జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-8

-వెనిగళ్ళ కోమల

రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది.

లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా ఉన్న ఓరియంట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. పదార్ధాలు ఆర్డరిచ్చి మాట్లాడుకుంటున్నాము. నాలో అతిసన్నని కదలిక అనిపించింది. గర్భం సూచన అది అనిపించింది. భోజనం సహించలేదు. ఓరియంట్ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత ఉండేది. ఎలీట్, విజ్ఞులు, మేథావులు సాయంత్రాలు అక్కడ చేరి అనేక విషయాలు చర్చించుకునేవారు. అలాంటి స్థలంలో కూర్చుని గర్భవతినయ్యాననే విషయం గ్రహించాను. బిడ్డ మేథావిగా పెరిగాడు. అది నా నమ్మకం. ఎవరితోనూ ఎప్పుడూ చెప్పలేదు నా విశ్వాసాన్ని గురించి. ఇన్నయ్యకు కూడా చెప్పలేదు. సెంటిమెంట్ అని ఎగతాళిగా కొట్టిపారేసి ఉండేవాడు. ఒకవేళ చెప్పి వుంటే  నా నమ్మకం నాది. నా బిడ్డ గురించి నా విశ్వాసం నాది. కాని ఇప్పుడా రెస్టారెంట్ ఇరానీ చాయ్ దుకాణంగా మారింది. ఆ మేథావులందరితోనే దాని వైభవం గతించింది.

శైలజా వాళ్ళ యింట్లోనుంచి మారాం అద్దె ఎక్కువయిందని. వెనక బజార్లో ప్లీడరు రాజారెడ్డిగారి మేడమీద చిన్న ఇండిపెండెంట్ పోర్షన్ ఉంటే అక్కడికి మారాము. నవీన ఇంటివారితో కలిసిమెలిసి ఉండేది. మూడేళ్ళు వచ్చాయి తనకు. ఆ ఇంట్లో ఉండగానే సొంతంగా చదివి ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. ఇంగ్లీషు పరీక్ష రాశాను. బిడ్డలిద్దరినీ వదిలి వైజాగ్ పరీక్షల ముందు వెళ్ళాను. అమ్మను పిలిపించుకున్నాను. మా అత్తగారూ ఉన్నారు.

వైజాగ్ లో కనకమణి అప్పటికే యూనివర్సిటీలో చేరి ఎం.ఎ.కి చదువుతున్నది. ఆమె బంధువు ప్రొఫెసర్ రామ్ మోహన్ యింటిలో తనతోపాటు నేను ఒక నెలరోజులు ఉన్నాను. కమల, రామ్ మోహన్ ఎంతో ఆదరించారు. వారి అమ్మాయి అమర పసిపిల్ల అప్పుడు. ఆ తరువాత వారికి ఒక అబ్బాయి పుట్టాడు. బిడ్డల మీద బెంగ ఉన్నా పట్టుదలగా పరీక్షలు రాసి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నాను. కాలేజీలో లెక్చరర్ గా వెళ్లే అర్హత సంపాయించుకున్నాను. నేను వైజాగ్ నుండి తిరిగి వస్తే రాజు ఒక్క క్షణం అలా నా వైపు చూచి పరుగెత్తి వచ్చి కాళ్ళకు చుట్టేసుకున్నాడు. ఆ స్పర్శలో బిడ్డ పడిన బెంగ అంతా గ్రహించాను. నవీన రాజు అక్కగా హుందాగా నన్ను చేరింది. ఎప్పుడూ మెచ్యూర్డ్ ప్రవర్తనే తనది. అమ్మ బిడ్డలను కనిపెట్టుకుని ఉన్న ఆ నెలరోజులు నాన్నకు భోజనానికి ఇబ్బంది కలిగింది. పండ్లు పాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది మూల్పురులో. నేను తిరిగి రాగానే అమ్మ తిరిగి మూల్పూరు వెళ్ళిపోయింది. అదే ఆఖరుసారి అమ్మ మా యింట్లో నెల ఉండటం. కొన్ని చికాకులు ఎదురైనా గుంభనగా సర్దుకున్నదని అమ్మ చెప్పకపోయినా నాకర్ధమయింది. మనవల మీద ప్రేమ ముందు చికాకులు లెక్కలోనివి కాదనుకున్నది అమ్మ.

ఇంటి ఓనరు సుశీలమ్మ – చక్కని రంగు, రూపం, నెమ్మదస్తురాలు. ఒకరోజు కూరలబండి వస్తే చిన్న బుట్టలో కొంచెం పాలకూర, టమాటాలు కొని తీసుకెళుతూ నవీన ఆడుతూ కనిపిస్తే – సోనీ అమ్మకు చెప్పు  కూరలబండి వచ్చిందని, తీసుకుంటుందేమో అన్నారట. సోనీ ఆమె బుట్టవైపు చూపిస్తూ మా అమ్మ అంత కొంచెం కొనదు. మార్కెట్ కెళ్ళి పెద్ద బుట్ట నిండా కొంటుంది అన్నదట. నేను కనిపిస్తే ఆమె నీ బిడ్డ అసాధ్యురాలు ఇలా అన్నది అని సంతోషంగా చెప్పారు. సుశీలమ్మకు తెలుగు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట చూడటం చాలా సరదా. అంత రద్దీలో చూసి వచ్చేవారు.

దగ్గరలోనే దీపక్ మహల్ థియేటర్ ఉండేది. అందులో లేతమనసులు సినిమా వస్తే ఇన్నయ్య పిల్లలిద్దర్నీ తీసుకు కెళ్ళాడు. వాళ్ళెందుకో రాము అంటే జమున నటి చాలా బాగుంటుంది. అని నచ్చజెప్పి తీసుకెళ్ళారు. సినిమా అయిపోయి తిరిగి వస్తుంటే నవీన డాడీ – జమున బాగుంటుంది అని అన్నారు. మా అమ్మ చక్కని చీర కట్టుకుంటే యింకా బాగుంటుంది అన్నదట. ఎవరి తల్లి వారికి బాగుంటుంది కదా మరి! పిల్లలిద్దరూ ఇంగ్లీషు సినిమాలు ఇష్టపడేవారు.

సుశీలమ్మగారి ఇంటి నుండి త్వరలోనే మారాము. ఎం.ఎల్.ఎ. (కొత్తవి) క్వార్టర్సుకి మారాము. కొల్లూరు కోటేశ్వరరావు టీచర్, ఎం.ఎల్.సి.గా ఎన్నికయ్యారు. ఇన్నయ్య సహాయం కోరారు. ప్రశ్నలు వేయటం, వేసిన ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలి, మొదలైన విషయాలన్నిటిలో ఇన్నయ్య ఆయనకు బాగా తోడ్పడ్డాడు. ఆయన తెలుగు విద్యార్ధి అనే మాసపత్రిక నడిపేవారు. అన్ని స్కూళ్ళల్లోను బాగా ప్రచారం పొందిన పేపరది. ఇన్నయ్య అనేక విషయాలమీద రెగ్యులర్ గా ఆ పత్రికకు వ్యాసాలు రాసేవాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. తెలుగు విద్యార్ధి ప్రచురణలు అని పబ్లిష్ అయ్యాయి. క్వార్టర్స్ లో ఫ్రీగా ఉండేవాళ్ళం.  సెమీ ఫర్నిష్డ్, రెండు బెడ్ రూంల క్వార్టరు, ఫోను సౌకర్యం ఉండేది. ఎం.ఎల్.సి. మాతోనే ఉండేవారు. ఆయనకిష్టమైన వంటలే చేసేదాన్ని – వెజిటేరియన్, సొంత అన్న అన్నట్లే చూసాను. 

క్వార్టర్ట్స్ లో పిల్లలకు రక్షణ ఉండేది. లాన్ లో ఆడుతూ ఉండేవారు. రాజు మూడేళ్ళవాడు మేమక్కడకెళ్ళినప్పుడు. ఇతర పిల్లలతో కలిసి లాన్ లో ఆడేవారు. నేను కిటికీలో నుండి మధ్యమధ్య గమనిస్తుండేదాన్ని. రాజు ముద్దుగా సుకుమారంగా ఉండేవాడు. ఆటమధ్యలో కాసేపటికొకసారి వచ్చి తలుపు కొట్టేవాడు. నేను తలుపు తెరిస్తే – అమ్మా ఏం చేస్తున్నావు అంటూ లోనకొచ్చేవాడు. నాతో ఎక్కువ అనుబంధం తనకు. 

నా యం.ఎ. రిజల్ట్స్ రాకుండానే ఒకటి రెండు ఇంటర్వ్యూల కెళ్ళాను ఇంగ్లీషు లెక్చరర్ పోస్ట్ కి అన్ వారుల్ – ఉలూం కాలేజీలో సెలెక్ట్ అయ్యాను. ప్రొ.శివ్.కె.కుమార్ ఇంటర్వ్వూ చేశారు. నాతోపాటు ఇంకా ఇద్దరు గూడా సెలెక్ట్ అయ్యారు – గోపాల్, శివ్ కుమార్, అనుకూలమైన రిజల్ట్ వస్తే (ఎం.ఎ.లో) వెంటనే జాయిన్ అవమన్నారు – ఆగస్టు, 1968, మరుసటి వారంలో రిజల్ట్ రాగా – ఫలితాలు ప్రకటించిన పేపర్ చూపి జాయినం అయ్యాను.

నారాయణ గూడా స్కూలుకి 3 నెలల నోటీసు యిచ్చే వ్యవధిలేక – రెజిగ్నేషన్ లెటర్ తో పాటు 3 నెలల జీతం తిరిగి ఇవ్వటానికి స్కూల్ కెళ్ళాను. నన్ను రిలీజ్ చెయ్యకుండా సెక్రటరీ నరసింహారెడ్డి చాలా ఇబ్బంది పెట్టారు. కాలేజి ప్రిన్స్ పాల్ కి లెటర్స్ రాశాడు నన్ను తీసేయమని. ప్రిన్స్ పాల్ విసిగిపోయి – ఆమె రూల్స్ ప్రకారం 3 నెలల జీతం ఇస్తున్నది. తీసుకుని ఆమెను రిలీజ్ చేయమని రాశారు. దానితో తప్పనిసరిగా రిలీజ్ చేశారు. అప్పుడు 3 నెలల జీతం తిరిగి ఇవ్వాలన్నా నాకు ఆర్ధికంగా ఇబ్బందే. అయినా రూలు రూలేగదా! తప్పదు. కస్తూరి ప్రసాద్ స్కూలు ప్రిన్సిపాల్. సెక్రటరీని ఆమె ఎదిరించలేకపోయారు నా విషయంలో న్యాయమని తెలిసినా. 

నేను అన్వరులుం కాలేజీలో సెలెక్ట్ అవటానికి, ప్రొ.ఆలంఖుంద్ మిరి సాహబ్ సహాయపడి ఉండవచ్చు. ఆయన ఇన్నయ్యకు ఫిలాసఫీలో గురువు. తరువాత కొలీగ్ మంచి స్నేహితుడయ్యారు. శివ్.కె.కుమార్ ఆయన మంచి స్నేహితులు ఉస్మానియా యూనివర్సిటీలో. కొన్నాళ్ళ టీచింగ్ తరువాత – ఆలం సాహెబ్ ఇన్నయ్యతో అన్నాటరట – కోమల మంచి టీచరుగా విద్యార్థుల మన్ననలు పొందుతున్నదని – తాను కొందరు విద్యార్థులు  మాట్లాడుకుంటుంటే విన్నాను.. అన్నారట. దాన్ని బట్టి నా విషయంలో శివ్.కె.కుమార్ కి రికమండ్ చేశారేమో అనుకున్నాను. వారిప్పుడు లేరు. వారికి కృతజ్ఞతలు మనసులోనే తెలుపుకున్నాను.

ఎం.ఎల్.ఎ. క్వార్టర్సు దగ్గరలో, రిడ్జ్ హోటల్ డౌన్ లో బ్లూబెల్స్ అని చిన్న స్కూలు నడుపుతున్నారు శ్రీమతి నజ్మా అహమద్. ఆమె ఇంగ్లండులో ట్రైనింగ్ అయ్యారు. కొద్దిమంది పిల్లలతో నాలుగవ తరగతి వరకూ నడుపుతున్నారు. నవీన, రాజును అక్కడ చేర్పించాము. అక్కడ విద్యావిధానం పిల్లలిద్దరికీ మంచి పునాది వేసింది. నజ్మా ప్రత్యేక శ్రద్ధ చూపారు. నా పిల్లలిద్దరిపట్ల అప్పుడప్పుడు యింటికి వచ్చి పిల్లల విషయం ముచ్చటించేవారు. ఇప్పటికీ నవీన, రాజు ఆమెను కలుస్తూ, తలుస్తూ ఉంటారు. వారి మనసుల మీద చెరగని ముద్రవేసారామె. ఆమె బిడ్డ షిరీన్ గూడా వీళ్ళతోపాటే చదివింది. 

స్కూలుకు లంచ్ బాక్స్ లు పట్టుకుని ఆయా భూదేవి పిల్లల వెంట వెళ్ళేది. తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేది. నవీన భూదేవి అవసరం లేదు, నేను తమ్ముణ్ణి తీసుకెళ్ళగలను అంటుండేది. కాని జాగ్రత్తకోసం తనను వెంట పంపేదాన్ని. నవీన దృఢంగా, చక్కగా, చురుకుగా కనిపించేది. త్రోవలో చాలా మంది పలకరించేవారు. అందరూ సోనీ అనే పిలిచేవారు.

క్వార్టర్సులో సోనీ అందరికీ పరిచయమే. మేము సోనీ అమ్మ, నాన్నలమనే వారికి తెలుసు. మా పేర్లు బహుశ వారందరికీ తెలియకపోవచ్చు. ఆటల్లో తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడేది.  ఎవరూ నెట్టకూడదు, పడవేయకూడదు. ఒక లీడరులాగానే వ్యవహరించేది. పిల్లలంతా ఆమె లీడర్ షిప్ ను ఒప్పుకునేవారు.

అక్కడొక చిన్న షాపు ఉండేది. కూల్ డ్రింక్స్, సిగరెట్లు, పాన్ లూ, సోడాలు అమ్ముతుండేవారు.  ఒకసారి ఎవరో అతిథులొస్తున్నారని ఇన్నయ్య అక్కడ సోడాలు కూల్ డ్రింక్స్ కావాలని వెళితే షాపతను కుర్రాడితో సోనమ్మ నాన్నగారు, ఇంటిదాకా వెళ్ళి సరుకు యిచ్చిరా అన్నాడట. ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ నుండి మారవలసి వచ్చినపుడు ఆదర్శనగర్ లో యిల్లు చూడటానికి వెళ్ళితే – సోనీ నాన్నగారు ఇచ్చేద్దాం ఇల్లు అద్దెకు అన్నదట ఇంటివారి అమ్మాయి ఉమారాణి. అలా కూతురు పేరుతో చలామణీ అవుతున్నాం అని నవ్వుకునేవాళ్ళం.

నవీనకు మనోహరి (సుబ్బరాజుగారి మనవరాలు), దుర్గాభవాని (భవనం వెంకట్రాంగారి అమ్మాయి) ఆటల్లో స్నేహితులు. మనోహరి అమెరికాలో ఉంటున్నది. దుర్గాభవాని గైనకాలజిస్ట్ గా హైదరాబాద్ లో వారి సొంత హాస్పిటల్ – సన్ షైన్ – లోనే పనిచేస్తున్నది.

బ్లూబెల్స్ స్కూలుకెళ్ళిన మొదటినాడు నవీన ఇంటికి వచ్చిన తరువాత, మంచం మీద ఎగురుతూ మై ఫాదర్ నేమ్ ఈజ్ ఇన్నయ్య, మై మదర్ నేమ్ ఈజ్ కోమల అంటూ వల్లెవేస్తున్నది. నేను ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అనాలి అని కరక్ట్ చేశాను. తనకు నా మీద నమ్మకం కలగలా. అలా అంటావా, సరే డాడీని రానివ్వు అడుగుతాను అన్నది నేనెప్పుడూ ఇంట్లో పనులు చేయటం, వాళ్ళ అవసరాలు తీర్చటమే చూస్తున్నారు పిల్లలు. తండ్రి దగ్గర కూర్చోపెట్టుకుని షేక్స్ పియర్ నాటకాల కథలు, వార్తలు చదివి వినిపిస్తూ, సైన్స్ విషయాలు వారికి సులభంగా చెపుతూ ఉండేవాడు. అందువలన తండ్రి జ్ఞానం మీదే వారికి గురి ఉండటం సహజం. ఇక నేను వారి చదువుల విషయంలో ఆట్టే కలగజేసుకోలేదు. ఎప్పుడైనా హిందీలోగాని, ఇంగ్లీషులో గాని సందేహాలడిగినప్పుడే చెబుతుండేదాన్ని. ఇన్నయ్య వల్లనే పిల్లలకు సైన్స్ పట్ల అభిరుచి, పుస్తకాలు, వార్తాపత్రికలు చదవటం అలవడింది. మొదటి నుండి సెక్యులర్ భావాలతోనే పెరిగారు. ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు. కులంమతం పాటించలేదు, అందరం మానవులం అనే ధోరణే వారికి కల్పించాడు తండ్రి. 

బ్లూబెల్స్ లో చదువయిన తరువాత ఇద్దరూ ఆబిడ్స్ లోని గ్రామర్ స్కూల్లో చేరి 9వ వరకూ చదివారు. అక్కడ స్కూలు సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకూ ఉండేది. నెలకు చెరి వంద ఫీజు, టరం ఫీజు, యూనిఫారాలు, షూలు, పుస్తకాలు ఖర్చు ఎక్కువే అప్పట్లో.  వారికి ఏ లోటూ రాకుండా పెంచాలనేదే నా తాపత్రయం. రాజు పుస్తకాలు అంటే బాగా శ్రద్ధ చూపేవాడు. ఏమి కావాలి అని తండ్రి అడిగితే పుస్తకాలు తీసుకురండి డాడీ అనేవాడు. సామాజిక విషయాలమీద దృష్టి ఉండేది. 6, 7 క్లాసులలో ఉన్నప్పుడు తన దృష్టికి వచ్చిన విషయాల మీద పత్రికలకు లెటర్స్ టు ది ఎడిటర్ కాలంకి రాసేవాడు. తెలుగు అంటే ఇష్టపడేవాడు కాదు. ఇద్దరూ హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నారు. తెలుగు బదులు స్పెషల్ ఇంగ్లీషు చదివారు. హిందీని చపాతీ భాష అనేవాడు రాజు. ఇద్దరూ 9వ క్లాసు డిసెంబరులో ముగించి సొంతంగా చదివి ప్రిపేర్ అయి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో రాశారు. ఇద్దరికీ వయసు చాలదంటే తహసీల్దారు వద్ద నుండి ఏజ్ కాండొనేషన్ సర్టిఫికెట్ తెచ్చుకొని పరీక్షలు రాశారు. కమలగారి అబ్బాయి రాజశేఖర్ రాజు క్లాస్ మేట్. అతను కూడా 10వ తరగతి రాజుతోనే పాసయ్యాడు. ఇద్దరూ పందెం పెట్టుకున్నారు. ఇంగ్లీషులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు రెండవవారికి జేమ్స్ బాండ్ సినిమాలన్నీ ఫ్రీగా చూపించాలి అని. రాజుకి ఎక్కువ మార్కులు రావటంతో పందెం ప్రకారమే నడుచుకున్నాడు.

నవీన ఇంటర్మీడియేట్ లో సైన్స్ గ్రూపు తీసుకుని స్టాన్లీ జూనియర్ కాలేజీలో చదివింది. రాజు చైతన్య జూనియర్ కాలేజీలో చదివాడు. 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. ఆర్ట్స్ గ్రూపు తీసుకుని ఫీజు కట్టడానికి వెళితే ప్రిన్సిపాల్ శ్రీ సుందరరామయ్య సైన్స్ గాని మ్యాథ్స్ గ్రూపుగాని తీసుకుని చదవమని సలహా యిచ్చి, మరురోజు దాకా  ఆలోచించుకుని ఫీజు కట్టమని పంపించివేసారు. ఆయన మాటకు మర్యాదనిచ్చి మరురోజుదాకా ఆగినా  ఆర్ట్స్ గ్రూపులోనే చేరాడు. ఆర్ట్స్ చదువుతానని  8వ క్లాసులోనే నిర్ణయించుకున్నాడు. సైన్స్ లో ఫిగర్స్ డ్రా చేయటం ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పుడు అక్కతో గీయించుకునేవాడు ఏమన్నా చేయవలసి వస్తే. ఇంటర్లో ఆనందీమేడం ఇంగ్లీషు టీచరుగా రాజు మీద మంచి ప్రభావం చూపారు. ఆర్.కె.నారాయణ్, పి.జి.వోద్ హౌస్ రచనలు ఆమె ప్రభావం వల్లనే అప్పుడే చదివాడు. ఇద్దరూ ఇంటర్ మంచి మార్కులతో పాసయ్యారు. 

నవీన చిన్నప్పుడు నా స్నేహితులు, చుట్టాలు ముద్దుకి ఏమి చదువుతావు అని అడిగితే డాక్టర్నవుతా, అమెరికా పోతా అనేది. డాక్టరు చదవమని నేను అని ఉండవచ్చు కాని అమెరికా పోతా అనడం నాకూ అర్ధమయ్యేది కాదు అప్పుడు. 

16 ఏళ్ళు నిండలేదని మెడికల్ ఎంట్రన్స్ రాయటానికి అనుమతి దొరకలేదు. దిట్టంగా ఉంటాను, చీరకట్టుకొని పెద్దమనిషిలా అప్లికేషన్ తీసుకు వెళితే రాయనిస్తారు అని ఆశపడి అప్లికేషన్ తీసుకెళ్ళింది. అప్లికేషన్ రిసీవ్ చేసే వ్యక్తి అప్లికేషన్ లో వయసు వివరం చూసి – నెక్ట్స్ ఇయర్ బెటర్ లక్ అమ్మా! అని అప్లికేషన్ నిరాకరించాడని చిన్న ముఖం చేసుకుని తిరిగి వచ్చింది. వేసవిలో గుంటూరు వెళ్ళి స్పెషల్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్నది. తులశమ్మ, రాఘవరావుగారి యింట ఉండి చదివింది గుంటూరులో. సీతమ్మ అమ్మమ్మ శ్రద్ధగా వండి పెట్టింది. అందరూ ప్రేమగా చూశారు. తీరా ఎంట్రన్స్ పరీక్ష రేపనగా సడన్ గా ఎపెండిసైటిస్  ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. డాక్టర్ను బ్రతిమాలింది – మందులివ్వండి నొప్పికి – పరీక్ష రాసిన వెంటనే ఆపరేషన్ చేయండి అని. మేము రిస్క్ తీసుకోదలచలేదు – ఆపరేషన్ చేయించివేశాము. బాగా డీలా పడింది. కానీ అదే సంవత్సరం నిజాం కాలేజీలో జెనెటిక్స్ తో మొదటి సంవత్సరం బి.ఎస్సీ చదువుతుండగా ఎక్చేంజ్ ప్రోగ్రాంలో గవర్నమెంటు నుండి బెంగుళూరు గవర్నమెంటు కాలేజీలో ఎం.బి.బి.ఎస్.లో సీటు దొరికింది. అక్కడ హాస్టల్లో ఉండి మెడిసిన్ చదివింది.

ఇన్నయ్య మెడిసిన్ వద్దు, ప్యూర్ సైన్సెస్ చదివి, రిసర్చ్ ఫీల్డ్ ఎన్నుకోమని ఎంత చెప్పినా మెడిసినే చదవుతానని పట్టుపట్టింది. సీటు రావటానికి ఛీఫ్ మినిస్టరుగా శ్రీ భవనం వెంకట్రాం తోడ్పడగా, అప్పుడే ఛీఫ్ మినిస్టరయిన శ్రీ విజయ భాస్కర రెడ్డి అనుమతి పత్రంపై సంతకం చేశారు. వెంటనే బెంగుళూరు వెళ్ళి జాయిన్ అయింది. 

రాజు మరుసటి సంవత్సరం ఇంటర్ అయి నిజాం కాలేజీలో బి.ఎ. ఎకనమిక్స్ మెయిన్ తో చదివాడు. ఒకనాడు ఇ.ఎన్.టి. డాక్టరు టి.వి.కృష్ణారావు ఇంటికి వచ్చారు. రాజు పసిగా ఉన్నప్పుడు ఆయనే టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. రాజును ఏమి చదువుతున్నావయ్యా అని అడిగారాయన. బి.ఎ. అన్నాడు. అదేమిటి ఇంజనీరింగో, మెడిసినో చదవక బి.ఎ. ఏమిటి? అన్నారాయన. నేను అదే చదవాలనుకున్నాను, అదే చదువుతున్నాను అన్నాడు రాజు నిక్కచ్చిగా. 

రాజు ఇంటర్ చదివేటప్పుడు జస్టిస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆటోబ్రయోగ్రఫీ రాసి చదివి ఎలా ఉందో చెప్పమన్నారు రాజును. చదివి –  మీరు బెట్ర్నాండ్ రసెల్ అని అనుకుంటున్నారా, ఈసోది అంతా ఎవరు చదువుతారు, కొన్ని వివరాలు తొలగించండి అని మార్జిన్ లో ఎక్కడెక్కడ తగ్గించాలో సూచించాడు. ఆయన పిల్లకాకి అని కొట్టిపడవేయకుండా రాజు సూచనలు పాటించారు. అలాగే నార్లగారి రచనలో రాజు సలహాలిచ్చాడు. ఇద్దరు విజ్ఞులూ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు తమరచనల్లో.

బలహీనంగా ఉండేవాడు. తినే విషయంలో ఎప్పుడూ పేచీయే. తినమంటే విసుక్కునేవాడు చిన్నప్పుడు – అసలెందుకు తినాలమ్మా అని ప్రశ్నించాడు నన్ను. తింటే బలంవస్తుంది. పెద్దవాడిగా పెరుగుతావు. అని నాకు తోచిన మాటలు చెప్పాను. ఒకసారి ఏదివిన్నా మనసుకి హత్తుకుపోతుంది తనకు. ఏకసంతగ్రాహి. ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో కింది భాగంలో ఎం.ఎల్.ఎ. జి.రాజారాంగారి కుటుంబం ఉండేది (తరవాత మినిస్టరయ్యాడాయన). వారి తల్లి మరణించింది అప్పుడు. ఎందుకు చనిపోయింది అని పసివాడు రాజు నన్ను ప్రశ్నించాడు. పెద్దామె అయింది. పెద్దవయసు వలన మృతి చెందింది అని చెప్పాను. 

ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లో ఒకనాడు రాజు సడన్ గా నన్ను ప్రశ్నించాడు – అమ్మా నీవు చిన్నప్పుడు 6 దోసెలు, నాలుగు ఇడ్లీలు తిని, చాలా గ్లాసుల పాలు తాగేదానివా? అని నాకు అయోమయంగా అనిపించినా లేదు నాన్నా మామూలుగా తినేదాన్ని. అయినా ఎందుకలా అడుగుతున్నావు అన్నాను. తింటే బలం వస్తుంది, పెద్దవాళ్ళవుతారు అన్నావు.  కింద ముసలమ్మగారు పెద్దగా అయి చనిపోయింది కదా! నీవు అలా పెద్దగా కావద్దు. మాకు నువ్వు కావాలమ్మా, చనిపోకూడదు అన్నాడు. బిడ్డ గొంతులో భయం చారలు నన్ను కలవరపెట్టాయి. సర్ది, బుజ్జగించి మరిపించవలసి వచ్చింది. 

క్వార్టర్సులో ఉన్నప్పుడు రాజు గురించి రెండు విషయాలు నేను ప్రస్తావించాలి. గ్యాస్ సిలిండర్ (అ రోజుల్లో ఒకటే ఉండేది) అయిపోయింది. ఫోన్ చేస్తే నాలుగు రోజుల్లో ఇస్తామన్నారు. అయ్యో బంధువులు కూడా ఉన్నారు, కిరోసిన్ కూడా అయిపోయినట్లున్నది, ఎలాగా? అని పైకే అన్నాను. అది విన్నాడు రాజు బడికి బయలుదేరుతూ. ఆయా తలుపు తెరిచి వారిని లోనకు పంపించి వెళ్ళిపోయింది.  రాజు ఖాళీ కిరోసిన్ డబ్బా తీసుకుని అక్కడ జార్ లో డబ్బుంటే తీసుకుని దగ్గరలో ఉన్న కిరణాషాపుకెళ్ళి డబ్బా నిండా కిరోసిన్ పోయించుకుని మోయలేక గుండెలకు డబ్బాని అదిమి పెట్టి నెమ్మదిగా నడుస్తూ రావటం అప్పుడే ఇల్లు చేరుతున్న నాకు కనిపించింది. పరుగెత్తి డబ్బా తీసుకున్నాను. హృదయం ద్రవించి కంట నీరొచ్చింది. బిడ్డ తీసుకున్న శ్రద్ధ చూసి. 

మరొకసారి సాయంత్రం కూరలు కొనటానికి వెళుతూ చిన్నక్క కొడుకు నరేంద్రతో కిరోసిన్ పొయ్యిమీద కుక్కర్ ఉంది, మూడు విజిల్స్ రాగానే దించమని చెప్పాను. నరేంద్ర ఏదో కథ చదువుతూ మూడు విజిల్స్ వచ్చినా పట్టించుకోలేదు. పసితండ్రి రాజు నేను చెప్పటం విన్నాడు కాబోలు వెళ్ళి కుక్కర్ దించాడు. బరువుకి కింద పెడుతుంటే పెద్ద శబ్దం రాగా నరేంద్రకు స్పృహ వచ్చి వెళ్ళి చూసాడు. నేను తిరిగి రాగానే నాకా సంగతి చెప్పాడు. గుండె గుభేలుమన్నది. ఇంకానయం హ్యాండిల్స్ పట్టుకొని దించాడు. కుక్కర్ మీద చేతులు పెట్టకుండా. చాలా భయం వేసింది. 

ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో హోలీ పండుగ నాడు గుండెలు పిండే సంఘటన జరిగింది. అక్కడ నేపాలీ గూర్ఖా పండుగ ఇనాం అంటూ వస్తే రాజుతోటే డబ్బు ఇప్పించానతనికి. అతనికి అప్పుడే దుర్మార్గపు ఆలోచన వచ్చినట్లున్నది. బయట ఆడుకుంటున్న రాజును కిడ్ నాప్ చేసి తన క్వార్టర్సులో బంధించి ఉంచాడు. పసివాడు సొమ్మసిల్లి భయపడి నిద్రపోయాడు. భోజనం వేళకి పిలుద్దామని వెళితే రాజు ఎక్కడా కనిపించలేదు. తోటి పిల్లలు, చూడలేదన్నారు. గుండెలవిసిపోయాయి. క్వార్టర్సు, నౌబత్ పహాడ్ అన్నీ గాలించాము. బిడ్డ ఆచూకీ దొరకలేదు. 

పోలీసు కమీషనరు పర్వతనేని కోటేశ్వరరావుగారికి తెలపగా అన్ని పోలీసు స్టేషన్లనీ ఎలర్ట్ చేసి సర్చ్ ఆర్డరిచ్చాడు. సాయంత్రం అవుతుండగా, రాజు నడిచి రావటం చూసిన పిల్లలు రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు అని అరిచారు. బిడ్డ అలసి, సొలసి మౌనంగా వచ్చాడు.  గూర్ఖా తన రూమ్ కి తీసుకెళ్లి, పదిపైసలు చేతిలో పెట్టాడు. బల్ల మీద కూర్చోబెట్టాడు. నిద్రపోయాను అని చెప్పాడు. గూర్ఖా భార్య ఎక్కడ నుండో ఇంటికి తిరిగి వచ్చి, పరిస్థితి తెలుసుకుని రాజుని విడిపించిందట. మనకీ పిల్లలున్నారు, దుర్మార్గపు ఆలోచన మంచిది కాదని భర్తకు చివాట్లు పెట్టిందట. ఏది ఏమైనా మా బిడ్డ మాకు దక్కాడు. గూర్ఖాను జైల్లో వేయవద్దని కోటేశ్వరరావుగారిని కోరాము. 

పర్వతనేని కోటేశ్వరరావుగారు నిజాయితీ ఉట్టిపడే పోలీసు ఆఫీసరు. రాజుకు ఆయన్ను యూనిఫారంలో చూడటం ఇష్టంగా ఉండేది. అంకుల్ మా యింటికి యూనిఫారంలోనే రండి! అని రిక్వెస్ట్ చేసేవాడు. ఆయనంటే ఎంతో గౌరవం రాజుకు. ఆయన ఎవార్డు తీసుకుంటుంటే ఆగస్టు 15వ తేదీన పెరేడ్ గ్రౌండ్స్ కి వెళ్ళి, ఆయనతో ఫోటో దిగాడు. తన బర్తడేకని పోలీసు యూనిఫాం కొనిపించుకున్నాడు నాచేత. కాని తీరా పుట్టినరోజు నాటికి ఆటలో పడి మోచేయి ఫ్రాక్చరు అయినందువలన పట్టీ ఉండటం మూలాన యూనిఫాం తొడుక్కోలేకపోయాడు. కోటేశ్వరరావుగారి భార్య రవికుమారి పిల్లలు సుధీర్, పద్మ మాకు బాగా దగ్గరయ్యారు. రిటైరైన కొద్దికాలంలోనే కోటేశ్వరరావుగారు మృత్యువాత పడటం మమ్మల్ని బాధించింది. 

రాజు బి.ఎ. అయిన తరువాత ఐ.ఎ.ఎస్. చేయమన్నాను. చేయగలను, ఫస్ట్ ఛాన్స్ లో క్లియర్ చేయగలను కాని చేయను అన్నాడు. గవర్నమెంటు అనుకూలంగా లేకపోతే తీసుకెళ్లి లూప్ లైన్ లో పడవేస్తారు. అలాంటి ఉద్యోగం నాకొద్దు అన్నాడు రాజు. ఏదైనా పుస్తకం చదవ మొదలెడితే అది పూర్తి  అయ్యేదాకా భోజనానికీ, స్నానానికి లేచేవాడు కాదు. అసలు పిలిచినా వినిపించుకునేవాడు కాదు. సరిగ్గా తినకపోవడం, బలహీనంగా ఉండటం ఆయన జన్మహక్కులా ఉండేది ఆరోజుల్లో. 

జస్టిస్ జగన్ మోహనరెడ్డిగారు ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఇన్నయ్యకు బాగా సన్నిహితులయ్యారు. ఇంటికి పిలిచి అనేక విషయాలు ఇన్నయ్యతో చర్చించేవారు. ఇన్నయ్య అప్పటికే ఎం.ఎన్.రాయ్ గ్రంథాలన్నీ తెలుగులోకి అనువదించి ఉన్నాడు. జగన్ మోహన్ రెడ్డిగారు రాసిన – మైనారిటీస్ అండ్ ది కాన్స్టిట్యూషన్, అవర్ గవర్నర్స్, లా అండ్ సొసైటీ, ది యూనివర్సిటీ ఐ సర్వ్డ్ అనే పుస్తకాలను ఇన్నయ్యతో తెలుగులోకి అనువాదం చేయించుకున్నారు. ఇన్నయ్యకు తెలుగులో అనేక గ్రంథాలు రాసిన అనుభవం ఉన్నది. అందువలననే జగన్మోహనరెడ్డిగారికి సహాయపడగలిగాడు. ఇన్నయ్య పాల్ కర్జ్, రిచర్డ్ డాకిన్స్, శామ్ హారిస్, క్రిస్టోఫర్ హిచిన్స్ వంటి రచయితల పుస్తకాలు తెలుగించాడు. నార్లగారి ది ట్రూత్ ఎబౌట్  గీతా తెలుగు చేశాడు. చెప్పాలంటే ఇంకా పెద్ద లిస్టే అవుతుంది. మచ్చుకి కొన్ని ప్రస్తావించాను. 

నన్ను రచయితను చేయాలని ఎంతో ప్రయత్నించాడు. కొన్ని అనువాదాలు చేసినా రాయటం నాకంత సులభంగా అబ్బలేదు. తనేవిషయమైనా సులభశైలిలో చక్కగా రాయగలడు. తను 10వ క్లాసు చదివేనాటి నుండి అనేక పత్రికలకు రాసిన అనుభవం ఉంది. 

శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రముఖ పాత్రికేయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. జర్నలిజంలో ప్రత్యేక వరవడి తెచ్చినవారాయన. అనేక గ్రంథాలు రచించిన మేథావి. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా జర్నలిజంలో ఎన్నో ప్రక్రియలు ప్రవేశపెట్టినవారు. ఆయన సంపాదకీయాలు చదవటానికే పేపరు కొనేవాళ్ళు అనేకులు. నార్లగారితో ఇన్నయ్యకు సన్నిహితత్వం ఏర్పడింది. ఎక్కువగా వారిల్లు లుంబిని (బంజారా హిల్స్)లో ఇద్దరూ కూర్చుని అనేక విషయాలు చర్చించేవారు. వారి కోరిక మీదట ఇన్నయ్య కొంతకాలం ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరోలో పనిచేశాడు. నార్లగారు పేపరు నుండి వైదొలగినప్పుడు ఇన్నయ్య ఉద్యోగం నుండి విరమించుకున్నాడు. 

నార్లగారింటికి నేను గూడా అప్పుడప్పుడు ఇన్నయ్యతో కలిసి వెడుతుండేదాన్ని. వారి శ్రీమతి సులోచన మంచి హోస్ట్ వేడిగా తినమని పట్టుబట్టేవారు. నార్ల, ఇన్నయ్య మాట్లాడుకుంటుంటే నేను వింటూ ఉండేదాన్ని. వారి లైబ్రరీ 20వేల పుస్తకాలకు పై చిలుకు కలది. వాల్ టు వాల్ అలమేరాలలో క్రమంగా పుస్తకాలు సర్దబడి ఉండేవి. పుస్తకాలు, అనేక కళాఖండాలు కొనటం నార్లవారి అభిరుచి. సులోచనగారు ఎక్కువ చదువుకోకపోయినా ఆ పుస్తకాలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు. నార్లగారు ఫలానా చోట ఫలానా పుస్తకం తెమ్మంటే ఆమె వెంటనే తెచ్చి యిచ్చేవారు. నార్లగారి అనంతరం ఆయన లైబ్రరీ అంతా ఓపెన్ యూనివర్సిటీకి బహూకరించబడింది. ఆదివారాలు ఇన్నయ్యను వెంటబెట్టుకొని సుల్తాన్ బజారులో రోడ్డు పక్కన పెట్టి అమ్మే పుస్తకాలు చూడటానికి వెళ్ళేవారు. నచ్చినవి కొనేవారు. ఏ పుస్తకమైనా తమ వద్ద ఎక్స్ ట్రా ఉంటే ఇన్నయ్యకిచ్చేవారు. మా పిల్లలకు కూడా రకరకాల పెన్నులు బహూకరించేవారు. చివరలో రైటింగ్ డెస్క్, టైప్ రైటరూ రాజుకి బహూకరించారు. అంతటి మేథావులతో పరిచయం నాకు గర్వకారణం. వారి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ డాక్టర్లు – కోడళ్ళు, అల్లుళ్ళు కూడా. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. పెద్దమ్మాయి శారద తప్ప. రమ, మీనాక్షితో నాకు బాగా పరిచయం. ఇప్పటికీ టచ్ లో ఉన్నాము. నార్లగారు తమ నరకంలో హరిశ్చంద్ర నాటకం ఇన్నయ్యకు అంకితమిచ్చారు. అదే వారి ఆఖరి రచన.

రాజు నిజాం కాలేజీలో డిగ్రీ ముగించి ఇర్మా, ఆనంద్ (గుజరాత్) కురియన్ ఇన్స్టిట్యూట్ లో రెండేళ్ళు మేనేజ్ మెంట్ కోర్సు చేశాడు. వాళ్ళు స్కాలర్ షిప్ ఇచ్చారు. అది సరిపోయిందో లేదో గాని మమ్మల్ని ఎప్పుడూ డబ్బు అడగలేదు. బిడ్డే అన్నీ సర్దుకున్నాడు. ఎక్కడ చదివినా ఫస్ట్ రావలసిందే. ఇర్మాలో మాథ్స్ ఎక్కువగా ఉన్న కోర్సది. బిడ్డ చాలా కష్టపడవలసి వచ్చింది మొదట్లో. కాని సాధించి కోర్సులో ఫస్ట్ నిలిచాడు. అమ్మా, ఫస్ట్ వస్తున్నానని నీవు బాగా సంతోషిస్తావు. అలా జీవితాంతం శ్రమపడితేనే అన్ని రంగాలలో ఫస్ట్ ను నిలుపుకోగలను అన్నాడు. అలానే నిలుపుకున్నాడు చేసిన ప్రతి పనిలో. ఇప్పటికీ అదే ప్రతిభ చూపుతున్నాడు తన పనిలో. 

ఇర్మాలో కేంపస్ ప్లేస్ మెంట్ లో ఎ.పి.డి.డి.సి వారు సెలెక్ట్ చేసి అహమ్మదాబాద్ బ్రాంచ్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ ఉద్యోగం నిర్వహించటంలో తనకున్న ప్రతిభావ్యుత్పత్తులు చాటుకునే అవకాశం తక్కువగా ఉన్నదని గ్రహించిన రాజు అనతికాలంలోనే రాజీనామా సమర్పించి ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నడిపే సోషల్ జర్నలిజం చదవటానికి వెళ్ళాడు. తన క్లాసుమేట్, స్నేహితుడు ప్రవీణ్ అగర్వాల్ ఢిల్లీలో ఎ.పి.డి.డి.సి. బ్రాంచ్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను హైదరాబాద్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు మా యింట్లోనే చాలా కాలం ఉన్నాడు. ఢిల్లీలో రాజును తనతో ఉండమని పట్టుబట్టాడు. అతని తల్లి, సోదరి నీరూ రాజును ప్రేమగా చూసుకున్నారు. 

జర్నలిజంలో రాజు గురువులు ప్రొ.నైనన్, ప్రొ. ఊమన్ రాజులోని ప్రతిభను గుర్తించారు. రాజుకు జర్నలిజంలో మంచి భవిష్యత్తు ఉన్నదని చెప్పిన వారు వాళ్ళిద్దరూ. చదువు అవగానే రాజుకు ది ఎకనామిక్ టైమ్స్లో ఉద్యోగమయింది. అనతి కాలంలోనే రాజును ఎసైన్ మెంట్ మీద జర్మనీ పంపిచారు ఒక నెల రోజులు. అప్పుడు రాజు తనకున్న తెలివి తేటలకు, శక్తి సామర్ధ్యాలకు బయట ప్రపంచంలో పనిచేయటం ఉత్తమం అని తెలుసుకున్నాడు. తిరిగి వచ్చిన తరువాత టోఫెల్, జి.ఆర్.ఇ. పరీక్షలు రాశాడు. టోఫెల్ పరీక్షలో సెంట్ పర్సెంట్ మార్కులతో పాసయ్యాడు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.