలో ఉమర్ ఖయ్యాం కాక మిగిలిన నవలలన్నీ సాంఘికాలే. 

ఈ దశకంలోనే లత ‘ఊహాగానం’ (1963), అంతరంగ చిత్రం( 1965) వచ్చాయి. అంతరంగ చిత్రం ఆమె స్వీయ చరిత్ర రచన.ఊహాగానం తనలో కదలాడే ఊహలకు పదచిత్రాలు.ఒక విషయం పై ఆలోచనలు ఎటు ప్రసరిస్తే వాటినట్లా నమోదు చేసిన రచనల రాగ మాలిక. ఇవి చదవటం లత నవలల అధ్యయన విశ్లేషణలకు ఉపయోగకరమని  నిడదవోలు మాలతి తెన్నేటి హేమలత గురించి వ్రాసిన వ్యాసం (THULIKA.NET 4-11-2013) సూచిస్తున్నది. 1962 లోనే  ఘట్టి ఆంజనేయశర్మ లత సాహిత్యం గురించి ‘సాహితీలత’ అనే పుస్తకం ప్రచురించాడంటే సాహిత్య రంగంలోకి ప్రవేశించి ఏడెనిమిదేళ్లు కాకుండానే లత ఎంతగా పాఠకప్రపంచాన్ని ఆకట్టుకొన్నదో తెలుస్తుంది. ఆందుకు కారణమైన మూలశక్తి, తనకాలపు మహిళా రచయితలకంటే భిన్నంగా  లభించిన పబ్లిక్  లేదా మేధో ప్రపంచం అనే చెప్పాలేమో. అదే ఆమె నవలలను సమకాలపు స్త్రీల నవలల కన్నా భిన్నంగా నిలబెట్టాయి. అదెలాగో చూద్దాం. 

ఎడారిపూలు నవలను “సాహితీవనంలో లతను నాటిన మా అన్నయ్య డాక్టర్. గాలి బాల సుందరరావు కు” అంటూ అంకితమిచ్చింది లత. ఒక ఉదయం ఆరుగంటలకు పార్వతి కుంపటి రాజేస్తుండగా మరిది రాజు కొత్తగా పెళ్లాడిన అమ్మాయితో రైలు దిగి  ఇంటికి రావటంతో మొదలవుతుంది ఈనవల. పెద్దలకు తెలియకుండా హఠాత్తుగా చేసుకొన్నతన పెళ్లికి, పెళ్లాడిన అమ్మాయికి అన్నగారి  ఆమోదం సంపాదించి పెట్టమని మరిది భుజాలకెత్తిన బాధ్యతను నెరవేర్చి  పార్వతి నవలలో కథను కదలికలోకి తెస్తుంది. ఈనవలలో పార్వతి ఆనందరావు ఒక జంట. ఆమెమరిది రాజు అతని భార్య సత్యవతి మరొక జంట. రాజు స్నేహితుడు శివరావు అతను పెళ్లాడిన సునందన ఇంకొక జంట. కామాక్షి డాక్టర్ మధుసూదనరావు వేరొక జంట. అన్నపూర్ణ శంకర రావు, శంకరావు మహాలక్షమ్మమ్మ, సత్యవతి శర్మ, అన్నపూర్ణ రాజు ఇలా రకరకాల స్త్రీపురుష జంటల మధ్య లైంగిక ఆకర్షణలను, సంఘర్షణలను, కౌటుంబిక సంబంధాలను చర్చకు పెట్టిన  నవల ఇది.కథలో ఘటనల పరిణామాలకన్నా ప్రేమ, వాంఛ, నీతి, అవినీతి, వ్యవస్థ, వ్యక్తి మొదలైన అంశాలపై భిన్నాభిప్రాయాలు సంభాషణల సమాహారమే ఈనవల ఇతివృత్తం.

ఈ నవలలో విజయవంతమైన దాంపత్య సంబంధం పార్వతీ  ఆనందరావులది. పార్వతి సౌందర్యవతి సుగుణవతి. అణుకువతోకూడిన వ్యక్తిత్వం. పెళ్లయినది మొదలు భర్తను, సంసారాన్ని, మామగారిని, మరిదిని తనవాళ్లనుకొని వాళ్ళకోసం శ్రమించింది.తపించింది. ఆకుటుంబానికి ఆమెతలలో నాలుక. నవల ప్రారంభానికి ఆమె గర్భవతి. పూర్తయ్యేసరికి పుట్టిన బిడ్డకు  ఏడాది పుట్టినరోజు కూడా అవుతుంది. అంటే స్థూలంగా నవలలో కథ ఏడాదిన్నర రెండేళ్ల కాలం మీద నడిచింది. 

స్త్రీలలో  స్త్రీత్వమే కాదు మాతృత్వం కూడా ఉందన్న సంగతి చాలా మంది భర్తలు ఎరుగరు అంటుంది … పార్వతి గురించి చెబుతూ రచయిత్రి.అసలు కొందరు పుడుతూనే దేవతాంశతో జన్మిస్తారు.వాళ్ళున్న చోట వారి అధికారానికి ఏ లోటు ఎన్నడూ రాదు. ఏమనిషైనా వారి చల్లని పర్యవేక్షణలో సుఖపడతారని ఒప్పుకోవాలి. మంచిచెడులను సమంగా చూడటం,ఎదుటివాళ్లను ఏవిధంగానూ కించపరచకపోవటం వాళ్ళ లక్షణం.. అని పార్వతి వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తుంది.సత్యవతి గురించి ఆమె తనలాగా ఆడపిల్ల …అన్యాయం చేయకూడదు.తనమరిది వలచి చేసుకొన్న ఇల్లాలుకనుక ఈఇంట్లో తనకెంత స్థానంఉందో ఆమెకీ అంతస్థానం ఉందనుకొనటం ఆ వ్యక్తిత్వలక్షణమే.  ధర్మపత్నిగా భర్తను తప్ప మరొకళ్ళను తలచని ఉత్తమ స్త్రీ.

 రాజు మిత్రుడు శివరావు వేశ్య  కులపు అమ్మాయి సునందనను పెళ్లాడిన విషయం ప్రస్తావిస్తూ కామాక్షి ‘ వర్ణాంతర వివాహం చేసుకున్నాడని నువ్వు అసహ్యించు కోవడం లేదుగదా”  అని సందేహం వ్యక్తం చేసినప్పుడు పార్వతి “ అలాంటివి నాకెప్పుడూ లేవు,ఎవరికీ సుఖమైన పద్ధతిలో వాళ్ళు జీవితం నడుపుకుంటారు.మధ్యలో మనకేంటి అనగలిగిన నిబ్బరం ఆమెది.ఎవరికిష్టమైన పద్ధతిలో వాళ్ళు జీవితం నడుపుకోవచ్చా  అని కామాక్షి రెట్టిస్తే ఇతరులకు బాధ కలగనంతవరకు ఎవరి కిష్టమైనపద్ధతిలో వాళ్ళుగడుపుకోవటం అంత విమర్శించదగ్గ విషయం కాదు అంటుంది. పెళ్లి జన్మజన్మల బంధం అనేది ఆమెదృఢ విశ్వాసం. అన్నపూర్ణతో రాజు సాన్నిహిత్యం సంగతి తెలిసాక సత్యవతి సొత్తు పరాయిడవుతున్నట్లు బాధపడింది. మద్రాసు వెళ్లి సత్యవతిని తీసుకురమ్మని మరిదిని ఆజ్ఞాపించకుండా ఉండలేకపోయింది.ఆ రకంగా ఏడాది తరువాత రాజుకు సత్యవతికి జీవితాన్ని చక్కదిద్దుకొనే ఒకఅవకాశం ఆమెకల్పించింది.దానిని వాడుకొనే చొరవ, చైతన్యం, ప్రయత్నం  వాళ్లలో లేకపోవటం అది వేరేసంగతి. పెళ్లి ఒకమహత్తర అనుబంధమే అయితే విడాకుల సంగతిఏమిటి అనికామాక్షి ప్రశ్న.ప్రేమ పేరుతో ఎంత తేలిగ్గా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయో అంతతేలిగ్గా విడాకులకు సిద్ధమైపోతున్నారని ఆమెభావన. పెద్దలు జరిపే పెళ్లిళ్ల వైపే ఆమె మొగ్గు. హృదయము వివాహమూ రెండూ ఒక దగ్గర సమకూడిన దాంపత్యానికి ఆమె ప్రతినిధి పాత్ర.

 సత్యవతి రాజలది ప్రేమవివాహం.ప్రేమలో ఉద్వేగం తప్ప, వివేకం ఉండదని లత అభిప్రాయంగా కనబడుతుంది. ఉద్వేగం శారీరక ఉద్రేకాలకు కారణమవుతుండగా పెళ్ళికి తొందర ఉంటుంది. నిదానంగా సంబంధాలను అంటుకట్టుకొనే ఓపిక లేక త్వరలోనే ఒకరికొకరు పాతవాళ్లయి పోతారు. సత్యవతి తో మూడునెలల కాపురంలోనే రాజు  పునరాలోచనలో పడటం దానినే సూచిస్తుంది.ఎంత సుందర దృశ్యమైనా రోజూ చూస్తుంటే అలవాటయి పోయింది అనుకుంటాడు. అనివార్య పరిస్థితులలో పెళ్లి చేసుకొన్నాడు గానీ నిజంగా తాను ఆమెను ప్రేమించ లేదనిపిస్తున్నది అని కూడా అనుకొన్నాడు. అన్నతో పోల్చి తనను తక్కువ చేసి మాట్లాడే పద్ధతికి ..మనసు విరిగిపోయింది అతనికి. వదినగారు పుట్టింటికి వెళ్ళినప్పుడు వంటరాక, చేయలేక ఆమె అవస్థ పడటం , ఇద్దరిమధ్యా మాటామాటా పెరగటం , అతను పక్కెయ్యమంటే మీ దాసిని కానంటూ ఆమెఎదురుతిరగటం, అతను చెయ్యెత్తి చెంపదెబ్బ కొట్టటం, రోషం వచ్చి ఆమె అప్పటికప్పుడు బయలుదేరి మద్రాస్ చేరటం జరిగిపోయాయి.   ఆడది కోపగించి లేచిపోయిందంటే ఆడదానికే నష్టం గానీ మగవాడికి ఏవిధమైన నష్టం లేదని అతని అభిప్రాయం. అయితే మగవాడికి తెలియనిది అలాంటి సత్యవంతుల ఆంతర్యంలో అంతర్వాహినిగా ప్రవహించే అనురాగస్రవంతులు అని అవి అలా ఇంకిపోతూనే ఉంటాయి అని ఆ అభిప్రాయాన్ని లత వ్యాఖ్యానించటం గమనించవచ్చు. పార్వతి గురించి చెప్పినట్లు కాక సత్యవతి  అంతరంగాన్నిఅనేక ఉద్విగ్న సందర్భాలనుండి ప్రదర్శించటం ద్వారా పాఠకులు తమంతట తాము ఆమెను గురించి తెలుసుకొనేట్లు చేస్తుంది లత.

సత్యవతి మద్రాస్ నగర జీవితంలో పెరిగింది. ఇంటర్ చదివింది. స్త్రీగా స్వంత అస్థిత్వాన్నిపెంచుకొనటానికి అవి సరిపోయాయి. తన అన్న, వదిన, మద్రాస్ ఆధిక్యతలను గురించిన ఆమె మాటలు తన ప్రత్యేక ఉనికిని చాటుకొనేవే. భర్త మీద అలిగి పుట్టింటికి బయలుదేరిన సత్యవతి  రైల్లో ఒక బాలింత ఒళ్ళో నవ్వుతున్నపసివాడిని చూసి  అవును అతను పెరిగి పెద్దవాడవుతాడు. మగవాడుగా మారుతాడు అనుకుంటుంది. వెయ్యిమంది రాజుల వారసుడు అని ఆ పిల్లవాడి భవిష్యత్ పరిణామాన్నిఊహిస్తుంది. ‘స్త్రీలు పుట్టరు.తయారుచేయబడతారు’  అనే సైమన్ దె బావురే భావం తెలిసిన లక్షణం సత్యవతిలో కనబడుతుంది ఇక్కడ.మగవాళ్ళు మానవవ్యక్తులుగా కాక అధికార ప్రతినిధులుగా, స్త్రీలమీద పెత్తనంచేసేవాళ్లుగా తయారుచేయబడుతున్న సామాజిక లక్షణాన్ని ఆమెగుర్తించినట్లే ఉంది.ఆడది కావటం వల్ల తన తక్కువ ఏమిటన్నది ఆమె ప్రశ్న. ఆడదయి పుట్టినంత మాత్రాన రాజుకు వంగి సలాము చెయ్యాలా అనుకుంటుంది. తనను కొట్టే అధికారం అతనికిఎక్కడిదని? తానెలా ఎదురుతిరగలేక పోయింది అని ఆశ్చర్యపడుతుంది. 

ఇంటర్ దాకా చదివాను..ఎక్కడైనా చాకిరీ చేసుకొని బ్రతకవచ్చు అనే ఆత్మాభిమానం ఆమెది.నైతికమైన  విలువలమీద ఆమెకు అభిమానం అట్టేలేదు. ఆచరించక పోయినా ఆదర్శాలు కొన్నిఉన్నాయి. తనంతటికి తాను బ్రతకాలనేది వాటిల్లోఒకటి. ప్రేమించాలి కానీ వ్యభిచరించ కూడదు అనేది మరొకటి. అయితే వాటిని ఆచరణలోపెట్టటం తెలియదని అంటుంది లత. ఆత్మగౌరవం గల స్త్రీ ఎవరైనా ఆసమయంలో అలాగే ప్రవర్తిస్తుంది. అని రాజు కొట్టిన దెబ్బకు బయలుదేరి వచ్చేయ్యటాన్ని సమర్ధించుకొంటూనే …తప్పుచేసానా అని మరొకవైపు చింతన చేస్తుంది.రాజును తాను ప్రేమించలేదు..భ్రమ అనుకొంటుంది.అతనిమీద కోపంతో అలాఅనుకోని తృప్తిపడుతున్నానేమోనని మళ్ళీ అనుమానం. శర్మతో స్నేహం కావాలి.శరీరం అతనిని వాంఛిస్తుంది కూడా కానీ ఒంటరిగా అతనితో కూర్చొనటం తప్పని రక్తగతమైన జన్మజన్మల సంస్కారం హెచ్చరిస్తుంటుంది. ఇట్లా డోలాయమైన సత్యవతి మానసిక స్థితిని పెళ్లి ఒకదగ్గర  జరిగి, హృదయం మరొకచోట లగ్నం కావటం అని వ్యాఖ్యానించింది లత. అనార్కలి, ఏకవీర వంటి సాహిత్య పాత్రలతో పోలిక చెప్పి ధర్మానికి హృదయానికి మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న స్త్రీగా సత్యవతిని చూపుతుంది. 

అన్నపూర్ణ కూడా సత్యవతి వంటిదే. అన్నపూర్ణ శంకరరావు మేనకోడలు.యవ్వనంలో ప్రేమ లోపడి వంచనకు గురైతే గర్భవతి అయిన ఆమెను మేనమామ అవమానాల బారినపడకుండా విజయవాడ  తీసుకువచ్చి ఇల్లుతీసుకొని గర్భం తీయించి చదువు చెప్పించాడు. పెళ్లి చేయాలను కొన్నాడు కానీ లోకోపవాదు కు జంకక తనకోసం  నిలబడ్డ మేనమామ ను మించిన ఉత్తముడు తనకు లభించడని అతన్ని తప్ప పెళ్ళాడనని పంతం పట్టింది. ఆదర్శాలు, ఆరాధనలు, ఆవేశాలు వెనకబట్టి వాస్తవం లోకి వచ్చేసరికి తనకంటే పాతికేళ్ళు పెద్దవాడైన మేనమామ తో సంసారం లో సారంకనబడక చీరెలకు, నగలకు వేధింపులుగా మారి పోవటమే కాదు, కొత్తగా పరిచయమైన రాజు మీదకు ఆమె మనసు పోయింది. అతని కోసం మద్రాస్ మకాం మార్చింది. రాజుకు సన్నిహితం అయినా అతని మనిషి కాలేకపోయింది. అతను , తాను కూడా విడివిడిగా వివాహ వ్యవస్థలో బందీలు. పెళ్లయిన వాళ్ళపట్ల కోరిక కలుగకూడదు అన్న నిషేధం విధించిన ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తూ రాజు పెళ్లయిన వాళ్ళ పట్ల అనురాగం కలుగకూడదు అన్ననిషేధం మనసుకు విధించలేకపోవటం ఏమిటి అని అనుకుంటాడు. ఈ విధి నిషేధాల ధర్మ శాస్త్రం లో నడిచినంతసేపు రహస్య సంబంధాలు కొనసాగుతాయి. నడవకపోతే అన్నపూర్ణ లాగా ఆత్మహత్యలకు పాల్పడటమో , సత్యవతిలాగా భోగాలలో, మత్తు పదార్ధాలతో మునిగి తేలటమో జరుగుతుంది. అన్నపూర్ణ కామాక్షికి వ్రాసిన ఉత్తరంలో రాజును చూసిన మరుక్షణంలో తాను తార, అన్నా కెర్నినా వలె అయినానని అంటుంది.ఈ జాతీయ అంతర్జాతీయ సాహిత్య పాత్రలను ప్రస్తావించటం ద్వారా సంసారం చేసుకొంటున్న స్త్రీల జీవితంలో పరపురుషులపట్ల ఆకర్షణ తెచ్చే మానసిక సంఘర్షణను సూచించినట్లయింది. హృదయాలు  ఓడిపోవటం, వ్యవస్థగెలవటం అంతిమపరిణామం.

ఈనవలలో కీలక వ్యక్తి కామాక్షి.  ఆధునిక స్త్రీ . 27 ఏళ్ల వయసు. బిఎ పాసయింది.  పెళ్లి కాలేదు. తల్లి లేదు. తండ్రి చెప్పినట్లు రచయిత కావటం ఆమెకు ఇష్టమైన విషయం కాదు. అలాగని అది ఆయనకు చెప్పలేదు. తాను చెప్పలేని వాటిల్లో  ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లిచేసుకో అని ఏ మగవాడితోనూ అనలేకపోవటం’  ఒకటి అని చెప్పటం గమనించదగింది.అలాగని ఆమెమనసులో మాట బయటకు చెప్పలేని ముగ్ధ ఏమీకాదు.  తాను నల్లగా ఉంటుంది. తనకారెక్టార్ మంచిదికాదని లోకం అనుకొనటం తనకు పెళ్లికాకపోవటానికి కారణాలని ఏభావోద్వేగాలు లేకుండా చెప్పగలదు.  తన క్యారెక్టర్ మంచిది కాదని లోకం అనుకొనటానికి కారణాలు తన వ్యక్తిత్వంలోనే ఉన్నాయని తెలిసిన మనిషి ఆమె. మగవాళ్ళను చూసి సిగ్గుపడకపోవటం, స్త్రీగా ఆకర్షించే పదార్ధం ఏదైనా తనలో ఉందన్న స్పృహే లేకపోవటం , మగవాళ్ళతో తిరగటం, ఏమగవాడినీ కేర్ చేయకపోవటం తనను లోకం దృష్టిలో  క్యారెక్టర్ లేనిమనిషిని చేశాయి. ఎందుకంటే అది లోకం సంభావించిన స్త్రీ నమూనాకు భిన్నమైంది. కామాక్షి లోకం నిర్వచించిన స్త్రీగా ఎందుకు ఉండలేకపోయింది? 

విస్తృతమైన చదువు ఆమెను బుద్ధిజీవిగా చేసింది.మనసు మీద పెత్తనం బుద్ధిదే అయింది. ఆరేళ్లకు తల్లి చనిపోతే తనను పెంచిన తండ్రిని ఆమె ప్రేమించలేకపోయింది. అనుక్షణం ఏవ్యక్తి నైతే అసహ్యించుకుంటున్నానో ఆవ్యక్తినే ప్రేమిస్తున్నట్లు గడుపుకొస్తున్నాను అని శివరావుకి చెప్పుకొని బాధపడింది కూడా. తల్లి ద్వారా తనకు వచ్చిన ఆస్తి,పెళ్లిచేసుకొని వెళ్ళిపోతే అనుభవానికి లేకుండా పోతుందనే తండ్రి తన పెళ్లి విషయంలో తగినంత శ్రద్ధ పెట్టలేదని ఆమె ఆరోపణ. పార్వతి దంపతులను శివరావు దంపతులను చూసి దాంపత్య సంబంధాలలోని ఆనందం తన అనుభవానికి రాదా అని లోలోపల దిగులుపడుతుంది కూడా. అలాగని తండ్రి చెప్పాడని శివరావు ను పెళ్లాడే చొరవ చెయ్యలేదు. తండ్రికి  ఇష్టం లేదని  తాను ఇష్టపడిన  డాక్టర్ మధుసూదనరావు తో పెళ్ళికి సిద్ధం కాలేకపోయింది. ద్వేషించే తండ్రిని పూజించటానికి, ప్రేమించే డాక్టర్ ను ప్రేమించటం మానెయ్యటానికి..పెళ్లిమానుకొనటానికి ఇలా పరస్పర విరుద్ధ భావోద్వేగాల మధ్య నలిగిన మనిషి గా  కనబడుతుంది కామాక్షి.

తనకు లభించిన సంసారంలో  సంతోషాన్ని , సంతృప్తిని పొందుతున్న పార్వతి అంటే గౌరవం. ఒకరకంగా ఆమె తన ఆదర్శం కూడా .. కానీ అది ఆమెకు అందుకోలేనిదే. ఆడపిల్లలు ఎన్నితెలిసినా తెలియనట్లు నటించటం లోకం కోరుతుంది. అలా నటించలేకపోవటం వల్లనే లోకంలో తాను అపకీర్తి పాలయ్యానని సంపూర్ణ అవగాహన ఉంది ఆమెకు.

కామాక్షి ఉద్వేగస్వభావి.తనలో తెగని ఆలోచనలకు సమాధానాలు సాహిత్యంలో వెతుక్కుంటుంటుంది.ఆమె ఏకవీర నవల చదివినట్లు అందులో ఆరంజేవిరుంబు అనే మాట దగ్గరఆగిపోయి ధర్మం అంటే ఏమిటి ధర్మాధర్మాలు, నీతిఅవినీతులు దేశకాలవ్యక్తి సాపేక్షాలు కదా అనివిచికిత్సలో పడుతుంది.లోకం చేత అపహసించబడేవాళ్లు, వెలివేయబడినవాళ్ళు సంఘవిదూరులై అపనిందల పాలుకాబడిన స్త్రీలు తన మిత్రులు అనుకుంటుంది. శంకరరావు ఆరకంగానే తనకు మిత్రుడయ్యాడు. పెంచి పెద్దచేసిన మేనగోడలు చేసిన తప్పును కడుపున పెట్టుకొనాలానే మంచితనం అపవాదై చుట్టుకుంటే వూళ్ళో ఉండటం కష్టమై అన్నపూర్ణతో విజయవాడ వచ్చి చదువుచెప్పించి పెళ్లి చెయ్యాలనుకొంటె మేనమామకు ఉంపుడుగత్తెగా ఉండటానికైనా ఇష్టమే గానీ వేరే పెళ్లి చేసుకోనని పట్టుబట్టడంతో పెళ్ళాడి ఆమె కుబట్టలు , నగలు అమర్చి సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తున్న శంకరరావు కు పత్రికకు బొమ్మలు వేసే పని అప్పగించి ఆదుకున్నది. శంకరరావు తాను అన్నపూర్ణ కోసం భార్యను సంసారాన్ని వదులుకొని  త్యాగం  చేశానని అనుకొంటుంటే అతను తప్పని చెప్పగలిగింది.అన్నపూర్ణ పట్ల సానుభూతిని ప్రకటించగలిగింది. 

పెళ్లి ప్రస్తుతం గాలివానలో పూరి గుడిసెగా మారిందని,  లోపలివాళ్ళు బయటకురావటానికి, బయటివాళ్ళు లోపలికి పోవాలనీ ప్రయత్నిస్తుంటారని కామాక్షి అభిప్రాయం. పూరి గుడిసెలోకైతే తాను వెళ్లనని  అదిమహాసౌధమైతేనే ప్రవేశిస్తాను అంటుంది.అది తన ఆత్మగౌరవానికి తాజ్ మహల్ కావాలని అదనంగా మరొక మాటకూడా చేర్చింది. ప్రేమ, పెళ్లి – ఈరెండూ ఏక కాలంలో లభించవు అన్న  సందేహం కూడా ఆమెకు ఉంది.  వాస్తవ జీవితంలో సుఖమూ, గౌరవమూ పొందలేక అవమానాలు మింగు కొని, దుఃఖాన్ని అణచుకొన్న స్త్రీలను కాలాంతరంలో సహనవతులుగా, పతివ్రతలు గా కీర్తించటంలోని అర్ధరాహిత్యాన్ని ఆమె ఏవగించుకొన్నది. సీతను ఇప్పుడు పూజిస్తే మాత్రం ఏమిప్రయోజనం..ఆమె జీవితకాలపు వాస్తవ దుఃఖానికి అది పరిహారం కాదు అని కామాక్షి అభిప్రాయపడింది. నీతి అనే మత్తు మందు స్త్రీరక్త నాళాల్లోకి ఇంజెక్ట్ చేసి నిశ్చేతనంగా ఆమె పడి ఉండటమే సుఖనిద్ర అని పిక్చర్ పెయింట్ చేసి ప్రదర్శిస్తుంది ఈలోకం. ఈనీతి అనే పదార్ధం వల్ల  ఆ నీతికి కట్టుబడి ఉండటంవల్లా స్త్రీ సుఖిస్తుందని అనుకొనటంకన్నా అజ్ఞానం మరి లేదు అని భావిస్తుంది ఆమె. అందువల్లనే ఎప్పుడూ పతితలు , భ్రష్టులు అయిన స్త్రీలపక్షాన ఆమెనిలబడింది. వసతిగృహాలు చేరిన దిక్కులేని స్త్రీలజీవితాలను  అధ్యయనం చేసి వాళ్ళ పట్ల  సానుభూతిని , సహానునుభూతిని  ప్రదర్శించింది. వారి గురించి పత్రికకు వ్యాసాలు వ్రాసింది. సుఖం అనుకున్నది అందుకొనటానికి  నిలకడ అన్నది లేకుండా తిరిగి గర్భవతిగా ఒంటరిగా నిలబడిన లీలను ఆదరించింది. 

అధర్మం అంటే అసహ్యం,దౌర్జన్యాన్ని సహించలేకపోవటం,న్యాయ రక్షణకి ఆత్మవిశ్వాసం, సౌందర్య పిపాస – వీటిని మానవుడిలో పెంపొందింప చేసేదే ఉత్తమసాహిత్యం…మనిషి తనను తాను తెలుసుకొని, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సత్యంకోసం, న్యాయం కోసం పోట్లాడేట్లు చేసి మనిషిలోని నైచ్యతను నిర్మూలింప చేసేదే ఉత్తమసాహిత్యం అని కామాక్షి సాహిత్యం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె జీవిత తాత్వికతను ప్రతిఫలిస్తాయి. సత్యం అని నమ్మినదాని కోసం, న్యాయం కోసం ఎవరినీ లెక్కచేయక మాట్లాడుతుంది కనుకనే గయ్యాళిగా లోకంసంభావించిన స్త్రీ నమూనాకు భిన్నంగా రూపొందింది కామాక్షి వ్యక్తిత్వం. “ నేనీ నాగరిక ప్రపంచంలోకి దేనితోనూ రాజీపడటానికి రాలేదు. ప్రతి దాంతోనూ ఆజి చేయటానికే వచ్చాను” అని చెప్పగలిగిన ధీమా మూలం అదే. 

ఈ నవలలో సుఖపడిన స్త్రీలు ఇద్దరే అన్నసూచన ఉంది. వాళ్ళు ఎవరు? పెళ్లి లో ధర్మార్ధకామాలను సంతృప్తిగా అనుభవిస్తూ ఆనందించిన పార్వతి.. భర్తవల్ల  తనకు సుఖకరం కాని వివాహ వ్యవస్థను పట్టించుకోకుండా తన ఆనందం తనదిగా జీవించిన లీల. పూర్తిగా ఒదిగిపోవటమో, పూర్తిగా తిరస్కరించటమో ఇవి మాత్రమే ఆనందహేతువులు. సత్యవతి, అన్నపూర్ణ, పెళ్లిలోని భద్రత, ప్రేమలోని స్వేఛ్చ రెండూ కోరుతూ నీతి అవినీతుల గురించిన అంతః సంఘర్షణలో సుఖం, శాంతి రెండూ కోల్పోయారు. కామాక్షి కోరింది ఉన్నతమైన వివాహ బంధం.అందులో ప్రేమ అంతః సూత్రం. కానీ ఆదర్శవంతమైన అటువంటి జీవితం ఎడారిలో ఖర్జుర పువ్వు వంటిది. ఎంత వాస్తవమో, ఎంత భ్రమో అంతుపట్టనిది. అది తేల్చుకోలేని సందిగ్ధంలో చివరివరకూ చింతనా జీవిగానే మిగిలిపోయింది కామాక్షి. 

ఈ నవల పేరు ఎడారిపువ్వులు. ఈమాటను ఒకతాత్వికార్ధంలో పదేపదే ప్రయోగించిన వ్యక్తి కామాక్షి.  శివరావు తో తొలి సంభాషణ లో ఆమె ‘జీవితంప్రారంభించే తొలిరోజుల్లో ప్రతి పువ్వూ మనకోసమే వికసిస్తుందనుకుంటాం. కొన్నాళ్ళు పోయినతరువాత గానీ అవి ఎడారిపువ్వులని మనకుతెలియదు’ అని  గాఢమైన నిట్టూర్పు తో ఆమె అన్నమాటలకు శివరావు నీమనస్సులో అగ్ని పర్వతాఃలుకొన్ని ఉన్నాయనుకొంటాను అంటాడు. దానిని సవరిస్తున్నట్లుగా ఆమె అగ్ని పర్వతాలు కాదు మనఅందరి మనస్సుల్లోనూ ఎడారిపువ్వులు కొన్ని ఉన్నాయి. మహా భయంకరమైన ఎడారిలో ఒక చిన్న ఒయాసిస్. ఆఒయాసిస్ పక్కన రెండు ఆకులతో ఒకఖర్జూరపు చెట్టు. ఆఖర్జురపు చెట్టుకు ఒకటో రెండో పువ్వులుండవచ్చు. అప్పుడప్పుడు దారితప్పిన ఒంటరి ఒంటె ఏదైనా బక్కచిక్కిన తన మెడ చాచి ఆపువ్వునందుకుంటే అదృష్టం ఆపువ్వుదో, ఆఒంటేదో ఆలోచించేందుకు చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు.’ అంటుంది. 

ఈ భావాన్నే శంకర రావు కు చెప్పి బొమ్మ కూడా  గీయించింది.నిరాశాతప్తమైన హృదయానికి ఆశను కలిగించే చిత్రం అంటుంది కథకురాలు. ఎడారి పువ్వులు చిత్రం చూసి శర్మ అదేపేరుతో నాటకంవ్రాయటం అదివిజయవాడలో ప్రదర్శించటం కూడా జరిగింది. ఎడారి వంటి జీవితంలో స్త్రీ ఒయాసిస్ అని, ఎడరిపువ్వులు ఆశా నిరాశలతో, ఆకాంక్షలతో కొనసాగే మనబతుకులు అని లత తాత్పర్యం.

శివరావు భార్య సునందన వేశ్య కులంలోపుట్టిన స్త్రీ. ప్రేమించి పెళ్లాడిన శివరావు ఆమె ప్రవర్తనలో స్వభావంలో ఆమె కులం మూలాలలను గుర్తించకుండా ఉండలేడు. ఆమాట ఎత్తి ఆమెను అవమాన పరచకుండానూ ఉండలేడు. అది వాళ్ళమధ్య తరచు సంఘర్షణకు   కారణం అవుతుంటుంది. ప్రేమను కలుషితం చేసే  నీతి గురించిన పురుష నీతి గురించిన చర్చ ఈసందర్భంలో వస్తుంది. పెళ్లయి భార్యను వదిలేసిన శివరావు వేశ్యకులంలో పుట్టి ఒకరిద్దరితో శారీరక సంబంధం కలిగినా పెళ్లిచేసుకొని గౌరవకరమైన జీవితంగడపాలనుకొన్న సునందన కన్నా ఏరకంగా నీతిమంతుడు అవుతాడు అన్నప్రశ్నను వదులుతుంది ఈనవల. అంతే కాదు. సునందనను అతను కులం దృష్ట్యా హీనంచేసి మాట్లాడుతుంటే ఆమె తల్లి సునందన ది బ్రాహ్మణ పుట్టుక అనిచెబుతుంది.సునందన తండ్రి యాభై ఏళ్ల వయసులో సంతానం కోసం పదిహేనేళ్ల అమ్మాయిని పెళ్లాడితే సునందన పుట్టింది. ఆ సంసారం లో సంతృప్తి లేక బిడ్డతోసహా ఇరవై ఏళ్ల  యువకుడితో ఆఅమ్మాయి లేచి వచ్చింది. తీసుకొచ్చినవాడు వదిలేసి వెళితే బతుకు నేర్పి భద్రత ఇచ్చింది మోహనాంగి.వేశ్య. అందువల్ల ఆమెను అవమానించటం అంటే నీకులాన్ని నీవు కించపరచుకొనటమే అని హెచ్చరిస్తుంది ఆమె శివరావు ను. వేశ్యలు పుట్టరు ..తయారుచేయబడతారు అని అందుకు బాధ్యత వహించాల్సిన సమాజం వైపు, చిన్న పిల్లలను పెళ్లాడటానికి వృద్ధ పురుషులకు అధికారాన్ని, అహాన్ని ఇచ్చిన వివాహవ్యవస్థ వైపు వేలెత్తి చూపుతుంది ఈనవల. బ్రాహ్మణత్వం కులమా?  విలువా?    బ్రాహ్మణత్వం ఎందులో  ఏక్కువ?  బ్రాహ్మణ ఔన్నత్యాన్ని దిగజార్చే దుష్ట సంస్కృతి మాట ఏమిటి ? కులహీనులుగా  అవమానించబడే  వేశ్య స్త్రీలలోని జీవన విలువల సంగతేమిటి వంటి ప్రశ్నలను కూడా ఈ సందర్భం మనముందుకు తెస్తుంది.   

లత తరువాతి నవలలో దాదాపు ఇవే భావాలు భిన్న పార్శ్వాల నుండి ప్రతిఫలించటం చూస్తాం.                                                                                 

                                                          

*****

( ఇంకా ఉంది ) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.