నారిసారించిన నవల-19

                      -కాత్యాయనీ విద్మహే 

లత నవల ‘రాగజలధి’  తొలి కూర్పు 1960 ఆగస్టు. ‘ఆశోపహతులైన అదృష్టహీనులకు’ అంకితం. అనూచానంగా స్త్రీపురుషుల మధ్య ప్రవహించి పోతున్నఈఆకర్షణా వాహినికి తాత్పర్యం ఏమిటి ? తరగ వెనకాల తరగగా, పరుగులెత్తే నురగగా, జీవితాన్నిసరిగా ఊపిరి కూడా పీల్చు కోనీకుండా అడ్డుపడుతున్నఈరాగజలధిని ఎవరు సృష్టించారు? దీనికి అర్ధం ఏమిటి?  అన్న ప్రశ్నలతో మొదలైన ఈనవలలోఇతివృత్తం కపర్దిని, ఆరణిని, సూర్యాన్ని చుట్టుకొని విస్తరించింది. తన గతాన్ని, సరస అనే వెలయాలితో తనకు ఏర్పడిన బంధాన్ని తలచుకొంటూ కపర్ది‘ప్రేమించటం ఎందుకు జరుగుతుందంటావ్’ అని   అడిగిన ప్రశ్నకు సమాధానంగా మిత్రుడు ఆరణి తన గతాన్నిఅతనికి వినిపించటంగా కథ విస్తరించింది. నిజానికి నవలలో అసలు కథ ఆరణిది , అతని స్నేహితుడు సూర్యానిది.అంతకంటే  ఆరణి చెప్పిన సూర్యం కథ అనవచ్చు. 

ఆరణి గోదావరి కాలువల మీద తిరుగుతూ ఉప్పు అమ్మే పడవలలో పెరిగిన అనాధ శిశువు. పడవ కళాసీల దయతో పెరిగాడు. ఉప్పు పడవలో  ప్రయాణించిన ఒక అయ్యవారి వల్ల అక్షరం పరిచయం అయి అభిమానం పెరిగింది. ఉప్పు పడవ వచ్చి ఆగిందన్న  సమాచారం ఇయ్యటానికి పడవ ఆగిన గోదావరి ఒడ్డు గ్రామంలోకి వెళ్ళినప్పుడు సూర్యంతో అతనికి ఏర్పడ్డ పరిచయం స్నేహంగా  అభివృద్ధి చెందింది. ఉప్పు పడవలు వదిలి చదువుకు రాజమండ్రి చేరాక సూర్యంతో పాటు అతని గదిలోనే ఉన్నాడు. సూర్యం తల్లి కనకాంగి ఆదరణ పొందాడు. సూర్యం తల్లిని ఎందుకు ద్వేషిస్తున్నాడో ఆమెవల్లే తెలుసుకున్నాడు.అతని జీవితం అంతవరకే.  వివాహిత అయిన మీనాక్షితో సూర్యం స్నేహం, ఆమెతో ఇల్లువదిలిపోవటంతో మొదలుపెట్టి సూర్యం జీవితంలో వచ్చిన పరిణాల కథనం గా సాగిన ఈ నవల ఇతివృత్తంలో మీనాక్షి తమ్ముడు నటరాజన్  జీవిత పరిణామాలు ప్రధాన భాగం ఆక్రమించాయి. ఆరణికి సూర్యంతో అరమరికలు లేని స్నేహం కనుక తాను చూసి కానీ , అతను చెప్తే వినికానీ తెలుసు కొన్న వివరాలతో సూర్యం గురించి చెప్పగలడు. చెప్పాడు. సూర్యానికి కూడా ప్రత్యక్ష సంబంధంలేని , అందువల్ల      ఆరణికి  అసలు తెలియటానికే   వీలులేని నటరాజన్  జీవిత ఘట్టాలు,  అతని కథనంలో భాగం కావటం కొంత అసంబద్ధంగా అనిపిస్తుంది. 

 పైగా ఈ నవలలోని నటరాజన్ జీవితానికి   శారద అనే కలం పేరుతో నవలలు, కథలువ్రాసిన నటరాజన్ జీవితంతో దగ్గరి పోలికలు కనిపిస్తాయి.నవలలోని నటరాజన్ కూడా రచయితే. ఇతని కలంపేరు నందిని. శారద నవలలు మంచీ-  చెడూ, అపస్వరాలు అయితే నవలలో నటరాజన్ వ్రాసిన నవలలు నీతి అవినీతులు, అపశ్రుతులు.ఇద్దరూ జీవిక కోసం హోటల్ సర్వర్లుగా పనిచేసినవాళ్ళే. ఆకలి, దరిద్రం, తాగుడు , పెళ్లితో సంబంధంలేని లైంగిక సంబంధాలు, వ్యాధులు…అర్ధాంతర మరణం ఇద్దరికీ సామాన్యమే.  విజయవాడకు సమీపంలోని తెనాలిలో జీవించి 1955 లో మరణించిన నటరాజన్ జీవితంలోని డ్రామా ఏదో అప్పుడప్పుడే  రచనా రంగంలోకి అడుగుపెడుతున్న లతను  బలంగా ఆకర్షించినట్లుంది. అది ఈ రకంగా రాగజలధి నవలేతివృత్తంలో భాగం అయింది. 

సామాజిక నీతిసూత్రాల శాసనాల కింద పడి నలిగిడికి గురైన స్త్రీపురుష సంబంధాల లోని సహజ సున్నితత్వం గురించిన చింతన ఈనవలలో ప్రధానం. ఆరణి అమలాపురం దగ్గర, గోదావరి ఒడ్డున దొరికిన పిల్లవాడు. చింతయ్య మాటల్లో ‘ఏతల్లి కని పారేసిందో తెలియదు’. ఆమాటవినగానే శివశివా అని చెవులు మూసుకొని, ‘రత్నంలాంటి బిడ్డ వర్చస్సు తొణికిసలాడు తున్నది. మంచివంశంలోనే పుట్టిఉండాలి’ అన్న అయ్యవారి వాక్యాన్నికలిపి చూస్తే అరణి ని అనాథనుచేసిన స్త్రీపురుషసంబంధాల నీతి వ్యవస్థ లక్షణం తెలిసి వస్తుంది. మంచి వంశం లోపుట్టిన బిడ్డ పరిత్యజించబడటం ఎప్పుడు జరుగుతుంది.? ఆపుట్టుకకు కారణమైన స్త్రీపురుష సంబంధం సామాజిక నీతికి వ్యతిరేకమైతే. పెళ్లికాకుండా వచ్చే గర్భం, భిన్నకుల, మత , వర్గ స్త్రీపురుషుల సంబంధఫలితమైన గర్భం, వితంతు స్త్రీ గర్భం అనైతికం, అధర్మం అని నిర్ధారించిన సమాజంలో ఆమోదయోగ్యం కావు కనుక వదిలించుకోవలసినవి అవుతాయి.భ్రూణ హత్యలు, సాధ్యం కాకపోతే పుట్టగానే శిశువును ఎక్కడో వదిలేసి సమాజానికి ఆమోదయోగ్యమైన పద్ధతిలో జీవించటానికి సిద్ధపడటం జరుగుతుంటుంది. అనాధ శిశువులు ఈరకమైన సామాజిక దుర్మార్గానికి నగ్నసాక్షులు. ఆరణి వాళ్లకు ప్రతినిధి. 

స్త్రీపురుష సంబంధాలు దంపతీ కుటుంబ సంబంధాలుగా పరిణామం చెందిన క్రమంలో ఒకస్త్రీకి ఒకపురుషుడు, ఒకపురుషుడికి ఒకస్త్రీ జీవితకాలం కట్టుబడి ఉండాలన్న సూత్రం రూపొందినా ఆచరణలో మగవాళ్లకోసం కుటుంబానికి అవతల వేశ్యా వ్యవస్థ ఏర్పాటు అయింది. కుటుంబ నీతిని ధిక్కరించి వేశ్యలతో సంబంధం ఏర్పరచుకొనే పురుషులు సమాజంలో మర్యాదస్తులుగానే చలామణి అవుతుండగా  వేశ్యలు మాత్రం మగవాళ్ళను చెడుదారులకు ఈడ్చేవాళ్ళుగా , నీతి బాహ్యులుగా చూడబడటం ఒక వైరుధ్యం. వేశ్యా వ్యతిరేక ఉద్యమంలోకి కొనసాగివచ్చిన ఈఅధర్మ ధర్మాన్ని గుర్తించి గురజాడ వేశ్యాలలోని మానవత్వ కోణాన్ని సభ్య సమాజపు క్రౌర్యాన్ని పక్కపక్కన చూపిస్తూ కన్యాశుల్కం నాటకం వ్రాసాడు.చలం, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు వంటి రచయితలు ఆసంప్రదాయాన్నిముందుకు తీసుకుపోయి సంస్కరించబడవలసినది నీతి  గురించి భ్రమలలో బతుకుతున్న సమాజమే అనితేల్చిచెప్పారు. వాళ్లకు కొనసాగింపుగా లత లైంగికనీతికి సంబంధించిన భావనలను చర్చకు పెడుతూ ఇతివృత్తాలను నిర్మించింది. రాగజలధి నవలలో సూర్యం తల్లి వేశ్య. సమాజం ఆమెను నీతి బాహ్యురాలని చులకనగా  చూస్తుంది. శరీరాన్ని అమ్ముకొని బతికే తల్లి బిడ్డగా సూర్యం సమాజంలో తన స్థితికి అవమాన పడతాడు. ఆక్రోశపడతాడు. అదితల్లి పట్ల, అమ్మమ్మ పట్ల ద్వేషంగానో, తరస్కారంగానో వ్యక్తం అవుతుంటుంది. దూరం పాటించేలా చేస్తుంది.స్త్రీపురుష సంబంధ నీతివ్యవస్థ ఏదైతే చలామణిలో ఉందొ అది సూర్యం వంటి పిల్లల  మెదళ్లను,హృదయాలను కుళ్ళబొడుస్తుంటుంది. సహజ మానవసంబంధాలకు పరాయీకరిస్తుంది. వాస్తవాలను అర్ధంచేసుకోకుండా భ్రమలలో బతికేలా చేస్తుంది. ఆభ్రమల నుండి అతనిని బయట పడేసిన వ్యక్తి మీనాక్షి.

మీనాక్షి శివాలయం గుడిపూజారి భూషయ్య భార్య. తల్లిని తప్పించుకొని తిరుగుతూ శివాలయంలో దాక్కునే సూర్యానికి ఆమెతో చనువు ఏర్పడింది. ఆమె పవిత్రురాలు తనతల్లి లా నికృష్టురాలు కాదు అన్న ఊహతో ఆమె పట్ల గౌరవాభిమానాలు పెంచుకున్నాడు. అరవై ఏళ్ల భూషయ్య కు పద్దెనిమిది పంతొమ్మిదేళ్ళ వయసు భార్య మీనాక్షి.పాలఘాట్ నుండి కొనుక్కొచ్చి పెళ్లిచేసుకొన్న పిల్ల.స్కూల్ ఫైనల్ పరీక్షలు వ్రాసి వచ్చి మీనాక్షిని చూడబోయిన సూర్యానికి ఆమె జీవిత విషాదం తెలిసివస్తుంది. ఆకలి,  దరిద్రం ఆడపిల్లలను అమ్ముకొనటానికి, వయో తార తమ్యంతో పని లేని పెళ్లిళ్లు జరగటానికి కారణమవుతుండగా ,   స్త్రీల లైంగికత మీద నిఘాకు , నిత్య అనుమానానికి పురుషులకు  సర్వాధికారాలు  సంక్రమింప చేసిన పితృస్వామిక ద్వంద్వ లైంగిక నీతి స్త్రీలపై  హింసగా వ్యక్తం కావటం అతనికి అర్ధమైన సందర్భం అది.  పేదరికంతోడై నప్పుడు ఆడవాళ్ళ బ్రతుకు ఎంతదుర్భరం అవుతుందో తెలుసుకోగలిగిన జీవితానుభవం మీనాక్షిది. సూర్యం కంటే ఏ ఆరునెలలో ఏడాదో పెద్దదైన మీనాక్షి ఈప్రపంచంలో తల్లితప్పుచేసిందని బాధపడటం  కన్నా కష్టం లేదనుకొనటం తప్పుఅని,  ప్రపంచాన్నిఒక్కసారి విచ్చగొడితే కనిపించే పురుగుల ముందు  నీతల్లి చాలా ఆరోగ్యవంతురాలు అని సూరికి చెప్పగలిగిందంటే ఆ అనుభవం వల్లనే. లోకంలో జరిగే ఘోరాలతో పోలిస్తే నీతల్లి అసలే పాపమూ ఎరుగదు. ఆమెను ద్వేషించటం మానెయ్యమని మాట అడగటంలోనూ  అనుభవం నుండి కలిగిన అవగాహనాపరిణితి కనిపిస్తుంది. అధికార వర్గ సమాజ అణచివేత నీతికి సమ్మతి సాధించబడిన ప్రధాన స్రవంతి సమాజం ఆ తల్లి కొడుకుగా అవమానిస్తే అణచివేత నీతి కల్పించిన భ్రమలో తల్లిని ద్వేషించిన సూర్యం ఆనీతి తలకిందుల నీతి అని మీనాక్షివల్ల తెలుసుకోగలిగాడు. ఇక ఇక్కడి నుండి నిజమైన మానవుడిగా అతని పునర్నిర్మాణం ప్రారంభం అవుతుంది.

సూర్యంపట్ల స్నేహం, ప్రేమ పుష్కలంగా ఉండి, కష్టసమయంలో తనను ఆదుకోగలవాడు అతనే అన్ననమ్మకంతో పిలిపించుకొని  అతని సాహచర్యంలో శాంతిని పొందిన మీనాక్షి అతను కాలేజీ స్నేహితురాలు కృష్ణహరి పట్ల ఏర్పడిన అనురాగానికి, తనపట్ల ఉన్నబాధ్యతకు మధ్య నలిగిపోవటం, ఘర్షణపడటం గమనించి అతని జీవితం నుండి తప్పుకొనటానికి నిర్ణయించుకొన్నది. భూషయ్య మరణ వార్త తెలిసి అతని వితంతువుగా జీవించటానికి నిర్ణయించుకొని శిరోముండనం చేయించుకొని మరీ కాశీ వెళ్ళిపోయింది. సహజమైన కోరికలు సహజంగా తీర్చుకొనే వీలివ్వని సామాజిక నీతి పైన మీనాక్షి ప్రకటించిన నిరసన ఇది. తన నిష్క్రమణ వల్ల ఏ కృష్ణహరికి సూర్యం దగ్గరవుతాడని మీనాక్షి అనుకుందో.. ఆకృష్ణహరి పెళ్లిలేకుండా మీనాక్షితో అతను కలిసి ఉండాటాన్నిఅవినీతిలోపుట్టి అవినీతిలో పెరిగిన వ్యక్తి చేసే అవినీతి చర్యగా తీర్పు ఇచ్చి, అతని కులాన్ని ద్వేషించి అతనికి దూరం అయింది. ఆమె అధికారవర్గ అసమాన నీతికి ప్రతినిధి. అయితే నవల చివరకు వచ్చేసరికి ఇద్దరూ కృష్ణ భక్తులుగా ఒకే ఆశ్రమంలో కలిసి జీవించటం కాస్త విచిత్రంగా తోచక మానదు. ప్రేమకు, కావాలనుకొన్న వ్యక్తితో సంబంధాలకు, సహజీవనానికి అవరోధంగా ఉన్న సంప్రదాయ భావనలనో , స్వీయ భావోద్వేగాలనో అధిగమించే చైతన్యం లేక ఆశోపహతులైన వారి అంతిమ గమ్యం భక్తిమార్గమే అవుతుందని రచయిత్రి ఆంతర్యం కావచ్చు. సూర్యం కూడా ఒకరకంగా ఆశోపహతుడే అయినా మగవాడు కావటం వల్ల మరొకస్త్రీని పెళ్ళాడి పిల్లలతండ్రి అయి అంతరంగంలో ఆవేదన ఉన్నా సమాజంతో సర్దుకుపోవటం చూస్తాం.

నటరాజన్ జీవితం లోనూ లైంగిక సంబంధాలు కీలకమైనవిగానే కనబడతాయి. దరిద్రం , తన జీవితానికే భరోసా లేని అతనికి పెళ్లిచేసుకొనే అవకాశం, సాహసం రెండూ లేవు.అయితే శరీరం వాంఛా పరితృప్తిని కోరుతుంది. అందుకే ముగ్గురు పిల్లల తల్లిఅయిన ఒకవితంతువుతో దైహికసంబంధాన్ని పెట్టుకొన్నాడు. దరిద్రం వల్ల  చెల్లెలిని ఆమె పిల్లలను పోషించటం కష్టంగా ఉన్న ఆమె అన్న అది ఒక వంకగా ఆమెను పిల్లలను వెళ్లగొడితే  వాళ్ళ పోషణ బాధ్యతను    నటరాజన్ అతి సహజంగా  స్వీకరించాడు. నీవేదిక్కని వచ్చిన ఆడదానిని కాదనలేని నైతికత అతనిది. అంతకన్నా గొప్పవాళ్ళు తనను ఇంతప్రేమించరని , ఇంత కృతజ్ఞత కూడా చూపరని  తెలిసిన వాస్తవిక దృష్టి అతనిది. తాయారును సుఖపెట్టలేక పోతున్నానని, కడుపునిండా తిండిపెట్టలేకపోతున్నాని ఆంతర్యంలో బాధపడే అచ్చమైన మానవుడు. తాయారుకు వరదరాజులు తో సంబంధం  ఉందని తెలిసినా అదీ సహజంగా తీసుకోగలడు తాను అనారోగ్యం పాలై ఆమెను ఇక పోషించలేనన్న విషయం అర్ధమయినప్పుడు .అంతే సహజంగా ఆమెను తీసుకొని పొమ్మని వరదరాజులుకు చెప్పగలిగాడు. అవసరాలే  కానీ అనైతికత గురించి ఆలోచించే అవకాశమూ , వ్యవధీ లేని ఒక సమాంతర ప్రపంచం ఈ సమాజంలోనే  ఉందని ఈ సందర్భం స్పష్ట పరుస్తుంది. స్త్రీ మీద  భర్తగా జీవితకాలపు అధికారం చెలాయించే పురుషుడు , తన దనుకొన్న స్త్రీమీద లైంగిక ఆధిపత్యం నెరిపే పురుషుడు స్త్రీపట్ల అనుమానాన్ని, తన అధికారంలోఉన్నస్త్రీమీద ఆశపడే పురుషుడి పట్ల ఈర్ష్యను స్పర్థను కలిగి ఉండటం లోకంలో తరచు కనపడేదే .కానీ నటరాజన్ కానీ, వరదరాజులు కానీ తాయరు పోషణ గురించి కూడా మిగిలిన అన్ని వ్యవహారాలను మాట్లాడుకొన్నట్లే  మాట్లాడుకొనటం ఎందువల్ల సాధ్యమైంది? నటరాజన్  స్త్రీని ఆస్తిగా చూసే  ఆస్తి పరవర్గం వాడు కాదుకనుక. వరదరాజులు ఆస్తి కాస్త ఉన్నవాడే అయినా  ఆడబాప కు పుట్టిన పిల్లవాడిగా పొందిన అనుభవం,  తల్లి  లైంగిక బానిసత్వం గురించిన జ్ఞాపకాలు స్త్రీని సమాజంనిర్దేశించిన లైంగిక నీతికి అతీతంగా చూడటం అలవాటుచేసుకొన్నాడు కనుక. 

అలాగే నటరాజన్ సర్వర్ గా పనిచేస్తున్న హోటల్ రూములో తటస్థపడిన నందిత తనను ప్రేమిస్తున్నానని అంటే ఆమెచదువు, ఆర్ధిక హోదా ఇవన్నీ తమసంబంధానికి అవరోధాలని తెలిసిన ఒకవాస్తవ జ్ఞానం నుండి నిరాకరించాడు.అయినా ఆంతర్యంలో ఆమెను తన ప్రేమకు, ఆరాధనకు ఆలంబనగా నిలుపుకొనే ఉన్నాడు. ఎంతగానంటే ఆమెతో జీవించలేక పోయినా  ఆమె సమక్షంలో మరణించాలను కొన్నంతగా. తీవ్రమైన అనారోగ్యం తోఆమెను వెతుక్కొంటూ అతనుచేసిన ప్రయాణం ఈనవలలో సుదీర్ఘంగా వర్ణించబడింది. అదితీరని కొరికే అయింది. ఆవిషయం తెలిసిన ఆమె పెళ్లిఅయిన తరువాత కూడా నటరాజన్ మరణించిన రోజు  ఏపుణ్యక్షేత్రానికో వెళ్లి సంతర్పణ చేయకుండా ఉండలేదు. ఏ స్త్రీపురుషులు ఇద్దరిమధ్యా అనురాగం అంకురించినా సహజీవనంగా దానిని వికసింపచేసుకోనీయని ఒకానొక వ్యతిరేక సామాజిక అధికారం ముందు స్త్రీపురుషుల జీవితాలు దుఃఖభాజనం అవుతున్నాయని చూపటమే రచయిత్రి ఉద్దేశంగా కనబడుతుంది.ఆక్రమంలోనే పెళ్లిళ్లు , కాపురాలు సజావుగా సాగుతున్నట్లు కనిపించటం ఒకభ్రమ అనికూడా ఈనవల సూచిస్తున్నది.

ఈనవలలో మరొక అంశం కులం. కులవ్యత్యాసాలు మనుషులలో కలిగించే గాయాలు ఆధిక్యతా సాధనకు అహం పడే ఆరాటం కూడా ఈనవలెత్తివృత్తంలో భాగం. సూర్యం కనకాంగికి ఒకబ్రాహ్మడివలన పుట్టాడు. దానివెనక ఒకపెద్ద కథ ఉంది. ఆ బ్రాహ్మడు  నాట్యవిద్యా నిపుణుడు.ఆయన దగ్గర తనకూతురు కనకాంగికి నృత్యంలో శిక్షణ ఇప్పించాలని ఆమెతల్లి సింహాచలం తలచింది.నిష్టాపరుడైన బ్రాహ్మడిని వేశ్యకు విద్యచెప్తానా అతను తిరస్కరించాడు. ఆతరువాత ఏటిలో పడి కొట్టుకుపోబోయిన తన కొడుకును సింహాచలం రక్షించిందన్న కృతజ్ఞతతో కనకాంగికి నాట్యంనేర్పటానికి అతను అంగీకరించాడు.విద్య చెప్పేటప్పుడు కూడా తానుబ్రహ్మడిని అన్నవిషయం ఆయన మరిచిపోలేదు. కనకాంగి చెయ్యి తగిలితే మైలపడ్డానని స్నానంచేసి వచ్చేవాడు.దానితో పంతానికి పదేపదే ఆయనకు చెయ్యో,చెరగో తాకించటం చేసేది  కనకాంగి.పదేపదే స్నానంచెయ్యలేక ఆమెనాట్యం నేర్చుకొని వెళ్ళాక ఒకేసారి స్నానం చేసే స్థితికి వచ్చాడు ఆయన. తరువాత ఆయన అంతట ఆయనే ఆమెనుతాకే స్థితి వచ్చింది.విద్యపూర్తయ్యాక గురుదక్షిణగా తల్లి పంపిన పట్టుపంచలను కూడా ఆయన కులాహంకారంతోనే తిరస్కరించాడు. ఇంటికి వెళ్లి నమస్కరించి రమ్మని తల్లి పంపితే   వెళ్లిన కనకాంగి సౌందర్యానికి భ్రమసి ఆబ్రాహ్మడు ఆమెను దగ్గరకు తీసుకొన్న దాని ఫలితం సూర్యం కడుపున పడటం. ఈ కథంతా సరే. బ్రాహ్మడిని లొంగదీయగలిగాను కదా అన్న అహం తృప్తి పడింది కనకాంగికి. బ్రాహ్మణాధిక్యత మీద అది తన విజయంగా భావించినట్లు కనబడుతుంది. కానీ ఆ బ్రాహ్మడు మాత్రం దానిని అవమానంగానే భావించాడు.సన్యసించి ఊరువిడిచి వెళ్ళిపోయాడు.  అందువల్లనే కొడుకు తనను ద్వేషిస్తున్నాడన్న విషయం తెలిసిన ఆమె ఆరణితో ‘ద్వేషం వాడిరక్తంలోనే ఉంది అని చెప్పగలిగింది. అది అన్యకుల ద్వేషంతప్ప మరొకటి కాదు. 

తనఇంట బ్రాహ్మణ బిడ్డజన్మించ బోతున్నాడని సింహాచలం గర్వపడటం అంటూ సొంటూ సోకకుండా  ఆబిడ్డను పెంచటం గమనించదగినది.అంటే బ్రాహ్మణాధిక్యత గురించిన సమ్మతి ఎట్లా సర్వవ్యాపితమో ఇది సూచిస్తుంది.నటరాజన్ నివసించే గుడిసెలలో ఒకదానిలో ఉండే పాచిపనులు చేసుకొనే చిన్నమ్మ అనే  మహిళ నటరాజన్ ఒక్కడే రోగంతో మంచంపట్టి  ఉన్నప్పుడు గుడిసె ఊడ్చి అతనిబట్టలు ఉతికి ఆరేసి పెడుతుండేది. టీ  తెచ్చిఇస్తుండేది.ఆమెఆశించే ప్రతిఫలం తనగర్భస్థ శిశువుకు అతని ఆశీర్వచనం.బ్రాహ్మణ ఆశీర్వచనం.ఆదితెలిసి నటరాజన్ ఆశ్చర్య పోయి తనబ్రాహ్మణత్వం గురించి విచికిత్స చేసుకొంటాడు. తండ్రి పిల్లల్ని అమ్ముకొనేకసాయి. అక్కఅవినీతి పరురాలు. అంతకంటే అవినీతి జీవితం తనది. రక్తంలో పవిత్రత లేని  తనఆశీర్వచనానికి బలం ఎక్కడిదని నవ్వుకొంటాడు అతను. బ్రాహ్మణ తేజస్సు గురించిన ఒకగర్వం,  బ్రాహ్మణ పతనం గురించిన దిగులు రెండూ లతకు ఉన్నాయా అనిపిస్తుంది ఆమెనవలలు చదువుతుంటే.  

                                                          

*****

( ఇంకా ఉంది ) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.